Jan2008
అపరాజిత 4: మైకం కమ్మిన జీవితాలు
పాఠశాల వదిలేసిన తరువాత సెయింట్ ఫ్రాన్సిస్, పార్మలీ, మిషన్ లాంటి రిజర్వేషన్లలో ఎక్కువగా తిరిగేదాన్ని. జనాలు దౌర్జన్యం కింద ఎలా నలిగిపోతారో, నాశనమవుతారో ఈ ఊర్లు చక్కని ఉదాహరణ. ఇళ్లన్నీ తారు పేపరుతో, ఏది దొరికితే దానితో కట్టుకుంటారు. తుప్పుపట్టి, ఎక్కడికక్కడ పడిపోతున్న ఒక చిన్న హౌస్ ట్రెయిలర్ను తీసుకో. నారింజ పళ్ల క్రేట్లతో ఒక ఆవరణం తయారు చేసి, ఆ ట్రెయిలరుకు తగిలించు. అది మీ వంటగది అవుతుంది. దానికి ఏదో ఒక ఆటో బాడీని చేర్చు. అది మీ పడక గది అవుతుంది. దానికొక టెంటు తగిలిస్తే అది నర్సరీ అవుతుంది. అంతా కలిపి ఒక సాధారణమైన ఇల్లు తయారవుతుంది. చివరగా ఓ యాభై అడుగుల దూరంలో చెక్కలతో చేసిన మరుగుదొడ్డి. మంచు తుపాను చెలరేగుతుండగా రాత్రి వేళ ఆ మరుగుదొడ్డికి వెళ్లడం ఒక పెద్ద సాహసకార్యమే అవుతుంది. ఎవరైనా దొడ్డి లోకి వెళ్లేంతవరకూ ఎదురుచూసి, కొంతమంది కలిసి ఆ దొడ్డిని లేవనెత్తి తలకిందులుగా చేసి, లోపల ఉన్నవాళ్లు పిచ్చి పట్టినట్టు అరుస్తూ వుంటే ఆనందించడం తాగుబోతులు తమ మధ్య వేసుకునే ఒక ప్రాక్టికల్ జోకు. పార్మలీలో దొరికేదల్లా ఇలాంటి ఆనందాలే.
పార్మలీ, సెయింట్ ఫ్రాన్సిస్, మిషన్ పట్నాల్లో తాగుబొతులు చాలా ఎక్కువ. వారం చివర్లో వచ్చే లీజు డబ్బు, ADC (Aid To Dependent Children) చెక్కులు లెమన్ వాడ్కా, జిమ్ బీమ్, కార్ వార్నిష్, పర్పుల్ జీసస్, పెయింట్ రిమూవర్ వంటి మత్తు పదార్ఠాలు కొనుక్కోవడానికి సరిపొయ్యేవి. లోడ్ల కొద్దీ బీరు ఎప్పుడూ ఉండేది. కొంతమంది తమ కుటుంబాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ఒక జగ్గు వైను కోసం ఏమైనా చెయ్యడానికి తయరుగా ఉండేవారు. ఉన్న కొద్ది డబ్బుతో తిండి కొనాలా మద్యం కొనాలా అని వాదించుకునేవాళ్లు. చివరికి మద్యానిదే పైచెయ్యి అయ్యేది. తమ దీనావస్థ నుంచి బయట పడే దారి లేక వాళ్లల్లో వాళ్లే కొట్టుకునేవారు. ఎవరో ఒకరి తల పగలకుండా కన్ను లొట్టపోకుండా ఏ ఒక్క వారం గడిచేది కాదు. “నేల మీద కనిపిస్తున్నవి ద్రాక్షపళ్లు కాదు, కళ్లు” అనేది ఒక అరిగిపోని జోకు.
అందరూ తప్పతాగి కార్లు ఎక్కి రోడ్లమీద పడి, దారీ తెన్నూ లేకుండా ఒక ఊరి నుంచి ఒక ఊరికి తిరుగుతుండేవాళ్లు.
ఆ కార్లు ఎలా ఉండేవని?! ఒక్కో కార్లో ఎంతో మంది ఒకరిమీద ఒకరు కూర్చుని ప్రయాణం చేసేవాళ్లు. ఒక్కోసారి ఆ గుంపుల్లో చిన్నపిల్లలు కూడా ఇరుక్కుని కూర్చునేవాళ్లు. అవి చాలావరకు బ్రేకులు సరిగా పడని కార్లే. రోడ్డు కూడలి ఒక మైలు దూరంలో ఉండగానే బ్రేకు మీద పదేపదే తొక్కవలసి వచ్చేది. విండ్ షీల్డుకు వైపర్లు ఉండేవి కావు. అయినా వైపర్ల అవసరం అంతగా ఉండేది కాదు. ఎందుకంటే, విండ్ షీల్డే ఉండేది కాదు. కనీసం ఒక్క హెడ్ లైట్ వెలిగినా మంచిదనుకునేవారు. ఒక్కోసారి కారు డోర్లు ఉండేవికాదు. ఒక టైరు లేకపోయినా రిమ్ము మీదే కారు నడిపేవారు. ఓ రెండు కేసుల బీరు, కొన్ని గాలన్ల నాసి రకం కాలిఫోర్నియా వైన్ వెనుక సీట్లో ఎప్పుడూ ఉండేవి. ఒక్కోసారి చిన్నపిల్లలకు కూడా ఆ మద్యం దొరికేది. అలా బీరు క్యాన్ల మధ్య, కడుపులో గాలన్ల కొద్దీ మద్యంతో బ్రేకుల్లేని కార్లల్లో ఎగిరిపోతూ వుండేవారు. జీవితాన్నిభరించడానికి వాళ్లకు అంతకన్న మంచి మార్గం కనిపించలేదు.
నేను నా పన్నేండో ఏటికే, క్వార్టరు బాటిల్ స్ట్రాంగ్ మద్యం తాగినా కనీసం తూలేదాన్ని కాదు. నేను బాగా తాగేదాన్ని. అసలు సిసలు తాగుబోతును అయ్యేదాన్నే కానీ, తాగడం పట్ల విముఖత ఏర్పడింది. తాగేటప్పుడు బాగానే ఉండేది కానీ, పొద్దున లేచేటప్పటికి హాంగోవరుతో నీరసించిపొయ్యి, భయంకరంగా అనిపించేది. ఆ ఫీలింగ్ నాకు నచ్చేది కాదు. అయినా, సాయంత్రమయ్యే సరికి సీసా పట్టుకునేదాన్ని. తరువాత, ఒక్కసారిగా తాగడం మానేశాను. ఎప్పుడైతే నా జీవితానికో అర్థం వుందని గ్రహించానో, ఎప్పుడైతే నన్ను నేను ఇష్ట పడగలిగానో అప్పటి నుండి సంవత్సరాల పాటు ఒక చుక్క తాగలేదు. ఈ విషయంలో ఇండియన్ మూవ్మెంటుకు, పవిత్రమైన పెయూట్ కు ఎప్పుడూ రుణపడి ఉంటాను. పిల్లలు పుట్టక ముందే తాగడం మానేశాను గాని, మళ్లీ దాని జోలికి పోకపోవడానికి పిల్లలే పెద్ద కారణం.
మా అక్క బార్బ్ కు, నాకు చాలా మంది స్నేహితులున్నారు. వాళ్లల్లో చాల మంది బాగా తాగుతారు. నేను తాగడం మానేశానని వాళ్లకు చెప్పాను. వాళ్లతో వెళ్లినప్పుడు 7అప్ తాగుతాను. “మా కంపెనీ నీకు ఇష్టం లేదా” అని అడుగుతారు. “తాగుడు మనకు మంచి చేస్తోందని నేను అనుకోవడం లేదు. నేనేదో మీముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నానని అనుకుంటే మీ ఇష్టం. మీకు తాగాలనుంటే తాగండి. నన్ను పట్టించుకోవద్దు” అని చెప్పే దాన్ని. ఇతర్లకు హితబోధలు చేసే ఉద్ధేశం నాకు లేదు. తప్పతాగేసి గందరగోళంలో ఉన్నప్పుడు నన్ను, బార్బ్ ను ఏం చెయ్యాలో అడిగేవాళ్లు. ఒక్కోసారి పిల్లల కోళ్లల్లా అనిపించేది మాకు. వాళ్లు నా దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకునే వాళ్లు. ఇలాంటి సమయాల్లో పవిత్రమైన పెయూట్ అయితే ఏమి చెప్పొచ్చో ఊహించుకుని అదే వాళ్లకు చెప్పేదాన్ని. నేను చెప్పేది వాళ్లు వినేవాళ్లు. నేను చెప్పేది నిజమని ఒప్పుకునేవాళ్లు. తాగుడు మానేస్తామని చెప్పేవాళ్లు. కాని, మానేసే ప్రయత్నం పట్టుదలగా చేసేవాళ్లు కాదు. మరునాడే బయటకు వెళ్లి తప్పతాగి వచ్చేవాళ్లు. వాళ్లు ఎందుకలా తయరయ్యారో నాకు తెలుసు, వాళ్లను అర్థం చేసుకోగలను. “మీ బడ్ వైజర్ను మీరు ఎంజాయ్ చెయ్యండి, నా 7అప్ ను నేను ఎంజాయ్ చేస్తాను “అని చెప్పేదాన్ని.
తాగుడు మా జీవితాల్లో ఒక భాగమైనట్లు అనిపించడం వల్లనే మొదట నేను తాగడం మొదలెట్టాననుకుంటా. మా నాన్న తాగేవాడు. పెంపుడు తండ్రి తాగేవాడు. అమ్మ తాగేది. మరీ ఎక్కువ సార్లు కాదు కానీ, అమ్మ ఎప్పుడన్నా బాగా తాగేసేది కూడా. మా అక్కలు తాగేవాళ్లు. నా కంటే నాలుగేళ్లు పెద్దదయిన బార్బ్ సరిగ్గా నాకంటే నాలుగేళ్ల ముందు నుంచి తాగడం మొదలెట్టింది. అందరూ తాగుతారనే భావనతో పెరిగాను నేను. అది చాలా వరకు నిజం కూడా. కొంతమంది పాత ఆచారవంతులు కూడా చచ్చిపోయిన తమ బంధువుల అత్మ సంతృప్తి కోసమన్నట్లు నేలమీదో, మూలలకో మద్యం చిలకరించి “ఇదిగో అన్నా, నీకోసం కొంచెం మద్యం. తాగి ఆనందించు!” అని అనేవాళ్లు.
అమ్మ ఇంకో పెళ్లి చేసుకున్నప్పుడు తాగడం మొదలు పెట్టాను నేను. నాకు అప్పుడు పదేళ్లు. అతను ఎప్పుడూ తాగేవాడు. నేను అతని సీసాల్లోంచి కొంచెం తీసుకుని తాగేసేదాన్ని. పాఠశాలలో అయితే ‘వెస్ట్రీ’ లో దూరి, చర్చి వైను - క్రీస్తు రక్తం - తాగేదాన్ని. మా జనాల మధ్య జీవితం తెలుసు కనుక ఆయన నన్ను అర్థం చేసుకుని వుంటాడని నా నమ్మకం . ఏమైతేనేం నాకు ఏ పిడుగు దెబ్బా తగల్లేదు. కొంతమంది పెద్దలు చేసుకున్న ఒక పార్టీలో నేను మొట్ట మొదటిసారి తాగాను. “కొంచెం నిమ్మరసం కావాలా?” అని ఒకావిడ నన్ను అడిగింది. ఓ పెద్ద గ్లాసులో నిమ్మరసం వేసి, అందులో మద్యం కలిపి ఇచ్చింది. అదే తాగుడుతో నా మొదటి అనుభవం. తూలుతూ నడవబోయి పడిపోయిన నన్ను చూసి అందరూ నవ్వుకున్నారు.
నిజానికి రిజర్వేషన్లో మద్యం నిషేధించబడింది. ఆ నిషేధం ఒక పెద్ద జోకు. విన్నర్, సెయింట్ ఫ్రాన్సిస్, మిషన్ లాంటి టౌన్లలో సగం తెల్లవాళ్లు ఉండేవారు. వాళ్లకు మద్యం కావలసి వచ్చి ఆ టౌన్లు రిజర్వేషన్ మధ్య ఉన్నా, అవి తెల్లవాడి చట్టం కిందకి వచ్చేట్టు చేసుకున్నారు. అక్కడా చాలా బార్లు వెలిశాయి. రిజర్వేషను చుట్టుపక్కల వున్న చిన్న చిన్న ఊర్లలో కూడా చిన్న సెలూన్లు వుండేవి. ఏ మారు మూల ఊర్లో చిక్కుబడిపోయినా ఏదోలా మద్యం దొరికేది.
మా అక్క బార్బ్ నా ప్రాణ స్నేహితురాలు కూడా. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించేది. నా గురించి అన్నీ పట్టించుకునేది. ఒక రోజు ఒకబ్బాయి నన్ను జాన్ వైన్ సినిమాకు తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి మేం మద్యం దొరికే చోటికి వెళ్లి మాకు కావలసినవి తీసుకుని బయటకు వస్తున్నప్పుడు బార్బ్ ఎదురుపడింది. తనకు కావలసిన సరుకు కొనుక్కోవడానికి వచ్చింది. ఏదో నమ్మశక్యం కానిది చూస్తున్నట్లు మొఖం పెట్టి, “నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?” అని గద్దించింది.
“నువ్వేం చేస్తున్నావు. ఈ దుకాణం నీ సొంతమని నాకు తెలీదే” అని నేను ఎదిరించాను.
ఆమెకు చాలా కోపం వచ్చింది. “నేను ఫర్వాలేదు. నాకు పదిహేడేళ్లు. నువ్వు ఇలా చెయ్యకూడదు. నువ్వు చాలా చిన్నదానివి” అని ఆమె మా దగ్గరున్న సీసాలు లాగేసుకుంది. నాతో వచ్చిన అబ్బాయి అడ్డం వస్తే సీసాతో తల పగల గొడతానని బెదిరించింది. ఆ గందరగోళంలో ఆ సీసాలను తనకోసం, తన స్నేహితులకోసమైనా వుంచుకోకుండా స్తంభానికేసి విసిరి పగలగొట్టేసింది.
ఇంకోసారి, ఏదో డాన్సు తరవాత, నాకు నచ్చిన ఒకబ్బాయితో కలిసి కూర్చుని సిగరెట్టు తాగుతూ వున్నాను . బార్బరా ఎక్కడినుంచో వచ్చి, నా నోట్లోంచి సిగరెట్టు లాగేసి, దాన్ని కిందపడేసి కాలితో తొక్కేసింది. ఆమెని కొట్టేస్తూ “నువ్వు కూడా తాగుతావు కదా.” అని గట్టిగా అరిచాను, ఆమె మళ్లీ అంది, “అవును, కానీ నేను పెద్దదాన్ని.” ప్రేమతో, బతుకు లోని విసుగు వల్లా మేమిద్దరం బాగా కొట్టుకునేవాళ్లం.
నేను పాఠశాల వదిలేసి ఇంటికి వచ్చిన తరువాత, ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోయాయి. అమ్మతో, పెంపుడు తండ్రితో తరచూ కొట్లాడటం తప్ప ఏం చెయ్యడానికి వుండేది కాదు. చూసి చూసి ఇంట్లోంచి పారిపొయ్యాను. మొదట్లో ఇంటికి మరీ దూరం పోకుండా, ఓ రెండువారాల పాటు ఇంటికి దూరంగా వుండేదాన్ని. చివరికి ఇంటికి వెళ్లడం పూర్తిగా మానేశాను. ఎప్పుడూ తాగుతూ, గంజాయి దమ్ము కొడుతూ ఉండేదాన్ని. నా పదిహేడో ఏటి వరకు నేను చేసింది అంతే. మొదట్లో విస్కీ తాగేదాన్ని. తారవాత జిన్ నచ్చి, అది తాగడం మొదలెట్టాను. కార్ల నిండా తప్ప తాగి పిచ్చిగా తిరిగే జనాలు రిజర్వేషన్లో ఎక్కడ చూసినా కనిపిస్తారు. అలాంటి విశ్రుంఖల విహారం నుంచి ఎలా బయటపడ్డానో నాకే తెలీదు. ఒకసారి మేము ముర్దో అనే ఊరి నుంచి ఎప్పటిలాగే ఎనభై మైళ్ల వేగంతో వస్తున్నాం. కారు నిండా జనాలు. ముందుసీట్లో కూర్చున్న రెండు జంటలు ముద్దులు పెట్టుకుంటున్నారు. అందులో ఒకరు డ్రైవరు. ఒక్కసారిగా ఒక టైరు పేలిపొయ్యింది. డోర్లు బార్లా తెరుచుకున్నాయి. ముద్దు పెట్టుకుంటున్న రెండు జంటలూ బయటకు పడిపొయ్యారు. కార్లో ఉన్న అమ్మాయిలు గట్టిగా అరవసాగారు. రక్తం ఓడుతున్న ఒకమ్మాయి అందరి కంటే బిగ్గరగా అరవడం మొదలెట్టింది. చివరికి ఎవరికీ పెద్ద దెబ్బలు తగలకుండా బయటపడ్డాం. కనీసం రెండు డజన్ల మేరకు నా బంధువులను, స్నేహితులను ఇలాంటి యాక్సిడెంట్లలో పోగొట్టుకున్నాను. ఒకసారి ఒకతను ఒక అమ్మాయితో కలిసి కార్లో వెళుతూ మందు కొట్టసాగాడు. వెనక ఇంకో కార్లో అతని భార్య, తను కూడా తాగుతూ వాళ్లిద్దరి వెంట పడింది. చివరికి వాళ్లను దొరక పుచ్చుకుంది. ఆ ఇంకో అమ్మాయి అతని ప్రియురాలు కూడా కాదనుకుంటా. ఎందుకంటే, అప్పటికి అతనికి సీసాకు మించిన ప్రియురాలు లేదు. అతని భార్య వాళ్ల వైపు పిడికిలెత్తి “మిమ్మల్ని నలిపి పారేస్తా” అంటూ అరవడం మొదలెట్టింది. రోడ్డు మీద వున్న మిగతా కార్లు ఆ తాగుబోతుల కార్లను తప్పించుకోవడానికి తంటాలు పడసాగాయి. కొన్నిరోడ్డు పక్కన సేజ్ పొదల్లో పడిపొయ్యాయి. చివరికి ఆ భార్య అతని కారును ఢీ కొట్టింది. ఆ ముగ్గురు అక్కడికక్కడే చచ్చిపొయ్యారు.
బాధలు మరచిపోవడానికి తాగుతారని అంటారు కానీ అన్నీ గుర్తుంటాయి. నిజమైనవో, ఊహించుకున్నవో నిన్నటి అవమానాలు, ద్వేషాలు అన్నీ గుర్తుంటాయి. దాంతో ఎప్పుడూ కొట్లాటలు జరుగుతుంటాయి. నాకు తెలిసిన వాళ్లల్లో మంచివాడు, శాంతస్వభావుడైన ఒకాయన ఉన్మత్త క్రోధంలో భార్యను చంపేశాడు. మా బంధువు ఒకరు తాగేసి ఒళ్లు తెలియకుండా పడి వుంటే ఎవరో అతడి కళ్లను పీకేశారు. మా వదిన డెల్ఫీన్ భర్త కూడా అలాగే ఒక కన్ను పోగొట్టుకున్నాడు. మైకంలో వున్న ట్రైబల్ పోలీసు డెల్ఫీన్ ను కొట్టి చంపేశాడు. ఇలాంటి విషయాలు చాలా సాధారణం . ఇవి ప్రత్యేకించి పరిశోధించాల్సిన పెద్ద విషయాలని ఎవరూ అనుకునే వారు కాదు.
నేను కూడా బాగా కొట్లాడేదాన్ని. బార్ల చుట్టూ తిరిగే రోజుల్లో ఒక రోజు బీరు కోసమని రాపిడ్ సిటీలోని ఒక బారులోకి వెళ్లాను. దేశం మొత్తం మీద మరెక్కడి కన్నా రాపిడ్ సిటీలోనే ఇండియన్ల పట్ల జాత్యహంకారం ఎక్కువని సూ ప్రజలు నమ్మేవారు. పాతకాలంలోనైతే సౌత్ డకోటాలోని చాలా సెలూన్ల వద్ద “ఇండియన్లకు, కుక్కలకు ప్రవేశం లేదు!” అని బోర్డులు తగిలించేవారు. బారులోకి వెళ్లి ఒక పెద్దావిడ పక్కన కూర్చున్నాను. ఆమెకు ముప్పయి ఏళ్లు వుంటాయేమో. అదేమంత పెద్ద వయసు కాదుగాని, పదిహేడేళ్ల అమ్మాయి కంటికి అది పెద్ద వయసే. ఆమె నావైపు వికారంగా చూసి, దూరంగా వున్న ఇంకో స్టూలు దగ్గరికి వెళ్లింది, “దరిద్రపు మురికి ఇండియన్. నువ్వు వుండాల్సిన వీధుల్లోకి, మురిక్కాలువల్లోకి వెళ్లిపో.” అని అంది.
ఆమె దగ్గరికి వెళ్లి, “ఏమన్నావు?” అడిగాను.
“నువ్వు విన్నదే చెప్పాను. ఇది ఇండియన్లు ఉండే చోటు కాదు. డామిట్, మీలాంటి వాళ్లు ఎదురవకుండా తెల్లవాడు (నాకింకా గుర్తుంది, ఆమె “వాడు” అనే అంది) ప్రశాంతంగా కూర్చోవడానికి ఎక్కడా చోటు మిగల్లేదా?”
నాకు కోపం నషాళానికి ఎక్కింది. నా ముందున్న గ్లాసు యాష్ ట్రేని బల్లకేసి పగలకొట్టి, ఆమె మొఖం మీద గాయం చేశాను. మత్తులో ఉన్నా ఆ కోపంలో అలా చెయ్యడం బాగనిపించింది. మైకంలో లేకపోయివుంటే ఇంకా బాగనిపించేదేమో.
మా స్నేహితురాలిని కలుసుకోవడానికి ఐయోవా రాష్ట్రంలోని సీడర్ రాపిడ్స్ కు వెళ్లాను. ఆమె చాలా పేదరాలు. కానీ, నాకు తిండిపెట్టడానికి తన ఫ్రిడ్జు ఖాళీ చేసేసేది. ఆమె తెగ వాళ్లు పౌ-వవ్ జరుపుకుంటున్నారు. అందులో దాదాపు అరవైమంది యువకులు వున్నారు. ఫుల్-బ్లడ్స్ డ్రమ్ము కొడుతూ వుంటే మరి కొందరు నృత్యం చేస్తున్నారు. వాళ్లు పాడేవన్నీ మిలిటెంటు పాటలు. అక్కడే వున్న సంకర జాతి, తెల్ల యువకులకు ఆ మిలిటెంటు పాటలు నెత్తికెక్కాయి. కొట్లాటకు రమ్మని ఫుల్-బ్లడ్స్ ను వేధించసాగారు.
ఇక్కడ మీకో ఒక విషయం స్పష్టం చెయ్యాలి. ఈ కాలంలో అందరూ అంగీకరించే రూలు ఏమిటంటే, ఫుల్-బ్లడ్స్ కు సంకర జాతికి మధ్య తేడా రక్తంలో, ముఖాల్లో కాక వాళ్ల నడవడికలో వుంటుంది. ఎవరైతే ఇండియన్ మాదిరి ఆలోచిస్తారో, పాడుతారో, ఇండియన్ భాషలో మాట్లాడుతారో వాళ్లు ఫుల్-బ్లడ్ ఇండియన్లు. సంకరజాతి వాళ్లు ఎంత ఇండియన్ మాదిరి కనిపించినా తెల్ల వాడిలా ప్రవర్తించేవాళ్లు. సంకరజాతి, తెల్ల అబ్బాయిల వేధింపులు కొద్దిసేపు భరించి వాళ్లతో కొట్లాటకు సిద్దమయ్యారు ఫుల్-బ్లడ్స్ . ఫుల్ -బ్లడ్స్ రిబ్బన్ షర్టులు వేసుకుని, మెడలో చోకర్లతో, పొడవు జుట్టుతో వున్నారు. మిగతా వాళ్లు తెల్లవి, కౌ బాయ్ షర్టులు వేసుకునివున్నారు. ఈ తేడా వల్ల ఎవరు మిత్రుడో, ఎవరు శతృవో ఇట్టే తెలిసిపోతుంది. అంత పెద్ద తాగుబోతుల కొట్లాటలో ఇంకెప్పుడూ పాలు పంచుకోలేదు నేను. అరగంట సేపు సాగిన ఆ కొట్లాట చివర ఓ తొమ్మిది తెల్ల షర్టులు రక్తం ఓడుతూ ఓ పెద్ద చెట్టు కింద కూలబడ్డారు. ఇలాంటి కొట్లాటలు మొదలయితే వూరికే ముగియవు. ఆ స్థితిలో కొట్లాడాలనే ఉత్సాహంలో ఎవరైనా, “తన్నండ్రా వాళ్లని!” అని అరుస్తుంటే, అతను చేసేది శుద్ధ తప్పని, శాంతంగా వుండమని చెప్పలేం.
సియాటిల్ లో వున్నప్పుడు బ్లాక్ ఫుట్ తెగకు చెందిన మా స్నేహితురాలు, బోనీ తో, బార్ కు వెళ్లాను. ఇండియన్లు చాలామందే ఆ చుట్టుపక్కల కనిపించేవారు. అవి క్రిస్ మస్ రోజులు కావడంవల్ల అంగళ్లకు, బార్లకు ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో బల్బులు వేలాడగట్టారు. క్రిస్ మస్, కొత్త సంవత్సరం పార్టీ కోసం మద్యం కొనాలనుకున్నాం. “మా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పి వస్తాను” అని ఫోను బూతు లోకి వెళ్లింది బోనీ. తను ఫోన్ చేసుకుంటూ వుండగా ఒక తెల్లతను అక్కడికి వచ్చాడు. బోనీని బయటకు లాగేసి తాను ఫోను చేసుకోవాలని అతని ఉద్దేశం, “ఇండియనుకు ఫోను చేసుకునేంత అవసరం ఏమొచ్చింది? నీకు ఫోను డయల్ చెయ్యడం కూడా రాదని నాకు తెలుసు. పోయి టామ్ - టామ్ వాడుకోపో!”
“చెత్త వెధవా, ఒదులు నన్ను!” అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించింది బోనీ. అతను తన చేతిలో వున్న బీరు బాటిల్ ఆమె తల మీద మోదాడు. తలనుంచి ముఖం మీదకి రక్తం ధారలుగా కారుతుండగా తూలుకుంటూ బయటికి వచ్చింది తను. నేను తనకు సహాయం చెయ్యడానికి వెళ్లాను. అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాం కానీ కళ్లల్లోకి రక్తం కారడం వల్ల కళ్ల్లు కనిపించడం లేదు బోనీకి. అతను ఆమెను మళ్లీ కొట్టాడు. వీధి పక్కన పారుతున్న చిన్న కాలువలోకి దొర్లింది తను. అక్కడ పడిపొయ్యి, కళ్లు కనిపించక నా పేరు పిలువసాగింది. పోలీసుల కోసం అరిచాను కానీ మిగతా తెల్లవాళ్లు అతన్ని ఎక్కడో దాచేశారు. పోలీసులు అతన్ని వెదికి పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. మా చుట్టూ అన్ని రకాల జనాలు - తెల్లవాళ్లు, నల్లవాళ్లు, ఇండియన్లు – మూగ సాగారు. ఒక తెల్లావిడ నన్ను పక్కకు తోస్తూ, “పక్కకు జరుగు. నేను నర్సును. నువ్వు అంతా తప్పుగా చేస్తున్నావు” అని అరిచింది.
“అలా తొయ్యొద్దు. నేను ఆమె స్నేహితురాలిని.” ఆమెతో అన్నాను. కానీ ఆమె పట్టించుకోలేదు, “పక్కకు జరుగు. ఈ ఇండియన్లకు నిజంగా ఏమీ తెలీదు!” నేను ఆమెను ఆగి వున్న కారుకేసి తోసి కింద పడేశాను. పోలీసులు వచ్చి నన్ను అరెస్టు చేశారు. నువ్వు ఇండియన్ స్త్రీవైతే, అదీ గెట్టోల్లో వున్నట్లయితే దౌర్జన్యాన్నీ, లైంగిక వేదింపులను ఎప్పుడూ ఎదుర్కుంటూనే వుండాలి. క్రమంగా నువ్వు ఎలా తయారవుతావంటే, నీపై దాడి జరగడానికి ఎలాంటి ఆస్కారం లేకపోయినా ఎదురు దాడికి దిగుతావు. ఈ గొడవలకు చాలావరకు తాగుడు కారణమైనా, దానికంటే పెద్ద కారణం నువ్వు ఇండియన్ కావడమే. సియాటిల్లోనే ఒక తెల్లవాడు తెలివి తప్పి దారి పక్కన పడిపోయిన ఒక ఇండియన్ను “ఇదిగో, ఇది వూండెడ్ నీ కి ప్రతీకారం!” అంటూ బూటు కాలితో పదే పదే తన్నడం నేను చూశాను.
నిజానికి నాది హింసా స్వభావం కాదు. నాకు కోపం వస్తే ఒళ్లంతా వణికిపోతుంది, నా రక్తం ఉడికిపోతుంది, ఎవరినైనా గాయపరుస్తానేమో, నేనే గాయపడుతానేమో అని భయంగా వుంటుంది. అందుకని చాలావరకు కొట్లాటల్లోకి వెళ్లకుండా శాంతంగా వుండడానికి ప్రయత్నిస్తాను. కానీ ఎవరైనా ఇండియన్ సోదరి వేధింపులకు గురవుతుంటే నేను ఆమెకు సహాయం వెళ్లాల్సిందే. ఒక్కసారి కొట్లాటలోకి దిగిన తరువాత మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను. మరీ దారుణమైన పరిస్థితి ఎదురవుతే అందులోంచి బయట పడడానికి ఎవరినైనా చంపాల్సివస్తే, ఆ పని చెయ్యడానికి నేను వెనుకాడనేమో. “నువ్వో, నేనో” తేల్చుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఎవరైనా నాలాగే అలోచిస్తారని నా నమ్మకం. మామూలు తెల్ల వాళ్లకు అలాంటి పరిస్థితి అంత తరచుగా ఎదురవదు. కానీ ఇండియన్లు ఎప్పుడూ అదే పరిస్థితుల్లో ఉంటారు. అలా వుండడం వాళ్లకు ఇష్టమై కాదు.
రాను రాను నన్ను నేను నిగ్రహించుకోవడం, పరిస్థితులను నియంత్రించడం నేర్చుకున్నాను. అట్లాంటి సన్నివేశాలు ఎదురయితే వాటిలోకి ఈడ్వబడకుండా జాగ్రత్తపడుతాను. కొట్లాటల్లో పాల్గొనే బదులు, దూరంగా కూర్చుని వాటిని చూడడమే మంచిదని బార్బరా చెబుతుంది. “పగ తీర్చుకోవడం కంటే అద్భుతమైనది లేదు, కానీ బలప్రయోగంతో కాదు. ఆ పని బుద్ధితో చెయ్యాలి” అని చెబుతుంది. కానీ, మంచి రసవత్తరమైన కొట్లాట జరుగుతున్నప్పుడు బార్బరా బుద్ది ఆమె ముష్టి ఘాతాల్లోకి రావడం ఎన్నోసార్లు చూశాను.
రోజ్ బడ్ లో వున్నప్పుడు బార్బ్ ఒక సారి పూర్ బేర్ అనే అబ్బాయితో డేట్ కు వెళ్లింది. ఆరోజు ఆమె తాగలేదు గాని, అతను బాగా తాగేసి వున్నాడు. లిక్కర్ అతని లోని దెబ్బలాడే మనస్తత్వాన్ని నిద్రలేపింది. వాళ్ల కారు ట్రైబల్ ఆఫీసు పక్క నుంచి వెళుతున్నప్పుడు పూర్ బేర్ హఠాత్తుగా కారు ఆపేశాడు. “మన కష్టాలన్నీ ఆ బిల్డింగు లోంచే ప్రారంభమయ్యేది.” అంటూ ట్రంకు లోంచి తన వేట తుపాకీ తీసి బిల్డింగుకు వున్న గ్లాసు కిటికీలన్నీ పగలకొట్టేశాడు. తరువాత రోజ్ బడ్ పక్కన వున్న చిన్నకొండ మీదకు ఎక్కి తన పనితనాన్ని చూసుకొని ఆనందించసాగాడు. కొద్ది సేపటికే ట్రైబల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. “ఊరికే తనిఖీ చేస్తున్నాం” అంటూ కారు లోంచి సగం తాగేసిన వైన్ జగ్గును, బార్బ్ కు తెలియకుండా సీటు కింద దాచేసిన విస్కీని, చివరగా తుపాకీనీ, వాడేసిన బుల్లెట్ షెల్సును కనుక్కున్నారు. “ట్రైబల్ బిల్డింగులోకి తుపాకీ పేల్చింది మీరేనన్నమాట” అంటూ పూర్ బేర్ ను అరెస్టు చేశారు. బార్బ్ అతనికి బెయిల్ ఇప్పించాల్సి వచ్చింది. అతనికి ఒక సంవత్సరం ప్రోబేషను మాత్రమే ఇచ్చారు. మేం ఉండే చోట ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి కనుక వాటి పట్ల కొంచే ఉదాసీనంగా ఉంటారు.
ఇప్పుడు నేను ఒకరి భార్యని, నా పిల్లల తల్లిని. నా భర్త మెడిసిన్ మ్యాన్. నా పిల్లలు ఎప్పుడూ నాతోనే ఉంటారు. నేను తాగడం పూర్తిగా మానేశాను. దాంతో కొట్లాటల్లోకి దిగకుండా ఉండేందుకు చాలా ప్రయత్నిస్తాను. ఎంత ప్రయత్నించినా సరే కొన్ని పరిస్థితుల్లో గొడవల్లోకి ఈడ్వబడుతుంటాను. వాటినుంచి తప్పించుకోవడం అసాధ్యమనిపిస్తుంది. 1975లో వాషింగ్టన్ రాష్ట్రంలోని ఒక రిజర్వేషన్లో నా భర్త లియొనార్డ్ కొన్ని క్రతువుల్లో పాల్గొన్నాడు. నేను, నా భర్త, మా అబ్బాయి పెద్రో, స్నేహితురాలు అనీ మే, ఇంకో సూ నాయకుడు అందరం కలిసి ఒక హోటల్లో దిగాం. ఆ హోటలు వున్న టౌను రిజర్వేషన్లో కొంచెం, బయట కొంచెం వుండిది. క్రతువులు అయిపోయిన తరువాత మా వూరికి బయల్దేరబోతున్నాం. లియొనార్డ్ ఎప్పుడూ వేసుకున్నట్లే జుట్టును రెండు జడలుగా అల్లుకుని ఎర్ర బట్టతో వాటిని కట్టుకున్నాడు. మా సామాన్లు కార్లో పెడుతూ గ్యాసు ట్యాంకు కారుతూ వుండడం చూశాం. అప్పటి వరకు బాగానే వుంది. దాన్ని ఎలా బాగు చెయ్యాలా అని మేము అలోచిస్తూ వుంటే, ఇద్దరు తెల్ల వాళ్లు అటు వైపు వచ్చారు. మాకు కొంచెం పక్కన నిలబడి అసభ్యకరంగా మాట్లాడసాగారు: “ఆ ఇండియన్లు, వాళ్ల పొడవాటి జుట్టు చూడు. మంగలి దగ్గరకు వెళ్లి ఎన్ని రోజులయ్యిందో?” మమ్మల్ని తేరిపార చూస్తూ, గేలి చేస్తూ అక్కడే నిలబడ్డారు. “ఇక్కడకి మేం కొట్లాడడానికి రాలేదు. పనిమీద వచ్చాం. మీకు ఏం కావాలి? ఇది ఇండియన్ రిజర్వేషన్ తెలుసా? ఊరికెనే గొడవ పడొద్దు మనం.” అన్నాడు లియొనార్డ్.
వాళ్లు వెకిలిగా నవ్వుతూ వచ్చి లియొనార్డ్ జడలు పట్టుకుని గట్టిగా లాగారు. తరువాత అతని మీద కలబడ్డారు. అప్పుడే రస్, ఐరన్ షెల్ అనే ఇద్దరు ఇండియన్ స్నేహితులు లియొనార్డ్ కు సహాయంగా వచ్చారు. నేనేమో మా అబ్బాయిని రక్షించుకోవలసి వచ్చింది. కొద్ది సేపటికి ఓ కారు నిండా తెల్ల వాళ్లు వచ్చి ఆ గొడవలో దిగారు. ఒకతని దగ్గర తుపాకీ వుంటే, కొందరి దగ్గర బేస్ బాల్ బ్యాట్లు వున్నాయి. మా మానాన మమ్మల్ని వెళ్లనివ్వమని వాళ్లను వేడుకున్నాను. కానీ వాళ్లు వినకుండా మా మగవాళ్లను వేధించసాగారు. ఇండియన్లను కొట్టడం అక్కడి వారికి అలవాటని తరువాత తెలిసింది. వీధికి అటువైపున ఒక పోలీసు కారు ఆగి వుండడం చూశాను. మా అబ్బాయిని చూసుకోమని ఆనీ మే కు చెప్పి, కారు పక్కన వున్న ఇద్దరు పోలీసుల దగ్గరికి పరిగెట్టాను. “ఏం జరుగుతోందో చూడండి. మేం ఏమీ చెయ్యలేదు. మా మగవాళ్లను నిష్కారణంగా కొడుతున్నారు. మీరు ఎందుకు ఏమీ చెయ్యట్లేదు?” అని వాళ్లను గద్దించాను. ఆ పోలీసులు ఏమీ మాట్లాడకుండా తమ కారెక్కి వెళ్లిపొయ్యారు. ఓ యాభై గజాల దూరంలో కారు ఆపి, వినోదం చూస్తూ, పళ్లికిలిస్తూ కూర్చున్నారు. అంతలోపల తెల్ల వాళ్లు మా కారును బ్యాట్లతో తుక్కు తుక్కు చేసేశారు. ఒక ఇండియన్ స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆమె కారు తెచ్చాను. అందరినీ దాంట్లో ఎక్కించుకుని పారిపోదామని నా ఉద్దేశం. కొట్లాట దగ్గరికి తిరిగి వెళ్లేసరికి ఇంకొంతమంది ఇండియన్లు కొట్లాటలోకి దిగారు. కారు అక్కడికి తీసుకు వెళ్లేసరికి తుపాకీ పేలడం విన్నాను. ఒక బుల్లెట్ పెద్రో కాలు పక్కనుంచి దూసుకుపొయ్యింది. మరో రెండు పోలీసు కార్లు అక్కడ చేరాయి. పోలీసులు, “ఇంక చాల్లెండి. మీ అడవాళ్లు ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటారు, వాళ్ల దగ్గరికి వెళ్లండి. ఈ రోజుకు ఇంత వినోదం చాలు” అని తెల్ల వాళ్లతో అని, ఇండియన్లను అరెస్టు చెయ్యడం మొదలు పెట్టారు.
ఇది ఎప్పుడూ జరిగే పనే. అసలు నేరస్తులను ఇళ్లకు పంపి, “శాంతిని భంగపరచినందుకు,” ఇండియన్లను అరెస్టు చేసి, జైళ్లల్లో పెట్టి, జరిమానా విధిస్తారు. ఎవరైనా వాళ్లకు బెయిల్ ఇవ్వాలి, లేదా వాళ్లను కోర్టుకు ఈడ్చి జరిమానా వసూలు చేస్తారు. ఆ సంఘటనలో నా కంటి పక్కన గాయమై మచ్చ ఏర్పడింది. నేను ఒకడిని కాళ్ల మధ్య తన్నాను. ఈ సంఘటనలో తెల్ల వాళ్లు మాత్రమే తాగి వున్నారు. చెప్పుకుంటూ పోతే ఈ సంఘటనలు బోరు కొట్టేంత విసుగు కలిగిస్తాయి.
లియొనార్డ్ కలవకముందు, వూండేడ్ నీ కి వెళ్లకముందు నా జీవితమంతా తాగుడు, కొట్లాటలనే విష వలయంలోనే తిరిగింది. బార్బ్ పరిస్థితి కూడా అంతే. ఏమంటే తను చాలా వరకు వేరే గుంపుతో తిరిగేది. ఆమె ఎలాంటిదంటే, ఒక్క బీరుతోనో, ఒక్క గ్లాసు వైనుతోనో ఆ రోజుకు తాగడం ఆపేసేది. చాలా మందిమి అలా చెయ్యలేక పొయ్యేవాళ్లం.
నేను చాలా సంవత్సరాల పాటు తాగకుండా వుండగలిగాను. కానీ నా ప్రాణస్నేహితురాలు తలలో బుల్లెట్ గాయంతో చనిపొయ్యిందని తెలుసుకుని, ఆ దుఃఖం తీరడానికి తాగాలనిపించింది. అప్పుడు నేను న్యూ యార్క్ లో వున్నాను. వణికిపోతూ, ముఖమంతా కన్నీళ్లమయంగా దగ్గర్లో వున్న ఒక బారులోకి గుడ్డిగా వెళ్లిపొయ్యాను. నాలుగు మార్గరీటాలు వెంట వెంటనే తాగినా అది నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు, నా బాధ ఏమాత్రం తీరలేదు. అదే చివరి సారి నేను తాగడం.
“ఇండియన్ల తాగుడు సమస్య” గురించి అందరూ మాట్లాడుతారు. నిజానికి అది తెల్లవాడి సమస్య. విస్కీని తెల్లవాడే కనుక్కుని అమెరికాకు తెచ్చాడు. వాళ్లే దాన్ని తయారు చేసి, అడ్వర్టైజు చేసి, మాకు సరఫరా చేస్తారు. దాని మీద లాభాలు పొందుతూ, మేం ఇంకా ఇంకా తాగడానికి కావలసిన దుర్భర పరిస్థితులు కల్పిస్తారు.
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం