పరదా!

”మీ గురించి మాకు, అంటే… అమెరికన్లకి ఉండె అపోహ ఏమిటో చెప్పండి?.” అంటూ ఎబిసి ఛానల్ జర్నలిస్టు ఒకరు అరబ్ ఎమిరెట్స్ కి చెందిన ముగ్గురు యువతులతో ఇటీవల జరిపిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. వారిలో ఇద్దరు యువతులు బ్రెస్ట్ కాన్సర్ ని జయించినవారైతే ఒకరు డాక్టర్. ఇంతకీ ఈ ప్రశ్నకి వారిచ్చిన సమాధానం….’మేము రాతి యుగంలోనో, చీకటి లోకంలోనో లేము” అని. తరువాతి ప్రశ్నగా, “మీ దేశంలో మహిళలు బ్రెస్ట్ కాన్సర్ అని ఎవరికీ చెప్పరట కదా! అలా చెపితే భర్తలు వొదిలేస్తారని భయమట కదా” అనడిగినపుడు, ముగ్గురు యువతుల్లో ఒకామె సమాధానమిస్తూ, ”నేను కూడా అమెరికాలో చాలా సంవత్సరాలు ఉన్నాను. అక్కడి పరిస్థితులు నాకు బాగా తెలుసు. ఇక భర్తల విషయానికి వొస్తే, అమెరికాలో అయినా గల్ఫ్ ప్రాంతం అయినా పెద్ద తేడా ఏం లేదు” అని తేల్చి చెప్పింది.

ఈ సమాధానాలు సూటిగా తగిలాయి నాకు! ఎందుకంటే, వాళ్లు చెప్పిన సమాధానాల్లాంటివే నాకు కూడా పలు సందర్భాల్లో చాలా మంది అమెరికన్ మహిళలకి చెప్పాలనిపించింది కాబట్టి. ఇదేదో జాతి విద్వేషంతో ఇస్తున్న స్టేట్‌మెంట్ అనుకోవద్దు. సాధారణంగా డబ్బున్న వాడికి అది లేనివాడు ఎంత తెలివితేటలు, అవగాహన కలవాడైనా తనంత నాగరికుడుగా ఎలాగ అగుపడడో…. నేను ప్రస్తావిస్తున్న కోణం అలాంటిది. మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవచ్చు నేర్పు, పనితనం, ఎక్కడ ఉన్నా ఆకళింపు, అధ్యయనం చేసుకోవటం అవసరం కూడాను. కానీ అవతలి వాళ్లందరూ వెనకబడిన వాళ్లని….తమని అందరు అనుకరిస్తారనుకోవడం ఎబ్నార్మాలిటీ…

ఉదాహరణకి, ఈ దేశం వొచ్చిన కొత్తలో ఒక కమ్యూనిటీ టెలివిజన్ స్టేషన్లో వాలంటీర్‌గా పనిచేశాను. ఆ సమయంలో ఒక ఫెమినిస్టు తన కవిత్వాన్ని వినిపిస్తానంటే రికార్డు చేయడానికి టీమ్ అంతా వెళ్లాం. టీమ్ అందరిలోకి భిన్నంగా కనిపించే నన్ను చూసి ఆమె బాగా మాట్లాడింది, అనేక విషయాలు అడిగింది. తన అవగాహన మేరకు, ”భారతీయ స్త్రీలు భర్త చాటు భార్యలు, వరకట్నాన్ని తెచ్చేవారు, బాల్యవివాహాలు – పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకునేవారు, తమ హార్మోన్ల పోకడల పట్ల బొత్తిగా అవగాహన లేదా జ్ఞానం లేనివారు, భర్తల వ్యక్తిగత ఆస్తిలో వీరూ ఒక భాగం….(పర్సనల్ ప్రాపర్టీ), భ్రూణహత్యలకు అడ్డుచెప్పలేని వారు, సంప్రదాయాన్ని దాటలేని, హింసని కనీసం బహిరంగపరచలేని అసహాయులు. ఏ మాత్రం పరిచయంలేని నాగరికతల్లోకి, దేశాల్లోకి ఇష్టం ఉన్నా లేకున్నా భర్తల వెనుక ‘సాహసంగా’ వెళతారు. అమెరికాలో ఉన్న వాళ్లలో బాగా చదువుకున్న మహిళలు, చురుకైన వారు ఉన్నప్పటికీ నాగరికత, వ్యవహారశైలి వంటి విషయాలలో ఇంకా సంప్రదాయ స్త్రీలుగా పరిగణించాల్సిందే.
అయితే ప్రతి నాణానికీ అవతలి వైపు మరో కథనం ఉంటుంది కనుక నేను కూడా ప్రస్తుతం ఇండియాలో మహిళల స్థితిగతులు, విద్య , ఉద్యోగ అవకాశాలు, సమాజంలో వొస్తున్న మార్పుల గురించి అలాగే మహిళా ఉద్య మం గురించి నాకు అవగాహన ఉన్నంత వరకు కవయిత్రి మరియు స్త్రీవాది అయిన ఆమెకి అప్‌డేట్ చేసే ప్రయత్నం చేశాను… అంతా విన్న తరువాత …..”ఈ మార్పులన్నీ పాశ్చాత్య ప్రభావం వల్ల వొస్తున్నాయా? మీ మహిళా ఉద్య మపు వ్యూహాలన్నీ అమెరికన్ విమెన్స్ మూవ్‌మెంట్ నుంచి అధ్యయనం చేసి నేర్చుకున్నవేనా? వోంట్ యు పీపుల్ లుక్ అప్ టు అజ్ ఫర్ ఎవ్రిథింగ్ ….?” అనడిగింది.

అమెరికా దేశం, మనుషులు, వారి వ్యవహారశైలి ఇవన్నీ అప్పటికి కొత్త కాబట్టి, ఆమె ఆ ప్రశ్న వేసిన వెంటనే జవాబు చెప్పలేకపోయానని ఇప్ప్తటికీ విచారిస్తుంటాను. అదే ఇప్పుడయితే”మాక్కూడా ఒక వ్యక్తిత్వం, జ్ఞానం, చరిత్ర, అమెరికాలాంటి దేశానికి కూడా బోధించగల నైపుణ్యం ఉన్నాయి. కానీ ప్రపంచానికి అమెరిన్‌ల గురించి ఎక్కువ తెలియడం, అమెరికన్లు ముఖ్యంగా మూడో ప్రపంచపు దేశాల్లో ఇంకా ‘మనుషులు పాములు కలిసి తిరుగుతారనే’ భ్రమల్లోనే ఆగిపోవడంతోనే ఈ సమస్యంతా. ఇక మహిళా ఉద్యమం విషయానికొస్తే, ఇప్పటి వరకు ఉద్యమించిన సమస్యలన్నీ మా మూలాల్లోంచి వొచ్చినవే…ఇంకా చెప్పాలంటే, మా రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఉధ్రుతంగా నడిచిన సారా ఉద్యమం…ఎక్కడో మారుమూల పుట్టింది…వాళ్లకి అమెరికా వాసన కూడా సోకలేదు. కాకపోతే మీ దగ్గరే కాదు ప్రపంచంలో ఎక్కడయినా, ఉద్యమాలు ఎదిగేందుకు తోడ్పడే వ్యూహాలు, రచనలు దొరికితే పరిశీలించి…పనికొస్తాయేమో తెలుసుకునే, అమలులోకి తేగలమేమో ప్రయత్నం చేసే సానుకూలత మాకుంది. బహుశా… మీకే దూరపు నేలంతా పల్లం! అనే గాఢ నమ్మకం ఉండటం వల్ల మాలాంటి వాళ్ళ వికాసం గురించి తెలియడం లేదు. భారతదేశంలో మహిళలకి సమస్యలు లేవని, మీరు వర్ణించినటువంటి స్త్రీలు అక్కడ లేరని అనను కానీ, రంగు, రూపం, పరిసరాల మార్పులతో మీ దేశపు మహిళలు కూడా అంతకంటే తక్కువ సమస్యలని ఎదిర్కోవడం లేదు.

ప్రతి ముగ్గురు అమెరికన్ మహిళల్లో ఇద్దరు మహిళలు తమ జీవిత కాలంలో కుటుంబంలోని పురుషులు, లేదా పరిచయస్తుల చేతిలో లైంగికదాడికి గురవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఏడు సెకనులకు ఒక మహిళ దాడిని ఎదుర్కొంటోంది. దాదాపు 2.5 మిలియన్ల మంది మహిళలు ఏదో ఒక రూపంలో గృహ హింస పాలవుతున్నరు. అమెరికా జనాభాలో యాభై శాతానికి పైగా మహిళలుంటే, వారిలో సుమారు 25 శాతానికి పైగా మహిళలు హై స్కూల్ డిప్లమా స్థాయిని దాటి చదువుకోలేదు. అమెరికాలో జన్మిస్తున్న పిల్లల్లో మూడోవంతు మంది పిల్లలు సింగిల్ మదర్స్ కి పుడుతుండటం వల్ల…. ఆ కుటుంబాల భారాన్ని లాగలేక జీవితాల్లో వాళ్లు నిస్పృహని, అనారోగ్యాన్ని నింపుకుంటున్నారు… ఇక వ్యసనపరులైన భర్తల సంగతి సరే సరి! నిజానికి మీరు మా సారా ఉద్యమాన్ని స్టడీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో! 2006వ సంవత్సరంలో టీనేజీ అమ్మాయిలకి పుట్టిన బిడ్డల సంఖ్య 440,000. ఇల్లీగల్ అబార్షన్ల కారణంగా చనిపోతున్న మహిళలు, మెడికల్ ఇన్సూరెన్స్ భరించడం కష్టమని భర్తలు ఎంత ఘోరంగా ప్రవర్తించినా సర్దుకుపోతున్నవాళ్లు అనేకం. అమెరికాలో ఛాందసవాదం, అజ్ఞానం లాంటి లక్షణాలు ఇతర ప్రపంచ దేశాల్లోలాగానే ఉన్నాయి తప్ప అందుకు మినహాయింపు లేదు. ఆడది ప్రెసిడెంట్ పదవి చేపట్టడానికి మా దేశం ఇంకా సిద్ధంగా లేదంటూ ఈ దేశంలోని మగవాళ్లలో ముప్పాతిక శాతం ఆలోచిస్తున్నారంటే మీ కంటే మాలాంటి దేశాలే నయం” అని చెప్పడానికి కచ్చితంగా వెనకాడను.

ఈ దేశంలోని మహిళలందరూ మేమే గొప్ప అన్నట్టుంటారని అనను కానీ, తమ సమస్యల కంటే ఇతర దేశాల మహిళలు అథమంగా ఉన్నారనుకునే స్థాయిలో వాళ్ల భావజాలం ఉండటం కొన్ని సార్లు చికాకుగా ఉంది. కాకపోతే మారణాయుధాలు లేకుండానే ఆ బూచిని చూపించి ఇరాక్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికాకి తన ప్రజలు ‘ఆధిపత్యపు’ భ్రమలు కలిగి ఉంటే కానీ ఆటలు సాగవు. అసలు ఈ తరహా అభిప్రాయాలు నూరిపోయడంలో ప్రథాన ప్రాత పోషిస్తున్నది మీడియా అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కుంచించుకు పోయిన పరిధితో ప్రసారాలు, యురోపును దాటని ఆలోచనలతో పాటు, అడపాదడపా ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించిన కథనాలు వొచ్చినా, భారతీయ మహిళ సంప్రదాయంగా ఉంటేను, అరబ్ మహిళ బురఖా వేసుకుంటేను, ఆఫ్రికా అడవులను అక్కడి ప్రజలు దాటక పోతేను అమెరికన్ టెలివిజన్ కి మంచి స్టోరీ అవుతుంది తప్ప, ఆధునిక భారతీయ, పాకిస్తానీ లేదా అరబ్ మహిళలు, భవంతుల్లో నివసించే ఆఫ్రికన్లు సబ్జక్టులుగా అనిపించకపోవచ్చుననేది అర్ధం చేసుకోవాల్సిన మరో కోణం.

సరిగ్గా ఓ వారం క్రితం నా స్నేహితురాలు ఇందు ”మా పెరట్లో పాము కనిపించిందని ఇంటిపక్క వాళ్లకి చెపితే, మీ దేశంలో మనుషుల మధ్యే తిరుగుతాయటగా” అనడిగారనిచెప్పినప్పుడు నిజ్జంగా నోట మాట రాలేదు. నాకో, నా స్నేహితురాలికో ఇలాంటి వాళ్లు తారసపడ్డారు కాబట్టి, అమెరికాలోని పౌరులందరూ ఇదే స్థాయిలో ఉన్నారని జనరలైజ్ చెయ్యలేను కానీ, ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపే చూస్తున్నయని మంచి చెడుల పోకడలన్నీ ఇక్కడి నుంచే ప్రపంచం నలుమూలలకు ప్రసరి స్తున్నానయనుకునే స్థాయికి అనేక మంది సాధారణ పౌరులు తెలియకుండానే ట్యూన్ అయివున్నారు.

ఈ మధ్యే మీడియాలో ప్రచురించిన మరో ఇంటర్వ్యూ గురించి చెపుతాను. పాకిస్తాన్ కి చెందిన బేగం నవాజిష్ అలీ (అలీ సలీమ్) ఒక పాపులర్ లేట్ నైట్ షో హోస్ట్ (http://www.youtube.com/watch?v=Cn7Kke8YK8Q). బై సెక్సువల్ అయిన ఇతను గ్లామరస్ ఉమన్ లాగా తయారయ్యి ఇంటర్వ్యూలు చేస్తాడు. ‘నేను ఒక మహిళని, ఒక పురుషుడిని కూడా… ఈ రెండు జెండర్లకు సంబంధించిన భావావేశాల్ని బాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను’ అని బహిరంగంగా ప్రకటించే అలీ షోకి పాకిస్తాన్‌లోని సెలబ్రిటీల నుంచి పొలిటీషియన్స్ వరకు రావడానికి ఉత్సాహపడతారు. అనేక మంది ఇండియన్స్ ని కూడా అతను ఇంటర్వ్యూలు చేస్తాడు. అలీ ఇటీవల అమెరికా, బ్రిటన్లలో పర్యటించినపుడు బిబిసి, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి మీడియా సంస్థలు ఉత్సాహంగా ఇంటర్వ్యూలు చేశాయి. వాషింగ్టన్ పోస్ట్ లో వొచ్చిన ఇంటర్వ్యూలో అనుకుంట, ”పాకిస్తాన్ లాంటి సంప్రదాయదేశంలో ఇంత బహిరంగంగా మీ సెక్సువాలిటీని ఎలా బయటపెట్టారు… పాపులర్ టాక్ షో హోస్ట్ ఎలా కాగలిగారు. అమెరికాలో, బ్రిటన్‌లలోని గే మూవ్‌మెంట్స్ లాంటివి స్ఫూర్తినిచ్చాయా” అనే ప్రశ్న వేసినపుడు, ”సమస్య దాని పరిష్కారం రెండూ నా మూలాల్లోంచి వొచ్చినవే. వాస్తవానికి, హోమో సెక్సువాలిటీ పాశ్చాత్య దుష్ప్రభావం అనే ప్రచారం ఓ భ్రమ మాత్రమే, దీని వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండి, తమ అస్థిత్వం కోసం పోరాటం చేసే వాళ్లకి చాలా అన్యాయం జరుగుతోంది. ‘బేగం నవాజిష్‌’ లాంటి లోకల్ హీరోయిలకే ఆ క్రెడిట్ దక్కాల”న్నాడు. పదిహేడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి, అనేక అవమానాలు, సంఘర్షణలు ఎదుర్కొని ఈ రోజు అతను సాధించిన విజయానికి, పొందుతున్న ఆదరణకి మేమే స్పూర్తా అనడిగితే అతని పోరాటం హైజాక్ కి గురయ్యిన భావన కలగదూ ?

 ఏది ఏమయినప్పటికీ, ఈ ‘అమెరికన్ ప్రయిడ్’ అనే పరదా తొలగించుకుని ఎప్పటికయినా వీరు బయటకు రాగలరంటారా?

2 అభిప్రాయాలు »చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. ప్రాణహిత » మార్చ్ 2008 : సంపాదకీయం Apr 10, 2008 1

    [...] లో ఈ సారి మహిళల గురించి రాసిన ‘పరదా!’ ను, మేరీ బ్రేవ్ బర్డ్ ‘లకోటా వుమన్ [...]

  2. kamal Oct 12, 2009 2

    మీ వ్యాసం చాలా బాగుంది, ఫెమినిజం లొ కూడ ప్రాంతీయ భేదాలు. ఈ భావం ఒక్క అమెరికాలొనె కాదు, ఒక సాంస్కృతిక ప్రాంతం నుండి మరొ భిన్నమైన సాంస్కృతిక ప్రాంతం వెల్లె మనుషుల అనుభవాలు ఇలాగె ఉంటాయి, నేను కూడ స్వయంగా అనుభవించిన వాడినే. కడప ప్రాంతం నుండి రాజధాని నగరం భాగ్యనగరం లొ కొత్తగా స్థిరపడినప్పుడు, నగర ప్రజల్లొ కడప ప్రాంతం మీద ఉన్న అపొహలన్ని నా మీద ఒక్క సారిగా పశ్న రూపం లొ దాడి చేసాయి, సాంస్కృతిపరంగా చరిత్ర పరంగా సాహిత్యపరంగా నాకు పట్టు ఉండడం తొ అలా ప్రశ్నించవారికందరికీ సమాధానాలు చెప్పగలిగాను. ఈ భావన అన్ని చొట్లా ఉన్నదే.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో