Mar2008
మనిషంటే పని కదా
మాధుర్యం కావాలి
జీవితమూ స్నేహమూ
మాధుర్యం నిండాలి
కాని ప్రతి నెత్తుటిచుక్కా చక్కెరముక్కయినప్పుడు
ఇది కన్నీటి కాలం
ఇది భయం కాలం
ఇది నిరాశ కాలం
ఇదివరకెప్పుడూ భయపడలేదు
వేలసూదులతో చర్మమంతా జల్లెడ అయినప్పుడూ
రక్తబిందువులన్నీ పెటిల్లున పగిలి
దేహం ఒణికిపోయినప్పుడూ
లోలోపలి తీపితయారీయంత్రం
లోలకంలా అటుకొసకూ ఇటుకొసకూ
ఉధృతంగా ఊగుతూ
అస్తిత్వాన్ని చిగురుటాకు చేసి
సుడిగాలిలో ఎగరేసినప్పుడూ
ఎప్పుడూ భయపడలేదు
అనారోగ్యానికి కాదు
శయ్యకు ఖైదీని చేసినందుకూ కాదు
దినచర్యంతా శరీరరక్షణే అయినందుకు
పనిమీద ఆంక్షల కటకటాలు నిర్మిస్తున్నందుకు
ఇది కన్నీటికాలం భయాలకాలం నిరాశలకాలం
మనిషంటే ఆలోచన కదా
మనసుమీద మంచుకప్పమంటే ఎట్లా?
మనిషంటే మాట కదా
పెదాలు కుట్టేసుకోమంటే ఎట్లా?
మనిషంటే రాత కదా చదువు కదా
హాసం కదా స్నేహం కదా
మనిషంటే పని కదా
సెలవు పలకమంటే భయం
మనిషితనాన్ని వదులుకొమ్మంటే భయం
- జనవరి 22, 2008
March 15th, 2008 at 8:12 am
me kavetha bagundi …
March 21st, 2008 at 3:32 am
రామ చంద్రాపురం – హైదరాబాదు లో జరిగిన ‘తెలంగానం’ కలాల గుండె చప్పుడు ప్రాణహిత లో వివరంగా ఇవ్వగలరు.
ఇట్లు
ప్రవాస తెలంగాణ సాహిత్య అభిమాని
March 30th, 2008 at 1:27 am
sitye loi aksharadoshalu chala akuuvaga unnai.sarichayandi
April 10th, 2008 at 10:34 pm
[...] మనిషంటే పని కదా – ఎన్ వేణుగోపాల్ [...]