Apr2008
గగనకళ
చూపుండాలిగాని
ఏ దిక్కు చూసినా అందం ఆనందం
ఈ ఆకాశం
నవరసాల సువిశాల స్వతంత్ర సుక్షేత్రం
అందుకుందామంటే అందదు
అణగదొక్కుదామంటే కుంగదు
భూగోళోం గుడిసె ముందట
ముగ్గులలో మురిపెంగా
తీర్చిదిద్దిన వాకిలి ఈ ఆకాశం
చిన్నపిల్లలై వ్యోమగాములు
మూడుచక్రాల బండ్ల రాకెట్లెక్కి
ఈ మూల నుండి ఆ మూలకు
ఆ మూల నుండి ఈ మూలకు
పోటీపడి ఆదుకోవచ్చు పాడుకోవచ్చు
ఎన్ని మార్గాల్లోనైనా విహరించవచ్చు
ఎన్ని ప్రయోగాలైనా చేసుకోవచ్చు
నక్షత్రాలన్ని గాలించి రావటం
గ్రహాలన్నిశోధించి రావటం
మహాప్రస్థాన యాత్రాస్థలం ఈ నీలాకాశం
ఎన్నో పరిణామాల యుద్ధ విమానాల
అతి పెద్ద రంగస్థల ప్రవేశం ఈ నింగి
వేదికనధిష్టించిన
వీరుల కదలికలు చంద్రవంకలు
భూమ్మీద నుండి చూస్తే
బోర్లించిన కోల్లగంప ఈ దివి
గంప కింద ఎరుపుజుట్టుల
కొక్కోరోకోలు ఉభయసంధ్యలు
తేజస్సు మేధస్సుతో
రెప్పార్పని కన్ను ఈ మున్ను
సంగ్రామ రంగంలో రంగుల విల్లు సంధిస్తున్న
నైపుణ్య బాణాలు చినుకులు
పడమర నుండి బయల్దేరితే
తూర్పు దాకా
దక్షణం నుండి దండయాత్ర చేస్తే
ఉత్తరం దాకా
దట్టమైన చీకట్ల పదఘట్టనల
కోట్ల చెట్ల విజృంభణల
భయంకరారణ్యం ఈ గగనం
ఎన్నో అలల సుడుగాలుల
తుఫాన్ భీభస్సాల
మహూద్రేక మహా సముద్రం
చకచక మెరుపుల ఉరుముల
ఫెళఫెళార్భాట పిడుగుల
రుద్రరూప భీతావహ జ్వాలాజ్వలితం
సూర్యునంత ఎత్తు
కనిపించని కట్టెకొసకు
రెపరెపలాడుతున్న జెండా
ఎన్నో కోణాల్తో
ఎన్నెన్నో ఇతివృత్తాలతో
తెల్లకాగితంమ్మీద గీసిన వృత్తం
పుట్టినాక బతకడానికి
గుడిసె కూడా లేనివాని ఇంటి పై కప్పు
భయానికి భూమంతా కదిలిపోతుంటే
ఒక్కసారి పైకి చూడు
నేనున్నానని తండ్రిలా
వెన్నుతట్టుతున్న గుండె ధైర్యం
గాలంతా విశాలం ఈ ఆకాశం
త్యాగాల తంత్రుల మీద
పోరాటాల రాగలు తీస్తుంది
విలయతాండవం చేయడానికి
కైలాస శిఖర సభలో కొలువుదీరిన
బుద్దిజీవులు చుక్కలు
జీవగంజి పోయడానికి
ఆవిరితట్టలు మోసుకు తిరుగుతున్న
కావడి బతుకులు మోఘాలు
ఆ దిక్కు సూర్యగీళం
ధగధగమంటుంది
ఈ దిక్కు చంద్రబింబం
నవనవలాడుతుంది
అందం ఆకాశం
వెచ్చని తూర్పు వెలుతురులో
ఒళ్ళంతా హొయలు గొలుపుతుంది
ఆనందం ఆకాశం
తెల్లని మబ్బుల బెలూన్లతో
ఇల్లంతా పండగ చేసుకుంటుంది