Mar2008
తాయిమాయి
ఎల్లవ్వా, చెంపకేమైందే.
దెబ్బతాకింది.
దెబ్బతాకిందా, మొగుడు కొట్టిండా.
ఏదో ఒకటయింది. ఖరాబయిన నల్ల ఏదో చెప్పు.
బాత్రూంల నల్ల నీల్లు పోస్తలేదు. కొత్తనల్ల ఫిట్ చేయి.
వాటర్ ట్యాప్ పరిశీలించి, బలాన్నంతా ఉపయోగించి నల్ల విప్పింది.
దీనికి వాచర్ ఒక్కటే పోయింది. అది ఏసుకుంటే అయిపోవు. సార్ కొత్త నల్ల తీసుకచ్చిండని పెడుతున్న అంటూ నల్ల బిగించింది.
చేసిన పనికి ఇచ్చినంత తీసుకొని బయల్దేరింది.
చాటుకు పెట్టుకొని ఏం తీసుకుపోతున్నవు? కసిరింది ఇంటావిడ.
ఖరాబైన నల్ల మీరు పాత సామాను కింద పారేస్తరు. దానికి వాడేమిస్తడు ఈ దీనికి కొత్త వాచరు పెట్టి ఎవరింట్లనన్న ఫిట్ చేస్తే నాలుగు పైసలత్తయనే ఆశతోని కొంటవోతున్న.
నీ దగ్గర చాన ఇకమతులు ఉన్నయే. ఎప్పుడు లేచి ఇంటిపని చేసుకుంటవో గని తెల్లార్తెనే కరీంనగర్‌ల ఉంటవు.
ఏం చేయాల్నవ్వా! ఎంత చేసినా ఎప్పటి చిప్ప ఎనుగుల్లనే అన్నట్లు చేసి, చేసి వాని తాగుడుకు పెట్టుడైతుంది. అనుకుంటూ వెళ్ళింది.
అలా పల్లెటూరు నుండి కరీంనగర్‌కు వచ్చి, తనకు తెలిసిన మేస్త్రీ దగ్గర ప్లంబర్ పని చేసి రాత్రి వరకు పల్లెకు చేరుకోవడం ఆమె నిత్యకృత్యం. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఎల్లవ్వను మేనమామ పెంచి పోషించాడు. మేనమామ ఇంట్లో ఎల్లవ్వ బట్టకు, పొట్టకు కరువు లేకుండా బతికింది. మేనమామ కొడుకు తనకంటే పెద్దవాడు అతనితో ఆడుతూ, పాడుతూ బడికి దూరమై పెరిగింది. మొదటినుండి ఎల్లవ్వ పనులలో దిట్ట, తెలివిగలది. తన కొడుకు పనికిమాలిన వాడని, మూర్ఖుడని కుమిలి పోయేవాడు. ఎల్లవ్వకు తన కొడుకునిచ్చి పెళ్ళి చేస్తే కనీసంగానైనా బతుకుతడని మేనమామ ఆశపడ్డడు. ఎల్లవ్వకు బావమీద సదభిప్రాయం లేదు. కాలం గడుస్తుంది. ఎల్లవ్వ పెద్దదయింది. కొమురయ్యకు మీసం మొలిచింది. కాల పరీక్షకు తట్టుకోలేని మేనమామ శరీరం రాలుటకు సిద్దమైంది. అటువంటి రోజులలో ఒకనాడు.
”ఎల్లవ్వా, ఇగరా” అంటూ పిలిచాడు
”ఏంది మామ”
నా పానం మంచిగుంట లేదు. ఎప్పుడు పోతనో తెలుత్తలేదు. నాముంగట కొంరని తోని నీ పెండ్లి చేస్త.
……………………………………………………………………………………………………………
నువ్వు మాట్లాడ్తలేవంటే నాకు సమజయింది. కొంరడంటే నీకు ఇష్టం లేదు. వాన్ని ఇడ్సి పెడితే, ఏమైతడో అని భయం. నేను చస్తే వాడు ఆగం అయితడు. వానికి నిన్ను జత చేస్తే నా ప్రాణం హాయిగుంటది. అట్లగాక నీకు వేరోన్తోటి పెండ్లి చేయాలంటే కట్నం, గిట్నం కావాలె అదో పెద్ద లొల్లి అవి ఏన్నుంచి తేవాలె నేను. ఉన్న ఒక్క ఎకురం నీ పెండ్లికి ఖర్చు పెడుతే, తర్వాత కొంరడు ఏం చేసుకుని బతుకుతడు. దీంట్ల, దీంట్లనే ముడేత్తె వాడు నువ్వు చేసుకుని బతుకుతరు. ఇల్లు నిలవడ్తది అనిపిస్తంది.
నీ యిష్టం మామ నువ్వు చెప్పినట్టు ఇంట. బావను కూడా అడుగు.
గాడిది మొకపోడు గావాన్ని అడుగుడేంది.
నిశ్శబ్దంగా మంగళసూత్రం తలదాల్చింది. మౌనంగా సంసారంలోకి దిగింది. మేనమామ తనువు చాలించాడు. పని చేతగాని భర్తకు ఊళ్ళో పనులు లేకపోవటం వరమైంది. వ్యవసాయం చేసే కాలం కాకపోవడం, కూలి పనులు దొరకక పోవటం, ఆ కుటుంబాన్ని పీడించింది. తాగడం నేర్చుకొని భర్త అన్నీ మరిస్తే, భర్తను భరించటానికి ఎల్లవ్వ పనికోసం పరితపించింది. పనిని వెతుక్కుంటూ పక్కనే ఉన్న కరీంనగర్ బయలుదేరింది. విషయం భర్త చెవిలో వేసింది.
నేనెటు రాను. ఈ ఊర్లె కొంపయినా ఉంది అక్కడికి పోతే అది కూడా ఉండది.
ఈడ ఉండి ఏం జేత్తవు.
ఉన్ననాడు తింట, లేన్నాడు పంట.
అలాంటి మొండి సమాధానం విన్న ఎల్లవ్వ తన ఊరి నుండి కరీంనగర్‌కు ప్రతిరోజు కూలి పనికి వచ్చి వెళ్ళేది. మొదట్లో ఆపనీ ఈపనీ చేసిన ఎల్లవ్వ నెమ్మదిగా ప్లంబింగు మేస్త్రీ దగ్గర కుదురుకుంది. చాలా వరకు పని నేర్చుకుంది. నీళ్ళ పైపులేకాక, సెప్టిక్ ట్యాంకుల పైపులు బిగించాల్సి ఉండడంవల్ల, ఆ వాసనల్ని భరించడానికి పాన్ నమలడం నేర్చుకుంది. అది మెల్లగా గుట్కాకు దారి తీసింది. పొద్దున్నే తిని ఇంటి నుండి బయల్దేరిన ఎల్లవ్వ, రాత్రి వరకు ఇల్లు చేరుకునేది. ఇందుకు భిన్నంగా కొమురయ్య ఊర్లోనే ఉంటూ చేసేదిలేక తాగుతూ, ఊరి వాళ్ళతో కయ్యాలు పెట్టుకుంటూ కాలం గడపసాగాడు. తాగడానికి భార్యను డబ్బుకోసం వేధించడం మొదలు పెట్టాడు. గృహహింస హద్దు మీరింది. మొదట్లో సహించిన ఎల్లవ్వకు, రాను రాను సహించడం కష్టమైంది, అది తీవ్ర స్థాయికి చేరుకున్న ఒక రోజు
మా అయ్యే లేకుంటే నువ్వు దిక్కు లేని దాని వయిదువు.
ఇప్పుడు కూడా నేను దిక్కు లేని దాన్నే.
మా అయ్య సాది సవరిత్తే గట్లంటవా. గుడ్లురిమిండు.
నిన్ను కట్ట వెట్టి, దిక్కు లేని దాన్ని చేసిండు.
అంటే నీ లెక్కల నేను సచ్చినట్టేకదా అంటూ విపరీతంగా బాదిండు.
ఇంట్లో ఇద్దరి మధ్య రగడ మొదలై రాజుకుంది. అయిష్టత, అసహనం, కోపం, దాష్టీకం వారి మధ్య రాజ్యమేలినయి. ఇల్లు నరకమైంది. ఎల్లవ్వ డబ్బు సంచికి చిల్లు పొడిచాడు. మద్యం అతని కాలేయానికి చిల్లు పెట్టింది. అతనికి గ్రహింపు లేదు. అది గ్రహించిన ఎల్లవ్వ అతనికి డబ్బేకాక ఏదీ అందకుండా నాలుగు దిక్కులూ కట్టడి చేసింది. ఒక్కసారిగా ఉక్కిరి, బిక్కిరి అయిండు. చేసేది లేక పగను పెంచుకున్నడు. పరిస్థితులు కుదుట పడ్డాయనుకుంది. అప్పుడప్పుడూ ”మా అయ్య నిన్ను పెంచి పెద్ద చేసిండే, నువ్వు ఇప్పుడు నన్ను సాదాల్నే” అంటూ హుంకరించేవాడు. ఆమె అతని మాటల్ని ఎన్నడు లెక్క చేయలేదు. అది భరించలేక పోయేవాడు. అన్ని ఖర్చులూ పోను, కొంరయ్య బారిన పడకుండా కాపాడగలిగిన కొద్ది డబ్బును చిట్‌ఫండ్ రూపం లో పోగేసింది. అదంతా ఒక రోజు చేతికి వచ్చింది. సంతోషంగా ఇంటికి వెళ్ళింది. సరుకులు కొంది. తనకిష్టమైన చేపల కూర వండింది. కొంరయ్య కోసం చూసింది రాత్రయిందని తిని పడుకొంది.
కరీంనగర్‌లో జరిగిన ఎలక్షన్ మీటింగు కోసం పార్టీవారు భారీగా జనాన్ని సమీకరించారు. అందులో కొంరయ్య ఒకడు. మీటింగు పూర్తి అయ్యేసరికి రాత్రయింది. ట్రాక్టర్లతో ఎవరి ఊర్లలో వాళ్ళను దించి డబ్బులతో పాటు ఎవరికి కావలిసినన్ని వారికి సారా పాకెట్లు ఇచ్చారు. కొంరయ్య సంచి సారా పాకెట్లతో నిండింది. కడుపు సారాతో నిండింది. తూలుతూ, పడుతూ, లేస్తూ ఇంటికి బయల్దేరాడు సగం రాత్రయింది. తాగిన కొంరయ్య తలుపు తోసుకొని ఇల్లు జొచ్చిండు. నాసిక నాలిక చురుగ్గా పని చేశాయి. చేపల పులుసు వేసుకొని తృప్తిగా తిన్నాడు అలికిడి విన్న ఎల్లవ్వ నిద్రలేచింది.
”తిన్నవా” ఆప్యాయంగా పలకరించింది.
”కూర మంచిగున్నది చానా రోజులాయె ఇట్ల తినక ” అంటూ దగ్గరకు చేరిండు.
తననే మెచ్చుకున్నట్లు భ్రమించి అతనికి మరింత దగ్గరయింది. ఆమె వాసన అతన్ని తట్టి లేపింది. ఆ సమయంలో తన వద్దే దాచిపెట్టుకున్న ఆమె డబ్బు సంచి కూడా అతని కంట పడింది. గ్రహించలేక పోయింది కంటినిండా నిద్రలో ఆమె. తెచ్చుకున్న లిక్కర్‌తో అతను మిగిలిన రాత్రి గడిపాడు. ఎల్లవ్వ నిద్ర లేచి డబ్బు సంచి కోసం వెదికింది. కొంరయ్య జేబులో కనపడింది. లాఘవంగా లాగి బొడ్లో దోపుకుంది.
ఎల్లీ… ! అరిచాడు.
”పొద్దెక్కనే లేదు తాగినవా”
”అసలు నేను పంటె గదా రాత్రంతా తాక్కుంటనే ఉన్న. గన్ని రూపాయలు ఎక్కడియే”
”నీ కెందుకు”
”ఎవడిచ్చిండే నీ అవన్నీ”
”నోర్ముయ్”
నన్ను నోర్ముయ్యమంటవా. అంటూ చేతికందిన కర్రనొకదాన్ని విసిరాడు. తప్పించుకుంది ఉగ్రుడై ఊగుతూ లేచిండు. అనుకోని ఉపద్రవానికి జడిసి భయంతో బజార్లోకి పరుగెత్తింది. ఆమె వెంటబడ్డాడు, భయంతో ఒకరు ఉన్మాదంతో మరొకరు, ఒకరివెనుక ఒకరు ఉరక సాగారు. అతనికి దూరంగా ఉండటానికి ఆమె, ఆమె దగ్గరి డబ్బుల కోసం అతను పరుగు తీసారు. ఆ పరుగు పక్కనే ఉన్న మయిన్ రోడ్ ఎక్కింది.
ఆకాశం పగిలి ఎరుపెక్కింది. సూర్యకిరణాలు పొడుచుకొస్తున్నాయి. ఇవన్నీ పట్టని మనుషులు తమ తమ పనుల్లో మునిగిపోయారు. మందలు మందలుగా పశువులు ఊరిబయటకు వెళుతున్నాయి. వాటి గిట్టల ద్వారా లేవాల్సిన దుమ్ము లేవడం లేదు. రోడ్డు భుమికి ఆచ్చాదనమైంది. పశువుల కాపరి రోడ్డు పక్క చాయ దుకాణంలో కి వెళ్ళి బాతాఖానిలో మునిగాడు. సంచార జీవులు కొందరు బస్సుకోసం వచ్చి టీ కొట్టులో స్థిర పడ్డారు. తెల్లారగానే వార్తలతో కడుపునింపుకునే వారు పత్రిక కోసం హోటల్‌కు వచ్చి చేరారు. రెగ్యులర్ కస్టమర్స్ అప్పటికే టీ తాగుతూ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హోటల్ పల్లెకు, పట్నం వాసనల్ని పంచే కేంద్రకం. అర్బన్ రంగు, రుచి, వాసనలన్నీ ఆ గడపగుండానే పల్లెలోకి అడుగుపెట్టాయి. ఆ హోటల్ యజమాని అమర్చిన టీవీ సెట్టు పల్లె ప్రజల సాంస్కృతిక కేంద్రమయింది. ఆ కూడలి ఊర్లో వాళ్ళందరి మజిలి. రకరకాల వ్యాపకాలతో పొద్దున్నే అనేక మంది ఆనవాయితీ ప్రకారం అక్కడికి చేరారు. చల్లగాలి, నీరెండల్తో వాతావరణం హాయిగా ఉంది. అంత ఉదయాన్నే స్నానం చేసి శుచిగా, శుభ్రంగా ఉన్న డెబ్బయ్ ఏళ్ళ ముసలివాడు, రోడ్డు పక్క ఇంటి చూరు కింద కూర్చొని తత్వాలు ఆలపించసాగాడు. నొసట విభూతి రేఖలు, కంఠంలో రుద్రాక్షలు ధరించి ఏక్‌తారా మీటుతూ పాడసాగాడు.
గురురాయ నీమాట వినకుంటె కీడు
వింటే లోకుల తోటి అపకీర్తి పాలు
ఔర సద్గురు రాయ అంతానీ మాయ
ఆత్మలో దలచితే ఆనంద మాయే
చింత చెట్టు మీద చిలకలున్నవిరా
చిలుక నోటిలో రామ పలుకు లున్నవిరా ||ఔ||
ఏటి గట్టున ఒక్క కొంగ ఉన్నదిరా
కొంగ మెడన కోటి లింగాలున్నవిరా ||ఔ||
………………………………………..
………………………………………..
పాట ఉదయాన్ని నిద్ర బుస్తుంది. శబ్దతరంగాలు వాతావరణాన్ని నాదమయం చేశాయి. వాతావరణం ప్రశాంత గంభీర రూపం దాల్చింది. అందరూ మత్తుగా ప్రశాంతతను అనుభవిస్తున్నారు. దూరం నుండి అల్లరి వినిపించింది. ముందుకెళ్తున్న పశువులు వెనక్కి తిరిగిచూశాయి. అరుపులు మరింత దగ్గరయ్యాయి. కూర్చున్న వారు నిల్చుని చూశారు. అరుపులతో పాటు దృశ్యం కనిపించింది అరుపులు ఆమెవి. ఉరుములు అతనివి. దిక్కుతోచకుండా ఆమె పరుగెత్తుకుంటూ వస్తుంది. ఉన్మాదిలా అతను వెంటాడు తున్నాడు. ఇద్దరు చాయ్ హోటల్ వద్దకు వచ్చారు. ప్రజల సమూహం కాపాడుతుందనే ఆశతో ఆగింది. రెట్టింపు వేగంతో అతను వచ్చి ఒడిసి పట్టుకున్నాడు. శక్తినంతా కూడదీసుకొని ప్రతిఘటిస్తుంది. ఒకరినొకరు నిలువరించు కోసాగారు. ఈ సంఘటనలో చాయ హోటల్ చలనశీలతను కోల్పోయింది. డబ్బు సంచి కోసం అతను ఆమె పొట్ట కింద చేయి వేసి గట్టిగా గుంజిండు. డబ్బు సంచితో పాటు చీర కూడా ఊడి వచ్చింది. సిగ్గుతో రోడ్డుపై కూల బడింది. పాటగాని ఆసరాతో ఆమె లేచింది. చల్లారిన సముద్రంలా అతను వెళ్ళి పోయాడు.
జరిగిన సంఘటన వారం రోజుల వరకు ప్రజల నోళ్ళలో నానింది. హోటల్ వద్ద టాపిక్ అయింది. సన్నివేశం దృశ్యాలు, దృశ్యాలుగా ముక్కలు, ముక్కలు గా మారి కొందరి నోళ్ళలో చిలువలు, పలువలు అయింది.
” తాగి తాగి పొల్లను నాశనం చేసిండు ”
” ఎన్కటి రోజులు కావు ఎవల్ని హద్దుల పెట్టేటట్లు లేదు ”
” సారా, గుడుంబాల మన్నువడ అవ్వి చెయ్యవట్టి మొగోల్లు వెధవలు, ఆడోల్లు విధవలు ఆయితుండ్రు”
” అమ్ముకొనే టోడు మంచిగనే ఉంటున్నడు తాగెటోడే ఆగం అయితండు. ”
” తాగుడు కాదు, అమ్ముడు బంద్ వెట్టాలె ”
” షాప్ ఓనర్‌కే కాదు సర్కార్‌కు ఇదొక ఆదాయవనరు. అమ్ముడెట్ల బంద్ అయితది? ”
ఇలా ఎవరికి తోచిన ప్రశ్నను వారు, ఎవరికి నచ్చిన జవాబును వారు తలపోసుకోసాగారు. ఎల్లవ్వ అక్కడ కనిపించిందని ఒకరు, ఇక్కడ కనిపించిందని ఒకరు చెప్పుకోసాగారు.
ఒక రోజు అర్ధరాత్రి పాత పెంకుటిల్లు ఎక్కింది ఆమె. మెల్లమెల్లగా వంటింటి వైపు వెళ్ళింది. చప్పుడుకు ఇంటామె లేచింది ” ఎవలుల్లా ” అంటూ అరిచింది. చప్పుడు లేదు. దొంగా దొంగా అంటూ అల్లరి చేసింది. పది మంది గుమి గూడారు. అందులో ఒకరు గుర్తుపట్టి ఎల్లవ్వా! అని పిలిచాడు.
”ఏందన్నా”
”ఏం చేత్తన్నవే”
”గూన సదురుతున్న”
”నీ యవ్వ… గీ సీకట్ల సదురుడేందే”
”దొంగతనానికచ్చింది” అందులో ఒకరు
”వంటింట్ల నుంచి ఇంట్లకు దిగుదామనుకుంది” మరొకరు
”దాన్ని పట్టుకోండి” ఒక్కసారిగా పదిమంది అరిచారు.
ఈ హడావిడి నంతా గమనించి ఆమె మరో వైపు దుమికింది. అందరు ఆ వైపు వెళ్ళే సరికి చీకట్లో మాయమైంది.
”ఎసొంటి మనిషి ఎట్లయిపాయె” ఒకరి సానుభూతి.
”సింగులు చెక్కిందంటే నడుం లేపకపోవు” మరొకరి నిట్టూర్పు.
”బాగా తాగుడు మరిగి గిట్లయింది” ఇంకొకరి అసహనం.
”వాడకట్టోల్లం దీనితోని జాగ్రత్తగుండాలె”
”అరేయ్! అదెటు పోయిందో చూడు పోర” ఒకరి పురమాయింపు.
గుంపు నుండి ఒకతను ఎల్లవ్వ వెళ్ళిన దిక్కు బయల్దేరాడు. పరుగెత్తుతున్న ఎల్లవ్వ కనిపించింది. వెంబడించాడు. పరుగెత్తి మెయిన్‌రోడ్ పై కాలుమోపింది. అంతా నిర్మానుష్యం ఉచ్వాస, నిశ్వాసలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా మెయిన్ రోడ్ పై గల టీ దుకాణం వద్దకు వచ్చి ఆగింది. ఆమె వెనకే వచ్చినవాడు చాటుగా నిలబడి చూడసాగాడు. ఆమె అక్కడ నిలబడి ఆకాశం లోకి చూస్తూ చేతులెత్తి అరవసాగింది. నెత్తి కొట్టుకోసాగింది.
vemuganti Mar 16, 2008 1
telangana life lo ninchi vachchina story sanklishta mina jeevithanni chppina swamy ki thanks