Dec2007
సముద్రంలా చందమామ
ఒకే రాత్రి,
ఆ రాత్రి నునుసిగ్గుల నవవధువు
బుగ్గలపై పూసిన గోరింటలా చందమామ
ఆ రాత్రి పురానాపూల్ కమాను వద్ద
ఆకలితో బిచ్చగత్తె ఆత్రంగా తింటున్న
మాడిన రొట్టెముక్కలా నల్లటి చందమామ
ఆ రాత్రి లిబర్టీ చౌరస్తా వీధిలైట్ల కింద
నిస్సహాయంగా, నిరాసక్తంగా నిలబడ్డ ‘వేశ్య’
తొలగిన పైట నుంచి జారిన వడలిన రొమ్ములా చందమామ
ఆ రాత్రి సుల్తాన్ షాషీ ఇరుకు వీధుల్లో
తలపై మలం నిండిన కుండతో నడిచి వెళ్లే
పాకీ తల్లి చేతిలో మెరిసే సత్తు రేకులా చందమామ
ఆ రాత్రి తుదికంటా పోరాడి ఒరిగిన
అమరుడి తెరిచిన కన్నులలో
ఆరని కనుపాపలా చందమామ
ఆ రాత్రి దగ్ధమైన పగళ్ళ చితాభస్మం నుంచి
ఆకాశానికెగిసిన సముద్రంలా చందమామ
బహురూపుల చందమామా!
నువ్వంటే ఎంత మోహమే నాకు!
December 11th, 2007 at 10:54 pm
చాలా బాగుంది…………
December 13th, 2007 at 1:29 am
చాలా కాలం తరువాత ఇటీవల ఆంద్రజ్యొతి లొఅనూ మళ్ళి ప్రాణహిత లొనూ విమల కవిత చదవడం చాల సంతొషం కలిగించింది..
January 14th, 2008 at 2:03 pm
చాలాబాగుంది బహురూపుల చందమామ మోహకాంతి లొపరుచుకున్నబతుకుచిత్రాల చిత్రణ విమల కవితాత్మకు జోహారులు ఆంధ్రజ్యొతి వివిధ లోని ఇటీవలి కవిత కూడా………..