మార్చ్2008
వరదల్లో గజ ఈతరాలు
ముందుమాట చదివి పుస్తకాన్ని మూస్తున్న కాలం ఇది. ఈ విషయం తెలిసి కూడా కథలకు, కథా నేపధ్యం రాసి ప్రచురించడం ఒక సాహసం. మరో రకంగా నిజాయితి. ‘గజ ఈతరాలు’ అనే తన కథా సంపుటిలో గొరుసు జగదీశ్వర్ రెడ్డి తన కథలన్నిటికి, కథా నేపధ్యం పేరున కథ రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించాడు. అవి చదివితే కథలన్నీ ఊహించవచ్చు కుతూహులం కొద్ది కథలోకి తొంగి చూశామా, కథ మనల్ని అరెస్ట్ చేసి తన వెంట తీసుకెళుతుంది. కథల్లో వస్తు వైవిధ్యం ఉంది. ప్రపంచీకరణ తాకని జీవితం లేదు కదా! తెలిసిన జీవితాల ఎత్తు పల్లాలు కథల నిండా పరుచుకున్నాయి. తెలిసిన జీవితాలను కథగా మలచడానికి కథనం ప్రధాన సాధనం. అందుకే ప్రత్యేకమైన పరుసవేదిని కథల్లో దట్టించాడు. ఈ క్రమం లో శైలీ శిల్పాలపై శ్రద్ధ వహించాడు. ఏ ప్రాంత మాండలికమైనా జీవశక్తితో తొణికిసలాడుతుంది. ఆ యాసను కథల్లో జాగ్రత్తగా ఉపయోగిస్తే రక్తి కడుతుంది లేకుంటే ఈనగాచి నక్కలపాలు చేసినట్లవుతుంది. మానవ జీవితాల్ని ప్రేమించినట్లే, మాండలికాల్ని ప్రేమించాడు కనుకనే జగదీశ్వర్ వాటిని శక్తివంతంగా ప్రయోగించాడు. వలస పక్షులు అనే కథలో ఉత్తరాంధ్ర, తెలంగాణ మాండలికాలు పాఠకుల నోరూరిస్తాయి.
అనేక అనుభవాల ముల్లెగా, ప్రాపంచిక బాధల పల్లవిగా రచయిత కథల్లో దర్శనమిస్తాడు. ”ఆర్ధిక స్థితి” గతులు తప్పితే ఠీవికి, దర్పానికి ప్రతీకలైన భుజం పైని కండువాలె గోచి గుడ్డలుగా రూపాంతరం చెందుతాయనిపించింది. అనే వాక్యం ఇతని లోక పరిశీలనా శక్తికి అద్దం పడుతుంది. ఎదురైన సన్నివేశాల్ని, మెదడు పొరల్లో నిక్షిప్తమైన సంఘటల్ని నెలల తరబడి ఊరబెట్టి, మాగిన తరువాత కథల రూపంలో బయట పెట్టాడు. అందుకే చెట్టున మాగిన పళ్ళలా ఇతని కధలుంటాయి. సన్నివేశ చిత్రణ, వర్ణనల పట్ల ఇతనికున్న మోజు రావిశాస్త్రిని గుర్తుకు తెస్తుంది. వీటి వల్లనే కథల నిడివి కూడా పెరిగినట్లనిపిస్తుంది. మచ్చుకు ఒకటి.
”ఓ లమ్మా… వడ్డీల వరాలప్ప కొన్నావుగాన, ఎల్లోలమ్మా, బేరవాగనందకొచ్చినాది సవతికారి తల్లి” ప్రతి అక్షరాన్ని విడదీసి, రాగం తీస్తూ వరాలత్త చేతిలోని చేపల్ని విసురుగా లాక్కుని తాటి బుట్టల్లో వేసుకునే వారు. దూరంగా వున్నప్పుడు మన కేసి చూస్తూ ”రా బాబూ, రామోలమ్మా సంసువాలు కొన్నందికిరా బాబూ, జెల్లి సూడుమీ … ఏక్నాసు గెనాగున్నదో… ఎగస్టా ముక్కేత్తానురా బాబూ అంటూ ఇంగ్లీషు పదాలు వల్లిస్తూ పిలిచి, బేరం చెడిపోతే తిట్లకు దిగుతారు చేపల బజారు సరదాగా అనిపించేది. ”
కథకుని ఈస్టటిక్ సెన్స్ వల్ల పాఠకునికి హాయి కలుగుతుంది. కాని కేవలం కళాత్మక విలువల వల్లనే కథలు నిలబడవు. గొరుసు కథల్లో గల విషాద వాస్తవం, అతని కథల్ని నాలుగు కాలాల పాటు నిలబెడుతుంది. అసమ సమాజంలోని వ్యక్తుల కడగండ్లు, సామాజిక విషాదంగా మారి పసితనం వీడని పిల్ల గొంతు నుండి జగదాంబ జంక్షన్‌లో దర్శనమిస్తుంది.
”అమ్మకి ఒంట్లోని బాగులేదని తెల్దేటి? అమ్మోటి సెప్పిందొరే! మందులు కొన్నందకి డబ్బులు సాలవన్నదా, ఆసుపత్రికి అమ్మని తీసుకెళ్ళమని డాటేరు బాబు సెప్పనేదేటి? నీకు అమ్మ కావాలా, రంగు బుడ్డీకావాలా” తమ్ముణ్ణి ఒప్పించడానికి బ్రతిమాలుతుంది.”
ఇది ఒక పాలబుగ్గల కూతురి వేదన. ఇక జీవితానుభావాల్తో పండి ముగ్గు బుట్టగా మారిన తల్లి మాటలు వాల్తేరత్త రూపంలో వినండి.
” ఆడ పుట్టుకే పుట్టి, పాలిచ్చే పెంచాను. నా పేగు తీపి వొవులికి అరదమవుతుంది బాబూ… నా సిమ్మాసెలం ఒచ్చెత్తాడొచ్చేత్తాడని నా మనసంతాది బాబూ. ఆడెక్కడున్నడో గానీ… ఆడి పేగోసన అప్పుడప్పుడు నా ముక్కుకి తగలతాది బాబూ… ”
బొడ్డు వాడు తెంపుకొని రొమ్ములపై పారాడిన తన కొడుకు గురించి ఒక తల్లి విలపించిన తీరు ఇది.
ఇలాంటి అనేక సంభాషణలు లోకం పోకడలను విశదీకరిస్తాయి. కథలన్నీ చదివాక మంగలంలో వేసిన మక్క గింజలా గుండె వేగుతుంది. భరించలేని వేదనకు కథల్లోని పాటలు లేపనం పూస్తాయి.
”భోగందాని బొడ్డు సుట్టన్నియల్లో
సోమిరెడ్డి పాపికండ్ల ఎన్నియల్లో ”
”చెక్క వచ్చి చెంప దగిలె నా సామి
సెప్పరాని దుక్కమొచ్చె నాసామి ”
ఇలాంటి పాటలు సేదతీతుస్తాయి. పాఠకులకు అహ్లాదాన్నిస్తాయి.
కథకుని కధన కౌశలం వల్ల కథలకు ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణమే పాఠకుణ్ణి కథలో కట్టేస్తుంది. విడివిడిగా కథలున్నప్పుడు వాతావరణం కలిగించిన మేలు, సంపుటిగా వచ్చినప్పుడు కనిపించదు. ఈ సంపుటిలోని కొన్ని కథల్లో వాతావరణం చర్వితచరణమైంది. అనుభవ సారాల మాలికగా కనపడే ఈ సంపుటిలో పది కథలున్నాయి.. ముగింపుల్ని చేతిలోకి తీసుకోవడం, మెరిపించడం చేయలేదు. మొక్కలతో నడిపించిన చీడ కథ, అసంబద్ధ వాతావరణంలో సాగిన బతుకు గోస కథలు సంపుటిలోని విభిన్నతకు గుర్తులు. వాచ్‌మెన్, ఉసుళ్ళు కధల్లోని డ్రమటైజేషన్ ఆసక్తి కరంగా ఉంది. జలగలవార్డు, ఖాయిలా బతుకులు అనే రెండు కథలు చెప్పక తప్పదనే ఒక బాధ్యత నుండి వచ్చినట్టుగా కనిపిస్తాయి. అర్ధవంతమైన బాపుగారి ముఖచిత్రంతో అందమైన పుస్తకాన్ని వెలువరించిన గొరుసు జగదీశ్వర్ రెడ్డి అభినందనీయుడు.