ఫిబ్రవరి2008
ఉరుకుతున్న గంగ
నీ ప్రవాహం
మా నేలమ్మకు జీవమనుకున్నం
మొక్కులు తీర్చి పూజలు చేసినం
అయినా
మానేటి తల్లీ మర్లి సూడనే సూడవు!
గింజ కాదల్గి
సుక్క నీరైత లేవు
మెతుకు కాదల్గి
కుండల ఎసరైత లేవు
సుట్టపోలే అచ్చి సుట్టు తిర్గి పోతున్నవు
గింత అన్నాలమా…?
పురమచ్చినా నిన్ను నిందించలే
శాంతి చేసినం
నీపేరు బిడ్డలకు పెట్టి మురిసినం
నీ సల్లని సూపుకోసం
నీ దారెంట ఎన్ని ముడుపులు కట్టినం
అయినా
నీ బిడ్డల్ని పరాయి సూపులు సూస్తున్నవు..!
బతుకమ్మ నిడిసిన చేతులు
నెర్రెలిడిసిన నేలలో రైతు శవాన్ని మోస్తున్నది
నిన్ను గానం చేసిన గొంతులు
దూపతో అలమటిస్తున్నయ్
ఎన్ని వాగుల నదివి నాదానివి
ఎవని మడిలో పారే చినుకువి?
నీ పయనం
మా నేలమ్మకు అచ్చిరాలే
జీవనదివనుకున్నం
కాని.,
ఎండిన బీళ్ళ పక్కనుంచి ఉరికే
ఉరితాడనుకోలేదు.