అపరాజిత 7: కన్నీటి జాడల్లో

1972 వేసవి చివరలో రోజ్ బడ్ లో సూర్యనృత్యం (సన్ డాన్స్) నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎ.ఐ.ఎమ్. లీడర్లు చాలా మంది సూర్యనృత్యంలో పాల్గొనడానికి క్రౌడాగ్ దగ్గరికి వచ్చారు. పవిత్ర పొగ గొట్టంతో ప్రార్థనలు చేస్తూ, గద్ద ఎముకతో చేసిన ఈల  వూదుతూ, సూర్యుడి వైపు చూస్తూ, ఆచారం ప్రకారం తమకు తాము నొప్పి కలిగించుకుంటూ మా జాతి చాల పవిత్రం అని భావించే సూర్య నృత్యంలో మమేకమయి పాల్గొన్నారు అందరూ. ఇక్కడొక ముఖ్య విషయం చెప్పాలి. మునుపు ఎన్నడూ సూర్య నృత్యం సంప్రదాయాన్ని పాటించని తెగల నుంచి వచ్చిన మగవాళ్లు కూడా క్రౌడాగ్ నిర్వహించిన ఆ సూర్య నృత్యంలో పాల్గొనడం విశేషం. “నేను మళ్లీ ఇండియన్ అయ్యాను” అని వాళ్లలో ప్రతి ఒక్కరూ చెబుతున్నట్టనిపించింది నాకు.
 
మా వాళ్లు ఒకరి గురించి ఒకరు తెలుసుకోడానికి కూడా ఆ సూర్య నృత్యం ఉపకరించింది . ఎన్నో తీవ్ర చర్చలు నడిచాయి మా మధ్య. ఆ చర్చలలో ఆడవాళ్లు కూడా పాల్గొనడం చూసి నేను చాల సంతోషించాను. ఒక ఎ.ఐ.ఎమ్ . సభ్యుడు సరదాగా అన్నాడు, ” ఈ ఆడవాళ్లతో మాట్లాడించడానికి ఇన్నాళ్లు చాల తంటాలు పడ్డాం. ఒక సారి మాట్లాడడం మొదలెట్టారా ఇక వాళ్ల నోళ్లు మూత పడట్లేదు”. నేను ఊరికే వినేదాన్ని. అప్పట్లో నాకు సిగ్గు బిడియం, సంకోచం చాల ఎక్కువగా వుండేవి . పోగా వయస్సులో చిన్నదాన్ని. వెనకాలెనకాల వుండిపోయేదాన్ని. ఏమీ చేసేదాన్ని కాదు.
 
అప్పట్లో వాతావరణం చాల ఉద్రిక్తంగా వుండేది. అంతా అల్లకల్లోలంగా వుండేది. మొహాక్ తెగకు చెందిన రిచర్డ్స్ ఓక్స్ అనే ఆయన్ని ఎవరో తెల్లవాడు చంపేశాడని సూర్యనృత్యం ముగిసిన తరవాత మాకు వార్త చేరింది. అయన ‘అల్కట్రాజ్ ఆక్రమణ’ కు నాయకత్వం వహించిన మనిషి. జనానికి ఆయనంటే చాలా ఇష్టం. అంతకు కొద్ది రోజుల ముందే నెబ్రస్కా లోని గోర్డన్ అనే వూళ్లోని  అమెరికన్ లెజియన్ హాల్లో సూ తెగకు చెందిన రేమండ్ ఎల్లో థండర్ అనే ఆయన్ని సరదాగా బట్టలూడదీయించి నగ్నంగా నృత్యం చేయించి అ తరవాత కొట్టి చంపేశారు. పైన్ రిడ్జ్ కి చెందిన నార్మన్ లిటిల్ బ్రేవ్ ను కాల్చి చంపిన ఒక కోటీశ్వరున్ని ఎలాంటి శిక్ష లేకుండా వదిలేశారు. నార్మన్ తాగుడు వంటి అలవాట్లకు దూరం ఉండడం కోసం క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే వాడు. ఆ నిష్ఠ ఆయన్ని కాపాడలేకపోయింది. ఇండియన్ల మీద దౌర్జన్యాలు విపరీతంగా జరుగుతున్న కాలమది. “ఈ చెత్తలో ఇక బతకలేం, ఇక చాలు” అని జనాలు అనుకోడం మొదలయ్యింది. ఆ కోపం లోంచి, నిస్సహాయత లోంచి, కొత్త ఆశల లోంచి పుట్టింది “ భగ్న ఒప్పందాల జాడ” (ట్రెయిల్ అఫ్ బ్రోకెన్ ట్రీటీస్) అనే ఉద్యమం.

అది మా రోజ్ ఉడ్ లో, మా జనం మధ్య పుట్టిందని చెప్పుకోడానికి నేను గర్విస్తాను. అలా ఆలోచించడం మంచిది కాదేమో. సొంత తెగ గురించి గర్వం ఇండియన్ల  ఐక్యతకు అడ్డంకి అవుతుందేమో . ఆ సంగతేమయినా ఇట్టాంటి గర్వం మాత్రం వుండిపోయింది. నిజానికిది ఏమంత చెడ్డది కూడా కాదేమో.

భగ్న ఓప్పందాల బాటలో భాగంగా; అన్ని దిక్కుల నుంచి బయల్దేరిన వూరేగింపులు వాషింగ్టన్ డి.సి లో కలుసుకుంటే బాగుంటుందనే ఆలోచన బాబ్ బర్నెట్ కు మొట్టమొదట వచ్చింది. రోజ్ బడ్ లో ట్రైబల్ ఛైర్మెన్ గా వుండేవాడతను. తను ఎ.ఐ.ఎమ్ . సభ్యుడు కాదు . ఆ ఊరేగింపులో పాల్గొన్నవారిలో ఇంకా చాలమంది నాయకులు… హ్యాంక్  ఆడమ్స్, రూబెన్ స్నేక్స్, సిడ్ మిల్స్ ఎ. ఐ. ఎమ్ . సభ్యులు కారు. సిడ్, హ్యాంక్ వాయువ్య ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్లు అక్కడ  ఇండియన్ల చేపలు పట్టుకునే హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తుండేవారు. అలాగే న్యూయార్క్ రాష్ట్రం నుంచి వచ్చిన ‘సిక్స్ నేషన్ పీపుల్ ‘ కు సంబంధించిన వాళ్లు, కొన్ని ఈశాన్య ప్రాంత తెగల నుంచి వచ్చిన వాళ్లుకూడా ఎ.ఐ.ఎమ్ . సభ్యులు కారు.

‘లిటిల్ బిగ్ హార్న్ ‘యుద్ధం తరువాత అంత పెద్ద ఎత్తున జరిగిన సంఘటన ఈ ‘భగ్న ఒప్పందాల జాడ’ (ట్రెయిల్ అఫ్ బ్రోకెన్ ట్రీటీస్) అని చెప్పవచ్చు. ఓజిబ్యే తెగ గురువు (మెడిసిన్ మ్యాన్) ఎడ్డీ బెంటన్ ఇలా అన్నాడు. “ అన్ని తెగలూ సోదర భావంతో చేతులు కలిపి ఒక తాటి కింద నిలుస్తాయని మా తెగలో ఒక భవిష్యత్ వాణి వుంది. ఇలా అన్ని తెగలు కలిసి నిలబడడాన్ని నా జీవిత కాలంలో నేను చూడగలిగానని నాకు చాల సంతోషంగా వుంది. ఈ  ఖండంలోని అన్ని తెగలూ కలిసి ఒక ధ్యేయం కోసం నిలబడడం చాలా ముఖ్యమైన విషయం. ఈ పోరాటం వల్ల ఏమైనా ఒనగూడినా ఏమీ ఒనగూడకపోయినా ఇలా కలిసి నిలబడడం దానికదే గొప్ప విషయం”.

ప్రతి వూరేగింపు(క్యారవాన్) కు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పవిత్ర పొగ గొట్టం పట్టుకునే గురువు(మెడిసిన్ మ్యాన్) నాయకుడిగా వుండేవాడు. ఓక్లహోమా వూరేగింపు వాళ్లు చెరోకీల ‘కన్నీటి బాట’ (ట్రెయిల్ అఫ్ టియర్స్) మీదుగాకదిలి వచ్చారు. ఈ ‘కన్నీటి బాట’ వెనుక ఓ గాథ వుంది. ప్రెసిడెంట్ అండ్రూ జాక్సన్ కాలంలో ప్రభుత్వ ఆదేశాల పర్యవసానంగా తమ  ఇళ్ల నుంచి, భూమి నుంచి వెళ్లగొట్టబడిన చెరోకీలు అ బాట మీదుగానే వారికి కేటాయించిన మరో ప్రదేశానికి వెళ్లారు. విపరీతమైన చలిలో, తిండి లేక ఎంతో మంది చెరోకీలు ఆ బాట మీదే ప్రాణాలు వదిలారు. సహచరులు అలా నేల రాలిపోతున్నా తలలు వంచి వెళ్లిపోతున్న చెరోకీలను చూసి దారిలో తెల్లవాళ్లు కూడా ఏడ్చారట. అందుకే ఆ బాటకు “కన్నీటి బాట” అనే పేరు వచ్చింది. ఆనాడు నేలకొరిగిన చెరోకీల అడుగు జాడల మీదుగా ఓక్లహోమా వూరేగింపు ముందుకు సాగింది. మా వూరేగింపు ‘వూండెడ్ నీ’ నుంచి బయల్దేరింది. సూ ప్రజలు అలా వూండెడ్ నీ నుంచి బయల్దేరడంలో కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. వూండెడ్ నీ ఒక ప్రతీక. అక్కడ అమెరికా ఏడవ ఆశ్విక దళం (సెవెంత్ కావల్రీ) చేత హతమార్చబడిన ఆడవాళ్ల, పిల్లల ఆత్మలు మూకుమ్మడి శ్మసానాల లోంచి లేచి వచ్చి మాతో కలిసి నడిచినట్లు మాకు అనిపించింది.

నేను రోజ్ బడ్, పైన్ రిడ్జ్ నుంచి వచ్చిన స్నేహితులతో కలిసి ప్రయాణం చేశాను. మా తమ్ముడు, అక్క బార్బరా కూడా ఆ గుంపులోనే ఉన్నారు. ముందు ఏం జరగబోతోందో నేను ఊహించలేపోయాను. అంత పెద్ద నిరసన యాత్రలో పాల్గొనడం నాకు అదే మొదటిసారి. వాషింగ్టన్ చేరిన తరువాత మేం దారి తప్పిపోయాం. మాకు తిండి, బస ఏర్పాటు చేస్తామన్న చర్చీలు, ప్రభుత్వ ఆదేశాల కారణంగా చివరి నిమిషంలో ముఖం చాటేశాయి. రాత్రి గడిచి తొలి వెలుగులు పరుచుకుంటున్నా మాకింకా బస చేయడానికి తగిన చోటు దొరకలేదు. అలసటతొ నాకు కళ్లు మూసుకుపోతున్నాయి. అయినా మేము ఒక పని మాత్రం చేశాం. అ మసక వెలుగులలోనే వైట్ హౌస్ చుట్టూ కార్లు నడుపుతూ, గట్టిగా హారన్లు మోగిస్తూ, డప్పులు వాయిస్తూ మేము వాషింగ్టన్ చేరుకున్నామని ప్రెసిడెంట్ నిక్సన్ కు తెలిసేలా చేశాం.

చివరికి ఒక పాతబడిన చర్చిలో మాకు చోటు దొరికింది. నేను నా పరుపు చుట్టలోకి దూరిన కొద్ది సేపటికే ఒక పెద్ద పిల్లి నా పరుపు మీదికి దూకింది. కళ్లద్దాలు పెట్టుకుని చూస్తే, అది పిల్లి కాదు. ఎలుక. అంత పెద్ద, అసహ్యకరమైన ఎలుకను చూడడం నాకదే మొదటిసారి. చర్చిలో పెద్దకోలాహలం మొదలయ్యింది. ఆడవాళ్లు ఒకటే అరుస్తున్నారు. ఆ చర్చిలో ఎక్కడ చూ సినా ఎలుకలే ఎలుకలు. చెయాన్ రివర్ నుంచి హిచ్ హైక్ చేసుకుంటూ వచ్చిన ఒక పెద్దావిడ బాత్రూములు పని చేయట్లేదని చెప్పింది. అది నవంబరు నెల మొదటి వారం. బాగా చలిగా వుంది. చర్చిలో వేడి కల్పించే సాధనాలు ఏమీ లేవు. కెనడా నుంచి వచ్చిన ఒక ముసలి ఇండియన్ ఊతకర్రల మీద అటూ ఇటూ తిరుగుతున్నాడు. అయన రెండు కాళ్లు చచ్చుబడి పోయివున్నాయి. విశ్రాంతి తీసుకోడానికి ఆయనకు ఒక మంచి స్థలం దొరకలేదు. అక్కడ ఎలుకలే కాదు, కుప్పలు కుప్పలు బొద్దింకలు కూడా వున్నాయని ఒక అమ్మాయి అరవడం మొదలెట్టింది. సెయింట్ పౌల్ లోని మురికివాడనైనా ఇందుకోసం కేటాయించి వుంటే బాగుండేదని ఒక ఓజిబ్వే యువకుడు బాధ పడ్డాడు . ఇంతకంటే మంచి బస దొరుకుతుందని ఆశించలేదని నేను అన్నాను. ప్రెసిడెంట్ నిక్సన్ మా కోసం కలర్ టీవీ, కార్పెట్లతో హాలిడే ఇన్ లాంటి హోటల్లో బస ఏర్పాటు చేస్తాడని ఆశ పడ్డాడేమో ఆ యువకుడు. దుప్పట్లు కప్పుకుని, ఒకరినొకరు హత్తుకున్నట్లుగా నుంచున్నారు అందరూ. “మనకు మంచి బస ఏర్పాటు చేస్తామన్నారు. మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి . దీన్ని మనం సహించకూడదు” అన్నారెవరో.

“అందరం బి.ఐ.ఏ. బిల్డింగ్ కు పోదాం పదండి” అని ఇంకెవరో సూచించారు. కాన్స్టిట్యూషన్  అవెన్యూ లోని బ్యూరో అఫ్ ఇండియన్ అఫైర్స్ (బి.ఐ.ఎ.) బిల్డింగుకు వెళ్లాలని ఆలోచన రావడం సహజమైన విషయమే. మాకు వసతి కల్పించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఎంతైనా అది’మాకు’ చెందిన బిల్డింగ్ కదా! అదీగాక, ఈ బ్యూరో మమ్మల్ని ఎలా దోచుకుంటోందో చెప్పడానికే కదా మేము ఇంత దూరం వచ్చింది. అందరూ బి.ఐ.ఏ. బిల్డింగుకు వెళ్లాలని ఉత్సాహపడ్డారు. కాసేపట్లో మేము అందరం అక్కడికి వెళ్లిపోయాం. చెరువుకు గండి పడి వరదలెత్తినట్ల్లు అందరం ఆ బిల్డింగులో చొరబడ్డాం. బిల్డింగ్ ముందు లాన్ లో ఎవరో టిపి ఏర్పాటు చేశారు. రక్షణ దళసభ్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాళ్లు చేతులకు ఎర్ర రిబ్బన్లు కట్టుకున్నారు. ఇంకొందరు తమ రిబ్బన్ షర్టులకో, డెనిమ్ జాకెట్లకో ఏడు రంగుల గుడ్డలు కట్టుకున్నారు. ఒక్కో తెగ ఒక్కో రూములో సర్దుకున్నారు. పిల్లలు ఆడుకోడం మొదలు పెడితే, వయసు మళ్లిన ఆడవాళ్లు మెత్తని సోఫాల్లో సర్దుకున్నారు . ఎవరో డప్పు మోగిస్తున్నారు. నిక్ నిక్ (ఇండియన్ పొగాకు) వాసన కూడా వచ్చింది నాకు. ఎవరో ఇండియన్ కంట్రీ అని బోర్డు రాసి ముందు గేటుకు తగిలించారు. చివరికి ఆ బిల్డింగు మొత్తం మా చేతుల్లోకి వచ్చేసింది. దాన్ని ఒక గ్రామం (ట్రైబల్ విలేజ్) గా మార్చడం మాకు ఎంతోసేపు పట్టలేదు.

మా చిన్న బృందం రెండో అంతస్తులో సర్దుకున్నాం. మందపాటి కార్పెట్లతో, చిరు వెలుతురుతో, మెత్తటి సోఫాలతో, ఈజీ చైర్లతో అక్కడ చాలా బాగుంది. ఎలా బతకాలో ఈ బ్యూరోక్రాట్లకు బాగా తెలుసు. బయట ఎవరో సూ భాషలో మాట్లాడడం వినిపించింది. తలుపు తెరిచి చూస్తే లియోనార్డ్ క్రౌ డాగ్ కొంతమంది యువకులతో మాట్లాడుతున్నాడు. మేము అక్కడ ఎందుకున్నామో, ఇదంతా ఎందుకోసమో, దీనంతటి అర్థమేమిటో వాళ్లకు వివరిస్తున్నాడు . “మెల్లగా… చప్పుడు చెయ్యొద్దు, క్రౌ డాగ్ మాట్లాడుతున్నాడు!” ఎవరో నన్ను మందలించారు. అప్పటికి నేను చిన్న దాన్ని. బహుశా అందువల్లేనేమో, లియొనార్డ్ చాలా పెద్దవాడిలా, ఎన్నో బాధ్యతలు వున్నవాడిలా కనిపించాడు. అప్పటికి తన వయసు ముప్పై రెండేళ్లే. ఒక రోజు నేను అతని పిల్లలకు తల్లినవుతానని అప్పుడు నాకు తట్టలేదు.

బి. ఐ. ఏ. బిల్డింగును ఆక్రమించుకోవడమన్నది మా ప్లాన్ లో వున్నది కాదు. మా బసకు తగిన ఏర్పాట్లు చేసి వుంటారని మేము నిజంగానే నమ్మాం. ఆ వాగ్దానం కూడా ఎన్నో పాతకాలపు చెత్త వాగ్దానాల వంటిదే కావడంతో మేము బి.ఐ. ఏ. బిల్డింగును ఆక్రమించుకోవలసి వచ్చింది. అలా చెయ్యమని ఎవ్వరూ మాకు ఆదేశాలివ్వలేదు. అయినా, ఆదేశాలంటే మాకు ఇష్టం వుండదు కూడా. వివిధ తెగలకు సంబంధించిన వాళ్లు వాళ్ల వాళ్ల గదుల్లో చేరి తరువాత ఏం చేయాలో ఆలోచనలు మొదలెట్టారు. అప్పుడప్పుడు అందరూ ఒక పెద్ద గదిలో కలుసుకుని ఆలోచనలు పంచుకోవడం కూడా జరిగింది. అసెంబ్లీ హాలులో ఒక స్టేజీ, లౌడ్ స్పీకర్లు, చాలా కుర్చీలు వున్నాయి. ఆ చర్చలు కూడా, ఎవరో ఒక తెగ గురువు (మెడిసిన్ మ్యాన్) చిన్నిపాటి క్రతువు చేసిన తరువాతే మొదలయ్యేవి. మొట్టమొదట మా కోసం ట్రక్కు నిండా తిండితీసుకు వచ్చింది నల్ల జాతి పౌరహక్కుల సంస్థ (బ్లాక్ సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్) వాళ్లే అనుకుంటాను. ఆ తరువాత ఎన్నో చర్చి గ్రూపులు, వేరే సానుభూతి పరులు మాకు తిండి, డబ్బు అందజేశారు. ఆ బిల్డింగులో ఒక కిచెన్, క్యాఫెటీరియా వుండేవి. మేము వెంటనే భోజనం తయారు చేయడం, గిన్నెలు కడగడం, చెత్త ఎత్తడం లాంటి పనులు మొదలెట్టాం. పిల్లలను చూసుకునే పనిని కొందరు ఆడవాళ్లకు అప్పగించారు. ముసలివాళ్ల బాగోగులు చూసే పనిని కూడా అలాగే కొందరికి అప్పగించారు. వైద్య బృందం (మెడికల్ టీం) కూడా ఏర్పాటయ్యింది. మా గురించి తెల్లవాల్లకు వున్నఅభిప్రాయాలు తప్పు అని రుజూ చేశాం. స్వయపరిపాలన గురించి ఎవరో వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేకుండా, మా ఏర్పాట్లు మేము బాగా చేసుకునేవాళ్లం. ఎవరో మాకు చెప్పాలని ఎప్పుడూ ఎదురు చూడలేదు. ఆ బిల్డింగులో దాదాపు ఆరు నుంచి ఎనిమిది వందల మందిమి వుండినా, మాకు ఇరుకు అనిపించలేదు.

ఆ ఉద్యమం గురించి ఆలోచించిన నాయకులు మొదట్లో చాల శాంతి యుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించాలని అనుకున్నారు.  సెనెటర్ల కోసం పాటలు, నృత్యాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, శాసన సభ్యుల కోసం ఫ్రై బ్రెడ్, మొక్కజొన్న సూపులతో విందు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉండింది. మా గోడు వినడానికి వారిలో ఎవరైనా ముందుకు వచ్చి వుంటే, ఆ కార్యక్రమాలన్నీ ఎంచక్కా జరిగేవేమో కూడా. మేము ఎవరిని కలవాలని వచ్చామో ఆ ముఖ్యమైన వ్యక్తులు… ప్రెసిడెంటు దగ్గరి నుంచి ఎవరూ మాతో మాట్లాడడానికి ముందుకు రాలేదు. మేము ఇలా ఇక్కడికి రావడం వాళ్లెవరికీ ఇష్టం లేదని అర్థమయిపోయింది. వారి దృష్టిలో మేము ఎవరో పిచ్చి జనాలం, ఇండియన్ ప్రజలకు ప్రతినిధులం కాదు. ప్రెసిడెంట్ నిక్సన్ ఎలాంటి అధికారిక హోదా లేని ఒక చిన్నఆఫీసరును మా దగ్గరికి పంపించాడు. మేము అక్కడికి రావలసిన అవసరమేమీ లేదని అతనితో మాకు చెప్పించాడు . ప్రెసిడెంటుకు ఇంకేవో ముఖ్యమైన పనులున్నాయని చెప్పాడు అ చిన్న అధికారి. తనను కలుసుకోడానికి వచ్చినవాళ్లు మాట్లాడే మాటల్ని రికార్డుచేయించడం, వాటర్ గేటుకు ప్రణాళికలు వేయడమే ఆ ముఖ్యమైన పనులేమో ప్రెసిడెంటుకు.

ఇవోజిమాలో ‘కాంగ్రెషనల్ మెడల్ అఫ్ ఆనర్ ‘ అందుకున్న పీమా తెగకు చెందిన ఐరా హేస్ సమాధి దగ్గర క్రౌడాగ్ తో క్రతువు చేయించాలని మేము ఆలోచించాం. అది మతపరమైన క్రతువు కాకుండా, రాజకీయమైన క్రతువు అవుతుందని చెప్పి సైన్యం అందుకు ఒప్పుకోలేదు. మెలమెల్లగా మా ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. సెనెటర్ల వినోదం కోసం పాటలు నృత్యాలు ఏర్పాటు చేయడం గురించి ఆలోచనలు వెనుకడుగు పట్టాయి. మా మాట ఎలా నెగ్గించుకోవాలా అని ఆలోచించడం మొదలు పెట్టాం. ఎ.ఐ.ఎమ్ . హింసకు వ్యతిరేకం కానీ ఈ జనాలకు ఇండియన్ల బాధలు చెప్పుకోవాలంటే మరో watts రావాలేమో అని డెనిస్ బ్యాంక్స్ వ్యాఖ్యానించాడు. మీడియా మమ్మల్ని పక్కన పెడుతోందని, పట్టించుకోవడం లేదని రసెల్ మీన్స్ ఒక విలేఖరితో అన్నాడు. “మమ్మల్ని పట్టించుకోడం అవసరమని మీకు అర్థం అయ్యేలా చేయడానికి మేం ఏం చేయాలంటారు. ఎవరినైనా కూర్చోబెట్టి  గుండు గొరిగించాలా?” ఈ సంఘటనతో నాకు ఒక విషయం అర్థమయ్యింది. మేం’మంచిగా నడుచుకున్నంతసేపు’ మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మేము కాస్త రౌడీల్లా ప్రవర్తించడం మొదలుపెట్టగానే మీడియాలో మాకు ఎప్పుడూ లేనంత కవరేజ్, మద్దతు కూడా దొరుకుతుంది.

వాళ్లఉద్దేశం అర్థమయ్యాక మేము దానికి తగినట్లే నడుచుకున్నాం . బిల్డింగు లోంచి పోలీసులను, గార్డులను బయటకు తోసేశాం. కొంత మంది మేం తోసేసే దాకా చూడకుండా అన్నిటికన్న కింది అంతస్తు లోని కిటికీల్లోంచి కప్పల్లాగ బయటకు జారుకున్నారు. ఇరవయి డిమాండ్లను తయారు చేశాం. మాతో మంతనాలు జరపడానికి వచ్చిన బ్యూరోక్రాట్ అధికారులు ఆ డిమాండ్లను తిరస్కరించారు. ఆ మంతనాల నుంచి మాకు ఒరిగిందల్లా … ఒక తెల్ల అధికారి ఒక ఇండియన్ పాపాయిని ఎత్తుకుని ‘చాలా ముద్దుగా వుంది కదూ’ అంటూ ఫొటో దిగడం ఒక్కటే. మా పాపాయిల్ని వాళ్లతో ముద్దుచేయించడానికి మేం అంత దూరం వెళ్లామా?

“ ఓయ్, పందులు వచ్చేశాయి” అని ఎవరో అరవడం వినిపించింది. కిటికీ లోంచి చూస్తే, అది నిజమే. రకరకాల తుపాకులు పట్టుకుని, హెల్మెట్లు పెట్టుకుని పోలీసులు ఆ బిల్డింగును చుట్టుముట్టారు . మా రక్షణ దళం సభ్యులకు  పోలీసులకు మధ్య గొడవ మొదలయ్యింది. కొంత మంది యువకుల తలలకు దెబ్బలు తగిలాయి. వాళ్ల ముఖాల మీద రక్తం కారడం నేను చూశాను. ఇలా జరుగుతుందని హెచ్చరిక ముందుగానే వినిపించింది. అది వదంతి అనుకున్నాం. చివరికి అది నిజమైంది.

బిల్డింగులో అందరిలో భయం, ఉద్విగ్నత. నాలో కూడా చీమల పుట్టను కదిలించినట్లు ఆందోళన మొదలయ్యింది. “ వాళ్లు వస్తున్నారు, చంపేస్తారు” అని ఎవరొ ఒకామె అరవడం విన్నాను. మగవాళ్లు కూడా అరవడం మొదలెట్టారు. “ఆడవాళ్లు, పిల్లలు పై అంతస్తుల్లోకి వెళ్లండి” అన్నారు. నేను ఆ మాట పట్టించుకోలేదు . కింది అంతస్తులోకి వెళ్లాను. అప్పటికే ఇద్దరు ఇండియన్లను కొట్టి జైలుకు తీసుకెళ్తున్నారు. మేము అన్ని తలుపులను దిగువ కిటికీలను కాగితాల పెట్టెలు, జెరాక్స్ మెషీన్లు, టేబుళ్లు, క్యాబినెట్లతో మూసేశాం. పోలీసులు బిల్డింగును ముట్టడిస్తే వాళ్ల మీద తోయడం కోసం కొందరు యువకులు కిటికీల మీదకు టైపు రైటర్లు చేర్చారు. చాలా మంది యువకులు “చనిపోవడానికి ఇదే మంచి రోజు” అంటూ వీర గీతాలు పాడుతున్నారు. అక్కడ ఏ వస్తువు దొరికితే దానితో ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు. మాలో ఇద్దరుముగ్గురికి ఎలాగో రెండు విల్లమ్ములు దొరికాయి. మరి కొందరు గోల్ఫ్ క్లబ్స్ పుచ్చుకుని వాటిని అటు ఇటు తిప్పి చూసుకుంటున్నారు. ఇంకొందరు చేపలు పట్టే గాలం బద్దలకు చివర్లలో కాగితాలు కోసే పెన్ నైవ్స్ కట్టి వుంచుకుంటున్నారు. ఒక టేబుల్ కాలు ఊడదీసి దానికి ఉత్తరాలకవర్లు తెరిచే చాకు కట్టే సరికి మాంచి ఈటె తయారయ్యింది. అందరి కంటె ముందు చెర్రీ క్రీక్ నుంచి వచ్చిన సూ జాతీయుడు ఫ్లాయిడ్ యంగ్ హార్స్ పాత ఆచారం ప్రకారం ముఖానికి యుద్ధం రంగు పూసుకున్నాడు. చాల మంది యువకులు అలాగే ముఖానికి రంగు పూసుకుని పోరాడ్డానికి తయారయ్యారు. చాలా మంది ఒకనాటి ఘోస్ట్ డాన్స్ పధ్దతిలో తమ నిరసనకు సంకేతంగా అమెరికన్ జెండాను తలకిందులుగా వంటికి చుట్టుకున్నారు.

నేను ఒక కత్తెరను విడదీసి, అందులో ఒక చాకు భాగాని ఒక విరిగిన కుర్చీ కాలుకు కట్టి బయటకి వెళ్లి మా రక్షణ దళంలో చేరిపోయాను. రక్షణ దళంలో మా తమ్ముడు కూడా ఉన్నాడు. నా అనాకారపు ఆయుధాన్నీ నన్నూ చూసి ఘాట్టిగా నవ్వేశాడు. తను నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేసివచ్చాడు. .38 తుపాకిని విదదీయడం, శుభ్రం చేయడం, కాల్చడం అంతా నాకు తనే నేర్పించాడు.

చివరికి పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. మేము బిల్డింగు విడిచి వెళ్లాలనీ, అందుకు మాకు ఇరవయ్ నాలుగ్గంటలు టైం ఇస్తున్నామని చెప్పారు. ఆ సంఘర్షణ అంతటితో ముగిసింది. ఆ తరువాత, ప్రతి రోజూ ఉదయం మేము ఆ రోజు సాయంత్రం ఆరు గంటల లోగా బిల్డింగు ఖాళీ చేసి వెళ్లాలని మాకు కోర్టు ఆదేశం వచ్చేది. ప్రతి రోజూసాయంత్రం మేము పోరాటానికి సిద్ధంగా వుండేవాళ్లం. మా సోదరీసోదరులలో చాలా మంది పోరాడుతూ, ఆ బిల్డింగు మెట్ల మీద ప్రాణాలు బలి పెట్టడానికి సిధ్ధం అయిపోయారు. “మీ పిల్లలకు, ఆడవాళ్లకు దెబ్బలు తగలొచ్చు కదా, మీ ఇండియన్లకు భయం లేదా” అని పత్రికల వాళ్లు ఎ. ఐ. ఎమ్ . నాయకులను అడిగారు. “మా అడవాళ్లు, పిల్లలు నాలుగు వందల సంవత్సరాలుగా ఇదే ప్రమాదకర పరిస్థితిలో, దీన్నుంచి మార్గంతరం లేదనుకుని బతికేస్తున్నారు, కొత్తగా భయమెందుకు” అని మా నాయకులు బదులిచ్చారు.. “మేం భయపడం” అంటూ అక్కడున్న మా వాళ్లందరూ వత్తాసు పలికారు. ఆ బిల్డింగులో వున్న మొత్తం వారం రోజుల్లో నేను ఐదారు గంటలకు మించి నిద్ర పోలేదు.

ప్రతి ఉదయం, సాయంత్రం ఏదో ఉద్రిక్తత. మధ్యలో మంతనాలు కొనసాగేవి. సంగతి విని మాకు మద్దతుగా చాల మంది గుంపులు గుంపులుగా వచ్చారు. వారిలో మంచివాళ్లున్నారు, అంతగా నమ్మదగని వాళ్లూ ఉన్నారు. ఇండియన్ కమిషనర్ లూయిస్ బ్రూస్ మాకు సానుభూతి తెలియజేయడం కోసం ఒక రాత్రంతా బిల్డింగులో వుండిపోయాడు. ఒక సెనెటర్ భార్య, మరి కొందరు కూడా అలాగే చేశారు. కాలిఫోర్నియాలో హాగ్ ఫార్మ్ అనే చోటి నుంచి వచ్చిన వే గ్రే అనే ఆయన చెవికి ఒక పెద్ద రింగు పెట్టుకుని, తమాషాగా అలంకరించిన బస్సులో వచ్చాడు, మా కోసం మైకు సిస్టం ఏర్పాటు చేశాడు. అదే సమయంలో పోలీసులు ఆంతరంగిక శాఖతో మాకు ఉన్న కనెక్షన్ మినహా అన్ని టెలిఫోన్ కనెక్షన్లనూ తొలగించేశారు. రెవరెండ్ మెకింటైర్ అనే ఆయన క్రైస్తవ గీతాలు పాడుతూ, దీవెనల సైగలు చేస్తూ, ఓ పూల గుత్తి పట్టుకుని మా దగ్గరికి వచ్చాడు. ఆయన జాత్యహంకారవాది అనీ, వియత్నాంతొ అమెరికా యుద్ధాన్ని సమర్థించే మనిషి అనీ అందరికీ తెలుసు. ఆయన ఎందువల్ల మాకు మద్దతు ఇస్తున్నాడో మాకు అర్థం కాలేదు. పత్రికల వాళ్లు, కెమెరాల వాళ్లు మా బిల్డింగును ముంచెత్తేవారు. టూరిస్టులు ప్రత్యేకించి ఫొటోలు తీసుకున్నారు. బి.ఐ. ఎ. బిల్డింగు చుట్టూరా వున్న తెల్లవాళ్లు ఏదో బఫలో బిల్ తరహా కౌబాయ్ సినిమా వంటి దృశ్యాల కోసం ఎదురు చూస్తున్నారా అనిపించింది మాకు.

నాకు సంబంధించినంతవరకు, మా మగ వాళ్లు ఆయుధాలు పట్టుకోవడం పెద్ద విశేషం అనిపించలేదు. ఓక్లహోమా నుంచి వచ్చిన ఒక సాధారణ చెరోకీ మహిళ మార్తా గ్రాస్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రి మోర్టాన్ ను నిలబెట్టి మాట్లాడిన తీరు అక్కడ జరిగిన వాటన్నిటిలోకి ఎక్కువగా మమ్మల్ని ఆకట్టుకుంది. ఆమె ఏమాత్రం నీళ్లు నమలకుండా మనసులో మాట ఉన్నదున్నట్లు మాట్లాడారు. మా అందరి మనసుల్లో ఏముందో అది మాట్లాడారామె. రోజువారీ బతుకు గురించి, ఆడవాళ్ల గురించి, పిల్లల గురించి చిన్న చిన్న విశేషాలతో, వినేవాళ్ల మనసుకు హత్తుకునేలా మాట్లాడారు. మోర్టాన్ ముఖం మీద పిడికిలి వూపుతూ “ఇక చాలించండి ఈ చెత్త” అనేశారు. ఒక ఇండియన్ తల్లి అలా నిర్భయంగా నిలబడి ఒక వాషింగ్టన్ ఉన్నతాదికారిని నిలబెట్టి మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది . “ఇది మా బిల్డింగు “అంటూ ఆ అధికారిని వెళ్లమని బయటకి దారి చూపించింది.

చివరికి ఏదో ఒక రాజీ కుదిరింది. అది ఎన్నికల వారం కాబట్టి సంప్రదింపులు జరుపుతూ వుండిపోలేమని, మా డిమండ్లను పరిశీలించడం కోసం ఇద్దరు ఉన్నతాధికారులను నియమిస్తామని ప్రభుత్వం చెప్పింది. మేము ఇళ్లకు వెళ్లడానికి ఖర్చులు ఇచ్చారు. మాలో ఎవ్వరినీ కేసుల్లో ఇరికించబోమని హామీ ఇచ్చారు. ఆచరణలో ఆ ఉద్యమం సాధించిందేమీలేదనే చెప్పాలి. కాని, నైతికంగా అది గొప్ప విజయమే. మేము ఏ తెగకు ఆ తెగ కాకుండా, అందరం కలిసి ఉమ్మడిగా తెల్ల అమెరికాను నిలదీయగలిగాం. ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడి, పోరాటం అనే అగ్ని గుండ ప్రయాణం చేశాం. పారిపోలేదు. రస్సెల్ మీన్స్ మాటల్లో చెప్పాలంటే, అది “పోరాటం మొదలయ్యిందని చెప్పడానికి ఒక సంకేతం”.


అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో