Mar2008
గుర్రపు చెవిలో పురుగు
కదులుతున్న ఆకాశం మీదికి
ఆశను విసిరి
బతుకుల చుట్టూ
నడుముల్లోతు నీటిపూలు కలగంటానికీ
ఒక సుఖ నిద్ర కావాలి కదా!
అరచేతులకీ
మూడడుగుల చెక్కముక్కకీ
ఆకలి ఒక రసాయనపు బంక
చెర్మం వూడినా
ఆశ పట్టు సడల నివ్వదు
బతుకును కలగనే స్థితి
లేదు సరికదా
నిద్ర కోసమే మేలుకోవాల్సిన పరిస్థితి
రాత్రీ పగలూ
నీటి ఉయ్యాలపైన వూగుతూ
దారపు పోగుల మధ్యకు
కళ్ళు గిరాటిస్తుంటే
ఇక నిద్ర ఎలా వస్తుంది?!
విసిరిన ప్రతిసారీ
అమ్మరొయ్య దొరుకుతుందనే ఆశే.
వుప్పటి వెన్నెల్లో
తెప్పల మీద
ఇసుక తెప్పల మీద
ఆరేసిన దారపు కుప్పల మీద
నిగనిగ లాడుతూ వుంటుంది ఆశ
అచ్చం నా చిన్నప్పుడు చూశిన
గుర్రపు చెవిలో పురుగులాగే
తీరా నేలమీదకొచ్చి
ఐసు ముక్కల్లోకి
తొంగి చూశాకే
ఒడ్డుమీద ఎగిరెగిరి పడుతుంది.
చివరకు
ఏమీ లేనితనంతో
ఖాళీ తనం పొటమరించిన తనువుతో
నీళ్ళ గుచ్చుతున్నా
మళ్లీ హైలెస్సా మొదలు పెడుతుంది
నీళ్ళలో విషం కలిపితే
చేపలు చచ్చి తేలటం పాతకథే
ఏ విషము లేకుండానే
గుప్పెడు ఐసు ముక్కలు
ఆహారాన్ని శాసించటం
జాలరి పేటకు నిప్పెట్టటమే
అచ్చమైన వార్త
ఉప్పుకూ ఊపిరికీ
మధ్య ఎగుమతిదారుడు
ఒక ఆక్టోపస్
కళ్ళు మూసుకుని
సముద్రాన్ని తాగుదామను కుంటున్న పిల్లి,
ఇప్పుడు వీడి మాడు పగులగొట్టే
తెడ్డొకటి అవసరమే
March 14th, 2008 at 8:53 am
Ee tilte name thappu. Gurram purugu thappa Gurrapu chevilo purugu gaa palukubadilo ledani gamanincha manavi.Idi oka suuchana maathrame nani kuda gamanincha korika.
March 16th, 2008 at 10:47 pm
poem lo pattunnadi