Jan2008
మారుతున్న పరిస్థితుల్లో పెరిగిన రచయిత బాధ్యతలు
తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలలు, కథలు, నాటికలు అందించి వెళ్లిపోయారు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆ గొప్ప రచయిత పేరు మీద నెలకొల్పిన ప్రతిష్టాకరమైన ‘రావిశాస్త్రి స్మారక సాహిత్య అవార్డు’ ను స్వీకరిస్తున్న సందర్భంగా నాకు చాలా ఆనందంగా వుంది. ఒక ఉన్నత పురస్కారం లభించినప్పుడు ఏ రచయిత ఐనా ఏ కళాకారుడైనా ఎలా స్పందిస్తాడో, ఎలా అనుభూతిస్తాడో నేనూ అలాగే స్పందిస్తున్నాను, అలాగే అనుభూతిస్తున్నాను.
ప్రతి రచయితా గుర్తింపును కోరుకుంటాడు. తన కృషి పలువురి దృష్టినాకర్షించాలని అభిలషిస్తాడు. అయితే గుర్తింపు లభించిన మరుక్షణమే అతడు భయపడవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని బాధ్యత పెరుగుతుంది కాబట్టి, గుర్తింపు, బాధ్యత అనేవి ఒకే నాణానికి రెండు ముఖాలు అని నా అభిప్రాయం. బాధ్యత అనేది బరువైన మాట, అది వివరించే ముందు రచయిత అసలు ఎందుకు రాస్తాడో ఆలోచిద్దాము.
ప్రాథమికంగా, స్పందించే గుణం వున్నవాడే రచయితగానీ, కవి గానీ అవుతాడు. సమకాలీన సమాజ పోకడల్ని గమనిస్తున్న క్రమంలో ఎదురయ్యే సమస్యలు (….), అనుభవించే సంఘర్షణలు, కదిలించే సన్నివేశాలు రచయితని అశాంతికి గురిచేస్తాయి. ఆ అశాంతి నుండి ఊరట చెందేందుకు అతడు అనివార్యంగా రాయాల్సిందే. అతని వద్దవున్న సాధనం అదొక్కటే. సమాజంతో సంభాషించడానికి మార్గం కూడా అదే. తన రచనలో ఒక జీవిత పార్శ్వాన్ని ఆవిష్కరించి తాను అర్థంచేసుకున్న ఒక జీవిత సత్యాన్ని ఇతరులకు చేరవేస్తాడు. తన ఆలోచనల్ని, అవగాహనారీతిని వాళ్లతో పంచుకుంటాడు. ఉమ్మడి కష్టసుఖాల్ని వాళ్లతో సహనుభూతిస్తాడు. సమాజ చైతన్యపు సగటు స్థాయికన్నా ఒక మెట్టు ఎగువన రచయిత ఉంటాడు కాబట్టి, మెరుగైన స్థితిగతుల మరో ప్రపంచం గురించిన ఆలోచన సమాజంలో రేకెత్తిస్తాడు. ఈ అంతిమ ప్రయోజనం లక్ష్యంగా రచయిత ఎంత సీరియస్‌గా శ్రమిస్తే అంత ఉత్తమ సాహిత్యం సృష్టి అవుతుంది.
ఇక బాధ్యత గురించి-రచయిత ఏది పడితే అది రాసి పాఠకుల్ని తాత్కాలికంగా సమ్మోహితుల్ని చేయడమే తన ఉద్ధేశ్యంగా పెట్టుకోజాలడు. ఎంత చేదుగా వున్నా అతను వాస్తవాలే రాయాల్సి వుంటుంది. నిజం వెంబడే నడవాల్సి వుంటుంది, నిర్బంధాన్ని ఎదిరించి స్వేచ్ఛకోసం గళమెత్తాల్సివుంటుంది, అభివృద్ధి ఫలాలను తృప్తిగా అనుభవించే కొద్దిమంది ఉత్సాహంగా పాడే ఆనందగీతికల్ని కాక అభివృద్ధి రథచక్రాల కిందపడి నలిగిపోతున్న బహుసంఖ్యాక బడుగు వర్గాల ఆక్రందనల్ని ప్రతిధ్వనింపజేయాల్సివుంటుంది. తన వ్యక్తిగత ప్రయోజనాల్ని రచయిత పక్కన పెట్టవలసి వుంటుంది. తిరోగమన వాదాన్ని, పలాయన వాదాన్ని నిర్మొహమాటంగా విమర్శించవలసి వుంటుంది. శాస్త్ర, సాంకేతిక విప్లవం, ప్రపంచీకరణ ప్రభావంతో మానవ జీవితం మరీ సంక్లిష్లమై పోతున్న ప్రస్తుత తరుణంలో, మర్కెట్ ఎకానమీకి పెద్దపీట వేస్తున్న ఈ సంతోషకాలంలో మానవీయ విలువలను పురుజ్జీవింపజేసేందుకు నేటి రచయిత విస్తృతంగా రాయాలి. మానవవిలువల ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజెప్పేందుకు అవసరమైన సరికొత్తసాధన సంపత్తిని అతడు చేపట్టవలసివుంది; వివిధ ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోగల నేర్పు సాధించవలసి వుంది. ప్రజల్లో చదివే అలవాటు తగ్గిపోతూ, పుస్తకం అస్తిత్వం ప్రమాదపుటంచున ఉన్న ఈ విషయ ఘడియలో రచయిత ఈ తక్షణ బాధ్యతను గుర్తించాలి. ఇవాళ నాకిచ్చిన ఈ అవార్డు నా విరామాన్ని భగ్నం చేస్తూ నా బాధ్యతను ముందర నిలబెడుతున్నది.
నేను బీదకుటుంబంలోంచి వచ్చిన వాడిని. నా తండ్రి బొగ్గు గని కార్మికునిగా పని చేశాడు. కష్టించేవి రెండు చేతులయితే తినేవి ఎనిమిది నోళ్లు. అసంతృప్తికరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య బాల్యం గడుస్తున్న సమయంలో తెలియకుండానే పఠనానురక్తి పెంచుకున్నాను. రష్యన్ సాహిత్యం, శరత్‌నవలలు, రావిశాస్రి బీనాదేవి, తిలక్ గార్ల కథలు చదివాను. 17 ఏళ్ల వయసులో రాసిన నా మొదటికథ ‘ఆదర్శం’ ‘ప్రగతి’ సచిత్రవారపత్రికలో ప్రచురితమైంది. జూనియర్ కాలేజీ చదువు మధ్యలో ఆపేసి మూడేళ్ల టెక్నికల్ ట్రయినింగ్ కి వెళ్ళాను. ఆ తర్వాత హోరెత్తే యంత్రాల నడుమ యంత్రంలాగా మేల్కొని వుండే వుద్యోగం 27 ఏళ్లు చేశాను. రచన వ్యాసంగా ‘87 నుండి పున:ప్రారంభించాను. సమాంతరంగా ఆంగ్లసాహిత్య అధ్యయనం సాగించాను. కాఫ్కా, బోర్జెస్, జేమ్స్ జాయిస్ లను ఆసక్తిగా చదివాను.
రచయిత అన్నవాడికి అనుభవసారం, పరిశీలనశక్తి, ఊహాపటిమ అత్యవసరమని నా అభిప్రాయం. కథలో వస్తువు, శిల్పం ఒకదానిలో మరొకటి అతుకు కనిపించకుండా (…) ఇమిడి పోవాలని నాభావన, అనుభవానికి లేదా పరిశీలనకు ఊహాపటిమ జోడయ్యినప్పుడు మంచి కథ ఉద్భవిస్తుంది. ‘జీవన్మృతుడు’, ‘విధ్వంసదృశ్యం’ కథలు అలాగే జనించాయి. నాది పల్లెటూరి నేపథ్యం, ‘నాలుగు దృశ్యాలు’, ‘ముసల్దానిముల్లె’, ‘ఆక్రోశం’ కథలు ఆ నేపథ్యంలోంచి వచ్చినవే. నాకు నా కులవృత్తిలో అనుబంధం లేకున్నా పూర్తిగా పరిశీలన పునాదిగా ‘త్రిభుజపు నాలుగో కోణం’ రాశాను. ‘తివ్యగ్రేఖ’, ‘అనివార్యం’ కథలూ ఆ కోవలోవే.
అయిదేళ్ల క్రితం వరకు నాకు విస్తారంగా చదివే అలవాటుండేది. ఇంగ్లీషులో నాకు బాగా నచ్చిన కథ ‘ది మెక్సికన్’. ఉత్కంఠభరింతంగా కథనం సాగిన జాక్‌లండన్ అద్భుత రచన లది. బక్క పలుచని గ్రింగో అయిన కథానాయకుడు ఫిలిప్ రివేరా మొక్కవోని పట్టుదల, ఆరిపోని ఆశయ జ్వాల, కసి, చివర్న దెబ్బతిన్న బెబ్బులిలా అతను ప్రత్యర్థిమీద విరుచుకుపడి బాక్సింగ్‌లో విజయం సాధించిన తీరు పాఠకుల్ని భ్రమంలో మంచెత్తుతుంది. తెలుగులో నేను మెచ్చిన కథ ‘వర్షం’. రావిశాస్రి గారి కలం నుండి వెలువడ్డ ఈ మంచికథ ఆశావాదాన్ని నిర్భీతి ని ప్రబోధిస్తుంది. నాకు నచ్చిన నవల మహీధర రామ్మోహనరావుగారి ‘రథచక్రాలు’. సాహిత్యోద్యమ సంధికాలంలో తెలుగునాట పెల్లుబికిన ప్రజా చైతన్యాన్ని చిత్రించిన ఈ ఉత్తమ నవల ‘అండ్‌క్వైట్ ఫ్లోస్ ది డాన్’ తో పోల్చదగ్గది. అక్టోబర్ విప్లవకాలంలో రష్యాలో చెలచేగిన అంతర్యుధ్ద పరిస్థితులను, కోసక్కుల డోలాయమాన సందిగ్థావస్థనూ ఎర్రసైనికులు కొన్ని తొందరపాటు చర్యలనూ ఈ ఐతిహాసిక నవలలో వెంకైల్ షాలకోన్ సమగ్రంగా చిత్రించాడు. నాగరికతలోని డొల్ల తనాన్ని, సాంస్కృతిక క్షీణదశను అద్భుతమైన పద చిత్రాలతో అనితర సాధ్యమైన మెటఫర్లతో అక్షరీకరించిన టి.ఎస్.ఇలియట్ దీర్ఘకవిత ‘దివేస్ట్‌లాండ్’ని తీరిక వేళల్లో చదువుతుంటాను. లాటిన్ అమెరికన్ రచయితలు అవలంబించిన టెక్నిక్ ‘మాజిక్ రియలిజం’ పట్ల నాకు అమితమైన అభిమానం. సామాజిక వ్యవస్థలోని కర్కశత్వాన్ని రాజకీయ రంగంలోని క్రూరత్వాన్ని, సెన్సారు కత్తెరకు అందకుండా, ఎండగట్టినందుకు పురాగాధలతో, వివిధ కాలాలాకు చెందిన పాత్రలతో వాస్తవికతని, మాంత్రికతని సమ్మిళితం చేస్తూ మార్క్వెజ్, బెన్ ఓక్రీ ప్రభృతులు సాగించే కథనం నిజంగా పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అలాంటి శిల్పసంవిధానంతో ఒక నవల రాయగలిగితే బాగుండు అని నా కోరిక. కథ ఎలా వుండాలి అన్న విషయం మీద నాకు స్పష్టమైన అభిప్రాయం వుంది. ప్రసిద్ధ అమెరికన్ రచయిత్రి కేబాయిల్ వేసిన సవాలును కథ రాసేటప్పుడు చిత్తశుద్ధితో మననం చేసుకుంటాను.
తెలుగు కథ ప్రస్తుతం మంచి దశలోవుంది. వస్తువులో విస్తృతి, శిల్పంలో వైవిధ్యం పెరిగాయి. ప్రయోగాత్మక కథలూ వస్తున్నాయి. ఇతర భారతీయ భాషా కథలకు ధీటయిన ధోరణి ఇది. పట్టణికీకరణ ప్రభావాలు, వ్యవసాయ వ్యాపారీకరణ, రైతుల దైన్యస్థితి, చేనేత కార్మీకుల, రైతుల ఆకలిచావులు, నూతన పారిశ్రామిక విధానం వల్ల ఉపాధి కోల్పోతున్న కార్మికుల బాధలు, భూనిర్వాసితుల గోసలు, వ్యవస్థలోనే అవినీతి, రాజ్యహింస, స్త్రీల సమస్యలు, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు, ప్రాంతీయతా అస్తిత్వవాదాలు, ప్రపంచీకరణ తాకిడికి విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు – ఇలా చాలా అంశాల్ని నేటి కథ స్పృశిస్తుంది.
మనం సంకట స్థితిలో పడ్డప్పుడు, మనమే గందరగోళపడే సన్నివేశం ఎదురయినప్పుడు కథ రాయాలన్న తపన, అవసరం కలుగుతాయి. ఆ గందరగోళ సన్నివేశానికి మూలకారణాలు రోజు రోజుకి కొత్తవి పుడుతున్నాయి. కాబట్టి కథ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంటుంది. మారుతున్న పరిస్థితుల్లో రచయిత మరింత బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తాడనీ నా ఆకాంక్ష, తను బాధ్యత గుర్తిరిగి, ప్రజల పక్షాన నిలిచిన రచయితలందరికీ ఈ అవార్డు చెందుతుందని నేను భావిస్తున్నాను.
ఈ అవార్డు నాకు బహుకరించ నిర్ణయించిన ‘రావిశాస్త్రి స్మారక సాహిత్య ట్రస్ట్’ సభ్యులకు నా హార్దిక ధన్యవాదాలు. దివంగత రచయిత వాసిరెడ్డి సీతాదేవి గారికి నా జోహార్లు. ఈ సభలో నన్నుద్దేశించి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన ఆత్మీయ అతిథులైన పెద్దలకు కృతజ్ఞతలు. వారి సూచనలు పాటించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా నా కథలను సహేతుకంగా విశ్లేషించిన ప్రియమిత్రునికి ధన్యవాదాలు.
(ఏప్రిల్ 24, 2007 నాడు ‘రావిశాస్త్రి స్మారక సాహిత్య అవార్డు – 2006′ స్వీకరిస్తున్న సందర్భంగా చేసిన ప్రసంగ వ్యాసం)