వితంతువు

చలికాలం. ఈ వూళ్ళో అదేమోకాని చలి ఎక్కువ. మంగమ్మ నా శాలువా కప్పుకొని నిద్రపోతోందనుకుంటా, మొగిణ్ని వెచ్చగా కావలించుకొని. నాకు ఇక్కడ చలి. నిద్రరాదు. కప్పుకోడానికా యేమీ లేదు. ఈ వెచ్చని  పొయ్యి దగ్గర కూచుంటే కొంచం వణుకు నయం. కాని నేల ఇంకా ఆరలేదు- యెక్కడో ఇంకా చలిదేశాలు వుంటాయట. అక్కడెట్లా వుంటుందో?- చిన్నప్పుడు నాన్న ‘సిండరిల్లా’ కథ చెప్పేవాడు. అట్లా వుంది నా స్థితి యిప్పుడు. ఐతే సిండరిల్లా చిన్నపిల్ల…. నాన్న బతికి వున్నప్పుడు ఎంత బావుండేది. నాన్న యిప్పుడు నన్ను యీ అర్ధరాత్రి ఈ పొయ్యి దగ్గర వొంటరిగా కూచోడం చూస్తే? యెంత యేడుస్తాడో? ఎన్నడన్నా నేనిట్లా అనాధనైపోతానని అనుకొని వుంటాడా? వొళ్ళో నన్ను కూచోబెట్టుకొని నా తల దువ్వుతో, చంపలు తాకుతో, “మా అమ్మ అంత అందమయింది లేదు. మా అమ్మని కింద కాలు పెట్టనీని మొగిణ్ణి తీసుకొస్తా” అనేవాడు. అప్పుడు ఈ వెంకట్రావుగారూ, వాళ్ళూ నన్ను వొళ్ళల్లో కూచోపెట్టుకొని మిఠాయి పొట్లాలిచ్చి నా నోట్లోంచి చిన్న పాట వొస్తే చాలు,ఆహా ఆహా అని ఒకటే ఆనందించేవాళ్ళు. పదేళ్ళు కాలేదు ఇంకా. మొన్న అన్నయ్యతో మాట్లాడుతో ఆయనే ఆ వెంకట్రావుగారే మొహం తిప్పేశాడు నన్ను చూసి.

అదిగో-పిల్ల లేచి ఏడుస్తోంది. మంగమ్మ లేవదేం? నేనైతే అట్లా ఏడవనిస్తానా? పొద్దస్తమానం ముద్దాడుతుంది పిల్లని. ప్రేమ లేకపోలేదు.అదుగో లేచింది మంగమ్మ- పిల్లని కొట్టింది- ఏడుస్తోంది పిల్ల. పిల్లల్ని కొట్టడానికి వీళ్ళకి చేతులెట్లా వొస్తాయో? సాయంత్రమేగా అట్లా ముద్దెట్టుకుంది. ఆ నోటితోనేగా ఆ తిట్లన్నీ – నాకే బిడ్డ వుంటేనా తెల్లార్లూ నా చేతుల్లో ఎత్తుకుని వూయిస్తో, ఒక్క నిమిషం రెప్పవాల్చక జోల పాడుతా. ఇట్లా చేతుల్లో నున్నని, మెత్తని వెచ్చని అబ్భాయిని పట్టుకొని రొమ్ము నోట్లో పెట్టి అదుముకుంటే… ఎంత బావుంటుంది! అందులో నా రొమ్ములు ఇంత గుండ్రంగా,చిన్నగా,నున్నగా వుంటాయి. అబ్బాయి చిన్న లేత గులాబీచేతులు యెంత బావుంటాయో _ ఇప్పుడీ మనోవేదనతో నిద్రరావడం లేదు గానీ, అప్పుడా పరమానందంలో రాదు…. అదుగో పోలీసువాళ్ళు గావును ఆ యీలలు, ఈ వీధికే వొస్తున్నారు. వీళ్ళేట కన్నాలు వేయించేది. ఎందుకో ఊరికె అట్లా వూత్తారు? దొంగలు భయపడ్డానికేమో….

మంగమ్మకి పిల్ల వుంది. కొట్టే మంగమ్మకి, చీదరించుకునే మంగమ్మకి. ఆ పిల్ల ఏడుస్తూనే వుంది.యేం? పిల్లకి పాలివ్వాలని వుండదూ? ఆ చిన్న తడుముకునే నోటికి, పిల్ల గావును! ఉష్ పో- నాకు పిల్లలుండకూడదూ? ఆయన బతికి వుంటేనా, నాకీపాటికి ముగ్గురు నలుగురు పిల్లలుండేవాళ్ళే. నేను గొడ్రాల్నయ్యేదాన్ని కాదు. బిడ్డల సంగతి తలుచుకుంటేనే నా కడుపులో ఇట్లా కలియబెట్టినట్లుందే నాకు పిల్లలుండకపోయేవాళ్ళా! చీదరించుకునే ఇట్లాంటివాళ్ళకే వుండగా లేంది? మొన్న వాడు జుట్టుపీకితే ఎందుకు పుట్టావురా వెధవా అంది మంగమ్మ. ఇంకోసారి “చచ్చావన్నాకాదు, పీడ వదిలిపోను” అంది. నాజుట్టు అట్లాంటి చిన్న చేతులతో ప్రతి వెంట్రికా నెత్తురు కారేటట్టు పీకించుకుంటాను.

ఆ మంగలాడు గొరగడం కంటె నయం కాదూ?—– నా వెంట్రికలు తీసేస్తారుట. తీసెయ్యనీ. చీదర వొదులుతుంది. వుండి యెవరికని? గొరిగేటప్పుడు మంట పుడుతుందిగావును. మరి మొగాళ్ళు ఏడవరే? మంట వుండదు. కాని గొరగడం తలుచుకుంటే యిప్పుడే భయం పుడుతోంది. భయమే కాదు—గొరిగేప్పుడు మంగలాడు మెడమీద చెయ్యేస్తాడు గావును! మొన్న అన్నయ్యమీద చెయ్యివేశాడు. వొళ్లు ఝల్లుమనదూ? పెల్లిలో తాళీ కట్టేప్పుడు ఆయన చిటికెన వేలు తగిలేప్పటికి వొళ్లు  పులకరించింది. మీద చన్నీళ్లు పోసుకున్నట్టు… మొన్న లక్ష్మికాంతం తాళపు చెవిలిస్తో అజాగ్రత్తగా అతని వేళ్లు నా చేతికి తాకనిచ్చేటప్పటికే అన్నయ్య కళ్ళెర్ర చేశాడు. అదివరకు నేనేమీ అనుకోలేదు కాని, అన్నయ్య పడే అనుమానాన్ని చూసి, నాకు లక్ష్మీకాంతమంటే సరదా పుట్టింది… నన్ను తన యింటో  పెట్టుకున్న కాలాగ్నిమల్లే చూస్తాడను కుంటా అన్నయ్య. లక్ష్మీకాంతాన్ని చూసి కళ్ళెర్ర చేశాడు. కాని మంగలాడు నా మెడ మీద చేయ్యేస్తే యామంటాడో అన్నయ్య?

ఈ పిల్లి బాగా మరిగింది పాలు తాగడం. ఈవాళ పాలు అందడం లేదు. గోల పెడుతుంది. ఆకలి, దానికి, పాపం నాకుమల్లేనే నిద్రపట్టదు. పోనీ యెలికల్ని పట్టరాదూ?… నా శాలువ కప్పుకొని మొగుడి పక్కన మంగమ్మ నిద్రపోతున్నట్టంది మళ్ళీ. తెల్లార్లూ ఆ గదిలో ఏం చేస్తారో తలుపులు మూసికుని? ఆయనే బతికివుంటే నేనేం చేస్తో వుండేదాన్నీ? నన్నిట్లా పొయ్యి దగ్గర కూచోనిచ్చేవాడా! చిన్నవాడే!ఎట్లా ఆ రోగం వచ్చిందో కాని? కార్య మయినా అయితే బావుండేది. అంతా తెలిసేది. ఏం చేస్తారో తెలుసు.కాని ఎట్లా చేస్తారో, అప్పుడు వొళ్ళు ఎట్లా వుంటుందో తెలియాలని వుంది. కొందరు ఏడుస్తారు, ఎవర్నన్నా అడగాలని వుంటుంది. సిగ్గు,భయం, చెప్పరనుకుంటా. వాళ్ళకీ సిగ్గే. అప్పుడు సిగ్గు వుండదేమో! మాట్లాడ్డం మాత్రం సిగ్గు. నీకెందుకంటారు.! ఒకవేళ ఒక బిడ్డకూడా వుండేదేమో? ఆయన కళ్లు బావుండేవి. ఆ కళ్ళే వొచ్చేవి అబ్బాయికి. నా చిన్న ఎర్రని నోరు వొచ్చేది. ఎంత బావుండేవాడని! అప్పుడు యీ వొదిన్ని యామైనా లెఖ్కచేసేదాన్నా మా నాన్న యిచ్చిన శాలువ లాక్కొని మంగమ్మ కియ్యనిచ్చేదాన్నా! అబ్బాయికి కావాలనేదాన్ని. ఇప్పుడు తెల్లారకట్టే లేచి మంగమ్మ కొడుక్కి వేణ్ణీళ్ళు కాచాలంటే ఎంతోకష్టంగా వుంటుంది. అప్పుడు నా బాబుకోసం యెన్ని నీళ్లన్నా సంతోషంతో కాచేదాన్ని కదూ! ఇప్పుడైనా పుట్టకూడదూ! మొగుడు లేకుండా కనే పద్ధతి లేదూ? చెట్లకి కాయలు కాయటంలా? పోనీ ఒకబ్బాయి యొక్కడైనా దొరికితే బావుండును! అట్లా కాదు. కాదు. నాలోంచే రావాలి. నా అబ్బాయి కోసం… అట్లా కాకపోతే మంగమ్మ కొడుకుమీద నాకు ప్రేమ వుండకూడదూ?… నిద్ర వొస్తోంది కొంచంగా పడుకుంటే రాదు మల్లీ చలి.

నా ఖర్మంట! ఏదో పాపం చేశాను పూర్వజన్మలో ఎవరి పిల్లల్నో చంపాననుకుంటా. వొచ్చే జన్మలోనైనా పిల్లలుంటారేమో! వొచ్చే జన్మంలో పిల్లలుండడానికి ఇప్పుడేం చెయ్యాలో? శాస్త్రులుగారిని అడగనా! వొదినకి తెలిస్తే యింకేమన్నా వుందా? పిల్లలుండాలనుకోటం తప్పా! పోనీ వచ్చే జన్మంలో వుండాలనుకోడమూ తప్పే ఆ ముసలి ముత్తైద యాభై ఏళ్లది వున్న కొడుకుని, అవుత్యం చేయించి చేతులార చంపుకుంది. ఆమె వొచ్చి పిల్లలు లేరని ఏడిస్తే అందరూ వోదారుస్తారు. పద్దెనిమిది ఏళ్లు లేవు; నేను పాలిచ్చుకోడానికి ముద్దు చెయ్యడానికి, ఆడికోడానికి పిల్ల కావాలంటే ఎందుకు తిట్టడం? సిగ్గు మాలిన ముండ  దీన్నింటో వుంచకూడదంది వొదిన. బయటికనకూడదు. ఇట్లా రాత్రులాలోచించాలి. మల్లీ గస్తీ యీలలు… ఈ పోలీసువాళ్లేట దొంగతనాలు చేయించేది… ఒక్క పిల్ల వుంటే చాలు ఆడపిల్ల ఐనా సరే. వొద్దు వొద్దు ఆడపిల్ల వొద్దు. నాకు వెధవముండే పుడుతుంది. నాకుమల్లే యిట్లా యాడవాలి… నాకు నిద్రవొస్తోంది. కాని యీ చలిలో యెట్లా నిద్రపడుతోంది. శాలువుంటే బావుండును. హాయిగా మంగమ్మ కప్పుకొని నిద్రపోతోంది. నేను మాత్రమిట్లా ఎందుకని బాధపడలో… మరి చేసుకున్న కర్మ ప్రకారం యిందరు ఆడవాళ్ళు బిడ్డలు లేకుండా ఇట్లాంటి విచారంతో చస్తోవుంటే, మొగవాళ్ళ కొక్కరికీ ఇట్లాంటి కర్మ పట్టదేం? పెళ్లాం పోతే పెళ్లాం తయారవుతుంది. అందరూ పాపాలు చేసేవారేగా! ఏదో మేముమాత్రం చేసే పాపం వొకటుండాలి. వెధవలయ్యే పాపం. మళ్ళీ యిక పెళ్ళిగాని పాపం. మళ్ళీ తక్కిన వెధవలు చెయ్యరది. హిందూ విధవలే. మొన్న శాస్త్రులుగారంటున్నారు. ఈ వ్రతాలు,పూజలూ, యాత్రలూ చెయ్యడం వల్ల స్వర్గం వొస్తుందట. మరి ఆ స్వర్గం కోసం అందరూ వెధవముండలు కారాదూ? ఎక్కడో వెధవ ముండలకి మళ్ళీ పెళ్ళి చేస్తున్నారట! అప్పుడు మళ్ళీ జుట్టు పెంచుకుంటారా! వెధవముండల్ని చేసుకునే వాళ్లెవరుంటారో!

కర్మమెట్లానైతేనేం. నాకు పిల్లలు కావాలి. ఒకవేళ వెధవనై కూడా బిడ్డని కనే రాత వుందేమో! ఆ బిడ్డను ఈ జన్మంలో కని పెంచే పుణ్యమో, పాపమో పూర్వజన్మంలో చేశానేమో? అప్పుడు మరి వీళ్లందరూ యామంటారు? వొదిన చంపేస్తుంది. అన్నయ్య తరిమేస్తాడు. నా కర్మప్రకారం అట్లా రాసివుంది నేనేం చెయ్యనంటే, వొప్పుకుంటారా? నాకు ఆ పెనిమిటికే వివాహం కావాలనీ, ఆయన చావాలనీ. నేనిట్లా కావాలనీ, అన్నీ రాసి వున్నాయట. నేను పిల్లని కనాలనే, రాసి వుండకూడదూ? వీళ్లు చూసి వొచ్చారా? ఇంక నా మీద కోపమెందుకూ? డబ్బుందని ఆ రోగిష్టి మొగిణ్ణి కట్టడం నా కర్మం. బిడ్డని కంటే నన్ను వెళ్ళకొట్టడం వీల్ల కర్మం. ఇట్లా ఆడవాళ్ళందరూ యాడవడం యీ దేశం కర్మం. పోనీ జాలన్నా చూపించరు. యెవరన్నా వాళ్ళ పూర్వజన్మ దుష్కృతంకొద్దీ, గుడ్డివాళ్లయితే, కుంటివాళ్లయితే, జాలిపడతారు. నాకు ఆ దుష్కృతం… కాదు… సుకృతం కొద్దీ బిడ్డపుడితే జాలిచూపరు.అట్లా  రాసివుండంది నాకు మాత్రం బిడ్డ పుడుతుందా యేం? వెధవనైతేనే జాలిలేదే వీళ్లకి పోనీ బిడ్డమీదన్నా జాలి వుండదు. మళ్ళీ జాలి కలవాళ్ళే. నాకు మాత్రం చూపరు. ఎందుకో… యీ యెలికలు నన్నుకూడా కరవ్వుగదా? ఒకవేళ ఆ కిటికీలోంచి దొంగొస్తాడేమో… మొన్న ఆవు పెయ్య యెంత కష్టపడ్డది! అదిచూసి వెంటనే యెద్దును తెప్పించారు. యెందుకూ! వీళ్లకి పాలూ దూడలూ కావాలి గనక. మరి నాకు పిల్లలు కావాలి. కర్మం ప్రకారం మొగుడు పోయినాడు. కర్మాన్ని జయించి నేను ఆ సౌఖ్యం సంపాయిస్తానంటే వీళ్లకెందుకో కోపం!.. వొదిన పుట్టింటి కెల్లినప్పుడు అన్నయ్య సుబ్రహ్మణ్యంగారితో అంటున్నాడు సిగ్గులేకుండా, భార్యలేకుండా, వంటరిగా వుండడం కష్టమని! నాకు కూడా అట్లానే వుందని పైకి అంటే ఆకాశం ముక్కలై కిందపడ్డట్టు చూస్తారు… చలి యెక్కువౌతోంది. పొయ్యి కూడా చల్లబడ్డది… అందరూ అన్నం తింటారు. కొందరికి అన్నం తినకుండా వుండే కర్మం కాలదు. అట్లా కాలినవాళ్లు, ఆ కర్మాన్ని జయించి అన్నం దొరికించికొని తింటే, ఎవరూ ఏమీ అనరు. కాని కొందరికి యిట్లా కర్మలు కాలుతుంది. ఈ బాధ వోర్చుకోవలసిందే గాని, తీర్చుకోవలసింది కాదు… మృగాలకి ఇట్లాంటి కర్మం పట్టదు… అయ్యో ! ఆవునో, కోడినో ఐ ఎందుకు పుట్టలేదో నేను; మల్లీ మనుష్యజన్మ గొప్పది అంటారు. మనుష్యజన్మం గొప్పదేకాని వితంతుజన్మం కాదు. ఎవరూ ఒక్కరూ, హృదయం దగ్గరిగా చేర్చుకోడానికి లేకపోయింతరవాత బతకడమెందుకు! పిల్లలులేని వితంతుజన్మం ఏమవసరమో ఈశ్వరుడుకి! ఏమిటో బాధ,ఆశ,కల- నా లోపల. మొగవాడివల్ల తీరుతుంది గావును! ఏమిటో శూన్యం ,లోపం.
          
2     

అయిందానికి విచారం లేదు. కాని కొంచం భయంగా మాత్రం వుంది. భర్తేవుంటే, ఈ పాటికి సూడిదలూ, ఉత్సవాలూ! ఇప్పుడు వెలి. అప్పుడు రహస్యంగా వొదిన చెవులో చెబితే, నవ్వి చెంపమీద కొట్టి వుండేది. ఇప్పుడు చెవి కాలినట్టు అదిరిపడుతుంది. అప్పుడూ యిప్పుడూ ఒకటేకదా! అసలు సృష్టి ఒకటే విధం కద! ఇప్పుడు ఒకసారి జరిగింది. అప్పుడు ఎప్పుడూ అదే. లోపల కదులుతోంది. అప్పుడే తెలుసునను గావును, నేను తన అమ్మనని. ఎప్పుడూ నన్ను లోపల  లోపల తాకుతో వుంటుంది. ఆ పెద్దకళ్ళూ,చిన్నకాళ్ళూ  పెద్దవవుతున్నాయి గావును- నాకు మంగమ్మ కూతురంటే  చీకిరికళ్ళ పిల్ల పుడుతుందా? ఎప్పుడూ ముక్కు కారుకుంటూ—- మళ్ళీ మొగవాడి మొహం కూడను. వాడు నేను తనని వలిచే వొప్పుకున్నాననుకుని వుంటాడు? నా పుట్టబోయే బాబుకి వాడి పెద్ద కళ్ళు రావాలని సరేనన్నాను, నావంక యోధుడి వలె. జయించిన వాడివలె చూస్తాడు దరిద్ర వెధవ- ఎలా మండుకొస్తుంది- వాడికిచ్చిన చనువుకు నాకు డోకువస్తుంది. తన వెధవ అందం చూసి నిలవలేక, భ్రమిసి, నా వొంటి మదం అణుచుకోలేక భంగపడివాడికి ప్రాధేయపడ్డానను కున్నాడు. ఈసారి దగ్గిరికి రానీ మొహంమీద ఉమ్మేస్తాను. కాని పాపం, నాకీ బిడ్డ నిచ్చినవాడే, నా బిడ్డ తండ్రే అని మళ్ళీ ఎందుకో చెప్పరాని ప్రేమ కలుగుతుంది. అది సహజమేమో! కాని ఆ రాత్రి వాడికి నేను లోకువ కావడం అది తలుచుకుని భరించలేను. అప్పుడు ముద్దుగా, గౌరవంగానే మాట్లాడాడు. కాని వాడి కళ్ళలో ఎంతో చులకనయ్యే వుంటాను నేను. ఇట్లా నీచంగా ఏ మొగాడికో లోబడిగాని, వాడికి వొంటిని, పవిత్రమైన వొంటిని, వాడి మోటు చేతులకి వప్పచెప్పి, ఎట్లా వుపయోగించినా వూరికుని- ఛీ!ఛీ ఆ యెంగిలి…. పాడు…. నలిగిపోయిగాని. కనడానికి, పుత్రభిక్షని పొందడానికి. వీల్లేక పోవడమేమిటో! ఛీ ఛీ! వెళ్ళిపోయేటప్పుడు వాడు, ఎంత లోకువగా మాట్లాడాడు! ఈ మొగాళ్లు చూపే గౌరవం దొంగగౌరవమే! బతిమాలడం వాళ్ళకే బావుంటుంది గనక బతిమాలతారు. ఆట! కాని వాడి వూహా! నేను ప్రాధేయ పడ్డాననేగా! అంతా నటన ముందు నేనున్నానుగా? నేను రక్షిస్తాగా! అని అవసరమేమిలేకుండానే అని, నా భుజం మీద చెయ్యేసి, ఎవరో విరోధులున్నట్టు ధిఖ్కరించి నుంచునాడయ్యా! తరవాత పాదాలు చప్పుడౌతున్నాయనేటప్పటికి, ఆ షర్టు చంకనపెట్టి గుమ్మంలో నక్కాడు. అంతా మాయ. అట్లా ఆడదాన్ని రక్షిస్తున్నట్టుగా నుంచుంటే, వాళ్ళ మనసుకి శాంతిగా వుంటుంది. నా ధైర్యంలో యిరవయ్యో వంతులేదు. వాడు వెడుతో, ‘భయం లేదులే’ అంటాడు పైగా. చిరునవ్వుతో, వెకిలిగా “జాగ్రర్త, ఆ వెంకటేశ్వర్లు కూడా కన్నేశాడు. వాడివేపు చూశావా, చంపేస్తా. వాణ్ణీ నిన్నూ!” ఒక రాత్రి, ఒక్క అరగంట వాడికి లోకువైనానని, నాపైన అంత అధికారమూ, స్వతంత్రమూ వొచ్చాయి వాడికి! ఛీ పాడుజన్మ! ఈ ఆడజన్మ!….. నిజంగా యింక నాకు బిడ్డపుట్టి తీరుతుంది కదూ! ఆ చిన్న గులాబి గుప్పెట్లు పట్టుకొని చిన్న చిన్న కళ్ళు మూసుకొని, పగడంవంటి నోటితో, పాలకి తడుము కొంటో, యీ, యీ, అంటూ… అమ్మోయ్!

వీళ్ళకెప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది ఎన్నాళ్ళు దాచగలను యిట్లా? పోయిన నెలకూడా, బయట కూచొని, నాటకమాడాను…. వొదిన కొడుతుంది. ఏమైనా సరే బయట తెలియకూడదంటాడు అన్నయ్య. వొదిన వెళ్ళకొట్ట మంటుంది. అన్నయ్య వొద్దంటాడు. కాని కేకలు వేసే వొదినే నయం. ఆ రహస్యంగా వుంచమనడం నా కోసమా? కులం వెలిపడీ నా అనేవాళ్ళేలేక, నా మొహంమీద వుమ్మి వేయించుకొంటో,వొంటరినై, భ్రష్టురాలినయ్యే నా సంగతి అఖ్కర్లేదు: ఏ పాపం ఎరక్క నిర్భాగ్యురాలికి, నాకు పుట్టే దిక్కుమాలిన, నా పిల్లల సంగతీ ఆలోచించడు. యిరుగు పొరుగునా కచేరీలోనూ తన చెల్లెలిట్లా చేసిందంటే తన పరువు పోయిందనే దిగులొక్కటే అతని, – మళ్ళీ చిన్నప్పుడు అన్నయ్య బళ్ళోంచి వస్తాడని, నా కాఫీకూడా అతని గ్లాసులోనే పోసి, అంతా అతనికే వేడిచేసి యిచ్చేదాన్ని లస్టరుచిమ్మీ, తన బంతితో అన్నయ్య బద్దలుకొడితే, నేనని ఆ నేరం నా మీద పెట్టుకుని, దెబ్బలన్నీ నేను తిన్నాను. ఆవాళ రాత్రి నా భుజాలమీద చేతులేసి, “చెల్లీ ఎప్పుడూ మరిచిపోను. ఇంకెప్పుడూ నిన్ను కొట్ట” నన్నాడు. ఆవేళ నాకెంత సంతోషం వచ్చందని! ఇప్పుడు అన్నయ్య దయగా ఒకమాట మాట్లాడడు…

నాకు చచ్చిపోయిన తరవాత నరకం అంటకుండాను నా శరీరాన్ని ఇంత అందంగాచేసి, రగిలే ఈ కోర్కెని హృదయంలో సహజంగా పుట్టించి, నాకు వీళ్ళిచ్చిన మొగుణ్ణి చంపి, పైగా నన్ను నరకానికి పంపుతాడా దేవుడు! మంగమ్మకి కొడుకు పుట్టినందుకు స్వర్గమా! పిల్లల్ని కొట్టే మంగమ్మకి! లేక లేక కష్టపడి ఈ బిడ్డను తెచ్చుకొని కన్నందుకు నరకమా! ఆ దేవుణ్ణి అడగనూ నాటకానికన్నా వెళ్ళనీకండా, ప్రతిరాత్రీ అన్నయ్యని తనకి కట్టేసుకునే వదిన కుండదూ, నరకం! అంతా అబద్దం, దేవుడికి లేదు నామీద కోపం. నన్ను భయపెట్టడానికి అన్నారు. అప్పుడే మా చిన్ననాన్న భొజ్జలోకి పాలు ఏర్పడుతున్నాయి. దేవుడికే కోపంవుంటే అబ్బాయి పుడతాడని ముందేయోచించి ఆ బంగారు భొజ్జలోకి బువ్వ తయారుచేస్తాడా! అంతా అబద్దం వీళ్ళకి తెలియకపోతే దేవుడికి తేలీదూ నా బాధా, నా స్వభావమూ, ఆలోచనా! నేనే కావలసినవారు, నన్నే ప్రేమించేవారు, నన్ను బతిమాలి గోముచేసి “యెంతకోపం నామీద” అని గడ్డంపట్టి తమవేపు తిప్పుకునేవారు వుండాలని ఎంతో మనసు లాగుతుంది. ఏ మొగాడు ఏ ఆడదాన్ని ప్రేమగా చూచినా, ఆపాదమస్తకం మండిపోతుంది! నన్నీ! నన్నీ! నాకో! నాకో! అని ప్రతి నరం అరుస్తుంది. నామీద ప్రేమలేని వాళ్ళకి, జన్మంతా రెక్కల కష్టంపోసి మొసలిదాన్నై చస్తే ఎవరు సంతోషించను? అంతకంటే నన్ను ఒక్క రాత్రికైనా సరే కావాలనేవాడికి నా దేహమిచ్చుకుంటే పాపమా! సోమరిమల్లే పగలు తొమ్మిదింటిదాకా పట్టెమంచంమీద దొర్లే వొదినకు కాఫీ కాచడం పుణ్యమని ఏ శాస్ర్తాల్లో వ్రాసి వుందో! ఇలాంటి కోరికలు, ఇంతమంది వితంతువులున్నారే, వాళ్ళందరికీ వుంటాయా? వాళ్ళెవరూ నాకు మల్లే గోలపెట్టినట్టు కనపడరే? వాళ్ళు మంచివాళ్ళేమో! నాకొక్కదానికేనేమో యి దుర్భుద్ధి! కాదు. నేనూ పైకి ఏమెరగనట్లే కనపడతాననుకుంటా. బైటికందరూ అంతే! లోపల… ఎవరినన్నా రహస్యంగా అడగనా? అడిగితే, ఛీ ఛీ! పొమ్మంటారు! నేనననూ?అట్లానే తమాషా. నేను మాత్రం అందరంత మంచిదాన్ని కానా ఏమిటి? రోజూ జపం చేస్తాను. వాళ్ళ బుల్లెమ్మమల్లే తాంబూలాలు వేస్తనా? పరుపులమీద పడుకుంటానా? బ్రాహ్మడికి ప్రతి నెలా పెట్టుకుంటున్నాను. మొన్న స్వాములవారి తీర్థం పుచ్చుకున్నాను. నాకు మాత్రం భర్తే వుంటే నేను మంచిదాన్ని కాదూ? అప్పుడు యీ పని వొద్దనడం. పిల్లల్ని కనకపోవడం, తప్పు, అపరాధం, పన్నేండేళ్ళు నిండకముందే మొదలుపెట్టి అరవయ్యోయేటిదాకా, ఒక రోజూ వ్యవధి లేకుండా కాపరాలు చేసే యీ ముత్తైదలని చూస్తే యెవరికీ విపరీతంగా కనపడదేం? భర్తపోగానే కోర్కెకూడా చస్తుందా వాడితో కూడా? వాడి చితిమీద కాలుతుందా?… ఎవరినన్నా కన్నెత్తి చూస్తేచాలు; ఇల్లంతా తల్లకిందులు చేసి రాగాలు పెట్టి పరాయి ఆడదాన్ని గడప తొక్కకుండాచేసి, తన మొగాళ్ళని తమ వుపయోగార్థమే దాచుకుంటారే! ఎన్నడూ మొగాణ్ణి యెరగని దానికి నాకు మాత్రం అట్లా వుండదూ?

నా సంగతి తెలిస్తే వీళ్ళూరుకోరు. కాని నన్నింటోంచి బైటికి పోనీరు. నా బిడ్డని యెవరికో ఇప్పించి మళ్ళీ నన్ను చాకిరీకి తెచ్చుకుంటారు. నేనెక్కడన్నా నా బాబుతో సుఖంగా బతుకుతున్నా వీళ్ళు వోర్చుకోరు తమదైన హక్కును తమకి భుక్తమైన సొంత సౌఖ్యాన్ని నేను దొంగలించినట్టు ఏడుస్తారు. సూర్యనారాయణ చెల్లెలిని నలుగురూ నన్నూ నా బిడ్డతో సహా చూపిస్తోంటే, అన్నయ్య సహించగలడా?

కాని నేనొప్పుకోను, నా బాబుని, నా చిట్టి బంగారాన్ని ఎవరికీ ఇవ్వను. నాకు తప్ప వాడిమీద ఎవరికి వుంటుంది  దయ! మామయ్యలూ, అత్తయ్యాలూ, తాతయ్యలూ వీల్లకీ వుండదే కనికరం! పరాయివాళ్ళకి వుంటుందా? నే నివ్వనీను. నేనే పెంచుకుంటా, నన్ను వీళ్ళేం చేసినా సరే గోలచేస్తా, యేడుస్తా. వెళ్ళిపోతా. కాని, నా బాబుని లేకలేక నా చేతుల్లోకి వొచ్చిన నా భాగ్యాన్ని పారేసుకోను. నా ముద్దులమూట చిరునవ్వొక్కటి చూడకండా వుంటానా? నేను స్వంతంగా పాలిచ్చుకుంటా నా బాబు నన్ను గుర్తుపడితే ఇన్ని కష్టాలు, వెలో, తిట్లూ, అన్నీ తన కోసమే, అని తెలుసుకుంటే, నన్నూ,నా మొహాన్ని గుర్తుపట్టి, చేతులు జాచి, నా వేపు “అమ్మా” అంటే పకపక రత్నాలు నవ్వితే, నామీదే అంత ప్రేమా చూపితే నాకింకేం కావాలి?- వీళ్ళకి నా బిడ్డమీద కూడా కోపం ఎందుకొస్తుందో? నేనంటే పోనీ అపరాధం చేశాననుకోవచ్చు. నోరెరగని ఆ పసిగుడ్డేం చేసింది? ఒకవేళ నన్ను వాళ్ళల్లో వుణ్ణిచ్చినా వుంటానా! వాడిముందు నన్ను లోకువగా చూస్తే నేను భరించగలనా? వాణ్ణి తిట్టి, వాడిచేత చాకిరీ చేయించుకుంటే_ ఎక్కడికన్నా వెళ్ళిపోతా_ యెక్కడికో. నాన్న అంటే ఏ మననూ? చచ్చిపోయినాడంటా… కాదు… “నేనే నీ నాన్న” అంటా.

2 అభిప్రాయాలు »కథలు, క్లాసిక్స్

2 అభిప్రాయాలు

  1. koresh Apr 10, 2008 1

    యెమి చేద్ద0 బ్రాహ్మనిస0్ దేశాన్ని సర్వ నాసన0్ చెసింది

  2. రాజేంద్ర Apr 12, 2008 2

    గొప్ప కధ,ప్రచురించినందుకు ధన్యవాదాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో