Dec2007
సృష్టి
మూలం: బెర్ట్రండ్ రసెల్
ఒకనాడొక ప్రముఖ వేదాంతి తను మరణానంతరం స్వర్గోన్ముఖుడై ప్రయాణిస్తున్నట్లు కలగన్నాడు. వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలతో పరిచయముండటం వల్ల దారి కనుక్కోవటంలో ఇబ్బందేమీ కలగలేదు. స్వర్గ ద్వారాన్ని తట్టగానే తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా తనను సూక్ష్మపరిశీలన చేస్తున్న వ్యక్తిని చూసి, “నాకు ప్రవేశం కావాలి… నా పవిత్ర మానవ జీవితమంతా భగవంతుని కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేయడానికే ధారపోశాను” అన్నాడు వేదాంతి.
“మానవుడివా! అదేమిటి? నీలాంటి అత్యల్పజీవి భగవంతుని కీర్తి ప్రతిష్ఠలను ఎలా ఇనుమడింప చెయ్యగలదు?” అన్నాడా ద్వారపాలకుడు.
వేదాంతికాశ్చర్యం వేసింది.
“మీకు మానవుల గురించే తెలియదా? భగవంతుని సర్వోత్కృష్టమైన సృష్టి మావవుడని మీకు తెలిసుండాలే” అన్నాడు.
“మీతో ఏకీభవించలేకపోతున్నందుకు క్షమించండి. కాని మీరు చెబుతున్న ఈ విషయం ఇదివరకెప్పుడూ వినలేదు. ‘మానవుడు’ అనే జీవి గురించి కూడా ఇక్కడెవరికీ తెలియదనే నా నమ్మకం. అయినా మీరు చాల్ల కష్టపడి వచ్చినట్టున్నారు గనక, మీకు మా గ్రంథాలయాధికారిని కలిసే అవకాశం మాత్రం ఇవ్వగలను” అన్నాడు ద్వారపాలకుడు.
వెయ్యి కళ్ళూ, ఒక నోరూ వున్న విచిత్రాకారుడైన గ్రంథాలయాధికారి కొన్ని కళ్ళు వేదాంతి వైపు సారించి, “ఇదేమిటి?” అంటూ అడిగాడు ద్వారపాలకుణ్ణి.
“ఇదండీ, భూమి అనే చోట వుండే ‘మనిషి’ అనే జీవజాలానికి సంబంధించిన జీవి అటండీ. సృష్టికర్త ఇవి వుండే చోటు మీదా, తమ మీదా ఏదో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వుంటాడని వీటికో తమాషా అభిప్రాయం వుందండీ! మీరు వీటికేమన్నా విషయాలు తెలియచెబుతారేమోనని తీసుకొచ్చాను” అన్నాడు ద్వారపాలకుడు.
గ్రంథాలయాధికారి వేదాంతి వైపు దయగా చూసి, “ఈ భూమి అనేది ఎక్కడుందో కాస్త చెబుతారా?” అని అడిగాడు.
“ఆ! భూమి సౌరకుటుంబంలోని ఓ గ్రహం” అన్నాడు వేదాంతి.
“ఏ సౌర కుటుంబం?”
“అయ్య బాబోయ్! నేను కేవలం ఆధ్యాత్మిక జ్ఞానంలో మాత్రమే ప్రావీణ్యత సంపాదించాను. మీరు అడిగేవన్నీ భౌతిక విషయాలు. అయినప్పటికీ ఖగోళ శాస్త్రజ్ఞులైన నా మిత్రులు చెప్పినందువల్ల తెలిసింది. సౌర కుటుంబం పాలపుంతలో ఓ భాగం”
“పాలపుంత అంటే ఏమిటి?”
“పాలపుంత అనేది వందలాది లక్షల నక్షత్ర వీధుల్లో ఒకటి”
“బాగు. బాగు. ఇంత గందరగోళంలో నువ్వు చెప్పేది జ్ఞాపకముంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది చెప్పు? ఈ ‘నక్షత్ర వీధి’ అనే మాట మాత్రం ఎప్పుడో విన్నట్టుగా గుర్తు. మా అసిస్టెంట్లలో ఒకడు ‘నక్షత్రవీధి’ విభాగం చూస్తుంటాడు. అతన్తో మాట్లాడి మీ చిరునామా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను.”
దీర్ఘ నిరీక్షణ తర్వాత పన్నెండు తలలున్న నక్షత్ర వీధి విభాగపు అసిస్టెంటు వచ్చాడు. ఒకప్పుడతను శుభ్రంగానే వుండివుంటాడు. కాని ప్రస్తుతం పుస్తకాల బీరువాల దుమ్మంతా కొట్టుకుపోయిందా మొహాలమీద. వేదాంతి తన చిరునామా చెప్పే ప్రయత్నంలో నక్షత్రవీధి గురించి చెప్పాడనీ, అందువల్ల తమ గ్రంధాలయంలోని నక్షత్ర వీధి విభాగం ఈ విషయంలో ఏమైనా సహాయం చెయ్యగలుగుతుందేమో చూడాలనీ చెప్పాడు గ్రంథాలయాధికారి.
వెదుకుతూపోతే కాలక్రమంలో, యితని జాడ దొరికించుకోవటం అసాధ్యమేమీ కాదు. కాని కొన్ని వందల లక్షల నక్షత్ర వీధులున్నాయి. ఒక్కో నక్షత్ర వీధికీ ఒక్కో సంపుటం వుంది. అందువల్ల కావలసిన సంపుటం వెదికి పట్టుకోవటం ప్రయాసతో కూడిన విషయం. అయినా ఈ సూక్షజీవికేం కావాలట.
“ఏ పాలపుంతో చెప్పాలి” అన్నాడు వేదాంతి.
“సరే! ప్రయత్నిస్తాను” అన్నాడు అసిస్టెంటు.
ఓ మూడు వారాల తర్వాత తిరిగి వచ్చి తమ లైబ్రరీలోని అతి సమర్థవంతమైన కార్డు యిండెక్సు పద్ధతి వల్ల ఇతడి నక్షత్ర వీధి సంఖ్య X.321,762 అని తెలుసుకున్నట్టుగా చెప్పాడు. “మన లైబ్రరీలోని ఐదువేల మంది గుమాస్తాలు కలిసి వెదికితేగాని కనుక్కోలేక పోయాం. ఈ నక్షత్రవీధి వ్యవహారాల గుమాస్తాను తీసుకొచ్చాను ఇదిగో” అన్నాడు అసిస్టెంటు. ఎనిమిది తలకాయల ఆ గుమాస్తా, పుస్తకాల బీరువాల చీకటికలవాటు పడిన కళ్ళతో వెలుగును చూడలేక కళ్ళు చిట్లించి- “నా నక్షత్ర వీధి గురించి మీకేం సమాచారం కావాలి?” అడిగాడు.
“నాకు నా సౌర కుటుంబం గురించి చెప్పండి. సౌర కుటుంబం అంటే ఒక్కో నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తూ వుండే కొన్ని గ్రహాల సముదాయం. మా గ్రహ కుటుంబం సూర్యుడనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటుంది.”
అసిస్టెంటు నిట్టూర్చి, “ఫలానా నక్షత్ర వీధి అంటూ తెలుసుకోవటమే కష్టమంటే ఇదొకటా? ఆ ప్రత్యేకమైన నక్షత్రం ఏమిటో కనుక్కోవటం మరింత కష్టతరమైన విషయం. నా నక్షత్రవీధిలో మూడు వందల కోట్ల నక్షత్రాలున్నాయని నాకు తెలుసు. ఐతే అందులో ఓ నక్షత్రానికీ, మరో నక్షత్రానికీ తేడా మాత్రం నాకే తెలియదు. ఒకప్పుడెప్పుడో పరిపాలన శాఖవారు మూడు వందల కోట్ల నక్షత్రాల జాబితా అడిగినట్లుగా జ్ఞాపకం. ఆ జబితా బహుశా మా భూగృహంలో వుందేమో చూస్తాను. ఇంత శ్రమపడటం మీరు అవసరమనుకుంటే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి వెదికిస్తాను.’
“ఎట్లాగూ కొంత పరిశోధన జరిగింది గనకా, వేదాంతి చాలా దిగులు పడుతున్నాడు గనకా వెదికితే పోతుంది” అనుకున్నారు.
అలా కొన్నేళ్ల తీవ్ర పరిశోధన తర్వాత, నాలుగు తలకాయల పరిశోధకుడు అసిస్టెంటు వద్దకొచ్చి, “హమ్మయ్య చివరికి మీక్కావలసిన ఆ నక్షత్రం గురించిన సమాచారం దొరికింది. ఇదిగోనండి! కాని మీరు దీని గురించి ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ చూపించారో అర్థం కావటంలేదు. నక్షత్ర వీధిలోని అసంఖ్యాకమైన ఇతర నక్షత్రాల్లగే యిదీ వుంది. మిగతా వాటికి మల్లేనే కొన్ని గ్రహాల సముదాయం దీని చుట్టూ కూడా తిరుగుతూ వుంది. దీర్ఘపరిశోధన తర్వాత కొన్ని గ్రహాల మీద కొన్ని పరాన్నభుక్కులున్నట్టుగా పసికట్ట కలిగాను. బహుశా ఇక్కడికొచ్చిన జీవి ఆ పరాన్నభుక్కుల జాతిదేమో!” అన్నాడు.
వేదాంతి దుఃఖం ఆపుకోలేకపోయాడు.
“సృష్టికర్త మాకీ విషయాలిదివరకే ఎందుకు తెలియ చెప్పలేదు? ఈ విశ్వాలను సృష్టించింది మాకోసం. నా దీర్ఘ జీవితమంతా భగవత్సేవలో గడిపాను. నా సేవకు మెచ్చి, నా భక్తికి కరుణించి నాకు శాశ్వతానందాన్నిస్తాడాని నమ్మాను. ఇక్కడ చూస్తేనెమో నేనెక్కడివాణ్ణో నా చిరునామా కూడా వీళ్ళకు తెలియదు. కొన్ని వందల లక్షల నక్షత్ర వీధుల్లోని వందలాది లక్షల నక్షత్రాలలోని, ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించే ఒక సూక్ష్మగ్రహం మీద గడిపిన ఒక సూక్ష్మాతి సూక్ష్మ జీవినంటారు వీళ్లు. ఇది నేను భరించలేను. ఎందుకా సృష్టికర్తను కొలవాలి? ఎందుకు అతడి లీలల్ని కీర్తించాలి?” అన్నాడు వేదాంతి.
“ఇక వెళ్ళొచ్చు”
కల చెదిరిన వేదాంతి- సైతాను మనకెలాంటెలాంటి పీడకలల్ని కల్పిస్తోందో చూశారా అంటూ గొణుక్కున్నాడు.
January 3rd, 2008 at 2:35 pm
ఇదే విషయాన్ని మరింత నేలబారుగా నేనొక వ్యాసంలో రాశాను.
http://poddu.net/?p=404