Apr2008
నాడీకణాలు
ప్రాణులకు తమ పరిసరాలను గురించి ఉండే స్పృహా, చైతన్యమూ ఎంతో ప్రత్యేకమైనవి. అవి లేనిదంతా “జడ” పదార్థమే. ముఖ్యంగా మనుషుల్లో “ఒళ్ళు తెలియకుండా పోవడం” చాలా అసహజమైనదిగా భావిస్తాం. ఎంత ప్రాథమిక జీవి అయినా బతికున్నంత కాలమూ తన చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించి, వాటికి స్పందిస్తుంది. అయితే ఈ స్పందనల్లో తేడాలుంటాయి. ఏకకణజీవులైన అమీబా వంటివి ఎక్కువ “తెలివితేటలను” పొందలేవు. పరిసరాలను గుర్తించే ఇంద్రియాలూ, ఆ సమాచారానికి అనుగుణంగా స్పందించే కండరాలూ మొదలైనవన్నీ సంతరించుకోవడం వాటివల్ల అయేపని కాదు. ఒక మిల్లిమీటర్లో వందోవంతు ఉండే ఏకకణజీవుల శరీరాలు అంతకన్నా పెరగలేవు. వాటి వైశాల్యం కనక రెండింతలైతే ఘనపరిమాణం ఎనిమిదింతలవుతుంది. అందుచేత ఉపరితలంద్వారా జీవికి అందే పోషకపదార్థాలు ఒక పరిమితిని దాటితే సరిపోవు. జటిల శరీరనిర్మాణానికి చిన్నసైజు పనికిరాదు. అందుచేత ఏకకణజీవులు సూక్ష్మమైనవిగానే ఉండక తప్పదు. మ్యుటేషన్లద్వారా అవి తమ లక్షణాలను మార్చుకోవటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ భౌతిక పరిమితులవల్ల గత 300 కోట్ల సంవత్సరాలుగా అవి సూక్ష్మస్థాయిలోనే కొనసాగక తప్పలేదు.
ప్రాణికి చైతన్యం పెరగాలంటే అది బహుకణజీవిగా మారకతప్పదు. అయితే కణాల సంఖ్య ఊరికే పెరిగితే సరిపోదు. స్పంజ్ జాతి ప్రాణి ఎన్నో ఏకకణజీవుల సముదాయంవంటిది. అందులోని కోట్లాది కణాలు సమన్వయం లేకుండా వేటికవిగా బతుకుతాయి. కేంద్ర నాడీవ్యవస్థ ఏదీ లేకపోవడంతో తెలివితేటల్లో స్పంజ్‌కీ, అమీబాకూ పెద్దగా తేడా ఉండదు. ఏవో కారణాలవల్ల స్పంజ్ జాతి ప్రాణులు తమకున్న అనేక కణాలద్వారా లాభం పొందలేకపోయాయి. జీవపరిణామంలో వాటి ప్రస్థానం ఏనాడో ఆగిపోయింది; వాటినుంచి ఉన్నతజాతులేవీ పుట్టుకురాలేదు. వివిధ కణాలన్నీ కలిసికట్టుగా పని చేసేందుకు అనుకూలించే జన్యుపరమైన మ్యుటేషన్లేవీ తలెత్తలేదు. అందువల్లనే స్పంజ్ జాతులు బహుకణజీవుల స్థాయి అందుకోలేకపోయాయి. తమ కణాలమధ్య పరస్పరసంబంధాలు కలిగిన బహుకణజీవులకు పైన చెప్పిన ఉపరితల, ఘనపరిమాణ సమస్యలేవీ ఉండవు.బహుకణజీవుల కణాలమధ్య శ్రమ విభజన ఉంటుంది కనక కొన్ని కణాలు ఆహారానికీ, ఇంకొన్ని ఆక్సిజన్ సరఫరాకూ, మరికొన్ని కవచంగా రక్షించడానికీ పనికొస్తాయి. క్రమంగా కొన్నేసి కణాలకు కొన్ని విషయాల్లో ఎక్కువ సామర్య్థమూ, తక్కిన విషయాల్లో తక్కువ సామర్య్థమూ ఏర్పడింది. వాటిమధ్య పరస్పరసహకారం పెరగడంతో ప్రాణి తన ఆహారాన్ని సంపాదించడంలోనూ, ప్రమాదాల నుంచి తప్పించుకోవడంలోనూ నేర్పు పొందసాగింది. ఈ విషయంలో స్పంజ్‌కన్నా అగ్గిపుల్ల పరిమాణంలో ఉండే హైడ్రా అనే నీటి “మొక్క” మెరుగైనది (పటం). తన వాలకాన్నీ, స్పర్శకాలవంటి అంచులనూ రకరకాలుగా తిప్పుకుంటూ, ప్రమాదాల బారిన పడకుండా ఆహారం వెతుక్కుంటూ ఉంటుంది. స్పంజ్‌లాగా కాకుండా కణాలమధ్య సంపర్కం ఉంటుంది. చైతన్యానికి కావలసినది అదే.
హైడ్రావంటి జీవాల్లో పరస్పరం సంభాషించుకోగలిగిన తొలి నాడీకణాలు ఉద్భవించి ఉండవచ్చు. అయితే ఈ కణాలు ఉపరితలంమీదనే ఉంటే పరిసరాలకు స్పందించడం సులువైనప్పటికీ, వాటికి హాని కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందువల్ల మ్యుటేషన్ల కారణంగా ఇవి రానురాను శరీరపు లోపలి భాగాలకు చేరుకుని ఉంటాయి. పరిసరాల గమనికకై స్పర్శకాలవంటి వాటిని పైకి పొడుచుకు వచ్చేట్టుగా అమర్చుకుని ఉంటాయి.
1. అమీబా, 2. హైడ్రా, 3. స్పంజ్
మన నాడీమండలంలోని వివిధ భాగాలను పరిశీలిస్తే వాటి ఆవిర్భావం ఎలా జరిగిందో అర్థమౌతుంది. మెదడులోని జీవకణాలు నాడీకణాల రూపంలో ఉంటాయి. న్యూరాన్ అనబడే ఒక్కొక్క కణమూ మిల్లిమీటర్‌లో సుమారు పదోవంతు పొడవుంటుంది. మెదడులోని ఈ కణాల సంఖ్య దాదాపు 30 వేల కోట్లు. ఈ బంధాలన్నీ మొత్తం 40 లక్షల మైళ్ళ పొడుగు కలిగి ఉంటాయి. తక్కిన కణాల్లాగే వీటిలో కేంద్రకం ఉంటుంది కాని పొడుగాటి ఒక తోకవంటిది కూడా ఉంటుంది.
ఇదికాక మొక్కల వేరులను పోలిన అనేక కేశికలుకూడా ఉంటాయి. వీటన్నిటిలోనూ పెద్దదైన ఆక్సాన్, అక్షనాళం లేదా లాంగూలం అనబడే ఈ తోకద్వారా సమాచారం బైటికి పంపబడుతుంది. అవతలి వైపున ఉండే శాఖోపశాఖలను డెండ్రైట్ లంటారు. ఇతర నాడీకణాలు పంపే సంకేతాలను ఇవి పసికట్టి తమ కణానికి అందిస్తాయి. మెదడును మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఎంతో జటిలంగా, సూక్ష్మమైన వలలాగా కనబడే ఆక్సాన్, డెండ్రైట్‌ల వ్యవస్థ నాడీకణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకోవడాలకు పనికొస్తుంది. సగటున ఒక్కొక్క నాడీకణమూ వెయ్యికి పైగా ఇతర కణాలతో సంభాషిస్తుంది. మనుషుల తెలివితేటలకూ, అనుభవానికీ మూలాధారమైన ఈ సంపర్కం ఊహించలేనంత పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఈ సంబంధాల లంకెల సంఖ్యను సూచించటానికి ఒకటి పక్కన ముప్ఫై, నలభై సున్నాలు చుట్టాలి! వీటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్క రకమైన బాధ్యతను నిర్వర్తిస్తాయి.నాడీకణాలమధ్య జరిగే సంభాషణ ఎలెక్ర్టికల్ సర్కిట్ల పద్ధతిలో అంచెలంచెలుగా జరుగుతుంది. సమాచారం ఒక చోటినుంచి మరొకచోటికి క్రమంగా పాకుతుంది. స్పర్శద్వారానో, ఇంద్రియాలనుంచో అందే స్పందనల కారణంగా నాడీకణాల విద్యుదావేశంలో స్వల్పమైన మార్పులు కలుగుతాయి. దాని వల్ల కణం వోల్టేజ్‌లో వ్యత్యాసం ఏర్పడి ఒక విద్యుత్ సంకేతం రూపొందుతుంది. ఇది ఒక వోల్ట్‌లో వెయ్యోవంతు మాత్రమే; ఒక సెకండులో వెయ్యోవంతు గడిచే లోపునే ఇది మాయమౌతుంది. నాడీకణాలన్నీ రసాయనిక బేటరీల్లాగా పనిచేసి, క్షణంలోనే విద్యుత్తును విడుదలచేసి ఊరుకుంటాయి.

న్యూరాన్ లేక నాడీకణం నిర్మాణం 1. కేంద్రకం, 2. ఆక్సాన్, 3. డెండ్రైట్,4. జీవకణం, 5. మయెలిన్ పొర, 6.ఆక్సాన్ కొస
దీనికి అవసరమయే శక్తి మనం పీల్చే ఆక్సిజన్ ద్వారా లభిస్తుంది. ఈ సంకేతాలు గంటకు దాదాపు 225 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి (లోహపు తీగల్లో విద్యుత్తు ఇంతకన్నాకూడా వేగంగా ప్రవహిస్తుంది). ఇంత వేగం అవసరమా? ఇలా జరగకపోతే మెదడుకు సమాచారం అందడం, దాన్నిబట్టి మెదడు స్పందించి కండరాలను వెంటనే కదిలించడం వీలవదు. నాడులు మందంగా ఉంటే ఈ వేగం పెరుగుతుంది కనక కొన్ని సముద్రజీవుల్లో ప్రమాదం తటస్థిస్తే పారిపోగలిగేందుకు మనుషులకన్నా 100 రెట్లు మందమైన నాడీకణాలుంటాయట.
లోహపు తీగలకు బైట విద్యుత్తును నిరోధించే ఇన్సులేటర్ తొడుగు ఉన్నట్టే ఆక్సాన్‌కు మయెలిన్ పొర ఒకటుంటుంది. అందువల్లనే ఒకదానికొకటి తగిలినా తేడా కలగదు. మయెలిన్ అనేది తెల్లని, మెత్తటి కొవ్వుపదార్థంవంటిది. దీని కారణంగా నాడులవెంట సంకేతాలు వేగంగా ప్రయాణిస్తాయి. స్క్లిరోసిస్ వంటి వ్యాధులు ఉన్నవారి నాడుల్లో ఇది పాడవుతుంది.
ఎదిగిన మనిషి మెదడు పుట్టినప్పటినుంచీ ఎలా పెరుగుతుందో అనే విషయమూ, జీవపరిణామంలో మెదడుకు ఇంత ప్రత్యేకత ఎలా కలిగిందో అనేవిషయమూ చాలా ఆసక్తికరమైనవి. వీటిలో జన్యువులదీ ముఖ్యపాత్రే. ఈ పరిశోధనలు కొన్ని నరాల రుగ్మతల నివారణకుకూడా ఉపయోగపడుతున్నాయి. మన భావాలూ, ఊహలూ అన్నీ నాడుల స్పందనల మీద ఆధారపడినవే కనక బుద్ధిజీవులుగా మనం వీటి గురించి తెలుసుకోవడం అవసరం.మనుషులకు పరిస్థితినిబట్టి రకరకాల ఊహలూ, స్పందనలూ కలుగుతూ ఉంటాయి. లేళ్ళూ, బల్లులూ, చిన్నచిన్న పురుగులూకూడా అలికిడైతే బెదిరి పారిపోవడం చూస్తాం. తన స్థాయిలో ఆలోచనలు లేకపోయినప్పటికీ చిన్నాపెద్ద ప్రాణులన్నిటికీ ప్రాథమిక స్థాయిలోనైనా స్పందనలు కలుగుతాయనేది మనిషికి వేలఏళ్ళుగా తెలిసిన విషయమే. పరిసరాలను గుర్తించి, ప్రేరణలకు లోనవడం నాడీకణాల పని. స్పర్శకూ, పరిసరాల ఉష్ణోగ్రతలోని హెచ్చు తగ్గులకూ, కళ్ళూ, ముక్కూ, చెవులనుంచి అందే సందేశాలకూ మన శరీరంలోని వివిధ కండరాలు తగిన విధంగా స్పందిస్తూ ఉంటాయి. మన భావనలన్నీ నాడీకణాలతో ప్రమేయం కలిగినవే. వాటి సమాచారాన్ని సమన్వయపరచడమే మెదడు పని. అందుకని నాడీకణాలు పనిచేసే పద్ధతిని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వీటి సంగతి మొదటగా పంతొమ్మిదో శతాబ్దం ముగిసే నాటికి తెలిసింది.
నాడీకణాల్లో న్యూక్లియస్ లేక కేంద్రకం ఉండే ముఖ్యభాగం (సోమా) కాక డెండ్రైట్‌లనే కేశికలూ, ఆక్సాన్ అనబడే పొడుగాటి తోకవంటిదీ ఉంటాయి. ఆక్సాన్ నిడివి ఒక మిల్లిమీటర్‌నుంచి ఒక మీటర్‌దాకా ఉండవచ్చు. డెండ్రైట్‌లు ఇతరకణాల ప్రేరణలను స్వీకరించేందుకూ, ఆక్సాన్‌లు కణం నుంచి సందేశాలను పంపేందుకూ పనికొస్తాయి. అంటే ఒక కణపు ఆక్సాన్‌నుంచి మరొక కణపు డెండ్రైట్‌లకు సందేశాలు ప్రసారమవుతాయి. నాడీకణాలతో కూడిన నాడీవ్యవస్థ ఒక్కొక్క ప్రాణిలోనూ ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. జెల్లీ చేపలవంటి జీవాలకు ఉండే ప్రాథమికవ్యవస్థలో ఇవన్నీ ఒక వలలాగా ఏర్పడతాయి; వివిధ ప్రేరణలకు అది స్పందించే తీరుకూడా సుమారు ఒకే రకంగా ఉంటుంది. ఇతర చేపలూ, కీటకాలూ అన్నిటిలోనూ ఇది మరింత జటిలంగా ఉంటుంది. వాటిలోని నాడీకణాలు గుంపులుగా ఏర్పడి ఉంటాయి; వీటిని గాంగ్లియా అంటారు. ఇటువంటి గుంపులు గొలుసుల రూపంలో వెన్నెముకగల ప్రాణుల్లో సామాన్యంగా కనిపిస్తాయి. గ్రంధులనూ, కొన్ని కండరాలనూ, గుండె పనిచేసే తీరునూ నియంత్రించడానికీ ఇవి పనికొస్తాయి. గాంగ్లియా శరీరంలో కలిగే స్పందనలను ఒక చోటినుంచి మరొక చోటికి చేరవేస్తాయి.
నాడీకణాల మధ్య ప్రసారమయే స్పందనలు రసాయనికమైనవి; కణం పైపొర మీద కలిగే రసాయనిక చర్యల వల్లనే స్పందనలను స్వీకరించే న్యూరాన్లు రసాయనిక మార్పులకు లోనవుతాయి. ఇంకా చెప్పాలంటే ఇవి విద్యుత్ రసాయనిక ప్రక్రియలు. ముందుగా సందేశం విద్యుత్తు రూపంలో ప్రసారమవుతుంది. దానివల్ల కణం కొసలో ఉన్న చిన్నచిన్న కోశాలు తమ న్యూరో ట్రాన్స్‌మిటర్ రసాయనాలను విడుదల చేస్తాయి (పటం).
నాడీకణాల మధ్యనుండే లంకెలకు కొంత ప్రత్యేకత ఉంది; ఆక్సాన్, డెండ్రైట్‌లమధ్య కొంత ఎడం ఉంటుంది. దీన్ని సినాప్స్ అంటారు. ఇది సుమారు 20 మిల్లీమైక్రాన్లు ఉంటుంది. ఒక మైక్రాన్ మిల్లిమీటర్లో వెయ్యోవంతు కనక మిల్లీమైక్రాన్ అంటే మైక్రాన్‌లో వెయ్యోవంతు అన్నమాట. అతి సూక్ష్మమైన ఈ అంతరాన్ని దాటిన న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు రెండో కణంలోని ప్రత్యేక స్థానాలకు చేరుకుని అక్కడ విద్యుత్తును విడుదల చేస్తాయి. అది మళ్ళీ ఇతర కణాలకు ప్రవహించి ఇటువంటి ప్రక్రియలకు కారణమవుతుంది. అదనంగా విడుదలఅయిన న్యూరోట్రాన్స్‌మిటర్‌లు మళ్ళీ మొదటి కణంలోకి ప్రవేశించి స్వీకరించబడతాయి. ఈ పద్ధతిలో నాడులమధ్య సంకేతాలన్నీ అంచెలంచెలుగా పాకుతూ పోతాయి. ఇవి సెకండుకు ఒక మీటర్‌నుంచి 100 మీటర్లవరకూ పోగలవు.

1. సందేశం పంపే కణం; 2. దాన్ని అందుకునే కణం; 3.రసాయనాల కోశం;4. న్యూరో ట్రాన్స్‌మిటర్; 5. న్యూరో ట్రాన్స్‌మిటర్ పునర్ స్వీకరణ; 6. రసాయనాలు అందే స్థలం
ఈ రసాయనిక ప్రక్రియలు ఎటువంటివో చూద్దాం. తక్కిన జీవకణాల్లాగే నాడీకణాల లోపలుండే కణజలానికీ, దానికి వెలపల ఉండే జలానికీ రసాయనికమైన వ్యత్యాసాలుంటాయి. కణాల వెలపల ఉండేది రక్తకణాలూ, ప్రోటీన్లూ లేనటువంటి రక్తమే. అందులో ఉండే సోడియం, క్లోరైడ్ అయాన్లు కణం లోపలి కన్నా 10 రెట్లూ, 14 రెట్లూ ఎక్కువగా ఉంటాయి. పొటాసియం అయాన్లు మటుకు బైటికన్నా లోపల 30 రెట్లు ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ రసాయన సంకేతాలను పంపడానికి నాడులు ఈ తేడాలను “ఉపయోగించుకుంటాయి”.
దీనికి ఒక కారణమేమిటంటే కణం లోపల బైటికన్నా సుమారు 70 మిల్లీవోల్ట్‌ల ఋణ విద్యుత్తు అధికంగా ఉంటుంది. విద్యుత్ వికర్షణ వల్ల లోపలున్న క్లోరైడ్ అయాన్లు బైటికి నెట్టబడతాయి; బైటివి లోపలికి రాలేవు. లోపలి పొటాసియం అయాన్లు 30 రెట్లు ఎక్కువగా ఉండాలంటే 90 మిల్లీవోల్ట్‌ల ఋణవిద్యుత్తు ఉండాలి. ఈ 20 మిల్లీవోల్ట్‌ల తేడావల్ల పొటాసియం అయాన్లను కణం లోపలికి నెట్టవలసిన అవసరం కలుగుతుంది. అలాగే సోడియం అయాన్లను కణం నుంచి బైటికి నెట్టడానికి ప్రయత్నం జరగాలి. ఇందుకుగాను ఆక్సాన్ పొరగుండా రసాయనాలు స్రవించడానికి అనుకూలమైన మార్పులు కలగాలి.
ఒక నాడికి ప్రేరణ అందగానే సోడియం అయాన్లు కణంనుంచి బైటికి స్రవించడానికి మార్గం ఏర్పడినట్టవుతుంది. అందువల్ల ఆక్సాన్ లోపల ధనవిద్యుత్తు పెరుగుతుంది. ఇది అంతకంతకూ సులువై, విద్యుత్తు ఒక అలలాగా సెకండులో వెయ్యోవంతు సేపు ముందుకు సాగుతుంది. అప్పుడు సోడియం అయాన్ల స్రావం నిలిచిపోవడం, పొటాసియం అయాన్లు కణం లోపలికి రావడం జరుగుతాయి. ఆక్సాన్ అంతర్భాగంలో అకస్మాత్తుగా విద్యుదావేశంలో మార్పు జరగడంతో నాడికి ప్రేరణ కలుగుతుంది. ప్రేరణను స్వీకరించే డెండ్రైట్‌లోకూడా విద్యుత్ పరిణామాలే కలుగుతాయి. ఇవి ఒక స్థాయిని మించగానే సందేశం ప్రసారమౌతుంది.
జీవపరిణామం ఏకకణ జీవులతో మొదలై, ఒకానొక దశలో బహుకణజీవుల ఆవిర్భావానికి దారితీయడం, ఆ తరవాత కొన్ని కణాలకు ప్రత్యేక విధులు ఏర్పడడం జరిగింది. నాడీకణాలు అటువంటివే. జీవాల మనుగడకు అత్యవసరంగా పరిణమించసాగిన చైతన్యం ప్రాథమిక స్థాయిలో నాడుల స్పందనలతో ఆరంభమై ఉండాలి. ఈ స్పందనలు శరీరంలో ఉన్న సోడియం, పొటాసియం లవణాల హెచ్చుతగ్గులను బట్టి స్వల్పమైన విద్యుత్ తరంగాల రూపంలో ఎలా ప్రసారమౌతాయో, వాటి సహాయంతో ప్రాణులు తమ పరిసరాల్లో జరిగే మార్పులను పసికట్టి ఎలా బతకసాగాయో తెలుస్తోంది. తక్కిన సందర్భాల్లో జరిగినట్టుగానే జీవపరిణామం ఉన్న పరిస్థితులనూ, పదార్థాలనూ మాత్రమే ఉపయోగించుకుంటుంది. స్పందించగలిగిన నాడుల ఆవిర్భావమూ, అవి పనిచేసే తీరూ అన్నీ కూడా అప్పటికే శరీరంలో ఉన్న జీవరసాయనిక పదార్థాల సహాయంతోనే జరుగుతాయి; కొత్తవేమీ అకస్మాత్తుగా పుట్టుకురావు. భౌతిక, రసాయనిక పరిస్థితులవల్ల తలెత్తే సూక్ష్మ విద్యుత్ స్పందనలే బలపడి ప్రాణులను అవసరమున్నప్పుడు అప్రమత్తం చెయ్యగలిగిన స్థాయికి చేరుకున్నాయి. మనుషులకు వాస్తవ ప్రపంచంకన్నా వాస్తవికంగా అనిపించే ఊహాలోకమంతా ఇటువంటి ప్రాథమిక నాడీప్రేరణల వల్లనే కలుగుతుందనేది మరచిపోకూడదు. రోజువారీ చైతన్యానికీ, ఎంతో ఉన్నతమనిపించే అతీంద్రియ భావనలకూ కూడా ఒకే రకమైన ప్రక్రియలు వర్తిస్తాయి.
చైతన్యం, స్పృహ అనేవి ప్రాణులకు ముఖ్యం అవుతున్నకొద్దీ నాడుల ప్రాముఖ్యత పెరుగుతుంది. మనుషులు నాడుల ప్రేరణల మీద ఎంతగా ఆధారపడతారో వేరే చెప్పనవసరం లేదు. వాహనాలనూ, చిన్నాపెద్ద యంత్రాలనూ నడిపేవారూ, సున్నితమైన పరికరాలను ఉపయోగించేవారూ ఇంద్రియాలద్వారా అందుతున్న ప్రేరణలనుబట్టి తమ కండరాలను తగిన విధంగా కదిలించ గలుగుతున్నారు కనకనే పనులన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. భావనలే అన్నిటికన్నా ముఖ్యం అనుకుంటాం గాని నాడుల్లో జరిగేవి మాత్రం అతి సీదాసాదా భౌతిక ప్రక్రియలే.
4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్


శ్రీనివాస చక్రవర్తి Aug 17, 2009 1
వ్యాసం చాలా బావుంది. న్యూరాన్ నిర్మాణం గురించి, న్యూరాన్ లో జరిగే విద్యుత్ రసాయన చర్యల గురించి, న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణల గురించి, నాడీ మండలం యొక్క పరిణామ క్రమం గురించి చాలా చక్కగా రాశారు.
ఒకటి, రెండు చోట్ల సరిగ్గా అర్థం కాలేదు.
1) ఒక చోట “ఈ సంబంధాల లంకెల సంఖ్యను సూచించటానికి ఒకటి పక్కన ముప్ఫై, నలభై సున్నాలు చుట్టాలి!” అని వుంది.
ఎదిగిన మెదడులో రమారమి నూరు బిలియన్ల న్యూరాన్లు ఉన్నప్పుడు, సగటున ఒక న్యూరాన్ కి వెయ్యి సైనాప్స్ (లంకె) లు ఉన్నప్పుడు, మొత్తం లంకెల (సైనాప్స్ ల) సంఖ్య ఒక క్వాడ్రిలియన్ మాత్రమే అవుతుంది కదా?
2) మరో చోట “ఒక నాడికి ప్రేరణ అందగానే సోడియం అయాన్లు కణంనుంచి బైటికి స్రవించడానికి మార్గం ఏర్పడినట్టవుతుంది. అందువల్ల ఆక్సాన్ లోపల ధనవిద్యుత్తు పెరుగుతుంది.” అని వుంది.
కాని మొట్టమొదట సోడియం అయాన్లు నాడీ కణం లోపలికి రావాలి కదా? అప్పుడే లోపల ధన విద్యుత్తు పెరుగుతుంది కదా?
Rohiniprasad Aug 17, 2009 2
న. “ఈ సంబంధాల లంకెల సంఖ్యను సూచించటానికి ఒకటి పక్కన ముప్ఫై, నలభై సున్నాలు చుట్టాలి!”
మీ లెక్క కరెక్టే. అయితే 1నేను కార్ల్ సేగన్ పుస్తకం ఆధారంగా అలా రాశాను. Complexities and uncertainties of neuronal network function అనే వ్యాసంలో David Parker రాసినదిది:
…the brain consists of hundreds of billions of neurons, each of which can connect to thousands of other neurons. Networks of neurons influence all behaviours, including perception, movement, memory and language. If each neuron in the brain was in one of two states, resting or active (there is actually a range of functional states), the number of potential configurations would exceed the number of elementary particles in the universe (Sagan 1977).
సోడియం అయాన్ల గురించిన ఒక వివరణ:
the nerve impulse … basically it involves the flow of sodium ions across the neuronal membrane into the cellular fluid. This is called a depolarization wave (nerve impulse) At the end of the axon there are cells which secrete a neurotransmitter called acetylcholine. There is a gap between the axon and the dendrite of the next neuron. The membrane on the dendrite is polarized with Na ions on the outside of the membrane. The acetlycholine permits the Na ions to pass through the membrane starting the depolarization wave, which continues to the next axon and synapse. The synapse is necessary to direct the impulse directionally.
Immediately after the acetylcholine is secreted it is degraded by the enzyme cholinesterase and the Na ions are pumped out in preparation for the next impulse.
శ్రీనివాస చక్రవర్తి Aug 24, 2009 3
ఓహ్! అర్థమయ్యింది.
మెదడు స్థితుల సంఖ్య అయితే బహుశ అలాంటి పెద్ద సంఖ్యే అయ్యుంటుంది.
లంకెల (సైనాప్స్ ల) సంఖ్య ఇంకా తక్కువ ఉంటుంది. (పైన నా వాఖ్య లో చిన్న దోషం ఉంది, క్షమించాలి) సగటు నాడీకణానికి వెయ్యి సైనాప్స్ లు అనుకుంటే మొత్తం సైనాప్స్ లు 10 పవర్ 14, పది వేలు అనుకుంటే 10 పవర్ 15 (క్వాడ్రిలియన్ ) అవుతుంది.
అయితే ఆక్షన్ పొటెన్షియల్ ఆరంభంలో సోడియం అయాన్లు నాడీకణం లోపలికి, అంతంలో బయటికి వస్తాయన్నమాట.
వివరణలకి చాలా థాంక్స్.
ఒక చిన్న అభ్యర్థన. సైన్స్ పాపులరైజ్ చెయ్యాలన్న లక్ష్యం తో మేము ఒక బ్లాగ్ నడిపిస్తున్నాం. (www.scienceintelugu.blogspot.com)
తెలుగులో సైన్స్ లో రాసేవాళ్లు చాలా తక్కువ. మీరు చాలా చక్కగా రాస్తున్నారు.
ఆ బ్లాగ్ కి మీరు ఏవైనా వ్యాసాలు రాయగలరా? మీ ఈమెయిల్ ఐడీ తెలిపితే మిమ్మల్ని ప్రత్యేకంగా కంటాక్ట్ చేస్తాను.
Rohiniprasad Aug 25, 2009 4
శ్రీనివాస చక్రవర్తిగారూ,
మీ సైట్ ఇప్పుడే చూశాను. పూర్తిగా ఇంకా చూడలేదు. మళ్ళీ రాస్తాను.
ఏపీ వీక్లీ కోసమని వారానికొక సైన్సు వ్యాసం రాస్తున్నాను. వాటిలో కొన్ని పుస్తకరూపంలో వచ్చాయి.
http://rohiniprasadkscience.blogspot.com/2008/06/18-208-50-3-airmail-520-002.html
తక్కినవి మరొక 4 సంపుటాలుగా త్వరలోనే రాబోతున్నాయి.
సైన్సును వ్యాప్తి చెయ్యడం చాలా అవసరం.తెలుగు పాఠకులకు ఆసక్తి కూడా ఎక్కువే. అందుకే కాబోలు నా మొదటి సంపుటం వెయ్యి కాపీలూ నాలుగు నెలలలోనే అమ్ముడై రెండో ఎడిషన్ వేశారు. మీ ప్రయత్నానికి వీలైనంతవరకూ సహాయం చెయ్య ప్రయత్నిస్తాను.