Feb2008
మహిళ?!
అమెరికా అధ్యక్షపదవికి డెమోక్రాట్ల అభ్యర్థిని ఎంపికచేసుకునే ప్రక్రియలో ఆఫ్రో-అమెరికన్ జాతికి చెందిన మహిళలపై ‘జెండర్ సెన్సిటివిటీ కంటే జాతిపరమైన భావోద్వేగ ప్రభావమే ఎక్కువగా ఉందం’టూ ప్రముఖ న్యూస్ ఛానల్ సి ఎన్ ఎన్ ఒక స్టోరీని ప్రసారం చేసినపుడు, మొదట గందరగోళపడ్డప్పటికీ, ఆచరణలో లేదా మానసికంగా అది వాస్తవానికి దగ్గరేననిపించింది. విభిన్న జాతులు, మతాలకు చెందిన ఓటర్లున్న అమెరికాలోఇలా ఒక ప్రత్యేక జాతిని లక్ష్యంగా ఎంచుకుని న్యూస్ స్టోరీ చేయడం వివాదాస్పదమైనప్పటికీ, ఈ న్యూస్ స్టోరీలోని “హైపొథిటికల్ స్టేట్ మెంట్ “ విన్న తరువాత నా పరిధి మేరకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా ఉండలేకపోయాను. ఈ విషయాన్ని ఒక ఉధాహరణ ద్వారా చెపితే, ప్రముఖ ఆఫ్రో- అమెరికన్ మహిళ, టాక్ షో హోస్ట్ అయిన ఓప్రా విన్ ఫ్రే డెమోక్రాట్ల నామినీగా బరాక్ ఒబామాకు తన మద్దతు ప్రకటించడమే కాకుండా అతని తరపున ప్రచారం కూడా చేసింది…..ఈ నేపధ్యంలో, అమెరికాలోని మహిళోధ్యమానికి ఓప్రా వెన్నుపోటు పొడిచిందనే ఆరోపణలతో ఆమె వెబ్ సైట్ నిండిపోయింది. ఇక ఆ ఆరోపణలు చేసిన వారిలో మెజారిటీ ఎవరయి ఉంటారనేది ప్రత్యేకంగా ప్రస్తావించు కోవల్సిన అవసరం లేదనే అనుకుంటునాను. పసి వయసునుంచే మానసికంగా,శారీరకంగా అనేక దాడులకు గురవటమే కాకుండా, అణగారిన పరిస్థితుల నేపధ్యంలోంచి నేడు మీడియాను ఏలే స్థాయికి చేరిన ఓప్రాకి జెండర్ సెన్సిటివిటీ గురించిన స్పృహ లేదని ఎలా అనుకోగలం!? కానీ బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ లలో తన జాతివాడైన ఒబామాకే ఆమె మద్దతు పలకడాన్ని ఏ విధంగా స్వీకరించాలి అనే సందేహంతో నా పరిశీలన మొదలుపెట్టాను. అయితే ఇక్కడ ఓప్రాని కేవలం ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాను తప్ప ఆమె ఆఫ్రో- అమెరికన్ స్త్రీలందరి ప్రతినిధిగానో, ఆజాతి వారందరూ ఒబామా వైపే మొగ్గుచూపుతారనో భావించడంలేదు.
జాతి ప్రభావం, జండర్ అనుభవాలను ఏ బలంతోఓవర్ టేక్ చేయగలుగుతోంది?, అమెరికాలోని మహిళలు తామంతా ఒకటి…… అనే భావనతో ఉన్నారా లేదా అనే విషయాలకి వొస్తే, నిస్సందేహంగా ‘జండర్ స్ట్రగుల్’ అనేది మహిళలకి కామన్ ప్లాట్ ఫామ్ అయినప్పటికీ, రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతల కారణంగా వివిధ జాతుల మహిళల అంతరంగాల్లో ఒకరిపట్ల మరొకరికి పూడ్చలేని, అనుసంధానానికి సులువు కాని కొన్ని అగాధాలు ఏర్పడ్డాయి. ఎంతో లోతుగా తరచి చూసుకుంటే కానీ ఆ అగాధాలున్న వాస్తవం కనిపెట్టలేమంటే ఆశ్చర్యం లేదు. అలాగే మెరుగైన జీవితాల్ని, పరిస్థితులని అనుభవిస్తున్న వారికి అవి లేని వారు లోనయ్యే ఒత్తిడి, ఆందోళనలని అర్థం చేసుకునే విషయంలో చాలా అనుభవ రాహిత్యం, అజ్ఞానం ఉంటాయనడంలో వెనుకాడాల్సిన అవసరం ఏం లేదు.ఇద్దరు శ్వేతజాతి స్త్రీలు, ఇద్దరు ఆఫ్రో- అమెరికన్ మహిళలు, ఇద్దరు భారతీయ మహిళలు విడి విడిగా కూర్చుని మాట్లాడుకుంటే, ప్రతి ఒక్క జంట సంభాషణ భిన్నంగా ఉండేందుకే అవకాశాలు ఎక్కువ. ఎవరి అనుభవాలు-అనుభూతులు- నేపధ్యాలు వారివి, ఎవరి సమస్యలు – గాయాలు వారివి, ఎవరి సామాజికవాతావరణం – అసమానతల గోడు వారిది.
ఉదాహరణకి, అమెరికాలో 1960ల్లో ప్రారంభమయిన మహిళా ఉద్యమపు తొలిదశనే తీసుకుంటే, ఆఫ్రో-అమెరికన్ మహిళలు ఆ ఉద్యమపు లక్ష్యాలలో తమ అస్థిత్వాలని పోల్చుకోలేక పోయరు.శ్వేత జాతి మహిళల అధ్వర్యంలో మొదలైన ఈ పయనంలో మగవారితో సమానంగా ఓటు హక్కు, ఉద్యోగవకాశాలు, డబ్బు సంపాదంచడం లాంటివి ప్రధాన లక్ష్యాలుకాగా, చాకిరీ కోసమే పుట్టినట్టుగా అప్పటికే కొన్ని తరాలు గడిపినా, ఇంకా జాతి వివక్ష నుంచి పూర్తిగా బయటపడని ఆఫ్రో- అమెరికన్ మహిళలు తమ కన్నీళ్లకి ఆ మహిళా ఉధ్యమంలో “విలువ” లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.శ్వేతజాతి ఉద్యమ కారిణులు అనేకాంశాల్లో ఆఫ్రో-అమెరికన్ మహిళల మద్దతు కోరినప్పటికీ, వారి ఆకలి, అవసరాలు, స్వేచ్చాస్వాతంత్యాలు కూడా’మహిళా ఉద్యమం’ లో భాగం అని ఒప్పుకోవడానికి ససేమిరా అన్నారు.బహుశా ఈ కపటతనమే, ‘మహిళ’ అంటే ఒకరి కాదని ‘నల్ల’ జాతి మహిళ వేరనే అభిప్రాయం వారిలో స్థిరపడటానికి కారణం అయ్యుండచ్చు! పై పెచ్చు మిగతావారితో పోలిస్తే, అఫ్రో- అమెరికన్ మహిళలకి ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి ఉండే అవకాశం ఉంది. ఏకకాలంలో అటు జాతి పరమైన అణచివేతని, ఇటు జెండర్ కారణంగా ఎదురయ్యే హింసని ఎదుర్కొనటం వల్ల తమ అనుభవాలు చెప్పిన పాఠాలనే వారు నమ్మేందుకు అవకాశాలు ఎక్కువ. మహిళా ఉధ్యమం ఊపందుకున్న కాలంలోనే, అమెరికాలో బలంగా సాగిన పౌరహక్కుల ఉధ్యమంలో తమ జాతికి చెందిన పురుషులతో కలిసి ఆఫ్రో- అమెరికన్ మహిళలు చాలామంది చురుగ్గా పాల్గొనటం వల్ల అనేక హక్కులు సాధించుకోగలిగారు. ఈ విధంగా జాతిలోంచి చూసినపుడు ‘ వర్గ శత్రువు’ అంత దుర్మార్గంగా అనిపించి ఉండకపోవచ్చు..
కాకపోతే అమెరికాలో మహిళోద్యమం పుట్టి యాభై ఏళ్ళు దాటుతోంది. సమానహక్కులు సాధించి దాదాపు అంతే కాలం అయింది. పెరుగుతున్న గ్లోబల్ కుటుంబాల కారణంగా తమ ‘జాతి’ పట్ల అమ్మమ్మల కున్నంత గర్వం, భావోద్వేగం మనవరాళ్ళకి ఉండడం లేదు. తరాల మధ్య దృక్పథాల్లోను మార్పు సాధ్యం కనుక ఎవరు ఎవరినైనా తమ నాయకుడిగా ఎంచుకోవచ్చు. అందుకు ప్రభావితం చేసే అంశాలు, గుణగణాల చిట్టా కూడా రాను రాను పెరుగుతూనే ఉంది. కానీ ఇంకా ఎంత కరుడుకట్టినతనం లేకపోతే నువ్వు ఫలానా వాళ్లనే ఎందుకు ఎంచుకున్నావు అని ప్రత్యేకంగా అడుగుతారు? అనేది ప్రశ్న!
సందర్భమో, అసందర్భమో తెలియదు కానీ ఒప్రా వెబ్ సైట్ లో మెసేజీ లను చదివిన తరువాత, అమెరికా లో ‘రేస్ – జెండర్ ‘ కి సంబంధించిన అనేక వివాదాలు, విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో అప్రయత్నంగా నేను పుట్టి పెరిగిన వాతావరణం కళ్ల ముందు మెదిలింది. దాదాపు ఇక్కడి ఆఫ్రో-అమెరికన్ మహిళల ప్రతిరూపాలే మన దళిత మహిళలయి నప్పుడు, మన రాష్ట్రంలోని, దేశంలోని మహిళా ఉద్యమంలో వారి సమస్యలకి గుర్తింపు, సముచిత స్థానం దక్కిందా అనే ప్రశ్న వేసుకుంటే … అహంకారం అవాస్తవం అనే విశ్వాసం నాకు లేదు.
3 అభిప్రాయాలు »చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
Rajani Feb 14, 2008 1
హిమబిందు గారూ,
మీ అనాలసిస్ బావుంది కానీ మీతో నేను ఏకీభవించను. ఒక దేశ అధ్యక్షుడ్ని ఎన్నుకుంటున్నప్పుడు దేశానికి ఎంత మేలు చేస్తాడో చూడలి కానీ మన వర్గానికి సంభంధించిన వాడా కాడా అని చూడడం ఎంత వరకు సమంజసం? వర్గ పోరాటాలలో కూరుకుపోయి మనం దేశ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాము. ప్రస్తుతం మన దేశ పరిశ్థితి అలానే వుంది. ఓప్రా ఒబామాకు మద్దతునివ్వడం ఆవిడ వ్యక్తిగత ఇష్టం. దాన్నించి రేస్ జెండర్ వివాదాలను చూడలేము. అమెరికాలో నల్లవాల్లే కాక అన్ని వర్గాల వాళ్ళూ ఒబామాని ఇష్టపడుతున్నారు.
himabindu Feb 14, 2008 2
రజనిగారు,
మీ అభిప్రాయానికి ధ న్యవాదాలు.
ఒబామాని అన్ని వర్గాల వారు ఇష్ట పడుతునారనేది నా అభిప్రాయమ్ కూడా. ఆలాగే ఎన్నికల్లొ దేశ ప్రయొజనాలను మించిన అంశ మ్ కూడా లేదు. కానీ కొన్ని గ్రౌంఢ్ రియాలిటీస్ ఓటింగ్ సర ళిని ఎప్పుడూ ప్రభావితమ్ చేస్థూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. అందుకు అనేక సామాజిక అణ చివేత లు, ఆర్ఢిక, రాజకీయ కుతంత్రాలే కార నమ్ . ఇండియాలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి అణచివేసిన పరిస్థితుల్లోంచి వొచ్చిన వాళ్ళు , అనేక సార్లు మోసఫొయిన వాళ్ళు చాలా వరకు మొదట వేసుకునే ప్రశ్న ఎవరిని నమ్మాలి, నమ్మగలమ్ అనేదే.
ఇక ఒబామా విషయానికి వొస్థే, అతను అఫ్రొ అమెరికన్ కావడమే కాకుండా నవతరమ్ ప్రతినిధిగా ఆన్ని వర్గాల మద్దతు పొందుతున్నాడు. ఈ కాలమ్ లోని ముగిన్పుకి ముందు ఇదే చెప్పె ప్రయతనమ్ ఛేశాను.
అక్షర దోషాలకి క్షమించండి.
హిమ బిందు.
Sriharsha Feb 25, 2008 3
హిమబిందు గారూ, చక్కగా చెప్పారు! అనేక సార్లు మోసపోయినవాళ్ళు ఎవరిని నమ్మాలి అని ప్రశ్నించుకోవడమనేది అతి సహజమ్. వర్గపోరాటాల్లో కూరుకుపోవటమ్ ఖచ్చితంగా తప్పే! కాని ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ఇంకా కుళ్ళుతున్న వర్గ తారతమ్యాల అస్థిత్వాన్ని గుర్తించడానికి నిరాకరించకూడదు. ఆఫ్రో-అమెరికన్ మహిళలకూ మన దళిత, గిరిజన స్త్రీలకూ చేసిన కంపారిజన్ కూడా మరీ వాస్తవ దూరమేమీ కాదు. ప్రత్యేకించి మన సమాజాల్లో దళిత, గిరిజన స్త్రీలపై జరిగే సామూహిక అత్యాచారాలని పరిగణనలోకి తీసుకుని చూస్తే సదరు స్త్రీకి కూడా అమెరికా లాంటి పరిస్థితే తటస్థిస్తే ఆమె దృక్కోణం జెండర్ -రేస్ సంబంధంగా మనకి అగుపిస్తే దాన్ని మనం అనవసర వర్గ పోరాట రాధ్ధాంతంగా కొట్టిపారేయగలమా?