భారతీయ భాషా పరిషత్‌ యువ పురస్కారం - సుంకోజి దేవేంద్రాచారి స్పందన

భారతీయ భాషా పరిషత్‌, కలకత్తా - యువ పురస్కారం 2007కు స్పందన

పరిచయం:
పేరు: సుంకోజి దేవేంద్రాచారి
జననం: 24-07-1974
తల్లిదండ్రులు: ఈశ్వరమ్మ, రెడ్డెప్పాచారి
భార్య, కూతురు: దేవిక, యుక్త
విద్య: ఇంటర్మీడియట్‌
స్వస్థలం: గుడ్రెడ్డిగారిపల్లె, కెవి పల్లె మండలం, చిత్తూరు జిల్లా
నివాసం: 6-76, మిద్దెపైన, సాయినగర్‌, తిరుచానూరు పోస్టు, తిరుపతి.
వృత్తి: పత్రికారంగం
ప్రవృత్తి: సాహితీవ్యాసంగం
రచనలు: 48 కథలు, 40 కవితలు, రెండు నవలలు, గ్రామీణ క్రీడలపై రాసిన 28 కథనాలు
బహుమతులు: తెలుగుపలుకు (ఆస్ట్రేలియా), తానా (అమెరికా), ఆటా (అమెరికా), పులికంటి సాహితీ సంస్కృతి, ఆర్‌.ఆర్‌. కృష్ణమూర్తి స్మారక సంస్థ (విశాఖపట్టణం) తదితర సంస్థలతో పాటు వివిధ పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో దాదాపు 20 వాటికి బహుమతులు లభించాయి.
అవార్డులు: రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖచే రాష్ట్రస్థాయి ఉత్తమ యువ రచయిత (2005)
ప్రచురించిన పుస్తకాలు: మనమంచి ఆటలు, అన్నంగుడ్డ కథల సంపుటి

సభకు నమస్కారం, నాకు ఇక్కడకు వచ్చే అవకాశాన్ని కల్పించిన భారతీయ భాషాపరిషత్‌కు, ఈ కార్యక్రమ నిర్వాహకులకు, నన్ను తెలుగునుంచి నామినేట్‌ చేసిన ప్రముఖ కవి కె. శివారెడ్డిగారికి, విమర్శకులు చేకూరి రామారావుగారికి, ద్రవిడ వర్శిటీ విసీ గంగిశెట్టి లక్ష్మీనారాయణగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

కలకత్తా నగరం గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నదే… చూసింది ఇదే మొదటిసారి… శరత్‌ సాహిత్యం చదువుతున్నప్పుడు, రవీంద్రుని చదువుతున్నప్పుడు, రామకృష్ణ పరమహంసను, వివేకానందుని చదువుతున్నప్పుడు, మదర్‌ థెరిస్సాను చదువుతున్నప్పుడు జీవితంలో ఒక్కసారైనా కలకత్తాకు పోయి రావాలి అనుకునే వాడిని. చిన్నప్పటినుంచీ కలలు కనడం చాలా ఇష్టం. అయితే ఎప్పుడూ ఆ కలలను వ్యక్తం చేసేవాడిని కాదు. ఎందుకంటే కలలన్నీ సాధించుకోవడం సాధ్యంకాదు కాబట్టి. అలా కలకత్తా చూడాలనే కోరిక కూడా కలలకే పరిమితమైపోయింది. కనీసం పక్క జిల్లాలకు కూడా ఎప్పుడో తప్ప పోని నేను…. దాదాపు 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కలకత్తా వాస్తానని, ఇక్కడిగాలి పీలుస్తానని, ఇక్కడి నీళ్లు తాగుతానని, ఇక్కడి మనుషులతో మాట్లాడుతానని… కలలో కూడా వూహించలేదు. అంటే ఈ ప్రయాణం నా వూహకు అందనిది. అందదనుకున్నది అందుతున్నప్పుడు, అనుకోకుండా అందలం ఎక్కినప్పుడు కలిగే ఆనందం అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను అలాంటి స్థితిలోనే ఉన్నాను.

నాకు యువ పురస్కారం ప్రకటించిన విషయం తెలుస్తానే ఎన్‌. వేణుగోపాల్‌ గారికి ఫోన్‌ చేసి చెప్పాను. తను సామాజిక, రాజకీయార్థిక విశ్లేషకుడు, సాహితీ విమర్శకుడు కూడా. ఆయన చాలా సంతోషించారు. నా పరిచయం ఇంగ్లీషులో రాసి, కలకత్తాలో యువ పురస్కారం ప్రధానోత్సవంలో పంచుదాం అన్నారు. నాకు ఇంగ్లీషు రాదు కదా అన్నాను. అందుకతను ”నీకు కథలు రాసేది వచ్చుకదా. చాలు… నువ్వు రాసేది రాసినావు… మిగిలింది మేము చేస్తాంలే” అన్నారు.
 
నా రచనలకు కలకత్తా వరకు నన్ను రప్పించే శక్తి ఉందా? అని నేను ప్రశ్నించుకున్నాను. సమకాలీన సాహిత్యంతో నా రచనలను బేరీజు వేసుకున్నాను. ఇంతకూ నేనేం రాసినాను…? ఎందుకు రాసినాను…? సమాజాన్ని ఎలా అర్థం చేసుకున్నాను? అనే ప్రశ్నలు వేసుకున్నాను. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో నన్ను నేను ఉన్నతీకరించుకోవడానికి, నా వేదనలను వ్యక్తం చేసుకోవడానికి సాహిత్యాన్ని మాధ్యమంగా వాడుకున్నాను అనిపించింది.

నా దృష్టిలో రచయిత పారదర్శకంగా ఉండాలి. రచనలు చదివితే రచయితతో మాట్లాడినట్టు, రచయితతో మాట్లాడితే అతని రచనలు చిదివినట్టూ ఉండాలి. ఈ నేపథ్యంలో నా కథల్లో ఎక్కువ ఆత్మకథాత్మకమైనవే. ఈ సంపుటంలోని 13 కథల్లో ఆరు కథలు నా జీవితంలోంచి ఏ మాత్రం కల్పన తేకుండా రూపొందాయి. మరో రెండు కథల్లో దాదాపు సగభాగం సీయానుభవాలే.

నా కథల నేపథ్యమంటే నా జీవత నేపథ్యమే.

అందుకని మీకు నా జీవిత నేపథ్యాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తాను.

మేము ఆచార్లం… మానాన్న కొయ్యపని చేసేవాడు. కొయ్యపనంటే శిల్పాలు చెక్కడం కాదు, రైతులకు అవసరమయ్యే నాగళ్ళు తాయారు చేసేవాడు. ఎద్దుల బండ్లు తయారు చేసేవాడు. సాదాసీదా ద్వారబంధాలు, కిటికీలు, తలుపులు చేసేవాడు.

మా బంధువుల్లో ‘సుంకోజి’ వంశంలో మానాన్న ఒక్కడే ఉన్నాడు. ఆయనకు అన్నదమ్ములు లేరు. అందుకని నేనంటే చానా ఇష్టం. నా కంటే అక్క పెద్దది. నా తర్వాత 13 సంవత్సరాలకు ఇద్దరు తమ్ముళ్లు పుట్టారు.

మాది ఆగర్భ దరిద్ర కుటుంబం. నాన్న సంపాదన పస్తులు లేకుండా చేయలేక పోయింది. వంటికి చిరుగుల్లేని బట్టలు ఇవ్వలేకపోయింది. ఎన్నో రోజుల పస్తులు. నాన్న కొయ్యపనితో పొట్టగడవడం ఇబ్బందిగా మారడంతో పల్లెలోనే రైతుల పొలం కౌలుకు తీసుకున్నాడు. నాక్కు (ఒకటికి ఒకటిన్నర బస్తాలు కాయలు) వేరుశనగ కాయలు ఇచ్చేలా అదే రైతు దగ్గర తీసుకుని సాగు చేశాడు. ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. పంట దిగుబడి చానా తక్కువ. ఎంత అంటే ఆ రైతుకు తిరిగి చేతిగుండా నాన్న డబ్బు కట్టించాడు. అప్పుడు నా వయస్సు ఏడేళ్ళు. నేను పెద్దయ్యేకొద్దీ తూకాల్లో మోసాలు, పంటలకు గిట్టుబాటు ధరలేకపోవడం గమనిస్తూ వచ్చాను. ఇవన్నీ కలిపే ‘గొంగళిపురుగు’ కథ రాశాను.

దరిద్రం అన్నాను కదా…

ఇటీవల ఒక మిత్రుడు అన్నాడు ”నువ్వు పదేళ్ల ముందు వేయాల్సిన బట్టలు ఇప్పుడు వేస్తున్నావే” అని.
 
”నిజమే” అన్నాను.

నా బాల్యమంతా ఎప్పుడూ చిరుగుల బట్టలే. నాకు బాగా గుర్తు. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు మా మండలంలో ‘బ్యాంకింగు రంగంలో నెహ్రూ సేవలు’ అనే అంశంపైన వక్తృత్వ పోటీ పెట్టారు. మూడు స్కూళ్ల పిల్లలం పోటీ పడ్డాం. నాకు ప్రథమ బహుమతి వచ్చింది. నాలుగు రోజుల తర్వాత సభ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ చేతులమీదుగా బహుమతి అందుకున్నాను. అప్పుడు నేను వేసుకోనుండే డ్రాయర్‌కు రెండు పిర్రలవద్దా చిరుగులు పడ్డాయి. దాన్ని మా అమ్మ మాసికలువేసి కుట్టింది.

నాకు ఇద్దరు తమ్ముళ్లని చెప్పాను కదా. అంతకు ముందు అమ్మా, నాన్న పనికి పోయేవాళ్ళు. చిన్న తమ్ముడు పుట్టాడు. అమ్మ బాలింత. అమ్మ కూడా పనికి పోతేకానీ మాకు కడుపులు నిండేది అంతంతమాత్రమే. అందుకని అమ్మ స్థానంలో సెలవుల్లో నేను నాన్న వెంట పనికి పోయేవాడిని. అప్పుడు నేను ఎనిమిది పరీక్షలు రాశాను. వేసవి సెలవులు, 20 ఏళ్ళనాటి సంగతి ఇది. ఆ రోజు పొద్దున్నే సద్ది తాగినాం. ఇంట్లో బియ్యంలేవు. నాన్న నేనూ రెండు మైళ్ళ దూరంలో ఉండే పల్లెకు పనికి పోయినాం. మధ్యాహ్నం అన్నం లేకుండా పని చేసినాం. కడుపునిండా నీళ్లు తాగినాం…. సాయంత్రం వాళ్లు ఇరవై రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు నేను డ్రాయర్‌ జేబులో పెట్టుకున్నాను. ఇద్దరం ఇంటికి వచ్చినాం. కాళ్లుచేతులు ముఖం కడుక్కున్నా. రెండు కేజీల బయ్యం. రెండు రూపాయలకు నూనె, రెండు రూపాయలకు కందిపప్పు, చింతపండు, ఉప్పు తెమ్మని చెప్పింది అమ్మ. సంచి తీసుకుని అంగడికి బయలుదేరుతూ జేబులో చేయిపెడితే డబ్బులేదు. కంగారుగా పరిగెత్తుతూ మేము పని చేసిన పల్లెకు వెతుక్తుంటా వెళ్ళాను. కనిపించలేదు. తిరిగి వస్తున్నాను. నాన్న సగం దోవలో ఎదురు వచ్చాడు. బాలింత అమ్మ, తమ్ముళ్లు.. పస్తులు.. అన్నీ తలచుకుని వెక్కిళ్లు పెట్టి ఏడ్చాను. నాన్న సముదాయించాడు.

నేను పదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్ష ఫీజు ఇరవై రూపాయలు. ఆ ఇరవై రూపాయలు కట్టలేదని నన్ను ప్రధానోపాధ్యాయుడు తరగతిలోనించి ఇంటికి పంపించేశాడు. తర్వాత రోజు కూడా ఇరవై రూపాయలు లేకుండా బడికి పోయాను. సచరిత అనే అమ్మాయి ఇరవై రూపాయలు కట్టింది. అయితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నేనే ప్రథమ స్థానంలో నిలిచాను.

నా చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలు మేమే కొనుక్కోవాల్సి ఉండేది. అతికష్టం మీద నాన్న పాఠ్యపుస్తకాలు తీసిచ్చాడు. నోటు పుస్తకాలు? మా సామాన్యశాస్త్రం అయ్యవారు 30 రూపాయలి ఇచ్చారు. అయితే దరదృష్టవశాత్తు ఆయనకు నాలుగు నెలలకంతా బదిలీ వచ్చింది. బదిలీకి కారణం కూడా అగ్రవర్ణ పెత్తనాన్ని ప్రశ్నించడమే. నేను ఆ అయ్యవారికి 30 రూపాయలు బాకీ ఉన్నాను కదా, తీర్చాలి. నాలుగు రోజులు బడికి సెలవు పెట్టాను. నాన్న నేను కలిసి పల్లెలో వేరుశనగ పొలంలో చెట్లు పీకేదానికి ఒప్పుకున్నాం. రేయింబగలూ పని చేశాం. చేతులకు బొబ్బలు వచ్చాయి. డబ్బు తీసుకుని నాలుగురోజుల తర్వాత వెళ్తే ఆ ఉపాధ్యాయుడు ఇల్లు ఖాలీ చేసి వేరే వూరు వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నేను ఆయనకు బాకీనే. నా ‘బాకీ’ కథకు అదే మూలం.

21 కిలోమీటర్ల దూరంలోని పీలేరులో ఇంటర్‌లో చేరాను. పావు బియ్యంతో అన్నం చేసుకునేవాడిని. దానినే మూడుపూటలా తినేవాడిని. కొన్ని సందర్భాల్లో ఆ అన్నం కూడా దొరికేది కాదు. ఒకసారి రెండు రోజులు అన్నం లేదు. రోడ్డుమీద నడుస్తూ ఆకలికి శోషవచ్చి పడిపోయాను. అక్కడి ఇంట్లో వాళ్ళు లేపి కూర్చోబెట్టి నీళ్లు తాపారు. కాసేపటికి తెప్పరిల్లాక మిత్రుని గదికి వెళ్ళి అన్నం తిన్నాను. ఇంటర్‌లో మాకు రసాయనశాస్త్రం అధ్యాపకుడు ఉన్నా సరిగా చెప్పేవాడు కాదు. భౌతికశాస్త్రం అధ్యాపకుడు లేడు. డబ్బు ఉన్నవాళ్లు ట్యూషన్‌కు వెళ్లారు. నెలకు 60 రూపాయలు. ఆ స్థోమతలేక నేను ట్యూషన్‌కు పోలేదు. తరగతిలో పాఠాలు చేప్పే అధ్యాపకుడు లేడు. దీంతో ఇంటర్‌లో పరీక్ష తప్పాను.

పరీక్ష తప్పానని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే మానాన్న ధైర్యం చెప్పాడు. తాతల కాలంనించీ పని చేసుకునే బతుక్కుంటా ఉండాంకదా… ఎందకు బాధపడతావు అన్నాడు. నిజమే అనుకున్నాను. నాన్న వెంట పనికి పోవడం మొదలు పెట్టాను. అయితే నాన్నకు అప్పుడు తెలీలేదు., ఆధునిక యంత్రాల ప్రభావంతో పల్లెల్లో తన అవసరం లేకుండా పోతా ఉందనే విషయం. ఆ అనుభవాలే ‘అన్నంగుడ్డ’ కథ.

ఒక్క సంవత్సరం చదువు లేకుండా ఇంటిదగ్గరే ఉన్నాను. నా జీవితంలో చాలా బాధపడ్డరోజులవి. ఇంట్లో ఇద్దరు చిన్న తమ్ముళ్లు.. పెళ్ళికాని అక్క.. పనులు లేవు.. నాన్నకు, అమ్మకు విడవని జ్వరం. నేనొక్కడినే శారీరకంగా ఆరోగ్యంగా ఉండేది. ఇంతమంది పస్తులతో, అనారోగ్యంతో బధపడతా ఉంటే చూస్తా ఉండలేకపోయాను. అట్లని డబ్బు వచ్చే మార్గమూ లేదు. జీవితంపైన విరక్తి. పుట్టింది మొదలు ఎప్పుడూ కష్టాలూ కన్నీళ్లేనా.. ఎతకాలం ఇలా.. ఎప్పుడూ ఇంతేనా.. కులవృత్తి కూడు పెట్టేలాలేదు. చదువూ లేదు. నాకయితే భవిష్యత్‌ ఆశాజనకంగా కనిపించలేదు. ఎందుకిలా బాధలు పడుతూ బతకడం? చనిపోవాలనుకున్నాను. అలాంటి బలహీన మానసిక స్థితిలో ఉన్నప్పుడు మిత్రుడు యాదగిరి వచ్చాడు. అతను తిరుపతిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నేను విషయం అంతా చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాను. ఈ దరిద్రంలో జీవించలేను. చనిపోతాను అన్నాను. అతను ధైర్యం చెప్పాడు. భవిష్యత్తు బాగుంటుందన్నాడు. యాదగిరి తిరుపతికి పోతానే ఐటిఐలో చేరడానికి రమ్మని ఉత్తరం రాశాడు. అలా తిరుపతికి చేరుకున్నాను.

రెండేళ్లు ఐటిఐ ఐపోతానే అక్కడే మా మామ వాళ్ళదగ్గర ఉండి కొయ్యపని చేయడం మొదలు పెట్టాను. నాకు బొమ్మలు గీయడం ఇష్టం. నేను చిత్రకారుడిని కావలసిన వాడిని వడ్రంగం పనిలోని దిగాను. రోజును యాభై రూపాయలు ఇచ్చేవాళ్లు. చిత్రకళ నేర్చుకుందాం అని వెళ్లి ఒకతడిని అడిగాను. స్వంత ఖర్చులతో వస్తే నేర్పిస్తానన్నాడు. నాకు డబ్బు తక్షణం అవసరం కావడంతో కొయ్యపనిలోనే ఉండిపోయాను.

1994 జులై 26 నుంచి 2002 సెప్టెంబర్‌ 15 దాకా కొయ్యపనితోనే జీవించాను. ఆ అనుభవాలే ‘సానరాయి’ కథ రాయడానికి ఉపయోగపడ్డాయి. ‘రాబందులు’ కథలో రామచంద్ర పాత్ర కూడా కార్పెంటర్‌గా ఉన్నప్పటికి నా అనుభవాలే. నాకు 1998 డిసెంబర్‌లో దేవికతో వివాహం అయింది. మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్ళి. అప్పటికే నాకు ఆర్నెల్లుగా దగ్గు. స్వరం పోయింది. మిత్రులు యాదగిరి, జలపతి సివిల్‌ సర్వీసెస్‌ కోచింగు కోసం హైదరాబాదులో ఉండే వాళ్లు. నాకు అక్కడ గాంధీ ఆసుపత్రిలోని పెద్ద ప్రొఫెసర్‌ దగ్గర చూపించారు. అతను టెస్ట్‌లు చేసి వేయి రూపాయల ఫీజు తీసుకుని మందులు రాసిచ్చాడు. దగ్గిదగ్గి రెండో వోకల్‌కార్డ్‌ వీక్‌ అయి మాట పోయిందన్నారు. అప్పుడు నేను మాట్లాడినా శబ్దం వచ్చేది కాదు. మూడు నెలలు మందులు వాడాను. మళ్ళీ హైదరాబాదుకు వెళ్ళాను. తిరిగి అతను రెండు నెలలు మందులు వాడమన్నాడు. వాడాను. ఫలితం లేదు. గొంతుపూర్తిగా పోయింది. మనిషి మనిషి అస్థిపంజరంలా మారిపోయాను. ఇప్పుడు నాబరువు 70 కెజీలు. అప్పుడు 43 కేజీలు. ఎలా ఉంటానో మీరే ఊహించుకోండి. అలాంటి స్థితిలో ఒకరోజు నా మిత్రుడు యాదగిరి తిరుపతికి వచ్చాడు. (అతనప్పటికి నిరుద్యోగి. ఎంపీడీవో ఉద్యోగం వచ్చినా పోస్టింగు ఇవ్వలేదు). నన్ను తీసుకెళ్లి డాక్టర్‌ దగ్గర చూపించాడు అక్కడ టెస్ట్‌లు చేసి క్షయ అని తేల్చారు. అదీ బాగా ముదిరిపోయింది. చివరి దశ. రెండు ఊపిరి తిత్తులు పాడయ్యాయి. చాలా శక్తివంతమయిన మందులు ఇచ్చాడు. ఆ మందులు సైడ్‌ ఎఫేక్ట్స్‌ ఎక్కువ. నల్లగా మారిపోయాను. చిరాకు, మందులు నెల రోజులు వాడానంతే, కొద్దిగా కోలుకున్నాను. రోజుకు ఇరవై రూపాయలు అయ్యేటివి. పనిలేదు. నాపైన ఆధారపడ్డ భార్య, అందుకని రుయా ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ నెలనెలా మందులు ఉచితంగా ఇచ్చేవాళ్ళు. క్షయ ఎలా వస్తుందో అందరికీ తెలిసిందే. నేను మనుషలతో మాట్లాడం మానుకున్నాను. నేను మాట్లాడితే ఎక్కడ పక్కవారికి క్షయ వస్తుందో అనే భయం. నా గొంతు ముందులా రాలేదు. కానీ కొంచెం పర్వాలేదు. మాటల్లో స్పష్టత తగ్గింది. నేను మనుషులతో మాట్లాడడం మానుకోవడంతో తెలిసిన వాళ్లందరికీ దూరమయ్యాను. అహంభావి అనే ముద్రవేశారు. అయినా నేనేం బాధపడలేదు. చిత్రమేమిటంచే ఆరోగ్యం బాగయినా ఇప్పటికీ మనుషులతో ముందులాగా మాట్లాడలేకుండా ఉన్నాను. 2002 ఏప్రిల్‌కు క్షయ పూర్తిగా నయమయింది. మందులు వాడటం మానేశాను.

నిత్య దరిద్రునికి సమాజంలో ఎవరు మాత్రం విలువ ఇస్తున్నారు? నేను బీసీ అయినప్పటికీ పల్లెలో చాలా తక్కువగా చూడబడ్డాను. అ అనుభవాలనే ‘కడగొట్టోళ్లు’ కథగా రాశాను. 2002 సెప్టెంబర్‌లో ఆంధ్రజ్యోతిలో ఆర్‌. ఎం. ఉమామహేశ్వర రావుగారు నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ఫరవాలేదు.

పెళ్లయింది మొదలు నా శ్రీమతి దేవిక చాలా పనులు చేసింది. నా ఆదాయం సరిపోయేది కాదు కదా. తను మూడు ప్రైవేటు పాఠశాలల్లో పని చేసింది. ఎస్టీడీ బూత్‌లో, మందుల దుకాణంలో.. చివరకు మద్యం తయారు చేసే కంపెనీలో కూడా కొంతకాలం పని చేసింది. మేముండే కాలనీనుంచి ఆడవాళ్లంతా క్యారేజీలు తీసుకుని పొద్దున్నే వెళ్లేవాళ్ళు. బస్సులో వెళ్లి పని చేసుకుని సాయంకాలం వచ్చేవాళ్లు. రోజుకు డెభ్బై రూపాయలు. చాలామంది సంసారాలను గుల్ల చేసే మద్యం తయారీ కంపెనీలో పని చేయడం వలన డబ్బు వస్తున్నా, మాకు ఇష్టం ఉండేది కాదు. అందుకని దేవికను అక్కడ అగిపొమ్మని చెప్పాను. నాకు పెళ్లయింది మొదలు తిరుపతిలో ఉన్నాము. మా అక్కకు 1992లో పెళ్ళయింది. నాకు పెళ్లయ్యాక బాధ్యతలు పెరగడం, పాప పుట్టడం, సంపాదన తక్కువగా ఉండటంతో మా మధ్య రాకపోకలు దగ్గాయి. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు మాట్లాడకపోవడం, ఊర్లకు పోకపోవడంతో నన్నందరూ వేరే విధంగా ఊహించుకున్నారు. సంపాదన పెరిగేప్పటికి మనిషి రావడం మానుకున్నాడు అనుకున్నారు. ఈ నేపథ్యంలో భాథతో రాసిన కథే ‘ఎంతెంతదూరం’.

బాల్యంనుంచీ రైతులతో మా జీవితం ముడిపడి వుండేదే కదా. పల్లెల్లో చేతివృత్తులన్నీ రైతులకు అనుబంధంగా ఉండేటివే. వ్యవసాయ దారులంటే కేవలం రైతులే కాదు.. చర్మకారులు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్రంగులు.. అన్న వృత్తులను కలుపుకోవాలి. ఇలా అందరి జీవితాలతో నా జీవితం ముడిపడి ఉండటంతో దాదాపుగా అన్ని కథల్లోనూ రైతుజీవితమే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. అన్నదాత, నీడ, అభివృద్ది కథలకూ ఇదే నేపథ్యం.

కష్టాలు, కన్నీళ్లూ చాలామందికి ఉంటాయి. చాలామంది వాటిని అధిరోహించిన వారే. అయితే వాళ్లందరూ కథకులు కాలేదు.

ఇంతవరకూ నేను చెప్పింది నా కథావస్తువుల సంగతులు.

నా జీవితంలోని సంక్షోభాన్ని, నా చుట్టూ ఉన్న వాళ్ల జీవితాల్లోని సంక్షోభాన్ని ఎలా కథలుగా మలిచాను? అసలు రచయితను ఎలా అయ్యాను అనే విషయాల్లోకి వస్తాను.
 
మాది చిత్తూరు జిల్లాలోని మారుమూల మండలం. కడప జిల్లాకు సరిహద్దులో ఉంది. ఇప్పటికీ మా మండలంలో సగభాగం కడవజిల్లాలోని రాజంపేట నియేజకవర్గంలో ఉంది. మా వూరికి నాకు పదేళ్ల వయసులో కరెంటు వచ్చింది. అంతకు ముందంతా బుడ్డీదీపాలే. సాయంకాలం ఏడుగంటలకంతా అన్నాలు తినేసి దీపాలు ఆర్పేసి అందరూ పడుకునేవారు. మా నాన్న దూరంగా ఉండే పల్లెలకు పనికి పోయేవాడు. సాయంకాలం వరకు పని చేసి అక్కడినుంచి బయలుదేరేవాడు. ఇంటికి వచ్చేప్పటికి రాత్రి ఎనిమిది గంటలయ్యేది. ఈలోపు అమ్మ నన్ను, అక్కను చెరొక పక్కన పడుకోబెట్టుకొని కథలు చెప్పేది. మా అమ్మకు చదువురాదు. అయితే జానపద కథలు చాలా వచ్చు. జానపదాలు, పౌరాణికాలు ఎక్కువ చెప్పేది. దాంతో నాకు చిన్నప్పటి నుంచీ కథలంటే ఇష్టం ఏర్పడింది. మా నాన్నకూడా కథలు బాగా చెప్పేవాడు. ఆయన రెండోతరగతి వరకు చదువుకున్నాడంతే. రోజూ గజేంద్రమోక్షంతోనో, నిర్వచనోత్తరామాయణంతోనో, నరసింహశతకంతోనో మాకు తెల్లవారేది. మానాన్న తెల్లవారుజామునే లేచి వాటిని పారాయణం చేసేవాడు. నేను లేచి నాన్న బడిలో కూర్చుని వినేవాడిని. నాలుగో తరగతికి వచ్చాక నేనూ వాటిని చదవడం మొదలు పెట్టాను.

రెండో తరగతి సెలవుల్లో నేను చదివిన మొట్టమొదటి నవల ‘బాటసారి’. మా పక్కింటిలో సురేంద్రరెడ్డి అనే అతనుండేవాడు. ఆయనకు కథలంటే చాలా ఇష్టం. వాళ్ల ఇంటిలో ట్రంకు పెట్టెనిండా పుస్తకాలు ఉండేవి. అతను పదో తరగతి ఫెయిల్‌ అయ్యాడు. అందుకని అతనంటే కొందరికి చిన్నచూపు. కానీ మాకు మాత్రం ఆ పుస్తకాలు చదివే అతనంటే కథానాయకుడే. నేనూ వాటిని చదివేవాడిని. ఐదో తరగతిలో మధుబాబు నవల చదివాను. అవంటే పిచ్చి. ఏడో తరగతిలో ‘అసమర్థుని జీవయాత్ర’ చదివాను. ఎనిమిదో తరగతిలో ఉండగా కెవి పల్లెలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇక పాఠశాల లేనప్పుడు, పని లేనప్పుడు నేను అక్కడే గడిపేవాడిని.

గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చదివాను. ప్రసిద్ధుల రచనలన్నీ అక్కడ చదివినవే. అయితే వారు ప్రసిద్ధులనే విషయం అప్పుడు తేలీదు. రష్యన్‌ అనువాదాలు ఎక్కువ ఉండేవి. పానుగంటి మొదలు మాదిరెడ్డి వరకు అందరి రచనలు ఉండేవి. అనువాద నవలల్లో ప్రేమ్‌చంద్‌ రచనలు నిర్మల, కర్మభూమి, మనోరమ, సేవాసదన్‌ తదితర నవలలు నాలుగైదుసార్లు చదివాను. ఆ పుస్తకాలను మా వూరి గ్రంథాలయంలో చదివిన వ్యక్తిని నేను మాత్రమే అని లైబ్రేరియన్‌ ముంతాజ్‌బేగు గారు అనేవారు.

పత్రికల్లో కథల పోటీల ప్రకటనలు, కథలకు వాళ్లు ప్రకటించిన డబ్బు చూసినప్పుడు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేనూ కథలు రాయచ్చుకదా అనిపించేది. అలానే మొదలు పెట్టాను కూడా. ఇంటర్మీడియట్‌ చదివే రోజులనుంచే కథలను పోటీలకు పంపడం ప్రారంభించాను. కథలు చదవడం వేరు, రాయడం వేరు కదా? జీవితానుభవం, పుస్తక పఠనం ఉన్నప్పటికి కథలు రాయలేకపోయేవాడిని. 1998లో నా మొదటి కథ ‘భూమి గుండ్రంగా ఉంది’ అచ్చయింది. హామీపత్రం రాయడం, పేజీలకు ఒకవైపునే రాయాలనే విషయాన్ని, కథకులు శ్రీధర శ్రీరామకృష్ణగారు చెప్పారు. కథలు ఎలా రాయాలో కూడా చెప్పేవారు. మా ఇద్దరి దృక్పథాలు వేరు కావడంతో ఆయనతో స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదు.

1998 చివరలో తిరుపతిలో జరిగిన ఓ సాహీతీసభలో మధురాంతకం రాజారాం గారు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు, కారామాస్టారు, కొలకలూరి ఇనాక్‌గారు తదితర రచయితలు చాలామంది పాల్గొన్నారు. అప్పటికే నా కథకు ఒకదానికి ఆస్ట్రేలియాలోని తెలుగుపలుకు సంస్థ నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ విషయం తెలిసి మధురాంతకం రాజారాం గారు నన్ను వేదిక మీదకు పిలిచి ‘కథ-1997′ పుస్తకాన్ని బహూకరించారు. అందులోని కథలు నన్ను ఎంతగానో వెంటాడాయి. అప్పటికే నాకు డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని, మధురాంతకం నరేంద్ర గారు పరిచయం. నేను తరచూ నరేంద్ర గారి ఇంటికి వెళ్ళేవాడిని. గంటలుగంటలు సాహిత్య విషయాలు చర్చించుకునే వాళ్ళం. ఇప్పటికీ. 2000 సంవత్సరానికి ఆరేడు కథలు అచ్చయ్యాయి. అప్పటికి ఇంకా నావి తప్పటడుగులే. ఒకసారి మధురాంతకం నరేంద్ర గారు ”నీకేదికావాలో నీవే నిర్ణయించుకో. సీరియస్‌ సాహిత్యంలో అయితే ఎవరూ ఎవరికీ పోటీ కాదు. ఎవరి స్థానం వాళ్లదే. అయితే ఇందులో డబ్బురాదు. పాపులర్‌ సాహిత్యంలో డబ్బు వస్తుంది. సాహితీలోకం దీనిని గుర్తించదు” అన్నారు.

ఆ మాటలు నాలో బాగా ప్రభావాన్ని చూపాయి. 2001లో ఆర్‌. ఎం. ఉమామహేశ్వరరావు గారు పరిచయమయ్యారు. మధురాంతకం నరేంద్రగారు దేనిని కథా వస్తువులుగా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి లాంటి విషయాలను చెప్పారు. అయితే ఆ వస్తువులను కథల్లోకి అన్వయించే విధానం నాకు తెలిసేది కాదు. ఈ ఇబ్బందిని ఉమాగారు తొలగించారు.

”కథా వస్తువును తీసుకున్నాక, అందులోని పాత్రల్లాంటి వారు నీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటారేమో చూడు. తప్పకుండా ఉంటారు. వాళ్లను ఊహించుకుని ఆ కథను రాయి. అప్పుడు కథ నేల విడిచిపోదు” అని చెప్పారు.

మరో సందర్భంలో ”నేను రాయాలనుకున్న కథలాంటిదే ఇప్పటికే వేరేవాళ్లు రాసేశారు. ఇక నేను రాయను” అంటే అందుకు ఉమాగారు అన్నారు ”ఎందుకలా అనుకుంటావు? ఎవరి జీవితానుభవాలు వాళ్లవి. ఎవరి దృష్టకోణం వాళ్లది. నువ్వు రాయాలనుకుంది రాయి. తప్పకుండా అది ముందు కథకు భిన్నంగానే ఉంటుంది” అన్నారు.
ఆ భరోసాతో రాసిన కథే ‘నీడ’. ఆ కథకు తానా కథలపోటీలో బహుమతి వచ్చింది. రెండు కథా సంకలనాల్లోనూ చోటు చేసుకుంది. అదేమిటో ఉమామహేశ్వర రావుగారిని చూస్తే కథ రాయాలనిపించేది. ఆయనతో ఒకరోజంతా ఉన్నానంటే తప్పకుండా కథ రాసేసేవాడిని.

రాబందులు కథ రాసి పంపితే రెండు పత్రికలనుంచి వెనక్కు వచ్చింది. బండి నారాయణ స్వామిగారు తిరుపతికి వచ్చారు. ఆయనకు మధురాంతకం నరేంద్రగారి ఇంటిలో ఆ కథను చదివి వినిపించాను. ఆయన అన్నారు ”నువ్వు కథలో దేన్నయితే చెప్పాలనుకున్నావో, దానికి అనుగుణంగానే కథంతా ఉండాల. డైలాగు కానీ, నెరేషన్‌ కానీ చెప్పాలనుకున్న విషయానికి బలం చేకూర్చల. అలాకాకుండా విషయం ఎంతబాగున్నా కథలోంచి నిర్దాక్షిణ్యంగా తీసేయ్‌” అని.

అంతకు ముందు ఒకసారి మధురాంతకం గారింటికి స్వామి వచ్చారు. మీ వృత్తి కథలు ఎందుకు రాయలేదు అని ప్రశ్నించారు. రాయాల్సిన అవసరాన్ని చెప్పారు. తర్వాత రాసిన కథే అన్నంగుడ్డ. ఈ మధ్యలో పులికంటి కృష్ణారెడ్డిగారి పరిచయం జరిగింది.

నాకు కథల పరంగా స్వామి, తుమ్మేటి రఘోత్తమరెడ్డి బాగా ఇష్టం. కథలతోపాటు, మాటలతోనూ, వ్యక్తులుగా నన్ను బాగా ప్రభావితం చేసిన వాళ్ల మధురాంతకం నరేంద్ర, ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు, అల్లం రాజయ్యగారు. తిరుపతిలో ఉండటం వలన తరచూ కలుస్తుండటం వలన నరేంద్ర, ఉమాగారితో మరింత చనువు. తిరుపతిలో ప్రతి శనివారం సాహితీ మిత్రులం నరేంద్ర, రాసాని, వి.షన్ముగం, పలమనేరు బాలాజి, ఇంద్రవెల్లి రమేష్‌, వి. ప్రతిమ, ఎ. మల్లేశ్వరరావు మరికొందరం కలిసి సాహిత్యంపైన చర్చలు జరిపేవాళ్లం. ఇది కూడా బాగా ఉపయోగపడింది.

నీడ కథకు బహుమతి ఇచ్చి ‘కథ 2001′లో ప్రచురించడం ద్వారా కథకునిగా నాలో నమ్మకాన్ని పెంచిన వారు వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌. వారి కథా సంకలనాలు ఎలాంటి కథా వస్తువులు తీసుకోవాలనే విషయంగా ఒకరకంగా నాకు దిక్సూచిలా పనిచేశాయి. తరచూ పోటీలకు పంపడం వలన, బహుమతులు రావడం వలన ఎక్కువమంది దృష్టిలో పడ్డాను. దాంతో కథకునిగా గుర్తింపూ పెరిగింది.

నాకు కథ రాయడం అంటే చాలా సులభమైన పని. అదే సమయంలో చాలా కష్టమైన పనికూడా. నాదగ్గర ఎప్పుడూ యాభైకి తగ్గకుండా కథా వస్తువులు వుంటాయి. వాటిల్లో ఏది బలంగా మనసును అలజడికి గురిచేస్తుందో అది కథగా బయటకు వస్తుంది. ఒక్కసారి కథ రాయడం మొదలు పెట్టాక గంటల్లోనే పూర్తవుతుంది. అయితే కథకూ కథకూ మధ్య రాసేదానికి వ్యవధి ఉంటుంది. అది ఎంతకాలం అనేది తెలీదు. ఒకరోజు కావచ్చు, నెలకావచ్చు, సంవత్సరం కూడా కావచ్చు. బలవంతంగా కథ రాయాలని కూర్చున్నా అది సగంలోనే ఆగిపోతుంది. అందుకని ఎప్పుడూ బలవంతంగా కథరాయను.

చివరగా..
 
సమాజాన్ని అర్థం చేసుకునే తీరును నాకు తెలియ చెప్పినవారు మధురాంతకం నరేంద్ర,      ఆర్‌.ఎం. ఉమామహేశ్వర రావు అయితే.., నేను సంస్కారవంతంగాను, కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకుండాను, ప్రలోభాలకు లొంగకుండాను ఉండే మానసిక స్థితిని కల్పించింది మాత్రం మా అమ్మానాన్నలు సుంకోజి ఈశ్వరమ్మ, సుంకోజి రెడ్డప్పాచారి. ఆజన్మాంతం వారి రుణం తీర్చుకోలేనిది.

- మీ అందరికీ కృతజ్ఞతలు -
(10-02-2008)

ఉపన్యాసాలు

8 అభిప్రాయాలు

  1. ఆరి సీతారామయ్య ఏప్రిల్ 2008 1

    సుంకోజీ గారికి అభినందనలు.

  2. Ramarao Kanneganti ఏప్రిల్ 2008 2

    సుంకోజీ గారూ:
    మీ కథ చదివిన తర్వాత అనిపిస్తుంది — బాధల పొక్కులు గిల్లి జీవితాన్ని దర్శించిన వారు ధన్యులు అని.

    మీరు ఒక నవల రాయాలి.

    రామారావు కన్నెగంటి

  3. achalla srinivasarao ఏప్రిల్ 2008 3

    జీవితం కధ కాదు కానీ మంచి కధలన్నీ జీవితానుభవాల్లోంచి వచ్చేవే. నిజంగా…

  4. Sree Basabathina ఏప్రిల్ 2008 4

    జీవితంలొ కష్టాలని జయించారు! మీరు నిజంగా అభినందనీయులు.

  5. narendra ఏప్రిల్ 2008 5

    Nenu chossinatha varaka etuvanti rachiyitala lo oka common thread emitante adi pelletoola lono chinna nagaralono vunna grandhalayam. Inka ekkuva grandhakayalu theristhe etuvanti rachiyitalu enka yendaro thayyar avutharu.

  6. కొల్లూరి సోమ శంకర్ ఏప్రిల్ 2008 6

    ప్రస్తుత తరంలో బాగా రాసే రచయితలలో సుంకోజి ఒకరు. ఆయన గురించి తెలుసుకోడం బావుంది.
    నిజ జీవితంలోంచి కథ వస్తువులెన్నుకుంటే సహజంగానే వాటికి జీవం అబ్బి రాణిస్తాయి.
    ఆయన రాసిన “ఇరుకు మాను” కథ చినుకు మాస పత్రిక ఏప్రిల్ 2008 లో ప్రచురితమైంది. చక్కటి కథ.
    సుంకోజి గారికి అభినందనలు

  7. pravallika ఏప్రిల్ 2008 7

    meeku unna anubhavanni goppaga cheppinanduku thanks, meeru life lo padda kashtalu chadivina tharvatha chaala feel inanu, anduke meeru goppa story writer ayyaru, alage story writing ni continue cheyandi.

  8. kasturimuralikrishna ఏప్రిల్ 2008 8

    బాల్యములొ బాధలు అనుభవించినవారె ఎదిగినతరువాత ఉత్తమ కథకులు అవుతారు.ధన్యవాదాలు.మీ అనుభవాలు చదివిన తరువాత నాకు నాకు ఇష్ట్మయిన పాట గుర్తుకువస్తొంది.దునియామె కిత్నా గం్ హే,మెఅరా గం్ కిత్నా కుం హే,లొగొంకా గం దెఖా తొ,మై అప్నా గం భూల్ గయా.ప్రపంచంలొ ఇతరుల దుఖమ్ చూస్తె నా దుఖం ఎంత అల్పమొ నాకు తెలిసింది.ఇతరుల బాధలు చూస్తూ నా బాధలు మరిచా.మీరిన్కా అఉతమయిన కథలు రాయాలి.మిమ్మల్ని త్వరలొ కలుస్తానని ఆశిస్తు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో