Jan2008
ధర్నా
”ఇదంతా అయ్యేపని కాదులేన్నా” నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. ఎం.ఆర్.ఒ. ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయింది.
ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎం.ఆర్.ఒ. జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా వున్నారు.
గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్ఫై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా వుంటాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమ చేతికి వున్న వాచీ కేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నారు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది.
”ఏమయ్యా నాగమల్లయ్య ఎం.ఆర్.ఒ. సారు ఇంకా అఫీసుకు రాలేదు. ఎప్పుడొస్తాడో నీ కన్నా తెలుసా? తెలీదా?”నవ్వుతూ అటెండర్‌ను పలకరించాడు రమణ.
ఎం.ఆర్.ఒ. గదిముందు స్టూలు పైన కూర్చుని దినపత్రికలో తలదూర్చుకుని వున్న నాగమల్లయ్య ఉలిక్కిపడి తలపైకి ఎత్తాడు. పేపరు మడిచి పక్కన పెట్టుకని, బట్టతలను ఎడంచేత్తో తడుముకుంటూ నోరు తెరిచాడు. మాటకంటే ముందు ఆవులింతే బయటకొచ్చింది.
గుంపులో ఆడమగా కొందరు వక్కాకు నములుతున్నారు. పసిపిల్లలు ఎండకు తాళ్లలేక తల్లుల్ని సతాయిస్తుంటే వారిని సముదాయించే ప్రయత్నంలో మొగుళ్లని విసుక్కుంటున్నారు కొందరు ఆడవాళ్లు. గుంపుకు దూరంగా వున్న మొగవాళ్లు బీడీలు వెలిగించి కబుర్లు చెప్పుకుంటున్నారు.
”ఎం.ఆర్.ఒ. సారు యాడికి పోయినాడో నాకు తెలీదన్న. లోపల ఆఫీసులో అడిగి చూడు”, ఆ మాట చెప్పి ఆపేసాడు నాగమల్లయ్య.
ఆ మాటతో బాటే రమణ కదిలాడు. ఆఫీసు లోపలికి వెళ్లాడు. పది నిముషాల తర్వాత ఆర్.ఇ. బయటికొచ్చాడు. అతడు ఆఫీసులోకి పోవటం చూసిన నాగమల్లయ్య తలతిప్పి గోపాల్ వైపు చూసి పలకరింపుగా నవ్వాడు.
”నువ్వు కూడా యూనియన్లో వుండావా బాబు. జనం చానా మంది వచ్చింరే. వీళ్లందరికీ ఇంటి పట్టాలు, రేషన్‌కార్డులు కావల్లంటే ఇదంతా అయ్యే పనేనా అస్సలు”
ఆ మాటలతో ఏకీభవిస్తున్నట్లు తలాడించాడు గోపాల్. ”నేను కూడా అదే చెప్తాండాన్నా. యూనియన్లో కొత్తగా చేరినాలే. రమణన్నంటే ఊర్లో అందరికీ బాగా తెలుసు నేను కొత్తకదా. అసలైన పేదోళ్లకి పట్టాలు ఈకుండా బినామీ పేర్లతో ఎవురెవురికో పట్టాలు ఇచ్చేసినాడంట కదా మీ ఎం.ఆర్.ఒ. సారు. ఆ పట్టాలన్నీ రద్దు చేసి న్యాయంగా కూలోళ్లకి, కారిమకులకి పట్టాలు ఇయ్యాలనే కదా మేం ధర్నా చేస్తాండేది. ఊర్లో జనం అంతా ఈడ్నే వూండార్లేన్నా” అన్నాడు గోపాల్ గొంతు తగ్గించి రహస్యం చెపుతున్న వాడిలా.
”ఏమేం పనులు చేస్తాండారు వీళ్లంతా. ఐనా ఇంతమందీ మీ యూనియన్లో మెంబర్లేనా” కుతూహలంగా అడిగాడు నాగమలయ్య బట్టతల్లో చెయ్యిపెట్టి చెమట తుడుచుకుంటూ.
తలతిప్పి జనం వైపు పరిశీలనగా చూస్తూ బదులిచ్చాడు గోపాల్.
”మా రమణన్నకి మిగతా యూనియన్ లీడర్ల మాదిరి సభ్యత్వం వుంటేనే వాళ్ల పనులు చెయ్యల్ల అనే రూలేం లేదు. ఊర్లో ఏమూలుండే వాడైనా సరే రమణన్నా నాకు అన్యాయం జరిగిండాది చూడన్నా అంటే చాలు. సొంత పనులు కూడా పక్కలో పెట్టేసి ముందు వాళ్ల పని చూసేస్తాడు. వాడు ఎవ్వరు ఏకులం, ఏ ప్రాంతం, యూనియన్‌లో వుండాడా లేదా అనే పట్టింపే లేదు ఆయన్నకి. ఈడూండే జనమంతా కూడా మా ఒక యూనియనోళ్లే కాదన్నా” అని ఆగి మళ్లీ కొనసాగించాడు గోపాల్.
”ఈడుండే వాళ్లలో కార్మికులుండారు. ఎస్.టి.డి. బూతుల్లో, హోటల్లో సినిమా హాళ్లల్లో, ఇండ్లల్లో, పనిచేసే లేబరోళ్లుండారు. కూలీలూండారు. కాంట్రాక్ట్ ఉద్యోగులూ వుండారు. ఏందినా మీ ఆర్.ఇ. సారు ఆఫీసులోంచి వొస్తాపోతా వుండాడు. జనం కళ్లా చూసుకుంటా సెల్‌ఫోన్లో మాట్లాడతానే వుండాడు. అప్పట్నుంచి చూస్తానే వుందా”
ఆ మాటతో నాగమల్లయ్య కంగారు పడిపోయాడు. ”నువ్వు ఆ సార్‌ని చూస్తాండేది ఆర్.ఇ. సారు గమనించలేదు కదా. నీతోబాటు నేను మాట్లాడతా వుండేద చూసినాడంటే నేనేందో కానిపని చేసినట్లు ఎం.ఆర్.ఒ.కి రిపోర్ట్ చేసేస్తాడు. అసలే ఆర్.ఇ. సార్‌కి నేనంటే అస్సలు అయ్యేదిలే” బట్టతల గోక్కోవడం ఆపకుండానే స్టూలు పైనుంచి లేచి నిలబడి కంగారుగా అన్నాడు నాగమల్లయ్య. అంటూనే ఆర్.ఇ. కోసం పరిసరాల్లో చూసాడు. కానీ అతడు ఎక్కడా కనిపించక పోవడంతో మల్లీ స్టూలు పైన కూర్చుని నిట్టూర్చాడు.
యథాపలంగా జనం వైపు చూసాడు గోపాల్. అతడికి పాతికేళ్లు వుంటాయి. పొట్టీకాదు పొడవూ కాదు. చామనచాయ రంగు. బలిష్టమైన దేహం. నూనె మిల్లులో పని చేస్తున్నాడు. కొత్తగా పెళ్లయ్యింది.
జనం ఎండకు తాళలేక పోతున్నారు. చింతచెట్టు కింద చేరి ఆడుకుంటున్న చిన్న పిల్లలు కొందరు గోపాల్ దృష్టిని ఆకర్షించారు. వాళ్లేం చేస్తున్నారా అని ఆసక్తిగా కొంచెం ముందుకెళ్లి గమనించసాగాడు.
ఐదారేళ్లు వుంటాయేమో వాళ్లకి. మొత్తం నలుగురు పిల్లలు వున్నారు. ఇద్దరు ఆడపిల్లలు.
అక్కడున్న రాతిముక్కలతో, ఎండు పుల్లలతో ఇల్లు కట్టాలని కాబోలు ప్రయత్నిస్తున్నారు పిల్లలు నిలబెడుతున్న రాళ్లు వెంట వెంటనే పడిపోతున్నాయి.
వాళ్ల మొహాల్లోని నిరాశను చూస్తే అయ్యో అనిపించింది గోపాల్‌కు.
”కామ్రేడ్ గోపాల్” రమణ గొంతు గంభీరంగా వుంది.
ఆ పిలుపుతో గోపాల్ కదిలి వెనుతిరిగి రమణ ముందుకొచ్చి నిలబడి ”ఏం రమణన్నా ఎం.ఆర్.ఒ. కతేమైనా తెల్సిందా. పాపం జనం ఎండకు అల్లల్లాడి పోతాండారు. అయినా మనం ఈ దినం ఈడ ధర్నా చేస్తామని అర్జీలు ఇచ్చేదానికి వస్తామని ముందుగానే ఎం.ఆర్.ఒ.కు పోలీసోళ్లకు తెల్సుకదా. తెల్సి ఎం.ఆర్.ఒ. యాడికి పోయిండాడో చూడు” అన్నాడు.
తలాడిస్తూనే చేతివేళ్లతో జుట్టు సవరించుకుంటూ గట్టిగా ”కామ్రేడ్స్” అన్నాడు రమణ జనాన్ని ఉద్దేశించి.
ఆ ఒక్క మాటతో చెల్లాచెదురుగా వున్న జనం గుంపు చేరిపోయారు అందరూ ముందుకొచ్చి నిలబడ్డారు. వాళ్ల చేతుల్లో అట్టముక్కలు పైకి లేచాయి.
”లంచగొండి ఎం.ఆర్.ఒ.ను సస్పెండ్ చెయ్యాలి. అర్హులకే ఇంటిపట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలి. బినామీ పట్టాల్ని రద్దు చెయ్యాలి. ఎం.ఆర్.ఒ. డౌన్ డౌన్. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి” అతీ రాయబడిన అట్టముక్కల వైపు చూసి నిట్టూర్చాడు గోపాల్.
ఎందుకో అతడికి ఈ విషయంలో న్యాయం జరుగుతుందన్న ఆశ లేకపోయింది. ఇదంతా పెద్దపెద్ద వాళ్లకు ఆఫీసర్లకు, రాజకీయ నాయకులకు తెలీకుండా జరిగివుండొద్దని అతడి అభిప్రాయం.
రమణ గొంతు సవరించుకుని మాట్లాడ్డం మొదలుపెట్టేసరికి గోపాల్ ఆలోచనల్లోంచి బయటపడ్డాడు.
”ప్రియమైన కార్మిక సోదరులారా మూడుపూటలా తిండిదొరకని వాళ్లు ఇక్కడ చాలామంది వున్నారు. చేస్తున్న పని రేపటికి వుంటుందన్న గ్యారెంటీ లేదు. జీతం కానివ్వండి, కూలీ కానివ్వండి, సరిగ్గా చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. ప్రపంచీకరణతో వేగం, దౌర్జన్యం, దుర్మార్గం పెరిగిపోతున్నాయి.
కార్మికులకు, శ్రామికులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు నిజమైన అర్హులకు అందటం లేదు. నిరుపేదలకు అందాల్సివన్నీ పక్కదారిలో బినామీలకు చేరిపోతున్నాయి. ఇంటిస్థలాలు లేనివాళ్లు, ఇండ్లు లేనివాళ్లు, ఉపాధి లేనివాళ్లు, కోల్పోయినవాళ్లు ఇక్కడున్నారు. మీకు న్యాయంగా కేటాయించిన ఇంటి పట్టాల్ని రద్దుచేసి బినామీలకు అమ్ముకున్న ఎం.ఆర్.ఒ.కు ఆర్.ఇ.కు వ్యతిరేకంగా మనం చేస్తున్న ఈ పోరాటం న్యాయ పోరాటం. అన్యాయానికి, దౌర్జన్యానికి గురైన మనందరిదీ ఒకటే ప్రాంతం, ఒకటే కులం.
మనకెందుకులే జరిగిందే అన్యాయం మనకు కాదు కదా. ఈ సమస్య మనది కాదు కదా అనుకునే వాళ్లూ వున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఒంటరివాడు పోరాడ్డం వేరు. ఐకమత్యంతో అందరం పోరాడ్డం వేరు. నీకోసం, నీ చుట్టూ వున్న వాళ్లు పోరాడ్డంలో గొప్ప సాహసం వుంది. తృప్తి వుంటుంది. విజయం వుంటుంది. మీరందరూ ఇక్కడే వుండండి. పని చేయటమే కాదు ఉద్యమించటం కూడా శ్రామికుడి పనే. కార్మికుల ఐక్యతా వర్థిల్లాలి. అర్హులకే…’ అని అరిచాడు రమణ గట్టిగా.
ప్రతిస్పందనగా ”… ఇంటి పట్టాలు, రేషన్‌కార్డులు ఇవ్వాలి” జనం అరిచారు. చప్పట్లతో ఆ స్థలం మార్మోగిపోయింది.
మరో కార్మిక నాయకుడు ఉపన్యసించే కార్యక్రమం మొదలయ్యాక రమణ పక్కకు వచ్చి విలేకరులతో కరచాలనం చేసాడు. తనతోబాటే వచ్చిన గోపాల్‌ను వారికి పరిచయం చేసాడు.
”దొంగపేర్లతో పట్టాలు అమ్ముకున్న ఎం.ఆర్.ఒ. అని వార్త రాసింది ఈయన్నే గోపాల్” అంటూ పొడవుగా వున్న ఒకతన్ని పరిచయం చేసాడు రమణ.
”అవునా. మంచివార్త రాసినారు సార్” అన్నాడు గోపాల్ నవ్వుతూ.
”మేం వార్తలు రాసినంత మాత్రాన ఎక్కడా న్యాయం జరిగిపోదు కదండీ. రమణ లాంటివాళ్లు నిస్వార్థంగా నిర్భయంగా ఉద్యమించినప్పుడే న్యాయం జరుగుతుంది. ఎక్కడైనా పోరాడితేనే కదండీ విజయం వరించేది. మొన్న సబ్‌కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేసి పోయినాడులే. ఎం.ఆర్.ఒ., ఆర్.ఇ.లు పని అయిపోయినట్లే” అన్నాడతడు.
”ఎం.ఆర్.ఒ.ని తన వాళ్లకి పట్టాలిమ్మని ఓ రాజకీయ నాయకుడు బెదిరించాడని కూడా పేపర్లో రాసినారు కదన్నా. ఆయన కతేమవుతుంది” కుతూహలంగా అడిగాడు గోపాల్.
ఆ విలేకరి మెల్లగా నవ్వి జాలిగా గోపాల్ వైపు చూసాడు.
”రాజకీయ నాయకులు కూడా తప్పు చెయ్యాలంటే భయపడే విధంగా వ్యవస్థ తయారైన రోజు అట్లాంటి నాయకుల కత కూడా ముగిసిపోతుందండి. అంతవరకూ మీరందరూ అన్యాయానికి వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాటం చెయ్యాల్సిందే” అన్నాడు నవ్వుతూనే.
”సరేన్నా మీరందరూ పత్రికల్లో ధర్నా గురించి బాగా రాయండన్నా. ఎన్ని రోజులని ఎం.ఆర్.ఒ. దాక్కుంటాడో అదీ చూద్దాం. మేం నలుగురు కలెక్టర్‌ను కలవడానికి చిత్తూరుకి పోతావుండాంనా” అన్నాడు రమణ అక్కడినుంచి కదులుతూ.
ఎండ ధాటికి తట్టుకోలేరేమో ఎటైనా కదిలి నీడ చాటుకు వెళ్లిపోతారేమో అని గోపాల్ అనుకున్న జనం అక్కడి నుంచి కట్టు కదలడం లేదు. వాళ్ల మొహాలు ఎండలో మెరుస్తున్నాయి. చెమన కారిపోతున్నా ఎండ దబాయించి దౌర్జన్యం చేస్తున్నా కిందా మీదా వేడిసెగా తాకుతున్నా వాళ్లు కదలటం లేదు. ఆర్.ఇ. దొంగలాగా తొంగి చూసి మళ్లా ఆఫీసులోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. అనాలోచితంగా గోపాల్ చింతచెట్టు వైపు చూసాడు. అక్కడ పిల్లలు కనిపించలేదు.
కానీ మట్టిలో పాతి నిలబెట్టిన రాతి పలకల ఇల్లు గొప్ప సౌందర్యం వెలిగిపోతోంది.
Rajani Feb 4, 2008 1
కధ చాలా బావుంది. మంచి కధ చదివించినందుకు ధన్యవాదాలు.