Jan2008
బాక్టీరియాకు “చిన్న తమ్ముళ్ళు”
ప్రకృతిలో రోగాల బారినపడని ప్రాణి ఏదీ ఉండదు. బాక్టీరియాకూడా జీవరాశిలో భాగమే కనక ఇది వాటికీ తప్పదు. పీత కష్టాలు పీతవి అన్నట్టుగా వీటిని వెంటాడేవికూడా లేకపోలేదు. దీనికర్థం ఏమిటంటే మనకు కనబడని రోగక్రిముల్లో బాక్టీరియాకాక మరికొన్నికూడా ఉన్నాయని. వాటివల్ల బాక్టీరియాకు రోగాలు వచ్చినట్టే మనకు కూడా జబ్బులు పట్టుకుంటూ ఉంటాయి. సంగతేమిటంటే మైక్రోస్కోప్‌లోంచి చూస్తేతప్ప కనబడని బాక్టీరియాకు వాటికన్నాకూడా సూక్ష్మమైన క్రిములవల్ల రోగాలు సంక్రమిస్తాయి. అలాంటివాటిని వైరస్‌లంటారు. బాక్టీరియావంటి ఏకకణజీవులూ, పుట్ట గొడుగులవంటి చిన్నా పెద్ద శిలీంధ్రాలూ, పెద్ద జంతువులూ, ఇలా విచక్షణ లేకుండా వైరస్‌లు అన్ని రకాల ప్రాణులకూ సోకుతూ, ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి.
అది ఒకరకమైన జన్యుపదార్థానికి నమూనావంటిది. అవకాశం దొరికినప్పుడల్లా తనలో ఉన్న జన్యుపదార్థాన్ని ఇతర ప్రాంతాల్లో వృద్ధి చెయ్యడానికి ప్రయత్నించడమే దాని “పని”. ఈమధ్య కంప్యూటర్ సాఫ్ ట్ వేర్‌కు వస్తున్న ఇలాంటి “అంటు రోగాలకు” కూడా ఇదే పేరును వాడుతున్నారు. ప్రస్తుతచర్చ మాత్రం జీవశాస్త్రానికి సంబంధించిన వైరస్‌ల గురించి. వైరస్‌ల ఆచూకీ గురించి 1880 ప్రాంతాల్లో జర్మనీ, రష్యా, హాలెండ్ మొదలైన దేశాల్లో పొగాకు మొక్కలకు పట్టిన తెగుళ్ళ మీద జరిపిన తొలి పరిశోధనల్లో లభించింది. మొదటి ప్రతిపాదనల్లో గందరగోళం ఏర్పడినా 1917 తరవాత వైరస్‌ల గురించిన అవగాహన పెరుగుతూ వచ్చింది. మనకు వచ్చే రకరకాల రోగాలకు కారణాలైన బాక్టీరియా, వైరస్‌లు రెండింటినీ నిరోధించి నాశనం చెయ్యగలిగిన మందుల గురించి ఇప్పటికీ ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మనం సామాన్యంగా అన్నిటినీ ఒకేరకమైన రోగక్రిములుగా పరిగణిస్తాం కాని వాటిమధ్య హస్తిమశకాంతరం అనిపించేంత తేడాలున్నాయి.సైజును బట్టి వైరస్‌లు బాక్టీరియా పరిమాణంలో సుమారు యాభయ్యోవంతు మాత్రమే ఉంటాయి. వైరస్‌తో పోలిస్తే జటిలమైన అంతర్ నిర్మాణం కలిగిన బాక్టీరియమ్ చుట్టూతా పల్చగా, రబ్బరులా సాగే పొర ఒకటి ఉంటుంది. అందులో సైటోప్లాజం అనబడే కణజలం నిండి ఉంటుంది. ఆ ద్రవంలో పునరుత్పత్తికి అవసరమైన డీఎన్‌ఏ, రైబోజోమ్ మొదలైన పదార్థాలన్నీ తేలుతూ ఉంటాయి. వైరస్ కణానికి ఇంత భేషజం ఉండదు. దానికి కాప్సిడ్ అనే ప్రోటీన్ “పూత” ఉంటుంది. లోపల డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. కొన్నిటికి “ముళ్ళ” లిపిడ్ కవచం ఉంటుంది. ఒక్కొక్క బాక్టీరియమ్‌లోనూ వేలకొద్దీ జన్యువులుంటాయి. వైరస్‌లలో సామాన్యంగా జన్యువుల సంఖ్య పదులూ, వందలకి మించదు. ఇవి స్వయంగా జీవప్రక్రియల్లో పాల్గొనవు కనక వీటి నిర్మాణంలో విశేషమేమీ ఉండదు.
వైరస్ అనేది జీవపదార్థానికీ, నిర్జీవ పదార్థానికీ మధ్యస్థంగా అనిపిస్తుంది. విడిగా దానికి జీవలక్షణాలేవీ ఉండవు. అది జీవరసాయనిక కణాల గొలుసువంటిది. తగిన అవకాశం దొరకనప్పుడు ఎన్నాళ్ళపాటైనా సరే ఎటువంటి చైతన్యమూ లేకుండా పడి ఉండే వైరస్ పోగు తనకు అనుకూలమైన జీవరసాయనిక వాతావరణంలోకి ప్రవేశించగానే “మేలుకుని” చకచకా పనులు మొదలుపెడుతుంది. ఈ ప్రక్రియలు తరుచుగా మనని రకరకాల జబ్బులకు గురిచేస్తూ ఉంటాయి.
పునరుత్పత్తి విషయంలో వైరస్‌కూ బాక్టీరియమ్‌కూ చాలా తేడా ఉంటుంది. స్వయంగా పునరుత్పత్తిని సాధించడానికి అవసరమైన సామగ్రి తమవద్ద ఉండదు కనక వైరస్‌లు అందుకోసం బైటి “వనరుల” మీద ఆధారపడతాయి. అక్కడి జీవపదార్థం స్థానంలో తమవి వృద్ధిచెందేట్టు చూస్తాయి. ఇవి ఇతర జీవకణాలలోకి తమ డీఎన్‌ఏను ప్రవేశపెట్టడానికని వాటిపై దాడి జరపడమో, వాటిలోకి ప్రవేశించడమో చేస్తాయి.
సూక్ష్మజీవుల ఆచూకీని తొలిగా కనిపెట్టిన లూయీ పాశ్చర్ పిచ్చికుక్కలవల్ల కలిగే రేబీస్ వంటి రోగాలు కలిగించేవి బాక్టీరియాకన్నా అతిసూక్ష్మమైనవి ఏవో ఉన్నట్టున్నాయని 1884లోనే అభిప్రాయపడ్డాడు. మిల్లిమీటర్ కన్నా 5 వేలరెట్లు చిన్నవైన వైరస్‌లను చూడాలంటే ఎలక్ర్టాన్ మైక్రోస్కోప్ ఒక్కటే సాధనం. వైరస్‌లలో చాలా రకాలున్నాయి. వైరస్‌ను వేరుచేసి స్ఫటికలక్షణాలు కలిగిన నిర్జీవపదార్థంగా నిలవచెయ్యవచ్చు. ఇవి జీవకణాలవంటివి కావుకనక వాటిపై బాహ్యప్రేరణల ప్రభావం ఉండదు. పరాన్నభుక్కుల్లాగా ఇతర జీవకణాల డీఎన్‌ఏను తమ పద్ధతిలోకి మార్చేసి ఇవి పరోక్షంగా పునరుత్పత్తి సాధిస్తాయి. జీవకణాలేవీ లేని పరిస్థితుల్లో వైరస్‌లు వృద్ధి చెందలేవు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగే మ్యుటేషన్లవల్లనే జీవపరిణామం కలుగుతూ ఉంటుంది.
లూయీ పాశ్చర్ (1822 1895)
ఉదాహరణకు జలుబునో, ఫ్లూ జ్వరాన్నో కలిగించే వైరస్ తన స్వభావాన్ని మ్యుటేషన్ల ద్వారా అతిత్వరగా మార్చేసుకుంటూ ఉంటుంది. ఈ మార్పులు మందుల ప్రభావాన్ని తప్పించుకునే పరిణామంలో రూపొందేవేకాని వైరస్ యొక్క “తెలివితేటల”వల్ల జరగవు. ఈ కారణంవల్లనే ఎంత సాంకేతిక ప్రగతి సాధించినా జలుబుకు మందు దొరకదు. జలుబుకు తాను మందివ్వలేననీ, మంచు కురుస్తున్నప్పుడు ఎవరైనా చొక్కా విప్పి ఈదురుగాలిలో పరిగెత్తి న్యుమోనియా తెచ్చుకుంటే కనక దాన్ని కుదర్చగలననీ చెప్పిన డాక్టర్ జోక్ ఒకటుంది.
కొన్ని రకాల వైరస్‌కు ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. ఉదాహరణకు మన పేగుల్లో ఉంటూ మనకు మేలుచేసే ఈ.కోలై వంటి బాక్టీరియాను కొన్ని వైరస్‌లు ధ్వంసం చెయ్యగలవు. ఇటువంటి బాక్టీరియోఫేజ్ వైరస్‌కు కాళ్ళవంటి ఆరు కొక్కేలుంటాయి. ఇవి
బాక్టీరియం మీద అనువైన స్థానంలో “వాలి”, దాని చర్మపు పొరను చీల్చిన తరవాత అందులోని డీఎన్‌ఏను వైరస్ నమూనాలోకి మార్చే “సందేశాలు” పంపబడతాయి. ఇవన్నీ వైరస్ యొక్క “శిరస్సు” నుంచి సరఫరా అవుతాయి. తన ఆజ్ఞలను అమలు చేయించటానికి వైరస్ వద్ద సామగ్రి ఏదీ ఉండదు. ఇందుకుగాను వైరస్ “గృహస్థు” యొక్క ఎన్‌జైములూ, తక్కిన పదార్థాలనే వాడుకుని తాను చేరిన “కొంపను కొల్లేరు” చేసేస్తుంది. త్వరలోనే బాక్టీరియమ్ తాలూకు డీఎన్‌ఏ యావత్తూ మారిపోయి వైరస్ తాలూకు “వృశ్చిక సంతానం” పెరగనారంభిస్తుంది. ఆ తరవాత బాక్టీరియం “పొట్ట పగిలి” చచ్చిపోతుంది. అందులోనుంచి బైటికొచ్చిన వైరస్ సంతానం ఇతర బాక్టీరియాపై దాడిని కొనసాగిస్తాయి. ఇదంతా కొన్ని గంటల, లేదా రోజుల వ్యవధిలో జరగవచ్చు. ప్రాణుల జీవకణాల మీద కూడా ఇటువంటి పద్ధతిలోనే దురాక్రమణ జరుగుతుంది.
వైరస్‌ల వివిధ ఆకృతులు
స్వరూపాన్నిబట్టీ, లక్షణాలను బట్టీ ఒక్కొక్క రకం జీవకణాన్నీ నాశనం చెయ్యగలిగిన ఒక్కొక్క రకం వైరస్ ఉంటుంది. కొన్ని మొక్కలకే పరిమితం. రేబీస్ క్షీరదాలకు మాత్రమే సోకుతుంది. హెపటైటిస్ వైరస్ మనుషుల కాలేయపు కణాల మీదా, పోలియో వైరస్ వెన్నుపాము కణాల మీదా మాత్రమే దాడిచేస్తాయి. ఎయిడ్స్ కలిగించే వైరస్ మనుషులకు మాత్రమే ప్రత్యేకం. కేన్సర్ వైరస్‌లలో అంతులేకుండా కణవిభజన చెయ్యగలిగిన జన్యుపదార్థం ఉంటుంది. ఇది సోకిన స్థలంలో ఉన్న మన శరీరకణాలకు ఇదే స్వభావం అబ్బుతుంది కనక అవి అప్పుడప్పుడూ కణితి రూపంలో పెరిగి ప్రాణానికి ముప్పుతెస్తాయి.
ఏదైనా కణానికి వైరస్ తగులుకోగానే మన శరీరాలకు సహజంగా ఉండే రోగనిరోధక వ్యవస్థ స్పందనలవల్ల వైరస్ సోకని జీవకణాల్లో ప్రతిక్రియలు మొదలౌతాయి. వైరస్‌ను చుట్టుముట్టి బంధించగలిగే ఏంటీబాడీస్ తయారవుతాయి. వైరస్‌లు కూడా మ్యుటేషన్ల ద్వారా వీటిని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. బాక్టీరియాను నాశనం చెయ్యగలిగే ఏంటీ బయోటిక్ మందులు వైరస్‌ల మీద పనిచెయ్యవు. వీటికి వేక్సీన్‌లూ, టీకాలూ, ఏంటీ వైరల్ మందులూ వేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండే జీవకణాలకు హాని కలిగించకుండా వైరస్‌ను మాత్రమే నాశనం చెయ్యగలిగిన మందుల తయారీలో చాలా ఇబ్బందులున్నాయి.
వైరస్ అనేది జీవ, నిర్జీవ పదార్థాలకు మధ్యస్థంగా ఉంటుంది. ప్రాణుల లక్షణాలన్నీ కేవలం జీవరసాయనిక ప్రక్రియలు మాత్రమేనని నమ్మనివారికి వైరస్‌ల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. వైరస్ అనేది జీవపదార్థమా కాదా అనే చర్చ ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్నదే. కొన్ని విషయాల్లో అది రోబట్‌లాగా పని చేస్తుంది. అంతేకాదు; అది కంప్యూటర్ల సహాయంతో మరిన్ని రోబట్లను తయారుచెయ్యగలిగిన రోబట్‌లాగా ప్రవర్తిస్తుంది. వైరస్‌ల ఉనికి అవి క్రితంసారి “ఆశ్రయం పొంది” పెరిగిన జీవకణమే. బైటికొచ్చిన వైరస్ కణాలన్నీ మరొక స్థావరం దొరికేదాకా అచేతనంగా ఉండిపోతాయి. ఇలా అవకాశమున్నప్పుడల్లా “జీవిస్తూ”, తక్కిన సమయాల్లో నిర్జీవంగా పడిఉండే వైరస్ నిజంగా జీవ, నిర్జీవపదార్థాల మధ్య సరిహద్దు వంటిది.
కొన్నిరకాల వైరస్‌లవల్ల రోగలక్షణాలేవీ కలగవు. నిజానికి మనకు తెలిసిన దాదాపు 1000 1500 రకాలలో రోగాలు తెప్పించేవి 250 మాత్రమే. వీటిలో \కూడా మనుషులను బాధించేవి సుమారు వందరకాలు మాత్రమే ఉంటాయి. గాలితో వచ్చే జలుబూ, ఆటలమ్మ, జీర్ణాశయం ద్వారా కలిగే పోలియో వగైరాలూ, చర్మం స్పర్శ ద్వారా అంటుకునే సామాన్యమైన హెర్పిస్ (సర్పి) వంటివీ, రక్తం ద్వారా, లైంగిక సంబంధాలద్వారా సోకే ఎచ్‌ఐవీవంటివీ, జననేంద్రియాలకు సంక్రమించే హెర్పిస్ (దీనికి మందు లేదు) ఇలా వేరువేరు వైరస్‌లున్నాయి. పొంగు, విరోచనాలు, గవదబిళ్ళల వాపు వగైరాలు రావడంకూడా వైరస్‌ల చలవే.
మెదడువాపుకు కారణమైన వైరస్ ముందర ఏ పక్షుల్లోనో ఉంటుంది. వాటిని కుట్టిన దోమల లాలాజలంలో ఆ ప్రాణాంతకమైన వైరస్ పెరిగి, ఆ తరవాత వాటి కాటుద్వారా ఇతర జంతువులకూ, మనుషులకూ కూడా సోకుతుంది. శరీరంలో ఒకచోట చేరిన వైరస్‌లు రక్తప్రసరణం, లేదా నాడీవ్యవస్థ ద్వారా ఇతర ప్రాంతాలకుకూడా విస్తరించగలవు.
మామూలు జలుబువంటివి ప్రమాదకరం కాకపోయినా చాలా నీరసపెడతాయి. వీటి కారణంగా ఎంతమంది ఉద్యోగులు సెలవలు పెడతారో, అందువల్ల కంపెనీలకు ఎన్ని కోట్ల డాలర్లు నష్టం వస్తుందో పారిశ్రామిక దేశాల్లో లెక్కలు కడుతూంటారు. జలుబుచేసినవారు తరుచుగా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం, తమ ఊపిరిద్వారా వైరస్ తాము ఉన్న గదుల్లో పేరుకోకుండా గాలి తగిలేట్టుగా చూసుకోవడం మొదలైన మామూలు జాగ్రత్తలు పాటించినట్టయితే సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి.
ఎచ్‌ఐవీ వైరస్ నిర్మాణం
ఈ రోజుల్లో వైరస్‌లు తెచ్చే తక్కిన రోగాలన్నీ ఒకఎత్తూ, ఎయిడ్స్ ఒక ఎత్తూ అనిపించడంలో ఆశ్చర్యంలేదు. అక్వయిర్‌డ్ ఇమ్యూనో డిఫిషెన్సీ సిండ్రోమ్ అనే పేరుగల ఈ రుగ్మత వ్యాధి కాకపోయినా, శరీరాన్ని ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉంచే నిరోధకవ్యవస్థను ధ్వంసం చేసేస్తుంది. దీనికి తగిన మందు లేదేమోననే భయంవల్ల ప్రజల్లో సహజంగా ఎంతో ఆందోళన కలుగుతోంది.
మన రోగనిరోధక వ్యవస్థలో రక్తంలో ఉండే తెల్లకణాలు అతి సమర్థవంతమయినవి. ఎయిడ్స్ వైరస్ వీటిలో టీ4 అనే లింఫోసైట్ కణాలపై దాడిచేస్తుంది. రోగాలని నిరోధించలేని పరిస్థితిలో చాలామంది ఒకరకం న్యుమోనియావల్లనో, కొన్ని రకాల కేన్సర్‌లవల్లనో తీవ్రంగా జబ్బుపడి ప్రాణాపాయానికి లోనవుతారు. నాడీమండలం దెబ్బతినడం, విపరీతంగా బరువు తగ్గిపోవడం మొదలైన లక్షణాలన్నీ చివరిదశలో కనబడతాయి. ఈ రోగపు లక్షణాలు పూర్తిగా కనబడడానికి పదేళ్ళకు పైగాకూడా పట్టవచ్చు. లైంగిక సంబంధంతోనో, కలుషిత రక్తం ద్వారానో వచ్చే ఈ సమస్య తల్లి పాలనుంచి శిశువులకు కూడా సోకుతుంది. ప్రస్తుతం వాడకంలో ఉన్న మందులు రోగుల ఆయుష్షును పెంచగలవుకాని పూర్తి చికిత్సను సాధించలేకుండా ఉన్నాయి. జీవనశైలిని నియంత్రించుకుని ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడడమే ముఖ్యమని భావిస్తున్నారు.
జీవకణాలలోకి చేరని వైరస్‌లు కొన్ని గంటలకన్నా బతకలేవు. అందువల్లనే కొన్ని రోగాలు అకస్మాత్తుగా కొంతమందికి వచ్చి, వారంతా చనిపోగానే ఆ వైరస్‌కు “నిలువ నీడ లేకపోవటంతో” అంత అకస్మాత్తుగానూ అంతర్ధానమైపోతూ ఉంటాయి. వీటిలో చాలామటుకు కొన్ని అడవి జంతువుల్లోనూ, కొందరు మనుషుల శరీరాల్లోనూ నిద్రాణంగా ఉంటాయి. ఈ లోపల అవి కొన్ని మ్యుటేషన్లకు కూడా లోనయి, జన్యుపరమైన మార్పులతో ఉన్నట్టుండి మనకు ప్రమాదకరమైన రూపాల్లో విజృంభించవచ్చు. ఉదాహరణకు 1959లో ఏదో వింతరోగంతో చనిపోయిన ఒక బ్రిటిష్ నావికుడు ఎయిడ్స్ వ్యాధికి బలైనట్టుగా ఆధునిక పరిశోధకులు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే దాని వైరస్ దాదాపు 20 ఏళ్ళ పాటు నిద్రాణంగా ఉందని అనుకోవాలి.
కొత్త రోగాలన్నీ ఎక్కువగా ఆఫ్రికా, ఆసియావంటి వెనకపడ్డ ప్రాంతాల్లోనే మొదలై విమానాల ద్వారా పశ్చిమ దేశాలకు దిగుమతి అవుతాయని అక్కడి శాస్త్రవేత్తల అనుమానం. ఇందుకు కారణం విదేశీ యాత్రికులు మాత్రమే కాదనీ, విమానాల్లోని గాలికూడా కలుషితం అయి, రోగక్రిములను మోసుకొస్తుందనీ వారు భయపడుతూ ఉంటారు. వీటిని బలపరిచే వార్తలూ ఉన్నాయి. ఉదాహరణకు ఆసియాలోనూ, మనదేశంలోనూ మంచినీరూ, మరుగుదొడ్ల పరిశుభ్రతా ప్రాథమికస్థాయిలో కూడా అందుబాటులో లేని ప్రాంతాలున్నాయనీ, ఈ విషయంలో మనవాళ్ళ పరిస్థితి పేద ఆఫ్రికన్ దేశాలకన్నా కూడా కనాకష్టంగా ఉందనీ ఈ మధ్యనే ఒక ప్రకటన వెలువడింది. మన రాజకీయనాయకులు తమ ప్రభుత్వం పడిపోయేలోగా హడావిడిగా డబ్బు వెనకేసుకోవడంలో చూపించినంత ఉత్సాహం “అలగా జనం” గురించి ఎందుకు చూపుతారు?
భూమిమీద వైరస్‌లు మొదట ఎలా ఆవిర్భవించాయనేదాన్ని గురించిన కొన్ని ప్రతిపాదనలున్నాయి. అతిప్రాచీనమైన పరాన్నభుక్కులవంటి కొన్ని కణాలనుంచి ఇవి రూపొందాయనీ, జీవపదార్థపు పునరుత్పత్తికీ, ఇతర ప్రాంతాలకు ప్రసారం కావటానికీ అవసరమైన లక్షణాలు మాత్రమే వీటిలో మిగిలాయనీ కొందరు అంటారు. అలా కాదనీ, ఇవి మామూలు జీవకణాలనుంచి కనీస అవసరాలకు తగిన పదార్థాలతో బైటపడ్డాయని మరికొందరి అభిప్రాయం. ప్రోటీన్లనూ, ఎన్‌జైములనూ తయారు చెయ్యడానికి సూచనలు అందించగలిగి, పునరుత్పత్తిని సాధించే ఆర్‌ఎన్‌ఏ కణాలనుంచి వైరస్‌లు పుట్టుకొచ్చాయనే సిద్ధాంతమూ ఉంది. వైరస్‌లు ఎప్పటికప్పుడు మ్యుటేషన్లద్వారా మార్పులు సంతరించుకుంటూ, జీవపరిణామసిద్ధాంతం ప్రకారం ప్రమాదాలనుంచి తప్పించుకుంటూ ఉంటాయి. వైరస్‌లుకూడా బాక్టీరియాలాగే తాము ఆక్రమించిన ప్రాణి శరీరం చచ్చిపోకుండా చూస్తాయి. అందుకు తగినవిధంగా వాటిలో జన్యుపరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎయిడ్స్ వైరస్ కూడా కాలక్రమేణా మనుషులకు నిరపాయమైనదిగా మారిపోవచ్చనే ఆశ ఉంది. ఎటొచ్చీ ఇది జరగడానికి శతాబ్దాలు పట్టినా పట్టవచ్చు.
వైరస్‌లలో జరిగే ప్రక్రియలన్నీ జీవకణాలను పోలినవే కనక వైరస్‌ల గురించిన పరిశోధనలవల్ల శాస్త్రవేత్తలకు ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. తద్వారా వైరస్‌లు తెచ్చిపెట్టే రోగాలకు మందులు కనిపెట్టడంకూడా వీలవుతోంది. వాటి శక్తిసామర్య్థాలనుబట్టి వైరస్‌లను వివిధ ప్రోటీన్ల తయారీకి పనిముట్లుగా వాడుకుని పరిశోధనలకూ, పరిశ్రమలకూ అవసరమయే కృత్రిమపదార్థాలను తయారు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది జన్యుపరమైన చికిత్సావిధానం. ఈ “జీన్ థిరపీ” ముందు కాలంలో ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది. ప్రస్తుతం పరిశోధనలకే పరిమితమైన ఈ ప్రక్రియల్లో ట్యూమర్లనూ, ఇతర అవాంఛనీయ లక్షణాలు కలిగిన జన్యువులనూ జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా తొలగించే ప్రయత్నాలు మొదలయాయి. పంటతెగుళ్ళ నివారణ మొదలైన ఇతర విషయాల్లో కూడా వీటి ఉపయోగాలున్నాయి.
ప్రపంచంలో మనకే మాత్రమూ కనబడని మరొక సూక్ష్మప్రపంచం ఉండడమే కాక అది మన జీవితాలను రకరకాలుగా నియంత్రించడం ఆశ్చర్యం కలిగించే విషయం.
2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Rakesh Jan 18, 2008 1
బాక్టీరియాలపై తాజా వార్త:
http://www.nytimes.com/2008/01/15/health/15infe.html?em&ex=1200805200&en=3c164b669d549239&ei=5087
New Bacteria Strain Is Striking Gay Men:
By LAWRENCE K. ALTMAN
Published: January 15, 2008
A new, highly drug-resistant strain of the “flesh-eating” MRSA bacteria is being spread among gay men in San Francisco and Boston, researchers reported on Monday.
Rakesh Jan 19, 2008 2
దోమల నివారణకై జరుగుతున్న పరిశోధనగురించి “ఆంధ్రజ్యోతి” ప్రచురించిన వార్త:
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jan/18main37
కుట్టిందో.. చచ్చిందే!!
టక్సన్, జనవరి 18: దోమలతో సమస్యలు అన్నీ ఇన్నీ అని ఎలా చెప్పగలం.. అవి సృష్టించే అరోగ్య సమస్యల సం గతి సరే సరి. వీటి బారినుంచి రక్షించుకునేందుకు మనం కేటాయిస్తున్న నెలవారీ బడ్జెట్‌కూడా వందల్లోనే ఉంటుం ది. కీటకనాశనులకూ లొంగకుండా నిరోధక శక్తిని పెంచుకుంటున్న ఈ దోమలకు చెక్ చెప్పేందుకు టక్సన్ లోని అరిజోనా యూనివర్సిటీ పరిశోధకులు నడుం కట్టా రు.
అరిజోనా క్యాన్సర్ సెంటర్ పరిశోధకుడు రోగర్ ఎల్. మీస్ ఫెల్డ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ దిశగా కొంత పురోగతి సాధించింది. వీరి ప్రయత్నాలు సఫలమై తే.. ఇక పై దోమ మనల్ని కుట్టిందో.. చచ్చిందన్న మాటే..!! ఈ పరిశోధనల్లో భాగంగా ముందుగా వీరు దోమల జీర్ణ క్రియను అధ్యయనం చేశారు. వీరు పరిశోధనలకు ఎంచు కున్న అడిస్ ఈజిప్టి అనే దోమలో మానవ రక్తం జీర్ణప్ర క్రియలో విష తుల్యమైన నైట్రోజన్ వాయువు వెలువడ డాన్ని పరిశోధకులు గుర్తించారు. దోమలు తప్పని సరిగా దీన్ని విసర్జించాల్సిందే. లేదంటే.. అవి గుడ్లు కూడా పెట్టలే వు.. క్రమంగా నీరసించి చనిపోతాయి.
మానవులకు ఎ లాంటి హాని చేయకుండా, దోమల్లో నైట్రోజన్ విసర్జన ప్రక్రియను అడ్డుకునే పదార్ధాన్ని గుర్తించేందుకు మీస్‌ఫెల్డ్ ఆయన సహచరులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి కొన్ని గుర్తించినా, దోమలతో పాటు, మనుషులకు కొన్ని ఇబ్బం దులు వచ్చే ప్రమాదం ఉండడంతో వాటిని పక్కనబెట్టారు. ఒక్కసారి ఇలాంటి పదార్ధాన్ని గుర్తించగలిగితే, వాటిని కీట కనాశకాలుగా మార్చి దోమల ఆవాస ప్రాంతాల్లో పిచికారి చేయవచ్చు.
అప్పుడు దోమలతో పాటు, వాటి సంతతితో పాటే అవి వ్యాప్తి చేసే వ్యాధులూ తగ్గిపోతాయి. ఇదే కాదు.. దోమల నివారణ కోసం నోటి ద్వారా తీసు కునే కీటక నాశక టాబ్లెట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ టా బ్లెట్లు దోమలను చంపేందుకు మనం తీసుకోవాల్సి ఉం టుంది. ఇవేమీ వ్యాక్సిన్లు కావు. ఈ టాబ్లెట్లు వేసుకున్న వా రిని ఆ తరువాత వ్యాధికారక దోమలు కుడితే, వారు కూ డా జబ్బు పడతారు. కానీ, వారి శరీరంలోని కీటకనాశి ని రక్తంతోపాటుగా దోమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే విషతుల్యంగా మారి మరొకరిని కుట్టేలోగానే దోమను చం పేస్తుంది.
‘ఈ టాబ్లెట్లు ఉపయోగించిన ప్రజలందరూ అప్పుడు దోమల నివారణ సాధనాలుగా మారిపోతారు.. సంప్రదాయ కీటకనాశనులు ఇప్పుడు దోమలను నాశనం చేసే పరిస్థితి లేదు.. కీటకనాశనుల ప్రభావంతోపాటు దోమలూ వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తరకం ఆయుధాల అవసరం ఎంతైనా ఉంద ని’ మీస్‌ఫెల్డ్ చెప్పారు. దోమలు వ్యాప్తిచేసే డెంగ్యూ, మలే రియా, ఎల్లోఫీవర్ వ్యాధులతో ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే, బోధకాలు మరెందరినో పాక్షిక అంగవికలురుగా మార్చేస్తుంది. వీరి ప్రయత్నాలు సఫలం అయితే కానీ, ఈ వ్యాధులను పూర్తి గా నివారించడం సాధ్యం కాదు.