Apr2008
ద పోస్ట్ మాన్ : (మొదటి భాగం)
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద కనబడి కళ్లు జిగేలుమనిపించే అమ్మాయిలతో ఎన్నెన్నో సాహసకార్యాలు చేస్తున్నట్టు కలలు కనొచ్చు. అలా మాగన్ను నిద్రలో కనేకలల వల్లనే అప్పుడప్పుడు నిజంగానూ అప్పుడప్పుడు ఉత్తుత్తిగానూ జలుబు చేసిందని చెపుతూ వచ్చాడు. తండ్రి పడవకోసం వలలు తయారుచేసే పని నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. దక్షిణాది ద్వీపాల నుంచి వచ్చే లావుపాటి బొంతలమధ్య ముడుచుకుని పడుకుని నిండుగా కలలు కనేవాడు. తన సోమరి స్వప్నగీతాలకు మరింతగా మెరుగు దిద్దుకుంటూ ఉండేవాడు.
అటువంటి సమయంలో ఈ సంగతి జరిగింది. తండ్రి హోస్ హిమేనెజ్ అప్పుడే సముద్రంమీద చేపల వేటకు వెళ్లి వచ్చి, కుప్పగా తడిసిపోయి, బాగా అలసిపోయి ఆకలితో ఇల్లు చేరాడు. ఆ సమయానికి ఇంట్లో ఉన్న మారియో అపరాధభావనతో అన్నట్టుగా తండ్రికి మధ్యాహ్న భోజనం తయారుచేశాడు. అప్పుడే కాల్చిన రొట్టెలు పెట్టాడు. టమాటాలు, ఉల్లిపాయలు ముక్కలు తరిగాడు. కాసింత పుదీనా, కాసింత కొత్తిమీర చల్లాడు.
తనకోసం మాత్రం ఒక తలనొప్పి మాత్ర పట్టుకుని కూచున్నాడు.
తన చేతి అన్నం తింటున్న ఆ పెద్దమనిషి వెటకారం నిండిన ముఖంతో “అలా పనీపాటా లేకుండా ఉండే బదులు ఏదన్నా ఉద్యోగం వెతుక్కోవచ్చుగా” అనేసరికి, ఆ మాట మారియో ఎముకల మూలుగుల్లోనుంచి లోలోపలికి జారింది. ఆ గొడవలో తలనొప్పి మాత్ర ఎంత నాటకీయంగా గొంతులోకి జారిందో తెలియలేదు.
“వెళ్లి పని వెతుక్కో” అని ఆ తండ్రినోటినుంచి వెలువడినది పదునైన మాట. సూటి మాట. ఆ మాటకుముందు ఆయన కొడుకువేపు పది నిమిషాలో ఐదు నిమిషాలో ఒక తృణీకార దృక్కు విసిరాడు.
“సరే” అన్నాడు మారియో, చొక్కా చేతితో ముక్కు తుడుచుకుంటూ.
ఇక రెండో పరిణామంలో ప్రధాన పాత్రధారి మారియో పెంపుడు ఆస్తి లెగానో సైకిల్. ఆ వాహనం మారియోను ఆ పల్లెకారుల తీరపు సంకుచిత దిగంతంనుంచి శాన్ ఆంటోనియో రేవుపట్నపు వైశాల్యంలోకి తీసుకుపోతూ ఉంటుంది. ఆ రేవు పెద్ద పట్టణమేమీకాదు గాని పుట్టిపెరిగిన ఆ చిన్న పల్లెకారుల గూడెంతో పోలిస్తే మారియో కళ్లకు ఆ పట్నం బాబిలోనియన్ లాగ కనిపిస్తుంది.
అబ్బ, ఆ పట్నం ఎంత మజాగా ఉంటుందో. ఎక్కడపడితే అక్కడ ఉన్న సినిమా పోస్టర్లలో కవ్వించేలా బుంగమూతి స్త్రీలు. పొడవాటి చుట్టలకొసలు నములుతూ పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ ఉండే మొరటు మగవాళ్లు. ఆ బొమ్మలు చూస్తుంటేనే మారియోకు మైకం ఎక్కిపోయేది. ఇక ఆ మైకం దిగాలంటే ఒకటే మందు. రెండుగంటలపాటు చీకటి గుయ్యారపు సినిమాహాల్లో కూచోవలసిందే. ఆ సినిమా అయిపోయాక నిరాశగా ఈడుస్తూ సైకిలు తొక్కుతూ వెనక్కి వచ్చేవాడు. సరిగ్గా ఆ సమయానికే కొన్నిసార్లు చిత్తడి వాన కురిసేది. ఆ వానలో తడవడంతో మారియోకు ఎక్కడలేని జలుబూ, తలనొప్పీ పట్టుకునేవి.
ఒకవైపు మారియో కోరికలకేమో అంతులేదు. ఆ కోరికలన్నిటినీ తీర్చడానికి తండ్రి ఔదార్యం ఎప్పటికీ సరిపోయేదీకాదు. అందుకని మారియో చాల తరచుగా పాతపత్రికల దుకాణం ముందర నిలబడి ఆ పత్రికల్లో తన అభిమానతారల బొమ్మల వేపు ఆబగా చూస్తూ ఆ పత్రికలను మరింతగా నలిపేస్తూ ఉండేవాడు.
అలాంటి ఒక రోజున మారియోకు ఎదురుగా పోస్టాఫీసు కిటికీలో ఒక ప్రకటన కనబడింది.
చిన్నపిల్లల లెక్కల నోటుబుక్కులోంచి ఒక కాగితాన్ని అశ్రద్ధగా చింపి ఆ ప్రకటన రాసినట్టు ఉంది. అసలే లెక్కలంటే మారియోకు భయం గాని ఆ ప్రకటన చూడగానే మాత్రం కాళ్లు నేలమీద నిలవలేదు.
మారియో తన జీవితంలో ఎన్నడూ టై కట్టుకోలేదు. కాని ఇప్పుడు మాత్రం టై కట్టుకుంటున్నట్టే చొక్కా గొంతు దగ్గర సరిచేసుకున్నాడు. బీటిల్స్ ను అనుకరిస్తూ పెంచుకున్న తన జుట్టును జాగ్రత్తగా సరిచేసుకున్నాడు.
పోస్టాఫీసుకు వెళ్లి అక్కడ కూచుని ఉన్న పెద్దమనిషితో, బర్ట్ లాంకాస్టర్ లాగ చిరునవ్వు నవ్వుతూ “పని ఉందని మీరు రాసిన ప్రకటన చూసి వచ్చాను” అన్నాడు.
“నీ దగ్గర సైకిలుందా?” అడిగాడా పెద్దమనిషి ఇంకే సంగతీ పట్టించుకోనట్టుగా.
“ఉంది” అన్నమాట పెదాలన్నాయో, హృదయం ఎగిరొచ్చి అందో, రెండూ ఒక్కసారే అన్నాయో తెలియలేదు.
“మంచిది” అన్నాడాయన. కళ్లజోడు తీసి తుడుచుకుంటూ “మాకు ఇస్లా నెగ్రా కోసం ఒక పోస్ట్ మాన్ కావాలి” అని జోడించాడు.
“వారెవ్వా. భలే. నేనుండేది సరిగ్గా అక్కడే. అక్కడ తీరం మీదనే మా ఇల్లు.”
“సరే, మంచిది. కాని అబ్బాయ్, ఒక చిన్న ఇబ్బంది ఉంది, నువ్వక్కడ ఒకేఒక్కరికి మాత్రమే పోస్ట్ తీసుకుపోవాలి.”
“ఒక్కరికేనా?”
“అవును. అక్కడ మిగిలినవాళ్లందరూ పొట్టకోసినా అక్షరం ముక్క రానివాళ్లు. వాళ్లు పన్నుల కాగితాలే చదవలేరు.”
“మరి పోస్టు వచ్చేది ఎవరికి?”
“పాబ్లో నెరూడా.”
మారియో హిమేనెజ్ గుండె గొంతులోకొచ్చింది. అవాక్కయి నోటినిండా నిండిన ఉమ్మిని ఒక్కగుక్కలో మింగేశాడు. “ఇదింకా బాగుందే, భలే, వారెవ్వా” అన్నాడు.
“భలేగా అనిపిస్తోందేం? ఆయనకు ప్రతిరోజూ మణుగులకొద్దీ పోస్టు వస్తుంది. ఆ సంచీ నీ భుజానికి తగిలించుకుని ఆ సైకిలు మీద పోతుంటే మజా తెలుస్తుందిలే. నీ భుజాలమీద ఏనుగును మోస్తూ పోయినట్టే. నీకన్న ముందు ఈ పని చేసిన మనిషి వీపు ఒంటెలాగయిపోయి గూని వచ్చింది తెలుసా?”
“కాని నా వయసు పదిహేడేళ్లేనండి.”
“మంచి ఆరోగ్యమేనా?”
“నాకా? ఆరోగ్యం సంగతా? గుర్రంతో సవాల్. ఎప్పుడూ జిర్రున చీది ఎరగను.”
పోస్టాఫీసు పెద్దమనిషి ముక్కుదూలంమీదినుంచి కళ్లజోడు కిందికి జార్చి, పైనుంచి అదోరకంగా మారియో వైపు తేరిపార చూశాడు.
“మరి మేమిచ్చే జీతం గుడ్డిగవ్వకు సరిపోదు. వేరేచోట్ల పోస్టు తీసుకుపోయేవాళ్లకు ఆసాములు ఇచ్చే బక్షీసు అంతకూడ ఉండదు మాజీతం. ఈ ఒక్క ఆసామి పోస్టు తీసుకుపోతే నీకు వారానికి ఒక్క సినిమా చూడడానికి సరిపోయే డబ్బులు గిడతాయేమో.”
“అయినా సరే, నాకీ పని కావాలి.”
“సరే, సరే, నాపేరు కోస్మె.”
“కోస్మె?”
“నువ్వు నన్ను కోస్మె గారూ అనాలి తెలిసిందా?”
“సరేనండి కోస్మె గారూ!”
“నేను నీ పై అధికారిని.”
“సరే సార్.”
కోస్మె తన నీలంరంగు బాల్ పాయింట్ పెన్ బయటికి తీశాడు. ఆ ముల్కి చివరన వెచ్చ చేస్తున్నట్టు ఒకసారి ఊదాడు. తలఎత్తి చూడకుండానే “పేరు” అని అడిగాడు.
“మారియో హిమేనెజ్” అని గంభీరంగా జవాబిచ్చాడు మారియో.
ఆ ముఖ్యమైన సమాచారాన్ని అందజేయగానే పని అయిపోయినట్టుగా కిటికీ దగ్గరికి నడిచి ఆ ప్రకటన కాగితాన్ని చించి వెనుకజేబులో కుక్కుకున్నాడు.
2 అభిప్రాయాలు »అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Santha Sundari Apr 8, 2009 1
చాలా ఆలస్యంగా దీనిని చదివాను. రెండేళ్ళ క్రితం్ ఈ సినిమా డీవిడి చూసాను.అద్భుతంగా తీసారు…ఇటాలియన్ భాషలో. ఇప్పుడు దీనిని మీరు ధారావాహిక గా తీసుకు రావటం వల్ల మూల కథని చదివె అవకాశం దొరికింది…సంతొషం.
R.Santha Sundari Apr 8, 2009 2
చాలా ఆలస్యంగా దీనిని చదివాను. రెండేళ్ళ క్రితం్ ఈ సినిమా డీవిడి చూసాను.అద్భుతంగా తీసారు…ఇటాలియన్ భాషలో. ఇప్పుడు దీనిని మీరు ధారావాహిక గా తీసుకు రావటం వల్ల మూల కథని చదివె అవకాశం దొరికింది…సంతొషం.