Feb2008
తెలంగాణ దండోరా
దండోరా వినపడదు
వినపడనట్టు కనపడటం
కనపడేలా కన్నీరు కార్చటం
ఓ కపట ప్రేమ
గొంతెండిన ఎక్కిళ్ళను
మా నేల పాట లయగా
మలుచుకున్నం
చేజారిన
నాగటి కర్రుల మీద
నేల కలల్ని రాసుకుంటున్నం
మూసిన మిల్లుల చక్రాల కింద
మాసిన మా ఊపిరుల
సెగలూదుకుంటున్నం
ఎన్నిచ్చి పోవుడు తెల్వనోల్లం
ఎదలు విచ్చి
పోరు జెండాలై ఎగిరినోల్లం
రాచరికాల్ని దించినోల్లం
రాజ్యాన్ని నిలదీసినోల్లం
మాకు సావంటే భయం లేదు
మీలా అందర్నీ ముంచి బతకాలన్న
యావలేదు
ఔను మరి…
మాకు పానం కన్నా
ఆత్మ గౌరవం ముఖ్యం…
మాకు ఇగిలిచ్చుకుంటు
ఇసం పెట్టే ‘మీ’ తీరొక్క మోసం తెల్సు
ఈతాకులిచ్చి తాటాకులు దొచ్చే
మీ యవ్వారమూ తెల్సు
మా నేల విముక్తి వెనక
మేం త్యాగాలు చదూకున్నం
రాగాలు చదూకున్నం
ప్రేమించుడు తప్ప
ప్రేమల్ని అమ్ముకునుడు తెల్వనోల్లం
పోరాట చరిత్ర లోంచి
పుట్టిన వాళ్ళం
తిరగబడే వారసత్వంనించి
మా నేల మరో విముక్తి లక్ష్యాన్ని
గుండెల కెత్తుకున్నాం
మేం దేశం దేహం నించి
ముక్కలు కావడం లేదు
మీ నమ్మక ద్రోహంనించి
దూర మౌతున్నాం
నిర్లక్ష్యం చేయబడ్డ
శరీర భాగాల్ని
శక్తివంతం చేసుకుంటుంన్నాం
మీ కుట్రల కింద
కూనారిల్లుతున్న బతుకులమై
రగులుకుంటున్నం
మీ ఆధిపత్య పైత్య ప్రకోపంనించి,
వలసవాది వలల్నించి
మమ్మల్ని మేం జాగ్రత్త పరుచుకుంటున్నం
మా అమ్మను మేం పట్టించుకుంటుంన్నం
ఇది మా దిగులు గుండెల దండోరా
వెల్లువెత్తు తున్న ‘మా’ ప్రత్యేక రాష్ట్ర
నినాదాల దండోరా
మీకు వెన్నులోంచి చలి పుట్టిస్తున్న
మావీర తెలంగాణ దండోరా.
Shashi Feb 28, 2008 1
నేను…రాజపోషవ్వను మాట్టాడుతున్నా….!
2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి – పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడికి మురికి బట్టలతో… నెరిసిపోయిన జుట్టుతో.. పీక్కుపోయిన మొహంతో ఓ అవ్వ అక్కడికి వచ్చింది. ఆమె పేరు రాజపోషవ్వ. అరవై ఏళ్ల దళిత మహిళ. ఆమె మాట్లాడిన మాటలు బొగ్గు గనుల కింద నిర్వాసితులు అవుతున్న స్థానికుల ఆవేదనకు, ఆక్రందనకు, దుఃఖానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోతాయి..
“అయ్యా నేను రాజపోషవ్వను మాట్లాడుతున్నా…
http://discover-telangana.org/wp/2008/02/27/nenu_rajaposhavvanu_maattaadutunna/
Janapadam Mar 6, 2008 2
వీర తెలంగాణ బిడ్డడి ఆవేదన బాగా వర్ణించారు