May2008
అసోయ్ దులా
పీరీల పండుగు. ఊరంత పండుగు.
నెలపొడుపునాడు పీరీలు నిలవెట్టిండ్రు. మొక్కినోళ్లు పక్కీర్లయితున్నరు. మటికీలు తీస్తున్నరు. మట్టి చిప్పల బిచ్చం అడుగుతున్నరు. మలీదలు చదివిస్తున్నరు. దమ్ము పిల్లలను ఇస్తున్నరు.
ఐదోనాడు సత్తె పీరి లేసింది సత్యం పక్కీరయిండు. మెడల దండ ఏసుకున్నడు. ఐదిండ్లు బిచ్చమెత్తిన బియ్యం తోని మలీదచేసి సదివిచ్చిండు. తల్లి తండ్రి కొడుకు ముగ్గురే! ‘అసోయ్ దూలా’ అంటూ పీరీల గుండం సుట్టూ తిరిగిండ్రు.
ఎవలదో టేకుమొద్దు… కొత్తది! ఎత్తుకచ్చి ‘దూలా’ అని అగ్గి గుండంల ఏసిండు సత్యం.
“అయ్యలెక్క కొడుకు… వట్టి తీట పోరడు… టేకుమొద్దు తెత్తావురా…” విసుక్కుంది తల్లి.
ఆరోనాడు లాల్ షావు లేసింది. రేఖ సానుపు సల్లింది గనీ ముగ్గు ఎయ్యలేదు. బొట్టు బిల్లను తీసి విబూతి రాసుకుంది. అడిగి తెచ్చుకున్న కుర్తా పైజామా ఏసుకుంది. దాని బిందెను ఎత్తుకుంది. తల్లి తండ్రి బిడ్డా కొడుకు “అసోయ్ దులా” అంటూ ఆలువ సుట్టూ తిరిగిండ్రు.
మసీదు నిండా జనం ఉశిక పోస్తె రాలది. ‘లోపలికి పోరాదు నీళ్లు ఇక్కడనే కుమ్మరియ్యి’ తండ్రి అన్నడు.
రేఖ ఇనలేదు అందరిని పాపుకుంట లోపలికి పోయి పీరీల కాళ్ల మీద పోసింది. “పోరి తల్లి లెక్కనే… పట్టువడితే ఇడువది.” తండ్రి నవ్వుకున్నడు.
దూల్ పీరి లేసిన్నాడు దస్తగిరి ఒక్క పొద్దు వట్టిండు ఆలువాడి దుమ్ము లేపిండు. శాలోల్ల రాజంను రేవు రేవున వెట్టి పాటవాడిండు. పగున్నోల్లందరి మీద పాట గట్టి పాడిండు.
కొందరు ‘దస్తగిరి గాడా.. అబ్బో.. వానిపగ పాము పగ. వాని కంట్లె పడద్దు’ అనుకున్నరు.
కొబ్బరికాయ కొట్టే ముందు ‘నా కొడుకు పాణం బాగలేక పోతే ఏశమోలె అయితే ఏశమేపిస్తనని మొక్కిన. ఎల్లుండి ఆడి ఏషం ఏపిచ్చుడే…’ సత్యం తల్లి అనుకుంది.
దమ్ము పిల్లను కోసి ఆరం బెడుతూ ‘బిడ్డ పుట్టెడు గండంల నుంచి బయట వడ్డది. ఎప్పటి లెక్కయితే ఏశమేపిత్తనని మొక్కిన. ఎల్లుండి మొగ ఏశం ఏపిచ్చుడే’ అనుకున్నడు రేఖ తండ్రి.
దస్తగిరి తండ్రికి గూడా ఒక మొక్కు ఉంది. బోరు పొక్కల నీళ్లు వడి పంట మంచిగ పండితే కొడుకుతోని దీని దీటి వట్టిత్తనని మొక్కుకున్నడు.
ఎల్లుండి దీటి పట్టియ్యాలని దీటి తయారు జేసుకుంటడు.
….
రేఖ తండ్రి, సత్యం తల్లి, ఇద్దరు అన్నా చెల్లెండ్లు. నోట్లెది నోట్లనే తీసుక తిన్నట్టు పాణాపాణం పెరిగిండ్రు చిన్నప్పుడు. కొడుకు బిడ్డను సమానంగా చూసుకున్నరు తల్లిదండ్రులు.
సత్యం తల్లిని ఊర్లెనే ఇచ్చిండ్రు. ఊర్లె ఇయ్యెం నిత్తెకయ్యం.
రేఖ తండ్రికి చిన్నప్పుడే పెండ్లయింది. భార్య గయ్యాలి గంప.
ఆస్తుల దగ్గెర తకురారు వచ్చింది. కొడుకు బిడ్డకు సమానమన్నరు తల్లిదండ్రులు. ఇట్ల దునియాల ఎక్కడన్నా ఉన్నదా… అన్నడు రేఖ తండ్రి.
కొట్లాట మొదలయింది మొఖం సూడని మాటలనుకున్నరు. అన్నా చెల్లెండ్లు పాసిపోయిండ్రు.
అద్దెకురం అమ్మి ఖర్చు వెట్టుకుని తిరిగిండుగనీ గజం భూమి గూడా చెల్లకు దక్కనియ్యలేదు రేఖ తండ్రి.
చెల్లెను మెడలువట్టి నూకిండు అన్న ఎత్తి ఏడుదోసిల్ల మన్ను పోసింది చెల్లె. అప్పటినుంచి అన్నా చెల్లెండ్ల నడుమ పచ్చిగడ్డి బగ్గుమంటుంది.
పిల్లలు పుట్టిండ్రు పెద్దగయిండ్రు గనీ పగ చల్లారలేదు. తండ్రి చచ్చిపోయిన్నాడయినా కలుస్తరనుకున్నరు అందరు. అన్నా చెల్లెండ్లు కలువనేలేదు. తొమ్మిది రోజుల నాడు నీళ్లల్ల మునిగి నరంటే మొఖాలు సూసుకోలేదు. తల్లి ఇద్దరినీ కలుపాలని తండ్లాడింది. కుదురలేదు.
సత్యం పాణం బాగలేక దవాఖానాలు తిరుగుతుంటే ‘చెల్లే… నీ కొడుక్కు ఏమైందే’ అని రాలేదు అన్న.
రేఖను ఆటోగుద్ది దవాఖానాల పడితే ‘అన్నా… నీబిడ్డకు ఎట్లాయెనే’ అని చెల్లె రాలేదు. రేఖ ఇంటర్ చదివి ఇంట్లో ఉంది. సత్యం చదివి ఉద్యోగం వేటలో ఉన్నడు. రేఖ మనుసులో ఏముందో గనీ సత్యం మనసులో రేఖ ఉంది. సత్యం కు అమ్మమ్మది సపోటుంది.
ఇద్దరికి పెండ్లయితే రెండు కుటుంబాలు కలిసి పోతయని కొందరు చెప్పిండ్రు. చెల్లె మూతి తిప్పింది. అన్న అసలే వద్దన్నడు.
ఊర్లెదూర్లె దస్తగిరికి రేఖను ఇద్దామన్న ఆలోచనలో ఉన్నడు రేఖ తండ్రి. ఇది తెలిసి రేఖ తొవ్వలు గాత్తుండు దస్తగిరి.
….
“అట్లనద్దు బిడ్డా… కండ్లు వొతయి. దేవుని మొక్కు పుట్టెడు రోగాలనించి బయట వడ్డవు మొక్కు దీరిత్తే నౌకరి దొరుకుతది. మంచి పెండ్లాం దొరుకుతది…” సత్యంను బుదురకిస్తూ చెప్పింది తల్లి.
వద్దు వద్దని పోరువెట్టి ‘ఓ రెండు నిమిషాలు… పీరీలకు మొకం సూపిచ్చి వచ్చుడే…’ అంటే ఒప్పుకున్నడు సత్యం.
‘బిడ్డో… మొక్కి తప్పదు. ఎంత పెద్ద గండంల నుంచి బయట వడ్డవు. ఏదో.. ఏ దేవుని పున్నెమో… నెత్తిమీద నాలుగు అచ్చింతలు పడాలె’ రేఖ తల్లి బతిమిలాడింది.
పోనేపోనన్న రేఖ పీరీల గుండం సుట్టు రెండు సుట్లు తిరుగుడే అంటే ఒప్పుకుంది. అక్కడ దస్తగిరి గూడా పోరు వెట్టిండు. ‘ఒక్క సుట్టు దిరిగి నా చేతికియ్యి నేనే పట్టుకుంట’ అని తండ్రి అన్నడు.
చిలుక పచ్చ చీర మీద ఎర్రరైక ఏసుకున్నడు సత్యం. మీసాలు తీసుకున్నడు. సౌరం గట్టుకుని జడేసున్నడు. జడల మల్లెపూలు పెట్టుకున్నడు. కాళ్ల కు గొలుసులు చేతులకు గాజులు చెవులకు కమ్మలు, ముక్కుకు ముక్కుపుల్ల… నడుచుకుంటూ పీరీల దగ్గరికి వచ్చిండు. అందరు ఆడపిల్లనే అనుకున్నరు.
రేఖ జీనుపైంటు తొడుక్కుంది. డబ్బల డబ్బల అంగి తొడుక్కుంది. జడను మలిచి టోపి పెట్టుకుంది. సొమ్ములు గాజులు తీసింది. బూట్లు తొడుక్కుని పీరీల దగ్గరికి వచ్చింది.
మసీదు సుట్టూ జనం. లేచే పీరీలు లేత్తున్నయి. ఎగిరె పీరీలు ఎగురు తున్నయి. తీరే మొక్కులు తీరు తున్నయి. మొక్కే మొక్కులు మొక్కుతున్నరు. మొగోళ్లు ఆలు వాడుతున్నరు. ఆడోళ్లు ఆశన్న ఊశన్న ఆడుతున్నరు.
పీరీల గుండం దగ్గర ఇద్దరు ఎదురయిండ్రు. చీకట్లో ఒకల మొఖం ఒకలకు కనవడక పోతుండె దీటి వట్టుకుని అప్పుడే దస్తగిరి అక్కడికి వచ్చిండు దీటి వెలుగులో ఒకలనొకలు చూసుకున్నరు.
సత్యం సిగ్గు పడ్డడు రేఖ బిడెంగా అంగిని సదురుకుంది.
ఒకలను చూసి ఒకలు కిలుక్కున నవ్వుకున్నరు.
వీళ్లిద్దరినీ గుర్తువట్టలేదు దస్తగిరి. పీరీల దిక్కు నడిచిండు.
చీకట్లో ఇద్దరూ అక్కడనే నిలవడ్డరు.
సత్యం కొద్దిగ దైర్నం తెచ్చుకుని ‘నువ్వు… అచ్చం నాలెక్కనే ఉన్నవు, కొద్దిగా పొట్టిగ్నువు గంతే!”
“నువ్వుగూడ… కొద్దిగ దొడ్డుగున్నవు గంతే…” రేఖ నవ్వింది.
“టోపి బలే పెట్టుకున్నవు. మీసాలు గూడా పెట్టుకోనుంటివి…” సత్యం అన్నడు.
“నువ్వు చీర బలే గట్టుకున్నవు. బెల్టు వెట్టుకున్నవా ఏంది…?” రేఖ అన్నది.
“టీషర్టేసుకోవద్దా… జీను మీద మంచిగుంటుండె…” సత్యం.
“నైలాన్ చీర కట్టుకోనుంటివి… పీరీల కాడికి పట్టుచీర గట్టుకత్తవా…” ఎక్కిరిచ్చింది రేఖ.
అప్పుడే దీటీ తో దస్తగిరి వచ్చిండు. వెలుతురుకు ఇద్దరు దూరం జరిగిండ్రు. ఇద్దరినీ చూడకుంటనే ఎల్లి పోయిండు.
సత్యంకు రేఖతో మాట్లాడాలని ఉంది. ఆమె ఎక్కడ ఎల్లిపోతదోనన్న భయం గూడా ఉంది.
మనుసులనే దేవునికి మొక్కుకున్నడు రేఖ కదుల లేదు. సత్యంకు ఏం మాట్లాడాలెనో తెలుస్తలేదు.
“సదువనుంటివి… ఎందుకు బందు జేసినవు…” అడిగిండు సత్యం.
“మా నాన వద్దన్నడు… నువ్వేం జేస్తున్నవు…” రేఖ అడిగింది.
“పీ.జి. అయింది ఏదన్న సూసుకోవాలె… మీనాన వద్దంటే బందయితవా… అబ్బో మీనాన కడ్డు గాడు…”
రేఖకు కోపమచ్చింది. ‘మరి… మీ అమ్మ’ అన్నది.
‘ఇద్దరిద్దరే… జిద్దుమనుసులు… అమ్మమ్మ రోజు ఏడుత్తుంది…’ బాధగా అన్నడు సత్యం.
“నానమ్మ నాకు మాచెప్పింది తియ్యి… నీసంగతి… గట్లెందు కంటున్నవు…” రేఖ అడిగింది.
“నేనేమన్నా…” అడిగిండు సత్యం.
మలీద సదివిచ్చే భక్తులు ఎవలో గంప ఎత్తుకుని దప్పు సప్పుడుతో అసోయ్‌దూలా అనుకుంట ఇద్దరి నడుమలనుంచి ఎల్లిపోయిండ్రు.
ఇద్దరూ ఇంకా చీకట్లోకి జరిగిండ్రు. పీరీలు లేచినట్టున్నయి. దప్పుల సప్పుడు ఎక్కువయింది. ఏదో మాట్లాడవోతుంటే దీటితో దస్తగిరి వచ్చిండు. ఇద్దరినీ అనుమానంగా చూసిండు. అక్కడనే నిలవడ్డడు.
ఇద్దరూ చెరో దిక్కు నడిచిండ్రు. దస్తగిరి ముందుకు నడిచిండు. ఇద్దరు దగ్గరి కచ్చిండ్రు. దస్తగిరి దీటివట్టి నడుమలకచ్చిండు. దస్తగిరిని తప్పుకుని చెరోదిక్కు తిరిగిండ్రు.
రోడు మీద కరంటు వెలుగుంది. గుండం దగ్గెర మంట వెలుగుంది. మసీదుల దీటీల వెలుగుంది. మరుగు మరుగున తిరుగుతుంటే దస్తగిరి కావలి గాత్తుండు.
జాక్కుని జాక్కుని ఇద్దరికీ యాష్టకచ్చింది. చీకట్లో ఇద్దరూ ఏదో మాట్లాడుకునే మోపుకు దగ్గెరికి పోయి దీటీ వడుతుండు దస్తగిరి.
అమ్మమ్మ ఏం జెప్పిందో అడుగాలనుకుంటుండు సత్యం.
తనకు సంబందాలు చూస్తున్నరని చెప్పాలనుకుంటుంది రేఖ.
నోరు విప్పనిస్తలేడు దస్తగిరి. సత్యంకు కోపమస్తుంది. రేఖకు విసుగస్తుంది. కోపంగా రేఖ ఇంటికి పోయింది. సత్యం సల్లవడి పోయిండు. దస్తగిరి పీరీల దగ్గరికి పోయిండు.
పోయిందను కున్న రేఖ పావుగంటలో లంగా వోనీ లో వచ్చింది. ఎక్కడినుండి చూసిండో దస్తగిరి దీటివట్టుకుని రేఖ ఎదురు వోయిండు.
రేఖ తప్పుకొని ఆడోళ్లు ఆశన్నూషన్న ఆడే దగ్గెరికి పోయింది. అక్కడికి మొగోళ్లు పోరు. పోతె తిడుతరు రేఖ సత్యంను పిలుచుకుంది.
ఆడోళ్లు గుంపులు గుంపులుగా ఆడుతున్నరు. సప్పట్లు ఏసుకుంటున్నరు. ఆలువాడుతున్నరు. అసోయ్‌దులా ఆడుతున్నరు.
గుంపుల నడుమ రాళ్లతెట్టె మీద కూసున్నరు ఇద్దరు అప్పటికి నెలపొడుపు గూకింది. ఇద్దరు దస్తగిరిని చూసి నవ్వుకున్నరు. ఎక్కడెక్కడో తిరుగుతుండు. దేవులాడుతుండు. దీటి ఎత్తి చూస్తుండు.
ఇద్దరూ సప్పట్లేసుకున్నరు ఆశన్నూషన్న ఆడుకున్నరు.
“చేసుకుంటే నన్నే చేసుకుంట లేకుంటే సచ్చిపోత అన్నవటగదా!” రేఖ అడిగింది. ముసలిది గట్టిపిండమే అనుకుని “నువ్వే అన్నవట గదా!” అని నవ్విండు సత్యం.
అర్ధరాత్రి దాటింది. ఊరు తిరుగవోయిన పీరీలు మర్రినయి. జనం ఒక్కొక్కలు ఇంటి దారి వట్టిండ్రు. ఇప్పుడే వత్తనన్న కొడుకు ఇంకా రాలేదని సత్యం తల్లి… ఏషమిప్పిన పిల్ల ఎటువోయిందని రేఖ తండ్రి ఇద్దరూ మసీదు దగ్గరికచ్చిండ్రు.
కొమ్మ మీద కూసున్న గువ్వపిట్ట లోలె రాళ్ల తెట్టెమీద ఇద్దరు కనవడ్డరు ఏదో గుర్తుకచ్చినట్టు జడ లోని పూల దండనుతీసి రేఖకిచ్చిండు సత్యం. మెడలోని పక్కీరు దండను తీసి సత్యంకిచ్చింది రేఖ. ఇద్దరూ ఇద్దరిని చూసిండ్రు. భయంతో కట్టెసరుసుక పోయిండ్రు.
పీరీలు మసీదు నిండుకున్నట్టున్నయి. దప్పులు మోతమోగినయి.
ఊదు గగ్గీలం పొగ గప్పుమని లేచింది.
బగబగ మండిన పీరీల గుండం సల్లారి పోయింది.
3 అభిప్రాయాలు »కథలు, మానేటి కథలు
May 21st, 2008 at 9:12 am
story exellently representing to telangana culture. but i feel it is ended abruptly.
conclusion is not clear.
Balu
September 5th, 2008 at 2:49 pm
కథ చాన బాగున్నది. ప్రతి కథకు అరిటిపండు ఒలిశినట్టు చెప్పే ముగింపు లెక్క కాకుంట బాగ ఖతం అయింది. ‘దస్తగిరి దీటివట్టి నడుమలకచ్చి’నప్పటి నుంచి సదువుతుంటె గుండెల రైల్లు ఉరుకుతున్నట్టు అయింది
September 14th, 2009 at 11:46 am
కత చానా బాగున్నది. అశోక్ తెలంగానా బాస చానా బాగా కథలో పొదిగినాడు.