సందేహం

ఆఖరికి పగవాడు మరణించినా…, మనిషన్నవాడికి అదొక కుదుపే! అందునా, మన ఆనవాళ్లు కనిపిస్తేనే ప్రాణం లేచొచ్చినట్టనిపించే పరదేశ జీవితంలో మనవాళ్ల తాలూకు దుర్ఘటనలు విన్నప్పుడు, లేదా చూసినపుడు చాలా దిగులుగా అనిపిస్తుంది. ఆ దుర్ఘటనకు చెందిన వ్యక్తులు వ్యక్తిగతంగా మనకు తెలియకపోవచ్చు. కానీ ఒకే మట్టికి చెందిన వాళ్లం కనుక… ఆయా కుటుంబాలు కోల్పోయే సంతోషం, జీవితాంతం పడే క్షోభ, పలకరిస్తే చాలు, కోల్పోయిన తమ బిడ్డల గురించి కన్నవారు చెప్పే ఊసులు, చనిపోయిన వారిపై ఆధారపడి ఉన్నవారు ఎదుర్కోబోయే ఆటుపోటులకు చెందిన అనేక అంశాలపై ఎంత వొద్దనుకున్నా మనసు పరిపరివిధాల పోతుంది. ఎందుకంటే ఈ ఛాయలన్నీ మన జీవితాల్లో కూడా ఎక్కడో ఒక  చోట పెనవేసుకుని ఉన్నవే, అలాగే పరిచయమైనవే!

లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన కాల్పుల సంఘటనలో అల్లం కిరణ్‌కుమార్‌, కొమ్మా చంద్రశేఖర్‌ రెడ్డిల మరణవార్తని నా ఫ్రెండ్‌ సి.వనజ నుంచి విన్నప్పుడు మొదట ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. కిరణ్‌కుమార్‌ తండ్రి అల్లం రాజయ్యగారు ప్రముఖ కథకులు కావడం, సాహిత్య విప్లవోద్యమాలలో చురుకైన పాత్ర వహించినవారుగా, అలాగే కుటుంబ పరంగా కూడా ఆమెకు వారితో సాన్నిహిత్యం ఉండటం వల్ల అనేక వివరాలు చెప్పినప్పుడు అసహాయంగా అనిపించింది. అప్పటికి నాలుగునెలల గర్భవతిగా ఉన్న కిరణ్‌కుమార్‌ భార్య, అలాగే పెళ్లైన పది నెలలకే భర్తని కోల్పోయిన చంద్రశేఖర్‌ భార్యలను గురించి తెలుసుకున్నప్పుడు కడుపు తరుక్కుపోయింది. ఇంతకీ ఈ దారుణానికి ఒడికట్టినవారెవరు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు, డిశంబర్‌ 14నాటి మన దినపత్రికలలో(ఆన్‌లైన్‌ ఎడిషన్స్‌) నలుగురు నల్లజాతివారి కారణంగా అనే కథనాలు వొచ్చాయి. సందేహమేమీ లేదు ఈ కథనాలన్నిటిలోను మన వారి మరణం పట్ల ఆందోళనే ఎక్కువగా వ్యక్తమయింది. కానీ తరువాత వొచ్చిన (ఫాలో అప్‌) కథనాల్లో కూడా పదే పదే నిందితుల  జాతి గురించి  ప్రస్తావించడం, వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళనగా అనిపించింది.బాధిత కుంటుంబాల వారు ఆవేదనలో ఆక్రోశం,కడుపుతీపి, కలిపి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, కానీ మీడియా కూడా పదే పదే నలుగురు చేసిన పనిని ‘జాతి’ అంటూ ఆపాదించినట్లుగా మాట్లాడటాన్ని, ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా, రిసీవ్ చేసుకోడం కష్టమే అయింది.

ఎంతమంది పైకి ఒప్పుకుంటారో తెలియదుకానీ, ఇక్కడ ఉంటున్నఅనేకమంది భారతీయులకి కొన్ని సంఘటనలవల్ల, లేదా భయాందోళనలవల్ల,లేదా రంగు తేడావల్ల ఆఫ్రో – అమెరికన్ సంతతికిచెందినవారితో స్నేహంగా మెలగటం పట్ల, వారివారి మనస్థత్వాలకనుగుణంగా…. సంకోచం, అనుమానం, వ్యతిరేకతలాంటి డిగ్రీలు ఉన్నాయి. కాబట్టి రిపీటెడ్ గా ఇటువంటి సున్నింతాంశాన్ని ప్రస్తావించడం మానసికంగా ఈ రెండు వర్గాల మధ్య మరింత దూరాన్ని పెంచేందుకు దోహదపడగలదనే అభిప్రాయంతో చాలా మంది ఏకీభవస్తారనే అనుకుంటున్నాను. ఇదిలా ఉంచితే, సమకాలీన వాతావరణంలో ఆఫ్రో- అమెరికన్ లను ఏ విధంగా అయితే ఉచ్ఛరించడం అనాగరికమో ఆ ‘ఎన్ ‘ తో కూడిన పదాన్ని కూడా ఎటువంటి జంకులేకుండా ఒక ఇంటర్నెట్  పత్రిక కథనంలో వాడినపుడు నోటమాట రాలేదు. వెర్నాక్యులర్ ప్రెస్  అంతర్జాతీయ పాఠకులకు చేరుతున్న ఈ రోజుల్లో తోటి జాతిని అవమానకరంగా సంభోదించడంపై నామోషీ పడాల్సిందే. అయితే, ఒకటి మాత్రం వాస్తవం! ఇవే వార్తాకథనాలు నేను ఇండియాలో నివసించేప్పుడు చదివినట్టయితే తేడాగా  అనిపించేది కాదేమో కానీ, అమెరికాలోని ‘మన మధ్య’ ఆఫ్రో – అమెరికన్ ల పట్ల తరచూ వ్యక్తమయ్యే భావావేశాల కారణంగా అసహనంగా అనిపిస్తోంది. బహుశా ఇక్కడి  నేపధ్యమే అందుకు కారణం!

ఏదిఏమైనప్పటికీ ఈ సంఘటన అటు భారతదేశంలోను, ఇటు అమెరికాలోను చర్చనీయాంశమే అయింది. అమెరికాలో ఎం జరుగుతోంది? మన వాళ్ల జీవితం ఎంత వరకు భద్రం? ప్రస్తుతం జరుగుతున్న దాడులకు లేదా నేరాలకు  అసహనమే కారణమా లేక జాతి విద్వేషమా? అనేటువంటి సందేహాలు అటు మీడియా నుంచి కానివ్వండి లేదా మన ఆత్మీయుల నుంచి కానీ పెరుగుతున్నాయనడంలో సందేహం లేదు.

మొదట, అమెరికాలో ఏం జరుగుతోంది అనే విషయానికి వొస్తే, ఉదాహరణకి, 2007లో జరిగిన దాడులకు సంబంధించి కొన్ని వివరాల్ని తీసుకుందాం. ఏప్రిల్‌ నెలలో వర్జీనియాటెక్‌ యూనివర్సిటీలో జరిగిన కాల్పులలో 32మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన విద్యార్ధి తరువాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ సంఘటనలో లోకనాథన్‌ అనే భారతీయ ప్రొఫెసర్‌ మరణించారు. డిశంబర్‌ మొదటి వారంలో ఒమహా(నెబ్రాస్కా) మాల్‌లో జరిగిన కాల్పులలో 19 ఏళ్ల యువకుడు తొమ్మిది మందిని కాల్చి, తనను తాను అంతం చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనల్నీ తీసుకుంటే, నిందితులు విద్యార్ధులు!  పైగా సామాన్య జీవితం గడుపుతున్నవారు. అంతకు మునుపు నేరచరిత్ర లేనివారు కూడా.  వారి జీవితాల్లోని ఒత్తిడిని తట్టుకోలేక దారుణాలకి పాల్పడి, ఇతరులతో పాటు తమని తాము కూడా అంతం చేసుకున్నారు. ఆలోచిస్తే,  జీవితంలో ఎవరికి ఏ అసహనం, ఉద్రేకాలున్నా, తుపాకీని ఆ ఒత్తిడికి వెంటిలేషన్‌లా వాడుకోవచ్చనే  ధోరణి రాను రాను పెరుగుతోందా అనే భయం కూడా వెయ్యకమానదు. హైస్కూలు దాటని పిల్లలు కూడా తుపాకీతో తోటి పిల్లల్ని హతమార్చిన అనేక సంఘటనలు కూడా మనం ఇక్కడ విన్నాం.  మన పిల్లలు చదువుతున్న స్కూల్లోను ఇలా జరిగే అవకాశం ఉందా అనే ఊహ వొచ్చినప్పుడల్లా భూమి కంపించినట్టే ఉంటోంది… యు నెవ్వర్‌ నో… రైట్‌! ఆఖరికి పిల్లల చేతుల్లోకి కూడా  తుపాకులు ఎలా అందుబాటులోకి వొస్తున్నాయి అనే ప్రశ్నే అమెరికాలో నేరాలు పెరుగుతుండటానికి సంబంధించిన ప్రాథమిక, ప్రధానాంశం. బజారులో బొమ్మలు కొనుకున్నంత సులభంగా తుపాకులు అందుబాటులో ఉండటం ఎంతవరకు సబబు? దేశం అంతా ఇలానే ఉంది అనలేం కానీ, ఆఖరికి చిల్లర డబ్బుల కోసం కూడా తుపాకీతో బెదిరించే వాతావరణం కొన్ని చోట్ల ఉంటోందంటే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉంటున్నాయి తప్ప పరిష్కారమార్గంలోకి వెళ్లే సూచనలు అంతగా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని తమ నైతిక బాధ్యతగా స్వీకరించడానికి ఇక్కడి ప్రభుత్వం అంగీకరించే మూడ్‌లో లేదు.

తుపాకీ కొనుగోళ్లను అదుపు చేసే విషయంలో, అమెరికాలోని వివిధ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతోంది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాలు తుపాకీ లైసెన్స్‌లకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉండాలని కోరుకుంటుండగా, అలబామా, ఫ్లోరిడాలాంటి దక్షిణాది రాష్ట్రాలు అందుకు వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నాయి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, గన్‌ లాబీ గ్రూప్‌లు మాత్రం సమస్య అంతా నేరం చెయ్యాలనే మనస్తత్వం ఉన్నవాడితో కానీ తుపాకీతో కాదని కొట్టిపారేస్తున్నాయి. పైగా ఈ  గ్రూపుల వెనుక ఉన్న బలమైన లాబీ చురుగ్గా తమ పని చేసుకు పోతోంది. డెమొక్రాట్‌లు లైసెన్స్‌లు ఇచ్చేటప్పుడు బ్యాగ్రౌండ్‌ చెక్‌ చేస్తే బాగుంటుందంటే, రిపబ్లికన్లు కొంపలు మునిగేంత పరిస్థితేం లేదంటున్నారు.

నేరాలు చేసే తత్వం పెరుగుతుండటానికి  మానవీయ కారణాలు వెతికినపుడు, అమెరికాలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య మీద, నిరుపేదల సంఖ్య మీద మనం తప్పక దృష్టి పెట్టాలి. పెట్టుబడిదారీ సంస్కృతి బాగా ఉన్న దేశం కావడంతో అనేక సంస్థలు తమ లాభాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి పనిని అవుట్‌ సోర్సింగ్‌కి ఇవ్వడం, తమ ఉత్పాదక కేంద్రాలను (మ్యానుఫాక్చరింగ్‌ సెంటర్స్‌) మూడవప్రపంచ దేశాల్లో (ముఖ్యంగా చైనా, భారత్‌, మలేషియా, లాటిన్ అమెరికా, ఇండొనీషియాలలో) నెలకొల్పుతుండటం లాంటి చర్యల వల్ల అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, నిరుద్యోగం పెరుగుతోంది. న్యూ ఆర్లీన్స్ నగరాన్ని సర్వనాశనం చేసిన కత్రీనా హరికేన్‌నే ఉదాహరణగా తీసుకుంటే జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం, పునరావాసం అందక ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలెన్నో. ఆయా ప్రాంతాల ప్రజలు నేటి అమెరికా వలస జీవులంటే ఆశ్చర్య పడాల్సినదేం లేదు. పైగా అక్కడ తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు జాతి వివక్ష కారణంగా ప్రభుత్వం, ఫీమా (FEMA) సహాయం అందించలేదనేది కూడా ఉంది. అంతేకాకుండా మెడికల్‌ ఇన్సూరెన్స్‌ లాంటివి ఆర్ధికంగా సాధారణ అమెరికన్‌ పౌరుడికి అందనంత స్థాయికి పోతుండటం, ఖరీదైన విద్య, ఒడిదుడుకుల కుటుంబ వ్యవస్థ ఇక్కడి పౌరుల్లో చాలామందిని ఎటూ పాలుపోని పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. గత ఐదారు సంవత్సరాలుగా వివిధ దేశాల్లో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధాల బారిన పడి నష్టపోయిన సైనిక కుటుంబాలనేకం. ఇటువంటి అనేక కారణాల వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పేదరికం, పనిలేనితనం, నేరమయ వాతావరణాలు ఏర్పడి వాటి నుంచి ఇటువంటి దారుణాలు పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడైతే నేరాల సంఖ్య ఈ విధంగా పెరుగుతోందో ఈ సమాజంలో భాగంగా ఉండటం వల్ల మనం కూడా దాని బారిన పడక తప్పడం లేదు.

ఇక, మంచి ఉద్యోగాలన్నీ భారతీయులు చేసేస్తూ వేలకు వేల డాలర్లు సంపాదించేస్తున్నారనే అసహనం, జాతి విద్వేషం అమెరికన్‌ సమాజంలో ఉందా అనే ప్రశ్నకి వొస్తే, అమెరికన్లతో పాటు మనవాళ్ళకూ అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే సంపాదన కూడా మెరుగ్గానే ఉన్నప్పటికీ, కేవలం మంచి సంపాదన కారణంగా భారతీయుల మీదే అసహనం ఉందని చెప్పేందుకు నోటి మాటలు నాలుగైదేమైనా ఉంటాయేమో తప్ప తగిన ఆధారాలు లేవు. భారతీయులతో పాటు, చైనా, జపాన్‌, యురోపియన్‌, ఇజ్రయిల్‌ లాంటి అనేక దేశాల నుంచి వొచ్చిన ఇమ్మిగ్రెంట్స్‌ కూడా అమెరికాలో ఎక్కువగానే ఉన్నారు. వాళ్లు కూడా వివిధ రంగాలలో బాగానే రాణిస్తున్నారు. కనుక అందరి దృష్టి మన మీదనే అనుకోవాల్సిన పని లేదు.

అలా అని భారతీయులపై జాతి విద్వేషంతో, వివక్షతో కూడిన దాడులు అస్సలు…. జరగలేదని, జరగబోవని అనలేం! సెప్టెంబర్ 11 సంఘటన తరువాత జరిగిన దాడిలో సర్దార్జీ ఒకరు మరణించారు. ఇక్కడ మనం ప్రస్తావించుకోవలసిన మరో అంశం ఏమిటంటే, మనకి….. అంటే  మూడోప్రపంచదేశాల వారికి అమెరికా వాళ్లంటే కొద్దో గొప్పో విషయాలు తెలుసేమో కానీ, చాలమంది అమెరికన్ లకి ఇండియా, పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక, గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులకు మధ్య ఉన్న తేడాలు, సంస్కృతి, వేశభాషల గురించిన అవగాహన పెద్దగా లేదు. ఫీనిక్స్ లో జరిగిన ఈ సర్దార్జీ హత్యోదంతాన్నే తీసుకుంటే, ఆయన తలపాగను చూసి బిన్ లాడెన్ ప్రాంతానికి చెందినవాడిగా పరిగణించి కాల్చి చంపారు. మాసచూసెట్స్ లో హిందువు అయిన ఒక పీజ్జాబాయ్ పై ముస్లిమ్ అనుకొని దాడిచేశారు. ఇటువంటి అంశాల కారణంగా మతపరంగా కొంత అసహనం ఉందన్న కోణాన్నిభారత ‘ఉపఖండ’ ముస్లింలే కాదు హిందువులూ అంగీకరిస్తారు. అయితే ఆ రెండూ సెప్టెంబర్ 11 నేపధ్యం ఉద్రేకంలో జరిగిన దాడులు కనుక ఇప్పుడా ఉద్విగ్నిత లేదనే నమ్మకంతోనే అందరూ ఉన్నారు.

మనలో ఎన్నో తేడాలు, సంఘాలు, రాజకీయాలు ఉండొచ్చు. కానీ విపత్కర సంఘటనలు సంభవించిన ప్రతి సారీ తెలుగువారందరూ కలిసికట్టుగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువ. నవంబర్‌ 29న శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒక రెస్టారెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీలో చదువుతున్న అనిల్‌రెడ్డి(నిజామాబాద్‌)  అనే విద్యార్ధి మరణించాడు. అతనికి మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ లేకపోవడంతో, బే ఏరియాలోని తెలుగు సంఘాలవారు, అనేకమంది ఎన్నారై దాతలు పూనుకుని మృతుని శరీరాన్ని హైదరాబాద్‌ పంపే ఏర్పాట్లు చేశారు. ఆటా, తానాల్లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చి సహాయం చేసిన, అండగా నిలిచిన సందర్భాలూ అనేకం. అయితే ప్రస్తుతం మన చుట్టుపక్కల పెరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న ఎంతో మంది తెలుగువాళ్లు ఉన్నారు, ఐ మీన్‌… ఓటర్లున్నారు, శక్తివంతమైన సంఘాలున్నాయి… మరి తుపాకీలు బాధ్యతగల వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని మన తరపున ప్రభుత్వానికి బలంగా చెప్పే అవకాశం లేదా?! ఈ కోణం నుంచి మనం ఏం చెయ్యలేమా
అనేది నా సందేహం.

-  డిసంబర్ 31, 2007 

(లూసియానా యూనివర్సిటీలో  జరిగిన సంఘటన పట్ల వివిధ తెలుగు పత్రికల వార్తా కథనాలు చదివాక …)

చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. ఆరి సీతారామయ్య జనవరి 2008 1

    నేరాలు చేసేది ఎక్కువగా నల్ల జాతి వారే అనే అభిప్రాయం చాలామంది తెలుగు వారికి ఉంది. కాని, పౌరహక్కులకోసం నల్లజాతి వారు చేసిన త్యాగాల మూలంగానే ఈ రోజు భారతీయులు అమెరికాలో తలెత్తుకుని తిరగ్గలుగుతున్నారని చాలా మందికి తెలియదు.

  2. Rohiniprasad జనవరి 2008 2

    మహతో అనే మరొక విద్యార్థి కూడా ఇదే పద్ధతిలో ప్రాణాలు కోల్పోయాడు. భారతీయ విద్యార్థులు కాస్త మెతకవారనే అభిప్రాయం నేరాలు చేస్తున్నవారిలో ఏర్పడి ఉండవచ్చు. తెల్లవారిపై అసలు దాడులు జరగటంలేదని కాదుగాని ప్రతీకారం గురించిన భయం వారి విషయంలో ఎక్కువగా ఉంటుందేమో. ఇటువంటి సంఘటనల గణాంకాలు తెలిస్తే వీటి గురించి జనరలైజ్ చెయ్యవచ్చు. అంతదాకా వీటన్నిటినీ ప్రత్యేక అవాంఛనీయ సంఘటనలుగానే పరిగణించాలి. అనుమానాస్పద వ్యక్తుల, సంఘటనల గురించి మన విద్యార్థులు ఒకరికొకరు సకాలంలో హెచ్చరికలు అందజేస్తూ, మరీ ఏకాంతజీవితాలు గడపకుండా అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉండడం కూడా మంచిదే. అమెరికా తుపాకుల సంస్కృతి గురించిన చర్చ ఇక్కడ అనవసరం. ఉన్న పరిస్థితుల్లో చెయ్యగలిగిందేమిటో యోచించాలి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో