కార్యకర్త

కొత్త బస్టాండుల దిగి ఏడడుగులు ఎనుకకు నడిచినా, పాత బస్టాండుల దిగి పదడుగులు ముందుకు నడిచినా, కాదుపోదంటే కోటగడ్డ ఎక్కి మైసమ్మ గుడి ముందు నుంచి బురుజు పక్కకు తిరిగి కిందకి దిగినా ఒక జెండా గద్దె కనిపిస్తది. గద్దెకు తాటిచెట్టంత ఇనుపపైపు, పైపుకు ఎగురుతున్న జెండా కనిపిస్తది పచ్చపచ్చగా…

బర్లమంద ఊర్లకచ్చేయాళ్లగానీ.. పాల మోటరు ఊరుదాటె యాల్లగానీ జెండా గద్దె దగ్గెర ఆవుల మళ్లేశం ఒక్కడే కనిపిస్తడు. జెండను కండ్ల నిండ నింపుకుని చూస్తడు. గుండె నిండ నింపుకుని కుంటుకుంట పోతడు. ఒక్కోసారి గద్దెమీదనే కూసుంటడు. సాకలిది ఊరు తిరిగి ఇంటికి వస్తూ ‘మామా… ఇంటికిపో పొల్లగాండ్లు ఎదురు సూత్తండ్రు’ అని మందలిచ్చేదాకా లెవ్వడు.

ఏ ఎలక్షనచ్చినా ఎవలు చెప్పినా చెప్పకపోయినా ఆ రంగు జండా పట్టుకుని ఊరంత తిరుగుతడు, ఓటెయ్యిమని బతిమిలాడుతాడు అందరు నవ్వుకుంట ఆకు దీర్గం తీసేసి ‘అవుల మల్లేశమత్తండురో’ అంటరు ఎక్కిరిత్తరు.

మల్లేశం కేటు కమాయించడు తన పనితాను చేసుక పోతడు. ఇది తెలుసుకొన్న ఆ పార్టీ నాయకుడు ‘అసొంటి కార్యకర్తలు నాకు వంద మంది ఉంటె సాలు ఈ దేశానికే పదాన మంత్రినైత’ అని ఎప్పటికీ అంటడట. ఎప్పుడు ఈ ఏరియకు వచ్చినా మల్లేశంను కలువంది పోడు. ఏ పని ఉన్నా ఒక్క ఫోనుగొట్టు నీ ముంగట వాలుత అంటడు నాయకుడు. 

పార్టీ పెద్దదే పవరు పెద్దదే మల్లేశం నోరిడిసి ఏది అడుగడు, పైరో జెయ్యడు, మాట్లాడడు, స్పీచులియ్యడు. తనేందో… తన పనేందో… జెండా సూడంది మాత్రం ఉండడు.

ఈ భక్తి మల్లేశంకు ఎప్పుడు మొదలయిందో ఎవలకు తెలువది. ‘మానేరు భరో ‘ ర్యాలీలో మల్లేశం కాలు ఇరిగి నప్పుడు అందరికి తెలిసింది. అప్పుడైతే పెద్ద నాయకులే వచ్చిండ్రు. మల్లేశం త్యాగాన్ని పొగిడిండ్రు పార్టీకోసం కాలునే పోగొట్టుకున్నడని, ప్రాణాన్నే అడ్డం పెట్టిండని ఆకాశానికెత్తిండ్రు.

మల్లేశం తాతలు, తండ్రులు… సుట్టాలు పక్కాలు ఎవలూ రాజకీయంల లేరు అందరూ చాపనో జెల్లనో పట్టుకొని అమ్ముకునే టోల్లే. అసలు ఆ కులపోళ్లు గూడా ఎవలూ లేరు యాడనో సుక్క తెగి పడ్డట్టు ఒకలో ఇద్దరో ఉన్నా వాళ్లతో మల్లేశంకు దోస్తాన్‌ లేదు.

మరి మల్లేశం ఇంత పెద్ద లీడరెట్లయిండు…? సదువుకున్నడా అంటే అదీలేదు. ‘ఓ’ అంటే ‘నా’ రాదు. మాటకారి అంటే అదీకాదు. నోట్ల నాలికె లేదు. ఎన్నడూ ఊరుదాటి పోలేదు. మరి అంత పెద్ద పార్టీ లీడరును ఎట్ల కట్టుకున్నడు…?

ఇది ఊరంతటికో చిక్కుముడి అయింది.

కొందరు ఇదన్నరు కొందరు అదన్నరు కొందరు ఔనన్నరు కొందరు కాదన్నరు. తొక్కుకుని తొక్కుకుని మల్లేశంనే అడిగిండ్రు. మలేశం మాటమార్చి నవ్విండు గని మర్మం చెప్పలేదు.

మల్లేశం మండలంల ఓ గురువున్నడు. పేరు గోపాల్‌ రెడ్డి. పేరున్న లీడరే. గోపాల్‌ రెడ్డి ఏలు వెట్టి తింపితే ఏలెంట తిరుగుతడు మల్లేశం. ఇద్దరిది ఒక్కటే గొంతు. మల్లేశం కాలు ఇరిగి నప్పుడు ఇద్దరికి దోస్తయింది.

ఏ మీటింగుకు పోయినా ఇద్దరు కలిసే పోతరు. ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేత్తరు ఇద్దరికి ఇచ్చుకం పుచ్చుకం ఉన్నది.

మల్లేశం సంగతిని కొందరు గోపాల్‌ రెడ్డిని అడిగిండ్రు. గోపాల్‌ రెడ్డి గూడా నోరు ఇప్పలేదు. నవ్వుకుంట ‘కలిసచ్చె కాలమత్తే నడిశచ్చే కొడుకు పుడుతడోయ్‌ … మీ మల్లేశంకు కిస్మత్‌ మంచిగుంది’ అన్నడు.

ఈ సీక్రెట్‌ ఇట్లనే ఉంది.

ఇంతట్లకే మండలం ఎలక్షన్లచ్చినయి. గోపాల్‌ రెడ్డి ఎం.పి.పి. కావాలను కున్నడు. ఊరిలో తను ఎంపీటీసిగా నిలవడ్డడు. ఊరూరు ఎంపీటీసిలకు మద్దతిచ్చిండు. పార్టీ నాయాకున్ని తెచ్చి మండలంల మీటింగు వెట్టిండు. వద్దు వద్దనంగ మల్లేశంను ఎంపీటీసిగా నిలవెట్టిండు. మల్లేశం ఖర్చునంతా తనే మోత్తనన్నడు.

మల్లేశం కుదురనే కుదురదన్నడు. మల్లేశంకు ఊర్లె కులం బలముంది. ఎవలను నిలవెట్టినా ఆ సీటు అపోజిట్‌ పార్టీకి పోతుందని గోపాల్‌ రెడ్డికి తెలుసు. బలవంతంగా బి పారం తెచ్చిండు.

ఖర్చు తప్పుతుంది గదా అని ‘సరే’ అన్నడు మల్లేశం. ప్రచారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్నట్టుంది అపోజిట్‌ పార్టీ మనిషి సారా సీసలు పంచుతుండు. మల్లేశంకు పంచక తప్పలేదు. గోపాల్‌ రెడ్డి వత్తండు పోతండు గనీ ఖర్చుమాట ఎత్తుతలేడు.

మల్లేశంకు అనుమానమచ్చింది అడుగాలనుకున్నడు అడుగుతే ఏమను కుంటడో అనిపించింది. గెలిచినంకి ఇత్తడేమో అనుకున్నడు. జిద్దు మీద రూపాయి పెట్టె జాగల రెండు రూపాయల ఖర్చు పెడుతుండు. లెక్క మొత్తం రాసి పెడుతుండు. గోపాల్‌ రెడ్డి ఇస్తడన్న ధీమాతోని దేనికి ఎనుకముందాడుతలేడు. 

ఎలక్షన్లయినయి. గెలిచేటోళ్లు గెలిచిండ్రు. ఏడిచెటోళ్లు ఏడిచిండ్రు. మొత్తం పన్నెండు సీట్లయితే చెరిసగం పంచుకున్నట్టు రెండు పార్టీలకు ఆరు సీట్లచ్చినయి. గోపాల్‌ రెడ్డి నెత్తికి చేతులు పెట్టిండు. వాళ్లు వీళ్లకు, వీళ్లు వాళ్లకు గాలాలేత్తండ్రు. కప్పలతక్కడయింది.

ఎవల సంఖ్యను వాళ్లు కాపాడుకోవడమే పెద్దపనయింది. గోపాల్‌ రెడ్డి ఎవలకు తెలువకుంట శ్రీశైలంల క్యాంపువెట్టిండు. ఆరుగుర్లో ముగ్గురు ఆడోళ్లే ఆముగ్గురు పిల్ల తల్లులే! క్యాంపుకు రావడానికి మొదట ఒప్పుకోనేలేదు. బతిలాడి బామాలితే ఒప్పుకున్నరు గనీ పిల్లా జెల్లా అందరు తయారయిండ్రు. గోపాల్‌ రెడ్డికి తప్పలేదు.

మల్లేశం క్యాంపులనే ఉన్నడు. గోపాల్‌ రెడ్డి ఖర్చు ఎప్పుడు అడుగుతడో అప్పుడే లెక్క చూపిద్దామని కాయిదం గూడా జేబుల వెట్టుకున్నడు.

గోపాల్‌రెడ్డి లెక్క అడుగుతలేడు. క్యాంపులో గూడా ఎక్కువగా పట్టించుకుంటలేడు. తనవాడే కదా అన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉన్నడు. తనకుగాక మిగిలిన ఐదుగురుకి మనిషికి ముప్పయి వేలిచ్చినట్టు తెలిసింది మల్లేశంకు. మనసు చిన్నజేసుకున్నడు. ఈ గోపాల్‌ రెడ్డికి తెలువకుంట ఇంటికి పోన్‌ జేసిండు. అపోజిట్‌ పార్టీ వాళ్ల రేటు లక్షయాభై పలుకుతుందని తెలిసింది

ధైర్నం జేసి అపోజిట్‌ లీడర్‌తోనే మాట్లాడిండు మల్లేశం. వస్తే రెండు లక్షలు ఇస్తన్నడు. తులం బంగారం పెడుతనన్నడు. గాలమేసి కూసున్నడు.

మల్లేశం ఆలోచించిండు రెండు లక్షలు ఎన్నడు సంపాయించాలనుకున్నడు. ఎట్లయితే అట్లయితదనుకున్నడు. రాత్రో రాత్రి గోపాల్‌ రెడ్డిని నమ్మిచ్చి బయట పడ్డడు. ఇక్కడి క్యాంపులకచ్చి చేరిండు.

గోపాల్‌ రెడ్డి అది ఊహించలేదు. ఎవలు ఏం చెసినా మల్లేశం మాత్రం తనోడే అనుకున్నడు. తనకు దోకా జెయ్యడనుకున్నడు. ఈ సంగతి తెలిసి ఆకులు పట్టుకునే యాళ్లకు చేతులు కాలిపోయినయి.

అగో… అప్పుడు… అప్పుడు ఒకలనొకలు దెప్పుకున్నరు. ఒకలనొకలు తిట్టుకున్నరు. దుమ్మెత్తి పోసుకున్నరు. ‘నాకు ఖర్చు పైసలిత్తానన్నవు ఒక్క పైస ఇయ్యలేదు. ఇంత మోసమా…’ మల్లేశం అన్నడు.

‘నీకు మస్తు పైసలిప్పిచ్చిన. కాలు ఇరిగినప్పుడు నేనే లేకుంటే ఏ బస్టాండులనో అడుక్క తిందువు…’ గోపాల్‌ రెడ్డి అన్నడు.

‘అప్పుడు నా పేరు జెప్పుకుని మత్తు పైసలు నొక్కినవు అది నాకు తెలువదనుకున్నవా…’ మల్లేశం కోపంగా అన్నడు.

అగో అప్పుడు అసలు సంగతి బయటవడ్డది. గోపాల్‌ రెడ్డికి కోపం ఆగలేదు. ‘నువ్వెంత… నీ బతుకెంత నీపేరు జెప్పుకుని నేను పైసలు నొక్కినానురా… అసలు నువ్వు కార్యకర్తవేనా…? ఎన్నడన్న పార్టీల పని జేసినావురా… నువ్వు పెద్ద మోసగానివి ‘ అని అందరి ముందట ఆసంగతి చెప్పిండు.

అదేమిటంటే ‘మానేర్‌ భరో’ ర్యాలి పోతుందట. రెండు మూడువందల మంది కార్యకర్తలు సైకిళ్ల మీద పోతున్నరట. మల్లేశం ఏదో ఊరికి పోదామని ఆటో కోసం నిలవడ్డడట. సైకిల్‌ ర్యాలీ వెళ్లి పోయిన అరగంటకు ఓ మోటర్‌ సైకిల్‌ వచ్చి మల్లేశంను గుద్దుడు గుద్దిందట. ఒక్కటే దెబ్బకు ఇరుసుక పడ్డడట మల్లేశం.

ఆవెనుకనే వస్తున్న గోపాల్‌ రెడ్డి ఇది చూసి ‘అరె పోరడు సచ్చిపాయెరా’ అని ఓ సైకిల్‌ తెచ్చి జెండా కట్టి కతంతా నడిపిండట.

ఇది తెలిసి ”అరే… మళ్లేశా… అన్నం పెట్టి నోనికి సున్నం పెడుతావురా… దేవునోలె ఆదుకున్నడు…” అని అందరు అంటే మల్లేశం మండిపడుతూ ”అబ్బో వాడా… వాడో బద్మాష్‌… వట్టి వట్టి గైతే నన్ను తొక్కుకుంట పోతుండె. నన్ను గుద్దింది వాని బామ్మరిదే…!” అన్నడు.

2 అభిప్రాయాలు »కథలు, మానేటి కథలు

2 అభిప్రాయాలు

  1. buchi reddy Mar 14, 2008 1

    good story–very realistic one

  2. ప్రాణహిత » మార్చ్ 2008 : సంపాదకీయం Apr 10, 2008 2

    [...] అందించబోతోంది. వాటిలో మొదటగా ‘కార్యకర్త’ కథను ఈ సంచికలో చదవండి. అట్లే బి.యన్ . [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో