లోను

ఎండకాలం.

తెల్లారేజామున మత్తుగా నిద్రపట్టింది ఉప్పలికి, పక్కనే జగన్‌ యాపచెట్టుగాలి దడదడ, డప్పుల సప్పుడుకు ఇద్దరికీ మెలుకవయింది.

“మామా… ఏదో సప్పుడు… ?” జగన్‌ మత్తుగా.

“ఏదో జాటింపు వేస్తండ్రు.” ఉప్పలి.

“ఏంటిదో…?”

”ఏంటిదో!”

ఇద్దరు చెవులు రిక్కించి విన్నరు. మైసడు కీసుగొంతు దప్పుగొట్టి ‘బ్యాంకు సార్లు వస్తండ్రు. ఎడ్లకు బండికి బాయిలకు లిప్టులకు లోన్లు ఇస్తరు. కావలిసినోళ్లు కార్యదర్శి దగ్గర పేర్లు రాయించుకోవాలెనయ్యో!…’ అని జాటింపు ఏసిండు.

‘అరే… లోన్లా… మా ఊర్లె గూడా రైతులకు లోను ఇస్తండ్రు’ జగన్‌ అన్నడు.”అట్లనా… మరి చెప్పవేం…” ఉప్పలి అన్నాడు లేచి కూసుంటూ.

”చెప్పితే ఏం చేస్తవు మామా… లోను తీస్తవా…” వెటకారంగా నవ్వుతూ జగన్‌.

ఉప్పలి నెమ్మదిగా బీడి తీస్తూ”ఆ… తీసుడే మరి!” అన్నడు.

నోరు తెరిచిన జగన్‌ నమ్మలేనట్టు”లోను తీసుడే… గుంట భూమి లేకనే!” అడిగిండు.

ఉప్పలి మరింత నెమ్మదిగా”భూమి ఉన్నోనికే ఎడ్లు బండి లేనోడికివద్దా..? వాడు బతుకద్దా… అయినా భూమి ఉన్నోనికి వీళ్లేంది ఇచ్చేది..? ఎవలిచ్చినా ఇస్తరు.” తర్కానికి దిగిండు.

”రేపు లోను కట్టొద్దూ…” జగన్‌.

”కట్టుడా… ఇప్పట్లో కాదు. పది పన్నెండేంన్ల తర్వాత…”

జగన్‌ బీడి అంటించిండు. ఒక దమ్ముతీసి పొగ వదులుతూ”తడిసి మోపెడయితయి. ఇంతకు ఇంత పెరిగి ఇంటికి ముప్పయితది.” అన్నడు.

ఉప్పలి నవ్వి”కడితేగదా! పాత అప్పులను ఎప్పటికప్పుడు గవుర్మెంటు మాఫీ చేస్తది.” అన్నడు లేస్తూ.

”నువ్వన్నది నిజమేగనీ… మేనేజర్‌ కడ్డుమనిషి రూలంటే రూలే! ఇంతకు ముందయితే లోను పైసలు చేతుల పెడుదురట. చెక్కులిత్తురట. ఇప్పుడు అట్ల గాదు. మేనింజరే సయంగా అంగడి వచ్చి ఎడ్లను కొనిత్తండట…” జగన్‌.

”అట్లనా… అట్లయితే ఇంకామంచిదాయె… మంచి మంచి ఎడ్లను ఏరుకోవచ్చు.” ఉప్పలి అన్నడు.

”నీకున్నది పదెకురాలు. మంచి ఎడ్లను కొని దున్నుతవు” ఎక్కిరిస్తూ నవ్విండు జగన్‌.

లేచి గొంగడి దులుపుతూ”అరే! పాలుకు పట్టుకుని దున్నుకుంట. భూమి లేకుంటే మాత్రం ఇంట్లనే పంటనా…” అన్నడు ఉప్పలి నవ్వుతూ.

ఇద్దరూ పండ్లపుల్ల లేసుకుని వాగుకు పోయిండ్రు. గడ్డ మీదనే ఈతచెట్లు. వాగుల మొఖం కడుక్కుని లొట్ట తీసుకున్నరు. నాలుగు మోతుకాకులు తెంపుకుని చెట్టుసాటుకు కూసున్నరు. సుట్ట మచ్చిండని కొసరు కల్లు తెచ్చిండు ఉప్పలి.

”మామా… కల్లు ఇసం లెక్కుంది.” ఒకసారి తాగి అన్నడు జగన్‌.

”సుట్టు పదూర్లకు పేరెల్లింది” ఉప్పలి.

మళ్లీ తనే”ఇప్పుడు ఆయిటి ముందు గదా! కల్లు ముదురుంటది రెండు వానలు పడ్డంక వస్తవుగదా! అప్పుడు సూడు. కొబ్బరి నీళ్లకంటే పలుసగుంటది…” నవ్విండు మీసాలు తుడుచుకుంటూ.

”రెండు వానలు పడ్డంకనా..! అప్పుడు ఎందుకస్త మామా… దున్నుకాలు. నాకు సచ్చిపోదామన్నా తీరదు.” జగన్‌ అన్నడు.

“నువ్వు నాకు ఎడ్లను అమ్ముతవు గదా! అందుకని వస్తవు” ఉప్పలి చెప్పిండు.

జగన్‌ కిందమీదయిండు కల్లు తాగడం ఆపి ఉప్పలిని చూసిండు. “నా ఎడ్లను అమ్ముడా… నువ్వు కింద మీద నూరేండ్లు తపసు జేసినా అమ్మ…” అన్నడు.

ఉప్పలి నవ్వుతూ “కొంత అటూ ఇటూ యాకాషి ముందచ్చే అంగడిరోజలల్ల నీఎడ్లను అమ్ముతవు. నేను మీఊరి అంగడికే వచ్చి కొనుక్కుంట” అన్నడు.

అప్పటికి జగన్‌కు తాగిన కల్లు కొది కొద్దిగా నెత్తికెక్కుతుంది. రేషం పొడుచుకొస్తుంది. తనయి రెండు, కొమ్ముల గిత్తలు. ఇరువై ఐదువేల జోడి. గిత్తలన్నట్టేగాని ఉరుకులాట లేదు. బండి గట్టి చిన్న పోరన్ని కూసోబెట్టినా ఇంటికి వత్తయి. నాగలి దున్ని వదిలిపెడితే పొద్దు గూకేవరకు ఇల్లు చేరుతయి. రెండు పుట్ల వడ్లు బండికెత్తినా ఆగకుంట నడుత్తయి. వీనికి నా ఎడ్లు కావలిసి వచ్చినయా..? అనుకున్నడు.

“ఏం అల్లుడా… బీరిపోతివి. ఆకువట్టు” ఉప్పలి అదిలించిండు. ఉలిక్కిపడి జగన్‌ ఆకు అందుకున్నడు.

తిండియాల్లకు ఇద్దరూ ఇల్లు చేరుకున్నరు. ఇంట్లో కోడికూర ఘుమ ఘుమ. జగన్‌కు నోట్ల నోళ్లూరినయి. ఇద్దరూ కాళ్లు చేతులు కడుక్కున్నరు. ఉప్పలి గొంగడి పరిచిండు. ఇద్దరు కూసున్నరు.

ఇస్తార్లు పరిచి నీల ఇద్దరికి అన్నంపెట్టింది. గంటెడు గంటెడు కోడికూర ఏసింది. గంటెడు సోరు పోసింది. గడ్డపెరుగు పెట్టింది.

అన్నం తింటున్నా జగన్‌కు ఎడ్ల ఆలోచనేఉంది. “వీనికి దోతి పంచెంత దొయ్యగూడాలేదు. నా ఎడ్లను కొంటనని ఎంత ఖచ్చితంగ అంటుండు… కొంపదీసి ఎడ్లకు మంత్రం జేస్తడాఏంది? అసలే వీని అయ్య మంత్రకాడని అందురు. వీడుగూడ నేర్చుకున్నడా..? లేకుంటే ఆ పెద్ద మీసాలెందుకు..?” అనుకున్నడు.

“అల్లుడా… తిను ఏమాయె… నిమ్మకాయ పిండుకుంటవా…” నీల ఇంకో గంటెడు కూర ఏసింది. వద్దన్నా వినకుండా ఇంకో పిడికెడు అన్నం పెట్టింది.

ఇద్దరు తిని చెయ్యి కడుక్కున్నరు.

ఉప్పలి బీడీ ఇచ్చి తనకొకటి తీసుకున్నడు. బీడీ తాగి లేచిండు జగన్‌ “మామా… పోత… సిరిసిల్లల పగటియాల్లన బస్సుంటది.” అన్నడు.

“పొద్దుగూక పోదువు తియ్యి చేరక పోతవా…?” ఉప్పలి అన్నడు.

“పోవాలె… పెంట ఎక్కడిదక్కడనే ఉంది. ఎరువు బండి కట్టాలె చినుకు పడితే తీరది. కట్టె పిడుక సదురుకోవాలె. ఎడ్ల గుడిసె కప్పాలె” జగన్‌ అన్నడు.

అప్పుడే అందుకుంది నీల “అయ్యా ! పోదువు తియ్యి రాకరాక వస్తివి . మీ నాయిన ఉండంగ పండుగు పండుక్కు మరువక పోతుండె. కచ్చురం కట్టి పంపుతుండె. ఇప్పుడు తొవ్వ మరిచినట్టాయె.” కండ్లు తుడుచుకుంది.

“అత్తా… మాఘమాసకురా… జాతర సూద్దువు… బిడ్డ గూడ గుర్తు జేస్తది.” ముందుకు నడుస్తూ అన్నడు జగన్‌.

“ఏమచ్చేట్టున్నమయ్య… రోజురోజుకు చాతనైతలేదు. బాగలేనని తెలిసి ఏదో ఆత్మ గొట్టుకుని సూసిపోదామని వస్తివి. ఇట్లనే ఎప్పుడన్న బిడ్డను వచ్చి సూసి పొమ్మను.” అని ఇంట్లకు పోయింది నీల.

విత్తనానికి ఉంచిన బీరగింజలను, సోరగింజలను, గుమ్మడి గింజలను పొట్లం గట్టి ఇచ్చింది ఇద్దరు వాకిట్ల దాక వచ్చి సాగనంపిండ్రు.

జగన్‌ ‘మామా … పయిలం’ అని నడువబోతుంటే ‘ఆగు ఆగు’ అని ఇంట్లకు పోయిండు ఉప్పలి.

జగన్‌ వెనక్కి తిరిగి చూస్తే ఇంట్ల నుంచి చిన్న సీసతో తిరిగి వచ్చిండు ఉప్పలి.

“నేను మరిచే పోయిన. ఆందెం ఎడ్ల కొమ్ములకు రాయి పెయ్యంతా రాయి. కొత్త తోలు పుట్టి పాణం పెడుతది. ఎడ్లు నీ ఎడ్లు గావు నా ఎడ్లు మంచి నిగా మీద ఉంచు.” సీస ఇచ్చి అన్నడు ఉప్పలి.

జగన్‌కు సురుక్కుమంది. పొద్దునైతే తాగిన నిసాలో అన్నడనుకున్నడు మళ్లీ అదే మాటను ఎందుకన్నడో అర్ధం కాలేదు. అనుమానం మొదలైంది. అదే అనుమానంతో చూసిండు. ఉప్పలి లో ఏ మార్పూ లేదు. నిజంగా అన్నట్టే అన్నడు పైగా “అవి నా ఎడ్లు. ఖరాబు చెయ్యకు. దర పలుకది. మంచి పాణం మీద ఉంచు. ఎంత ధర అంటే అంత ధర పలుకాలె.” అన్నడు.

“వీనికి పిచ్చి లేసినట్టుంది. నా ఎడ్లకు ఏమన్న కావాలె… అప్పుడు జెప్పుత వీని సంగతి. సుట్టమై వస్తే దయ్యమై వట్టిండట. ఇదే కత గావచ్చు” అనుకుంటూ ఇల్లు చేరిండు జగన్‌.

రెండు మూడు రోజులు అదే ఆలోచన ఎడ్లను పట్టి పట్టి చూసుకున్నడు. నిండా తడుముకున్నడు ఒకటికి పదిసార్లు ఏదన్న తేడా ఉందా అని చూసుకున్నడు. తర్వాత పనిలో పడి విషయాన్ని మరిచిపోయిండు జగన్‌.

వారం… రెండు వారాలు… మూడు వారాలు. యాకాషి దాటినంక మొదటి సోమవారం పొద్దున పొద్దున ఎడ్లకు గడ్డి ఏస్తున్న జగన్‌ ఫోన్‌ వచ్చిందంటే పక్కింటికి పోయిండు. మాట్లాడుతుంది ఉప్పలి.

మామా … అంటే అల్లుడా అనుకున్నరు.

ఉప్పలి చెప్పింది వింటుంటే జగన్‌ మొఖంలో రంగులు మారినయి. కొద్దిగా భయమయింది కూడా.

“మామా… నువ్వే గెలిచినవు. ఎడ్లను అమ్మక తప్పదు” అన్నడు జగన్‌.

“ఏం రేటుకు అమ్ముతవు అల్లుడా…” అడిగిండు ఉప్పలి.

“నలుగురు నచ్చే రేటు ఎడ్ల అంగట్లకురా… దర మాట్లాడుకుందాం…” జగన్‌ అన్నడు.

ఎడ్లను కడిగి ఆందెం రాసిండు జగన్‌. కదులలేక కదిలినట్టు పదిగొట్టంగ అంగట్లకు చేరుకున్నడు. రెండు సార్లు అంగడంతా తింపి చెట్టుకింద ఎడ్లను నిలిపిండు.

అందరి చూపులు జగన్‌ గిత్తలపైనే! పోటీలు పడుతున్నరు పిలిచి పిలిచి బయానా ఇస్తున్నరు. బీడి తాగుమంటున్నరు. ఎడ్లను నడిపి సూత్తున్నరు. నోట్ల చేతుపెట్టి పండ్లు లెక్క వెడుతున్నరు వంకలు తీత్తున్నరు. జగన్‌ను బ్యారకాళ్లు ఆగం జేత్తున్నరు.

జగన్‌ ముప్పయివెయిల ధర చెప్పుతుండు పైస దిగనంటుండు. అప్పుడే అంగట్లకు జీపు వచ్చి ఆగింది బ్యాంకు మేనింజరు ఇంకో ఇద్దరు ముగ్గురు… ఉప్పలి, ఇద్దరు రైతులు.

ఉప్పలి అంగట్లో నాలుగు చుట్లు తిరిగిండు. నాలుగు జతలను చూసిండు నలుగురు బేరకాళ్లను అడిగిండు జగన్‌ దగ్గరికి వచ్చి ఆగిండు.

“ఏ ఊరు తమ్మీ… గిత్తలు మాజోరు మీదున్నయి శేరేసినవా లేదా…?”

”శేరేత్తే ఎడ్లయితయి గిత్తలు గావు ఏ ఊరైతే ఎందుకుగనీ కొంటవా… పైసలున్నయా…?” జగన్‌ అడిగిండు.

“పైసలు లెకనే అంగడి వత్తనా… ఎంత ధర… చెప్పు” ఉప్పలి అడిగిండు.

“ముప్పయి…”

“అమ్ముడు కచ్చినవా… చూపించుడుకు వచ్చినవా… ఇచ్చేధర చెప్పు… ఇరువైకి ఇత్తవా…”

“ఇంకో పదేండ్లకు రా… ఇత్త… ఇప్పదు గాదు” జగన్‌ అన్నడు.

“అరే… అంత కోపమెందుకే… ఇయ్యక పోతే ఇయ్యక పోతివి మాటవరుసకు అడిగిన” ఉప్పలి. ఇంకో నాలుగు సార్లు తిరిగి నాలుగు జతలను చూసి నాలుగు వంకలు తీసి జగన్‌ దగ్గరికి వచ్చి నిలబడ్డడు. మేనింజర్‌ను తోలుకచ్చి ఎడ్లను చూపించిండు. అవే ఎడ్లు కావాలన్నడు. జగన్‌ పైస దిగలేదు.

“నాది పదెకురాల పట్టగుడ్డం. దున్నితే ఈ ఎడ్లే దున్నాలె. ఇస్తే దీనికి లోను ఇయ్యిండ్రి లేకుంటే లేదు.” ఉప్పలి అన్నడు.

బేరం సాగింది చివరికి ఇరువై ఐదువేలకు బేరం కుదిరింది. గీసి గీసి బ్యారమాడిన మేనెంజరు చెక్కును జగన్‌కు ఎడ్లను ఉప్పలికి ఇచ్చిండు. జీబు ఎల్లిపోయింది.

“రేపు చెక్కును ఇడిపిచ్చి పైసలు తీసుకురా అల్లుడా… ఈరోజు ఎడ్లు నాయింటి ముందటనే నిద్ర జేస్తయి. అన్నట్టు కల్లు మంచిగ పారుతుంది” ఉప్పలి అన్నడు నవ్వుతూ.

Share/Save/Bookmark

కథలు, మానేటి కథలు

ఒక అభిప్రాయం

  1. ravindra ponugoti ఏప్రిల్ 2008 1

    కథ బాగుంది తెలంగాన నుడికారమ్ బాగుంది ఐతె కథ ముగిమ్పు లొ మెరుపు లెదు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో