స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కవయిత్రులు

చిత్రం: ఏలే లక్ష్మణ్
చిత్రం: ఏలే లక్ష్మణ్
తెలుగు ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడ కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు. కవిత్వం వ్రాయగలిగినంత ప్రతిభా వ్యుత్పత్తులు స్త్రీలకు లేకపోవడమే కవిత్వ రంగంలో స్త్రీలు కనిపించకపోవడానికి కారణమన్న అభిప్రాయం వుంది. ప్రతిభా వ్యుత్పత్తుల సంపాదనకు పురుషులకున్నంత అవకాశాలు ఈ సమాజంలో స్త్రీలకు లేవన్నది ఒక నిష్టూర వాస్తవం. అయినా బ్రిటిష్ వలస పాలన వలన వచ్చిన ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలు, చైతన్యం, సంఘసంస్కరణోద్యమం వలన కలిసి వచ్చిన విద్యావకాశాలు కూడా స్త్రీలకు కవిత్వరంగంలోకి ప్రవేశాన్ని కల్పించలేక పోయాయా? స్త్రీలు కవిత్వం వ్రాసినా వాళ్ళకు గుర్తింపు రాలేదా? రాకపోవడానికి కారణాలు ఏమిటి? ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో భావ కవిత్వ శాఖకు ప్రతినిధులుగా చావలి బంగారమ్మ, తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మి (సౌదామిని)- ముగ్గురు, జాతీయోద్యమ కవిత్వ శాఖలో కాంచనపల్లి కనకాంబ, న్యాయపతి వెంకట విజయ లక్ష్మమ్మ, వీరపనేని, సరోజిని, కనుపర్తి వరలక్ష్మమ్మ, వక్కలంక రమాబాయి, మొదలైన కొద్ది మంది పేర్లు, అభ్యుదయ కవిత్వ శాఖలో వట్టికొండ విశాలాక్షి వంటి ఒకరిద్దరి పేర్లు మాత్రమే వినబడుతుంటాయి. వీళ్ళ కవిత్వమైనా సమగ్రంగా ఒక దగ్గర సంపుటీకరించబడలేదు. కవిత్వ చరిత్ర రచనకు అందుబాటులో లేదు.

ఇక ఈ మూడు ధోరణులలో కాక ఇతరత్రా వివిధ విషయాలపై స్త్రీలు వ్రాసిన కవిత్వం అసలు లెక్కలోకి రాకుండా పోయింది. తెలుగు కవుల చరిత్రలు, వాజ్ఞ్మయ చరిత్రలు ఎన్నో వచ్చినా స్త్రీల కవిత్వం గురించిన ప్రస్తావన కూడ వాటిలో లేకపోవడం “స్త్రీలలో సరియైన రచయితలు, కవయిత్రులు, లేరని చెప్పటానికి విచారిస్తున్నాము.” అని సాహిత్య చరిత్రకారులు బాధ్యతారహితంగా మాట్లాడటం, పసగల కావ్యాలు సృజించిన కవయిత్రులు పట్టుమని పదిమందైనా లేరు అని స్త్రీల కవిత్వాన్ని తక్కువగా చేసి, కవిత్వం వ్రాసిన స్త్రీలను నిర్లక్ష్యం చేసి మాట్లాడటం—విని విని వాటిపై విమర్శగా, సమాధానంగా ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ 1951 లో ‘ఆంధ్ర కవయిత్రులు’ అనే గ్రంధాన్ని రచించింది. స్వాతంత్ర్యానికి పూర్వపు కవయిత్రులే ఎక్కువగా ఈ గ్రంధంలో కనబడతారు. అయినా ఇది తొలి ప్రయత్నమే. ఉన్నంతలో సమగ్రమే కానీ సంపూర్ణం కాదు. లక్ష్మీ కాంతమ్మ దాదాపు అరవయ్యేళ్ళ క్రితం తెలుగు కవయిత్రుల చరిత్ర వ్ర్రాయటానికి చేసిన ప్రారంభ ప్రయత్నాలను ఆ తరువాత ఎవరూ అంది పుచ్చుకొనలేదు. ఇక కథ, నవల, వ్యాసం, నాటకం, పాట మొదలైన సాహిత్య ప్రక్రియలలో మహిళలు చేసిన కృషి గురించి ఆలోచించిందెవరు? మదింపు చేసిన దెవరు? ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ స్పూర్తితో ఇన్నాళ్ళు మహిళా వాజ్ఞ్మయానికి జరిగిన తీరని అపచారానికి పరిహారంగా స్త్రీల కవిత్వ చరిత్ర రచనను, స్త్రీల కథా సాహిత్య చరిత్రను, స్త్రీల నవలా సాహిత్య చరిత్రకు, స్త్రీల వ్యాస వాజ్ఞ్మయ చరిత్రను, స్త్రీల నాటక సాహిత్య చరిత్రను, స్త్రీల గేయ వాజ్ఞ్మయ చరిత్రను సమాంతరంగా నిర్మించు కొనటానికి మనమిప్పుడు సంకల్పించాలి. ఆ క్రమంలోనే ‘స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కవయిత్రులు’ అన్న ఈ ప్రసంగ పత్రం సిద్ధం చేయబడింది. ఇందుకై పరిశీలించిన కవులు 115 మంది. 1929 నుండి 1946 వరకు పద్దెనిమిదేళ్ళ కాలం మీద గృహలక్ష్మి, తెలుగు తల్లి, భారతి పత్రికలను అప్పుడప్పుడు, అక్కడక్కడా పరిశీలించి గుర్తించిన కవులు వీళ్ళు. వీళ్ళలో ఎక్కువమంది గృహలక్ష్మి పత్రికకు వ్రాసినవాళ్ళు. స్త్రీల ఆరోగ్య సౌభాగ్యములను పెంపొందించుటకు కె. ఎన్. కేసరి ఏర్పరచిన ఈ స్త్రీల పత్రిక స్త్రీలను ఎందరినో రచయితలుగా, కవులుగా ఆవిష్కరించిందనటంలో అతిశయోక్తి లేదు.

స్వాతంత్ర్యానికి పూర్వం కవయిత్రులు ప్రధానంగా పద్యాలు వ్రాశారు. సమస్యా పూరణ పద్యాలు వ్రాయటంలో ఉత్సాహంగా పోటీపడిన పరుచూరి భువనేశ్వరి, సామవేదుల చిరంజీవమ్మ, బెల్లంకొండ కనకమ్మ, యేలూరిపాటి లక్ష్మీసరస్వతి, కె. రామ సుబ్బమ్మ, ఆరాధ్యుల వేంకట సుబ్బలక్ష్మి, భాగవతుల వేంకట జోగమాంబ, దేశరాజు భారతీదేవి, పేరేపు మహాలక్ష్మి హరిలక్ష్మీ దేవి, పిండిప్రోలు కొండమాంబ, గండికోట సావిత్రీ దేవి, వడ్లపూడి శేషారత్నం, ఆతా సూర్యకాంతం, గంటి కామేశ్వరమ్మ, శేషమాంబ, సామినేని హనుమాయమ్మ, సామవేదం సీతారామమ్మ, యం.రామలక్ష్మమ్మ, ఎమ్.వేదవల్లి తాయారమ్మ, ఆచంట సత్యవతమ్మ, పంతుల సీతాలక్ష్మి, కనుపర్తి వరలక్ష్మమ్మ, మానాప్రగడ సీతారామమ్మ, కర్రి కమల మొదలైన స్త్రీలు ఉన్నారు. మదమంచి అనంతమ్మ, మాంచాల, నాయకురాలు అనే పద్య కావ్యాలను వ్రాసింది. సీరము సుభద్రయాంబ రామాయణం వ్రాసింది. కాంచనపల్లి కనకాంబ జీవయాత్ర అనే ఆధ్యాత్మిక కావ్యం వ్రాసింది. గుడిపూడి ఇందుమతీదేవి అంబరీష విజయం, లక్షణా పరిణయం వంటి ప్రబంధాలు వ్రాసింది. ఇట్లా మహకావ్య రచనోత్సాహంతో కృషి చేసిన స్త్రీలు స్వాతంత్య్రానికి పూర్వమే ఎందరో ఉన్నారు. ఇక వారు శతక రచన కూడ విస్తృతంగానే చేశారు. గుడిపూడి ఇందుమతీదేవి తరుణీ శతకం, రాజరాజేశ్వరి శతకం, నారసింహ శతకం, అయితం ఇందిరా భారతులు జననీశతకం, గంటి కృష్ణవేణమ్మ కాయిట్లాధిప చెన్నకేశవ శతకం, జ్ఞాన ప్రసూనాంబికా శతకం, కాంచన పల్లి కనకాంబ సింహపురి రంగశతకం కోటికల పూడి సీతమ్మ సాధురక్షక శతకం – ఇలా ఎందరో స్త్రీలు ఎన్నో శతకాలు రచించారు. ఇవన్నీ చెప్పటం ఎందుకంటే స్త్రీలు ప్రతిభావ్యుత్పత్తులలో ఎక్కడా వెనుకబడి లేరన్న విషయాన్ని స్థాపించటానికే. స్త్రీల అధ్యయనానికి, ఆర్తికి, సృజన శక్తికి నిదర్శనంగా ఈ సాహిత్యం కనబడుతుంది. 1929 అక్టోబరు గృహలక్ష్మి లో సంపాదకులు కె. యన్. కేసరి గుడిపూడి ఇందుమతీదేవిని పరిచయం చేస్తూ “పురుషులకు కూడ పరమాశ్చర్యము పొడము నట్లు గ్రంధరచన చేసిన కాంతామణి” అని చెప్పిన మాటలు చాలా మంది కవయిత్రులకు వర్తించేవే. వీరినుండి పాతిక మంది కవయిత్రులను ఒకటి కంటే ఎక్కువ కవితలను వ్రాసిన వారిని గుర్తించి వారి కవిత్వంపై కేంద్రీకరించి ఈ పత్రం రూపొందించటం జరిగింది.

ఈ కాలపు స్త్రీలకు కవితా సామాగ్రి చాలావరకు పురాణేతిహాస కావ్య మూలాల నుండి లభించింది. లేదా స్థానిక దైవతా విషయాలు కావ్య వస్తువును సమకూర్చాయి. లేదా వారి లౌకిక జీవితాన్ని నియంత్రించిన స్త్రీ జీవనధర్మ సూత్ర్రాలు ఒక ఆదర్శంగా వాళ్ళ కావ్య వస్తువును నిర్దేశించటం కనిపిస్తుంది.

లౌకిక ప్రపంచంలో, మానవ సమాజంలో విస్తృతమైన వస్తు సంపద, విశిష్టమైన జీవన సంబంధాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఉండే ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ ప్రపంచంలో ఈ సమాజంలో ఒక్కొక్క భాగంతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. కొంత భాగం ఎప్పటికి తెలియనిదిగానే మిగిలిపోతుంది. తెలిసిన దానిని బట్టే భావనా ప్రపంచం వికసిస్తుంటుంది. స్త్రీలకు తరతరాలుగా నిర్దేశించబడి ఉన్న కుటుంబ జీవన పరిమితులు, తరచు వాళ్ళను అతి చిన్న లౌకిక ప్రపంచ పరిధుల్లో పరిభ్రమించేటట్లు చేస్తాయి. ఆ మేరకు వాళ్ళ భావనా ప్రపంచం కూడ చిన్నదిగానే ఉంటుంది. తత్ఫలితంగానే స్త్రీల కవితా వస్తుప్రపంచం పరిమిత పరిధిలోనే ఉంటుంది. సంప్రదాయ సమాజం స్త్రీకి కుటుంబం పట్ల ఏ ధర్మాలను అనుసరించదగినవని చెప్పిందో ఆ ధర్మ నిర్వహణలోభాగంగా ఏ నోములు, వ్రతాలు, పండుగలు చేయాలని సూచించిందో అవే ప్రాథమికంగా స్త్రీల కవితా వస్తువు కావటం దీనినే రుజువు పరుస్తుంది.

గుడిపూడి ఇందుమతీదేవి వ్రాసిన తరుణీ శతకం, నీతి తారావళి స్త్రీలకు తొందరపాటు, కోపం ఉండకూడదు, అని ఇల్లు దిద్దుకునే నేర్పు, పతివ్రతా తత్వం ఉండాలని భోధిస్తాయి. దేశరాజు భారతీదేవి కాంతా శతకంలో ఇహపరాలు రెండింటికి స్త్రీకి పతియే గతని చెప్పంది. పాటి బండ వేంకట అలమేలు మంగతాయి – గృహిణి అంటే పొద్దున్నే లేచి ఉత్సాహంతో ఇంటిని తీర్చిదిద్ది శుభ్రమైన వస్రాలు ధరించి తేనెలూరు మాటలాడుచు శుభాలు చేకూర్చాలని సూచించింది. మదిన సుభద్రమ్మ “భోజ్యేషు మాతా శయనేషు రంభా” అన్న ప్రాచీన వాక్కును దృష్టిలో పెట్టుకొని భార్య ధర్మాలను నిర్వచించింది.

“ఘనపరిచర్యలందు దగుకార్యములందును, ధర్మసంగరం
బునశయనించు వేళలను భోజన కాలమునందున నీ క్షేమా
గుణమున దాసి, మంత్రియును, కూలియు, రంభయు, దల్లి ధాత్రిలా
గున జరియుంచు భార్యకుల గోత్రములెంతయు నుద్దరించెడున్” –(గృహలక్ష్మి అక్టోబరు 1929)

చిత్రం: ఏలే లక్ష్మణ్
చిత్రం: ఏలే లక్ష్మణ్
అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ పతివ్రత ధర్మములు అన్న శీర్షిక క్రింద వ్రాసిన పద్యాలలో భర్తకు సేవ చేయమని, ఇంటి పనులు చేయమని అతిథులను ఆదరించమని ఇరుగు పొరుగు ఇండ్లకు వెళ్ళి ముచ్చట్లతో కాలక్షేపం చేయక చదువుకొనమని ప్రభోధించింది. (గృహలక్ష్మి ఆగష్టు 1929) గిడుగు లక్ష్మికాంతం, జొన్నలగడ్డ శారదాంబ వదిన మరదళ్ళు. జంటకవులు. లక్ష్మీశారదాకుమారి నీతిశతకం వారి రచనలలో ఒకటి. కూతుర్ని అత్త గారింటికి పంపేటప్పుడు చేసే హితబోధ ఇందులో విషయం. భర్త మనోగత భావాలను గ్రహించి అతనికి సంతోషం కల్గేటట్లు ప్రవర్తించమని చెప్పడం భర్త చెడు మార్గాలకు పోతే ధైర్యం కోల్పోకుండా చతురతతో మంచి మార్గానికి త్రిప్పుకొమ్మని బోధించటం ఈ శతకంలో కనబడ్తుంది.
ఈ విధంగా స్వాతంత్య్రానికి పూర్వం కవయిత్రులు సంప్రదాయ మార్గంలోనే స్త్రీ ధర్మాలను నిర్వచించారు.అంటే స్త్రీ గురించిన సంప్రదాయ భావననే ఆమోదించి ఆ పరిధిలోనే ఆదర్శ స్త్రీకి ఒక నమూనాను తమ కవిత్వంలో రూపొందించారు.

స్త్రీల గృహజీవితం భర్తను సుఖపెట్టటానికే. ఆ ఆదర్శాన్ని సాధించటానికి అనుగుణంగా స్త్రీల నిత్య జీవిత భౌతిక క్రియాకలాపమంతా రూపొందించబడింది. భర్తను సుఖపెట్టటమే కాదు, భర్త సంక్షేమంలోనే స్త్రీకి ఉనికి, భద్రత ఉన్నాయన్న భావజాలాన్ని నిర్మించింది పిత్రస్వామిక సమాజం. అందువల్లనే భర్త సంక్షేమాన్ని, తమ సౌభాగ్యాన్ని కోరి స్త్రీలు వ్రతాలు, నోములు చేయటం కూడా స్త్రీ ధర్మమే అయింది.

నోములలో శ్రావణ మాసం నోములు చాలా ముఖ్యమైనవి. పెళ్ళైన సంవత్సరం నుండి ప్రారంభించి ఐదు సంవత్సరాలు శ్రావణ మంగళవారం నోములు స్త్రీలు నోచుకుంటారు. శ్రావణ మాసపు రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. జీవితకాలం చేసుకోవల్సినది. 1930 ల నాటి స్త్రీల జీవితం ఈ శ్రావణమాసపు నోముల చుట్టు ఎంతగా అల్లుకొనిపోయిందో స్త్రీల కవిత్వం చూస్తే స్పష్టమవుతుంది. మొగసాటి అప్పల నర్సమ్మ – శ్రావణ మాసాన్ని ఒక స్త్రీగా మానవీకరించి చెప్పిన పద్యంలో ఈ దృష్టిని గమనించవచ్చు.

పుణ్యాంగనలు నీవెపుడు వత్తువోయని దినమువ్రేళ్ళను లెక్క గొనుదురమ్మ
వరలక్ష్మీ పూజలు వ్రతములెప్పుడటంచు సంతోషమున ముచ్చటింతురమ్మ
మంగళప్రదమైన మంగళ శుక్రవారము లెప్పుడని లెక్క వ్రాతురమ్మ
పండుగ వేడుకల్ ప్రకృతి సౌందర్యంబు రాజిల్లుగాదె నీ రాకనమ్మ”

“తరుణుల గాచి రక్షించు దానవమ్మ
పుణ్యవతులందరను నీవ్వె బ్రోతువమ్మ
ముచ్చటగదమ్మ ముద్దుల పూర్ణిమమ్మ
పుణ్యశ్రావణీ! స్వాగతమును గొనమ్మ” (గృహలక్ష్మి ఆగష్టు 1931)

స్త్రీలు శ్రావణమాసం కోసం చూసే ఎదురు చూపులు, మంగళ, శుక్రవార వ్రతాలు చేసుకొనటం పట్ల చూపే ఆసక్తులు ఇందులో వర్ణింపబడ్డాయి. ఈ శ్రావణ మంగళవార, శుక్రవార పూజ ఉత్సవాలను “హైందవాచార సంప్రదాయానుబద్ధ ధర్మములు” అంటుంది రాజేశ్వరి అనే కవయిత్రి. కనుక నారీమ తల్లులకు అవి సదా ఆచరణీయములని చెపుతుంది. “వానినెన్నటికి వీడరాదు సుమీ కుమారీ” అని హెచ్చరిస్తుంది.

సంస్కరణోద్యమంలో ప్రధానాంశం స్త్రీ విద్య. 1870 ల నాటికే వీరేశలింగం పంతులు వంటి వారి కృషితో ఆంధ్రదేశంలో స్త్రీ విద్య ఉద్యమం విస్తరించింది. స్త్రీకి విద్య అవసరమా? కాదా? అవసరమైతే స్త్రీకి ఎటువంటి విద్య ఇవ్వదగినది అనే విషయాల మీద చర్చోపచర్చలు జరిగాయి. పాతిక ముప్పై సంవత్సరాల సంఘర్షణ సంవాదాల చరిత్ర క్రమంలో స్త్రీ విద్య ఒక మేరకు ఆమోదితాంశం అయింది. స్త్రీలు స్వయంగా సంఘాలు పెట్టుకొని స్త్రీ విద్యకు అనుకూలంగా స్త్రీ సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నం మొదలైంది. ఇంత జరిగిన 30 ఏళ్ళ తర్వాత కూడ స్త్రీ విద్య స్త్రీలకు పెద్దగా కవిత్వ వస్తువు కాకపోవటం ఒక చేదు వాస్తవం.

ఉన్నంతలో భువనగిరి లక్ష్మి కాంతమ్మ వ్రాసిన స్త్రీ విద్య అన్న ఖండ కావ్యం ఒకటి కనిపిస్తుంది. స్త్రీలకు బాల్యంలోనే స్త్రీ చరిత్రలు చెప్పాలని అంటుంది ఈ కవయిత్రి. ఐతే ఆ చరిత్ర శీలరక్షణకై ప్రాణాలు వదిలిన స్త్రీల చరిత్రగా ఉండాలని ఆమె ఆశించటం గమనించదగినది. అట్లాగే ఆమె మరొక పద్యంలోఎన్ని విద్యలు నేర్చుకున్నా దుశ్శీల పథం పట్టిన స్త్రీలకు గౌరవము అబ్బదని అంటుంది. శీలం ముఖ్యమైనదని చెప్పటమే విద్య నేర్పించేటప్పుడు అనుసరించవల్సిన ధర్మమని ఆమె అభిప్రాయం. స్త్రీ విద్య గతానుగతికమైన, సాంప్రదాయమైన శీలం అన్న విలువకు అనుబంధంగా మాత్రమే చూడబడ్తున్న స్థితిని ఇది సూచిస్తుంది.

ఐతే ఈ సంప్రదాయ పరిమితులలో కూడ స్త్రీలు సమకాలవు సామాజిక, రాజకీయ ఉద్యమాల వైపు తమ చూపును ప్రసరింప చేయటం విశేషం. హరిజన సమస్య, శ్రామిక వర్గపు సమస్య స్త్రీల కవిత్వ వస్తువు కావటం, వాళ్ళు కుటుంబ పరిధులను దాటి బయటి ప్రపంచాన్ని నిర్వచించటానికి, నిర్మించటానికి సంసిద్దమవుతున్న స్థితిని సూచిస్తుంది. మదమంచి అనంతమ్మ పల్లె పదాలు అనే శీర్షికతో వ్రాసిన పద్యాలలో(గృహలక్ష్మి మార్చి 1931) గడ్డి మోపును తెస్తున్న మాల స్త్రీని వర్ణించింది. ఆమె కష్టాన్ని గుర్తించి సంసారి పిల్లను ఆమెకు సాయంచేయమని చెప్పటం కనిపిస్తుంది.

పరుచూరి భువనేశ్వరీ దేవి – హరిజన సమస్యను కవితా వస్తువుగా చేసుకున్నది.
“కడుపునిండార త్రాగంగ గంజిలేదు
కట్టుకొనుటకు చింపిరి బట్టలేదు
నిద్ర వచ్చుచో జానెడు నేల లేదు
దీన హరిజన స్థితియిదె తెలుగు బిడ్డ”

వీరు సాటి వారంచుభావింపవేల?
ఈశ్వర సుతులంచునూహింపవేల
రక్త సంబంధముంట తలంపవేల
నీకు సోదరుల్ సుమివారు తెలుగుబిడ్డ!

“ఉపవసించె గాంధి యిరువదొక్క దినము
వారి క్షేమాభివృద్దికి పాటు బడుచు
పన్నమొడ్డెను వారికై ప్రాణములను
పిలిచి చేరదీయవదేమి తెలుగు బిడ్డ! (గృహలక్ష్మి 1932 మార్చి)

అని తెలుగు వాళ్ళను హరిజన సమస్యపై చైతన్యవంతులను చేయటానికి కవిత్వాన్ని సాధనంగా చేసుకొన్నది. హరజనుల సామాజిక దైన్యాన్ని, ఆర్థిక దైన్యాన్ని గుర్తించిన ఈ కవయిత్రి కులభేదంతో పని లేకుండా తెలుగువాళ్ళందరు సోదరులేనని భావించింది. హరిజనులను సాటివారిగా గుర్తించాలని సహభావాన్ని ప్రభోధించింది. గాంధీ ప్రారంభించిన హరిజనోద్యమాన్ని గురంచిన చైతన్యం కూడా ఈ కవితా ఖండికలో ప్రతిఫలించింది. హరిజనుల సమస్య పట్ల ప్రజలలో సహానుభూతిని పెంపొందించటం కోసం, ప్రజాభిప్రాయాన్ని సమీకరించటం కోసం గాంధీ నిర్వహించిన చారిత్రక పాత్రను పరుచూరి భువనేశ్వరీ దేవీ తన కవిత్వంలో నమోదు చేయటం విశేషం. జాతీయ కాంగ్రెస్ ని అభిమానించి, మహిళా సమాజాన్ని కూడా ఏర్పరచి కృషిచేసిన దేవులపల్లి సత్యవతమ్మ జాతీయోద్యమంలో స్త్రీలను భాగస్వాములు కమ్మని కోరుతూ “మాలల దు:ఖనిస్వనములన్” దయతో చూడమని స్త్రీలను హెచ్చరించింది. (గృహలక్ష్మి సెప్టెంబర్ 1931)

చిత్రం: ఏలే లక్ష్మణ్
చిత్రం: ఏలే లక్ష్మణ్
మదమంచి అనంతమ్మ వలనే కనుపర్తి వరలక్ష్మమ్మ కూడా శ్రామిక స్త్రీ జీవన శైలిని కవితా వస్తువుగా చేసుకున్నది. పేదరాలు కవిత ఆ కోవలోదే. ఈ పేదరాలు పగలంతా పలుగురాళ్ళు పగులగొట్టి కూలీ సంపాదించుకునే స్త్రీ. వర్షాలు లేక పంటలు పండక బ్రతుకు వెళ్ళని బడుగు జీవులు భూమిని వదిలి పని పాటలకై వలస వెళ్ళిన పరిస్థితులను కనపర్తి వరలక్ష్మమ్మ ఇందులోనమోదు చేసింది.

“పొలపు పాటున్న పుణ్య దినాల యందు కాయయో కంకియో చేతికందుచుండె
ముద్దుబిడ్డలకవి యీయ మురియుచుండ్రి యిపుడు లేదాయొ నా భాగ్య మేమిసేతు
పైరుతల్లి విడిచి పలుగురాళ్ళను గొట్టు కర్మమొదవినపుడె కలిగె లేమి
వాన చినుకురాలి వసుధ రంజిల్లక బాయునెట్టు పేదరాలి క్షుత్తు!”(గృహలక్ష్మి ఏప్రిల్ 1928)

వానలు లేకపోవడం తదితర కారణాల వల్ల వ్యవసాయ రంగంలోని సంక్షోభం అనేక మందికి ఉపాధి లేకుండా చేయటం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కూడా వుంది. వ్యవసాయపు పనులు లేక వాళ్ళ బ్రతుకుదెరువు కోసం వేరే మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. ఐతే అవి వాళ్ళకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేపని కాదు. వాళ్ళ కనీస అవసరాలను సంపూర్తిగా తీర్చలేని కూలి పనులు. అవి వారి జీవితాల్లో విషాదాన్నే మిగిల్చాయి. పేదరాలి స్థితి అదే. పేదరికం అనేది స్త్రీ పురుషులిద్దరికి సమంగా భాధాకరమైన విషయమే అయినా పేదరికం బరువు స్త్రీ మీద పడ్డప్పుడు అది మరింత భాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆకలి తీర్చలేని ఆ పేదరికపు తల్లి పడే హింస ఎంత తీవ్రంగా ఉంటుందో పేదరాలి వేదన ద్వారా వ్యక్తీకరించింది కనుపర్తి వరలక్ష్మమ్మ.

సమకాలపు స్వాతంత్ర్యోద్యమమం స్త్రీలను విశేషంగా ఆకర్షించిన వస్తువు. నాలుగు గోడల కుటుంబ పరిమితిలో నివసిస్తున్న స్త్రీలు తమ స్వాతంత్ర్యం కోసమో, దేశ స్వాతంత్ర్యం కోసమో వీధులలోకి వచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ విధమైన సమిష్టి కార్యకలాపాలలో భాగస్వామ్యం స్త్రీల అస్థిత్వ చైతన్య ప్రకటనకు ఒక వ్యక్తీకరణ అయింది. ఆ చారిత్రక సందర్భాన్ని సామవేదుల చిరంజీవమ్మ తన కవిత్వంలోనమోదు చేసింది. దేశసేవారక్తులైన స్త్రీలను “దేశసేవిక” అని సంబోధించి వారిని చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వారిగా సంభావించింది.

ఆ తపవహ్నికీల లవణాంబుధి తీరమునందు నుప్పుదా
చేతుల జేసినట్టి నవ చెల్వమొ కృష్ణుని జన్మభూమికిన్
జాతర చేయుట గలుగు శాంతరసంబో ముఖంబు నింప వి
విద్యాతత గౌరవాన్వయ విభాతి మనోజ్జవిలాస మొందెడిన్ (గృహలక్ష్మీ అక్టోబరు 1931)

దేశ సేవికల ముఖవిలాసమంతా ఎండలో, సముద్ర తీరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఉప్పు తీయటం వల్లనో, కాంగ్రెస్ సభలకు వెళ్ళటం వల్లనో వస్తున్నదని ఈ పద్యంలో భావన చేసింది సామవేదుల చిరంజీవమ్మ. 1930 మార్చి 12 వ తేదీన గాంధీ ఉప్పు సత్యాగ్రహం నిమిత్తం దండి యాత్రను నడిపించాడు. చారిత్రక ప్రస్థానంగా ప్రస్తావించబడిన ఈ దండి యాత్ర. స్త్రీలను ఎంత ఉత్తేజితులను చేసిందో చిరంజీవమ్మ వ్రాసిన కవిత్వం నిరూపిస్తున్నది. స్త్రీల సౌందర్యం సత్యా గ్రహోద్యమంతో ముడిపడి వికసిస్తున్నట్లు భావన చేయటం ఎంతో ఉదాత్తంగా ఉన్నది. కాస్మెటిక్స్ వినియోగం వలనే స్త్రీ సౌందర్యం సాధించబడుతుందనే వర్తమాన వాణిజ్య సంస్కృతికి సమాంతరంగా అభివృద్ధి చేసుకోవల్సిన జాతీయ సౌందర్య సంస్కృతిని గుర్తించిన స్పూర్తిని ఇక్కడి నుండే పొందాలి మనం.

ఓలేటి నిత్య కళ్యాణమ్మ దివ్యాశీస్సు అనే కవితలో (గృహలక్ష్మి మార్చి 1931) “ భారతీ సతి గుండెలందున పల్లవించిన స్వేచ్ఛ భావము” లను గుర్తించి చెప్పింది. దేవులపల్లి సత్యవతమ్మ దేశభక్తిని ప్రభోధిస్తూ జాతీయ సేవా దీక్షబూని కదిలి రమ్మని స్త్రీలకు పిలుపు నిచ్చింది.

దాస్యాంధకారము తరిమి వేయుటకు నై ఖద్దరు దీక్ష గట్టరమ్మ
గద్గద స్వరముతో కడుదు:ఖమందెడు పంచమ సుతుల పాలించరమ్మ
ఆత్మనాశ మొనర్చునట్టి త్రాగుడు మాన్పి దేశవస్తుల దీక్షదెల్పరమ్మ
మన భాష మన జాతి మన దేశమభివృద్ది నెనయు మార్గముల నూహింపరమ్మ

మనము పూర్ణ స్వతంత్రత గనెడు వరకు
తీరబోదమ్మ మన పని తెరవలార
మాతృసేవాపరాయణ మహిత దివ్య
కంకణము దాల్చి రారమ్మ గరితలార! (గృహలక్ష్మి సెప్టెంబరు1931)

సంపూర్ణ స్వాతంత్ర్యం పొందేవరకు భారతీయులకు ఖద్దరు ధారణ, మద్యపాన నిషేదం, అస్పృశ్యత నివారణ మూడు ముఖ్య కార్యక్షేత్రాలుగా నిర్దేశింపబడ్డాయి. గాంధీ ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని తమదిగా స్వీకరించి ముందుకు నడవటానికి స్త్రీలు ఎంతగా సంసిద్ధమయ్యారో ఈ పద్యం సూచిస్తుంది. మనభాష మనజాతి మనదేశ అభివృద్ది మార్గాలను గురించి ఆలోచించాలని దేవులపల్లి సత్యవతమ్మ దేశాభిమానాన్ని వ్యక్తీకరించింది.

అవటపల్లి కృష్ణవేణి ప్రజోత్పత్తి సంవత్సరాది సందర్భంగా కవిత్వం వ్రాస్తూ “నీవైనా శాంతి నొడగూర్చి నెగుడుమమ్మ” అని కోరింది. గాంధీ – ఇర్విన్ ఒడంబడికను ప్రస్తావించి వాళ్ళిద్దరూ కలిసి భారతమాత సంకెళ్ళను విప్పటానికి చేసిన సంకల్పాన్ని “దయ పూర్తి చేయుము” అని కొత్త సంత్సరాదిని కోరింది. (గృహలక్ష్మి మే 1931 ) అలాగే యం.వేదవల్లి తాయారమ్మ కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ “శాంతి సత్యాగ్రహములిచ్చి సరవిగొనుము” అని వేడుకుంటుంది. (గృహలక్ష్మి మే1931) ఆ రకంగా కొత్త సంవత్సర ఆకాంక్షలు దేశ స్వాతంత్ర్యము కాంక్షలతో ముడిపడి స్త్రీల కవిత్వంలో వ్యక్తమయినది.

పురావైభవ సంకీర్తనం కూడా స్వాతంత్రోద్యమ చైతన్యంలో ఒక భాగం. జాతీయోద్యమ కాలంలో ప్రాచీన భారతీయ చరిత్రను ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి వైభవాలను ప్రశంసిస్తూ అనేక మంది కవిత్వం వ్రాశారు. స్త్రీలలోకూడా అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళున్నారు. గంటి కృష్ణవేణమ్మ “హంపీ శిథిల స్మృతి” అనే ఖండ గీతి రచించింది.

తనమహోదగ్ర ప్రతాపారుణచ్ఛటల్
ఖండాంతరముల కీరెండ గాయ తనదిగంత శ్రాంత ఘనయశశ్చందిక
లెల్ల లోకములకు వెల్ల వేయ
తన మహ పాండిత్య ధారణాగరిమంబు
కవి చంద్రులకు కల్పకంబు గాగ తన చేతి శిత మహోదగ్ర ఖడ్గ ప్రభలు
ప్రతి పక్షులకు గుండి బరువు గాగ” పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్య వైభవాన్ని కీర్తించింది.

జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వం ప్రజలకు గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చిన అంశం. గాంధీని శ్రీకృష్ణుడిగా సంభావించి ఆరాధించేవరకు అది దోహదం చేసింది. అదే విధంగా మోతీలాల్ నెహ్రో, పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ మొదలైన జాతీయోద్యమ నాయకులు ప్రజలకు ఆరాధ్యులైనారు. అదే క్రమంలో వాళ్ళు కవితా వస్తువు కూడా అయినారు. అందులో భాగంగానే స్త్రీలు కూడ ఈ జాతీయోద్యమ నాయకులను కావ్య నాయకులుగా స్వీకరించి కవిత్వం వ్రాశారు.

దేవులపల్లి సత్యవతమ్మ “రథ చోదితుండ వౌచు రాజిల్లు కేశవున్ మరపించు శ్రీ గాంధీ మహిమ దలచి” అని ప్రారంభించిన కవిత్వ రచనలో (గృహలక్ష్మి ఫిబ్రవరి 1931) భారతేతిహాస కథాపాత్రలతో జాతీయోద్యమ నాయకులకు పోలికను భావించి చెప్పింది. భారత యుద్ధంలో రథం నడిపిన కృష్ణుడు వంటి వాడు గాంధీ. పటేలుని ధర్మరాజని, జవహర్ లాల్ ను అర్జునుడని సుభాష్ చంద్రబోస్ ను భీముడని పేర్కొని ప్రశంసించింది. దేశరాజు భారతీదేవి బాపూజీ అస్థి నిమజ్జన సందర్భాన్ని కవితాంశంగా చేసుకొన్నది. గాంధీజీ అస్థికలు ధరించిన కృష్ణానదిభాగ్యాన్ని ప్రశంసించింది. మోతీలాల్ నెహ్రూ మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ జూలూరి తులసమ్మ పదకొండు పద్యాలు వ్రాసింది. భారతజాతికెల్ల శుభాన్ని సంపాదించే పనిలో ఉన్నవాడని పొట్టన పెట్టుకున్నందుకు దైవాన్నే నిందించిందామె.
జ్ఞానాంబ మహమ్మద్ అలీ మరణానికి సంతాపంగా పద్యాలు వ్రాసింది.
“మహిత గుణశాళి శ్రీశ్రీ మహమ్మద్ అలీ
కాత్మ శాంతయు నిడు బరమాత్ముదెలమీ” అని ఆకాంక్షించింది. (గృహలక్ష్మి మార్చి 1931)

జాతీయోద్యమకాలంలో స్వదేశీ ఉద్యమంలో, సహయనిరాకరణోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న స్త్రీలు ఎందరో ఉన్నా చాలమంది చరిత్రలో అనామకంగానే మిగిలిపోయారు. జాతీయోద్యమ నిర్మాణంలో ఆ స్త్రీలు చేసిన కృషి తరచూ విస్మరించబడింది. ఈనాటికి ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో 1930లలోనే మహిళలు తమ సమకాలంలోనే జాతీయోద్యమంలో భాగస్వాములైన స్త్రీల నుండి స్ఫూర్తిని పొందటం, వారిని ఒక ఆదర్శ నమూనాగా భావించటం, వారి ఉద్యమ నిబద్ధతను కేంద్రంగా చేసి కవిత్వం వ్రాయటం గమనించవచ్చు.

“ఖద్దరు దరియించి కాల్పుడీ పరదేశ వస్త్రంబులనిన ప్రశస్తవీవు
అంటరాని తనంబు మటుమాయ మొనరింప నిరతంబు మదినెంచు నెలతనీవు
స్వారాజ్యమే స్త్రీల జన్మహక్కని దెల్పి స్వాతంత్ర్య దీక్షకై సాగితీవు
బీదసాదల జూచి ప్రేమతో సర్వంబు ధారవోసిన యట్టి థాత్రివీవు” (గృహలక్ష్మి నవంబర్ 1930)

అని కుడితిపూడి అచ్చమాంబ అన్నపూర్ణను ప్రశంసించింది. ఖద్ధరు ధరించటం, విదేశీ వస్త్రాలను దహించటం, అంటరాని తనాన్ని నిరసించటం, జాతీయోద్యమం ఇచ్చిన కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలను, ఆచరణలో పెట్టటం తన జీవితంలో భాగంగా చేసుకున్న మహిళ మాగంటి అన్నపూర్ణ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నది తిలక్ ఇచ్చిన నినాదం. ఆ నినాదాన్ని స్వారాజ్యమే స్త్రీల జన్మ హక్కు అని మార్చి స్వాతంత్ర్యాన్ని స్త్రీల ఆకాంక్షగా వ్యక్తీకరించింది మాగంటి అన్నపూర్ణ. స్త్రీలుగా అప్పుడప్పుడే స్వాతంత్ర్య స్పృహను పొందుతూ దానిని దేశ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా వెతుక్కుంటున్న ఒక దశకు మాగంటి అన్నపూర్ణ ఒక బలమైన ప్రతీకగా కుడితిపూడి అచ్చమాంబ లాంటి స్త్రీలకు తోచి ఉంటుంది. అది ఆమె పట్ల గౌరవంగా, ఆరాధనగా వ్యక్తమైంది. ఆ క్రమంలోనే మాగంటి అన్నపూర్ణ జీవితం కావ్యవస్తు గౌరవాన్ని పొందింది.

అయితం ఇందిరా భారతి అక్కా చెళ్ళెల్లు జంటకవులు. అన్నపూర్ణ సుభాషిత రత్నావళి అనే పద్య కావ్యం వ్రాశారు. మాగంటి అన్నపూర్ణదేవి భర్త బాపినీడు ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళాడు. ఆమెకు వెళ్ళటం సాధ్యపడలేదు. అతని గురించే ఆలోచిస్తూ పరిపరి విధాల పోయే తన బుద్ధిని మనస్సును నియంత్రించుకుంటు సత్యాగ్రహోద్యమంలో చేరింది. అప్పటినుండి భర్తను కూడా ఉద్యమంలో చేరమని ప్రోత్సహిస్తూ ఉత్తరాలు వ్రాసింది. మాగంటి అన్నపూర్ణదేవి భర్తకు వ్రాసిన ఆ లేఖాంశాలే కవితా వస్తువుగా చేసుకున్నారు ఇందిరా భారతి. అన్నపూర్ణ అనుభవించిన భర్తృ విరహాన్ని, దేశభక్తి నిబద్దతను ఈ కావ్యంలోచక్కగా వర్ణించారు. అసహాయ ఉద్యమాల్ని నడుపుతున్న గాంధీని ఆమె దివ్య మూర్తిగా భావించటం ఏలూరు, బెజవాడ సమావేశాలలో గాంధీజీకి తన ఒంటి మీద ఉన్న నగలన్ని అర్పించి నూలు గుడ్డలు కట్టుకోవటం మొదలైన అంశాలను కవయిత్రులు ఇందులో ప్రశంసించారు.

“కాల్చనిచ్చితి భక్తితో గాంధికేను
రెండువెల్సేయు పట్టుచీరెలను, మరియు
బెండ్లి చీరను గూడ నర్పించుకొంటి
వలయుచోబ్రాణమే నిత్తు భరత ధరగు”
పెండ్లి యుంగరమును గూడ బ్రీతితోడ
తిలకు నిథి కిచ్చినాను, మీ విలువ గలుగు
చేతి గడియార మిచ్చితి జేతమలర
నకట! మిము నిచ్చుకొనెడు భాగ్యంబు లేదు”.

అని తన భర్తను జాతీయోద్యమ కార్యాచరణకు సుముఖుడుగా చేసుకొన లేకపోవటం గురించి బాధపడినట్లుగా వాళ్ళు వ్రాశారు. అమెరికాకు భర్త దగ్గరికి పోవటం కంటె స్వాతంత్ర్యాన్ని ఆశించి స్వరాజ్యం కోసం పాటుపడుతున్న భారతీయులలో ఒక వ్యక్తిగా తనకు అర్హమైనది “దేశసేవా ప్రకార సద్దీక్ష” అన్న చైతన్యాన్ని కనపరిచిన స్త్రీ మూర్తిగా అన్నపూర్ణను దర్శించి కీర్తించారు ఇందిరా, భారతి.

జాతీయోద్యమ కాలపు కవయిత్రులకు మాగంటి అన్నపూర్ణ తర్వాత కావ్య వస్తువైన మరొక స్త్రీ మీరాబాయి (స్లేడు) ఆంగ్లకన్య. భారత స్వాతంత్ర్యాన్ని కాంక్షించి గాంధీ శిష్యురాలై మీరాబాయిగా ప్రసిద్ధి చెందింది. ఈమెను కీర్తిస్తూ ఓలేటి నిత్య కళ్యాణమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ కవిత్వం వ్రాశారు.

“ఎక్కడి యాంగ్ల దేశమిది, యెక్కడి భారతదేశ మద్దిరా!
ఇక్కడికేగుదెంచి యిటులెంతయు దీక్షను మాదు ముక్తికై
తక్కక రాత్రియుంబవలు తల్లిరొ! స్లేడురొ! పాటునొందునీ
ఎక్కువ యైన ఈ ఋణము నేగతి నీగెద మమ్మ యిమ్మహి”

మృగతృష్ణను బోలెడు నా
దగను విలాసమును విడిచి తల్లీ! స్లేడూ
నిగమాంత వేధి గాంధీకి
దగ కూతుర వైతి వెంత ధన్యవొ ధాత్రిన్” (గృహలక్ష్మి ఏప్రిల్ 1931) అని సత్యవతమ్మ మీరాబాయి స్లేడును ప్రశంసించింది.

ఈ విధంగా స్త్రీల కవిత్వం జాతీయోద్యమ ఆదర్శాలను జాతీయోద్యమంలో క్రియాశీల పాత్రవహించిన వ్యక్తుల చరిత్రను గౌరవాభిమానాలతో నమోదు చేసింది.

వట్టికొండ విశాలాక్షి:

అభ్యుదయ సాహిత్య ఉద్యమంతో ముడిపడి తన కవితా శక్తిని వికసింపచేసుకున్న స్త్రీ వట్టికొండ విశాలాక్షి. ఒకవైపు అంతర్జాతీయ కమ్యూనిస్టు తాత్వికత మరొకవైపు దేశీయ స్వాతంత్ర్య ఆకాంక్ష రెండు ఆమె కవిత్వంలో పెనవేసుకొని ఆవిష్కరించబడ్డాయి. 1942 జూలై లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. అందులోకి భిన్న వర్గాల ప్రజా సమూహాలను కల్పుకొని రావాలని గాంధీ ఆకాంక్షించాడు. అందులో భాగంగానే జాతీయోద్యమంలోకి స్త్రీల సమీకరణ ఆనాడు ఒక ప్రధాన కార్యక్రమం అయ్యింది. ఆ నేపధ్యంలో వట్టికొండ విశాలాక్షి ప్రభోదం అనే శీర్షికతో ఒక ఖండిక వ్రాసింది.

స్వాతంత్ర్య పోరాట శక్తిలో సగమైన మహిళా మణుల స్వేచ్ఛ మంటలో గల్పేసి
స్వాతంత్ర్య సమరాన సాగిపోయే రంచు
పురుషలోకానికి భోద చేయాలి.
స్వేచ్ఛ కావాలంటు స్త్రీలే అడగాలి.
సాహసముతో స్త్రీలే సాగిరావాలి.” అని స్త్రీల స్వేచ్ఛకు హామీ లభించినపుడే దేశ స్వాతంత్ర్యం సాధ్యమవుతుందన్న దృక్పధాన్ని కనబరిచింది. స్త్రీలు స్వేచ్ఛ సాధించినపుడే స్వాతంత్ర్య పోరాటం సమర్థవంతంగా సాగుతుందని ముందుగా పురుషులకు అర్థం కావాలి. స్వేచ్ఛ పిపాస స్త్రీలలో సమాంతరంగా అభివృద్ధి చెందాలి. అది విశాలాక్షి ఆకాంక్ష. స్త్రీలను జాతీయోద్యమంలోకి సమీకరించటమేకాదు సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధంలోకి కూడా వాళ్ళను ఆహ్వానించే చైతన్యం ఆమెది.

“ఫాసిస్టు శత్రువుల పాతిపెట్టాలి
సబలలమేమంచు చాటి చెప్పాలి.” అన్నది విశాలాక్షి ఆదర్శం. స్త్రీల విముక్తి ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ఉద్యమంతో ముడిపడి ఉన్నదని కమ్యూనిస్టుగా విశాలాక్షి నమ్మకం. అందుకనే ఫాసిజాన్ని సర్వనాశనం చేయటం స్త్రీలకు కార్యక్రమంగా ఇచ్చింది ఆమె.

ఒకవైపు సంప్రదాయ స్త్రీ ధర్మాలను శిరసును ధరించి ఆ ధర్మాచరణమే స్త్రీ ఆదర్శమని కవిత్వం వ్రాస్తూ మరొకవైపు సమకాలిన భావకవితా ఉద్యమ ప్రభావంతో ప్రకృతిని వర్ణిస్తూ గొప్ప భావుకతతో స్త్రీలు కవిత్వం వ్రాశారు. చావలి బంగారమ్మ భావకవుల ఊహా ప్రేయసి, విరహ భావనా స్థానంలో పతి విరహాన్ని నిలిపి నివేదన అన్న శీర్షిక క్రింద కవిత్వం వ్రాసింది. (భారతీ జూలై 1932) అంతేకాదు ఇంత సంప్రదాయ చట్రంలోకూడా స్త్రీలు కావడం వలన తాము ప్రత్యేకంగా పొందుతున్న అనుభవాలను, అనుభూతులను, ఆవేదనలను కూడ ఆనాడు స్త్రీలు అరుదుగా నైనా సరే తమ కవిత్వంలో నమోదు చేశారు. స్త్రీ పురుష సమానత్వాన్ని చెప్పటానికి ప్రయత్నించారు. మదమంచి అనంతమ్మ పల్నాటి యుద్ధ కథను రెండు కావ్యాలుగా వ్రాసింది. మాంచాల అనే కావ్యంలో బాల చంద్రుని వేశ్యా వ్యసనం పట్ల మాంచాలకున్న తీవ్ర వ్యతిరేకతను నిరసన స్వరంతో మాంచాల ముఖంగా వ్యక్తీకరించింది. బాల చంద్రుడు పల్నాటి యుద్దంలో పాల్గొనడానికి మాంచాల దగ్గర అనుమతి తీసుకోవల్సి వచ్చింది. తన ఇంటికి వచ్చిన భర్తను ఆహ్వానించి మాంచాల అతని దక్షిణ పాదాన్ని(కుడి కాలుని) కడిగింది. రెండవ కాలుని కడుగలేదని ప్రశ్నిస్తూ బాలచంద్రుడు ఇది మీ పుట్టింటి వారి మర్యాద లక్షణమ్మా అని భార్యను ఎత్తి పొడిచాడు. ఆ పాదం సాని సబ్బాయిది కనుక తాను కడుగలేదని చెప్పి అతను మొత్తం తన మనిషి కాదు అన్న వాస్తవాన్ని నిరసన స్వరంతో చెప్పింది. నాయకురాలు కావ్యంలో నాగమ్మ ముఖంగా ఆడది సింహాసనంమీద కూర్చుంటే భరించలేని పురుషాధికార అహంకారాన్ని ఎత్తి చూపింది అనంతమ్మ.

అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ టీచర్స్ ట్రైనింగ్ సందర్భంగా అది శిక్షణగా కాక శిక్షగా తన అనుభవంలోకి వచ్చిన తీరును విమర్శిస్తూ పద్యాలు వ్రాసింది. వ్రాసిందే వ్రాయటం, నోట్స్ ఆఫ్ లెస్సన్స్ వ్రాయటం, వేళా పాళా లేని డ్రిల్ కి హాజరు కావల్సి రావటం, హాజరు కాలేకపోతే డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి రావటం ఇవన్నీ ట్రైనింగ్ ను పెద్ద గండంగా భావించేటట్లు చేస్తున్నాయని ఈమె కవిత్వం చెపుతుంది. పబ్లిక్ ప్రపంచానికి అందులోను విద్యావ్యవస్థకు సంబంధించిన స్త్రీల అనుభవాన్ని తొలిసారిగా నమోదు చేసిన కవయిత్రిగా అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ కనబడుతుంది.

స్త్రీలు ఇంటికే పరిమితమైనా, అధ్యాపకులుగా గాని, మరే వృత్తి ఉద్యోగాలలోకి గాని, ఉద్యమాలలోకి గాని ప్రవేశించినా కవిత్వం వ్రాయటానికి పూనుకున్నా- వారందరికి ప్రధానమైంది ఇంటి పని పిల్లల పెంపకమే. ఆ రెండు ప్రధాన విధులను నిర్వర్తించిన తరువాత దొరికే సమయంలోనే, మిగిలిన శక్తితోనే ఆమె తన అస్థిత్వ నిరూపణకు, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన, ఆసక్తి కల్గిన కార్యాలు చేపట్టాలి. గిడుగు లక్ష్మీకాంతం, జొన్నలగడ్డ శారదాంబ వ్రాసిన “లేఖదూత” అనే కావ్యం ఇందుకు సాక్ష్యమిస్తున్నది. భర్త ఉద్యోగం వలన వేర్వేరు చోట్ల ఉన్న భార్యాభర్తల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో ఉన్న కావ్యం ఇది.

పిల్లల కోడి నౌట తెరపించుక లేదిక, నేమి సేతు నే నిల్లును దిద్దుకొంచు నొక యించుక తెన్నొకట్టబెట్టనేని
నుల్లసమంది యత్తరిని నోపిక దెచ్చుక కొన్ని పద్యముల్
జల్లగ వ్రాయ జూతు సుమీ! చారు గుణాకర! శ్రీ మనోహరా!

ఇది ఒక భార్య వేదన. పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకొనటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం, ఆమె స్థితి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవలసిందే. ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయ జూతు సుమీ” అని చెప్పటంలో వ్యక్తమైంది ఆ ఒక్క స్త్రీ స్థితి మాత్రమే గాదు. కవిత్వ రంగంలో ఉన్న స్త్రీలందరి స్థితికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇన్ని ఒత్తిడులను మధ్య వ్యతిరేక పరిస్థితుల మధ్య స్త్రీలు కవిత్వ రచన చేయాల్సివస్తున్నది కనుకనే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వ్రాయలేరు. ప్రధాన స్రవంతి పురుష కవి ప్రపంచంలో తమకొక స్థానాన్ని పొందలేరు. 1930 ల నాటి ఈ స్థితిని దాటి స్త్రీల కవిత్వ ప్రపంచంలో స్త్రీల గమనం ఏ దిశగా సాగిందో, ఏ గమ్యాన్ని చేరిందో కళ్ళముందున్న వర్తమానంతో పోల్చి మనమిప్పుడు బేరీజు వేసుకోవలసే ఉన్నది.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో