కథలు రాయటమెలా?

- (ఫ్లానరీ ఒ’ కానర్ వ్యాసానికి స్వేచ్ఛానువాదం)

కథలు రాయటం కష్టమని కొందరెందుకనుకుంటారో అర్థం కాదు. చిన్నప్పుడు మనం అమ్మల దగ్గరా, అమ్మమ్మల దగ్గరా ఎన్ని కథలు వినలేదు! క్లిష్టమైన విషయం వుందని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా మనం స్వయంగా ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో కథలు చెప్పే వుంటాం. కాని మళ్ళీ రాయటానికి కూర్చుంటే ‘కథలు రాయటమెలా’ అనుకుంటాం.

కాని కొందరు రాసిన కథలు చదివితే వాళ్ళకు రాయటమెలాగో తెలియదని అనిపిస్తూనే వుంటుంది. అంతే కాదు. కొందరు మరికొందరి కన్నా బాగా రాయగలరని కూడా తెలుస్తుంది.

అసలు, కథ చెప్పే శక్తి అందరికీ కొద్దో, గొప్పో వుంటుంది. కాని కాలక్రమేణా అది తగ్గిపోతుంది కాబోలు. కేవలం పదాలతో, మాటలతో జీవితాన్ని సృష్టించడానికి కొంత ప్రత్యేకమైన నేర్పు కావాలి అనటంలో సందేహం లేదు.

కాని తిరకాసేమిటంటే ఈ ‘నేర్పు’ కించిత్తు కూడా లేని వాళ్లకే కథలు రాయాలనే దుగ్ధ విపరీతంగా వుంటుంది. మనం పత్రికల్లో తరచుగా చూస్తే ‘కథలు రాయటమెలా’ వ్యాసాలు రాసేది వీళ్లే. కథలు రాయటం వెనక ఏదో రహస్యముందనీ, ఆ ఫార్ములా తెలుసుకుంటే ఎవరైనా రాయగలరనీ వీళ్ల నమ్మకం. ‘కథలు రాయటమెలా’, ‘పాత్ర చిత్రణ ఎలా’, ‘ఇతివృత్తం ఎలా తీసుకోవాలి’, వగైరా పుస్తకాలు వీళ్లకు ప్రేరకాలు. ఇలా, వస్తువు, ఇతివృత్తం, పాత్రలు, శైలి అంటూ మాట్లాడే వాళ్లందరూ మొహాన్ని వర్ణించమంటే కళ్లు, ముక్కు, నోరు ఎక్కడున్నాయో చెప్పినట్లుగా వుంటుంది.

సుస్పష్టమైన విషయాలే నిర్వచించడానికి అత్యంత క్లిష్టమైనవి. కథంటే ఏమిటో తనకు తెలుసునని ప్రతీ వ్యక్తీ అనుకుంటాడు. కానీ, తీరా రచనకుపక్రమిస్తే అది, ఏ జ్ఞాపకమో, అభిప్రాయమో, ఉపకథో మరేదో అయ్యే ప్రమాదం లేకపోలేదు.

కథంటే ఒక పరిపూర్ణ నాటకీయత కలిగిన కథనం. మంచి కథలో యాక్షన్ ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది. పాత్రలే యాక్షన్‌ను కంట్రోల్ చేస్తాయి. ఫలితం కథ ఒక అనుభవైక కావ్యమైన అనుభూతిగా మిగిలిపోతుంది. పాత్రలు ఎదుర్కొనే నాటకీయత కలిగిన సంఘటనల ఫలితమే కథ. పాత్ర ఒక వ్యక్తి. లక్షమందిలో అతడొక్కడైనప్పటికీ, కథకు సంబంధించినంత వరకూ అతడో ప్రత్యేకమైన వ్యక్తి. కథాకథనంలో ఆ ప్రత్యేక వ్యక్తిలోని అనిర్వచనీయత, మిస్టరీ పాఠకునికి అవగతమవుతుంది.

కాని చాలామంది ప్రారంభ రచయితలకు వ్యక్తుల్ని గురించి గాక, ఆదర్శవాదాల్ని గురించి చర్చించడం వాళ్లకిష్టం. వాళ్లకో వూహ తట్టొచ్చు. ఓ భావం కలగొచ్చు. లేదా కొన్నిసార్లు అహం దేన్నో ప్రేరేపించవచ్చు. అంతే. వాళ్లు వెంటనే కథ రాసేయాలనుకుంటారు. లేదా తాము తెలుసుకున్న లౌకిక జ్ఞాన సారాన్నంతా మామూలు పామర పాఠకులకు కథలుగా చెప్పాలనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే వాళ్ల దగ్గర జ్ఞానం వుంటే వున్నదేమో కాని కథ మాత్రం లేదు. ఉన్నా వాళ్లకు దాన్ని రాసే ఓపిక లేదు. కథ లేదు గనక, దానికి మారుగా వాళ్లు ఓ థియరీయో, ఓ శిల్పమో వుంటే సరిపోతుందని వెదుకుతుంటారు.

కథలు రాసేటప్పుడు మన నమ్మకాలు, మన నిబద్ధత, మన నైతిక విలువలు మనకు మార్గదర్శకంగా, కరదీపికలుగా వుంటాయి. అయితే ఆ విలువలు వెలుగుగా పనికొస్తాయేమో గాని, చూసే వస్తువులు మాత్రం కావు. వెలుగు సాయంతో లోకాన్ని చూడాలి. కాని వెలుగే లోకం కాదు. వెలుగు ఒక మీడియం. ఒక శక్తి. ఒక దృష్టి. రచయిత రాసే ప్రతీ వాక్యానికీ గీటురాయి దృష్టికోణం. వ్యక్తిత్వం. ఈ దృష్టితో మనం ఎంత లోకాన్ని చూడగలం? ఎంత అర్థం చేసుకోగలం? ఎన్ని విషయాల గురించి మంచీ చెడ్డా వివేచన, తీర్పు, మీమాంస చెయ్యగలం? వివేచన దృష్టిలో భాగం. వివేచనాశక్తి దృష్టి నుండి వేర్పడిన రోజున మనసులో ద్వైధీభావం జనిస్తుంది. క్రమేణా అది రచనలో కూడా ప్రతిబింబిస్తుంది.
మనం లోకాన్ని, మనుషుల్ని, వస్తువుల్ని చూసే పద్ధతే మారిపోవాలి. కొత్త అలవాట్లు చేసుకోవాలి. దయ గురించి రాసి దయనూ, సానుభూతి గురించి రాసి సానుభూతినీ, ఉద్రేకాన్ని గురించి రాసి వుద్రేకాన్ని, అలోచనల్ని గురించి రాసి ఆలోచనల్నీ పాఠకుల్లో కలిగించలేమని రచయితలు గ్రహించాలి. ఈ దయ, సానుభూతి, ఉద్రేకం, ఆలోచనలు వున్న సజీవ వ్యక్తుల్ని—బరువూ, ఒడ్డూ, పొడుగూ కొంత నిర్ణీత జీవితకాలమూ వున్న వ్యక్తుల్ని సృష్టించాలి.

కొందరు కథకుల కథల్లో వుద్రేకం ఎప్పుడూ బుసకొడుతూ ఉంటుంది. అయితే ఆ ఉద్రేకం రచయితదో, పాత్రదో మనకు స్పష్టంగా తెలియదు. దీనికి కారణం, రచయిత తన ఆలోచనల్లో, భావోద్రేకంలో మునిగిపోయాడే తప్ప కథలో మనుషులకు జరుగుతున్న సంఘటనల్ని, అనుభవాల్ని గురించి పట్టించుకోలేదు. నిజానికి అతడు తన ఆలోచనల ఆశాసౌధం నుండి పాత్రల నేలబారు జీవితపులోతులకు దిగటానికి నిరాకరిస్తున్నాడు. అతడి అభిప్రాయంలో పాత్రల ప్రవర్తన గురించిన తీర్పు, జడ్జిమెంట్ ఒక స్థాయిలోనూ, వాళ్ల ప్రవర్తన గురించి పాఠకుడికి తెలియజేసే యింద్రియ గ్రహణ శక్తుల వ్యక్తీకరణ మరొక స్థాయిలోనూ వుంటుందనుకుంటున్నాడు. కాని, వాస్తవంలో పాత్రల గురించిన తీర్పు వాళ్లను వర్ణించడంలోనే, వాళ్లను వూహించడంలోనే వాళ్లను చూసే పద్ధతిలోనే వుందని విస్మరిస్తున్నాడు. కళ అంటే అభివ్యక్తీకరణ. అభివ్యక్తీకరణకు పరిశీలన ప్రాణం. కథా రచన అనే ప్రక్రియకు మూలం కథ చెప్పటం కాదు. జరిగింది చూపించడం.


అనువాదాలు, సాహిత్య వ్యాసాలు

ఒక అభిప్రాయం

  1. pasunoori ravinder Dec 2007 1

    కథ రాయడానికి ఈ వ్యాసం కొంత వరకు ఉపయోగ పడుతుందని విశ్వసిస్తున్న,
    కానీ పార్థసారథి గారు కథా ప్రక్రియలో తలపండినవారు,
    కావున మరింత విశ్లేషణ తదుపరి సంచికల్లో అందిస్తారని ఆశిస్తున్నాను.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో