సూక్ష్మజీవుల ప్రతాపం

బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చెయ్యగలవో పూర్తిగా అర్థం కావటంలేదు. పరిశోధనల్లో బైటపడుతున్న కొత్త విషయాల్లో వాటి గురించిన మంచీ, చెడూ కూడా తెలియవస్తోంది. ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచంలో ప్రతిచోటా నిలదొక్కుకుని జీవిస్తున్న రకరకాల బాక్టీరియాను తప్పించుకోవడం అసాధ్యమైన పని. పనికిరాని చెత్తనూ, కుళ్ళిన జీవ పదార్థాలనూ ఎప్పటికప్పుడు విడగొట్టి మట్టిలో కలిపేసే బాక్టీరియా మనకు పనికొచ్చే ఆహారాన్ని కూడా “పాడు” చేస్తూ ఉంటాయి. మానవులు సమాజజీవితం మొదలుపెట్టిన నాటినుంచీ ఆహారాన్ని చెడిపోకుండా నిలవ ఉంచుకోవటానికి నానా అగచాట్లూ పడుతూనే ఉన్నారు. ఎండబెట్టిన పదార్థాలు నిలవఉంటాయని వారు గ్రహించారు. బాక్టీరియా పెరగడానికి తేమ అవసరం కనక వాటిని అరికట్టేందుకు ఇదొక పద్ధతి. అలాగే చలి దేశాల్లో ఆదిమానవులు ఆహారాన్ని మంచు పేరుకున్న గుహల్లో దాచుకునేవారు. ఈ రోజుల్లో ఆధునిక పద్ధతులెన్నో అమలులో ఉన్నాయి. ఫ్రీజ్‌ చేసి చల్లబరిచి బాక్టీరియా పెరుగుదలను నిరోధించడం, వేడి గాలిలో ఎండబెట్టడం, గామా కిరణాలకు గురిచేసి బాక్టీరియాను నాశనం చెయ్యడం మొదలైనవన్నీ కనబడని సూక్ష్మజీవులతో మనం సాగించే పోరాటంలో భాగాలే.

rp_7a.JPG

 

మన నోళ్ళలో ఉండే బాక్టీరియమ్‌

పరిశోధకులు బాక్టీరియాను ఏరకానికా రకంగా విడదీసి ప్రయోగాలు చేస్తారు కాని ప్రకృతిలో మాత్రం అనేక రకాలు కలిసి తుట్టెలాగా జీవిస్తూ ఉంటాయి. మన శరీరాల లోపలి భాగాల్లో పలచని పొరలాగా వ్యాపించినట్టే ఇవి సామాన్యంగా నీళ్ళలో ఉన్నప్పుడు నీటికీ, గాలికీ మధ్య ఉపరితలం మీద తేలుతూ ఉంటాయి. పెద్ద సిటీల్లో ఎందరో ప్రజలు కలిసి ఉన్నట్టుగా ఇవన్నీ తమతమ ప్రత్యేక విధులు నిర్వహిస్తూ కలిసిమెలిసి జీవిస్తాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అలాంటి పరిస్థితుల్లోనే పరిశీలించాలని శాస్త్రవేత్తలకు అనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం బాక్టీరియా జాతుల్లో తెలియనివి 95 శాతం మిగిలే ఉన్నాయి. తెలిసినవాటి జీనోమ్‌ పటాన్ని వారు తయారుచేస్తున్నారు. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ పద్ధతుల్లో వాటిని మనకు ఉపయోగపడేట్టుగా మార్చుకోవడంకూడా మొదలైంది. అమెరికాలో బంగారుగనుల్లో వాడే రసాయనాల్లో సయనైడ్‌, పాదరసం, ఆర్సెనిక్‌ మొదలైన విషాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గమనించారు. ముప్ఫై ఏళ్ళ తరవాత సయనైడ్‌ను సహించడమేకాక, దాన్ని ఆరగించే బాక్టీరియాను కృత్రిమంగా సృష్టించారు. అందువల్ల ఒకప్పుడు విషప్రాయం అనిపించిన సెలయేళ్ళలో ఈనాడు చేపలు పట్టడం వీలవుతోంది.
బాక్టీరియా గురించి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. అంతకు మునుపెన్నడూ ఊహించని విధంగా అవి ఎన్నో రోగాలకు కారణమని ఆధునిక ప్రయోగాల్లో రుజువౌతోంది. వీటిలో గుండె జబ్బులూ, కేన్సర్‌వంటివి కూడా ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ జాబితాలో పాతరోగాలు కొన్నిటికి బాక్టీరియా ముద్దాయి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
పనితోనూ, సమస్యలతోనూ ఒత్తిడికి లోనయేవారిలో కొందరికి కడుపులో ఏసిడిటీ పెరగడం, అది ఎక్కువైతే అల్సర్లకు దారితియ్యడం మామూలే. జీర్ణకోశంలో ఉండే హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, పెప్సిన్‌ వంటి ఇతర ఎంజైములూ కడుపు లోపలి పొరను నాశనం చెయ్యడంతో పుండు ఏర్పడుతుంది. ఇటువంటి వ్రణం జీర్ణకోశంలోనో, చిన్నపేగుకు ముందుభాగంలో ఉండే ఆంత్రమూలం (డ్యుఓడినమ్‌)లోనో ఏర్పడి పైపొరను ఛిద్రం చేస్తుంది. అందువల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, వాంతులూ, కడుపులో మంట మొదలైనవి కలిగి, మరీ తీవ్రపరిస్థితిలో రక్తస్రావం, మరణం కూడా సంభవిస్తాయి. దీనికి వంశపారంపర్య లక్షణాలూ, ఆహారపు అలవాట్లూ, మానసిక ఆందోళనా వగైరాలే కారణం అనుకునేవారు.

ఆమ్లానికి విరుగుడుగా క్షారపదార్థాలను ఉపశమనంగా వాడి, మరీ ముదిరిన రోగానికి శస్త్రచికిత్స చెయ్యడం పరిపాటి. ఆస్ట్రేలియాలో దీన్ని గురించి 1982 ప్రాంతాలనుంచీ పరిశోధనలు చేస్తున్న బాబీ మార్షల్‌ అనే శాస్త్రవేత్త మాత్రం రోగుల జీర్ణకోశభాగాల్లో ఒక కొత్తరకం బాక్టీరియా ఉన్నట్టు కనిపెట్టాడు. ఈ విషయాన్ని ఇతరులు అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే జీర్ణకోశంలోని ఆమ్లద్రవాల్లో బాక్టీరియా బతికి ఉండే అవకాశమే లేదని ఏనాడో నిర్ధారణ అయింది. మార్షల్‌ మాత్రం తన పరిశోధనల ఫలితాలను గట్టిగా నమ్మి, సదరు బాక్టీరియా కలిపిన ద్రావకాన్ని తానే స్వయంగా తాగి అల్సర్‌ తెచ్చుకుని, ఆ తరవాత నయం చేసుకున్నాడు. ఈ సంఘటన వల్ల అతని ప్రతిపాదనకు ఆమోదం లభించడమే కాక అతనికి 2005లో నోబెల్‌ బహుమతి కూడా లభించింది.

ఇంతకీ బాక్టీరియా కడుపులోకి ఎలా చేరాయి? ప్రయోగాలవల్ల తెలిసినదేమిటంటే బాక్టీరియా జీర్ణాశయంలోని మ్యూకస్‌ పొర అడుగున దూరి దాక్కుంటాయి. అందువల్ల అవి ఆమ్లాల ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాయి. ఈ లోపల వాటి ఉనికిని పసికట్టిన రోగనిరోధక వ్యవస్థ వాటిని నిర్మూలించడానికని “టి” కణాలను పంపుతుంది. ఈ కణాలు మ్యూకస్‌ పొర అడ్డుగా ఉండడంతో బాక్టీరియాను సమీపించలేక ఇవతలే ఉండిపోతాయి. కొంతకాలం గడిచాక ఆ కణాలు చచ్చిపోయి, బాక్టీరియాను నాశనం చెయ్యగలిగిన వాటి రసాయనాలన్నీ మ్యూకస్‌ పొర మీద చిందడంతో దానికి హాని కలుగుతుంది. ఈ లోపల క్రిమిసంహారక కణాల పోషణకై శరీరం సరఫరా చేసిన ఆహారాన్ని బాక్టీరియా ఆరగిస్తూ ఉంటాయి.

rp_7b.JPG

జీర్ణకోశంలో అల్సర్‌

మిగతా విషయాలకొస్తే శరీరంలో పంటి చిగుళ్ళ వాపునుంచి మూత్రకోశ వ్యాధుల దాకా శరీరంలోని ఏ భాగంలో క్రిములు మనని ఇబ్బంది పెట్టినా అది గుండెజబ్బుకు రంగం సిద్ధం చెయ్యగలదని అంచనా. ఎలాగంటే క్రిములు రక్తప్రవాహంలో చొరబడితే అవి రక్తం గడ్డకట్టే పరిస్థితులు కలిగించగలవు. ఒక్కొక్కప్పుడు అవే ఎక్కువ మోతాదులో ధమనుల్లో పేరుకుపోయి, తూములోకి చేరిన మురికిలాగా రక్తప్రసరణానికి అవరోధం కలిగిస్తాయి. క్రిముల సంఖ్య పెరిగినట్టయితే రోగ నిరోధక చర్యకు పాల్పడే తెల్లకణాలన్నీ రక్తనాళాల్లోకి చేరి, అక్కడున్న కొలెస్టరాల్‌ కణాలకు తగులుకుంటాయి. అందువల్ల కూడా ధమనులు పూడుకుపోవచ్చు. ఇవన్నీ కొత్త విషయాలు. ఇంతకు ముందు గుండెజబ్బులకు బాక్టీరియా కారణమని ఎవరైనా అంటే నవ్విపోతారనే భయం ఉండేది. ఇప్పుడు ఈ దృక్పథం మారుతోంది.
మరొకవంక భూగోళపు మహాసముద్రాల్లో ఎన్నెన్ని రకాల బాక్టీరియా ఉన్నాయో, ఆక్సిజన్‌ తయారీతోబాటు అవి ఇంకా ఏయే ప్రక్రియలకు కారణమౌతున్నాయో ఇప్పటికీ సరిగ్గా తెలియదు. బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల జనాభా లెక్కలు కట్టే ఈ పరిశోధనలకుగాను ఇటీవల వంద కోట్ల అమెరికన్‌ డాలర్ల ఖర్చుతో పదేళ్ళపాటు కొనసాగే ప్రయోగాలను 70 దేశాల్లో చేపట్టారు. పర్యావరణంలో జరిగే పెనుమార్పుల విషయంలో వీటి పాత్ర ఎంతుందో తెలుసుకోవలసిన అవసరం ఉంది. వాతావరణంలో కలిగే మార్పుల మీదా, ఆక్సిజన్‌, కార్బన్‌వంటి పదార్థాల మోతాదు మీదా బాక్టీరియా ప్రభావం బలంగా పని చేస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఏటా సుమారు 15 వేల కోట్ల కిలోగ్రాముల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కొన్నిరకాల సూక్ష్మజీవులు మెథేన్‌ వాయువును పీల్చేసి, గ్రీన్‌హౌస్‌ ప్రభావాన్ని తగ్గించడంద్వారా భూగోళాన్ని వేడెక్కకుండా కాపాడగలవని అంచనా. మొత్తం మీద బాక్టీరియావల్ల ఎక్కువ లాభాలూ, కొన్ని నష్టాలూ మనకు తప్పవు. వాటి గురించి ఎంత బాగా తెలుసుకోగలిగితే మనకు అంత మంచిది.

ఈనాడు మనిషి ఎటువంటి క్రూరజంతువునైనా ఒక తుపాకీ గుండుతో లొంగదీసుకోగలడు. కానీ కంటికి కనబడని రకరకాల క్రిములు ఎప్పుడైనా, ఎక్కడైనా మన ప్రాణాలు తీయగలవు. ఎన్నిరకాల కొత్త మందులు కనిపెట్టినా అవి తమ స్వభావాలని మార్చేసుకుని మనమీద దొంగదెబ్బ తీస్తూనే ఉంటాయి. సైంటిస్టులు ఈ ఎడతెగని పోరాటంలో అహోరాత్రాలు శ్రమిస్తూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుణ్ణి తలుచుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా అంటురోగాలు (లేదా, వాటి గురించిన భయం) ప్రబలినప్పుడల్లా ప్రజల్లో సైన్స్‌ విషయాల పట్ల కాస్త ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల వార్తల్లో కెక్కిన బర్డ్‌ ఫ్లూ, కొన్నేళ్ళ కిందట కంగారు పెట్టిన సార్స్‌, దానికి ముందు పశువులకు సోకిన మాడ్‌ కౌ డిజీజ్‌ (బీఎస్‌ఈ) వగైరాలన్నీ ఈ కోవకే చెందుతాయి. వీటన్నిటికీ రకరకాల వైరస్‌లే కారణం. ఎపిడెమిక్‌ రూపంలో వ్యాప్తి చెందే రోగాలు ఎల్లలూ, సరిహద్దులూ పాటించకుండా లక్షలమందిని బాధిస్తాయి. మనుషుల మధ్యగాని, దోమలూ, ఎలుకలూ వగైరా ప్రాణుల ద్వారాగాని ఒకరినుంచి మరొకరికి పాకే భయంకరమైన రోగాలకు “ఘనమైన చరిత్ర” ఉంది. పధ్నాలుగో శతాబ్దంలో చెలరేగిన మహామారి యూరప్‌ జనాభాలో మూడోవంతును “పొట్టనపెట్టుకుంది”. 1918లో మొదలైన ఒక రకమైన ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా నాలుగైదు కోట్లమందిని “బలి తీసుకుంది”. యుద్ధాలూ, విదేశీ సైన్యాల దాడీ వగైరాలవల్ల రోగాలకు దారితీసే పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఇరవయ్యో శతాబ్దానికి పూర్వం యూరప్‌లో జరిగిన యుద్ధాల్లో ఆయుధాలతో పోలిస్తే ఎక్కువమంది రోగాల వాతపడి ప్రాణాలు కోల్పోయారు. యూరపియన్లు అమెరికా ఖండాన్ని కనుక్కోవడమే కాక అక్కడ ఆరోగ్యంగా జీవిస్తున్న ప్రజలకు తమ భయంకరమైన రోగాలను ఉచితంగా సరఫరా చేశారు. వాటికి ఇమ్యూనిటీ లేకపోవడంతో మెక్సికోలో కొన్ని ప్రాంతాల్లో స్పెయిన్‌నుంచి దిగుమతి అయిన రోగాలకు 90 శాతం జనాభా చచ్చిపోయారట.

rp_7c.JPG

 

బీఎస్‌ఈ వ్యాధి కారణంగా పశువుల్లో తినరాని భాగాలు

1. చిన్న పేగు, 2. వెన్నుపాము, 3. మెదడు, 4. కళ్ళు, 5. టాన్సిల్స్‌

మశూచి, క్షయ, పోలియోవంటి పాతరోగాలు అదుపులో వచ్చాయనుకుంటూ ఉన్న తరుణంలో కొత్తవి మొదలయాయి. 1970 తరవాత ఎయిడ్స్‌, ఎబోలా, హెపటైటిస్‌ సి మొదలైనవి ఆవిర్భవించడమే కాక పాతవాటిలో కొన్ని మందులను నిరోధించగలిగే అవతారాలెత్తాయి. 1980లలో పశువులకు తగులుకున్న బీఎస్‌ఈ బ్రిటన్‌నుంచి వాటి మాంసం ఎగుమతి విషయంలో పెద్ద ఉత్పాతాన్నే కలిగించింది. వైరస్‌ ప్రభావం వల్ల వాటి మెదడు తూట్లుపడినట్టుగా తయారయింది. ఎటొచ్చీ అది మామూలు వైరస్‌వల్ల వచ్చిన రోగం కాదని తేలింది. మనం సూక్ష్మజీవులుగా పరిగణించే బాక్టీరియాకన్నా వైరస్‌లు చిన్నవైతే వాటికన్నా వందరెట్లు చిన్నవి కూడా ఉన్నాయి. వాటిని ప్రీయాన్‌లంటారు. సూక్ష్మాతిసూక్ష్మమైన ఈ కణాలు “వక్రమార్గం పట్టిన” ప్రోటీన్‌ కణాలవంటివి.

rp_7d.JPG

ప్రీయాన్‌లు

పశువులకు పిచ్చెక్కించి ప్రాణాలుతీసేవి ఇవే. మెదడులోని నాడులమీదా, రక్తంలోని తెల్లకణాల్లోనూ, కండరాలూ ఇతర శరీర కణాల్లోనూ ఒకరకమైన ప్రోటీన్‌ కణాలుంటాయి. వీటిలో కొన్ని మ్యుటేషన్‌ల కారణంగా వికృతి చెందుతాయి. ప్రీయాన్లలో 200 పైచిలుకు అమినో ఆసిడ్లు మూడు చుట్టలుగా చుట్టుకుని ఉంటాయి. మ్యుటేషన్‌లవల్ల వీటి ఆకారం మారి చీరె కుచ్చిళ్ళలాగా తయారౌతుంది. ఇటువంటివి మామూలు కణాలకు తగులుకుని వాటి స్వరూపాలని కూడా మార్చేస్తాయి. పశువుల మెదడు కణాలన్నీ నాశనమై అది స్పంజ్‌లాగా తయారౌతుంది.

మామూలుగా ఆకులూ, అలములూ తినే పశువులకు ఏపుగా పెరగడానికని వ్యాపార దృష్టితో గొర్రె మాంసం, పంది మాంసం, కోడి మాంసం వగైరాలన్నీ తినిపించడంవల్ల ఎక్కడో వాటి ఆహారంలో ఈ రోగక్రిములు ప్రవేశించాయి. చివరకు ఈ రోగభయంవల్ల లక్షల కొద్దీ పశువులను చంపవలసి వచ్చింది. అప్పటికే బ్రిటన్‌వంటి దేశాలనుంచి ఎగుమతి అయిన గొడ్డుమాంసం తిన్నవారంతా ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించారు. తరవాతి పరిశోధనలలో అది తిన్న మనుషుల ఆరోగ్యం కూడా దిబ్బతిన్నదని తేలింది. అలాగే న్యూగినీలో ఆదిమజాతుల తంతు విందుల్లో నరమాంస భక్షణ చేసిన కారణంగా కొందరికి అదే వ్యాధి సోకింది. ఇటువంటి రోగానికి గురి అయిన గొర్రెల మీద పరీక్షలు జరిపి, క్రిములను వేరు చేసిన తరవాత పరీక్షలు జరిపారు. మామూలుగా డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ వగైరాలను నాశనం చెయ్యగలిగిన అల్ర్టావయొలెట్‌ కిరణాలు వాటి మీద ప్రభావమేమీ చూపలేక పోయాయి. మరికొన్ని పరిశోధనలు చేశాక అందులో ఉన్నవి ప్రోటీన్లేనని తేలింది.

2003 ప్రారంభంలో చైనాలో తలెత్తిన సార్స్‌ వ్యాధికి కొంతమంది చనిపోయారు. దీని లక్షణాలకూ, పక్షులద్వారా ఈమధ్య వస్తున్న బర్డ్‌ ఫ్లూ లక్షణాలకూ పోలికలున్నప్పటికీ వీటికి కారణమైన వైరస్‌లు ఒకటికావు. పక్షులకు వచ్చే 15 రకాల ఫ్లూ వైరస్‌లలో ఎచ్‌5ఎన్‌1 అనేది అన్నిటికన్నా తీవ్రమైనది. 22 డిగ్రీల (సెల్సియస్‌) ఉష్ణోగ్రతలో ఇది నాలుగు రోజులదాకా బతికే ఉంటుంది. చలి ఎక్కువైన కొద్దీ దీని ఆయుర్దాయం పెరుగుతుంది కనక జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల రోగం త్వరగా వ్యాపించి చావుకు దారితీస్తుంది. కోళ్ళ పెంపకం జరిగే ప్రాంతాల్లో వాటి రెట్టల ద్వారా ఈ వైరస్‌ అన్ని పక్షులకూ తగిలే అవకాశం ఉంది. తక్కినవాటిలాగా కాకుండా ఇది మనుషులకు కూడా సోకే ప్రాణాంతక వ్యాధి. సార్స్‌లాగా వ్యాధిగ్రస్థులని వేరుగా ఉంచడంవల్ల దీని సమస్య తీరదు. ఎందుకంటే ఫ్లూ వైరస్‌లు అతివేగంగా మ్యుటేషన్లకు లోనవుతాయి. అటువంటిది జరిగి, దానికి మనుషులకు సోకే లక్షణాలు గనక రూపొందినట్టయితే వ్యవహారం చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉంది. ఎవరికైనా మామూలు ఫ్లూ తగిలితే ఆ పరిస్థితిలో బర్డ్‌ ఫ్లూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండు రకాల వైరస్‌లూ కలిసి కొత్తరకం తయారైందంటే అది తక్కివారందరికీ అంటుకోవచ్చు. దానికి ఇమ్యూనిటీ లేకపోవడంతో వ్యాధి బాగా ముదిరి ప్రాణాలు తీయవచ్చు. పక్షులనుంచి తిన్నగా సోకేది తీవ్రమైన వ్యాధి. ఒక మనిషినుంచి మరొకరికి అంటుకున్నప్పుడు దీని స్వభావం అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చు. అణుయుద్ధాలకు కూడా వెరవని పెద్ద దేశాలన్నీ ఈ సూక్ష్మక్రిముల దాడినిగురించి ఆందోళన చెందుతున్నాయి. ఇది పెనుప్రమాదం కాకుండా అరికట్టడానికని ఈ రోగం బారినపడ్డ పక్షులన్నిటినీ ఇటీవల బెంగాల్‌లో జరిగినట్టుగా చంపుతున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్నవారికి వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ.

rp_7e.JPG

1918 నాటి ఫ్లూ

దీనికి ఉన్న ఒకే ఒక్క విరుగుడు టామీఫ్లూ అనే మందు తయారీ గురించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీన్ని కూడా రోగం వచ్చిన ఒకటి రెండు రోజుల లోపునే ఇవ్వాలట. ప్రస్తుతం దీనికి వేక్సీన్‌ ఏదీ లేదు. వియత్నాంవంటి తూర్పు ఆసియా దేశాల్లో ఇది మొదటగా తలెత్తినప్పుడు దాదాపు 70 శాతం రోగులు చనిపోయారు. తరవాత ఈ సంఖ్య సగానికి తగ్గింది. కాని ఇది మంచి పరిణామం కాదని శాస్రవేత్తల ఉద్దేశం. రోగానికి కొద్దిమంది బలైపోయినప్పటికీ రోగం వారితోబాటే సమసిపోతుంది. రోగులు కోలుకుంటున్న కొద్దీ రుగ్మత వారినుంచి ఇతరులకు వ్యాపించే అవకాశం ఎక్కువౌతుంది.

1918లో ఫ్లూవల్ల చనిపోయిన ఒక వ్యక్తి శవం ఇటీవల అలాస్కాలో మంచులో కూరుకుపోయి ఉండగా దాన్ని బైటికి తీసి, పరిశోధనల నిమిత్తమై ఆ వైరస్‌ను కృత్రిమంగా మళ్ళీ పునర్నిర్మించారు. జన్యుపరీక్షలు జరిపి ఎలుకలవంటి వాటిమీద దాన్ని ప్రయోగించినప్పుడు అది ఎలుకల్లోనూ, మనుషుల ఊపిరితిత్తుల్లోనూ అతిత్వరగా పెరిగిపోగలదని తెలిసింది. ఇలాంటి ప్రయోగాలవల్ల లక్షలమంది ప్రాణాలు తీయగలిగిన వైరస్‌ల గురించి విలువైన సమాచారం లభిస్తుంది. మనుషుల మధ్య ఎన్ని సామాజిక, రాజకీయ విభేదాలున్నప్పటికీ సూక్ష్మక్రిముల విషయంలో అందరూ ఏకమై, ప్రపంచ ఆరోగ్యసంస్థవంటివాటి ద్వారా సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే భయంకరమైన పరిణామాలు కలగవచ్చు. కనబడే శత్రువుకన్నా కనబడని శత్రువువల్ల ప్రమాదం ఎప్పుడూ ఎక్కువే.

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో