Feb2008
అపరాజిత 5: గమ్యం లేని ప్రయాణాల కాలం
నేను చాలావరకు ఒంటరిగా వుండేదాన్ని. బట్టలు , మేకప్ , పర్ఫ్యూమ్ వంటి వస్తువులు చాలామంది అమ్మాయిలు ఇష్టపడినంతగా నన్ను ఆకర్షించేవి కావు. తెల్లవాళ్లంటే భయంవల్ల , జంకువల్ల వారితో ఎక్కువగా కలిసేదాన్ని కాదు. సంకరజాతి వాళ్లతో నూ బాగా కలువలేక పోయేదాన్ని. ఫుల్ బ్లడ్స్ నన్ను ఇష్టపడరేమోనని భయపడేదాన్ని. అమ్మ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయేదాన్ని. నాలా అలోచించే కొంతమంది అమ్మాయిలతోనే తిరిగేదాన్ని. ఎక్కడా ఉండడానికి చోటు లేదు కానీ, నాలో చాలా అశాంతి వుండేది. ఎక్కడికైనా సరే వెళ్లిపోవాలని ఎప్పుడూ అనిపిస్తుండేది. నేనున్న చోటుకాక మరేదైనా సరే మంచిదే అనిపించేది. అలా నా స్నేహితులెందరో చేసినట్లుగానే నేను కూడా ఇంటినుంచి వెళ్లిపొయ్యాను. నాకంటే పెద్దదైన బార్బరా, అలాగే వెళ్లిపొయ్యి నాకు మార్గదర్శకమయ్యింది. అప్పట్లో అమ్మతో కలిసి వుండడం చాలా కష్టంగా వుండేది. ఆమె కు మేము కూడా అంతే ఇబ్బంది కలిగించేవాళ్లమేమో . మా మధ్యలో ఉండింది జనరేషన్ గ్యాప్ కాదు, జనరేషన్ గ్రాండ్ కాన్యన్ (గ్రాండ్ కాన్యన్- అమెరికాలోని అతి పెద్ద లోయ). అది తరాల మధ్య అంతరం కాదు, తరాల మధ్య పెద్ద అగాధం. అమ్మవి అంతా పవిత్రంగా వుండాలనే తరహా ప్యూరిటన్ భావాలు . చాలా నిక్కచ్చిగా వుండేది. బార్బరా గర్భవతి అయినప్పుడు అమ్మ ఎంత కఠినంగా ప్రవర్తించిందో నాకు ఇప్పటికీ గుర్తు. బార్బరాను అనరాని మాటలు అంది, “నేను నీ మనవరాలిని కనబోతున్నాను. అది నీకు సంతోషమే కదా” అమ్మతో అంది బార్బరా. కానీ అమ్మ చాలా నిర్దయగా వ్యవహరించింది. బార్బరా తన కూతురే కాదు పొమ్మంది. కొన్ని రోజుల తరువాత బార్బరా ఆ పాపాయిని కడుపులోనే పోగొట్టుకుంది. తను పని చేస్తున్నచోట వంటగదిలో సెరియల్ తో నిండిన పెద్ద గిన్నె ఎత్తే సమయంలో తనకు అబార్షన్ అయిపోయింది.
మా ఇంకో అక్క సాంద్ర కూడా తన పెద్ద కొడుకు జెఫ్ తో కడుపుతో వున్నప్పుడు అమ్మ మళ్లీ అలాగే వ్యవహరించింది. “మీరంతా నాకిట్లా ఎందుకు చేస్తున్నారు? నా స్నేహితులముందు తలెత్తుకోలేకపోతున్నాను” అని బాధ పడింది. ఆమెకు మా మంచిచెడ్డల కంటే తన స్నేహితులు మా గురించి ఏమనుకుంటున్నారన్నదే ముఖ్యంగా వుండేది. “ అమ్మా, మేం ఇక్కడ వుండడం నీకు సిగ్గుచేటుగా వుంటే వెళ్లిపోతాం.” అని విసుక్కునేది బార్బరా.
అమ్మ ఎలా ఫీల్ అవుతోందో నాకు అర్ధమయ్యింది. ఆమె వేరే ప్రపంచంలో బతికింది. మేం పూర్తిగా వేరే భాషలో మాట్లాడేవాళ్లం. నాకు తనంటే జాలేసేది. కానీ మేం ఒకరినొకరం బాధ పెట్టుకునేవాళ్లం. పాపాయిని పోగొట్టుకున్న తరువాత బార్బరా చాలా మథనపడింది. తన పాపాయి పోవాలని అమ్మ కోరుకుందని అనుకునేది. అది సమంజసమైన అలోచన కాదు. కాని ఆ ఫీలింగ్ ఆమెలో అలాగే వుండిపోయింది. ఒకసారి ఇలాంటి ఉద్వేగాత్మకమైన గొడవలో, “ఎప్పుడైనా నా సహాయం కావలసి వచ్చినప్పుడు నా దగ్గరికి రాకండి!” అని అనేసింది అమ్మ. అవి కోపంలో అన్న మాటలే. మాకేదైనా అయితే తను మమ్మల్ని తప్పకుండా చేరదీస్తుంది. కానీ ముందు తన స్నేహితులు ఏమంటారో అలోచిస్తుంది. తన స్నేహితుల ముందు “తలెత్తుకు తిరగడం ” తనకు చాలా ముఖ్యం. ఆమెకు ఇల్లు , కారు, టీవీ అన్నీ వున్నాయి. ఆమెకు కావలసిందల్లా అవే. ఆమె మంచిదే, శ్రమజీవే. కానీ తన చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలుసుకునేది కాదు. బార్బరా పని చేసే చోటికి ఎప్పుడు ఫోన్ చేసినా తను దొరకదని అమ్మతో పని చేసే ఒక అమ్మాయి చెప్పిందొకసారి. బార్బరా పని మానేసిందని అమ్మ వెంటనే అనుకుంది . బార్బరా ఎదురుపడగానే, “మీ పిల్లల సంగతి నాకేం అర్థం కావడం లేదు. పనిమానేసి ఇంట్లో కూర్చుంటావా!” అంటూ ఏదేదో మాట్లాడడం మొదలెట్టింది.
బార్బరా వెంటనే తను పని చేసే చోటికి ఫోను చేసి మేనేజరుతో మాట్లాడమని అమ్మకు ఫోను ఇచ్చింది. తరువాత అమ్మతో అంది “ఈసారి నా గురించి మట్లాడే ముందు నిజనిజాలు తెలుసుకో. అయినా ఉద్యోగం గురించి అంతగా ఆలోచించొద్దు. ఉద్యోగం కంటే ముఖ్యమైన విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి.” మాకు అమ్మకు మధ్యలో చాలా అపార్థాలు వుండేవి. వాటిని పోగొట్టడానికి నేను చేసింది కూడా ఏమీ లేదు. రిజర్వేషన్ను అంటి పెట్టుకుని వుండే వాళ్లలో ఒకతెగా మిగిలిపోవడం ఇష్టంలేక , కనీసం వీడ్కోలైనా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపొయ్యాను. నాలాగే లెవీ జాకెట్లు వేసుకుని, మెడలో చోకర్లతో వున్న వేరే పిల్లలతో కలిశాను. ఎక్కడికి వెళ్తున్నామనేది పట్టించుకోకుండా రోడ్లవెంబడి తిరిగేవాళ్లం .
ఒకరిద్దరు పిల్లలు అయస్కాంతాల్లా ఆకర్షించేవాళ్లు. మేం గుంపులు గుంపులుగా ఏర్పడేవాళ్లం. కొత్త, పాత పరిచయస్తులు ఒక పదిమందితో కార్లో దూరి వేసవి అంతా తిరుగుతూనే వుండేవాళ్లం. మా వద్ద దుప్పట్లు, వండుకోవడానికి గిన్నెలు వుండేవి. మా దగ్గర వున్న వస్తువులు అయిపోతే మాలో బాగా చేతివాటం వున్నవాళ్లు వాటిని ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చేవాళ్లు. మేం ఒక చోటి నుంచి మరొక చోటికి కొట్టుకు పోతూ వుండే వాళ్లం. దారిలో కొత్త వాళ్లను కలుస్తూ, ఎంజాయ్ చేసేవాళ్లం. వెనక్కి తిరిగి ఆ రోజులని గుర్తు చేసుకుంటే ఆ ఆనందం అంతా తాగుడు , డ్రగ్స్ వల్లనే అని అర్థమవుతుంది. దగ్గర చాలా డ్రగ్స్ వుంటే ఇక అందరూ స్నేహితులే. కారు కూడా వంటే నీ అంత ముఖ్యమైన వ్యక్రి ఇంకెవరూ లేరు.
దారీ తెన్నూ లేకుండా , పిచ్చిపట్టినట్లు తిరగడంలో ఎంత ఖాళీతనముందో రానురాను అర్థమయ్యింది. నేను గంజాయి ఇష్టపడేదాన్ని. బార్బరా ఎల్ ఎస్ డి ఇష్టపడేది. ఒకసారి ఎనిమిది ఎల్ ఎస్ డి షాట్లు తీసుకున్నానని చెప్పింది. “అంతా నీ మనస్థితి మీద ఆధారపడి వుంటుంది. నిస్పృహలో వున్నా, నీ స్నేహితులు నిన్ను పట్టుకోలేకపోయినా అంతా చాలా వికారంగా అనిపిస్తుంది. ఆ డ్రగ్ నిన్ను వణికించేస్తుంది. “
బార్బ్ ఒకసారి తన స్నేహితురాలి బెడ్రూములో ఎల్ ఎస్ డి తీసుకుంది. ఆ రూములో తలకిందులుగా వేలాడగట్టిన అమెరికా జెండా వుంది. యుద్ధంలో దుస్థితిని తెలియచేడానికి గుర్తుగా జెండాను అలా తలకిందులుగా కడతారు. అంతేకాక ఘోస్టు డాన్సులో కూడా ప్రభుత్వం పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ జెండాను తలకిందులుగా తమ చుట్టూ కప్పుకునేవాళ్లు. డ్యాన్సు చేస్తూ , ట్రాన్సులోకి వెళ్లిపోయేవారు. తెలివి వచ్చిన తరువాత తాము మరో లోకంలోకి వెళ్లామని, ఆ లోకంలో తెల్లవాడు రాకముందు ఎలా వుండేదో అలా వుందని, ప్రెయిరీ అంతా తమ పూర్వీకులతో నిండిన టీపీ ఇళ్లతో, దున్నపోతులతో నిండి వుందని చెప్పేవారు. బుల్లెట్ ప్రూఫులుగా కప్పుకున్న ఆ జెండా దుప్పట్లు తెల్లవాడి బుల్లెట్లను ఆపలేకపోయాయి. ఎల్ ఎస్ డి తీసుకుని పడుకున్న బార్బ్ మెదడు మీద ఆ జెండా పనిచెయ్యడం మొదలెట్టింది. ఆమె దాన్ని చూస్తూ వుండగానే , ఆ జెండా అలలు అలలుగా తేలుతూ, దాని మీద వున్న నక్షత్రాలు నేలమీద పడి వెయ్యి కాంతులుగా పరుచుకుంటున్నట్లు అనిపించిందట. అది పాతకాలపు స్వప్న దర్శనంలాగ అనిపించిందని నాతో చెప్పింది. ఏమైతేనేం అది ఆమెకు చాలా నచ్చింది.
డ్రగ్స్ తీసుకుంటూ , రోడ్లమీద పడి తిరిగి తిరిగి తొందర్లోనే బార్బరా అలసిపొయ్యింది. ఆమెలో ఏదో శూన్యం చోటు చేసుకుంది. ఎడతెగని ఆ తిరుగుడు తనకు చాలా అలసట కలిగించిందని చెప్పింది. కానీ ఆమె దేని గురించో ఎదురు చూస్తొంది. అది ఏమిటో తెలీదు కానీ ఏదో సంకేతం కోసం ఎదురుచూస్తోంది. ఆమె లాగే, పవిత్రమైన గద్ద మోసుకొచ్చే ఒక సందేశం కోసం ఘోస్టు డ్యాన్సర్లు ఎదురు చూసినట్లుగానే, మిగతా ఇండియన్ యువతీయువకులు దేని కోసమో ఎదురుచూస్తూనే వున్నారు. నేనుకూడా ఎదురు చూస్తున్నాను . అదే సమయంలో దిక్కులు తెలీకుండా ప్రయాణిస్తునేవున్నాను.
నేను ఎల్ ఎస్ డి తీసుకునేదాన్ని కాదు గాని, గంజాయికి బాగా అలవాటు పడ్డాను. రిజర్వేషన్లు పూర్థిగా వేరు పరిచినట్లు వుంటాయని, మిగతా ప్రపంచంలో ఉండేవి అక్కడ వుండవని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అమెరికా తన పౌరులకు సమకూర్చేవి చాలావరకు మాకు చేరవు గాని , కొన్ని అందుతాయి. లాస్ ఏంజెల్స్ నుంచి , రాపిడ్ సిటీ నుంచి, సెయింట్ పౌల్ నుంచి, డెన్వర్ నుంచి వచ్చిన సిటీ ఇండియన్లు కొన్ని అలవాట్లను తమ వెంట తెచ్చేవారు. ఉదాహరణకు, 1969-1970 ప్రాంతంలో రోజ్ బడ్ రిజర్వేషన్లోని కొంతమంది ఎదిగీ ఎదగని అబ్బాయిలు హఠాత్తుగా గ్లూ పీల్చడం మొదలు పెట్టారు. గెట్టో ఇండియన్లు తమతో సిటీని రిజర్వేషన్లకు తెస్తే, మాలాంటి తిరుగుబోతు ఇండియన్లు రిజర్వేషన్లను , అందులోని కష్టాలను మా దుప్పట్లలో చుట్టుకుని మాతోపాటు మోసుకెళ్లేవాళ్లం. ఎక్కడికి వెళితే అక్కడ చిట్టి రిజర్వేషన్లు ఏర్పరిచేవాళ్లం.
ఆ రోజుల్లో ఒకసారి, “మీదంతా ఆసక్తికరమైన ఉప సంస్కృతి” అని చికాగో లోని ఒక ఆంత్రోపాలజిస్టు నాతో అన్నాడు. అతను హేళన చేస్తున్నాడో, మెచ్చుకుంటున్నాడో అర్థం కాలేదు. మేం ఇంగ్లీషే మాట్లాడుతున్నాం కానీ, ఒకరికొకరం అర్థం కావడం లేదు. అతని దృష్టిలో నేను ఎక్కడైనా దాచి ఉంచెయ్యాల్సిన ఒక అరుదయిన జంతువును. నా దృష్టిలో అతనొక వెర్రివాడు.
ఎప్పుడూ తిరుగుతూనే వుండడం వల్ల డబ్బుకు చాలా కటకటగా వుండేది. అంగళ్లలో దొంగతనాలు చేస్తూ, మమ్మల్ని మేం పోషించుకునేవాళ్లం. ఈ ఆటలో మాలో చాలా మందిమే నేర్పరులమయ్యాము. నాక్కూడా దొంగతనం చెయ్యడం బాగా అలవాటయ్యింది. ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపించేది కాదు మాకు. పోగా, ఆ దొంగతనాలు మాకు సంతృప్తి కలిగించేవి. మాకు దక్కాల్సిన న్యాయాన్ని మరో విధంగా సాధించుకుంటున్నట్లు అనిపించేది మాకు. తెల్ల గవర్నమెంటు ఏజెంట్లు, షాప్ కీపర్లు మమ్మల్ని ఎప్పటినుంచో దోచుకుంటున్నారు. 1880, 1890 లలో రిజర్వేషన్లో పనిచేసే ఏజెంటుకు సంవత్సరానికి పదిహేను వందల డాలర్ల జీతం వచ్చేది. ఆ జీతంతో ఐదారేళ్లలో రిటైర్మెంటు కోసం యాభైవేల డాలర్ల దాకా డబ్బు కూడబెట్టేవాళ్లు. ఇండియన్లకు పంచాల్సిన రేషన్ సామాగ్రిని దొంగతనంగా అమ్మేసుకునేవాళ్లు. కొన్ని రిజర్వేషన్లలోనైతే రేషన్ అందక జనాలు ఆకలితో అలమటిస్తుండేవారు. మిన్నెసోట రాష్టంలో ఎంతోమంది సూ ప్రజలు చచ్చిపొయ్యారు. హెడ్ ఏజెంటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే వాళ్లను గడ్డి తినమన్నాడు . ఈ సంఘటనతో సూ ప్రజలు తిరగబడ్డారు. ఆ హెడ్ ఏజెంటు గొంతులో గడ్డి, మట్టి కూరి చంపేశారు.
తరువాత సూదులు, పిన్నులు, పూసలు అమ్ముతూ గుర్రబ్బళ్లలో చిన్న వ్యాపారులు వచ్చారు. వాళ్ల సీట్ల కింద బీరు పీపాలు వుండేవి. కొన్ని రోజుల్లోనే ఆ గుర్రబ్బళ్లు అంగళ్లుగా వెలిశాయి. ఆ అంగళ్లు కొన్ని సంవత్సరాలలోనే మాల్సుగా తయారయ్యాయి. వూండెడ్ నీ దగ్గర ఒక ట్రేడింగు పోస్టు వుంది. అది వెలిసిన కొన్ని సంవత్సరాలలోనే దాని విలువ మిలియన్ డాలర్లయ్యింది.
ఈ రకపు వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. ఒక ప్రదేశంలో ఒక అంగడి మాత్రమే వుంటుంది. కావలసిన వస్తువులు అక్కడే కొనుక్కోవాలి. లేకపోతే ఇంకెక్కడా దొరకవు. సిటీల్లో వుండే అంగళ్లకంటే ఇప్పటికీ ట్రేడింగు పోస్టుల్లోనే ధరలు ఎక్కువ. న్యూ యార్కులో కొనుక్కొచ్చిన పూసలను ఆరు రెట్లు ఎక్కువ ధరకు ఇండియన్ చేతి పనుల వారికి అమ్ముతారు. ఆ ఇండియన్లకు బీన్సు క్యాన్ల రూపంలో డబ్బు చెల్లించి , వాళ్లు తయారు చేసిన వస్తువులను ఎంతో ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఎంతో ఎక్కువ వడ్డీకి ఇండియన్లకు అప్పులు ఇచ్చేవారు. కొన్ని నెలల తరువాత చేతికందే లీజు డబ్బు ఆ అప్పులు, వడ్డీ తీర్చడానికే సరిపొయ్యేది. ఓ అయిదు డాలర్ల విలువ చేసే తిండి కొనుక్కోవడానికి కుదువ పెట్టిన ఇండియన్ జువెలరీని గడువు లోపల విడిపించుకోలేకపోతే , ట్రేడర్సు వాటిని తీసేసుకుని వందల కొద్దీ డాలర్లకు అమ్ముకునేవాళ్లు. ఇవన్నీ తెలిసిన తరువాత మేం చేసే దొంగతనాలతో మాకు చెందాల్సిన వాటిని తిరిగి దక్కించుకుంటున్నట్లు అనిపించేది.
దొంగతనం చెయ్యడానికి నేను సరిగ్గా సరిపోతాను. నా వయస్సు కంటే చాలా చిన్నదానిలా కనిపించేదాన్ని. అమ్మ కోసం వెతుక్కుంటున్న అమ్మాయిలా నటించేదాన్ని. ఆకలితో ఏమైనా తినాలనిపించినప్పుడు నా స్నేహితులు నన్ను దొంగతనానికి పంపేవాళ్లు. బాగా కొత్తలో స్వెటరు కింద బ్రెడ్డు, ఛీజు , సాసేజి, హ్యామ్ దాచేసుకుంటూ పట్టుబడిపొయ్యాను. హఠాత్తుగా ఒక తెల్లగార్డు నన్ను పట్టేసుకున్నాడు. “నాతో రా” అని గదిమాడు. నేను భయంతో ఆకులా వణికిపోతున్నాను. నేను తన వెనక వస్తున్నానా లేదా అని రెండు క్షణాలకొకసారి వెనక్కి తిరిగి చూస్తూ నడుస్తున్నాడు. అతను చూడనప్పుడల్లా నా దగ్గర వున్న వస్తువులను ఒక్కొక్కటే పక్కన వున్న బిన్నుల్లో పడేస్తూ వెళ్లాను. మేం వెళ్లాల్సిన చోటికి చేరేసరికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. “నేను ఇండియన్ను కావడం వల్లే ఇట్లా చేశారు. దొంగతనం అంటగట్టినందుకు మిమ్మల్నందరినీ కోర్టుకీడుస్తాను.” అని వాళ్లమీద అరిచాను. తప్పయిపోయిందని వాళ్లు నాకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అప్పుడు నాకు పదిహేనేళ్లే.
ఈ దొంగతనాలకు ఇంకో కారణం కూడా వుంది. అంగడి యజమానులు మమ్మల్ని రెచ్చగొట్టేవాళ్లు. మేం దొంగతనం చెయ్యడానికే వస్తామని నమ్మేవాళ్లు. ఇండియన్లు అంగడిలోకి వెళితే యజమానో, సేల్సుమ్యానో గద్దల్లా గమనిస్తూ వుంటారు. చేతులు కట్టుకుని, రెండు అడుగుల దూరంలో నిలబడి చూస్తూ వుంటారు. ఏదైనా వస్తువు ఏరుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటే, వెంటనే పక్కన నిలబడి, “ఏమైనా సహాయం కావాలా ?” అని అడుగుతారు. సహాయం చెయ్యాలని వాళ్ల మనసుల్లో ఏకొశానా వుండదు.
“లేదు, వూరికె చూస్తున్నాను.” అని చెబుతాను. అయినా నా పక్కనే నిలబడి వుంటే, “ ఏమైనా కావాలా?” అని తిరిగి అడుగుతాను. “లేదు, వూరికే చూస్తున్నాను “ అని జవాబిస్తారు.
“ ఏం చూస్తున్నావు? దొంగతనం చేస్తాననుకుంటున్నావా?” అని సూటిగా అడుగుతాను.
“లేదు, వూరికె చూస్తున్నాను.”
“ సరే , నా వైపు అలా గుడ్లప్పగించి చూడొద్దు.” అంటాను. అయినా నా ప్రతి ఒక్క కదలికను గమనిస్తూ వుంటారు. అప్పటికి తెల్ల కస్టమర్లు కూడా నా వైపు చూడడం మొదలుపెడతారు. నేను ఇదంతా అంతగా పట్టించుకోను . నేనూ, ఆ అంగడి యజమానులు ఒక అప్రకటిత బహిరంగ యుద్ధంలో వున్నాం. కానీ వాళ్లు, ఇండియన్ పెద్దవాళ్లను కూడా అలాగే చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో రూల్సు సక్రమంగా పాటించే వాళ్లకు కూడా ఆ యజమానుల కంటి కింద నుంచి ఏదో ఒక వస్తువును దొంగిలించుకుపోవాలన్న ప్రేరణ కలుగుతుంది. నాకు తెలిసిన ఒక టీచరు నాకు సిగరెట్ కార్టన్ను , ట్యాంపాక్స్ ప్యాకెట్టును చూపించి చెప్పింది, “ఇది నేను దొంగిలించానంటే నమ్మగలవా! నేనే నమ్మలేకపోతున్నాను. కానీ వాళ్ల చేష్టలవల్ల దొంగతనం చెయ్యకుండా వుండలేకపొయ్యాను. అదొక ఛాలెంజిలా వుండింది. ఇప్పుడు వీటిని ఏం చెయ్యను? నేను సిగరెట్టు తాగను కూడా.” నేను కూడా ఛాలెంజిగా తీసుకుని అవసరం లేకపోయినా దొంగతనాలు చేసేదాన్ని.
నేను రోడ్ల వెంట తిరుగుతున్న రోజుల్లో సియాటిల్లోని ఒక ఇండియన్ జంట నాకు ఆశ్రయమిచ్చారు. సొంత తల్లిదండ్రుల మాదిరి నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆవిడ పేరు బోనీ. తొందర్లోనే మేం చాలా మంచి స్నేహితులమయ్యాం . దర్జాగా తయారైన ఒకావిడ దగ్గర్నించి క్రెడిట్ కార్డు దొంగిలించాను. ఆమె ఒక నేవీ అడ్మిరల్ భార్య. నా స్నేహితురాలిని ఒక ఫ్యాన్సీ అంగడికి తీసుకు వెళ్లి తనకు నచ్చింది తీసుకోమన్నాను. నేవీ పేరిట నా స్నేహితురాలికి రెండువందల డాలర్లు విలువ చేసే బట్టలు కొనిపెట్టాను. ఇంకోసారి అలాగే బాగా ముస్తాబయిన ఒకావిడను అంగడి మేనేజరుకు చూపించి, “నేను ఆవిడ దగ్గర పనిచేస్తున్నాను. ఈ ప్యాకేజీలు కారు దగ్గరకు తీసుకువెళ్ల్లాలి. ఆమె వీటి ధర చెల్లిస్తుంది.” అని చెప్పేసి, అతను ఆమెతో గొడవ పడుతూ వుండగా ప్యాకేజిలతోపాటు చెక్కేశాను.
ఒకసారి అందమైన ఇండియన్ ఉంగరం, బ్రేస్ లెట్ , పిన్ను దొంగిలించాను. అందమైన ఇండియన్ ఆర్టిస్టుల పనితనమంటే నాకు చాలా ఇష్టం. హాంగ్ కాంగులో, తైవానులో తయరయ్యే నకిలీ వస్తువులు చూస్తే కోపం వస్తుంది. దొంగతనం చెయ్యడానికి నా దగ్గర ట్రిక్కులేవీ లేవు. అంగడి యజమానుల కళ్లను గమనించడం నేర్చుకున్నాను. వాళ్ల కళ్లు మన చేతులమీద లేనంతవరకూ ఫర్వాలేదు. వాళ్లేం గమనిస్తున్నారో అన్నది వాళ్లు మాట్లాడే తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. చేతులనే గమనిస్తూ వుంటే వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలీదు. యజమానుల కళ్లను, చేతులను, పెదవులను గమనించడం తప్ప నా దగ్గర ట్రిక్కులేవీ లేవు.
దొంగతనం చేస్తూ రెండు సార్లు మత్రమే పట్టుబడ్డాను. ఐయోవాలోని దుబ్యూక్ లో రెండోసారి పట్టుబడ్డాను. ఇండియన్లు అల్కట్రాజును (కాలిఫోర్నియాలోని జైలు) ఆక్రమించుకున్న తరువాత , ఇండియన్లకు తెల్లవాళ్లకు మధ్య బాగా గొడవలు జరుగుతున్న కాలంలో జరిగిందా సంఘటన. కొన్ని కార్లల్లో, వ్యాన్లల్లో ప్రయాణిస్తున్నఒక యువ మిలిటెంట్ల బృందంలో కలిశాను. తిండి తినడానికి, ముఖాలు కడుక్కోవడానికి దుబ్యూక్ లో ఆగినప్పుడు ఒక షాపింగు మాల్లో దూరాను. అక్కడ నాకు నచ్చిన ఒక స్వెటర్ను నా లెవీ జాకెట్లో దాచుకున్నాను.
అంగడిలోంచి బాగానే బయటపడ్డాను . కానీ పార్కింగు దాటి మా బృందాన్ని చేరుకునేలోపల ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నన్ను పట్టేసుకున్నారు. “ఆ స్వెటర్ ఇవ్వు.” ఒకడన్నాడు. “కానీ, నా దగ్గర స్వెటరేం లేదు.” అని చెప్పాను. అతను ఏం మాట్లాడకుండా నా జాకెట్ తెరిచి , చంక కింద దాచుకున్న స్వెటర్ను తీశాడు. నన్ను ఆఫీసులోకి తీసుకువెళ్లి, నా ఐడీ తీసుకుని, నా వివరాలు రాసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల ఆఫీసులోని రేడియో పెద్దగా మోగుతోంది. ఊరి వైపు వస్తున్న ఒక పెద్ద ఇండియన్ మిలిటెంటు గ్రూపు గురించి, ప్రజల ఆదుర్దా గురించి రేడియోలోని అనౌన్సరు వివరిస్తోంది. ఒక గార్డు హఠాత్తుగా నావైపు తిరిగి అన్నాడు, “నువ్వు వాళ్లతో వున్నావా ఏమిటీ?”
“అవును” అతనితో అన్నాను, “వాళ్లు నాకంటే ఒక అరమైలు వెనుకగా వస్తున్నారు. నాకోసం వెదుకుతూ తొందర్లోనే ఇక్కడికి వస్తారు.”
“నీ పేరు ఇక్కడ సంతకం చెయ్యనక్కర లేదు. ఇక్కడినుంచి వెంటనే వెళ్లిపో. ఆ దిక్కుమాలిన స్వెటరు కూడా తీసుకు వెళ్లు.” అన్నాడు.
దొంగతనం చేసి రిస్కులు తీసుకోవడం అంత తెలివైన విషయం కాదని ఈ సంఘటనతో అర్థమయ్యింది. అంతేకాక నా హక్కులకోసం పోరడడానికి ఎన్నో మంచి మార్గలున్నాయని కూడా అర్థమయ్యింది.
బార్బ్ కు అంత అదృష్టం లేదు. కస్టర్ దగ్గర గొడవలు జరుగుతున్నప్పుడు రెండు రోజులపాటు రాపిడ్ సిటీలోని జైల్లో గడపాల్సి వచ్చింది. ఒక ఇండియన్ అబ్బాయితో కలిసి తిండి దొంగతనం చేస్తూ పట్టుబడింది . ఆ దొంగతనం వల్ల తనకు పదిహేనేళ్ల దాకా జైలు శిక్ష పడొచ్చని జడ్జి చెప్పినప్పుడు తనకు జ్ఞానోదయమయ్యింది. జైలుకు వెళ్లడమంటూ జరిగితే రెండు డాలర్లు విలువ చేసే చికెన్ ముక్క కోసం మాత్రం కాగూడదని ఆమె అర్థం చేసుకుంది.
ఈ అరెస్టులు చాలావరకు మేం చేసే పనుల వల్ల కాక, మేం ఇండియన్లం కావడం వల్లనే జరుగుతాయి. ఉదాహరణకు ఒకసారి సౌత్ డకోటాలోని మార్టిన్ అనే ఊరి దగ్గర మా కారు టైరు పంక్చరయ్యింది. కారును రోడ్డు పక్కకు లాగి అబ్బాయిలు టైరు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మాయిలం ఒక మోస్తరు మంట వేసి ఒళ్లు వెచ్చబర్చుకుంటూ కాఫీ తయారు చేస్తున్నాం. కాఫీ - మా భాషలో పెహూత సప - తిరుగుబోతులైన ఇండియన్లకు మంచి తోడు. అప్పుడే రోడ్డు మీద ఒక ఫైరు ట్రక్కు వెళ్లింది. మేం దాన్ని పట్టించుకోలేదు. కొద్ది సేపటికి ఆ ట్రక్కు వెనక్కి వచ్చింది. దాని వెనుక రెండు పోలీసు కార్లు వెళ్లాయి. ఆ పోలీసులూ మమ్మ్లల్ని చూసి ఆగకుండా వెళ్లిపొయ్యారు. కాని, తొందర్లోనే వెనక్కి వచ్చారు.
రోడ్డు కవతల ఒక ఫార్మ్ హౌసు వుంది. ఇండియన్లు తన ఇల్లు తగలబెడుతున్నారని పోలీసులను పిలిపించాడు ఆ ఇంటి యజమాని. మా టైరు బాగు చేసుకుంటూ, కాఫీ తయారు చేసుకుంటున్నామంతే. మంట పెట్టామని, ట్రెస్పాస్ చేశామని, శాంతిని భంగపరిచామని, ప్రయివేటు ఆస్తిని ధ్వంసం చేశామని మామీద కేసు పెట్టాడు. మేం చేసిందల్లా అతడి ఇంటి కంచెకు వున్న ఒక కుళ్లిన చెక్క ముక్కను మంటకు ఉపయోగించాం. రెండు రోజులు మమ్మల్ని జైల్లో పెట్టిన తరువాత మేం దోషులం కాదని విడుదల చేశారు.
అలా మెల్ల మెల్లగా జైల్లో గడిపే రోజుల సంఖ్య ఎక్కువ కాసాగింది. ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతూ వుండడం వల్ల మేం వాటికి అలవాటు పడిపోయాం . ఇదంతా తెలీకుండానే మా మనస్సుల మీద చాలా ప్రభావం చూపించింది. ఆ రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లోనైతే ఇండియన్ అయివుండడం, ఒక పద్దతిలో బట్టలు వేసుకోవడం పోలీసుల దృష్టిని ఆకర్శించేది. ఏ కారణం లేకుండానే కారు ఆపేసి చెక్ చెయ్యడం, ఎప్పుడూ నీడల్లా వెంటాడడం జరిగేది. ఇదంతా మెదడు మీద బాగా పని చేస్తుంది. ఎలాగూ అరెస్టు కాక తప్పనప్పుడు , అరెస్టు చెయ్యడానికి వాళ్లకో మంచి కారణం ఇవ్వొచ్చు కదా అని అనిపిస్తుంది.
ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు నేను తిరగుతూనే వున్నాను. ఇది ఎంత దూరం వెళ్లిందంటే నా తరువాతి జాయింటు, జిన్ను ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టాను. నా స్నేహితులు కొంచెం నెమ్మదించినప్పుడు కూడా నన్ను నేను ఆపుకోలేకపొయ్యేదాన్ని. ఒకసారి ఓ యాభై స్పీడ్ ట్యాబ్లెట్లు దొరికాయి. ఒకదాని తరువాత ఒకటి వేసుకోవడం మొదలుపెట్టాను. వీధుల్లో ఎంతో మంది అలా చెయ్యడం చూశాను. నేనెందుకు చెయ్యకూడదు? కానీ అది తట్టుకోవడం నావల్ల కాలేదు. ఇక ఇదంతా అంత అహ్లాదకరంగా వుండదని తొందర్లొనే అర్థమయ్యింది. కానీ ఇంకెలా జీవించాలో మాత్రం అప్పటికి అర్థం కాలేదు.
రాజకీయంగా మాలో మార్పు వచ్చిన తరువాత, ఎ. ఐ. ఎమ్. (Amercan Indian Movement) లో చేరిన తరువాత కూడా లైంగిక సంబంధాలు స్వేచ్ఛగా వుండేవి. ఎవరైనా అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చితే చాలు, “నాతో పక్కలోకి రా, నువ్వు కాకపోతే, నాతో రావడానికి ఇంకో అమ్మాయి సిద్ధంగా వుంది” అనేవారు. అబ్బాయిలు అలాంటి మనస్తత్వంతో వుండేవారు. నాకు బార్బ్ కు అది ఇబ్బందిగా వుండేది. ఎవరితోనైనా సంబంధంలో వుంటే మేము దాన్ని సీరియస్ గా తీసుకునేవాళ్లం. మా అమ్మ, అవ్వా, తాతల క్రిస్టియన్ భావాలు, వాళ్ల నైతిక విలువలు మాకు తెలీకుండానే మామీద పని చేసినట్లున్నాయి. వాటిని మా మీద రుద్దడానికి వాళ్లు గట్టి ప్రయత్నమే చేశారు. ఆ ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కునే వాళ్లం, కానీ కొంచెం ఆనవాళ్లు మిగిలిపొయ్యాయి.
సూ ప్రజల్లో అసక్తికరమైన వైరుధ్యం వుంటుంది. తెగలోని ఆడవారి స్థాయి గురించి ఎంతో గొప్పగా మాటలు మాట్లాడుతారు భూమిని ముత్తవ్వ అంటూ తామ ఆమెను ఎంత గౌరవిస్తారో అందంగా చెబుతారు. మా జాతి హీరో కూడా స్త్రీయే. ఆమె ‘బఫలో నేషన్’ మాకోసం పంపిన తెల్ల బఫలో స్త్రీ. పవిత్రమైన పొగ గొట్టాన్ని మాకోసం తెచ్చి, దాన్ని ఎలా ఉపయోగించాలో మా జాతికి నేర్పింది. ఆమె గురించిన ఒక గాథ ప్రకారం ఇద్దరు వేటగాళ్లు ఆమెను మొట్ట మొదట చూశారట. అందులో ఒకడికి ఆమె మీద మోహం కలిగింది. వెంటనే ఒక పిడుగు పాటుకు బూడిదయిపొయ్యాడు.
మా చరిత్రలో పరాక్రమవంతులైన ఎంతో మంది స్త్రీలు వున్నారు. పాతకాలంలోనైతే ఎవరైనా అమ్మాయి పెద్దమనిషయినప్పుడు తెగ అంతా చాటి చెప్పేవాళ్లు. ఆమె స్త్రీగా ఎదిగిన సందర్భంగా తెగ అంతటికీ ఆమె కుంటుంబం విందు చేసేది. విలువైన వస్తువులు పంచేది. మగవాళ్లకు పోటీలు వున్నట్లే ఆడవారికి పూసలు కుట్టడం, అల్లికలు వంటి వాటిలో పోటీలు వుండేవి. ఆ పోటీల్లో గెలిచిన అమ్మాయికి యుద్ధంలో వీరత్వం చూపించినంత గౌరవం ఇచ్చేవారు. “చాశారా, మేం మీకు ఎంత గౌరవం ఇస్తున్నామో.” అనేవారు మగవాళ్లు. దేనికోసం గౌరవిస్తున్నారు? మంచి అల్లికలు చేసినందుకు, పూసలు, పరుపులు, చెప్పులు కుట్టినందుకు, పిల్లలను కనిపెట్టినందుకా? అదంతా మంచిదే. పియెర్ లోని గవర్నర్ ఆఫీసులో ఇండియన్లు ఒక పోస్టరు వేలాడగట్టారు:
తెల్లవాడు ఈ దేశాన్ని
కనుక్కొనకముందు
ఇండియన్లు దీన్ని ఏలుతుండేవారు -
అప్పుడు ఫోన్లు, పన్నులు లేవు.
ఆడవాళ్లు అన్ని పనులు చేసేవారు -
తెల్లవాడు అలాంటి వ్యవస్థను
‘అభివృద్ధి’ చేద్దామనుకున్నాడు.
సూ యువకుడినెవరినైనా కదిలిస్తే ఇలా అంటాడు. “మన సంస్కృతి వీరులతో నిండి వుంది. తెగలోని ఆడవారిని రక్షించుకోవడానికి విల్లంబులను ఎప్పుడూ సిద్ధంగా వుంచుకోవలసి వచ్చేది. అదే మా పనిగా వుండేది. ఏ క్షణంలోనైనా ఏ పౌనీ తెగవాడో, క్రౌ తెగవాడో, తెల్లవాడో వచ్చి మీమీద దాడి చెయ్యొచ్చు. రోజూ వేటకి వెళ్లే మగవాళ్ల మీద ఏ ఎలుగుబంటో, దున్నపోతో వచ్చి దాడి చెయ్యొచ్చు. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మేము తయారుగా వుండాల్సి వచ్చేది. అది మన ఆచారం.”
“ సరే అయితే” అని, నేను అతనితో అంటాను,” ఆచారాలను బాగా పాటించు. వెళ్లి నాకోసం ఒక దున్నపోతును వేటాడి తీసుకురా.”
రుతువులో వున్న అమ్మాయిలు పక్కన వుండకుండా చూసుకోవడం వరకు వాళ్ల ఆచారం పనికి వస్తుంది. కానీ పెద్ద మనిషయితే ఆచారం ప్రకారం విందులేం ఏర్పాటు చెయ్యరు. అలాంటి వాటికి మాత్రం వాళ్లు ఆధునికులు. నాకు మొదటిసారి నెల వచ్చినప్పుడు నాకేమవుతుందో అర్థం కాలేదు. ఏడుస్తూ అవ్వ దగ్గరికి వెళ్లాను. ఏమీ అవలేదని ఏడవొద్దని అవ్వ చెప్పింది. నాకు అందిన వివరణ అంతా అదే . నన్ను ఎవరూ ఓదార్చలేదు. నా పేరిట విందు ఏర్పాటు చెయ్యలేదు. నన్ను తెల్ల జింక తోలుతో చేసిన దుప్పటిలో కూర్చోబెట్టలేదు. అదంతా ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది అందరికీ.
రుతువులో వున్న స్త్రీలు “అపవిత్రమై” వుంటారని కాదు. ఆ సమయంలో వారికి చాలా శక్తి వుంటుందని అనుకునేవారు. మా ఆచారాల్లో రుతువులో వున్న స్త్రీని క్రతువుల దగ్గరికి రానివ్వరు. ఆ సమయంలో ఆమె దగ్గర వున్న వింత శక్తి వల్ల పూజలు పనికి రాకుండా పోతాయని నమ్మేవాళ్లు. ఒక పెద్దాయన “రుతువులో వున్న స్త్రీ కట్ల పాము మీద ఉమ్మితే, అది అక్కడికక్కడే చనిపోతుంది” అని నాతో అన్నాడొకసారి . నిజం చెప్పాలంటే నేను రుతువులో వున్నప్పుడు నాకు ఎలాంటి శక్తీ వున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు.
నాకు పదహారు, పదిహేనేళ్లప్పుడు రేపుకు గురయ్యాను. ఒక అందమైన యువకుడు నన్ను పిలిచి, “ఇక్కడికిరా అమ్మాయి, నీకు సోడా కొనిపిస్తాను” అని నాకు ఆశ పెట్టాడు. అతను నాకంటే రెండితలు బరువు, ఒక అడుగు ఎత్తున్నాడు. నన్ను నేలమీద పడేసి అదిమి పట్టాడు. ఆ వివరాలు గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వాడిని తన్నాను, రక్కాను, కొరికాను, కానీ ఆపలేకపొయ్యాను. సిగ్గుతో, అవమానంతో నాకేం జరిగిందో ఎవరికీ చెప్పుకోలేకపొయ్యాను. నా కసి తీర్చుకోవడానికి ఎవరిదో కారు టైర్లు పంక్చరు చేశాను.
రిజర్వేషన్లో చాలాసార్లే రేపులు జరుగుతాయి. బాధితుల్లో ఫుల్ బ్లడ్ అమ్మాయిలే ఎక్కవగా వుంటారు. వాళ్లకు సిగ్గు, భయం మరీ ఎక్కువ. తమకు జరిగినదాన్ని గురించి ఫిర్యాదు చెయ్యరు. కొన్ని సంవత్సరాల క్రితం తెల్ల సైనికులకు ఇష్టమైన ఒక ఆట వుండేది. ఇండియన్ యువతులను తాగుడు మిష మీద అరెస్టు చేసేవాళ్లు - వాళ్లు తాగి లేకపోయినా సరే. వాళ్లను జైలుకు తీసుకువెళ్లి అక్కడ రేప్ చేసేవారు. ఒక్కోసారి అమ్మాయిలను పోలీసు కార్లల్లో ప్రెయిరీలో దూరంగా తీసుకెళ్లేవారు “తెల్లవాడు ఏం చెయ్యగలడో చూపిస్తాను. నిజానికి నేను నీకు ఉపకారం చేస్తున్నాను”అని అనేవారు. వాళ్ల పని అయిపోయిన తరువాత ఆ అమ్మాయిని కార్లోంచి బయటకి తోసి వెళ్లిపొయ్యేవారు. రేప్ కు గురయిన ఆ అమ్మాయి ఐదు, పది మైళ్ల దూరంలో వున్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. తెల్ల సైనికుల మీద ఇండియన్ అమ్మాయిలు చేసే ఫిర్యాదులను అంతగా పట్టించుకోరు. “వాళ్లెలాంటి వారో మీకు తెలుసు కదా. వాళ్లే కావాలని తమ తలలమీదకు తెచ్చుకుంటారు” అని కోర్టుకు చెప్పేవారు. అందువల్ల రేపులు గురించి గానీ, బలవంతపు స్టెరిలైజేషల్న గురించి గానీ ఫిర్యాదులు చాలావరకు నమోదు కావు. అదృష్టం కొద్దీ మారుతున్న ఈ కాలంలో మా స్త్రీలు ఇలాంటి సంఘటనలను బయట పెట్ట్దడానికి మునుపటిలా వెనుకాడడం లేదు.
నాకు మగస్నేహితులంటే ఇష్టమే. వాళ్ల గురించి తెలుసుకోవడం, కలిసి తిరగడం ఇష్టమే. కానీ ఒకరి పక్కలో చేరడమనేది నా దృష్టిలో వారికి కమిట్ కావడమే. ఆ సంబంధంలో ఒకరి గురించి ఒకరు బాధ్యత తీసుకోవాలి. కానీ దాదాపు తొంభై శాతం యువకులకు స్త్రీ పురుష సంబంధంలో బాధ్యత తీసుకోవడం ఇష్టం వుండదు. వాళ్లకు మాతో పక్కలో చేరడమే నచ్చుతుంది. అలా అయితేనే స్నేహంగా వుంటారు. వాళ్లతో సహకరించకపోతే వాళ్లకు వ్యక్తుల్లాగే కనిపించము. అందు వల్ల, నేను చాలావరకు ఒంటరిగా వుండేదాన్ని. అలా వుండడం నాకు సంతోషమే.
ఒకసారి నేను ఒక వీరుడిపైన ప్రాక్టికల్ జోకు చేశాను. అతని చుట్టూ అమ్మాయిలు ఎప్పుడూ చేరేవారు. కాలిఫోర్నియాలో జరుగుతున్నఒక సంఘర్షణలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ఒకరోజు నా పక్కలో చేరాడా వీరుడు(అతడు నిజంగానే చాలా ధైర్యవంతుడు. వీరుడని నేను వేళాకోళంగా అనడం లేదు). “మా ఆవిడతో గొడవపడ్డాను. నీ పక్కలో పడుకోవచ్చా?”
నా జవాబుకోసం ఎదురు చూడకుండా నా దుప్పటిలోకి దూరాడు. ఇది వూండేడ్ నీ లోకి వెళ్లకముందు, నేను ఎనిమిది నెలల గర్భిణిగా వున్నప్పుడు జరిగింది. అతడు నన్ను తడమడం మొదలెట్టినా నేను ఏమీ అనలేదు. అతని చెయ్యి మెల్లగా కిందకు వెళ్లి పెద్ద బెలూనులా వున్న నా పొట్ట దగ్గరికి వెళ్లి హఠాత్తుగా ఆగిపొయ్యింది, “ఏమిటిది?” అతను విస్మయంగా అడిగాడు. నేను అందంగా నవ్వి చెప్పాను “నాకు పాపాయి పుట్టబోతోంది. ఇప్పుడే నొప్పులు కూడా మొదలయ్యాయి.” నా పక్కలోకి ఎంత వేగంగా దూరాడో, అంతకంటే వేగంగా అక్కడినుంచి పారిపొయ్యాడు.
ఏమయితేనేం, మా మగవాళ్లు ఎంత మంచిగా ఉంటారో అంత హీనంగా వుండగలరు . అందుకు వాళ్లను అభినందించాల్సిందే . మమ్మల్ని రక్షించడానికి చాలా ధైర్య సాహసాలు చూపించేవారు, మా కోసం చచ్చిపోవడానికి సిద్ధపడేవారు, మా హక్కులకోసం గట్టిగా పోరాడేవాళ్లు - కానీ అదంతా బయటి వాళ్ల నుంచి రక్షించడానికి మాత్రమే.
లైంగిక వేధింపుల కారణంగా ఇండియన్లకు, తెల్లవాళ్లకు మధ్య చాలాసార్లే గొడవలు జరిగేవి. మా యువకులు మమ్మల్ని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఒకసారి ఎ. ఐ.ఎమ్. సభ్యుల మీద పియెర్ లో ఒక కేసు నడుస్తోంది. వాళ్లకు మద్దతు ఇవ్వడంకోసం చాలామందిమి పియెర్ లోని ఒక మోటల్లో దిగాం. ఒక్కో రూములో ఎనిమిది పదిమందిమి చేరాం. కింది అంతస్థులో వున్న మూడు గదుల్లో చేరిన గుంపులో బార్బరా వుండింది. కారు లోంచి ఏవో వస్తువులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్లిన బార్బ్ ను ముగ్గురు తెల్ల కుర్రాళ్లు వెకిలి మాటలన్నారు. వాళ్లు కౌ బాయ్ డ్రస్సులు వేసుకుని బీరు తాగుతూ వున్నారు. కొద్దిదూరం నుంచే బీరు వాసన వస్తూ వుండిందని చెప్పింది . మా అక్క వాళ్ల మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. కానీ చివరికి వెనక్కి తిరిగి తన రూముకు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పైన్ రిడ్జ్ కు చెందిన ఓగ్లాల తెగ యువకుడు టామ్ పూర్ బేర్ మాత్రమే కనిపించాడామెకు. బయట చేరిన కొంతమంది తెల్ల కుర్రాళ్లు తనను ఏడిపిస్తున్నారని అతనితో చెప్పింది. టామ్ వెంటనే ఆమెతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తెల్ల అబ్బాయిలు మళ్లీ అవే వెకిలి మాటలు మాట్లాడడం మొదలు పెట్టారు కానీ, పూర్ బేర్ ను చూసి అక్కడినుంచి మెల్లగా జారుకోవడానికి ప్రయత్నించారు. టామ్ వాళ్లను పిలిచాడు “ఇక్కడికి వచ్చి ఆమెకు క్షమాపణ చెప్పి వెళ్లండి.”
అందరికంటే అసహ్యంగా మాట్లాడిన కుర్రాడు వెనక్కి తిరిగి వెకిలిగా నవ్వుతూ అన్నాడు, “అలాంటిదానికి ఎప్పటికీ క్షమాపణ చెప్పను.”
పూర్ బేర్ కోపం పట్టలేక, “ఎవరు ఎలాంటి వారో చూపిస్తాను నీకు!” అంటూ వాళ్లపైకి ఉరికాడు. అలా గొడవ మొదలయ్యింది. కానీ వాళ్లు ముగ్గురవడం వల్ల వాళ్లదే పైచెయ్యి అయ్యింది. వాళ్లు పూర్ బేర్ ను చితక్కొట్టసాగారు. బార్బ్ మళ్లీ మోటల్లోకి పరిగెట్టింది. అక్కడ బాబీ లీడర్ ఛార్జ్ ఎదురుపడ్డాడు. అతను రోజ్ బడ్ కు చెందిన అబ్బాయి, అప్పటికి పదిహేనేళ్ల కుర్రవాడు. చిన్నతనం వల్ల అటూ ఇటూ అలోచించకుండా మెరుపులా బయటకు పరిగెట్టాడు. అప్పటికి తెల్ల కౌ బాయ్ లకు తోడుగా మరో ముగ్గురు స్నేహితులు చేరారు. మళ్లీ తెల్ల వాళ్లదే పైచెయ్యి అయ్యింది. అందరూ కలిసి పూర్ బేర్ ను, లీడర్ ఛార్జ్ ను కొట్టసాగారు. సహాయం కోసమని బార్బ్ మళ్లీ మోటల్లోకి పరిగెట్టింది. అదృష్టం కొద్దీ అప్పుడే రస్సెల్ , మీన్స్ బ్రదర్స్ , కోక్ మిల్లర్డ్ మోటలు దగ్గరికి వచ్చారు. వాళ్లు వెంటనే రంగంలోకి దిగారు. ఆ తెల్ల కుర్రాళ్లు పారిపోవడానికి ప్రయత్నించారు కానీ, వేగంగా పరిగెట్టలేకపొయ్యరు. కోక్ మిల్లర్డ్ ఒకబ్బాయిని ఎత్తి ఆగివున్న ఒక కారు టాపు మీద పడేశాడు. మరో తెల్లబ్బాయి తెలివి తప్పి పడిపొయ్యాడు. ఇంకొకడు మోచేతుల మీద, మోకాళ్లమీద పాకుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. మా మగవాళ్ల ఉద్దేశంలో ఆ గొడవ అంతటితో అయిపోయింది. అందరూ మోటల్లోకి వెళ్లిపొయ్యారు.
కానీ తెల్లవాళ్ల ప్రకారం ఆ గొడవ ఇంకా అయిపోలేదు. కొద్ది సేపటికల్లా మోటలంతా సెర్చి లైట్ల వెలుగుతో నిండిపోయింది. ఒక అరడజను పోలీసు కార్లు సైరన్లు మోగించుకుంటూ మా మోటలు ముందు ఆగాయి. ఒక్కో కారు లోంచి ఇద్దరు సైనికులు దిగి కారుకు చెరో వైపు నిలబడ్డారు. ఏదో అల్లరిని ఆపడానికి వచ్చినట్లు ఒక్కొక్కరి దగ్గర తుపాకులు, హెల్మెట్లు, ప్లాస్టిక్ షీల్డులు వున్నాయి. అప్పటికే లౌడ్ స్పీకరు మోగుతోంది: “ఈ వూరి షెరీఫ్ ను మాట్లాడుతున్నాను. దాడులు జరిపినందుకు లోపలవున్న మీ ఇండియన్లను అరెస్టు చెయ్యడానికి వచ్చాను. మీరు లోపల వున్నారని నాకు తెలుసు. తలలమీద చేతులు పెట్టుకుని బయటకు రండి. లేకపోతే మేమే లోపలికి వచ్చి షూట్ చేస్తాం!”. బార్బ్ ఇంకా ఇతర్లు తమ కిటికీల్లోంచి బయటకు తొంగి చూశారు. తమవైపు గురిపెట్టిన తుపాకులను చూసిన తరువాత బయటకు రావడానికి వాళ్లకు మనస్కరించలేదు. ఇండియన్లను, అందులో ఎ. ఐ. ఎమ్. సభ్యుల విషయంలో సౌత్ డకోటా పోలీసులు తుపాకులను ఉపయోగించడానికి ఉత్సాహం చూపేవారు. మీన్స్ బ్రదర్స్ లో ఒకతను ఫోనులో ఒక తెల్ల సానుభూతిపరుడిని పిలిచి, లాయరును తీసుకుని వెంటనే తమ గదికి రావాలని పిలిచాడు.
అప్పుడు పొద్దున రెండు గంటలవుతోంది. బయట చాలా చలిగా వుంది. ఎందుకోగాని సౌత్ డకోటాలో ఎప్పుడూ చాలా వేడిగానో, చాలా చలిగానో ఉంటుంది. తెల్ల స్నేహితుడు, లాయరు చలికి వణుకుతూ పోలీసు కార్లను దాటుకుని రావడం పై అంతస్థులోంచి చూశాను. మోటల్లోకి వెళ్లగానే మీన్స్ బ్రదర్స్ వాళ్లను ఒక రూములో తీసుకెళ్లడం చూశాను. వాళ్లు షెరీఫ్ తో మంతనాలు జరపడానికి వచ్చారని బార్బ్ తరువాత చెప్పింది. “మా ఇండియన్ స్నేహితులను, క్లయింట్లను కొంతమంది తాగుబోతు తెల్ల వాళ్లు రేపు చేసే వుద్దేశంతో దాడి చేశారు . కానీ ఆ తెల్ల వాళ్లు తమ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే మా క్లయింట్లు కూడా తమ ఫిర్యాదును విరమించుకుంటారు” అని చెప్పారు.
వాళ్లలా మంతనాలు జరుపుతూ వుంటే, కోక్ మిల్లర్డ్ ను పట్టుకోవడానికి ఇతర్లు తంటాలు పడాల్సి వచ్చింది. అప్పటికే కొన్ని బీర్లు పట్టించిన మిల్లర్డ్ వీరమరణం గురించిన పాటలు పాడడం మొదలు పెట్టాడు. “చచ్చిపోవడానికి ఇదే మంచి రోజు! నన్ను బయటకు వెళ్లనివ్వండి! నాకు వీరుడిలా చావాలనివుంది! ఆ పందుల మీద నన్ను యుద్ధానికి వెళ్లనివ్వండి! హోకా - హే!”. అతడు బయటకు వెళ్లకుండా ఒక చోట కూర్చోబెట్టి గట్టిగా పట్టుకోవలసి వచ్చింది. చివరికి ఒక మారణహోమాన్ని ఆపడం కోసమని ఇరు వైపుల వాళ్లు తమ ఫిర్యాదులను విరమించుకోవడానికి ఒప్పుకున్నారు. స్క్వాడ్ కార్లు వెళ్లిపోయిన తరువాత అంతా నిశ్శబ్దమైపోయింది. కానీ ఆ నిశ్శబ్దం చాలా ప్రమాదకరంగా వుండింది. ఏదో ఒక చిన్న సంఘటన పెద్ద గోడవగా మారే ప్రమాదం మాకెప్పుడూ వుండేది.
విచ్చలవిడిగా తిరిగిన ఆ రోజులను గుర్తు చేసుకుంటే , ఆ రోజులన్నీ మంచికో చెడ్డకో అర్థం కాదు. ఎడతెగని, అలుపెరుగని ఆ ప్రయాణాలనుంచి నేనేం నేర్చుకున్నానో తెలీదు. ఏం జరగకపోయినా , అలా తిరగడం వల్ల నేను మరింత ఇండియన్ను మాత్రం అయ్యాను. తెల్లవాడి ప్రపంచంలో ఇండియనుగా ఉండడమంటే ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది. ఎ. ఐ. ఎమ్. లో చేరిన తరువాత గమ్యం లేకుండా తిరగడం ఆగిపొయ్యింది.
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
Ajay Prasad Feb 2008 1
ఈ అనువాదాలు చాలా బాగుంటున్నాయి. ఈ నెల ఇంకా చాలా బాగుంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.