Feb2008
పడవ కాలిపోతోంది
వెన్నెల్లో చీకటి పడ్డట్లు
అప్పటిదాకా వెలిగిన
దీపమేదో నిశ్శబ్ధంగా
రాత్రిలోకి జారుకుంది.
ఆవలి వొడ్డున
అతనూ, నేను, పడవా
చిదుగుల మంటకు
కాగుతున్న చలీ
కరిగిన కొవ్వొత్తీ
పాదాల దగ్గర చేరి
గడ్డ కట్టిన కాలమై ప్రశ్నిస్తున్న
వెన్నెముకని
ఛిద్రం చేసుకు పోవాలని
ప్రయత్నం చేస్తూ
ఓడిపోయిన బుల్లెట్
అతనితో పాటు
నిశ్చలమై
అలలకు ఒక్కొక్క రక్తపు బొట్టును
అద్దాలనే ప్రయత్నంలో
పారిపోతున్న నీళ్ళను గమనించి
ఎరుపు ఎంత వెర్రిభయాన్ని
కలిగిస్తోందా
అని ఆశ్చర్యపోతుంది.
ఆరగట్టిన వలలు
అటేపుగా వీచడానికే
భయపడుతున్న గాలికి
నేలమీద పడి
దండం బెడుతున్నై
ఆరాత్రికీ
మిగితా అన్ని రాత్రులకీ
తేడా తెలుసుకున్న అడవి
ఇనుప బూట్లకు దారిచ్చి
భయంగా తలొంచుకుంది.
అడవి మీదా
ఏటి జాలు మీదా
వేట గుర్తులు
శాశ్వతంగా చిత్రించి
నదిదాటించిన
అతడి దేహపు పడవని
సగం కాల్చి, సగం ఆర్పి
వదిలేసిన నిన్ను
ఏమి కాల్చటం లేదూ !?
ఏ మాత్రం క్షమించకూడని
పొరపాటు తూటావి నువ్వు
నిన్ను మనిషని ఎలా పిలువనూ.
నువ్వు కొత్తగా
కట్టుకున్న ఇంట్లో
కాలి పోతున్న పడవబొమ్మ నొకదాన్ని
చిత్రించాలనుంది నాకు,
నీ ఊపిరి లోకి
ఎండిన నెత్తుటి మరకల
నీచు వాసను
నింపాలనుంది నాకు.
అతడు అశక్తుడు
చేపలవేట చేయలేడు
నువ్వు వేటగాడివి
నిన్ను జ్ఞాపకాలు వేటాడుతుంటే
ఏచేతినీ
అడ్డం పెట్టుకోలేవ్
అతడు బతికినంతకాలం
నువ్వు ఛస్తూనే వుండు.
అతడి వెన్నులో బులెట్ కలుక్కుమన్నప్పుడల్లా
నీచేతిలో తుపాకీ
పిచ్చి కుక్కై నిన్ను కరుస్తూనే వుంటుంది.
(పొరపాటు కాల్పులో చచ్చి బ్రతికి జీవచ్ఛమై పోయిన జాలరి వెంకన్న కోసం)
p.srinivas goud Feb 29, 2008 1
కవిత బాగున్నా,అందాల్సినంతగా అందటం లేదు.ఆర్ద్రత లోపించింది.
swati sripada Mar 12, 2008 2
ప్రాణహిత చాలా బాగుంది.
సాహితీ ప్రియులకు అమ్రుతం లా.