Apr2008
మానస సరోవరం
సరోజమ్మ మగతుగా కళ్ళు మూసుకొని పడుకొని వుంది. మధ్యలో తెలివొచ్చిపోతుంది. మంచం చూట్టూ వున్న వాళ్ళు చాలా ఆతురతగా చూస్తున్నారు వాళ్ళలో ఆమెకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరి ముఖాల్లో విచారం. రేపటి గురించి భయం లేదు. కాని ఒక ఆత్మీయురాలు అప్పుడే తమ నుండి దూరమయిపోతుందా అని బాధ. మధ్య మధ్య అమ్మా పండ్లరసం తాగమ్మా అంటున్నారు ఒకరు అమ్మా వేడివేడి పాలు రెండు చంచాలు తాగమ్మా అంటున్నారు మరొకరు. అమ్మా జావ తాగమ్మా కొంచెం అంటున్నారు మరొకరు. అన్నీ వింటూ కూడా కళ్లు తెరవాలనిపించడం లేదు ఆమెకు. తనలో తనను చూచుకోవాలనుకుంటుంది తను. పలకకుండా కాసేపు వుంటే నిద్రపోతున్నారనుకొని అందరూ ఆ గది బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు ఎటువంటి గొడవలేకుండా తన జ్ఞాపకాలలో మునిగిపోవచ్చు, అదీ ఆమె ఉపాయం.
ఆమె వాళ్ళను గది నుండి బయటకు వెళ్ళమని చెప్పలేదు. అట్లా చెప్తే వాళ్ళు బాధపడతారనే భయం అందుకే కళ్ళు తెరవకుండా పడుకుంది. ఎదుటివారు బాధపడకూడదు తనవల్ల, అనే ఆలోచనతోనే జీవితంలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
మొదట్నించీ అంతే ఆమె, తనవల్ల ఎవరూ బాధపడకూడదు. చాతనయితే తన వల్ల ఎదుటువారికి తగినంత సాయం చేసేది. ఎన్నిసార్లు పిలిచినా పలకకపోయేసరికి నిద్రపోనీయండి కాసేపు అని గది వదలి వెళ్ళిపోయారు అందరూ.
——–
సరోజ బీద కుటుంబంలో పుట్టింది. కనుక తనకు జీవితంలో కష్టసుఖాలు, జీవనయానంలో ఎదురయ్యే ఒడిదుడుకులు బాగా అనుభవం. జీవితం అంటే సుఖం ఒకటే అనే భావన ఆమెకు ఎప్పుడూ లేదు. చిన్నతనంలోనే పెళ్ళి కావడంతో కుటుంబ వ్యవహారాల్లో వుండే రాజకీయాలు మొదట్లో అంతగా తెలిసేవికావు. ప్రతిదానికి భయపడేది, బాధపడేది కాని చిగురుటాకుపై మొదట పడే చినుకుకే ఉలికిపాటు వుంటుంది, తరువాత కురిసే వడగళ్ళ వానకు భయం పారిపోయి బండబారిపోతుంది. ఆమె పరిస్థితి అంతే.
వుండిలేవిడి సంసారం. ఏ పనిచేసినా చేతికి, మూతికే సరిపోయేది. భవిష్యత్తు తలుచుకుంటే నడిసంద్రంలో నావలాగా అగమ్యగోచరంగా వుండేది. కనుచూపుమేర చీకటే కనిపించేది. దారిద్య్రం అతి భయంకరమయినది. ఆకలి అత్యంత కఠినమయినది. వాటి తాలూకు అనుభవాలు ఆమెను ఎంతో భయపెట్టేవి. భయపడ్తుండగానే ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. భార్యాభర్తలు ఎంత కష్టపడ్డా పిల్లలకు ఆ కష్టం తెలియకుండా పెంచాలని భావించేదామె. దానికోసం ఎంతో జాగ్రత్తపడేది. ఎన్నో కష్టాలు పడేది. రాత్రింబవళ్ళు పనిచేసేవాడు. అయినా వచ్చే ఆదాయం సరిపోయేదికాదు. ఆ సమయంలోనే తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిన్నది. లివర్ క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్‌కు వాడే మందులు ఎంతో ఖరీదయినవి. తన తమ్ముడొక్కడే భరించేవాడు పాపం. తన పరిస్థితి తెలుసు కనుక ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కాని తనకే మనసులో చాలా బాధగా వుండేది. కన్నతండ్రి అనారోగ్యంగా వుంటే ఏమి చేయలేకపోయానని, రెండు, మూడు నెలలు రోగంతో బాధపడి ఒకరోజు రాత్రి తండ్రి హాస్పటల్‌లోనే చనిపోయాడు.
చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఖర్చులు పెరిగినాయి. సరోజకూడా ఒక కంపెనీలో పనికిపోవడం మొదలు పెట్టింది. పొద్దున 8 గంటలకు పోయి సాయంత్రం 8 గంటలకు వచ్చేది. అత్తా, మామ, మరుదులు, తోడికోడళ్ళు – పెద్ద కుటుంబం. సరోజ భర్తి సూర్యంకు అన్నదమ్ములు ఆరుగురు, ఇద్దరు చెల్లెళ్ళు. ఆయన మూడోవాడు. ఆయన చిన్న తమ్ముడు పెళ్ళి కాగానే వేరుబడ్డారు. దాదాపు అందరూ ఆ ఊళ్లోనే ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎవరికి వారు విడిపోయి బతుకుతున్నారు. సూర్యం తల్లిదండ్రులు చాలా కష్టాలుపడ్డారు. జీవితంలో పేదరికం మించిన పెనుభూతం ఏముంది. వాళ్ళు ఒక చిన్న గుడిసెలోనే ఇందరు పిల్లల్ని పెంచారు. అందరూ రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. ముసలివాళ్ళిద్దరితోపాటు చిన్నకొడుకు ఆ ఇంట్లోనే వుండేవాడు. నెలకింతని తలా కొంచెం అందరూ పంపేవారు.
ఒకరోజు వున్నట్టుండి సరోజ అత్తకు బి.పి. పెరిగి తలలో నరాలు చిట్లి పక్షవాతం వచ్చింది. చాలా ఖర్చుయినా ఆరోగ్యం బాగుపడలేదు. పైగా మంచంమీది నుండి కదలలేనిస్థితి ఏర్పడింది. అంతవరకు లేని కొత్త సమస్య మొదలయింది. ఇప్పుడు అందరికి అందరూ డబ్బు పంపిస్తే రోగికి సేవ ఎవరు చేయాలి? నా భార్య ఒక్కత్తే ఎందుకు సేవచెయ్యాలి. పిల్లలకు, అమ్మకు చాకిరి చెయ్యలేక నన్నొదలిపెడ్తా అంటుందని తల్లిదండ్రులతో ఉండే కొడుకు గొడవ మొదలుపెట్టాడు.
అన్నదమ్ములంతా కూర్చొని మాట్లాడుకుని ఒక్కొక్కరు మూడు నెలల చొప్పున ఆమెను తమ ఇండ్లలో వుంచుకొని సేవచేయాలని తీర్మానించారు. అయితే ఇందులో పెద్దకొడుకు పట్నంలో వుంటాడు. పట్నం వాతావరణం సరోజ అత్త ముసలమ్మకు పడదు కనుక అక్కడికి వెళ్ళలేదు. తరువాత కొడుకు, కోడలు కూలిచేస్తేనే కాని రోజు గడవదు కనుక ముసలమ్మను వాళ్ళు తమ దగ్గర వుంచుకునే అవకాశం లేదు అన్నారు. సరోజ పరిస్థితి అంతే. మంచంలో కదలలేని మనిషిని తెచ్చి తను ఫ్యాక్టరీ పనికి ఎలా వెళ్ళగలదు. తనది అదే పరిస్థితి కనుక ఇవ్వవలసిన డబ్బును ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి, అవకాశం ఉన్న ఇద్దరిళ్ళకు మాత్రమే ఆమెను తీసుకువెళ్ళేవారు. చూసుండగానే ఆమెకు జబ్బుచేసి సంవత్సరం గడిచింది. అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయి అమ్మను నేనే ఎందుకు చూడాలంటే నేనే ఎందుకు చూడాలనడం మొదలుపెట్టారు.
సరోజ తన భర్తతో అప్పోసప్పో చేసి ఒక మనిషినయినా పెట్టి అత్తగారిని తీసుకొద్దామంది. ఆమె భర్త సూర్యం అతి మంచితనం నువ్వు చూపించనవసరం లేదు. మా అమ్మను తెచ్చి ఇంట్లో పెడితే ఆమెను ఎవరు చూస్తారు. పనిమనిషిని పెడ్తే మనలాగా చేస్తుందా. పైగా ఒకరోజు రాకపోయినా మా అమ్మకు ఎవరు చేయాలి. కొత్త అప్పులు చేస్తే ఎవరు తీర్చాలి. ఎక్కడినుండి తేవాలి అన్నాడు. నువ్వు త్యాగం చేసినట్టు ఫోజుపెట్టి మా ప్రాణం మీదకు తేవద్దులే అన్నాడు.
నిజానికి సూర్యం కొంచెం సహకరిస్తే తల్లి బాధ్యతను తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా, అప్పులయితే అయినాయి అని ధైర్యం చెయగలిగితే బాధ్యతను పంచుకునే అవకాశముండేది. ఉద్యోగం మానెయ్యి అని కూడా చెప్పలేకపోయాడు. చిన్న స్వార్థం, పెద్ద పొరపాటు. తీరని నష్టం. అత్తగారిని తన ఇంటికి తీసుకురాలేని పరిస్థితి. అన్నదమ్ముల మధ్య దూరాలు పెరిగాయి. మొదట్నుంచి అంతంత మాత్రంగా వున్న ఆలుమగల మధ్య సఖ్యత పోయింది.
అత్తగారిని ఇంటికి తెచ్చుకోలేక పోవడమనేది ఎన్నో సంఘటనలకు దారితీస్తాయి. ప్రతిసారి సరోజ అత్తగారింటికి పోయినపుడు ఆమె అమ్మా! నా సంగతి ఏం చేసినవే సరోజా? అంటూ ఏడ్చేది. తోడికోడళ్ళు, మరుదులు తనను దోషిని చేసి మాట్లాడేవారు. నిజమే తన మనసే చెప్పేది. నువ్వు దోషివి అని, పలాయనవాదివి అని. కాని తనేం చేయగలదు. భర్త, పిల్లల సహకారం లేకుండా, కదలలేని రోగిష్టి అత్తగారిని ఇంటికి ఎలా తేగలదు.
ఆమె మనసులో ఒక అంతర్వేదన మొదలయింది. దానికి తోడు సూర్యం ప్రతిదానికి విసుక్కునేవాడు. మా అమ్మకు చాకిరి చేయకుండా తప్పించుకున్నావు అనేవాడు. నువ్వు ఎవరికేం చేశావు. నువ్వేం చేసినా నీ కోసం చేసుకొంటున్నావు అనేవాడు. రోజు ఇంట్లో గడవలే. దాదాపు మూడు సంవత్సరాలు మంచం మీదవుండి అత్తగారు పోయారు. ఆవిడ పోయినాక అన్నదమ్ములంతా మళ్ళీ కీచులాడుకున్నారు. ఆమె ఉన్నప్పుడు అప్పు చెయ్యడానికి భయపడ్డవారు ఆమె పోయిన తరువాత అప్పుచేసి దినాలు ఘనంగా చేశారు.
రోజులు గడుస్తున్నాయి. తరచూ సూర్యం మా అమ్మకు సేవ చేయలేదు, మా వాళ్ళకు పెట్టనియ్యట్లేదు అంటూ సరోజతో గొడవపడుతూ వుండేవాడు. ఒకరోజు మా వాళ్ళకు ఎం చేసావ్. మా అమ్మ మంచానపడితే ఒక్క రోజైనా చాకిరి చేసినావా? అని అంటున్న భర్త మాటలకు తన పిల్లలతో అదేందిరా బాబు అప్పుడు మీ నాయనమ్మను తీసుకొద్దాం అంటే మీ నాన్నే కదా వద్దన్నాడు. మీరు కూడా నాన్నొద్దంటుంటే నీకెందుకు వూరుకోరాదమ్మ. మన ఇల్లు చిన్నది. వచ్చే జీతం తక్కువ అన్నారు. ఇప్పుడిలా కీచులాడుతున్నాడు అంటే, పిల్లలు చెప్పిన సమాధానంతో మతిపోయింది సరోజకు. నువ్వు నాయనమ్మను తీసుకొద్దాము అన్నావు కానీ తీసుకురాలేదు కదా. తీసుకొస్తే నాన్న అనెటోడుకాదు కదా, నాన్న వద్దన్నా నువ్వు తీసుకొస్తే నాన్న ఇప్పుడు ఇలా అనేటోడు కాదు కదా, నానొద్దంటే ఎందుకూరుకున్నావు అన్నారు. పిల్లల మాటలు విన్న సరోజకు ఏం చేయాలో తోచక నోరుమూసుకుంది.
భార్యాభర్తల మధ్య కీచులాటలు పెరిగినాయి. చేయని తప్పుకు దోషిని చేస్తూ రోజూ వేధించేవాడు సరోజ భర్త. పిల్లలు పెరిగారు. పదవ తరగతి అయిపోయి ఇంటర్మీడియేట్‌కొచ్చిన సరోజ బిడ్డకు పెళ్ళి సంబంధాల వేట మొదలయింది. సూర్యం అన్నదమ్ముల మధ్య రాకపోకలు తగ్గినాయి. సరోజ తరపున మిగిలిన తల్లి, తమ్ముడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవయ్యేది.
సూర్యం-సరోజ గొడవలతోనే ఏదో ఒక సంబంధం చూచి బిడ్డకు, కొడుకుకు పెళ్ళిళ్ళు చేశారు. సంవత్సంరం తిరక్కుండానే కొడుకు, కోడలు వేరుకాపురం పెట్టారు. సరోజ బిడ్డకు అత్తమామలు లేరు. పెళ్ళికాగానే ఒంటరి కాపురమే. ఎవరితో ఎవరికి సంబంధం లేదు. అందరూ వున్నారు. సూర్యం, సరోజ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీలున్నప్పుడు కీచులాడుకుంటున్నారు. వీలికాకపోతే మూతులు ముడుచుకుని వుంటున్నారు. ఒకే కప్పుకింద అపరిచితుల్లా.
ఇదంతా చూచిన సరోజకు భయమేస్తుంది. తన తల్లిని పలకరించలేకపోతుంది. అత్తను గుర్తుచేస్తూ భర్త గొడవచేస్తున్నాడు. కొడుకు అసలేం పట్టించుకోవట్లేదు. వాడిప్పుడే అవకాశవాదం మొదలుపెట్టాడు. ఇంతలో పక్కింట్లో ఒక సంఘటన జరిగింది. పక్కింట్లో జోగమ్మ, జోగయ్య వాళ్ళకి ఇద్దరు కొడుకులు. జోగయ్య ఏదో కంపెనీలో పనిచేసేవాడు. జోగమ్మ నాలుగైదు ఇండ్లలో పాచిపని చేసేది. పిల్లలను జాగ్రత్తగానే పెంచింది. వాళ్ళకు చదువబ్బలేదు. ఒకన్ని హోటల్లో, రెండోవాణ్ణి మెకానిక్ షెడ్‌లో పెట్టింది. ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. కొడుకులు పెద్దోళ్ళయినారు. అంతకుతగ్గ బొంతలనిచూచి పెళ్ళిచేసింది. ఎవరికి వాళ్ళు విడిపోయి బతుకుతున్నారు. రెండు, మూడు రోజులు కురిసిన వాన ముసుర్లలో జోగమ్మ తడిచి పనిచేయటంతో జ్వరం పట్టింది. జ్వరం, జ్వరంతో కాలుచెయ్యి పడిపోయింది. జోగయ్య పట్టించుకోలేదు. అసలింటికి రావడం మానేశాడు. కొడుకులకు కబురుచేస్తే ఇద్దరు వచ్చారు. డాక్టరు దగ్గరకు తీసుకుపోయారు. ఒక సూది వేయించి తీసుకొచ్చి ఇంట్లోపడేసి పోయారు. ఏమైందో ఏమో తెల్లారేసరికి శవమైంది. దాదాపు నెల రోజులు తిప్పలు పడ్డది ఒక్కతే. ఇరుగు పొరుగు ఆదుకున్నారు. జనం ముందు జోగయ్యను తప్పు పట్టారు. కాని అతడు కంపెనీలో యాక్సిడెంట్ అయి దవఖానాలో చేర్చారు. మంచం దిగలేని పరిస్థితి. కొడుకులూ పట్టించుకోలేదు. జోగమ్మ అనాథ శవమయ్యింది. ఆలస్యంగా నలుగులు కలిసి మునిసిపాలిటి వ్యానెక్కించారు. జోగమ్మ జీవితం అయిపోయింది.
ఇదంతా చూచిన సరోజకు భయం పట్టుకుంది. ఏం జరుగుతుంది, ఒకరికి ఒకరు కాకుండా మనుషులు ఏమైపోతున్నారు. మనుషుల మధ్య అవకాశవాదం, స్వార్థం ఎట్లా పెరుగుతోందో ఆలోచించే కొద్దీ దిక్కుతోచట్లేదు. తన అత్తలాగ తనకు రోగమొస్తే ఎవరు చేస్తారు. అమ్మో తలుచుకుంచేనే బయంతో గుండె ఆగేలాగ వుంది. అవకాశమొచ్చినప్పుడల్లా దీని గురించి పనిచేసేకాడ ఈ ముచ్చట అనుకుంటూ బాధపడింది. చిట్టీపాటకాడకు పోయినప్పుడు కూడా ఈ మాట ఎత్తితే అక్కడకు వచ్చిన దుర్గమ్మ ఉపాయం చెప్పింది. దగ్గర్లో ఒక ఆశ్రమం వుంది, అందులో అయ్యగారు, అమ్మగారుంటారు. వాళ్ల దగ్గరకు పోయినవాళ్లకు అందరికి మంచిమాటలు చెప్తుంటారని తెల్లారి పని అయిపోయినంక ఆడికి పోదామనుకున్నారు ఇద్దరు. అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరు ఆ ఆశ్రమానికి వెళ్ళారు. అదొక పెద్ద ఆవరణ. పూజలు, భజనలు, స్వాములు ఏం లేవు కానీ, చుట్టూ కూరగాయలు, పూలచెట్లు, గుంపులు గుంపులుగా బాతులు, కోళ్ళు ఆవరణలో వున్నాయి. రెండు గేదెలు పక్కన కట్టేసి వున్నాయి. వాతావరణం శుభ్రంగా, ప్రశాంతంగా వుంది. బిక్కుబిక్కుమంటూ ఆవరణలోకి వెళ్ళగానే ఇంటి అరుగుమీద ఇద్దరు పెద్దవాళ్ళు కనిపించారు. వాళ్ళే అయ్యగారు, అమ్మగారు. ఆమేదో రాసుకుంటూ కనపడింది, ఆయనేదో పొట్లాలు కడుతున్నారు. వీళ్ళను చూచి ఆదరంగా – రండమ్మా! ఎవరు కావాలి? అన్నాడు అయ్యగారు. దుర్గమ్మ అన్నది. మీతోనే మాట్లాడదామని వచ్చినమయ్యా, ఈ సరోజమ్మకు ఏదో మంచిమాట చెప్తరని వచ్చింది అన్నది. అమ్మగారు రాయడం ఆపి రండమ్మా, ఇటొచ్చి కూచోండని అరుగు చూపించింది. విషయమేంటి? నీ కెందరు పిల్లలు? మీ ఆయనేం పనిచేస్తారు? – లాంటి ప్రశ్నలు వేశారు ఇద్దరు కలిసి.
తరువాత అసలు విషయం మాట్లాడారు. సరోజమ్మ ఇట్లనే జరిగితే ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు తోడులేకుండా అనాధలైపోతారు కదా. డబ్బున్నవాళ్ళు వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు. మరి నిరుపేదలమయిన మాలాంటోళ్ళ గంతేంగాను అన్నది. వయసులో వున్నప్పుడు ఎవరు భార్యాపిల్లలు వాళ్ళే అనే స్వార్థం. తాము ముసలివాళ్ళు అయ్యాక తమ ఆలోచనలే పుణికిపుచ్చుకున్న పిల్లలు తమను పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులకు సముద్రమంతా నిస్సహయతా ఏం చేస్తాం అన్నారు అయ్యగారు.
ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నావు సరోజ అడిగింది అమ్మగారు. ఈ మనుషుల మధ్య అనుబంధాలు పెంటడం కోసం ఒక్కపూటలో మాయా మంత్రం ఏం చెయ్యలేం. అది తెలుసుకాని ఇప్పుడు అవసరం వున్నవారికి కొంచెం అవకాశం వున్న వాళ్ళు ఏం చెయ్యగలం ఆలోచిద్దాంమని అంది సరోజమ్మ.
ఏం చేస్తే బాగుంటుందని నీ ఉద్ధేశం.
ఒంటరిగా ఉండే నాలాంటోళ్ళందరం కలిసి ఒకచోట, ఒక కుటుంబంగా వుంటే బాగుంటుంది.
ఎట్లా?
నేను నాకు తోచింది చెప్పాను. చాలామంది 50 సం||లు దాటి తప్పనిసరిగా పనిచేయవలసివచ్చి ఒంటరిగా బయటపని, వంటపని, ఇంటిపని చేసుకుంటూ, నిరాశా, నిస్పృహలతో అప్పుడే చావుకోసం ఎదురుచూస్తూ బ్రతుకుతుంటే, మరికొందరు ఉన్న కొద్ది జీవితాన్ని సుఖంగా బతకాలని, తాగి తందనాలాడి, రెండోపెళ్ళి, అక్రమ సంబంధాలతో కొత్త కష్టాలు, కొత్త రోగాలు తెచ్చుకుని, ఇంకా బంధాల్లో కూరుకుపోతున్నారు. అందుకోసం ఏదన్నా చేస్తే బాగుంటుందని అంది సరోజ.
”ఏం చేస్తే బాగుంటుందో చెప్పు నువ్వే” అన్నారు అమ్మగారు.
ఏం లేదు, అందరూ ఉండి ఏకాకులమయిన నాలాంటి వాళ్ళందరూ కలిసి ఒకేచోట వుంటే ఎలావుంటుంది అనీ అంటూ నీళ్ళు నమిలింది. సరోజమ్మ.
”బాగానే వుంటుంది. కాని ఎక్కడ వుంటాం? ఎవరుండనిస్తారు?” అంది దుర్గమ్మ.
అంతసేపు వాళ్ళ సంభాషణ వింటున్న అయ్యగారు ”ఎవరైనా ఎందుకు వుండనివ్వరు” అన్నాడు.
సరోజమ్మకు సంతోషనేసింది. తన అభిప్రాయానికి బలం దొరికింది. అంటే అనుకున్నదు జరిగే అవకాశమున్నదనే ఆనందం.
”అయ్యగారు అలా వీలుకుదురుద్దాండి” అన్నది.
”కుదురుద్దేమో కాని… దానికి కొంత శ్రమ, కృషి అవసరం. ఆలోచన బాగుంది” అని తన పనిలో మునిగిపోయాడు.
అమ్మగారు కలగజేసుకుని ”నీలాగా ఆలోచించే వాళ్ళెవరయినా వుంటే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో కలిసి ఒకసారి ఇక్కడికి రండి, ఏదైనా ఆలోచించుదాం” అన్నది అమ్మగారు, సరే అమ్మగారు అని దుర్గమ్మతో కలిసి వచ్చేసింది సరోజమ్మ.
సరోజమ్మ…. సరోజమ్మా…. మళ్ళీ తన గదిలోకెవరో వచ్చినట్టున్నారు. తనను లేపాలని ప్రయత్నిస్తున్నారు. పిలుపులు వినపడుతున్నా కళ్ళు తెరవకుండా అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయింది. తనపట్ల వాళ్ళెంత అభిమానం చూపిిస్తున్నారు. తను వాళ్ళకు ఏమవుతుంది, తనవాళ్ళేరి, ఎవరూ వచ్చినట్టు లేదు.
మళ్ళీ గతంలోకి జారుకుంది. ఆశ్రమం నుండి వచ్చిన తరువాత దుర్గమ్మ, తను కలిసి మరో నలుగురితో కలిసి ఆశ్రమంలో మాట్లాడిన విషయాన్ని గురించి చెప్పింది. జోగయ్య, జోగమ్మల సంఘటనను ఉదాహరణగా వివరించింది.
అంతకుముందు టి.విలో చూచిన ఒక సంఘటన గురించి చెప్పింది. సునామీ తాకిడికి గురైన నలుగురు సభ్యులు వారివారి కుటుంబాలను వాళ్ళ స్వంత మనుషులను పోగొట్టుకున్నవాళ్ళంతా కలిసి ఒక కుటుంబంగా ఎలా జీవిస్తున్నది చూపించారు. అందులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అమ్మాయి, భర్తను, పిల్లలను పోగొట్టుకున్న ఇద్దరు మహిళలు, ఆస్తిని, సర్వాన్ని కుటుంబంతోసహా పోగొట్టుకున్న మరో వ్యాపారి, నలుగురు అనాధలు కలిసి ఒకరికి ఒకరుగా ఒకే కప్పు కిందవుండి, ఒకరి కష్టం మరొకరు పంచుకోవచ్చు. శక్తి వుండి సంపాదిస్తున్నప్పుడే కొత్త కుటుంబంగా ఏర్పడితే శక్తిని కోల్పోయినపుడు ఒకరికి ఒకరు తోడుగా నిలిచే వీలుంటుందని జోగమ్మలా అనాధశవంగా మారవలసిన అవసరం వుండదని వివరించింది. సరోజమ్మ. ఆమె ఆలోచన అందరికి నచ్చింది. అలా నచ్చి తనతో రావడానికి ముందుకు వచ్చిన ఒక ఐదుగురిని తీసుకుని మరుసటిరోజు దుర్గమ్మ, సరోజమ్మ ఆశ్రమానికి వెళ్ళారు.
వీళ్ళ కోసమే ఎదురుసూస్తున్నట్టు కూచున్న అయ్యగారు, అమ్మగారికి సమస్కారాలు పెట్టారు వెళ్ళినవాళ్ళంతా. వీళ్ళ కోసం చల్లని మజ్జిగ కలిపి ఒక సరవలో పోసి ఇచ్చింది అమ్మగారు. తలా గ్లాసు తాగారు. జ్ఞానబోధ చేస్తున్న గురువు చుట్టూ కూచున్న శిష్యుల్లాగా కూర్చున్నారు వెళ్ళినవాళ్ళు. అమ్మగారు సరోజమ్మను అడిగారు వీళ్ళంతా నీకు ఎలా తెలుసు? వీళ్ళ పేర్లేంటి అని. అందరికంటే పెద్దవయస్సు 60 సం||ల పైనే వుంటుంది కోటమ్మ, భర్త చనిపోయాడు, ఇద్దరు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేసి అత్తగారిళ్ళకు పంపించింది. పిల్లల పెళ్ళికి చేసిన అప్పులున్నాయి. ఒక ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది.
రెండవ ముసలమ్మ నరసమ్మ. భర్త వున్నా ఏ పనిచేయలేదు. తాగుడుకు డబ్బులకోసం వేధించేవాడే కాని తోడుగా వుండే రకం కాదు. ఎవరో డాక్టరు దగ్గర స్వీపర్‌గా పనిచేస్తుంది.
పిల్లలు లేరని భర్త వదిలిపెట్టిన ఎంకమ్మ, మరొకరు కూలిపని చేసుకుని బ్రతుకుతుంది. ఇలాగే ఇంకో ఇద్దరు, ఏం చేద్దామని నీ ఉద్ధేసం సరోజమ్మ అని అడిగారు అయ్యగారు.
ఏం లేదండి నేను చెప్పే అంత పెద్దదాన్ని కాదు కాని నాకు ఒక ఆలోచన వచ్చింది. అది సరియైనదో, కాదో అని – జగమ్మ మరణం, సునామీ పీడుతులైన కొత్త కుటుంబం తన ఆలోచన మొత్తం చెప్పింది. అందరికి ఆమె చెప్పేది నచ్చింది. ఆ ఆశ్రమమే నీడనిచ్చింది. ఆ ఆవరణలోనే మరో రెండు పాకలు వేయబడ్డాయి. ఒంటరిగా, విడివిడిగా వుండే వ్యక్తులు, వృద్ధులు అందరూ కలిసి ఆ ఆశ్రమంలోనే నివాసం వుండటం మొదలుపెట్టారు. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవారు, అందరూ కలిసి ఒకే ఇంట్లో వుంటూ కలిసి వండుకుని తినేవాళ్ళు, ఎవరికైనా వంట్లో బాగాలేకపోతే వేరొకరు తోడు వెళ్ళేవారు. ఎవరి సంపాదన వారే తిన్నా ఒకరికొకరు పంచుకుని తినేవారు. అంతా కలిసి ఒక కుటుంబంలా వుండేవారు. ఎవరి బంధువుల ఇండ్లలో ఏదైనా కార్యక్రమమయితే వెళ్ళి వచ్చేవారు. వీలుంటే వీళ్లలో కొందరు కూడా వెళ్ళేవారు. వీళ్ళతోపాటు మరో నలుగురు అనాధపిల్లలను చేరదీశారు. ఇంకో ఇద్దరు అనాధవృద్ధులు కూడా చేరారు. ఎవరి చేతనైన పని వాళ్ళు చేస్తారు. ఎవరికి ఆసక్తి వున్నపని వాళ్ళు చేస్తారు. ఏ పనికి ఏ ఒక్కరిని ఎవ్వరు బలవంతపెట్టడం వుండదు. బయటికి పోయి డబ్బు సంపాదించే పనులు కొందరుచేస్తే, కొందరు తోటపని, కూరగాయలు, ఆకుకూరలు పండించే పనిచేస్తారు. కొందరు బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చేపని చేస్తే దాదాపు అందరూ కలిసి వంటపని దగ్గరకు వస్తారు. పాత్రలు శుభ్రం చేయడం, బట్టలుతకడం అందరూ కలిసి చేసుకుంటారు. అప్పుడప్పుడు చిన్నచిన్న అలకలు వచ్చినా వెంటనే అందరూ కలిసిపోతారు. అన్ని పండుగలు జరుపుకుంటారు. కాలక్షేపానికి టి.వి. వున్నా ఎక్కువమంది కష్టసుఖాలు కలబోసుకోవడంలోనే ఆనందిస్తారు. వారానికి ఒకసారి ఒక డాక్టరు వచ్చి అందరినీ పరీక్షించి కావలసిన మందులు రాసే ఏర్పాటు జరుపుకున్నారు. ఎంతో ఆనందంగా ముందుకు సాగుతున్నారు.
”మానవ సరోవరం” అనే పేరుతో ఆ ఆశ్రమానికి పదేళ్ళు గడిచిపోయాయి. అయ్యగారు మరణించారు. అమ్మగారు పండుటాకులా మిగిలారు. కొత్తవాళ్ళొచ్చారు. పాతవాళ్ళు కొందరు పోయారు. కొత్తనీరు వస్తుంది, పాతనీరు పోతుంది. నీటిపై ఆధారపడిన చేపలు, కప్పలు, అనేక జలచరాలు, ఉభయచరాలు అన్నిటికి వెలవయింది ఆ ”మానవ సరోవరం”. సరోజమ్మ ఆఖరి గడియల్లో వుండి అనుకున్నది సాధించింది. ఆనందంగా, స్నేహపూర్వకంగా మృత్యువుకోసం ఎదురుచూస్తుంది. మరో తరానికి దారి చూపిస్తూ….
——
సరోజమ్మా! చాలా సేపయ్యిందిలే, కొంచెం ఏదైనా త్రాగు, మరీ అంత ఆనందంగా ఎదురుచూడాలా కొత్త స్నేహం కోసం? మే పాతబడిపోయామా? అంటున్నారు ఎవరో.
ఒకసారి పోవడంమంటే… మళ్ళీ రావడానికే కదా!
ఎదురుచూడటమంటే ఎవరినో ఆహ్వానించడమే కదా!
Wilson Sudhakar Apr 15, 2008 1
జ్వలిత గారు మంచి కథ వ్రాశారు. ఎంతో ప్రభోదాత్మకంగా ఉంది. కథ నదిపించిన తీరు చాలా బావుంది. వారికి నా అబినందనలు.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, బెంగలూరు.
ashok Nov 11, 2008 2
మీ అభిప్రాయము నాకు నచీంది
చాలా గొప్పగా వుంది