May2008
దాంపత్యం అలియాస్ పరస్పరహననం
ఎక్కడ పోగొట్టుకున్నాం
ఎవర్ని ఎవరమెలా కోల్పోయాం
స్నేహమహతిని నిర్భయంగా విరిచి
కక్షలూ కార్పణ్యాలూ పెంచి పోషించి
సామజిక శుష్కమర్యాదల కచ్చడాలమోపు
ప్రీ మోర్టెమ్ సరే – పోస్ట్ మోర్టమూ జరగకనే
పింజలుపింజలై పడిన ప్రేమశవాన్ని
చేతనయీ కాక కుట్టుకుని
వీపున కట్టుకొని మోస్తున్న విసుగే
రూపెత్తిన విక్రమార్కుల్లా జతపడ్డాం
బరిసె విసిరిన మొదటి చెయ్యి నీదా నాదా
ముందు బదాబదలైన హృదయమెవరిది
పరస్పర వేటలో ఒరిగి మరిగి పిగిలి ప్రిదిలి
విద్వేషపుకీలల సెగన ఇలా మిగిలామా!
అసలు మిగిలామా?
ఇంత జరిగి
విశ్వాసం గౌరవం స్తంభాలు
ఇంకా -
హృదయపు బూడిదలోంచి రాగాలు రవ్వలు
అడపాదడపానైనా ఎగసిపడుతూండడం విచిత్రం!
కటి నుంచి భృకుటివరకూ రోమాల్లా కామనలూ
అరుదుగానైనా బారులు తీరడం
అనంత మానవ విషాదం!
August 24th, 2008 at 12:09 pm
‘బరిసె విసిరిన మొదటి చెయ్యి నీదా నాదా’
అని ప్రశ్నను ప్రశ్నగా ఓపెన్ ఎండెడ్ గా వదిలెయ్యడంవల్ల… వైముఖ్యం మీద రాసిన ఈ పద్యం నిర్మల గారే అల్లప్పుడు ప్రేమావేశం మీద రాసిన ‘జుగల్ బందీ అంత గొప్పగా వుంది.
పద్యంలో వేదన వుంది. ఏకపక్షమైన అక్యుజేషన్ లేదు. మనుషులు కలుసుకోడానికి, పరస్పరం దిద్దుకోడానికి పనికొచ్చే మంచి వ్యక్తీకరాణః. బతుకు పట్ల ఒక మంచి వైఖరిని చాల కవితాత్మకంగా చెప్పారు నిర్మల గారు.
‘ఎక్కడ పోగొట్టుకున్నాం
ఎవర్ని ఎవరమెలా కోల్పోయాం?’
ఇద్దరూ కలిసి వెదుక్కోవలిసిందే. ఇది ఇద్దరి సంగతేనా? అందరమూ ‘కలిసి’ వెదుక్కోవలిసిందే.
ఇందులో వున్నది, కేవలం ప్రేయసీ ప్రియుల సమస్య మత్రమే కాదనుకుంటాను. మానవ సంబంధాలు అన్నిటికీ వర్తిస్తుందనుకుంటాను. ఉర్దూ షాయిరీల్లో ‘ప్రియా’ అని ఉన్నప్పుడల్లా చిరునామాదారు(డు) లవర్ మాత్రమే కాదుగా?!……. …… హెచ్చార్కె
October 24th, 2008 at 1:54 am
[...] of Pranahita we bring to you the powerful voices of poetry from Telugu women poets. Please read Ghantasala Nirmala ‘dAmpatyam paraspara hananam’ , Shilalolita ‘mATlADutunna sharIram’, Sujata Patwari ‘nIDala mATu‘, Mahe [...]