Jan2008
జనవరి 2008 : సంపాదకీయం
జనవరి ప్రాణహిత కు స్వాగతం. ప్రాణహిత పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
21 వ శతాబ్దిలో మరో సంవత్సర కెరటం కాలసముద్రంలో కలిసిపోయింది. 2007 సంవత్సరం వెళ్తూ వెళ్తూ కొన్ని విషాదాలను మిగిల్చి పోయింది. మరీ ముఖ్యంగా సంవత్సరాంతంలో, మనందరికీ సుపరిచితుడు, ఆత్మీయుడూ అయిన ప్రముఖ నవలా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు అల్లం కిరణ్ కుమార్ అమెరికా లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ కాంపస్ లో దొంగతనానికి వచ్చిన కొందరు దుండగులచే అతి దారుణంగా కాల్చి చంపబడ్డాడు. అతనితో పాటు సహ విద్యార్థి కొమ్మా చంద్రశేఖర్ రెడ్డి కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు. హత్యకు వెనుక ఉద్దేశ్యమేదీ లేదని ఇవి కేవలం దొంగతనం చేయడానికి వచ్చిన దుండగుల దురాగతమే అని చెబుతున్నప్పటికీ హత్య జరిగిన పద్దతి, అది మిగిల్చిన ఘోరమైన విషాదం కిరణ్ కుటుంబీకులకూ, చంద్రశేఖర్ కుటుంబీకులకు మిగిల్చిన అంతులేని దుఃఖం అమెరికాలోనే కాదు దేశ దేశాల్లో ఉన్న తెలుగువాళ్ళందరినీ ఎంతో కలచివేసింది. అమెరికాలోనున్న కన్నబిడ్డలను తలుచుకుని తెలుగు నేలపై తలిదండ్రులు విపరీతమైన ఆందోళనకు గురయ్యారు. చేతికందిన కన్న కొడుకులని కోల్పోయిన తలితండ్రుల విషాదం మాటల్లో చెప్పలేనిది. కన్నీళ్ళతో తీరిపోనిది. గర్భ శోకం ఆజన్మాంతమూ వెంటాడుతుంది. కిరణ్ , చంద్రశేఖర్ హత్యల పట్ల ప్రాణహిత ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి తలిదండ్రులకు,కుటుంబీకులకు ప్రాణహిత సానుభూతిని తెలియజేస్తున్నది. వారి దుఃఖాన్ని పంచుకుంటున్నది. సకాలంలో వారికి అండగా నిల్చిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నది. అయితే అనేక తెలుగు పత్రికలు రాసినట్టు ఈ హత్యలు కానీ , అంతకు ముందు జరిగిన ఏబికే ప్రసాదు గారి మనవడి హత్య కానీ భారతీయుల పట్ల ద్వేషంతో జరిగినవి కాదని ప్రాణహిత భావిస్తున్నది. అమెరికా లో రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగమూ, ఆకలీ, పేదరికమూ, సమాజపు పొరల్లో అంతర్లీనంగా దాగిన వివక్షా, వాటివల్ల నేరపూరితమవుతున్న కొన్ని వర్గాల ప్రజల సామాజిక జీవన బీభత్సమూ, కత్రీనా లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా బాధితులకు అండగా నిలవడంలో ప్రభుత్వమూ, పాలక సంస్థలూ చూపే జాతి వివక్షా, ఆకలిగొన్న వాడు ఆ పూట ఆకలి తీర్చే రొట్టె కొనుక్కునే బదులు తుపాకీ కొనుక్కొని శాశ్వతంగా ఆకలి తీర్చుకునే మార్గం కనుక్కున్నానని భ్రమింపచేసే నేరజీవితంలోకి నెట్టి వేసే తుపాకీ రాజకీయాలూ వాటి వెనుకనున్న లాబీలు, వాటి సంస్కృతీ – ఇలా ఎన్నో సామాజిక అంశాలని వాటి విభిన్న కోణాలని పరిశీలించి విశ్లేషించాల్సి ఉందని ప్రాణహిత భావిస్తున్నది. కారణాలేవయినా హత్యకు గురయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వల్ల కలిగిన లోటు పూడ్చలేని అగాధమని ప్రాణహిత భావిస్తున్నది.
ఈ సంచిక నుండీ ప్రాణహిత మీకో నెల నెలా ఒక కాలమ్ అందిస్తోంది. సమకాలీన సంఘటనల పట్ల స్పందిస్తూ అమెరికాలో నివసిస్తున్న ప్రాణహిత సంపాదకవర్గం సభ్యురాలు హిమబిందు రాస్తున్న ‘చౌరస్తా’ కాలమ్ మీ కందిస్తున్నాం. లూసియానా యూనివర్సిటీ హత్యల గురించిన అనేక ‘సందేహాల’ ను ఈసారి ‘చౌరస్తా’ లో చదవండి. ఈ సంచికలో మీకు కార్మికుల జీవితాలపై పలమనేరు బాలాజీ రాసిన ‘ధర్నా’ కథను, 80 ఏండ్ల కింద రాసినా ఇప్పటికీ స్త్రీ జీవితాల్లోని కడగండ్లను కళ్ళకు గట్టిన చలం గారి కథ ‘వితంతువు’ నూ మీ కందిస్తున్నాం. రంగు రాళ్లనీ, బాక్సైటు గనులనీ, ప్రాజెక్టులనీ ఆదివాసీ జీవితాలను అతలాకుతలం చేస్తున్న పాలకుల దురాగతాలని ఈసడిస్తూ జూపాక సుభద్ర ఆక్రోశం ‘సెట్టుంగొట్టేసినట్టు మాకేసుంగొట్టేసిండ్రు‘ ఈ సంచికలో చదవండి. ఈ ఏడాది ప్రముఖ కవి ఇస్మాయిల్ అవార్డును గరికపాటి పవన్ కుమార్ కు అందజేసారు. పవన్ కవిత్వాన్ని విశ్లేసిస్తూ శిఖామణి రాసిన వ్యాసం ‘అనుభూతి కవితా శిఖరం ఆ సాయంత్రం’ ను మీకందిస్తున్నాం. గీతాంజలి (డా||భారతి) ముస్లిం స్త్రీల జీవితాలపై రాసిన అద్భుతమైన కథల సంపుటి పహెచాన్ ని సమీక్షిస్తూ కాత్యాయని రాసిన ‘బాధిత మహిళలకొక స్నేహ హస్తం’ ను మీకందిస్తున్నాం. రావిశాస్త్రి అవార్డునందుకున్న సందర్భంగా ఆడెపు లక్ష్మీపతి ప్రసంగ వ్యాసం ‘మారుతున్న పరిస్థితుల్లో పెరిగిన రచయిత బాధ్యతలు’ ను ఈ సంచికలో చదవండి. మేరీ బ్రేవ్ బర్డ్ లకోటా వుమెన్ కి మమత ధారావాహిక అనుసృజన ‘అపరాజిత’ తరువాయి భాగాన్ని, డా|రోహిణీ ప్రసాదు రాస్తున్న శాస్త్రీయ వ్యాస పరంపర లోని తరువాయి భాగం ‘బాక్టీరియాకు “చిన్న తమ్ముళ్ళు”‘ ను ఈ సంచికలో చదవండి.
ఇంకా ఈ సంచికలో కల్పనా రెంటాల కవిత ‘సంచయనం‘, కృపాకర్ మాదిగ కవిత ‘ వైద్యో! రోగులు బలి!‘, బెల్లంకొండ సంపత్ కుమార్ కవిత ‘జలియన్ వాలా బాగ్‘, కె.శివారెడ్డి కవిత ‘రెక్కలక్కర్లేదు‘, పి. పరమేశ్వరివే మరికొన్ని ‘హైకూ‘ లు చదవండి.
ఎప్పటిలాగే ప్రాణహితను ఆదరిస్తారని, ఈ సంచికలోని రచనలను చర్చిస్తారని ఆకాంక్షిస్తున్నాం. వచ్చే సంచికనుంచయినా పత్రికను సకాలంలో తీసుకు రావడానికి శాయశక్తులా కృషి చేస్తామని విన్నవించుకుంటున్నాం.