Jan2008
బాధిత మహిళలకొక స్నేహ హస్తం
ముస్లిం సమాజాన్ని నిర్వచించటానికి ముస్లిమేతరులైన రచయితలూ, మేధావులూ సాధారణంగా రెండురకాల నమూనాలను అనుసరిస్తూ వుంటారు. ఒకటి – ముస్లింలందరూ అనాగరికులూ, మతోన్మాదులూ, దేశద్రోహులూ అనే అభిప్రాయం. ఇది హిందూమతోన్మాద భావజాలానికి చెందినదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండవది – ముస్లింలు బాధితులూ, పీడితులూ, నిస్సహాయులూ కాబట్టి వాళ్లను ఆదుకుని, రక్షించే బాధ్యతను స్వీకరించాలని భావించే ధోరణి. ప్రజాస్వామిక ప్రగతిశీల దృక్పథం కలవారనుకునే చాలామంది రచయితల్లో ఈ దృక్పథం కనబడుతుంది.
ఈ రెండు రకాల ఆలోచనా విధానాలూ ఒకదానికొకటి భిన్నంగా కబడుతూనే వున్నప్పటికీ వాటి మధ్యన ఒక పోలిక వుంది. అది – ముస్లిం సమాజాన్ని అంతర్గత వైరుధ్యాలూ, చలనాలూ, ఘర్షణలూ లేని ఒక ముద్దగా భావించటం. ఈ రెండు ధోరణులూ ముస్లిం సమాజం ‘లోపలి’ పీడితులకు నష్టం చేసేవే. ముస్లింలలోని సాధారణ ప్రజలందరినీ మతోన్మాదులుగా చిత్రించి, వారిపై దాడులకు పాల్పడుతున్న శక్తులను గురించి మనకు తెలుసు. అలాగే ముస్లింలను ఆదరిస్తున్నామనే ప్రజాస్వామిక వాదులు కూడా ముస్లింలలోని పేదలూ, స్త్రీలూ, నిమ్నకులాల మీద అమలయ్యే వివక్షను దాటవేస్తూ వుంటారు.
నిజం చెప్పాలంటే వివిధ అస్తిత్వ వాదాలు కొన్ని వ్యవస్థలుగా స్థిరపడిన యివాల్టి సందర్భంలో ఆ వ్యవస్థల ‘లోపలి’ అప్రజాస్వామిక లక్షణాలను గురించి వాటికి ‘వెలుపలి’ వాళ్లు మాట్లాడటం ఒక సాహసమే. గతంలో అలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా నిషేధాలూ, బెదిరింపులూ ఎదురయిన చరిత్రే కనబడుతుంది.
ఇలాంటి వాతావరణం మధ్యన డా||భారతి ‘పహెచాన్’ కథలు రాసింది. ముస్లింల సాధారణ సమస్యల దగ్గరే ఆగిపోయి, ముస్లిం పక్షపాతిగా గుర్తింపు తెచ్చుకోగల ‘సౌకర్యాన్ని’ భారతి వాడుకోదల్చలేదు. అందుకే ముస్లిం సమాజపు సామూహిక సమస్యలతో బాటుగా అందులోని పేదల, స్త్రీల, దూదేకుల సమూహాల బాధలు కూడా ఆమె కథావస్తువులయ్యాయి.
ముస్లిం సమాజంలోని అంతర్గత వైరుధ్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలోనూ చొరబడటానికి హిందూమతోన్మాద శక్తులు సిద్ధంగా కాచుకొని వున్నారన్న వాస్తవాన్ని యీ కథలు రాసే క్రమంలో భారతి ఎక్కడా మర్చిపోలేదు. ముస్లిం స్త్రీల సమస్యలను ఆ సమాజపు ‘అనాగరికత’గా చిత్రించి ఒక రాయి విసరటానికి ఉత్సాహపడే శక్తులకు చోటివ్వకూడదన్న బాధ్యతతోనే ఆమె స్త్రీల వేదనను చిత్రించటానికి పూనుకున్నది.
సమాజంలో స్త్రీలందరి మీదా జరుగుతున్న పితృస్వామిక హింసా, ఆధిపత్యాలకు ముస్లిం మహిళలు కూడా గురవుతున్నారని యీ కథలు చెప్తాయి. ముస్లిం స్త్రీలకే ప్రత్యేకమైన కొన్ని సమస్యలను ప్రస్తావించిన సందర్భాల్లో కూడా పురుషులను అంత కఠినంగా మార్చుతున్న సామాజిక, ఆర్థిక మూలాలను సూచిస్తాయి. ఆ కుటుంబాల లోపలి – వెలుపలి సమస్యల మధ్యన ఎలాంటి సంబంధం వుందో చర్చించటానికి రచయిత్రి ప్రయత్నించింది.
ముస్లింలను యీ దేశానికి పరాయివాళ్లుగా చూపించి, సమాజపు వెలుపలికి నెట్టివేసే ఒక కుట్ర ఎంత పకడ్బందీగా జరుగుతున్నదో, దానివల్ల ముస్లిం కుటుంబాలపై ఏర్పడే వత్తిడి స్త్రీలపై మరింతగా ఎలా కేంద్రీకృతమవుతున్నదో భారతి గుర్తించింది. ముస్లిం స్త్రీల మనశ్శరీరాలపై ఏర్పడిన గాయాలను ఒక స్త్రీగా, స్త్రీల వైద్యురాలిగా ఆర్తితో, సహానుభూతితో స్పృశించింది. ఆ హింసను అడ్డుకోవాలని తపన పడింది.
ముస్లిం సమాజాన్ని ఒక మతఛాందసుల గ్రూపుగానో, ఒక బాధితుల శిబిరంలాగానో కాక, సజీవమైన మానవ సమూహంగా చూసింది భారతి. వాళ్ల జీవితాల్లోని వెలుగునీడలకు అక్షర రూపాన్నిచ్చింది. స్త్రీ- పురుష సంబంధాల్లోని సాంప్రదాయిక నమూనాలకు భిన్నమైన పాత్రలు యీ కథల్లో కనబడతాయి. ”పడ్‌నా యా మర్‌నా” కథలో రఫీ పురుషుడిగా తనకున్న ఆధిపత్యాన్ని వొదులుకొని భార్య అభిరుచుల్ని గౌరవిస్తాడు. ‘సైతాన్’లో తలాక్ అధికారాన్ని అనాలోచితంగా, బాధ్యతారహితంగా ఉపయోగించుకున్న అఫ్జల్ చివరికి పశ్చాత్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతాడు. కూతుళ్ల మీది ప్రేమకూ, వాళ్లను గల్ఫ్‌దేశాల షేక్‌లకు అమ్ముకోక తప్పని దరిద్రానికి మధ్యన నలిగే ఎందరో తండ్రులు యీ కథల్లో కనబడతారు. స్త్రీ పురుష సంబంధాలను ఉన్నతీకరించే దిశగా పురుషులను సెన్సిటైజ్ చెయ్యటానికి యీ కథలు ఎంతగానో వుపకరిస్తాయి.
ఈ కథలు ముస్లిం స్త్రీల మీద కుటుంబాల్లో జరుగుతున్న హింసనూ, అణచివేతనూ చర్చించి, నిరసిస్తాయి. ఐతే యీ దుఃఖం, విషాదం పాఠకులను అంతిమంగా నైరాశ్యంలోకి నెట్టివెయ్యవు. ఈ స్త్రీలు ఎన్నో అవరోధాలనూ, పరిమితులనూ దాటుకుంటూ రకరకాల పోరాటరూపాలతో యుద్ధానికి తలపడతారు. ఆత్మహత్య తప్ప తన నిరసన ప్రకటనకు గత్యంతరం లేని నఫీజ్ (ఔలాద్) నుండి, ఒక హత్యకు తెగించి తమను తాము కాపాడుకున్న రుక్సానా, ఖుర్షీదా (పద్థర్)ల వరకూ యీ కథల్లో ఎదురవుతారు. తననూ, తన పసిపాపలనూ నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లిన భర్త పద్దెనిమిదేళ్ల తర్వాత క్షమాపణ కోరి, ఆహ్వానిస్తే నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది సైతాన్‌లో అక్తర్‌బేగం. బాధ్యతలు మరిచిన భర్తకు ‘ఖులా’ యిచ్చి ఆత్మాభిమానాన్ని ప్రకటిస్తుంది జహంగీర్‌బీ. తన ప్రజల మీద జరిగిన మారణకాండను బట్టబయలుచేసే ప్రయత్నంలో ప్రాణాలే అర్పిస్తుంది ‘పహెచాన్’లో జహీరా. ఏ మార్గమూ దొరకక నిస్సహాయంగా ప్రాణాలొదిలిన జన్నత్ (దోఝక్) కూడా ”ఈ హాలత్‌కు కారణం ఎవరు?” అనే ప్రశ్నను సంధించే వెళ్తుంది.
బాధిత స్త్రీల మధ్యన వుండాల్సిన సహానుభూతినీ, ఐక్యతనూ ప్రతిపాదించటం లోనూ భారతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ‘ఉనో నహీ మాన్తే’, ‘పద్ధర్’లలో తల్లీకూతుళ్లూ, ‘ఖులా’లో అక్కచెల్లెళ్లూ తమ అనుభవాల క్రమంలో మరింత సన్నిహితులవుతారు. స్త్రీలుగా, బాధితులుగా, సహచరులై నిలబడతారు. ఒకే పురుషుడికి భార్యలుగా శత్రుస్థానాల్లోకి చేరిన జుబేదా, వసీంలు (బచ్చేదాని) ఐక్యంగా నిలబడి పోరాడుతారు. ‘పద్ధర్’లో సమీనా ”అల్లా మనల్ని అన్యాయం సహించమంటడా చెప్పు?” అని బుజ్జగిస్తూ అస్మాను పోరాటానికి సిద్ధం చేస్తుంది. అమీనా మరింత ముందుకు వెళ్లి ముస్లిం స్త్రీలందరి విముక్తికి ఒక మౌలికమైన పోరాటాన్ని నిర్మించాలని ఆశిస్తుంది.
ముస్లిం- ముస్లిమేతర ప్రజలమధ్యన మానవ సంబంధాలు మెరుగుపడాలనే ఆశను కూడా రచయిత్రి వ్యక్తం చేస్తుంది. తరతరాలుగా పెనవేసుకుపోయిన యిరువర్గాల ప్రజల జీవితాలనూ బలవంతంగా విడదీస్తున్న మతోన్మాద రాజకీయాలను నిరసించే హిందూ పాత్రలను ఆమె యీ కథల్లో సృష్టించింది.
ఈ సంకలనంలోని ప్రతి కథా ఒక తీవ్రమైన దుఃఖాన్నీ, విషాదాన్నీ మనముందు పెడుతుంది. ముస్లిం ప్రజలతో – ముఖ్యంగా ముస్లిం స్త్రీల వేదనతో రచయిత్రి మమేకమై, సహానుభూతి చెందుతుంది. దాంపత్యాల పేరిటా, సంబంధాల మాటునా కుటుంబాల్లో స్త్రీలపై జరిగే లైంగిక హింసను ఆమె తీవ్రంగా అసహ్యించుకుంటుంది. వాటిచుట్టూ పేరుకున్న నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టాలని తపన పడుతుంది. అందువల్ల యీ కథలకొక వేగమూ, ఉద్విగ్నతా, తీవ్రతా చేకూరాయి.
ఐతే, కథావస్తువులతో రచయిత్రికున్న యీ నిమగ్నతా – తనకు తోచిన ప్రతి ఆలోచననూ, తెలిసిన ప్రతి వివరమూ కథలో నమోదు కావాలన్న ఆత్రుతా కొన్ని సందర్భాల్లో కథానిర్మాణాన్ని దెబ్బతీసినట్టుగా అన్పిస్తుంది. పాఠకులకు తను అందించదల్చుకున్న దృష్టి కోణం అందుతోందో లేదో రచయిత్రి కొన్నిచోట్ల పట్టించుకున్నట్టు కనబడదు. కొన్ని కథల్లో రచయిత్రి అవసరానికి మించి జోక్యం చేసుకోవటమూ, తన చైతన్యస్థాయిని పాత్రలపై బలవంతంగా ఆపాదించడమూ కూడా చేసినట్టుగా తోస్తుంది.
ఉదాహరణకు – స్త్రీలమీది లైంగిక హింసను సూక్ష్మ వివరాలతో సహా పదేపదే వర్ణించటమూ, కొన్ని సందర్భాల్లో పాత్రల మాటల్లో కూడా కాకుండా రచయిత్రి స్వయంగా వర్ణించటమూ యీ సంకలనం లోని కొన్ని కథల్లో కనబడుతుంది. ఆ హింసా, భీభత్సమూ స్త్రీల జీవితాల్లో లేవని కాదు – యింకా భయంకరంగా వుండొచ్చు కూడా. విషయాన్ని మరింత బలంగా, నిజాయితీగా చెప్పాలన్నదే రచయిత్రి లక్ష్యమని కూడా అర్థమవుతూనే వుంటుంది. కానీ, సృజనాత్మక సాహిత్యం లో యీ విధమైన చిత్రణ వివిధ స్థాయిల పాఠకుల మీద ఏయే ప్రభావాలను వేస్తుందో గమనించటం కూడా అవసరమే.
కన్నతండ్రి చేత సంవత్సరాల తరబడి లైంగిక అత్యాచారానికి గురవుతూ వున్న అస్రా అనే బాలిక కథ ‘పద్ధర్’. ఈ కథాంశమే హృదయ విదారకమైనది. ‘ఇన్‌సెస్ట్’ అనే దుర్మార్గాన్ని కుటుంబాలూ, సమాజమూ నిశ్శబ్దంగా కొనసాగనివ్వటం ఎంత దారుణమో ఆగ్రహంతో ప్రశ్నిస్తుంది భారతి. అస్రా మీద జరుగుతున్న హింసను అతి వివరంగా వర్ణించే యీ కథను చదువుతున్న పాఠకులూ, రచయిత్రి కూడా తీవ్రమైన ఆందోళనకూ, ఉద్వేగానికీ లోనవుతూ వస్తారు. చివరికి తల్లీ కూతుళ్లు ఆ మానవమృగాన్ని చంపడంతో కథ ముగించి రచయిత్రి తన మానసిక వత్తిడి నుండి బయట పడుతుంది. కానీ పాఠకులు భయాందోళనలతో హింసాత్మక సన్నివేశాల దగ్గరే ఆగిపోయి, కథలోని సున్నితమైన, మానవీయమైన అంశాలను గమనించ లేకపోయే ప్రమాదం వుంది.
సమీనా అనే టీచరు భర్త మజహర్ అలీ అస్మాను చూసి చలించిపోతాడు. ”మజహర్ అలీ….. గుండెల్ల బాధ పొంగింది. ఆ పిల్లను ప్రేమగా దగ్గర్కి తీస్కుందమనుకున్నడు. గని…. గాయపడ్డ….. అస్మా వైపుకు చూసేతందుకు గూడ భయమైతున్నది” అని యీ సన్నివేశాన్ని వర్ణిస్తుంది భారతి. అత్యాచార సన్నివేశాన్ని విన్నది విన్నట్టుగా వర్ణించటానికి ఏ రిపోర్టర్లయినా చాలు. కానీ, యింత మానవీయమైన భావనను వ్యక్తీకరించటానికి ఆర్తి, ప్రేమ కలిగిన రచయితలు కావాలి. ఆ శక్తి కలిగిన భారతి రిపోర్టింగ్ పనికి ఎందుకు పూనుకుంటుందో అర్థం కాదు. ‘ఫా తెహా’ వంటి మరికొన్ని కథల్లో కూడా యిలాగా జరిగింది. ఈ చిత్రణ వల్ల కథకు కలిగే అదనపు ప్రయోజనం లేకపోగా, కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు కలిగే ప్రమాదం వుందేమోనన్పిస్తుంది.
విద్యావిధానాన్ని గురించీ, ముస్లింలలో అధిక సంతానాన్ని గురించీ భారతి వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా అస్పష్టంగానే తోస్తాయి. పిల్లలను మదర్సాలలో చదివించటమూ, అధిక సంతానాన్ని కనటమూ లాంటి విషయాల్లో మతవిశ్వాసాలకన్నా, పేదరికానిదే ప్రధానపాత్ర అని రచయిత్రి పట్టించుకోదు. అందువల్లనే ”సబా- సవేరా”లో పిల్లలను ఇంగ్లీష్ బడికి పంపలేకపోయిన తండ్రి దోషిగా చిత్రించబడ్డాడు. అంతకన్నా ముఖ్యమైన విషయం – ముస్లింల మీది దాడులను ‘నాగరికతల యుద్ధంగా’ సామ్రాజ్యవాదులు బుకాయిస్తున్న సందర్భంలో మదర్సాకు ప్రత్యామ్నాయంగా ”లిటిల్ ఆక్స్‌ఫర్ట్ స్కూలు”ను చూపించటం తప్పుడు సంకేతాలను అందిస్తుందేమో చెక్ చేసుకోవాలి.
సంకలనంలో చివరికథ ‘మైఁ… అమీనా బాత్ కర్రైఁ…’. అన్ని కథల లోని స్త్రీ పాత్రల సమస్యలనూ సమీక్షించి వాటిని పరిష్కరించుకునే దృక్పథాన్ని యివ్వగల సంఘాన్ని స్థాపించాలను కుంటుంది అమీనా. ఈ కథలో చెప్పినట్టుగా ఎన్నో జీవితానుభవాలూ, సైద్ధాంతిక అవగాహనా కలిగిన అమీనాలు వుండడంలో ఆశ్చర్యం లేదు. కానీ, బాధిత ముస్లిం స్త్రీలందరినీ కలిపి వర్గదృక్పధం గల ‘ప్రగతిశీల ముస్లిం స్త్రీల సంఘం’ అనే సంస్థలను రిజిస్ట్రేషన్ చెయ్యగలిగే పరిస్థితులు యిప్పటికిప్పుడు అందుబాటులో వున్నాయా? ముస్లిం స్త్రీలను వాళ్ల సమస్యల ప్రాతిపదికన చైతన్యవంతం చేసే ప్రయత్నాలు ప్రగతిశీల ఉద్యమాలవైపు నుండి జరిగాయా? అమీనా పాత్రను సామాజిక వాస్తవికతకన్నా, రచయిత్రి చైతన్యస్థాయి డామినేట్ చెయ్యటం కనబడుతుంది.
ఇలా, కొన్ని విషయాల్లో చర్చించాల్సిన విషయాలు మిగిలి వున్నాయన్పించినప్పటికీ – యింతకాలం పాటూ మనలో చాలామందికి తెలియని, తెలిసినా పట్టించుకోని ముస్లిం స్త్రీల ప్రపంచాన్ని యీ కథలు పరిచయం చేస్తాయి. ప్రేమతో, ఆర్తితో, సహానుభూతితో ఆ స్త్రీలకు స్నేహహస్తాన్ని అందిస్తాయి.
పహెచాన్ – ముస్లిం స్త్రీల అస్తిత్వ పోరాట కథలు
రచన: డా|| భారతి (గీతాంజలి)
ప్రచురణ: మట్టి ముద్రణలు, ఆలగడప, మిర్యాలగూడ, నలగొండ జిల్లా, తెలంగాణ
వెల: 75 రూపాయలు
అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు