Mar2008
అపరాజిత 6: జీవితానికి అర్థాన్నిచ్చిన ఎ.ఐ.మ్
వాళ్లు మమ్మల్ని కొత్త ఇండియన్లంటున్నారు.
కానీ, మేము పాత ఇండియన్లమే.
ఈ ఖంఢానికి అసలు సిసలు వారసులం.
అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చాం.
- డెనిస్ బ్యాంక్స్ (ఏ. ఐ. ఎమ్ నాయకుడు)
అమెరికన్ ఇండియన్ ఉద్యమం మా రిజర్వేషన్ ను పెద్ద గాలి దుమారంలా చుట్టుముట్టింది, ఎక్కడి నుంచో కొత్త గాలిలా మమ్మల్ని స్పృశించింది. రాను రాను దగ్గరవుతున్న డప్పు మోతలా మమ్మల్ని తాకింది. 1890 లో తెగలను కుదిపేసిన ఘోస్టు డ్యాన్సులా, డిక్ ఫూల్ బుల్ మాటల్లో చెప్పాలంటే ప్రెయిరీ మంటలు చెలరేగినట్లు, డిక్ మామయ్య పాడే ఘోస్టు డ్యాన్సు పాటలా మమ్మల్ని తాకింది…
మక సితోమ్నియే తెక ఉకియే
ఒయాతె ఉకియె, ఒయాతె ఉకియె …
ఒక కొత్త ప్రపంచం వస్తోంది,
ఒక కొత్త జాతి పుట్టుకొస్తోంది,
గద్ద తీసుకొచ్చిన సందేశమది.
ఆ కొత్త గాలి నా అనుభవానికి కూడా వచ్చింది. దాన్ని నేను వినగలిగాను, దాని వాసన, స్పర్ష నాకు కూడా సోకాయి.
ఎ. ఐ.ఎం. వాళ్లను కలిసిన మొదటిసారి నాలో ఒకలాంటి భూకంపం బయల్దేరినట్లనిపించింది. బ్ల్యాక్ ఎల్క్ తాత తన జీవిత చరిత్ర చెబుతున్నప్పుడు ఒక మాట అంటాడు “ఎత్తైన గుట్టలాంటి నా పెద్ద వయస్సు నుంచి చూస్తే…” నేను కూడా నా వయసు అనే ఎత్తైన గుట్ట మీద నిలబడి కిందికి చూస్తే… ఇప్పుడు నాకు ముప్పై ఏడేళ్లైనా… ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నట్లు అనిపిస్తుంది - జరిగిన విషయాలను రాగద్వేషాలతో సబ్జెక్టివ్ గా కాకుండా, ఒక సరైన దృక్పథంతో చూడగలుగుతున్నాను. బ్ల్యాక్ ఎల్క్ తాత ఈ అనుభవాన్ని చాలా బాగా చెప్పాడు. జీవితంలో గడచిపోయిన దశాబ్దం కాలాన్ని తలుచుకుంటే కాలాన్ని ఒక గుట్టమీద నుంచుని చూసుకున్నట్లుంటుంది. రాను రాను ఉద్యమాలు తమ సారాన్ని కోల్పోతాయని, నాయకులు తమ శక్తి కోల్పోతారని ఇప్పుడు తెలుస్తోంది. మాలో కొంతమంది యుక్తవయస్సులోనే ప్రాణాలర్పించి, ముప్పై అనే’ ప్రమాదకర’ వయస్సు దాటేసి, అనుభవగ్నుడైన రాజకీయవేత్త అనే బిరుదును అంటగట్టించుకోకుండానే వెళ్లిపోయారనిపిస్తుంది. కొంతమంది నాయకులు కాలేజి ప్రొఫెసర్లయితే, కొంతమంది ఆదివాసి పాఠశాలలు ప్రారంభించారు, మరికొందరు ట్రైబల్ ఆఫీసు ఉద్యోగాలు సంపాదించారు. కొందరు మాత్రం ఇంకా గడిచిపోయిన కాలంలో గడుపుతుంటారు. పాత కలలు పక్కకు తొలగి, కొత్త తరం కలలకు దారి ఇవ్వాలని వాళ్లు గుర్తించరు. పదేళ్ల క్రితం దాకా ఉద్యమకారిణిగా తిరిగిన నేను ఇప్పుడు నా పిల్లలకు పాలు పడుతూ, డయపర్లు మారుస్తూ, నా కుటుంబానికి భోజనం తయారు చేస్తూ గడుపుతున్నాను. అయినా అదంతా జరుగుతున్నంత సేపు చాలా గొప్పగా వుండింది. ఆ కాలం గురించి మాట్లాడుతుంటే చాలా ఉద్విగ్నంగా వుంటుంది. ఎ.ఐ.ఎమ్ ను కొంతమంది ప్రేమించేవాళ్లు, కొంతమంది ద్వేషించేవాళ్లు, కానీ ఎవరూ దాన్ని పక్కన పెట్టెయ్యలేకపోయారు. దాన్ని పట్టించుకోకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాలేదు.
నేను ఎ.ఐ.ఎమ్ ను ప్రేమించాను. క్రౌ డాగ్ లు వుండేచోట జరిగిన సన్ డ్యాన్సు ఉత్సవంలో మొట్టమొదటిసారి ఎ.ఐ.ఎమ్ నాకు ఎదురుపడింది. లియొనార్డ్ క్రౌ డాగ్ ను చూపిస్తూ, నా పక్కన వున్న ఒక యువతిని, “అతను ఎవరు?” అని అడిగాను.
“ఆయన క్రౌ డాగ్” ఆమె చెప్పింది. పొడుగ్గా నిగనిగలాడుతున్న అతని జడలు చూశాను. పొడవాటి జుట్టుతో వుండడం ఆకాలంలో రిజర్వేషన్లో ఇంకా ఫాషన్ గానే వుండేది. “అదంతా అతని నిజం జుట్టేనా?” ఆ అమ్మాయిని మళ్లీ అడిగాను.
“అవును, అది అతని నిజం జుట్టే.”
దాదాపు అందరు యువకులూ పొడవాటి జుట్టుతో వున్నారు, కొంతమంది జుట్టులో గద్ద ఈకలు కూడా వున్నాయి. వాళ్లందరూ రిబ్బన్ షర్టులు వేసుకుని వున్నారు. రిజర్వేషన్లో నాకు అలవాటయిన నిరాసక్తమయిన మొఖాల్లా కాక, వీళ్లందరి మొఖాల్లో ఒక కొత్త వెలుగు కనిపించింది. వాళ్ల కదలికలు కూడా వేరుగా వున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో ఆత్మవిశ్వాసంతో తిరుగుతున్నారు. ఎన్నో తెగలకు చెందిన వాళ్లు నినాదాలు రాసిన ఒక పాత ట్రక్కులో వచ్చారు. అల్కట్రాజ్ ఆక్రమణ తదనంతరం సన్ డ్యాన్సులో పాల్గొనడానికి కాలిఫోర్నియానుంచి వచ్చారు వాళ్లు.
చిప్పెవా తెగనుంచి వచ్చిన ఒకతను నిలబడి ఉపన్యాసం ఇచ్చాడు. అప్పటిదాకా ఎవరూ అలా మాట్లాడడం నేను వినలేదు. నరమేధాల గురించి, ప్రజల సార్వభౌమత్వం గురించి, తెల్లవాడితో కుమ్ముక్కయిన తెగనాయకుల గురించి మాట్లాడాడతను. నెక్ టై వదిలి చోకర్లు ధరించడం గురించి, బ్రీఫ్ కేసులకు బదులు పరుపుచుట్ట పట్టుకోవడం, మిషనరీల చర్చీలకు వెళ్లకుండా పవిత్ర పైపును తీసుకోవడం గురించి మాట్లాడాడు. థ్యాంక్సు గివింగ్ పండుగను జరుపుకోగూడదని, అది ఇండియన్ల వినాశాన్ని ఒక సంబరంగా చేసుకున్నట్లవుతుందని వివరించాడు. తెల్లవాడు ఇండియన్ల భూమిని కొల్లగొట్టి, మూడువందల ఏళ్లుగా ఇండియన్లను నరమేధం చేస్తూ ఇప్పుడు దగ్గరికి వచ్చి, “థ్యాంక్సు గివింగ్ పండుగను మాతో జరుపుకో, మాతో కలిసి కొంచెం టర్కీ భోజనం చెయ్యి” అని అనజాలడని చెప్పాడు. అతను అమెరికన్ జండాను తలకిందులుగా తన చుట్టూ కప్పుకున్నడు. ఆ జండాలోని ఒక్కో నక్షత్రం ఇండియన్ల నుంచి దొంగిలించిన ఒక్కో రాష్ట్రానికి ప్రతీక అని చెప్పాడు.
తరువాత లియొనార్డ్ క్రౌ డాగ్ మాట్లాడాడు. తెల్లవాడితో ఎన్నో తరాలుగా పెదవులతో మాట్లాడడానికి ప్రయత్నించామని కానీ వినడానికి చెవులు, చూడడానికి కళ్లు, చెప్పేది అర్థం చేసుకోవడానికి హృదయం తెల్లవాడికి లేవని చెప్పాడు. శరీరాలతో మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, తన ప్రజల కోసం ప్రాణాలర్పించడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పాడు. ఉపన్యాసం చాలా ఉద్విగ్నంగా సాగింది. కొంతమంది ఏడ్చారు కూడా. ఒక పెద్దాయన నావైపు తిరిగి “అవన్నీ నేను ఎప్పుడో చెప్పాలనుకున్న మాటలే, కానీ వాటిని నేను నాలోనే దాచేసుకున్నాను.” అన్నాడు.
నేను ఒక యువకుడిని అడిగాను, “మీరు ఎలాంటి ఇండియన్లు?” “మేము ఎ.ఐ.ఎమ్”, అన్నాడతడు. “ఇది అమెరికన్ ఇండియన్ ఉద్యమం. మేము అన్నింటినీ మార్చెయ్యబోతున్నాం.” అని రెట్టించాడు.
1968లో ఎ.ఐ.ఎమ్ పుట్టింది. మిన్నెసోట జైళ్లో వుండిన కొంతమంది ఓజిబ్వా తెగవాళ్లు దాన్ని మొదలుపెట్టారు. సెయింట్ పౌల్ గెట్టోల్లో వున్న ఇండియన్ల సమస్యలు పరిష్కరించడానికి అది మొదలయ్యింది. ఒక ఇండియన్ స్త్రీ ఆ పేరును సూచించింది. ఆమె నాతో చెప్పింది, “ఉద్యమాన్ని మొదట్లో Concerned Indian Americans అని పిలిచేవాళ్లం. కాని దాని ఇనిషియల్స్ చూస్తే CIA అవుతుందని ఎవరో గమనించారు. అప్పుడు నేను “మీరంతా అది చెయ్యాలని ఇది చెయ్యాలని ధ్యేయంగా పెట్టుకున్నారు కదా, మరి ఈ ఉద్యమానికి American Indian Movement (A. I. M) అని పేరు పెట్టొచ్చు కదా?” అని వాళ్లతో చెప్పాను” అని వివరించిందామె.
ఎ.ఐ.ఎమ్ మొదట్లో సెయింట్ పౌల్ కు, మినియపొలిస్ కు మాత్రమే పరిమితమై వుండేది. గెట్టొలనుంచి వచ్చిన ఇండియన్లే మొదటి ఎ.ఐ.ఎమ్ సభ్యులు. వాళ్లంతా తమ భాషను, సాంప్రదాయాలను పోగొట్టుకున్న తెగలనుంచి వచ్చారు. సూ రిజర్వేషనుకు రావడం మొదలుపెట్టిన తరువాతనే వాళ్లు పాత పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. మేం కూడా వాళ్లనుంచి చాలా నేర్చుకున్నాం. సూ ప్రజలం వేరుగా “జింక చర్మాల తెరలు” అని కొందరు పిలిచే ఒక రకం తెరల వెనుక జీవించేవాళ్లం . 1960లలో 1970లలో వీచిన కొత్త గాలులు తుఫానులా మారి మాకు చేరడానికి మాకోసం కిటికీలు తెరిచిపెట్టిన ఉద్యమం ఎ. ఐ. ఎం. గెట్టోల్లోని పిల్లలు, ఆచారవంతులైన రిజర్వేషను ఇండియన్లు కలిసిన తరువాతనే ఎ.ఐ.ఎమ్ జాతీయ స్థాయి ఉద్యమంగా రూపొందింది. చెకుముకి రాళ్లు ఒకదానికొకటి కొట్టుకుని, చిన్ని అగ్గిరవ్వగా మొదలై సుదీర్ఘమైన చలికాలంలో మమ్మల్ని వెచ్చబర్చడానికి వచ్చిన పెద్ద మంటలా మారింది ఎ.ఐ.ఎమ్.
ఎ.ఐ.ఎమ్ లో చేరిన తరువాత తాగుడు పూర్తిగా మానేశాను నేను. మిగతా వాళ్లు చాలా మంది మాదక ద్రవ్యాలను పక్కన పెట్టేశారు. ఎ.ఐ.ఎమ్ లో చాలా సమస్యలు ఉండేవి. వాటిని మేం పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే పట్టించుకోదలుచుకోలేదు. అప్పట్లో అవి ముఖ్యమైన సమస్యలు కాదు. ముందుకు వెళ్లడమే ముఖ్యం. ఎ.ఐ.ఎమ్ యునిఫారం అంతా సూ స్టైల్ లో వుంటుంది. నల్ల టోపీలు, వాటికి కుచ్చిన ఈకలు, ఎముకతో చేసిన చోకర్లు, గుండెమీద పడేట్టు మెడలో వేసుకున్న మెడిసిన్ పౌచులు, లెవీ జాకెట్లు, వాటిమీద అల్లిన మా పోరాటాల పేర్లు - అల్కట్రాజ్, ట్రెయిల్ ఆఫ్ బ్రోకెన్ ట్రీటీస్, వూండేడ్ నీ… ఇలాగ. మా పాటలు మేం కట్టుకునేవాళ్లం. ఎ.ఐ.ఎమ్ గీతాన్ని ఒక సూ అబ్బాయి రాశాడు. వాళ్ల తెగకు చెందిన అబ్బాయి రాశాడని ఓజిబ్వాలు అంటారు, కాని దాని గురించి మాకే బాగా తెలుసు.
మాలో చాలామందిమి పాఠశాలను మధ్యలో వదిలేసి వచ్చిన వాళ్లమే. కానీ మేం చాలా మంచి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లం, కవితలు రాసేవాళ్లం. మాకంటే ముందుగా తమ ఉద్యమాలను మొదలుపెట్టిన నల్లవాళ్ల నుంచి కొంతభాషను మేం నేర్చుకున్నాం. మేం కూడా వాళ్లలాగే ఈ దేశంలో మైనారిటీలం, బీదవాళ్లం, జాత్యహంకారాన్ని భరించినవాళ్లం. కానీ వాళ్లకు మాకు చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా వాళ్లు తెల్లవాడితో కలిసిపోవాలని ఉద్యమాలు చేశారు, తెల్లవాళ్లతో విడిపోవడానికి మేం ఉద్యమాలు చేశాం. ఎన్నో తెగభాషల్లో నల్లవాళ్లను “నల్ల తెల్లవాడు” అని సంభోదిస్తారు.
మొదట్లో మేమంతా తెల్లవాళ్లను ద్వేషించేవాళ్లం. అప్పటిదాకా మాకు తెలిసిన వాళ్లంతా ఒకే రకంగావుండే వాళ్లు. అంతా జాన్ వెయిన్ రకం (కౌ బాయ్ సినిమాల్లో ఇండియన్లను ఎప్పుడూ ఓడించే హీరో పాత్రధారి). మాతో తమ ఆలోచనలు, మనస్సులు పంచుకోగలిగిన తెల్లవాళ్లను ఎంతో కాలానికి గాని కలుసుకోలేదు మేం. మాకు తెలిసిన ఒక యువకుడికి ఒక అందమైన అమ్మాయితో పరిచయమయ్యింది. తాను ఇండియన్నని ఆమె అతనితో చెప్పుకుంది. కానీ, ఒక అర్థరాత్రి, పక్కలో వుండగా ఆమె పొర్టొ రికో నుంచి వచ్చిందని అతనికి తెలిసింది. ఆమె ఇండియన్ కాదని తెలిసి అతనికి చాలా కోపం వచ్చింది, ఆమెను దాదాపు కొట్టబొయ్యాడు. ఇండియన్ అమ్మాయిలతో మాత్రమే స్నేహం చెయ్యాలని అతను అనుకున్నాడు. ఒక చెడ్డ ఫొస్టరు హోమ్ నుంచి పారిపొయ్యి తనలాంటి వారిదగ్గర తలదాచుకున్నవాడతను. తరువాత ఆమెతో తన ప్రవర్తన గురించి సిగ్గుపడి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. క్రమంగా ఎంతోమంది చికానో సోదర సోదరీమణులు మా ఉద్యమంలో కలవాడానికి వచ్చారు. వాళ్లను ప్రేమించడానికి, గౌరవించడానికి మాకు కొంత సమయం పట్టింది. బయటివాళ్ల గురించి అపనమ్మకంతో ఉంటూ మా ఇరుకు ప్రపంచంలో మేం జీవించేవాళ్లం. రాను రాను కాలేజి క్యాంపసుల్లో, చర్చీల్లో, వీధి చివర్లలో ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాం. మాకు తమ మద్దతు ఇవ్వడానికి వచ్చిన మార్లిన్ బ్రాండో, డిక్ గ్రెగరీ, రిప్ టార్న్, జేన్ ఫోండా, ఏంజెలా డేవిస్ వంటి ప్రముఖులతో మాట్లాడడం మొదలు పెట్టాం.
మాలో మేమే కాక బయటివాళ్లతో కూడా సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టాం. కొంతమంది అమ్మాయిలు ధైర్య సాహసాలు కనబరచిన ఏ వీరుడితోనైనా సంబంధం పెట్టుకునేవారు. మరికొంతమంది ఒకబ్బాయినే ప్రేమించేవారు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే మెడిసిన్ మ్యాన్ ను వెదికి పట్టుకునేవాళ్లు. ఆయన వాళ్లను ఈకలతో, సీడరుతో దీవించి, వారితో కలిసి పవిత్ర పైపుతో పొగతాగి, ఇద్దరి భుజాలమీద ఎర్ర దుప్పటిని కప్పి ఇండియన్ పద్దతిలో తంతు జరిపించేవాడు. తెల్లవాడి చట్టం ఇలాంటి పెళ్లిల్లను గుర్తించదు కానీ మేం ఆ సంబంధాన్ని గౌరవించేవాళ్లం. ఈ పెళ్లి ఒక్కోసారి కొన్నిరోజుల పాటే నిలిచేది. ఇద్దరిలో ఒకరు జైల్లో పడడమో, తెల్లవాడి బుల్లెట్ కు ఒరిగిపోవడమో జరిగేది. కానీ కొన్ని పెళ్లిళ్లు చాలా ఏళ్ల వరకు నిలిచేవి. కొన్ని రోజులైనా, ఎక్కువ రోజులైనా ఉన్నంత కాలం వాళ్లు బాగా వుండేవాళ్లు. తనను రక్షిస్తూ, తన బాధ్యత వహించేవాడొకడు అమ్మాయికి ఉండేవాడు. తన ఆలనాపాలనా చూసుకుంటూ, వండిపెట్టే అమ్మాయి ఒకతి అబ్బాయికి ఉండేది. ఒకరినొకరు ఉత్తేజ పరుచుకుంటూ, తమను తాము పోరాటానికి అర్పించుకునేవారు. గుర్తుంచుకోవడానికి అమూల్యమైన జ్ఞాపకాలుగా ఈ పెళ్లిళ్లు మిగులుతాయి. పదిహేడేళ్ల ఒకబ్బాయికి ఇరవై రెండేళ్ల అమ్మయితో సంబంధం ఉండేది. ఆమెను ప్రేమగా “గ్రాండ్ మా” అని పిలిచేవాడు. తన టీ-షర్టు మీద “ఐ లవ్ గ్రాండ్ మా” అని కూడా రాయించుకున్నాడు. ఆ అమ్మాయి తన ఈడువాడితో వెళ్లిపోయినప్పుడు అతను చాలా దిగులుపడ్డాడు. కొంతమంది ఎ.ఐ.ఎమ్ నాయకులు చాలామంది “భార్యల”ను ఆకర్షించేవారు. మేం వాళ్లను “నెల రోజు భార్యలు” అని అనేవాళ్లం.
నేను కూడా ఇలాంటి ఒక పెళ్లి చేసుకున్నాను. నేను గర్భవతినయ్యేంతవరకే ఆ పెళ్లి కొనసాగింది. కుటుంబ నియంత్రణకు మా నమ్మకాలు వ్యతిరేకం. అదీ గాక, ప్రపంచంలో ఎక్కువమంది ఇండియన్లు లేరని మాకు అనిపించేది. ఎంతమంది వీరుల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురాగలుగుతే అంత మంచిది. మా అక్క బార్బరా కూడా గర్భవతి అయ్యింది. ఆమె ప్రసవం కోసమని BIA (Bureau of Indian Affairs) హాస్పిటల్ కు వెళ్లింది. సిజేరియన్ అవసరమని వాళ్లు చెప్పారు. ఆమెకు తెలివి వచ్చిన తరువాత తన గర్భసంచీ తొలగించామని డాక్టర్లు చెప్పారు. అప్పటికే చాలామంది ఇండియన్లు ప్రపంచంలో ఉన్నారని వాళ్ల ఉద్దేశం. బాధ్యత లేకుండా, విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ ఎ.ఐ.ఎమ్ స్త్రీలను మంచిగా చూడాల్సిన అవసరం లేదని వాళ్లు నమ్మేవాళ్లు. బార్బరాకు పుట్టిన పాపాయి రెండు గంటలు మాత్రమే బతికింది. కొంచెం జాగ్రత్త తీసుకునివుంటే ఆ పాపాయి బతికేదేమో. కొన్ని సంవత్సరాలపాటు BIA డాక్టర్లు ఇండియన్, చికానో అమ్మాయిలకు వాళ్లకు తెలీకుండా కొన్ని వేల బలవంతపు స్టెరిలైజేషన్లు చేశారు. నాకోసమే కాక, బార్బరా కోసం కూడా పాపాయిని కనబోతున్నాని ఆనందంగా ఉండేది. తెల్లవాడి హాస్పిటల్లో నా బిడ్డకు జన్మనివ్వకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను.
ఒక సంఘర్షణ నుంచి ఇంకో సంఘర్షణకు మళ్లడానికి నాకు తొమ్మిది నెలల సమయం ఉండింది. ఇండియన్ సమాధుల్ని తవ్వుతున్న ఆంత్రొపాలజిస్టులు కనిపిస్తే, తెల్లవాళ్ల సమాధుల్ని పెకిలించి అందులోని పుర్రెలు, ఎముకలు తవ్వి గ్లాసు కేసుల్లో ప్రదర్శనకు పెడతామని బెదిరించేవాళ్లం. ఇండియన్లకు సంబంధించిన రాజకీయ నేర విచారణ ఎక్కడైనా జరుగుతూ వుంటే, డప్పులు పట్టుకుని ఆ కోర్టు ముందు ప్రత్యక్షమయ్యేవాళ్లం. “ఇండియన్లకు ప్రవేశం లేదు” అని ఏ బారు మీదైనా రాసి వుంటే, ఆ యజమానికి గట్టిగా బుద్ది చెప్పేవాళ్లం. రెడ్ పవర్ స్లోగన్లు రాసిన పాత ట్రక్కులు ఏదో ఒకలాగ ఎప్పుడూ అందుబాటులో వుండేవి. మమ్మల్ని ఆదరించి, మాంసం సూపు, ఇండియన్ ఫ్రై బ్రెడ్డు, చిక్కటి నల్లటి కాఫీ మాకందించే ఇండియన్లు ప్రతిచోటా దొరికేవాళ్లు. మా దగ్గర ఏమాత్రం డబ్బు లేకపోయినా బాగా తిని ప్రయాణాలు చేస్తుండేవాళ్లం.
ఇంతలో ఒక విచిత్రం జరిగింది. పాత ఆచారవంతులైన ఫుల్ బ్లడ్ మెడిసిన్ మెన్ మాతో కలిశారు. వీళ్లు మధ్య వయస్కులు కాదు. ఆ మధ్య వయస్కులను గతించిన తరం అనొచ్చు. వాళ్లు నెక్ టైలు వేసుకుని మహా తెల్ల తండ్రి తమకు మేలు చేస్తాడన్న నమ్మకంతో ఉన్నవాళ్లు. మాతో కలిసింది తమ అత్మలను, జ్ఞానాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన నిజమైన పెద్దవాళ్ళు. ఈ అవ్వలు తాతలు ఇండియన్లు ఇంకా ఇండియన్లుగా వున్న రోజులనుంచి వచ్చినవాళ్లు. వాళ్ల స్వంత అవ్వా తాతలు కస్టరులాంటి జనరల్సుతో పోరాడారు. వాళ్లు మా గొప్ప గతానికి ఇంకా బతికి ఉన్న లింకులు అని చెప్పవచ్చు. మాతో పంచుకోవడానికి సరిపొయ్యేంత శక్తి వాళ్ల దగ్గర మిగిలేవుంది. వాళ్లకు పాతకథలు గాథలు తెలుసు. సరియైన పద్ధతిలో క్రతువులు చెయ్యడం తెలుసు. వాటిని నేర్చుకోవడానికి మేం చాలా ఉత్సాహం చూపేవాళ్లం. తొందర్లోనే అందరూ ఈ కృతువుల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఎప్పుడూ గుర్రపు స్వారీ చెయ్యని, గుడ్లగూబ అరుపు విని వుండని సిటీ ఇండియన్లు కూడా ఆచారాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు కానీ, ఇదంతా మా లకోటాలు మొదలుపెట్టారని చెప్పడానికి నేను గర్విస్తున్నాను.
ఈ అవ్వలు నామీద చాలా ప్రభావం చూపారు. రష్ మూర్ పర్వతం దాదాపు పాకుతూ ఎక్కి, ఆ కొండ మీద చెక్కిన ప్రెసిడెంట్ల బోడి తలల మీద నిలబడి, ఆ నల్ల కొండలకు ఇండియన్లు అసలు సిసలు వారసులు అని ప్రకటించిన ముత్తవ్వ లిజి ఫాస్ట్ హార్స్ లాంటి వాళ్లు ఆ ముత్తవ్వలు. తెల్ల ట్రూపర్సు వచ్చి లిజిని పర్వతం మీదనుంచి కిందకి లాక్కుని వచ్చారు. తొమ్మిదేళ్ల ఆమె మునిమనవరాలితో కలిపి ఆమెకు సంకెళ్లు వేశారు. ఆ సంకెళ్లు రాసుకుని వాళ్ల చర్మం గీసుకుపొయ్యి కారిన రక్తం బొట్లు మంచులో ఎర్రని ముద్రలు వేశాయి. పాత చెయాన్ నానుడి చెప్పేది నిజమే. “ఒక జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోనంతవరకు ఆ జాతి ఓడిపోయినట్లు కాదు.” నిజమే, మా జాతి ఫుల్ బ్లడ్ స్త్రీల హృదయాలు ఇంకా గట్టివే. మమ్మల్ని ముందుకు నడిపించగలిగే ధైర్యం వాళ్లలో ఇంకా వుంది. వాళ్లు చేసే బ్రేవ్ - హార్టు అరుపును ఎన్నిసార్లు విన్నా నామెడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.
డకోటా రాష్ట్రాల్లో మేమంటే చాలా భయం వుండింది. అది నాకు అర్థమయ్యేది కాదు. మేం కదా అసలు బాధితులం. మేము ఎవరినీ హింసించి చంపేవాళ్లం కాదు. వాళ్లే మా జనాలను హింసించారు, చంపారు. కొన్ని ట్రేడింగు పోస్టులను దోచుకోవడం తప్ప మేం అంత చెడ్డపనులు చెయ్యలేదు. మేం పెద్ద నోళ్లు వేసుకుని, గొడవ చేసేవాళ్లం, కొంతమందిని అలా ఇబ్బంది పెట్టేవాళ్లం. ఒక క్వార్టరు (25 సెంట్లు) కోసం తమ కెమెరాలకు ఫోజులిచ్చే బికారి ఇండియన్లే కాక వేరేరకం ఇండియన్లు కూడా వుంటారని మేం తెల్లవాళ్లకు చెప్పదలుచుకున్నాం. కానీ అదంతా వాళ్లు మమ్మల్ని చంపడానికో, మమ్మల్ని చూస్తే భయపడి తమ పరుపు చుట్టల్లో దాక్కోవాలనో చెయ్యలేదు మేం. ఇద్దరు పద్నాలుగేళ్ల ఇండియన్ పిల్లలు ఒకదగ్గర కనిపిస్తే “ఎ.ఐ.ఎమ్ వస్తోంది, ఎ.ఐ.ఎమ్ వస్తొంది” అనే అరుపు వినడం సాధారణమైపొయ్యింది. ర్యాంచర్లు, పోలీసులు మా గురించి అద్భుతమైన కల్పనలు ప్రచారం చేసేవాళ్లు. మేం బ్యాంకులను దోచుకోబోతున్నామని, జైళ్లను ముట్టడించబోతున్నామని, కాపిటల్ బిల్డింగుకు నిప్పు పెట్టబోతున్నామని, రష్ మూర్ పర్వతాన్ని పేల్చెయ్యబోతున్నామని, గవర్నరును హత్య చెయ్యబోతున్నామని మీడియా చెప్పేది. రష్ మూర్ పర్వతం మీద చెక్కిన ప్రెసిడెంట్ల ముక్కులకు మేమురంగులు వేసి వాటి తలలకు ఎర్రరంగు వెయ్యబోతున్నామన్నది మా మీద వేసిన అతి చిన్న అభాండం. అన్నిటికంటే చెడ్డదేమిటంటే మేం టూరిస్టులను బెదరగొడుతున్నామట. టూరిస్టులవల్ల వచ్చే డబ్బు తగ్గిపోతోందట. అందుకని మమల్ని చంపడమే మంచిదని వాళ్ల ఉద్ధేశం.
తమ మనస్సులలో ఉన్న చెడ్డ భావల వల్లనే తెల్ల ర్యాంచర్లు మమ్మల్ని ద్వేషిస్తారనుకుంటా. ఎన్నో కేసుల్లో మాకోసం వాదించిన బిల్ కుంస్ట్లర్ ఒకసారి ఇలా అన్నాడు: “ఎవరినైతే ఎక్కువ గాయపరిచావో, వారినే ఎక్కువగా ద్వేషిస్తావు.” రిజర్వేషను చుట్టుపక్కల వున్న తెల్లవాళ్లందరూ ఇండియన్ల నుంచి దొంగిలించిన భూమి మీదనే నివసిస్తున్నారు. ఆ దొంగతనం కూడా ఎన్నో ఏళ్ల కిందటి సంగతి కాదు. అదంతా వాళ్ల తండ్రుల, తాతల కాలంలో జరిగిందే. వాళ్లు మమ్మల్ని దోపిడీ చేస్తూ జీవిస్తుంటారు. పాటలు పాడుతూ నృత్యాలు చేసే ఇండియన్లతోనే వాళ్లు సంబంధాలు పెట్టుకోగలుగుతారు. మాలాంటి ఇండియన్లు వచ్చినప్పుడు తలుపులు కిటికీలు బిడాయించుకుని తెరలవెనక దాక్కునేవాళ్లు. మేం వెళ్లిన ఊర్లో రెండు మూడు రోజులకంతా అన్ని తుపాకీ అంగళ్లలోని తుపాకులన్నీ అమ్ముడయిపొయ్యేవి. తెల్లవాళ్లు ఎక్కడికి వెళ్లినా తుపాకులు వెంటబెట్టుకుని వెళ్లేవాళ్లు. పాయింట్ 38 తుపాకులను లోడ్ చేసుకుని దిండ్లకింద పెట్టుకుని నిద్రపొయ్యేవాళ్లు. ప్రతి ఒక్క ఎ.ఐ.ఎమ్ సభ్యుడిని కటకటాల వెనక్కో, అరడుగుల గుంతలోకో నెడతానని శపథం చేసిన సౌత్ డకోట గవర్నరు వెస్టు జర్మనీనుంచి దిగుమతి అయిన అతికొత్త రకం మెషిన్ గన్ను కొన్నాడని వదంతి వుండేది. దాన్ని కాపిటల్ బిల్డింగులో పెట్టి అటువైపు వెళుతున్న ఇండియన్ల మీద గురిపెడుతూ వుండేవాడని అంటారు. అదంతా కల్పనే కావచ్చు, కానీ అతని గురించి నాకు తెలిసినంతవరకు, అతను అలా చెయ్యగలిగే మనిషే. వాళ్లంతా మమ్మల్ని చూసి భయపడడం నాకు అంత ఇబ్బందిగా అనిపించలేదు. క్వార్టరు కోసం వాళ్ల కెమెరాలముందు నవ్వుతూ నిల్చోవడం కంటే వాళ్లను భయపెట్టడమే నయం.
మేమేమీ దేవ దూతలం కాదు. ఎ.ఐ.ఎమ్ వల్ల, లేక తాము ఎ.ఐ.ఎంకు చెందినవాళ్లమని చెప్పుకునే వాళ్లు కొంతమంది వల్ల కొన్ని తప్పిదాలు జరిగాయి. కానీ ఆ సమయంలో మాకు ఎంతో అవసరమైన చేయూతను ఎ.ఐ.ఎమ్ మాకు అందించింది. అది మా ధ్యేయాల్ని మాకు స్పష్టం చేసింది. మాలోపలి ఆశలు ఆశయాలకు ఒక రూపం ఇచ్చింది. ఎ.ఐ.ఎమ్ తో తమకెలాంటి సంబంధంలేదని, అది నిజమైన ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్న ఎంతో మంది ఇండియన్లు కూడా ఎ.ఐ.ఎమ్ తరహాలో దుస్తులు ధరించడం, మసలుకోవడం మొదలుపెట్టారు. నాక్కూడా ఎ.ఐ.ఎమ్ తో కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చాయి. ఈ ఉద్యమం బతుకుతుందో లేదో నాకు తెలీదు. ఎప్పుడైతే ఒక ఉద్యమం మిగతా సమాజానికంతా అంగీకారం అవుతుందో అప్పుడు అది చనిపోతుందని అంటారు. కనీసం డకోట రాష్ట్రాల విషయానికి వస్తే ఈ ఉద్యమంలో ఇంకొంత ప్రాణం మిగిలేవుంది. ఏది ఏమైనా, ఎ.ఐ.ఎమ్ మొదలుపెట్టిన తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందని, ఏ సమయంలోనైతే దాని అవశ్యకత వుండిందో ఆ సమయంలో ఏర్పడి ఇండియన్ అమెరికా అభివృద్ధి చెందడానికి ముఖ్యకారణమైందని ఎవరైనా ఒప్పుకోవలసిందే.
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
koresh Apr 2008 1
భూమిని లాక్కునే సంఘటనలతో ఉన్న నవల ఒకటి చదివిన గుర్తు,వారి పొరటాల గూర్చి తెలియజెప్పే నొవెల్స్ పరిచయం చెయ్యండి వీలయితే!