Mar2008
మార్చ్ 2008 : సంపాదకీయం
ప్రాణహిత మార్చి సంచికకు స్వాగతం. మార్చి నెలలో 8 వ తారీకును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి నెల అంతర్జాతీయ మహిళాదినోత్సవం అందరిలో ఉత్సాహం నింపుతుంది. 1911 లో కోపెన్ హేగన్ లో మార్చి 8ని ప్రపంచ మహిళాదినంగా జరుపుకోవాలని క్లారా జట్కిన్ చేసిన ప్రతిపాదన ఆమోదం పొందింది.1908లో న్యూ యార్కులో బట్టల మిల్లుల కార్మికురాండ్రు తమ పనికి వేతనం పెంచాలని, పని గంటలు తగ్గించాలని ‘బ్రెడ్ అండ్ రోజెస్’ కావాలనే డిమాండుతో రోడ్లమీదకు వచ్చి పోరాటాలు జరిపారు. వీరి పోరాటాలకు గుర్తింపుగా మార్చి 8ని జట్కిన్ ఎంచుకోవడం జరిగింది. ఈ అతి సామాన్య పేద స్త్రీలు సృష్టించిన చరిత్రే అంతర్జాతీయ మహిళాదినం మార్చి 8.
మొదటి ప్రపంచ యుద్ధసమయంలో శాంతి కోరుతూ ప్రపంచంలోని చాలా దేశాల్లోని స్త్రీలు మార్చి 8ని మహిళాదినంగా జరుపుకోవడం ప్రారంభించారు. 1945 నుంచి ఐక్యరాజ్య సమితి కూడా మార్చి 8ని అంతర్జాతీయ మహిళాదినంగా పాటించాలని ప్రకటించటంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ ఉత్సవాలు జరుపుకోవడం ముమ్మరమైంది. స్త్రీలు ఈ దినం సందర్భంగా సమానత్వం, న్యాయం, ఓటు హక్కు ఇలా ఎన్నో అంశాలపై ఆందోళనలు చేశారు.
ఐక్యరాజ్య సమితి 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించి స్త్రీల సమస్యలను అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి కృషి చేయాలని ప్రపంచదేశాలను ఆదేశించింది. దీనితో అన్ని దేశాలూ మార్చి 8ని మహిళాదినంగా పాటిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు మార్చి 8 ని సెలవు దినంగా ప్రకటించి స్త్రీలు ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రోత్సహిస్తున్నాయి. త్యాగాలను, విజయాలను గుర్తు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవలసిందే. కానీ ఈ ఉత్సవాలు మేళాలుగా మారడంతో శ్రామిక మహిళల పోరాట దినం ఆశయం పదును కోల్పోయింది. మహిళలందరూ ఒకటి కాదు. చాలా కొద్దిమందికి మార్చి 8 “సెలబ్రేటెడ్ డే”. ఇంకా చదువు, ఆరోగ్యం, ఉపాధి లేక నిత్యం ఇంటా బయటా అవమానాలకు , అత్యాచారాలకు, హింసలకు గురవుతున్న అట్టడుగు వర్గాల పేద స్త్రీలు అన్ని దేశాల్లో అత్యధిక సంఖ్యలో వున్నారు. అంతర్జాతీయ మహిళాదినం ప్రకటన వెలువడి మరో మూడేళ్లకి వందేళ్లు నిండుతున్నాయి. ఈ కొద్ది కాలంలోనైనా ఆయా దేశాల ప్రభుత్వాలు నిరుపేద స్త్రీల సమస్యలను తొలగించడానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలని కోరుకుందాం. సామాన్య స్త్రీల సాహస గాథలను స్మరించుకుంటూ అంతర్జాతీయ శ్రామిక మహిళాదినంగా మార్చి 8ని జరుపుకుందాం. ఈ సందర్భంగా మహిళలందరికీ ప్రాణహిత జేజేలు తెలుపుతోంది.
ఈ సంచికనుండీ ప్రాణహిత మీకోసం పెద్దింటి అశోక్ కుమార్ రాస్తున్న మానేటి కథలను ధారావాహికంగా అందించబోతోంది. వాటిలో మొదటగా ‘కార్యకర్త’ కథను ఈ సంచికలో చదవండి. అట్లే బి.యన్ . స్వామి రాసిన ‘తాయిమాయి’ కథను అందిస్తున్నాం.
గొరుసు జగదీశ్వర రెడ్డి రాసిన ‘గజ ఈతరాలు’ కథా సంపుటి ని సమీక్షిస్తూ బి. ఎన్ . స్వామి రాసిన వ్యాసాన్ని, ఆఫ్రికన్ సాహిత్యాన్ని తెలుగులో అందించిన ప్రజాసాహితి ప్రత్యేక సంచికను సమీక్షిస్తూ గుర్రం సీతారాం రాసిన ” వ్యాసాన్ని మీ కందిస్తున్నాం. అట్లే హరగోపాల్ రాసిన కవితా సంకలనం ‘మూలకం’ ను సమీక్షిస్తూ వెంకటేష్ రాసిన వ్యాసం ఈ సంచికలో చదవండి.
చిలీ మహాకవి పాబ్లో నెరూడా జీవితంలోని ఒక చిన్న ఘట్టం ఆధారంగా రాసిన నవల ఆంటోనియో స్కార్మెటా ‘ద పోస్ట్ మాన్’ నవల ను ఎన్ . వేణుగోపాల్ తెలుగు లోకి అనువదించారు. ఆ అనువాదాన్ని ప్రాణహిత మీకు ధారావాహికంగా అందించబోతోంది. ఈ సంచికలో అనువాదానికి పరిచయ వాక్యాలు ” చదవండి.
ఇంకా ఈ సంచికలో ఎన్ . వేణుగోపాల్ ‘మనిషంటే పని కదా’, సుధాకిరణ్ ‘స్మృతి గీతం’, పసునూరి రవీందర్ ‘జ్ఞాపకాల ఖజాన’, తైదల అంజయ్య ‘వెదురువిల్లు’, కోసూరి రవికుమార్ ‘గుర్రపు చెవిలో పురుగు’, జాజుల గౌరి ‘ఉతికి ఆరేస్తా’ కవితలని చదవండి.
హిమబిందు ప్రతినెలా రాస్తున్న ‘చౌరస్తా’ లో ఈ సారి మహిళల గురించి రాసిన ‘పరదా!’ ను, మేరీ బ్రేవ్ బర్డ్ ‘లకోటా వుమన్ కి మమత తెలుగు సేత ఆరో అధ్యాయం ‘జీవితానికి అర్థాన్నిచ్చిన ఎ.ఐ.మ్‘, కొడవటిగంటి రోహిణీ ప్రసాదు ప్రత్యేక వ్యాసం ‘ప్రాణుల మెదడు’ ను ఈ సంచికలో మీ కందిస్తున్నాం.
ఈ సంచిక పూర్తిచేయబోతుండగా హైదరాబాదు నుంచి ఒక విచారకరమైన వార్త అందింది. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాదులో సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా, సాహిత్య, కళా రంగాల బుద్ధిజీవులకు కూడలిగా అభివృద్ధి చెందిన సుందరయ్య విజ్ఞానకేంద్రం భవనంపై దుండగులు దాడిచేశారని తెలుస్తున్నది. ఆ దాడి వెనుక రాజకీయ కారణాలు ఏమయినప్పటికీ ఒక సాంస్కృతిక చిహ్నం పైన అటువంటి దాడి జరగడం తెలుగు సమాజంలో పెరుగుతున్న అసహన ధోరణికి సూచికగా గుర్తిస్తున్న ప్రాణహిత ఆ ధోరణికి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నది.
ఎప్పటిలాగే ప్రాణహితను ఆదరిస్తారని, సాహిత్యంపై నిర్మాణాత్మక చర్చ ల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం.
