నీడ చెదిరిన గూడు

”పత్తి కుప్పల మీద సుడిగాలి లేశినట్టు పింజలు పింజలుగ నీళ్లు నురుగులు గక్కుకుంట పైనించి దునుకుతున్నై, దగ్గర్దగ్గెర ఈన్నించి మన అన్నారమవతల పోతురాజు గుట్టంత దూరం దన్క తెంపులేకుంట పారుతున్నై నీళ్లు యాన్నుంచొస్తున్నయో ఏమోపాడయ్యి. ఒక్కటే బొయ్యిన మోత!


ముసురు బడ్డట్టె సల్లగొచ్చి మీద బడతున్నై నీళ్ల తుప్పిర్లు. నేను మీ ఒదిన సలికోట్లు తొడుక్కున్నా గని ఒనుకుడు బెడుతున్నట్టే ఉంది. మీమేఏంది? ఎక్కడెక్కడి దేశాల్నించి ఒచ్చిండ్రో జనమాడికి! రంగురంగుల మడుసులు! రకరకాల మడుసులు! ఓళ్లన్న గానీ అందరు సలికోట్లేసు కోవాల్సిందే ఆడ. మా కొడుకు, కోడలు ఆల్ల దోస్తులు మన దేశపోల్లు కొందరు అందరం ఒక పదిమంది దన్క పోయిన మాడికి నయాగరా జలపాతమని మొత్తం ప్రపంచంలనే పెద్దదట అది. మనం నందికొండ డాము చూడ బొయినప్పుడు మాచర్ల కొండ చంద్రొంక వాగు ‘ఎత్తిపోతలు జూల్లేదా గసోంటిదే గని దానికంటే ఓ…. శానా పెద్దదన్నమాట. తాటి ప్రమాన మేంది రొండు మూడు తాటి నిలువుల్నించి కింద బడుతుంటై నీళ్లు”.
అమెరికాలో ఉన్న తన కొడుకు కాడికి బొయినప్పుడు తను చూసిన నయాగరా జలపాతం గురించి చెప్పుతున్నడు పారడురంగారావు దొర. కోర్లపున్నం రోజులు. పున్నమెల్లి రొండు మూడు రోజులైంది. తెల్లారగట్ల కావొస్తున్నది గని ఇంకా పిండారబోశినట్టు ఎన్నెల కాస్తున్నది. బావులకాడ కరెంటు మోటర్లు బెట్టి కావలి గాస్తున్నరు రైతులు, కరెంటు సరిగ్గ రాక మోటర్లు పడి పోతున్నయి అప్పుడప్పుడు. సలిమంటలు బెట్టి సుట్టలు దాగుకుంట గూసున్నరు దగ్గర దగ్గరి బావులోల్లు ఐదారుగురు.
పాండురంగారావు దొరకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. పట్వారిగిరి చేసుకుంట అందర్ని మంచిగ సదివిచ్చిండి. పట్లంల పెద్దోడు ఓ ప్రైవేట్‌ కాలేజీల పంతులు. సంవత్సరానికి రొండుమూడు లక్షలకు పైచిలుకే సంపాయిస్తడు. చిన్నోడు ఇంజనీరు. అమెరికాల ఉంటున్నడు.ఆని పెండ్లానిగ్గూడ ఆన్నే ఉజ్జోగం, ఇద్దరికి గల్పి నెల సంపాదన మన పైశలల్ల లక్షల మీదుంటది. నిన్న మొన్ననే దొర దొర్సానిని తీస్కోని అమెరికా బొయ్యెచ్చిండు చిన్న కొడుకు తానికి. గాముచ్చటే చెప్తున్నడిప్పుడు. ఇగ బిడ్డకు అల్లునికేమొ బాంకుల ఉజ్జోగం. కోదాటికాడ ఉంటున్నరు ఆళ్ళు.
ఊల్లెనించి ఎల్లొచ్చి పాలోల్లంత బావులకాడ గట్టుకున్నరిండ్లు. పెద్ద మడుసులకైనా, పిల్లలకైనా ఎవసాయంల ఏదో ఓ పని ఉంటనే ఉంటది. ఏకాలమనకుంట. పెద్ద మడుసులకసలే తెల్లారుగట్ల నిద్ర బట్టదు. ఇంకేముంది? అందరు ఒక్క తీరుగ ముచ్చట్లు బెట్టుకుంట పడి పోయినప్పుడు మోటార్లు బెట్టుకుంట ఎచ్చగ సలిగాగుతున్నరు. మంటసుట్టు, జీతగాల్లున్నా గని మొదట్నించి ఎవసాయం చేసినోళ్లకు ఇంట్ల నిద్రబట్టదు. అందికనే తెల్లారు జామున లేశి బాయికాడి కొచ్చిండు పాండురంగారావు.
”ఏముర పాండురంగం! ఆ దేశముల కల్లు బొట్టు దొర్కుతాదిర?” అడిగిండు యాదగిరి రావు దొర, ఆయిన పొలం సుట్టు అన్ని తాటిబొత్తలే? మున్నూటరవై రోజులు పొంగులు పొంగుతుంటది కల్లు ఆల్లింట్ల.
”ఆడ కల్లెక్కడిదే! ఇకారంగడుగుతవ్‌! మన దేశపు చెట్లే కనపడవక్కడ. అన్నేంటివో మనం గుర్తుపట్టని చెట్లే. పెద్ద పెద్ద అడవులు. ఒక ఊరి నుంచి ఒక ఊరి దన్క రోడ్డుకు రెండు దిక్కుల ఇనుప తీగల జాలీలు బెడ్తరు, జీవరాసులు మోటార్లు కింద బడిసచ్చిపోకుంట”. చెప్పిండు పాండురంగారావు.
”సరెగని నువ్వు మూన్నెల్లుంటివి గద దొర ఆడ! ఎట్ల పొద్దుపొయ్యేది నీకు”.
శావకపోల్ల ఎంకటేసులడిగిండు, ఆడు పెద్దదొర రాఘవ రావు పొలాన్ని కౌలుకు జేస్తున్నడు.
”ఏముందిరా! మా కోడలు చిన్నపిల్ల తల్లేనాయె! ఇంట్లనే ఉండేది. మా దొర్సానమ్మగ్గూడ ఆపిల్లతోనే పొద్దుబొయ్యేది. సలికి నేనింత మందుదాగి పాత తెలుగు పేపర్ల సదువుకుంట ఉండెలటోన్ని. శనివారమాదివారం శెలవలొచ్చినప్పుడల్ల ఎటన్న తీస్కపోతడు మావోడు. గా పజ్జూరు నుంచి ఒకడు, గడియ గౌరారం నించి ఒకడు మనోల్ల పిల్లలే ఉన్నరాడ. అందరం కలిశే పొయ్యేది యాడికి పోయినా” చెప్పిండు.
ఒకనాడు సిన్మాలు దీసే స్టుడియో సూపిచ్చిండ్రు. ఇంకోనాడు ఇంకో కాడికి పొయినం యాడికో గుర్తేలేదు. ఆడ భూమిలంగనే పోతయి రైళ్ళు, కార్లు అన్నీ రోడ్లు గూడ ఎట్టుంటయనుకుండ్రు? నూనె కిందబోతె ఎత్తుకోవచ్చు. మన నల్లగొండ రోడ్లేంది? పట్నం రోడ్టే పనికి రావాటికింద. పామన్‌గుండ్లకు, నీబిడ్డ పెండ్లికి పోయినప్పుడు సూల్లేదుర! బెజవాడ రోడ్దు! దాన్ని ఇంక మూడంతలు జేస్తరట ఈనడుమ, ఇగ అమెరికోని రోడ్లయితే అంతకు పదింతలుంటై. రోడ్డు నడుమంగ గడ్డి పెంచుతరు. ఈపక్కనించి ఆపక్కనించి దేనియ్యే గీతలు గొట్టుంటై. మోటార్ల ఉరవడిని బట్టి ఏ గీతలంగ బోతోడు ఆ గీతలంగనే పోవాలె. గీత తప్పిండ్రంటె టక్కర గావాలిశిందే”.
సిగరెట్టు ముట్టిచ్చి దమ్ములాక్కుంట చెప్తున్నడు.
ఇంతల బోరుగుంత పక్కన పడేశిన గొంగడి కదిలినట్టనిపిచ్చింది.
”ఏంది దొర! గాగొంగట్లె ఏందో కదుల్తున్నట్టుంది” అడిగిండు చాకలోల్ల సంజీవ. ఆడు సర్పంచి భాస్కర్రావు దొరకు పెద్ద జీతగాడు. అప్పుడే కొత్తబాయికాడ మోటరు బందుజేశి పాతబాయి కాడికొచ్చి మంట కాడ కూసుంటున్నడు.
అందర ఒక్కపాలే అటు జూశిండ్రు. అప్పుడప్పుడే తూర్పునించి ఎర్రడాలుబడి ఎలుగొస్తున్నది. బోరుగుంత కాడ కరంటు బల్బు గుడ్డి గుడ్డిగ ఎలుగుతున్నది. మంటెలుగుల గొంగట్ల ఏదో కదుల్తున్నట్టు కనిపిచ్చింది అందరికి.
”ఆరె! ఏందిర అండ్లకేదో చేరినట్లుంది. ఇప్పుడేనాయె నేనింటి కాన్నించి గొగడి కప్పుకోనే ఒస్తిని”, పరెశానయ్యిండు పాండురంగారావు.
”నేనొస్తాలకు మోటరు గాలిపట్టుబట్టి మొత్తుకుంటున్నది. జీతగాని పోరడు నిద్ర బోతుండు. ఆన్నెందుకులేపాల్నని నేనే గుంతలకు దిగి మోటరు బందుజేశి గాలిపట్టు దీసి మల్ల మోటరు బెట్టిన. అప్పుడే ఏం జేరిందిర? ఇచ్చెంత్రంగుంది”, లేశి బోరుగుంత దగ్గరికి బోయ్యి ఒంగబడి గొంగడి తియ్యబొయిండు.
”అర్రె! ఏందిదొర! గట్టబోతవు అడ్డగోలిగ! కట్టెతోనన్న కదిలియ్యరాదు అండ్ల పురుగు బూశి ఏమన్న చేరిందో ఏమో” నువ్వు జెరతాలు నేను జూస్తగని”.
ఒద్దనుకుంట లేశి దగ్గెరికొచ్చిండు సంజీవ. కర్రతోని గొంగడిని కదిలిచ్చి సూశిండు, మస్తు బరువున్నట్టనిపిచ్చింది. లోపల బుస్సుమని సప్పుడొస్తున్నది.
”ఏంది దొర ఇంత బరువుంది. ఇండ్ల పెంజరో, తాసుపామో చేరినట్టుంది. బుస్సున మోత పెడుతున్నది”.
అనుకుంట కర్రతోని గొంగటిని లేపి తిప్పేశిండు. తిప్పేస్తాలకు బుస్సున మొత మోసుకుంట మెలికలు దిరుగుతున్నది. దండ చెయ్యిలా వుంది కోడె! కోడెతాచు. పడిగిప్పి లేవబొయ్యింది గాని మూతి గొంగట్లె ఇరికి పైకి లేపరాలేదు. తోకదన్కర మెలికలు దిరుక్కుంట పొర్లుతున్నది.
”అనియమ్మ! ఎంత లావుంది దొర పాము ఇంతల్నే యాన్నుంచొచ్చినవే నువ్వు? ఓల్లలగ్గం జేద్దామనుకున్నవే? అనుకుంట కర్రతోటి పాము నుడుముల మీద, తలకాయ మీద రొడు మూడు దెబ్బలేశి చావగొట్టిండు సంజీవ. అందరు లేశి పాము సుట్టు చేరిండ్రు.
పాము తోక కదిలియ్యకుంట అయినంక గొంగట్లెనించి పక్కకు కదిలియ్యబొయిండు సంజీవ. కోరలు గొంగట్లె ఇరికి గొంగడి తోటే కదుల్తున్నది. గని ఊడోస్తలేదు పాము.
”ఏంది దొర! ఇది గొంగడ్ని గరిశి పట్టుకుంది. ఎంతకు ఒదుల్తలేదు”, అటిటు కదిలిస్తనే ఉండు.
”అరె! ఏమనకుర సూద్దాం” అని ఒంగి సూశిండు పాండురంగారావు, ఇంతల తెల్లారి బాగ ఎలుగయ్యింది.
”ఇదేందిరో పాండురంగం! పామేన్నో గొంగడిని కరిశినట్టుంది ఈడ్సుకుంట ఒచ్చినవ్‌ ఈడదాక” యాదగిరి రావు అన్నడు.
బోరుగుంతకాడ గొంగడి ఏశిన కాన్నించి బాటెమ్మటి ఏదో ఈడ్సుకొచ్చినట్లు గీతబడ్డది. అందరు లేశి ఒంగి పశానతు చేశి సూశిండ్రు. గొంగడిని పట్టుకోని లేపిండు యాదగిరి రావు. పాము గొంగడెమ్మటే లేశింది.
”ఇగోదిర! గొంగడెమ్మటే ఒస్తుందిది. గొంగడ్ని కొప్పెరజేశి కప్పుకున్నట్టుంది. కింద నేలకు జీరాడుతుంటె యాన్నో పాముకు తగిల్నట్టుంది. అది ఎమ్మటే కొడితాలకు కోరలు గొంగల్లె ఇరుక్కున్నయ్‌ ఊడిరాలేదు. గొంగడి బరువుల గలిశి పామా బరువు తెలువలేదు. ఈడిదాక ఈడ్సుకొచ్చినవ్‌”. ఇవరంగ ఇప్పి చెప్పిండు యాదగిరి రావు.
”పాము కూసం మీదుండి మత్తుకొన్నట్టుంది. అందికే ఈడ్సుకొచ్చింది. లేకుంటే మెలికల్దిరిగి ఇడిపిచ్చుకునేదుండె”. సంజీవ అన్నడు.
కర్ర దెబ్బలు తగిల్నకాడ పాము కూసం చెదిరిపోయి పొట్టులేశింది. దాని కండ్ల మీద కూడ కూసం కప్పుకోనుంది.
”పామేనార! మత్తుగొన్నది? మావోడేం తక్కువా? కొడుకు పంపిన సరుకింత సందకాడ ఏసుకున్నాలె! రేకలు బార్తాలకే దిగినాది మత్తు! సోయిలేకుంట ఈడిదాక ఈడ్సుకొచ్చిండు పామును పామైంది గొంగడైంది తెల్వకుంట” దెప్పి పొడిశినట్టు అన్నడు యాదగిరిరావు.
”కాదుగని దొర గామందేదో గింత గీ దొరగ్గూడ పొయ్యకపోయినవ్‌! గందికనే ఆయిన దెప్పుతున్నట్టుంది”. శావకపోల్ల ఎంకటేసులన్నడు.
పాండురంగారావుకు ఆల్ల ఆశికపు మాటలు ఇనిపిస్తలెవ్వు. ఒల్లంత సల్లజెమటలు పట్టినట్లయ్యింది. ఆపాము యాన్నోతననంటుకుంటె ఏమయ్యేది గతి?” తల్సుకునే సరికి గుండెదడ మొదలయ్యి గుడ్లల్ల నీళ్లు దిరిగినయ్‌. ఏకొడుకు తాన్నో ఉండక ఎందుకు తనకీ ఎవసాయం బాధలనిపిచ్చింది.
”ఏందిరా పాండురంగం గిట్టాయె! నువ్వు లేశినయాల్ల జరమంచి గున్నట్టుంది గని, లేకుంటె ఇయ్యాల నీ లగ్గమయ్యేదే ఉండె” అన్నడు, యాదగిరిరావు. పాండురంగారావు సప్పుడు జెయ్యలే.
”ఏదో లేర నీపిల్లలదురుష్టం బాగుంది, గని గీ గొంగడేడ సంపాయిస్తివి! నిన్న మొన్న అమెరికల దెచ్చిన రగ్గు కప్పుకొని తిరుగుతుంటివి”. జరమాట మార్చాల్నని అడిగిండు యాదగిరిరావు.
”పొయినేడుగా పాలమూరి కుమోల్లు కాల్వ కిందికి మేపులకు బోతప్పుడు రొండు మూడు రోజులు మందను పండబెట్టిస్తిని గద మడికట్లల్ల, ఆల్లు రొండు మూడు గొంగళ్ళు తెచ్చిండ్రు ఎంట. నేను ఒద్దొద్దంటుంటె ఓటి తీస్కోదొరా అని అంటగట్టిండ్రు. ఇయ్యాల అదే నా పానానికి అడ్డు బడ్డట్టయ్యింది.” చెప్పిండు పాండురంగరావు.
”రేకలు బారంగ గా చిర్రయొయినోని ఎనుగుకాడ ఇరుకు గుంజ దాటితప్పుడు తగిల్నట్టుంది. బుస్సుమని సప్పుడయ్యింది. గని నేనే చెవున బెట్టలే”.
అందరు కాసేపు పురుగు ముట్టిన ముచ్చట్లు, తేలు గరిశిన ముచ్చట్లు చెప్పుకుంటుంటె సంజీవ యాపకొమ్మను కర్రతోటి గొట్టి అందరికి పల్లు గర్రపుల్లలు తెచ్చిచ్చిండు. పుల్ల నములుకుంట ఇంటిబాట బట్టిండు పాండరంగారావు.
”మొకం కడుగరాదుర ఈన్నే ఇంత చాదాగిపోదువు” అన్నడు యాదగిరిరావు. ఆయిన బాయికాన్నే ఇల్లు గట్టుకున్నడు.
”ఒద్దే! కాసేపు పుల్ల నమిలి ఇంటికి పోయినంక కడుగుత”. ఎల్లిపొయిండు పాండురంగారావు.
అయిన ఎల్లి పొయినంక గూడ అందరు అదే ముచ్చట తీరు తీరుగ చెప్పుకున్నరు. అంబటాల్లప్పుడు ఊల్లెకు పాండురంగా రావింటికి పొయిండు యాదగిరిరావు. పోతాలకు నవారు మంచమ్మీద అడ్డ మొరిగున్నడు పాండురంగారావు. భార్య యశోదమ్మ ఒట్టి మిరపకాయలు తొడిమలు తీస్తున్నది కారం గొట్టియ్యటానికి.
”ఏదమ్మ కోడలమ్మ ఎందుకు మీకీబాధ? ఆయిగ యొడుకుల కాడికి బొయ్యి అయిదారాబాదుల్నో అమెరికాల్నో” కాలుమీద కాలేస్కోని కూసోక.
”యాడికో అయిన కాడికి పొలాన్ని పాలుకో పంపుకో ఇయ్యక” ఎవసాయం జేపిస్తనని ఆడు చీకట్ల బావుల పొంట తిరుగుడేంది? నువ్వు మిరపకాయలు తొడిమల్దీసుడేంది? కుక్కకు నెయ్యిమడనట్టు సుకపడే రాత లేదా ఏంది మీకు?” ఒస్తొస్తనే దండకం మొదలు బెట్టిండు యాదగిరిరావు.
”రావే! కక్కయ్య” పొద్దట్నించి నేనుగూడ అదే అనుకుంటున్న నువ్వు గామాటే అంటున్నవు గని రా! కూసుందువు” పండుకున్నోడు లేశికూసుండు పక్కన యాదగిరిరావు కూసుండు.
”అవును మామయ్య! ఈయన రేకలు బారంగ లేశి బాయికాడికొస్తప్పుడు మా కుక్క చెవులు లొటలొట గొట్టింది. ఎందుకయ్య గింతచీకట్ల నువ్వు బాయికాడికి బొయ్యి చేసేదేముంది? పొద్దున్నే పోదువంటె ఇన్లే, ఎంత గండం దప్పిందియ్యాల!” పుస్తెదీశి కండ్ల కద్దుకుంది యశోదమ్మ.
మొన్న మాచిన్నోడు గూడన్నడు అమెరికల అక్కన్నే ఓ కోళ్ళఫారమో, కోడెల ఫారమో కౌలుకు తీసుకొని ఉండొచ్చునని. ఈనేమొ మనూరు మనూరని ఈనించి ఎటూ పోనంటుడె”. అన్నది యశోదమ్మ.
”సాల్లేవే! లెస్ప ఎచ్చులు మాట్లాడినవుగని. ఏదో కడగనోడ భద్రాచలం పోరా అని సామెత చెప్పినట్టు మనం అమెరికల ఉన్నకాడికి చాల్లేదా ఏంది?” కసురుకుండు పాండురంగారావు.
”ఏందిర గట్ల మాట్లాడుతవ్‌? కోడలు మంచిగ సూసుకోలే?” యాదగిరి రావడిగిండు.
”ఎందుకు సూసుకోలేదే! మంచిగనే సూసుకున్నది గని ఓ మాట చెప్పితోడులేడు ముచ్చట చెప్పితోడు లేదు అక్కడేడ ఉంటమే మనం? ఉత్తగ ఉపసమ్మతికి అనుకునేదేగని”- పాండురంగారావు.
”మరయితే పట్నంల పెద్దోని కాడనన్న ఉండొచ్చు గదరా!”
”గదే! గటే పోదామనుకుంటున్న ఇయ్యాల పొద్దటినించి, అయినాగని ఆ బస్తీల పొంట ఉండాలంటె కట్టేశినట్టే ఉంటదే పానం. కోడండ్లు మంచిగ సూసుకున్నాగని మన అలవాట్లు మనకుండె. ఎప్పుడన్న ఓపాలి ఆల్లు ఏమన్న అంటె పానం గరుగ్గుమంటది. అందికనే యాడుంటోల్లు ఆన్నే ఉండాల్నని ఈడ ఉంటున్న” చెప్పిండు పాండురంగారావు.
”ఈ ఎండకాలముల భూమిని ఓల్లకన్న అంటగడదామనుకుంటున్న” అన్నడు.
”అవున్రా! నీనుగూడ గాముచ్చటే మాట్లాడుదామని ఈడిదాక ఒచ్చిన. ఇగ పోయొస్త” లేవబోయిండు యాదగిరిరావు.
”పోదువు గాని కూకో”!
”గా తలుపు గూట్లె సీస, రొండు గిలాసలు పట్టుక రావమ్మ గిట్ల”. భార్య తోటి చెప్పిండు.
”ఏందిరో నేను పొద్దున అన్నందుకా ఏంది? ఇప్పుడు మందెందుకుర? గవుండ్ల రాములు ఈదులకు బొయిండు ఇప్పుడె బాయికాడికి. ఇయ్యాల పుట్టగడ్డమీది పెద్దీదు కున్నది యార. ఆడికే పోదాంపా! మందేడికి పోద్ది? పొద్దుగూకాల తాగుదాంగని” యాదగిరిరావు.
”కాదే! మందుదేముంది గని కాసేపు కూసోరాదు! మా పట్వారీల పేర్లు మార్చి గప్పుడు వి.ఏ.ఓ.లన్నరు, ఇప్పుడు మల్ల వి.ఏ.ఓ.లను తీసి గ్రామ కార్యదర్శులను బెడ్తరంట. ఆపోస్టుకు నేను సరిపోను ఇప్పుడు. అందుకనే భూమిని పాలుకిచ్చి పెద్దోని కాడికి పోదామనుకుంటున్న నువ్వే సూడ్రాదు ఓల్లనన్న”.
యశోదమ్మ మందు సీసా గిలాసలు తెచ్చి మంచం పక్కన స్టూలు మీద పెట్టింది. చెరింత ఒంచి నీల్లు బోశిండు పాండురంగారావు. తాగుతున్నరిద్దరు.
”ఓల్లో ఎందుకుర! మా బుచ్చిరాములు పోరలుండిరిగా ఇద్దరు, ఓల్లోల్ల భూములో పట్టి చేస్తున్నరాళ్ళు. ఆల్లే జేస్తరు చెరింత. రేపు మీ పిలగాన్ని గూడ పిలిపియ్యరాదు మాట్లాడుదాం” అన్నడు యాదగిరిరావు.
రొండు రోజుల సెలవులు చూసుకొని పెద్దకొడుకొచ్చిండు. బిడ్డ అల్లుడు గూడ ఒచ్చిన్రు. యాదగిరి రావు మనుమల తోటి భూమికి మక్త, మునాఫ మాట్లాడుకున్నరు. యాసంగి వరి చేలు కోతలయినంక పెండ్లాన్ని ఎంటబెట్టుకోని పట్నం పెద్దకొడుకు తానికి బొయిండు పాండురంగారావు.
”మామయ్యా! మీరు పాలు దాగుతరా లేకపోతె బూస్ట్‌ కలిపియ్యనా మీగ్గూడ” కోడలు శర్మిష్ట పిల్లలకు బూస్టు కలిపిచ్చుకుంట మామగారినడిగింది.
”నాకు బూస్టెందుకమ్మ! ఇప్పుడే మీ అత్తమ్మకు చెప్పిన గింత చాయ్‌ తెమ్మని. నేను చాయ్‌ తాగతగని మీరు పాలు తాగండిర బంటీ! చంటీ! మనం బైటికెల్లి ఆడుకుందాం”.  అని కోడల్తోటి, మనుమల్తోటి అంటుంటే యశోదమ్మ చాయ్‌ తెచ్చింది.
”ఇప్పుడు బయిటికెందుకులే మామయ్య! నేను వీల్లిద్దరిని కూసోబెట్టి ఒక అరంగంట సేపు హోంవర్కు చేయిస్త. మీరు దగ్గరుంటె అస్పటు చదువకుంట అయిండ్రు ఇద్దరు”.అని కొడుకుల్ని తీసుకొని లొపలి గదిలకు ఎల్లిపోయింది కోడలు.
”ఇన్నిన్ని పుస్తకాలు ఏస్కోని పొద్దుననంగ పొయ్యి ఇప్పుడే ఇంటికొచ్చిరి పోరలు, మల్ల అప్పుడే సదువంట. పోరల్ని కాసేపన్న ఆడుకోనియ్యకుంటె ఎట్ల ముంగల బడ్తది?” తనకు తనే అనుకున్నడు పాండురంగారావు.
”ఆల్లు సదువుకునేది, ఆడుకునేది ఆల్ల అమ్మకు దెల్వదా ఏంది! నీకవంత పొద్దుబోకుంటె అట్ల ఇంటి ముంగలికి బొయ్యి ఆచెట్లకు నీళ్లన్న బొయ్యిరాదు! పని పోరడు ఒక్కడే తిప్పలు బడుతున్నట్టుంది”. సలహా ఇచ్చింది యశోదమ్మ.
”ఏమోనే ఈడ అసలు పొద్దు బోకుంటయ్యింది. ఊట్లె ఉంటె పొద్దున్లేస్తె ఓ కాయితం రాయమనో భూమి గొలువమనో ఆడో ఈడో ఇంటికి ఒస్తుండిరి. కోడలు మామయ్యా అని కడుపు నిండ పల్కరిసున్నాగని ఊరు మీదికే గుంజుతున్నది పానం”. అనుకుంట బైటికెల్లి పోయిండు. యశోదమ్మ వంట గదిలకెల్లి పోయింది.
బైట ఇంటికి గేటుకు మజ్జన ఉన్న ఖాళీ జాగల గులాబీలు, చామంతులు, రకరకాల పేర్లు దెల్వని పూలమొక్కలు చాలా ఉన్నై, పైపుతోటి నీళ్లు బెడుతున్నపని పోరల తోటి కలిశిండు పాండురంగారావు.
ఇంతల నల్గురైదుగురు అమ్మలక్కలు కారునిండొచ్చి ఇంటి ముంగల దిగిండ్రు. గంట గొట్టి ఇంట్లకు బొయిన్రు. వంట గదిల్నించి బయటికొచ్చిన యశోదమ్మ ఈళ్ళనిజూసి కోడలిని పిలుద్దామని లోపలికి పోతుండంగనే కోడలే బయిటికొచ్చింది.
”హాయ్‌! రండి రండి కూర్చోండి. చాలా రోజుల్తర్వాత అంతా కట్టకట్టుకోనొచ్చిన్రు మా ఇంటికి ఏమిటి విశేషాలు?”.
మర్యాద చేసి పలుకరిచ్చింది. సోఫాలల్ల కూటబడ్డరందరు.
”ఏందే! తెల్వనట్టడుగుతవ్‌? మన క్లబ్బు యాన్వల్‌డే సంగతి మర్చిపొయినవా ఏంది? డొనేషన్ల కోసం తిరుగుతున్నం. నువు రావా? ఆర్‌యూ బిజీ?” అడిగింది ఆదిలక్ష్మి.
”ఏమే శర్మీ! కొత్తగ తోటమాలిని పెట్టుకున్నట్టుంది. మాతోటెప్పుడు చెప్పనేలేదు?” అడిగింది. పొరుగింటి ప్రసన్నకుమారి.

”కొత్త తోటమాలెవరే? మా ఇంట్ల ఉన్నది ఒక్కడే పనివాడు. ఇంకెవర్ని బెట్టుకుంటిమి మీకు దెల్వకుంట” అన్నది శర్మిష్ట.
”నో నో విసా యాన్‌ ఓల్డ్‌మాన్‌ దేర్‌, ఇంటి ముంగల ఓ ముసలాయన చెట్లకు నీళ్లు బోస్తుండు గద! అందుకే అడిగినం”.
వివరించింది ఆదిలక్ష్మి. ఆమెకు ఇంగ్లీషులో మాట్లాడాలని మహాఇది. ప్రతి మాట ఇంగ్లీషులో అని తెలుగు చెప్పుద్ది.
”అరే! అట్ల మాట్లాడ్తరేందే? పూలిష్‌గ ఆయన మా మామగారు. ఈ మధ్యనే ఊరునించొచ్చి ఇక్కడే ఉంటున్నడు. మీకు తోటమాలిలాగ కనిపిచ్చిండా? అత్తయ్యా! మామయ్యను రమ్మను. ఎవరో చెప్పినట్లు పొయ్యి చెట్లకు నీళ్ళు పెడుతున్నడంట”. విసుక్కుంట యశోదమ్మను కేకేసింది శర్మిష్ట.
”ఇక్కడ పొద్దుపోత లేదంటె నేనేపొమ్మన్ననమ్మ. పిలుస్త ఉండు”. బైటికెళ్ళింది.
దోతిని రొండు మడతలేశి లుంగోలె పైకి ఎగగట్టుకొని బనీనుకు చేతులు తుడుసుకుంట లోపలికొచ్చిండు పాండురంగారావు.
”పోనీలేవే! ఆ బోయినే తీసెయ్యరాదు. ఖర్చులన్న కలిసొస్తయ్‌” ఆదిలక్ష్మి మాటలు పాండురంగారావు కూడ ఇన్నడు. తన గురించేనా? అనుకున్నడు.
”వాడ్డూ యూ మీన్‌? ఆ అవసరం మాకు లేదు గాని నువ్వు కాస్త నోరు మూసుకుంటె బాగుంటది”. శర్మిష్ట కోపగించుకుంది. అప్పటికి గాని తాను మాట్లాడింది నవ్వులాట మాటలు కాదని ఆదిలక్ష్మికి అర్థంకాలేదు.
”చేసిన కాడికి చాలుగాని తోటమాలిపని ఆపి టి.వి చూసుకుంట ఇంట్లనే ఉండండి. మల్లగిట్ట పొయ్యేరు బైటికి”.
మామగారిని కసిరిచ్చి లోపలికెళ్ళింది శర్మిష్ట. బట్టలు మార్చుకోని బయిటికొచ్చినంక అందరు కలిసి బైటికెల్లిండ్రు.
పాండురంగారావు జెర మనుసుల కలుక్కుమన్నది. థూ! నీయమ్మ! ఏంది ఈడికొచ్చి ఏది జేద్దామన్నా తప్పే అయిపాయె. ఆయిగ ఇంత కల్లుబొట్టు తాగి ఆడీడ బాతకాని కొట్టుకుంట ఊల్లె కల్ల ఉండక” అనుకున్నడు.
పట్నమొచ్చిన ఈనెల రోజుల్ని వరుసగ యాదికి తెచ్చుకుండు.
”ఏంది మామయ్యా! మీరిట్ల నట్టింట్ల బొగ్గు బట్టిలాగ పొగ ఒదుల్తుంటె మీమంత ఇంట్ల ఉండాల్నా? ఒద్దా? అట్ల బైటికి బొయ్యి తాగరాదురి ఆ సిగరెట్టు! హాలులో సిగరెట్టు తాగుతుంటె కోడలు కోప్పడ్డది ఒకనాడు.
అప్పట్నించి బైట లాన్ల కూసోని సిగరెట్‌ తాగుడు మొదలు పెట్టిండు. పీకలు సల్లార్చి పూల కుండీలల్ల ఏశిండని మల్లా కోపం చేసింది కోడలు.
”అరేయ్‌! చంటీ! తాతయ్య సిగరెట్టు ఎట్ల దాగుతడో చూపిస్త చూడ్రా” అని నోట్లె పెన్సిలు బెట్టుకొని యాక్షన్‌ చేసుకుంట తమ్మునికి చూపిస్తున్నడు పెద్దోడు బంటి. అది చూసిన శర్మిష్ట గయ్యిమని ఇంతెత్తు లేశింది ఇంకొక నాడు.

”ఏంరా నీకు సిగరెట్‌ కాల్చడం ఒచ్చిందా అప్పుడే” అని వాని వీపు మీద రెండంటించింది.
”అయ్యొ! ఎందుకమ్మ వాన్ని అట్ల గొడుతవ్‌” అని అక్కడే ఉన్న పాండురంగారావు అడ్డం బోయిండు.
”ఆ లేకపోతే మిమ్మల్ని గొట్టాల్నా? ఒద్దంటె ఆ పాడు సిగరెట్లు మానుకోరు. లేకపోతే ఆ తాగేదేదో సాటుకుబొయ్యన్న తాగరు. ఏం మనుషులో ఏమో, పోరలు పాడయితట్టుంది”. కోపంతోటి జెర పెడసరంగనే మాట్లాడింది కోడలు.

అప్పట్నించి సిగరెట్‌ తాగడం తక్కువ జేశిండు. రోజు రెండు మూడు సార్లు బాతురూములకు బొయ్యి తాగొస్తన్నడు.

”ఏంది మామయ్య! ఎట్ల జెప్పాలె మీకు? బాతురూము నిండ ఇట్ల పొగ నింపి ఒస్తె మల్లోల్లనన్న పోవాల్నా? పోవద్దా? లోపలికి”.
ఒనాడు ఆయిన బైటికి రాంగనే లోపలికి బొయిన కోడలు మళ్లీ కసురుకున్నది.
ఇంత బతుకు బతికి ఇంటెనక పడి సచ్చిందని ఏంది నేను ఈడికొచ్చి దీనితోటి మాటలు పడవలసొచ్చె” అనుకున్నడు.

”మల్లింత చాయన్న బెట్టిస్త ఉండు తాగుదువుగాని”
చిన్నబుచ్చుకోని కూసున్న భర్తను అడిగింది యశోదమ్మ. ఆయిన ఇనిపిచ్చుకోలేదు.
”ఏందయ్య! గిటు మనిషి మాట్లాడుతుంటె గక్కడ గుడ్లెల్లబెట్లి సూస్తున్నవ్‌?” గదమాయించి అడిగింది.
”ఏందే? ఏమో అంటున్నవ్‌?” అప్పుడే క్యాల్లెకొచ్చినట్టు అడిగిండు.
”ఏందేవులాడుకుంటవ్‌ గని మల్లింత చాయ్‌ బెట్టయ్యమంటవా?” మళ్లీ అడిగింది యశోదమ్మ.
”ఒద్దే! చాయొద్దు గీ యొద్దు గని, పెద్దోడు రాంగనే మనం ఊరికి బోదామే ఇయ్యాల” అన్నడు.
”అనంగనే ఏంబాయె! మనమే సదురుకోవాలె” అనుకుంట వంటగదిలకు బొయ్యి చాయ్‌ తెచ్చింది యశోదమ్మ.
”చిన్నప్పట్నించి ఒచ్చిన అలవాట్లు ఇయ్యాల ఈళ్లకోసం మర్చిపోవాల్నంటె ఐతదా? నీకేందెల్వదు గని ఊకో, ఉంటె నువ్వు ఈన్నే ఉండు. నేనొక్కన్నన్నబొయ్యి ఊల్లె ఉంట”. అన్నడు.
”నిన్న మొన్న నంటె సిగరెట్‌ తాగుడు తప్పాయె. మరి ఇయ్యాలేమాయె? ఆల్లకు నచ్చినట్లు మనముండలేమాయె. మనల్నుజూసి ఆల్లు ఓర్చుకోరాయె. అందికనే ఎక్కడ ఉంటోల్లు అక్కడనే ఉంటె మంచిది”. అన్నడు మళ్ళీ చాయ పూర్తిగ తాగకుంటనే కప్పుల సగం ఒదిలిపెట్టిండు.
సందకాడ బువ్వల్దింటప్పుడు యశోదమ్మ ఎల్లబెట్టింది ముచ్చట.
”బాపుకు ఈడ ఉండబుద్ది ఐతలేదంటరా! ఇంటికి బోతనంటున్నడు – అన్నది.
”అదె బాపూ! ఏమున్నది ఇంటికాడ? బుక్కెడు దిని నీడ పట్టున ఉండేదానికి, మీ కోడలు గిట్ట ఏమన్న అన్నదా ఏంది”. అడిగిండు కొడుకు.
”లేదురా! కోడలేమన్లే. నాకే పొద్దు పోతలేదీడ. ఓ మాట్లాడ్తోడు లేడు. ముచ్చట బెడితోడు లేడు. దయ్యమున్నట్టు ఒక్కనికి ఎట్టుండబుద్దైతది చెప్పు”.
”లేదండీ! మధ్యాహ్నం మాఫ్రెండ్సొచ్చినప్పుడు మామయ్య చెట్లకు నీళ్లు బెడుతుంటె చూసి తోటమాలా? అని అడిగిండ్రు. నేను ఆళ్ల మీద కోప్పడ్డగని, మామయ్యను గూడ కసురుకున్న అందుకే బాధ పడ్డట్టుంది”. శర్మిష్ట వివరించింది.
”కాదమ్మా! అప్పుడు నేవ్వేమన్నవని నేను బాధపడ్త? నాకే ఉండబుద్ది గాక పోతనంటున్న గని” అన్నడు.
”ఇంటికాడ ఉండననే ఈడికొస్తివి గద బాపూ! కాకపోతె అమ్మనువ్వు ఇద్దరు బొయ్యి పదిరోజులుండి రాది ఊల్లె, కళ్లాలు గూడ అయితున్నట్టుంది ఇప్పుడు”
”ఏమోర! నాకు ఆ అమెరిక కన్న, ఈ హైద్రాబాదు కన్న  మనూల్లెనే మంచిగనిపిస్తది. మనూరి తాటికల్లు మీదికే పానం గుంజుతది. కాకుంటె అప్పుడో, ఇప్పుడో ఒచ్చి రెండు రోజులుండి పోతగని, రేపు బస్సెక్కియ్యర నన్ను” కరాకండిగ అడిగిండు పాండురంగారావు.
”మరి నీకెట్లనిపిస్తున్నదమ్మ ఈడ? నువు గూడ ఉంటవా? పోతవా? బాపు తోటి గలిశి” తల్లి నడిగిండు.
”ఏమోర! నాకు ఆ ఒంటింట్ల బానే పొద్దుపోతున్నది గని, నేనీడ ఉంటె ఆయన ఒక్కడెట్ట తిప్పలు బడ్తడు ఆడ. ఉంటె ఇద్దరముంటం పోతె ఇద్దరం పోతం గని”. తేల్చి చెప్పింది యశోదమ్మ.
పొద్దున్నే ఇద్దర్ని బస్సెక్కించి ఊరికి బంపిండ్రు కొడుకు కోడలు బస్టాండుదాకొచ్చి సాగనంపిండ్రు.
సుకపడే రాతలేక మల్ల ఊల్లె కొచ్చిండని అనుకున్నరందరు. అంతేగని కొడుకుల గూల్లల్ల తనకు ఇంత చిక్కని నీడ దొరకడం కష్టమయ్యిందని ఎవ్వరికి అర్థం కాలేదు.
రెండు మూడేండ్లు గడిచినై.
ఏట చిన్న కొడుకు అమెరికా నించి ఒచ్చినప్పుడు కొడుకులు, కోడండ్లు, బిడ్డ, అల్లుడు గలిసి ఊల్లెకొచ్చి సుట్ట పక్కాల్ని పిలుచుకొని మంచిగ యాటలు గోశి దావతు చేసుకునేటోల్లు. ఒచ్చిన సుట్లపక్కాలు” అదృష్లమంటె నీదేరా పాండూ!” అని మెచ్చుకుంటుంటె” ఏమదృష్టమో ఏమో తలంత బలగాన్నిఏ బాశా ఒంటి బేగరోని బతుకయిపోయిందని బాధపడెటోడు పాండురంగారావు.
ఈ మధ్యనే కంటి సూపు బాగ తగ్గిపోయిందాయనకు, లేచి తిరుగులాడుతడు గని బాగ చాతగాకుంటయ్యింది. ముదాం మంచముల్నే పండుకోనుంటున్నడు. ఏడాదో, ఏన్నర్థమో అయింది యశోదమ్మ కాలం జేశి. ఆరోగ్యంగ తిరుగులాడే మనిషి ఓనాడు సుకసుకా అని కింద బడ్డది. నల్లగొండ దావకానకు పోతుంటె తోవల్నే పానం బొయ్యింది. మొదడు నరాలు చిట్లినయనో ఏదో కారణం చెప్పండ్రు డాక్టర్లు.
కోడండ్లు కొడుకులు హైద్రాబాదులో ఉండమన్నరు పాండురంగారావును, మనిషి సశాం ఇనలే. ఊపిరి బొయినా గని ఊరొదిలి రానన్నడు. ఇప్పుడిగ ఊరొదిలి పొయ్యేకాలమొచ్చినట్టుంది. పిల్లలందర్ని రమ్మని కబురు పెట్టిండు.
”ఏంరా బుచ్చి రాములూ! పిల్లలోలన్న ఒస్తమన్నార్ర ఇయ్యాల?” అప్పుడే మంచం కాడికొస్తున్న తమ్ముడు బుచ్చిరామా రావును అడిగిండు. ఈయన కొడుకులే పాండురంగారావు భూమిని చేసుకుంట పెదనాయినను యాల్లమాల్ల చూసుకుంటున్నరు.
”ఏమోనే! చిన్నోడు ఆస్ట్రేలియాల్నో యాన్నో ఉండంట. పెద్దోడు ఢిల్లీకి ఏదో మీటింగుకు బొయిండంట. వచ్చే వారమొస్తమన్నరని ఇందాక ఫోను జేస్తే హైద్రాబాదు నించి కోడలు చెప్పింది”. అన్నడు.
కూతురొచ్చి రెండు రోజులుండి పిల్లల్తోటి భర్త తిప్పలు బడలేడని నిన్ననే ఎల్లిపొయ్యింది.
పాండురంగారావు సప్పుడు జెయ్యకుంట అటుదిరిగి ఒత్తిగిల్లి పండుకున్నడు. పొద్దుగూకాల ఆరున్నరో, ఏడో కావస్తున్నది. యాసంగి వరికోతల రోజులు, గవుండ్లోల్లు తాటి చెట్లను రెండు పూటల ఒడుస్తున్నరు. అప్పుడే జీతగాని పోరడు కల్లులొట్టి దెచ్చి మంచం కాడ పెట్టి పొయ్యిండు.
”అన్నా జరలేశి కూసోరాదే! రొండు గిలాసలు కల్లు తాగుదువు.” బుచ్చిరాములు చెయిబట్టి లేపబొయ్యిండు.
”ఒద్దురా! నాకియ్యాల పొద్దటినించి మంచినీల్లు గూడ సయిస్తలెవ్వు. మీ ఒదినే గుర్తుకొస్తున్నది. మాటిమాటికి, పిల్లగాల్లొచ్చిందాక ఉంటనో, ఉండనో అని బయమైతున్నది” అన్నడు.
”ఎందుకే అట్ల మాట్లాడుతవ్‌? మేమంత లేమా ఈడ! పిల్లలు మటుకు ఎందుకు రారు! ఆల్లె ఒస్తరు గని, గింత కల్లు తాగరాదు, ఎండకు ఒల్లు సల్లబడ్తది”.
”సూశినావుర బుచ్చిరాములూ! కడకు కాలమెట్టొచ్చిందో? నీ పిల్లలకు సదువొస్తలేదని ఊకె బాధపడ్తివి నువ్వు. నా పిల్లలు సదివి సంపాయిస్తున్నరని ఊరోల్లంత నన్ను అదృష్టవంతుడవంటె నిజమే అనుకుంటి నేను కాని ఇయ్యాల నిన్ను, నన్ను గూడ చూసుకుంటోల్లు చదువుకోని నీ పిల్లలేనయిరి. ఏందో ఈ రుణ బంధం. తలాపున సముద్రమున్నా దూపకు పనికి రానట్లు కొడుకులు కోట్లు సంపాయిస్తున్నా నాకు సుకపడే రాత లేకపాయె”. ఏడుస్తూ రెండు చేతులు జోడించి పైకి దేవునికి దండం బుట్టుకున్నడు.
”ఏందే! ఊకూకనే ఏడుస్తున్నవ్‌!  ఇంతల్నే గింత డీలపడి పోతవేందే! లే! ఇగబటు, ఈగిలాసదీసుకో”.
కల్లు గిలాసను కిందబెట్టి అన్నను లేసి బలవంతంగ మంచలం కూసోబెట్టిండు బుచ్చిరాములు, గిలాస చేతబట్టుకోని రెండు గుటుకలు మింగిండు పాండురంగారావు. మూడో గుటుకకు సరానబడ్డది. గట్టిగ దగ్గిండు. గిలాస జారి కింద బడ్డది. ముకుల్లనించి కల్లుసుక్కలు బైటికొచ్చినయ్‌. ఒక్కసారే మంచంల ఎన్కకుబడి ఊపిరాడక అయాసపడుతున్నడు.
”అరేయ్‌ ఉరికారార్రో! పెదనాయినకు కల్లు సరానబడ్డది. ఎట్నో చేస్తున్నడు”. అని బుచ్చిరాములు అన్న ఎదుర్రొమ్ము, గొంతు తుడుసుకుంట ఇంటి ముంగలున్న కొడుకుల్ని పిలిచిండు. ఆళ్ళు లోపలికొచ్చిండ్రు.
”రొండు బుక్కలు నీళ్ళు దాగుపటు, ఏంగాదుగాని”. నీళ్ల గిలాస దెచ్చి నోటికాడ బెట్టి ఈపిన చెయ్యేసి మంచంల కూసబెట్టి పట్టుకున్నడు, తమ్ముని పెద్దకొడుకు.
నీళ్లు మింగబొయిండు పాండురంగారావు. మింగుడుబడలే. నీళ్లు ముక్కుల్లనించి మల్ల బయిటికే ఒచ్చినయ్‌. ఆయాసం ఎక్కువైంది. తమ్ముని చిన్నకొడుకుని గూడ దగ్గరికి రమ్మని సైగ జేశిండు భూమి దిక్కు ఆకాశం దిక్కు చెయ్య చూపిచ్చుకుంట ఏదో చెప్పబొయిండు. పెదనాయిన ఏం జుప్పుతున్నడో అర్థంకాకున్నా, అర్థమయినట్టు తలూపిండ్రు ఆల్లు. పెదిమలు ఏం కదిల్నయి గాని నోట్లెనించి మాటలు రాలె. తెల్లగుడ్లు పైకొచ్చి తెరుచుకున్న కండ్లు మూతలు పడలేదు. ఒళ్ళు సల్లబడ్డది. చయితోటి కల్లు మూసి మంచం మీదినించి కిందికి దింపిండ్రు.
కొడుకుల సెల్లునెంబర్లకు ఫోను జేశిండ్రు.

అభిప్రాయాలు లేవు »కథలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో