ఫిబ్రవరి2008
సర్రియలిజం అంటే…
రాత్రిపూట ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసీ మంచం మీదికి వాలుతూ, చీకటి మూసిన బెడ్‌రూంలో కాళ్లవైపు ఫ్లోరింగు తెల్లగా మెరుస్తూ టైల్స్ మీది డిజైన్ సైతం కనపడటం గమనిస్తాము. ఇంకో క్షణం పోయాక చూపులు తిన్నగా పైకి పోనిస్తే, లోకప్పు మీద ఫ్యాను రెక్కల నీడలు నల్లటి వలయాలుగా, గబ్బిలాల గుంపులాగా స్పష్టంగా తిరుగాడటం కనిపించి ఇంకా ఆశ్చర్యపోతాము. నిద్రమబ్బు కొద్దిసేపు భంగపడుతుంది. అప్పటి మన మానసిక స్థితిలో, తత్‌స్థలికాలాల్లో మన కళ్ల ఎదుట సీలింగు మీద కదిలే నల్లటి జీబ్రా చారలు, నేల మీద చిన్న వెలుతురు మడుగు! చీకటి గదిలోకి అంతుపట్టని సందుల నుంచో, మూలల నుంచో వెలుతులు ప్రసరించడం, పరావర్తనం చెందడమో అందుకు కారణమన్న మన సహజ పరిజ్ఞానం (common sense) పని చేయ స్థంభించడంతో కొద్దిసేపు ఈ అధివాస్తవిక దృశ్యం పట్ల విభ్రమంలో మునిగిపోతాము. ఔనా?
తెలుగులో అధివాస్తవికత వాదం అని మనం పిలుస్తున్న ‘సర్రియలిజం’ (Surrealism) రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక విప్లవోద్యమం లాగా పెల్లుబికి సాహిత్య, నాటక, శిల్ప, చిత్రకళా రంగాలపైన తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ కాలపు రాజకీయ, సామాజిక ఉద్యమాలతో చెట్టాపట్టాలేసుకుని కదం తొక్కింది. దీని ప్రవక్త ఫ్రెంచి సాహితీకారుడు ఆండ్రేబ్రెటన్. 1924లో ఒకటి, 1930లో మరొకటి - సర్రియలిజం గురించి రెండు ప్రణాళికలు (Manifesto on Surrealism) ప్రచురించాడీయన. తన మొదటి ప్రణాళికలో సర్రియలిజాన్ని ఇలా నిర్వచించాడు - ‘… నిజమైన ఆలోచనా స్రవంతిని మౌఖికంగానూ, దృశ్యపరంగానూ, రాతపరంగానూ వ్యక్తీకరించే శుద్ధమనస్తాత్త్విక స్వయంచాలకత్వం (pure psychic automatism) ఇది. వివేచన (reason)కు సంబంధించిన అన్ని నియంత్రణల్ని పక్కకునెట్టి, కళాశాస్త్రీయ లేదా నైతిక నియమాలన్నిటినీ ఆవలికి త్రోసి, ఇక్కడ కేవలం ఆలోచనధార నియంతృత్వం వహిస్తుంది”.
సర్రియలిజం కేవలం సాహితీ, కళారంగాల్లోని ఉద్యమం గానే కాకుండా ఒక జీవనశైలిగా, ఒక తాత్త్విక దృక్పథంగా కూడా ప్రకటితమైన రెండు యుద్ధాల మధ్యకాలంలోని సంక్షుభిత ఆలోచనా విధానాన్ని విశిష్టమైన పద్ధతిలో వ్యక్తీకరించే ధోరణిగా నిలదొక్కుకుందని విమర్శకులు, చరిత్రకారులు అంటారు. చిత్రకళలో దీని విజృంభణ పతాకస్థాయికి చేరుకుంది. మ్యాజిక్ రియలిజం, ఫాంటాస్టిక్ ఆర్ట్, డాడా గ్రూపుల ఆవిర్భావానికి మూల హేతువయ్యింది. మీరో, డీకిలికో, రినీమాంగ్రిట్, ఆక్స్‌డిట్టో, గ్రాష్ తదితరుల పెయింటింగులు వినూత్న పోకడలకు అద్దం పట్టాయి. ఈ ఉద్యమ పురోగమనానికి స్పానిష్ పెయింటింగు, శిల్పి సాల్వడార్ డాలీ కృషి అత్యంత గణనీయమైనది. ఈయన సర్రియలిజంలోని ముఖ్య సూత్రమైన స్వయం చాలకత (critical paranoia) సిద్ధాంతానికి మెరుగులు దిద్ది ‘క్రిటిక్‌ల్ పారానోయా’ (మత్తుమందు వల్ల కలిగే మతి అస్థిమితం) ను పోలిన ఒక భ్రాంతి దశలో కూరుకుపోయి కళాకారుడు తన పనిలో నిమగ్నుడవ్వాలని డాలీ ఉద్బోధించాడు. ఆ ప్రభావంతో అవాస్తవిక స్వాప్నిక స్థలాలకు భిన్నమైన ‘భ్రమాన్విత వాస్తవికత’ను ప్రతిబింబించే చిత్రకళ తలఎత్తింది. మానవాకారం పక్కకి పొడుచుకువచ్చేలా సగం తెరిచి ఉన్న సొరుగులు, మైనంతో రూపొందించినట్టుగా వంకరలు తిరిగి ఎండలో కరిగిపోయే గడియారాలు డాలీ పెయింటింగుల్లో తరచుగా కనపడే అభిమాన వస్తురాశి, మసకగా కనపడే కాటలో నియకమైదాన దృశ్యాలు వీటికి నేపథ్యంగా ఉంటాయి. ఈయన 1928, 1931లో బున్యెల్‌తో కలిసి రెండు సర్రియలిస్టు సినిమాలకు స్క్రిప్టు రాసి, సహదర్వకత్వం వహించాడు.
* * *
సాహిత్యరంగంపైన సర్రియలిజం ప్రభావం అపారం. మనిషి స్వేచ్ఛాయుత ఆలోచనా స్రవంతికి అవరోధంగా నిలిచిన అన్ని రకాల అడ్డంకుల్ని బద్దలు కొట్టడమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం అని మనం తెలుసుకున్నాం. తార్కిక విమోచన, ప్రామాణికత నైతిక నిబద్ధత, సామాజిక, కళాశాస్త్రీయ కట్టుబాట్లు, పూర్వ నిర్ధారిత ధ్యేయంతో, దురాలోచనతో కళాత్మక సృజనకు అధీన రేఖలు గీయడం… వగైరాలు సర్రియలిస్టులు భావించిన సదరు అడ్డంకులు. నిజమైన జ్ఞానానికీ, కళకీ ముఖ్య నిధిగా వాళ్లు ప్రతిపాదించుకున్న మనోసాగరం (deep mind) తన కర్తవ్యాన్ని నిరాటకంగా కొనసాగించేందుగ్గాను సర్రియలిస్టులు సుప్తచేతన (unconscious mind) ప్రేరేపించిన స్వయంచాలిత రచనలకుపక్రమించారు. అందుకై వాళ్లు కలల సామాగ్రి (dream material)కీ, అర్ధజాగృత డోలాయమాన మానసిక స్థితిని, సహజమైన లేదా కృత్రిమంగా ఆపాదించుకున్న చిత్తభ్రమలనీ (hallucinations) వాడుకున్నారు. ‘దైనందిన జాగృత వాస్తవికతతో స్వప్నవాస్తవికత సమున్నత రూపంలో సంశ్లేషణం చెంది, ఒద్దికగా మమేకమయ్యిన స్థితియే అధివాస్తవికత’ అని ఆండ్రెబ్రెటన్ తన రెండో ప్రణాళికలో చెప్పి ఉన్నాడు. ఈ ధోరణి పట్ల విశేషంగా ఆకర్షితులైన ఐరోపా, అమెరికా దేశాలకు చెందిన ఆధునిక కవులు, రచయితలు సాహిత్యంలో సరికొత్త ఫణితులకు శ్రీకారం చుట్టారు. వీళ్లు ఆయా ప్రక్రియలకు సంబంధించిన సాంప్రదాయిక శిల్పాలకు స్వస్తి చెప్పి, సరికొత్త వాక్య పరిచ్ఛేదాయి, అతార్కికమైన, కాలక్రమణికవహితమైన వర్ణనలు (e), స్వప్నసదృశమైన బీభత్స ఘటనల పరంపరలు, ఒకే చట్రంలో ఏకకాలంలో విరుద్ధాంశాలు చిత్రణలతో ప్రయోగాలు ప్రారంభించారు. డైలాన్ థామస్ కవిత్వం, థామస్ పింఛాన్, విలియం బర్రోస్ నవలలు ఇందుకు మంచి ఉదాహరణలు. అంతకు మునుపు లాట్రియామాంట్, రిబాండ్, జార్రీల చేతుల్లో సర్రియలిజం తారాస్థాయికి చేరింది.
స్పానిష్ భాషలో సర్రియలిస్ట్ రచనలకే అంకితమైపోయిన విశిష్ట రచయిత జూలియో కోర్టజార్ (1914 - ). ఈయన సర్రియలిజానికి ఫాంటసీ జోడించి, పాత్రల కళ్లెదుట ‘వాస్తవికతలోని పగుళ్లు’ తళుక్కున మెరిసే దిశగా (toward a glimpse at the ‘cracks in reality’) కథనం సాగిస్తాడు. కోర్టజార్, 1963లో వెలువరించిన ‘Hopscotch‘ అనే anti-novel తో సాంప్రదాయిక నవలాశిల్పంపై తిరుగుబాటు ప్రకటించాడు. క్రమపద్ధతి అనేది ఒక అసంబద్ధమైపోయిన నేటి లోకంలో అరాచకత్వం సమర్థనీయమే అన్న ఇతివృత్తంతో, అటు ఇటూ తారుమారు చేయగల అంతర్భాగాలతో కూడుకున్నదీ నవల. ప్రముఖ దర్శకుడు ఆంటోనియోని రూపొందించిన ‘Blow-Up’, గొడార్డ్ నిర్మించిన ‘Week-End’ సినిమాలు కోర్టజార్ కథలపైన ఆధారితాయి. 12 పేజీల ‘Blow-Up’ కథలో సర్రియలిస్ట్ ఫాంటసీ అన్వయింపు ఎలా ఉందో చూద్దాము.
కాలం రెండు తలాల (two planes of time) మీద, ఉత్తమ పురుషలో నడుస్తుందీ కథ. ముఖ్యపాత్ర రాబర్టోమైకేల్ జర్నలిస్టు, అనువాదకుడూ, అమెచ్యూర్ ఫోటాగ్రాఫర్ కూడానూ. ఓ మధ్యాహ్నం, అయిదో అంతస్తులోని తన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో కూర్చుండి, నెల రోజుల క్రితం తాను తీసిన ఒక ఫోటోగ్రాఫు తాలూకు ఎన్‌లార్జ్‌మెంట్ ప్రింట్ కళ్లెదుట గోడకు వేలాడదీసి చూస్తూ, ఆ ఫోటోగ్రాఫు తీయడానికి కారణమైన సంఘటన గురించి నెమరు వేసుకుంటూ, తనకో జోకులాగా అనిపించిన ఆ ఉదంతం గురించి చెప్పాలా వద్దా అంటూ సుదీర్ఘమైన తర్జనబర్జన పడి చివరికి ఆదివారం ఉదయం పూట పారిస్ నగరంలోని సీనే నది ఒడ్డున డాక్ దరిదాపుల్లో అతడు వాహ్యాళి చేస్తూ, ఫోటోలు తీసేందునువైన ఎండపొడ కోసం వేచి చూస్తుండగా, సమీపంలోని చెట్టుకింద నిలబడి ఒక జంట మీద దృష్టి నిలుపుతాడు. వాళ్లు ప్రేమికులూ కాదు, తల్లికొడుకులు కాదు, అక్కాతమ్ముళ్లూ కాదని కథకుడికి అర్థమవుతుంది. సన్నటి, పొడువాటి సొగసుకత్తె ఒకావిడ ఒక పదహారేళ్ల కుర్రవాడి ముఖంలో గుసగుస లాడుతూ వాడిని తన మోహంలో పడవేసుకునేందుకు ప్రయత్నిస్తూంటుంది. కుర్రవాడిని నిమురుతూ, రెయిలింగులకేసి అదుముతూ హత్తుకుంటూంటే వాడు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనుకకు అన్నచందంగా, బెదురుగా, బిడియంగా దూరం జరుగుతూ దిక్కులు చూస్తూంటాడు. వాడు బాగా డబ్బున్న కుటుంబంలోంచి వచ్చిన వాడనీ, పోర్నోగ్రాఫీ పత్రికలు చదివి పాడైపోతున్నాడనీ, ఆ కాల్‌గర్ల్ వాడి బలహీనతను డబ్బు చేసేకో ప్రయత్నిస్తున్నదనీ, ఉద్రేకపడ్డ ఆ కుర్రవాడిని ఆమె తన గదికి తీసికువెళ్లి ఆనందం అందిస్తుందనీ ఊహిస్తూ కథకుడు ఆ కుర్రవాడి ఇంటి గురించీ, కాల్‌గర్ల గదిలో జరగబోయే ఘటనల గురించీ సుదీర్ఘంగా భావకాలోక విహారం చేస్తాడు. ఆనక ఉండబట్టలేక, ఆ అసంబద్ధ దృశ్యాన్ని కుతుహులంగా చూస్తూ, కెమెరా క్లిక్‌మనిపిస్తాడు. అతని చర్యకు ఆమె అభ్యంతరం తెలిపి రీల్ తీసెయ్యమంటుంది. కుర్రవాడు భయపడిపోయి పరుగులంకించుకుంటాడు. అక్కడ ఫోటోగ్రఫీ నిషేధం కాదని బదులిస్తూ కథకుడు ఆమె అభ్యంతరాన్ని తోసిపుచ్చుతాడు. అల్లంత దూరంలో పార్క్ చేసి ఉన్న నల్లకారులో పేపర్ ముఖానికి కడ్డంపెట్టుక్కూర్చున్న ఒక మొదటి వ్యక్తి దిగివచ్చి కాల్‌గర్ల్ డిమాండుకు వత్తాసు పలుకుతాడు. వాళ్లమాటలేవీ లక్ష్యపెట్టకుండా కథకుడు వెనుతిరివస్తూ, మొదట వ్యక్తి పిడికిలి బిగించి గుర్రుగా చూస్తుండటం గమనిస్తాడు.
అదంతా గతించిన గతమనీ, తాను ప్రస్తుతంలోకి వచ్చి వర్తమానం వాస్తవికతలో ఏమి జరిగిందో చెప్తున్నానంటూ కథకుడు కొనసాగిస్తాడు. టేబుల్ మీద కెమెరా, టైపురైటర్ అనువాద ప్రాజెక్ట్ సరంజామా, ఎదురుగా చక్కగా సినిమాస్రీన్ సైజున్న ఫోటోగ్రాఫునూ, అందులోని అందమైన కురుల సొగసుకత్తె, ఆమె ఖరీదైన లాంగుకోటు, కుర్రవాడూ, వాడి ముచ్చటైన చేతొడుగులు, చెట్టు, ఆకాశంలో మబ్బులు, పిట్టల్ని తలెత్తీ చూస్తూ, రచన సాగిస్తూ, ఫోటోగ్రాఫు బాగా వచ్చినందుకు మురిసిపోతాడతను. వేరొకరి వ్యక్తిగత వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, వాళ్ల స్వేచ్ఛకు అడ్డంపడటం సమంజసమేనా అన్న సుదీర్ఘ మీమాంసలో పడతాడు, మళ్లా కుర్రవాడు చెడిపోకుండా కాపాడిన తన చర్య మంచిదేనని తలపోస్తూ, ఫోటోగ్రాఫులోని చెట్టుకొమ్మకదిలినట్టూ, కాల్‌గర్ల్ చేతులు లేపినట్టూ ‘భ్రాంతి’కి లోనవుతాడు. అతడు ఆశ్చర్యంగా చూస్తూండగానే జుట్టు ఎగిసి పోతుండగా కుర్రవాడు ఫ్రేములోంచి ఒక్క ఉరుకుతో ఆదృశ్యమవుతాడు - అనూహ్యమైన రీతిలో మొరటు మనిషి ఫ్రేములోకి వచ్చి, ఇంతైవటుడింతైన చందంగా ఫ్రేమునంతా ఆక్రమించుకుని, పూర్తి ఫోకస్‌లో కొచ్చిన ముష్టితో కథకుని ముఖం మీద మోదుతాడు. అతడు భయంతో వెనకకు గెంతి ఏడుస్తాడు. మళ్లా కళ్లు తెరిచి చూసే సరికి వర్షంలో కడిగిన వర్ణచిత్రంలా మారిపోయి ఫోటోగ్రాపు ఖాళీ చతురస్రంలాగా వేలాడుతూ కనపడుతుంది.
ఈ ఫాంటాస్టిక్ కథనం ద్వారా రచయిత సాధించదలచుకున్న ప్రయోజనం - Literalisation of Metaphor . మన భావనాలోకంలోని భయాలు, అపోహలు, సందేహాలు మూర్తిమంతమై కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తూ జరిగే చమత్కారమన్నమాట.
* * *
భారతీయ ఉభయ భాషాకవి (మరాఠీ, ఇంగ్లిష్) అరుణ్ కోలాట్కర్ (1932-2005) De-familiarization టెక్నిక్ ఉపయోగించి ‘Jejuri’ కావ్యాన్ని సమ్మోహనకరమైన క్లాసిక్‌గా మలిచాడు. పూనా నగరానికి యాభై కిలోమీటర్ల దూరాన వెలసిన శివుని అవతారం ‘ఖందోబా’ పుణ్యక్షేత్రం జెజూరి. 31 ఖండికలున్న ఈ దీర్ఘకవిత. ఒక అజ్ఞేయవాది ఐన పర్యాటకుని కోణంలోంచి ఆవిష్కృతం చేస్తాడు కవి. తనకు బాగా తెలిసిన పరిసరాలకే పరాయివాని కోణంలోంచి వర్ణించడం ద్వారా కవిత్వానికి చిక్కదనం, కొత్తదనం వచ్చాయి. పరాన్నభుక్కులా వర్ధిల్లుతున్న భక్తితత్వం, గుళ్లు, గోపురాల దైన్యస్థితి కొత్త విస్తృతిలో బహిర్గతమవుతాయి. ఇది మరో సందర్భంలో చర్చిద్దాం. ఈయన విరచితమై ‘the boat ride’ కవిత stillness ఆవరించి ఉంటుంది. ఇది చదువుతున్నంత సేపూ ఒక అధివాస్తవిక లోకం మన కళ్లముందర కదలాడుతుంటుంది. తన ప్రత్యక్ష అనుభవంలోంచి వచ్చిన సద్యోజనిత కవిత కాబట్టి.
‘గేట్ వే ఆఫ్ ఇండియా’ దగ్గరి అరేబియా సముద్రంలో కవి చేసిన పడవ షికారు ఇది. పడవలో కూర్చున్నాక, రాతిగోడ కొక్కేల నుండి పడవ వేరు పడడం, పావురాల గుంపు ఒక్కసారిగా లేవడం, పడవబాతులా కర్వతీసుకుని నీళ్లలో దూసుకువెళ్లడం, పొగమంచు తెల వెనకాల సరంగులు అస్పష్టంగా కదిలి తెరచాపలెత్తడం అబ్బురంగా చూస్తాడు కవి. పడవల పేర్లు, వాటి స్వంతదారుల మధ్య ఐకమత్యం, తన తోటి ప్రయాణికుల మనస్తత్వం, చంటి పిల్లవాడు బెలూన్లతో ఆడే విధానం, ఆఖర్న వచ్చిన అక్కాచెల్లెళ్లు కూర్చున్న భంగిమ, ఒక కొత్త జంట అపురూప అనురాగాలు, ఒకావిడ తన పెనిమిటి మీద చెలాయించే పెత్తనం మొదలైన విగ్రహాల శ్రేణి చెక్కినట్టుగా కవి అక్షర రేఖా చిత్రణ చేశాడు - విరామ చిహ్నాలు చిన్న చిన్న పాదాలు పాటలాగా సాగుతాయి. ఉదా:-
…/ after a pair of knees / has shot up and streaked / down the most after / the confusion of hands about / the rigging / an of white miracle / the sail / spreads / …
… / hands in lap / the have / been looking / past the boatman’s / profile / splicing / the wrinkles / of his saline / face / and loose ends / of the sea…
చివరగా
… / an expense of / unswerving stone / encrusted coarsely / with shells / admonishes our sight…
పైన సాక్షాత్కరించే దృశ్యమాలికలో ఊహాజాలంతో యాదార్థ్వం మమేకమవుతుంది తర్కంలోని ప్రతివాదాలు భావనా ప్రపంచంలో ఆమోదయోగ్యాలవుతాయి స్థల, కాలాలకు సంబంధించిన సాధారణ ఆలోచన పని చేయస్థంబిస్తుంది ప్రతిదీ ఒక అమాయకత దృక్ చట్రంలోంచి గోచరమవుతుంది. సర్రియలిజం ముఖ్య లక్షణాల్లో ఇది ఒకటి. (సర్రియలిజం పర్యవసానంగా మాజిక్ రియలిజం తలఎత్తింది. ఇది down to earth . దీని గురించి మరో వ్యాసంలో చర్చిస్తాను)
ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు