ఆకురాలు కాలంలో చెట్ల ఆత్మ విశ్వాసం – నారాయణస్వామి ‘సందుక’

“తీరా గాల్లో
ఎగరడం ప్రారంభించాక గాని
భూమ్మీద ఏమి
వదలి వచ్చామో
తెలియదు”
అంటూ తానిప్పుడు నిరంతర, ప్రత్యక్ష సంబంధంలో లేని జీవితాన్ని, స్థల కాలాల రీత్యా కొంత పరాయిదయిపోయిన జీవితాన్ని గొప్ప ఆర్ద్రతతో వ్యక్తం చేసిన నారాయణ స్వామి కవితా సంపుటి ‘సందుక’.

అందరం ఎగరడానికి ప్రయత్నిస్తున్న వాళ్లమే. విమానం ఒక వాహనం, ఒక ప్రతీక. అనుకుంటాం గానీ, సొంత ఊరూ దేశం వదిలి పో(రా)వడానికి మనల్ని ఆకర్షించేది ‘డాలర్ల గరగరలు’ కాదు. అసలు కారణం ‘ఉన్న చోటు’ నుంచి వెళ్లిపోవాలనే కోరిక, ఉన్నది కాకుండా మరొకటి కావాలనే కోరిక.

ఎంత ఎగిరినా ఎక్కడో ఒక చోట వాలక తప్పదు. ఎన్ని వేల మైళ్ల ఎత్తున దూసుకుపోయినా విమానం ఒక చోట ల్యాండ్ కాక తప్పదు. కొత్తచోటు కూడా కొన్నాళ్లకు… బహుశా కొన్ని రోజులకే… వర్తమానం అయిపోతుంది, ‘ఉన్నచోటు’ అయిపోతుంది.

కోరిక కల వంటిది. కలలో ముందుకెళ్తాం. వెనక్కీ వెళ్తాం. అంతా మిక్సప్ అయిపోతుంది. మళ్లీ, కొత్త ‘ఉన్నచోటు’ నుంచి ఎగిరి పోవాలని కోరిక దహిస్తుంటుంది. ఎగరడం ‘రేప’టికి కావచ్చు. ‘నిన్న’టికి కావచ్చు. ఈ తపనకు నిన్న, రేపుల మధ్య తేడా వుండదు. కలల్లో, కోరికల్లో కాలం సరళ రేఖ కాదు.

మనస్సు ఎగిరి వాలడానికి పనికొచ్చే కొమ్మలు గ్యాపకాలు. కాల్పనిక జీవులు, కవులు అందంగా చెప్పడమే గాని; గతంలో అంతా మంచివే వుండవు. అంతా అందమైనవీ, పసందయినవీ అయివుండవు. గతంలో అన్నీ అట్టాంటివే అయివుంటే, అక్కడి నుంచి ఎగిరిపోయేవాళ్లమే కాదు కదా.

మంచివే, అందమైనవే, ఇష్టమైనవే గ్యాపకం ఉంటాయి. అప్పటికి మామూలువి, అందమేమీ లేనివి కూడా గ్యాపకాల రూపం పొందాక అందగిస్తాయి. అసలేమీ బాగోలేనివి గ్యాపకాల్లో వున్నా వాటిని పక్కకు తోసేసి వ్యక్తీకరణ పొందకుండా చూసే ఒక మెకానిజం మన మనస్సులలో నిరంతరం పని చేస్తుంటుంది.

నారాయణ స్వామి ‘సందుక’ అలాంటి ఒక గ్యాపకాల పెట్టె. ఇప్పటి తన ‘విదేశీ’ నేల మీద, ‘విదేశీ’ కాలం మీద నిలబడి తన గ్యాపకాల పెట్టె తెరిచి ఒక్కొక్క వస్తువునే హృద్యంగా పరిచయం చేశాడు నారాయణ స్వామి. అందులో “తిన్నవా బిడ్డా అంటూ/ వీపు నిమిరే నాయనమ్మ/ తొక్కులాట” వుంటుంది. “ఎప్పుడో కాని కాలానికి/ మత్తడి దుంకే/ మన వూరి చెరువు” వుంటుంది. “ఒకటో రెండో/ సగం చిరిగిన/ కరపత్రాలు” కూడా వుంటాయి.

నారాయణ స్వామి ‘సందుక’ లో వ్యక్తి యొక్క (పర్సనల్ ) రోజువారీ జీవితం ఉంది. తన యవ్వన కాలాన్ని వెలిగించి కొన్నాళ్లు తనను కలిపేసుకున్న సామూహిక (పోరాటాల) జీవితం వుంది. వీటన్నిటినీ అప్పటి కళ్లతో కాకుండా, తన ఇప్పటి కళ్లతో చూసి కవిత్వమయ్యాడు స్వామి. దీని వల్ల కవికి ఉపయోగపడే ఒక పనిముట్టు స్వామికి ప్రత్యేక ప్రయత్నం లేకండానే దొరికిపోయింది.

ఆ పనిముట్టు మరేమో కాదు. ‘ఔట్ సైడర్ గుణం’ అనే మానసిక విశేషం. ఊరు, చెరువు, ఇల్లు, కుటుంబం, ఉద్యమ జీవితం… ‘సందుక’లో కనిపించేవన్నీ తనవే గాని ఇప్పటి తనవి కాదు. అప్పటి తనవి. వాటి బాగోగులు ఇప్పటి తన బాగోగులను నిర్ణయించవు. వాటిలో తను (ఇప్పుడు) ఇంటరెస్టెడ్ పార్టీ కాదు. ఔట్ సైడర్. స్థల కాలాలు రెండింటి రీత్యా తానిప్పుడు ఆ జీవితాలకు బహు దూరంలో ఉన్నాడు. ఈ భౌతిక వాస్తవం ఔట్ సైడర్ గుణానికి మంచి ఊతమిచ్చింది. ఆకాశం నుంచి భూమిని చూసే అవకాశం దొరికింది కవికి.

ఈ గుణం అబ్బక పోయివుంటే స్వామి “ఎప్పుడు మొదలవుతుందో తెలియని తోలుబొమ్మలాట” కోసం వేదిక ముందు కూర్చుని ఎదురు చూస్తుండే వాడు. “చావు బ్రతుకుల/ చిట్ట చివరి అంచు మీద/ మెరిసే పొడుగాటి శతృవు నీడల్లో/ పొగ చూరిన దిక్సూచుల” గురించి; “చలన రాహిత్యం లోకి వడి వడిగా/ పరుగెత్తే సామూహిక ఊరేగింపు దృశ్యాల” గురించి; ఇంకా, మరింత నిర్మొహమాటంగా, “ఎన్నడూ ఆరంభం కాని ప్రయాణపు/ ప్రాచీన గ్నాపకాల పేటికల్లో/ రెపరెపలాడే నెమలి కన్ను/ గమ్యాల” గురించి… ఇలా తడి కలిగిన భాషలో మాట్లాడగలిగేవాడు కాదు.

“వేయకుండానే/ అడుగులు/ జారి పోతున్న”ప్పుడు, “మోయకుండానే / భుజాలు/ కుంగి పోతున్న”ప్పుడు… అప్పుడు కూడా… “మనం ఏది కోల్పోయామో/ అది ఒక/ జీవిత కాల వాంఛా దుఃఖం” గా మనతో వుండి పోతుందంటాడు స్వామి. తన కవిత్వంలో ఈ దుఃఖమే అడుగడుగునా కనిపిస్తుంది, మనల్ని కదిలిస్తుంది.

పోరాటాన్ని అతి సహజం, అనివార్యం చేసే జీవితం ఒకటుంది. పలు వైఫల్యాల పర్యవసానంగా, ఇండియాలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో అది ఇంకా పదిలంగానే వుంది. అలాంటి జీవితంలోంచి వచ్చిన పలువురు తెలుగు యువకులలో నారాయణ స్వామి ఒకరు. దానికి ఆనవాళ్లు ‘సందుక’ నిండా దొరుకుతాయి. వాటిని తీసేసి చూస్తే స్వామి బాధ వెనుక అసలు కారణాలు మనకు తెలిసి రావు. ఉద్యమ కవిత్వంలో అప్పుడప్పుడు కనిపించే వట్టి రొమాంటిక్ దుఃఖమే ఇదీ అనుకోడానికి అవకాశం వుంటుదప్పుడు. స్వామి వేదన వాస్తవ జీవితంలోంచి వచ్చిందనడానికి ఈ జీవన స్పర్శ రుజువు. ‘సందుక’లో స్వామి కట్టిన మాటల బొమ్మలకు ఆ జీవితమే ప్రాణం, ప్రణవం.

లేమిని కాదని ఉబికే వూరి సంబంధాల ఆత్మీయతలు, అంతటి ఆత్మీయతలు సైతం కప్పి వుంచలేని ఊరి పేదరికం, వెనుకబాటు తనం, ఒకప్పుడు ‘ఇక్కడొక చెరువు ఉండేద’ని బాధగా తలపించే పర్యావరణ విధ్వంసం, దుస్థితిని అధిగమించడానికి వూరు చేసే ప్రయత్నాలు, ఆ పోరాట కెరటాల మీద పూచే మనుషుల మంచితనాలు, అసలు పోరాటం ఆరంభమయ్యీ కాకముందే నిలవ నీరుగా మారిపోతున్న వైనాలు… ఇలా ఎన్నొన్నో ఉద్వేగాలు ‘సందుక’లో ఇమిడి పోయాయి.

“వేదన లేని రేపటిని/ పుష్పించే స్వప్నాన్ని/ వ్యధా రహిత క్షణాల్ని/ ప్రేమించే కొత్త ఆశల్ని/ కంటి నిండా దుఃఖించాలి” అనడంలో వుంది ఒక మనస్వికి మాత్రమే సాధ్యమయ్యే అందమైన విరోధాభాస. స్వామిది వట్టి ఆవేశం కాదు. నిజమైన దుఃఖంలోంచి పుట్టిన ఆవేశం. తన విమర్శ కూడా దుఃఖం భాషలోనే వుంటుంది.

ఇది విజయోత్సవ వేళ కాదు. వ్యక్తిగా డాలర్లు పండించగలగడంలో పెద్ద విజయమేమీ లేదు. అందుకోసం తనకు తాను కాందిశీకుడై పోగొట్టుకున్న స్థానికత్వ సౌందర్యాని ఎన్ని డాలర్లూ తెచ్చిపెట్టలేవు. తనకు తాను కాందిశీకుడు కావడంలో తిరోగమనమంటూ ఏదయినా ఉంటే, ఆ తిరోగమనం తన ఒక్కడిది కాదు. తాను ప్రేమించే ఉద్యమంలోనూ తిరోగమనం ఉంది. ఉద్యమాన్ని విమర్శించడమంటే పోరాటం అనవసరమని చెప్పడం కాదు. పోరాటం లేదని చెప్పడమూ కాదు. అది ఏమేరకు అవసరమో ఆ మేరకు సజీవంగానే ఉంది. అవసరాన్ని నెరవేర్చవలసిన జీవితం ‘సజీవం’గానే ఉంది. ‘తోలుబొమ్మలు’ కట్ట గట్టుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లండని చెప్పే నిరాశ స్వామి కవితలో లేదు.

విమర్శ, ప్రేమ పడుగు పేకలా కలిసి పోయిన దృష్టి ’సందుక’ కవిది. ప్రేమ లేని విమర్శ నిరంకుశం. విమర్శ లేని ప్రేమ బానిసత్వం. ఎంతో కొంత ‘ఔట్ సైడర్’ కావడం వల్లనే స్వామికి ఈ సరైన దృష్టి సాధ్యమయింది. ఈ దృష్టి ఇంకా నిర్దిష్టమయ్యే కొద్దీ స్వామి కవిత మరింత పదును దేరుతుంది.

“కాల్చేసిన వంతెనలు/ దాటాల్సిన/ అగాధాల్ని గుర్తుచేస్తాయం”టాడు స్వామి. నిజమేగాని, బొమ్మను తిరగేసి చూడడం అవసరం. దాటాల్సిన అగాధాలు తిరిగి తిరిగి కట్టాల్సిన వంతెనల్ని గుర్తు చేస్తాయి. బహుశా అందుకే, స్వామి “అనాది ఆగ్రహాన్ని వర్షించే/ ఒక అఖండ వర్షధార కోసం/ దోసిలి చాస్తున్నా”నంటాడు. ఆగ్రహ వర్షధార అఖండంగా వుండే అవకాశం లేదు. అఖండత్వం కోసం ఏ ప్రయత్నమైనా సరే, ఎప్పటికీ మొదలు కాని తోలుబొమ్మలాట కాక తప్పదు. “అగాధాల్ని గుర్తుచేసే/ కాలిన వంతెనల చివరి/ ఆనవాళ్ల” కోసం ప్రయత్నం కూడా అనవసరమే. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేశారో సమీక్షలు అవసరం లేదు. వాటి జోలికి పోవడమంటే కూలిన బాబెల్ టవర్ల కింద మళ్లీ మళ్లీ నలిగిపోవడమే. అలాంటప్పుడే, స్వామి అన్నట్లు “చుట్టూ శబ్దమయ ప్రపంచమే/ అర్థమయ్యే మాటలుండవు”. జీవితం ప్రశ్నలు వేయడమే కాదు, తనవైన జవాబులూ చెబుతున్నది. వినాలి. ఎవరికి వాళ్లం, ఎక్కడ ఉన్న వాళ్లం అక్కడి నుంచే అలాంటి జవాబులం కావచ్చు. అసాధ్యం కాదు. “సన్నగిల్లుతున్న నమ్మకాలకు/ దీటుగా/ ప్రపంచమంతా/ మన వూళ్లను నాటొచ్చు”. అసాధ్యం కానే కాదు.

నిజానికి, స్వామి ‘సందుక’ అలాంటి ‘ఆత్మ విశ్వాసా’ న్ని అందించ గలిగింది. అమెరికాలో ఆకురాలు కాలం (Fall) నిజంగానే ఆకులు రాలిపోయే కాలం. ఎక్కడా ఒక పువ్వు, ఒక ఆకు లేకుండా చెట్లన్నీ దిశమొలల్తో నిలబడతాయి. ఇళ్ల ముందు లాన్లలో గడ్డి కూడా ఎండు రంగు సంతరించుకుంటుంది. కొన్ని రోజులు మరీనూ. ఇళ్ళు, బయళ్లు… నేల సమస్తం తెల్లని మంచు దుప్పటి కప్పుకుని జీవసమాధ్యవస్థను తలపిస్తుంది. ‘సందుక’లో ఈ కాలాన్ని ఆవిష్కరించిన చక్కని పద్యమొకటి ఉంది. పద్యం చివరి స్టాంజాలో స్వామి మాటలు అమెరికన్ ఆకురాలు కాలానికే కాదు అన్నిటికీ, అందరికీ వర్తిస్తాయి.

“చిటారు కొమ్మమీంచి
రాలిపోయే చిట్ట చివరి ఆకుల
వెచ్చని ఊపిరిని
ఆకురాలు కాలం
ఆర్తిగా స్పృశిస్తుంది.

చిగుళ్లని నెత్తురులో దాచుకున్న
మొండి చేతుల చెట్ల
ఆత్మ విశ్వాసాన్ని
ఆకురాలు కాలం
నిటారుగా నిలబెడుతుంది.”

4 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

4 అభిప్రాయాలు

  1. vimala Apr 12, 2008 1

    మీ సమీక్ష బాగున్నది.

  2. buchi reddy Apr 14, 2008 2

    సమీక్ష బాగుంది. సందుక యెన్ని సార్లు చిదివినా మల్లీ చదువాలినిపిస్తుంది.

    - బుచ్చి రెడ్డి

  3. pravallika Apr 16, 2008 3

    sanduka lopata emunnado vippi cheppina hrk ki thanks sanduka telangana sanskruthiki nidarshanam, pedda manushula anubhavalu andulu dagi untai

  4. desaraju May 21, 2008 4

    సమీక్ష బాగుంది. చాలా ఫ్రేమతో రాసారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో