అపరాజిత 8: తెగలను కలిపిన పెయూట్ తాత

తెల్లవాడికి వాస్తవికత అంటే బ్యాంకులు, అంగళ్లు, నియాన్ లైట్లు, ట్రాఫిక్ తో నిండి వున్న వీధులు; ఎటు చూస్తే అటు పోలీసులు, ఒళ్లమ్ముకునేవాళ్లు, దిగులు మొహాల మనుషులు, అందరూ గడియారం ప్రకారం పనిచెయ్యడానికి తొందర పడుతూ వుండడం. కాని అదంతా అవాస్తవం. నిజమైన వాస్తవికత వీటన్నిటి అడుగున వుంటుంది. దాన్ని కనుక్కోవడానికి పెయూట్ తాత సహాయపడతాడు.
- క్రౌ డాగ్

ఇండియన్ల హక్కుల వుద్యమం అన్నిటికన్న ముందు ఒక ఆధ్యాత్మిక వుద్యమం. మా ప్రాచీన మతం దానికి గుండెకాయ వంటిది. ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్టు హయాం వరకు ఇండియన్ల మతం నిషేధింపబడి వుండింది. పిల్లలు ఇండియన్ పద్దతిలో ప్రార్థనలు చేస్తే శిక్షించేవారు. పెద్దవాళ్లు ‘స్వెట్ బాత్ ‘ (చుట్టూ కప్పబడిన ఒక చిన్న డేరాలో కొంతమంది చేరి, వారి మధ్యలో అగ్గి కణికలు వేసుకుని, అప్పుడుప్పుడు వాటి మీద నీళ్లు చిలకరిస్తారు. దాంతో లేచిన ఆవిరి వారిని ఉక్కురిబిక్కిరి చేస్తుంది. ఆ బాధను భరిస్తూప్రార్థనలు చేస్తారు. ఆ క్రతువు తరువాత తమ మనస్సులు శుబ్రపరుచుకున్నట్లు భావిస్తారు) వంటి క్రతువులు పాటిస్తే జైళ్లపాలయ్యేవారు. మా పవిత్ర పొగగొట్టాల్ని పగులగొట్టారు, మా మందుల మూటల్ని కాలబెట్టేవారు లేదా వస్తు ప్రదర్శనశాలలకు అప్పగించేవారు. మమ్మల్ని శ్వేతీకరించడం కోసం, అంటే, మేము ఇండియన్లము అనే సంగతి మరిచిపోయేలా చేయడం కోసం వారనుసరించిన ఒక పద్దతి క్రైస్తవీకరణ. ఇది ఒక జాతిని కొద్దికొద్దిగా హతమార్చే పద్దతి. మేము మా పాత సాంప్రదాయాలను కాపాడుకోవడం దీన్ని నిరోధించడానికి ఎన్నుకున్న మార్గం. జనం పొగగొట్టంతో ప్రార్థనలు చేసినంతకాలం, చిన్న నీటివాయిద్యాన్ని(వాటర్ డ్రమ్ ) వాయించినంతకాలం ఇండియన్ జాతి అంతరించదు. ఇండియన్లం ఇండియన్లుగా కొనసాగుతాం. అందువల్లనే గత వందేళ్లుగా ఇండియన్ హక్కుల కోసం మా పోరాటానికి మా ప్రాచీన విశ్వాసాలే మాకు అండగా నిలిచాయి. ఎ.ఐ.ఎం. తదితర ఉద్యమాల ప్రభావం వల్ల ఇక్కడి స్థానిక జాతుల ప్రజలు అంతకంతకు ఎక్కువగా మిషనరీలను వదిలిపెట్టి తిరిగి మెడిసిన్ మెన్ల, పెయూట్ పంథా మనుషులవైపు మళ్లారు.

నేను కూడా అలాగే వెళ్లాను. నాలో తిరుగుబాటు తనం, ఇండియన్ సంప్రదాయాలవైపు మొగ్గడం… రెండూ ఒకేసారి జరిగాయి. తెల్లవాళ్లకు ఇదంతా తికమకగా వుండొచ్చు, పరస్పర విరుద్ధం అనిపించవచ్చు. నాకు నా మిత్రులకు మాత్రం ఇదే అత్యంత సహజం అనిపించింది. నేను చిన్నపిల్లగా వున్నప్పటికే ఈ క్రమం మొదలయ్యింది. సెయింట్ ఫ్రాన్సిస్ మతగురువులు, సన్యాసినులు అందించిన క్రైస్తవం నాకు ఏమాత్రం సరిపోలేదు. జీసుస్ పూర్తిగా మంచి వాడే కావచ్చు గాని, అమెరికాలోని తెల్లజాతీయులు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఆయన్ని ఉపయోగించుకున్నారు. మాకు విస్కీ, మశూచి తెచ్చిపెట్టిన తెల్లవాళ్లు ఒక చేత్తో శిలువ ఇంకొక చేత్తో తుపాకి పట్టుకుని వచ్చారు. వాళ్లు కరుణామయుడయిన జీసస్ పేరిట మామీద తుపాకులు ఉపయోగించారు. మా పవిత్ర పొగగొట్టాన్ని, పెయూట్ తాతను అలా వాడుకోలేకపోయారు. అందుకే, అతి సహజంగా నేను వీటివైపు మొగ్గాను. ఆ రోజుల్లో నా భావాల్ని సరిగ్గా ఇదే మాటల్లో చెప్పగలిగేదాన్నని కాదు గాని, జరిగింది అదే.

ఇండియనుగా ఉండగలగడం కోసం నేను కల్తీ కాని ఇండియన్ జాతీయుల వద్దకు చేరాను. మా అమ్మ, అమ్మమ్మ ఇండియన్లే గాని, పూర్తి ఇండియన్లు కాదు. సంకరజాతి ఇండియన్లు. దీన్ని నేను అంగీకరించలేకపోయాను. ఈ ఇయెస్కాలు… అంటే సంకరజాతి ఇండియన్లు… తమ గురించి తప్ప ఇతరుల గురించి పట్టించుకోరు. “సమగ్ర స్వార్థం” మాత్రమే నాగరికత ఫలాల్ని తమకు అందించగలదని వాళ్లు ఎప్పుడో నేర్చుకున్నారు. పూర్తి ఇండియన్ (ఫుల్ బ్లడ్ ఇండియన్లు) జాతీయులకు హృదయం వుంది. వాళ్లు వినయంగా ఉంటారు. తమకు వున్న సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. తమ భూమి తమకు ఆదాయం తెచ్చిపెట్టలేకపోయినా సరే, ఆ భూమిని అంటిపెట్టుకునే వుంటారు. ఆ భూమిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇయెస్కాలకు భూమి లేదు. వీళ్లు తమ భూమిని ఎప్పుడో అమ్మేశారు. ఎవరైనా తెల్లవ్యాపారి బొగ్గు లేదా యురేనియం తవ్వకాలకు భూమి కొంటామని వస్తే ఇయెస్కాలు ఎగిరి గంతేస్తారు. “అమ్మేద్దాం. ఆ డబ్బు తీసుకుందాం. కొత్త కారు, కలర్ టీవీ కొనుక్కుందాం” అంటారు. పూర్తి ఇండియన్లు ఏమీ మాట్లాడరు. తమ చిన్ని భూమి కమతాల మీంచి కదలరు. వీళ్ల వల్లనే కొందరయినా ఇండియన్లుగా మిగిలి వున్నారు. నా బంధువుల్లో అలా పట్టుదలగా వుండిపోయిన పూర్తి ఇండియన్లు నన్ను ఆకర్షించారు. మా ఫూల్ బుల్ మామయ్య ఒక పవిత్ర మూలిక గురించి ఎప్పుడూ చెప్పేవాడు. అది ఇండియన్ ప్రజలకు సృష్టికర్త ఇచ్చిన ప్రత్యేక కానుక అని చెప్పేవాడు. ఆయనే ఒక అందమైన కథ చెప్పాడు. ఒక పెద్దామె, తన కూతురుతో కలిసి వెళుతూ ఎడారిలో దారి తప్పింది. ఇక చచ్చిపోతామని అనుకుంటుండగా ఎవరో చిన్ని గొంతుతో తమను పిలుస్తున్నట్లు వినిపించింది. అది ఓ చిన్న మొక్కనుంచి వచ్చిన స్వరం. అదే వారిని కాపాడింది. పెద్దావిడ ఆ చిన్న మూలికను తనతోపాటు తెచ్చి తన తెగకు, ఈ భూభాగంలోని స్థానిక ప్రజలందరికీ ఇచ్చింది. ఇలాంటి కథలెన్నో విని ఒకరోజు మా అమ్మతో చెప్పాను, “నేను ఇండియన్ అమ్మాయిగానే పెరిగి పెద్దదాన్నవుతాను”.

అమ్మకు అది ఇష్టం కాలేదు. బాధ పడింది. ఆమె కాథలిక్ క్రైస్తవ్యురాలు. తన విశ్వాసం పరిధిలోనే నన్ను పెంచుతోంది. ఆమె నాకు మతదీక్ష కూడా ఇప్పించింది. ఆరోజు తెల్ల బట్టలు వేసుకుని, తెల్లని ముసుగు తలమీద సర్దుకుని, చేతిలో కొవ్వొత్తి పట్టుకుని ఎలా వుండివుంటానో తల్చుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. అప్పుడు తిరిగేసిన ఆపిల్ పండులా బయటికి తెల్లగా, లోపల ఎర్రగా వున్నాను. మా ముసలి తాత డిక్ ఫూల్ బుల్ నన్ను మొదటిసారి పేయూట్ సమావేశానికి తీసుకెళ్లాడు. నిజానికి, నేను పెరిగి పెద్దయిన తరువాతే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోగలిగాను. ఆయన మా దగ్గరి బంధువని కూడా తరువాతే తెలిసింది. ఆయనతో కలిసి చివరిసారి పేయూట్ సమావేశంలో కూర్చునే నాటికి ఆయన వయసు వందేళ్లపైమాటే. ఆ వయసులో ఆయన లేచి నిలబడి మూడు గంటలసేపు మాట్లాడాడు. ఆయన తన మరణానికి సిద్ధమవుతున్నాడు. దాని గురించే మాట్లాడాడు. తాను ఆనందకరమైన వేట భూములకు వెళ్తున్నానన్నాడు. చిట్ట చివరి మహత్తర మార్గం, పాలపుంత ద్వారా వెళ్లి కార్ల్ ఐరన్ షెల్, గుడ్ ల్యాన్స్ వంటి తన పాత మిత్రులందరినీ కలుసుకోబోతున్నానన్నాడు. వాళ్లు అంతా తన లాంటి వాళ్లు. అందరూ చనిపోయారు. ఆ మాట కొస్తే ఫూల్ బుల్ తాత చిన్న తనం నాటికే వాళ్లు ఒక్కొక్కరు వందేళ్లు జీవించారు. ఇప్పుడు వాళ్లు నీటి వాయిద్యం మోగిస్తూ, బహుశా ఆవిర్లుపోయే బర్రె మాంసం పాత్రతో తనకోసం ఎదురు చూస్తుంటారు. ఫూల్ బుల్ తాత ఎన్నో సంగతులు గుర్తు చేసుకుని చెప్పేవాడు. తను ఒక పాతకలపు మధుశాలలో గోడకు ఆనుకుని కూర్చొని వుండగా, తన వెనుక బీరు, విస్కీ పాత్రలు ఒకదాని మీదొకటి పేర్చి వుండే దృశ్యం గురించి ఆయన చెప్పగా వినాలి. తను అలా కూర్చొని వుండగా ఇద్దరు తెల్లవాళ్లు మధుశాలలోకి వచ్చారట. కాసేపటికే కొట్లాట పెట్టుకుని ఒకరిమీదొకరు కాల్పులు మొదలెట్టారట. ఫూల్ బుల్ తాత ఒక “ఓల్డ్ క్రో” విస్కీ పీపా వెనుక దాక్కున్నాడు. అక్కడ కుదురుకుంటుండగానే ఒక తూటా తన తలకు కొద్దిగాపైన ఓ పెద్ద పాత్రను తాకింది. రుచికరమైన ‘రెడ్ - ఐ’ సరిగ్గా ఆయన నోట్లోకి కారిపోయింది. తాత తను దాక్కున్న చోటు నుంచే ఇష్టమైనంత మధువు తాగేశాడట. పిచ్చిపట్టిన ఇద్దరు తెల్లవాళ్లు ఒకరినొకరు కాల్చి చంపుకోవడానికి గంటసేపు పట్టింది. అంతసేపూ తాతకు ఉచిత మద్యపానం.

తనను పాత ఇండియన్ సంప్రదాయంలో ఎలా ఖననం చేయాలో ఆయన చెబుతుండేవారు. క్రౌ డాగ్ తన కోసం ప్రార్థన చేస్తూ స్వీట్ గ్రాస్ (ఇండియన్లకు పవిత్రమైన మూలిక) తో ధూపం వేస్తుండగా తన చుక్కల దుప్పటిలో తనను కప్పి ఖననం చేయాలని చెప్పేవాడు. ఆ మాటల్లో ఎక్కడా దిగులు, విషాదం వుండేవి కావు. ఈ విషయాలపై ఆయన జోకులు కూడా వేసేవాడు. అనారోగ్యం, నలత వంటివి ఏవీ లేవు ఆయనకు. పాలపుంతలో ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చిందని అనుకున్నాడంతే. కొన్నాళ్లకే ఆయన చనిపోయాడు. తనతో మాట్లాడే అవకాశం వున్నప్పుడే ఆయన గురించి మరింత ఎక్కువ తెలుసుకోవాల్సిందని అనిపిస్తుంది. సూ ప్రజలు ప్రేమగీతాలు పాడుకునే పాత తరహా వేణువు, సియొతంకా తెలిసినవాళ్లలో - మా గుంపులో ఆయనే చివరి వ్యక్తి.

ఏడాది కిందట ట్రైబల్ ఆఫీసు దగ్గర నడుస్తుండగా నాకొక దివ్య-దర్శనం (విజన్ ) కలిగింది. అది చాలా వాస్తవికంగా కనిపించింది నాకు. మా ఫూల్ బుల్ తాత తన వేణువు చేతిలో పట్టుకుని నుంచొని వున్నాడు. నేను ఆయన దగ్గరికి పరిగెత్తి వెళ్లి “బలె బలే, ఫూల్ బుల్ తాతా, అయితే నువ్వు బతికే వున్నావన్నమాట” అని చెప్పాలనుకున్నాను. అంతలో ఆయన మరొకరుగా మారిపోయారు. అది మరెవరో పనిలేని ముసలాయన. ట్రైబల్ ఆఫీసు గోడకు ఆనుకుని దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు నుంచున్నాడు.

ఫూల్ బుల్ తాత మొదటిసారి తీసుకెళ్లినప్పుడు పేయూట్ సమావేశంలో రాత్రంతా తాత దగ్గరే కూర్చున్నాను. బాగా చిన్న పిల్లనే అయినప్పటికీ, బాగా ఎక్కువగానే మందు తీసుకున్నాను. మందు తీసుకుని ఎన్నెన్నో మంచి దృశ్యాలు చూశాను. ఉన్నట్టుండి నాకొక విషయం అర్థమయింది. ఈ మందులో వాస్తవికత దాగివుంది. ఇందులో మా వారసత్వం వుంది, ఇది మా భాష మాట్లాడుతుంది. పెయూట్ మట్టినుంచి వస్తుంది. ఒక్కోసారి దాని రుచి మట్టిలాగే వుంటుంది. పెయూట్ తీసుకుని నేను మట్టిలో ఒక భాగమయిపోయాను. నాలో మట్టి వుంది. నేను మట్టిలో వున్నాను. అదే ఇండియన్ల మట్టి. నేను మరింత ఎక్కువగా ఇండియన్ అయ్యాను. నావరకు నాకు పెయూట్ అంటే ప్రజలు. బతికి వున్న జనం. చిరకాలంగా మరిచిపోయిన విషయాల జ్ఞాపకం, స్మృతి పెయూట్.

ఆ రాత్రి నాకు తెలియని ఎవరో మనిషి నాకు నాలుగు సార్లు పెయూట్ తెచ్చి ఇచ్చాడు. నేను ఫూల్ బుల్ తాతకు కుడివైపున కూర్చొని వుండడం వల్ల ఆయనకు తెచ్చిచ్చే ముందే నాకు పెయూట్ తెచ్చిచ్చేవారు. తెచ్చిచ్చిన మనిషి ఇండియన్ భాషలో ఏదో చెప్పాడు. అప్పుడు నాకు సూ భాష మాట్లాడడం రాదు. అయినా ఆయన మాటల్లోని అర్థం నాకు అందినట్లే అనిపించింది. నన్నొక శక్తి ఆవరించింది. చనిపోయిన బంధువులెందరో మాట్లాడుతున్నట్లనిపించింది. అదొక గొప్ప భావన. నీటివాద్యం శబ్దాలతో పాటు ఒక సందేశం నాకు చేరుతోంది. నీటివాద్యం లయ నాగుండెలోంచే వస్తోంది నా గుండె నీటి వాద్యమయి అలా కొట్టుకుంటూనే వుంది. ఆ గొంతు నాకేమి చెప్పిందో, పెయూట్ తాత నాకేమి చెప్పాడో దాన్ని నమ్మాలో వద్దో నాకు తెలియలేదు. దాన్నంతా నేను ఇప్పటికీ వివరించలేను.

పొద్దు పొడిచింది. మేము పొద్దుటి తిండితిని, సెలయేరు నుంచి చల్లని నీళ్లు తాగిన తరువాత అంతకుముందెన్నడు కలగనంత సంతోషం కలిగింది నాకు. ఇంటికి వెళ్లాక నేను నేటివ్ అమెరికన్ చర్చికి వెళ్లొచ్చానని అమ్మతో చెప్పాను. ఆమె నొచ్చుకుంది. చివరికి ఒకసారి భుజాలెగరేసి “సరే నీ ఇష్టం. ఇలా చెయ్యి అలా చెయ్యి అని నీకు చెప్పలేను” అంది. అదే సమయంలో నాకు ఇష్టమైన మరొక మాట కూడా అంది, “సరే.. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇండియన్లు దేవుడికి దగ్గరగా వుంటారు”. తన ఉద్దేశమేమిటో నాకు తెలుసు.

రెండు వారల తరువాత అమ్మమ్మ వాళ్లింట్లో ఉన్నప్పుడు నాకొక కల వచ్చింది. అదొక తెలవారుఝాము రాత్రి. నేను మేలుకొనడానికి ప్రయత్నించాను, సాద్యం కాలేదు. మెలుకువ వుండీ లేని స్థితి. ఎటూ కదలలేకపోయాను. ఏడుస్తున్నాను. కళ్లు తెరిచి చూశాను. అమ్మమ్మ నా పక్కనే కూర్చుని వుంది. నాకేమయినా నలతగా వుందా అని అడుగుతోంది. తనకు జవాబు చెప్పలేకపోయాను. కలలో నేను ఎక్కడికో మరో జీవితంలోకి వెళ్లిపోతున్నాను. ఇండియన్ల టీపీలు (ఇల్లు) కనిపించాయి. మంట చుట్టూ కూర్చున్న ఇండియన్లు కనిపించారు. అందరూ నవ్వుతూ మాంసం వండుకుంటున్నారు. అంతలోనే తెల్లసైనికులు గుర్రాలమీద వచ్చారు. క్యాంపు మీద విరుచుకు పడ్డారు. ఆడవాళ్లను, పిల్లలను చంపారు. రేప్ చేశారు. గొంతులు కోశారు. అంతా నిజంగా జరిగినట్లే వుంది. సినిమాల్లో చూపించేదానికన్నా వాస్తవికంగా వుంది. దృశ్యాలు, శబ్దాలు, వాసనలు… అన్నీ. నేను చూడ్డానికి ఏమాత్రం ఇష్టపడని దృశ్యాలు. నేను వినదల్చుకోని చిన్నపిల్లల చావుకేకలు. నేను ఏమీ చేయలేకపోయాను, ఏడవడం తప్ప. కలలో నాకొక ముసలావిడ కనిపించింది. ఆమె భుజమ్మీద ఒక మూట వుంది. మూట చాలా బరువుందని తెలుస్తోంది. ఆమె ఏదో ప్రాచీన గీతం పాడుతోంది. పాట చాలా విషాదంగా వుంది. పాటలో మరో కొత్తకోణం కూడా వుంది. అది చాలా అందంగా వుంది. కాని, ఈ లోకానికి సంబంధించిన అందం కాదు. పాటలో ఒకరకం మూలుగు వినిపిస్తోంది. సైనికులు వచ్చి ఆమెను చంపేశారు. ఆమె రక్తం ఇంకిపోయి గడ్డి ఎర్రబడింది. ఇండియన్లు అందరూ చనిపోయి నేలమీద పడి వున్నారు. సైనికులు వెళ్లిపోయారు. సైనికుల గుర్రాల గిట్టల శబ్దం, గుర్రాలు పరిగెడుతున్న గాలి శబ్దం స్పష్టంగావిన్నాను. వాటితో పాటు చనిపోయిన ఇండియన్ల ఆత్మలు నాకు ఏమో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా కొన్ని గంటలపాటు కలగని వుంటాను. నాకు ఆ కల ఎందుకు వచ్చిందో అప్పుడు తెలియలేదు. తరువాత చాలా కాలానికి గాని అది నాకు అర్థం కాలేదు. పెయూట్ ఆద్యాత్మిక శక్తి ద్వారానే నాకు ఈ కల వచ్చిందని నాకు గట్టి నమ్మకం.

అలా కలగన్నప్పట్నుంచి చాలాకాలం విపరీతమైన దిగులుకు లోనయ్యాను. నాలోంచి సారమంతా బయటికి వెళ్లిపోయినట్లుండేది. అప్పటికి నేనింకా బడికి వెళ్లే పిల్లనే. అలాంటి కలల్ని భరించడానికి తగినంత వయసు లేదు. మేము ఇలాంటి బతుకు బతకడానికి ఈ భూమ్మీద పుట్టలేదు, అయినా ఇలాంటి బతుకు బతకాల్సి వస్తోందని దిగులు పడ్డాను. మాకు పరిస్థితులు ఇంత ఘోరంగా ఎందుకు వున్నాయి, ఇండియన్లకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని నాకు నేను ప్రశ్నలు వేసుకున్నాను. జవాబు దొరకలేదు.

క్రౌ డాగ్ ఇలా అంటూ వుంటాడు: “పెయూట్ తాత కు నోరు లేదు గాని మాట్లాడుతాడు; కళ్లు లేవు గాని చూస్తాడు; చెవులు లేవు గాని వింటాడు, నువ్వు వినేట్లు చేస్తాడు.” లియొనార్డ్ క్రౌ డాగ్ కు చదవడం రాయడం రాదు. “ పెయూట్ తాతే నా ఉపాద్యాయుడు, నా గురువు” అంటాడు. వూండేడ్ నీ సంఘటనల్లో పాల్గొన్నందుకు గాను జైళ్లో వున్నప్పుడు క్రౌ డాగ్ దగ్గరికి ఒక సైకియాట్రిస్టు వచ్చేవాడు. అతనితో క్రౌ డాగ్ ఇలా చెప్పేవాడు, “ మీరు నాకు అవసరం లేదు. పెయూట్ నా సైకియాట్రిస్టు. ఈ పవిత్ర మూలిక సహాయంతో నేను మీ మనస్తత్వ విశ్లేషణ చేయగలుగుతాను.” డాక్టరుకు అదేమీ అర్థం కాలేదు. క్రౌ డాగ్ జడ్జి ముందు నిలబడి “పెయూట్ నా న్యాయవాది” అని చెప్పేశాడు.

క్రౌ డాగ్ పెయూట్ పంథా ప్రయాణీకుడు. తన జనానికి బతుకు బాట చూపిస్తున్నాడు. క్రౌ డాగ్ ను పెళ్లి చేసుకున్న తరువాతే ఈ మందు గొప్పదనాన్ని అర్థం చేసుకోగలిగాను. లియొనార్డ్ వద్ద పెయూట్ మందు వుంది. దాన్ని పెయూట్ లేదా అంకెలా అంటారు. అతని దగ్గర పవిత్ర పొగ గొట్టం కూడా వుంది. తానొక పెయూట్ గురువు, అలాగే సాంప్రదాయక లకోటా మెడిసిన్ మ్యాన్, సూర్య నృత్యకారుడు కూడా. ఈ విషయంలో క్రౌ డాగ్ ను కొందరు తప్పు పడుతుంటారు. ఆ మాటకొస్తే క్రౌ డాగ్ నిర్వహించే క్రతువుల్లో పాల్గొనే మా అందరిమీదా విమర్శ వుంది. పెయూట్ లేదా పవిత్ర పొగ గొట్టం, అదో ఇదో ఒకదాన్నే నమ్ముకోవాలి. రెండింటినీ నమ్మడం సరైంది కాదంటారు. కాని, లియొనార్డ్ తన నమ్మకాల్ని వేర్వేరు గూళ్లలో దాచిపెట్టలేడు. ఇండియన్ల ప్రాచీన మతాలన్నీ ఒకే అత్యున్నత మాహా శక్తిలోని విభిన్నాంశాలు మాత్రమేనని క్రౌ డాగ్ అభిప్రాయం. అంతా కలిసి ఒక సృజనాత్మక శక్తి అంటాడతను. వాకన్ తాంక, తుంకశిలా లేక మహాశక్తి తీసుకునే పలు రూపాల్లో పెయూట్ ఒకటి, అంతే. పెయూట్, పొగ గొట్టం, జింక, పక్షి, సీతాకోక చిలుక, గులక రాయి - అన్నీ ఆ మహాశక్తిలో భాగమే. అన్నిటిలో ఆ శక్తి వుంది. ఆ శక్తిలో అన్నీ వున్నాయి.

కలలు, దివ్య దర్శనాలు మాకు చాలా ముఖ్యం. బహుశా ఇండియన్ల మతంలోని ఏ అంశం కన్న ఇవే ఎక్కువ ముఖ్యం మాకు. నేను దక్షిణ అమెరికా, మద్య అమెరికా, మెక్సికో, అర్కిటిక్ వలయం… పలు చోట్ల నుంచి వచ్చిన ఇండియన్లను కలిశాను. అందరూ దివ్య దర్శనం కోసం ప్రార్థనలు చేస్తారు. సూ ప్రజల భాషలో చెప్పాలంటే అందరూ “కల కోసం విలపిస్తున్నారు”. కొందరు దివ్య దర్శనం కోసం కొండమీద ఒంటరిగా విజన్ - పిట్ లో వుండి నాలుగు పగళ్లూ రాత్రులు ఉపవాస దీక్ష చేస్తారు. మరి కొందరు సూర్యనృత్య దినాల్లో అకాశంలో కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతిలోకి చూస్తూ ఉపవాసాలతో బాధపడుతూ దివ్య దర్శనం సంపాదిస్తారు. ఘోస్టు డ్యాన్సర్లు ఒక వలయంలో తిరుగుతూ తిరుగుతూ మంత్రాలను ఉచ్ఛరిస్తారు. తిరిగి తిరిగి నేలమీద పడిపోయి, తమ శరీరాల్ని వదిలేసి, భూమిని వదిలేసి, పాల పుంతలో నక్షత్రాల మద్య తిరుగుతూ గడుపుతారు. ఆ నిద్ర నుంచి లేచాక తాము ఏమేమి చూశారో వర్ణించి చెబుతారు. కొందరికి వారి పిడికిళ్లలో ‘నక్షత్ర మాంసం’, చంద్ర శిలలు కనిపించాయని చెబుతారు. ఇంకొందరికి మెరుపు తీగల ద్వారా, ఉరుము గర్జనల ద్వారా దివ్య దర్శనం కలుగుతుంటుంది. కొన్ని తెగల వాళ్లు పవిత్ర పుట్టగొడుగులు లేదా జిమ్సన్ వీడ్ సహాయంతో దివ్య దర్శనం పొందుతుంటారు. స్వెట్ బాత్ లలో ఉపయోగించే స్వెట్ లాడ్జ్ లలో ఉక్కిరి బిక్కిరి చేసే వేడి పొగల మద్య దివ్య దర్శనం పొందే వాళ్లూ చాలామందే వున్నారు. క్రౌ డాగ్ అలాంటి దివ్యదర్శన యత్నాలలోనూ, పెయూట్ సమావేశాలలోనూ ‘ఆకస్మిక మెరుపుల రూపం’లో దివ్య దర్శనం పొందుతుంటాడు.

ఈ పవిత్ర మొక్కను ఆజ్టెక్ తెగ వారి భాషలో పెయూటల్ అంటారు. పెయూటల్ అంటే గొంగళి పురుగు. ఈ జముడు మొక్క మీద గొంగలి పురుగు బొచ్చు మాదిరి నూగు వుంటుంది. దీన్ని మా సూ భాషలో పెజూత అంటారు.పెయూట, పెజూత శబ్దాలు దగ్గర దగ్గరగా వినిపిస్తాయి. శబ్దాల మద్య దగ్గరితనం కాకతాళీయం కావచ్చు. మాకు పెయూట్ మొక్క మెక్సికో నుంచి వచ్చిందనడంలో సందేహం లేదు. 1870 లలో కియోవా, కొమాంచె తెగల వాళ్లు ఈ మూలికతో ప్రార్థనలు చేస్తూ ‘నేటివ్ అమెరికన్ చర్చి’ అనేదాన్ని రూపొందించారు. ఇప్పుడు అలాస్కా వరకు అన్ని తెగలలో పెయూట్ మతం వ్యాపించి వుంది. రియో గ్రాండ్ తరువాత ఇక ఈ మొక్క కనిపించదు. మేము ఉత్తరాన సరిహద్దు ప్రాంతాలనుంచి మా మూలికలు తెప్పించుకోవాలి. నైరుతి ప్రాంతలో వుంటుంది మా ‘పెయూట్ తోట’.

మైదాన ప్రాంతాల ఇండియన్ల వద్దకు పెయూట్ సరిగ్గా రావలసిన సమయంలో వచ్చిందనవచ్చు. వారి పశువులన్నిటినీ చంపేసి, తెగలను కంచెలు కట్టిన రిజర్వేషన్లలోకి తరిమివేస్తున్నప్పుడు; ఇండియన్లు ఆకలి మంటలలో, తెల్లవాడి జబ్బులతో చనిపోతున్నప్పుడు ; ఇండియన్లు తమకు ముఖ్యమైనవని అనుకునేవన్నీ వాళ్లకు కాకుండా పోతున్నప్పుడు… పెయూట్ వారికి అందింది. ‘నేటివ్ అమెరికన్ చర్చి’ అనేది ఓడిపోయిన, చెదిరిపోయిన, పేదల్లో పేదలైన ప్రజల మతం అయ్యింది. ఇండియన్లు తమ కష్టాల్ని అర్థం చేసుకోవడానికి, భరించి నిలదొక్కుకోవడానికి పెయూట్ ఉపయోగపడింది. ఆ చీకటి రోజులలో వాళ్ల ఒకే ఒక జీవశక్తి పెయూట్. తెల్లవాళ్లు మానుంచి అన్నీ లాగేసుకున్నారు. దీన్ని కూడా లాగేసుకుంటారని భయపడేవాళ్లం. “ఇంత మంచిది వాళ్లకు ఎందుకు ఉండాలి. దీన్ని లాగేసుకుని మనమే అనుభవిద్దాం” అనుకునే తెల్లవాళ్లు ఇప్పుడు కూడా ఉంటారనుకుంటాను. కొంతమంది తిరుణాళలో రెండు తలల దూడను చూడ్డానికి వచ్చినట్లు “మెడిసిన్ మ్యాన్ ను చూడడానికి లియోనార్డ్ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు. రాగానే మొట్టమొదటి మాటగా “హేయ్, ఛీఫ్, కాస్త పెయూట్ ఉందా’ అని అడుగుతుంటారు. ఇప్పటికే కొంతమంది పెయూట్ ను దుర్వినియోగపరచడం చూశాను. మిగతా అన్ని మాదక ద్రవ్యాల్లాగే దాన్ని ఉపయోగించడం చూశాను. మా పవిత్రమైన మందు దొరక్కుండా పోవడం అప్పుడే మొదలయ్యింది.

ఇండియన్లు పూజా సమయంలో ఉపయోగించే వస్తువుగా పెయూట్ కొనడం, ఉపయోగించడం పూర్తిగా చట్టబద్ధం. కాకపోతే దానికొక ధర ఉంటుంది. డబ్బిచ్చి కొనుక్కోవాలి. ఇండియన్లమైన మాలాగే, పెయూట్ ని కూడా కంచెల మధ్య నియంత్రించే కొద్దీ అది దొరకడం కష్టమైపోతోంది. టెక్సాస్ సరిహద్దుల పొడుగునా వ్యాపారుల నుంచి, ‘నేటివ్ అమెరికన్ చర్చి’ ప్రజలు భారీ ధరలు పెట్టి పెయూట్ కొనాల్సి వస్తోంది. వ్యాపారులకు ఇది మరొక ‘గోల్డ్ రష్ ‘ అయిపోయింది. పెయూట్ మీద ద్రవ్యోల్బణం దెబ్బ కూడా పడింది. ఇది డిమాండు, సరఫరా సూత్రానికి లోను కావలసి వచ్చింది. ఊహించడానికి కష్టంగా వుంటుంది. ఎవరూ సాగు చేయకుండా తనకు తాను విపరీతంగా పెరిగే మొక్క, స్థానిక ప్రజలకు అనాదినుంచి ప్రకృతి ఇచ్చిన వరం - ఇది కూడా ఇప్పుడు వ్యాపారవస్తువే.

పెయూట్ నన్ను నేను అర్థం చేసుకోవడానికి, నా చుట్టూరా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను నా ప్రజల ఔన్నత్యాన్ని, పెయూట్ ఔన్నత్యాన్ని ఒకేసారి చూడగల్గుతాను. అది అంత గొప్పది. కాని, దుర్వినియోగం చేస్తే అంత ప్రమాదకరమైనది కూడా. సరైన మనస్సుతో, సరైన పద్దతిలో దాన్ని ఉపయోగించాలి. తలకాయలో చెడు తలపులున్న వారిని అది బాధిస్తుంది. పెయూట్ నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. ఎప్పుడూ నన్ను బాగా చూసుకుంది. మరేదీ నాకు తోచనప్పుడు పెయూట్ నాకు సాయం వచ్చింది. పెయూట్ తాతకు నీ సంగతి తెలుసు, తన నుంచి నువ్వు దాక్కోలేవు. అది ఇంకా పుట్టని పాప తల్లి కడుపులో నృత్యం చేసేలా చేస్తుంది. దానికా శక్తి వుంది. సరైన పద్దతిలో ఈ మందు తీసుకున్నప్పుడు నీలో బలం ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది, నువ్వొక ‘శక్తి క్షేత్రంలో ప్రవేశిస్తావు’. నీకు… నీకు మాత్రమే ఇవ్వబడిన ఒక మరో ప్రపంచ శక్తి క్షేత్రంలో ప్రవేశిస్తావు. శక్తి గురించిన ఈ భావన కూడా ఇండియన్లు అందరికీ సామూహికమైనదే. పెయూట్ తీసుకునే వారయినా తీసుకోని వారయినా ఈ శక్తి భావనను నమ్ముతారు.

పెయూట్ ఒక ఏకీకరణ శక్తి కూడా. నిజానికదే దీనిలో అతిముఖ్య లక్షణం. మునుపు శత్రువులుగా వున్న తెగలు దగ్గరికి చేరి స్నేహితులు కావడానికి, మేము మా పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ ఏకీకరణ శక్తి ఉపయోగపడింది. నేను ఎ.ఐ.ఎం. బాట పట్టాను కాబట్టే పెయూట్ బాటలో నడిచాను. నావరకు నాకు అవి రెండూ ఒకే బాట. నేను చాలా తెగలవాళ్లను కలిశాను. వాళ్లు విభిన్న సంస్కృతులతో, విభిన్న భాషలతో జీవిస్తున్నారు. పెయూట్ మందును ఉపయోగిస్తున్నప్పుడు వారి క్రతువులు కూడా విభిన్నంగా ఉండొచ్చు. “మాదే ఉత్తమ తెగ. మా మగవాళ్లు మీవాళ్ల కన్న బాగా పోరాడేవారు. ఏం చేసినా మేమే బాగా చేస్తాం” అని తెగల మధ్య అసూయలు ఉండొచ్చు. కాని, అందరూ ఒకసారి పెయూట్ టీపీ (ఇల్లు) లో కలుసుకున్నారంటే విభేదాలు మరచిపోతారు. ఇక వాళ్లు న్యావహోలు కారు, పోంకాలు, అపాచీలు, సూలు… ఏవీ కారు. ఇండియన్లు, అంతే. ఒకరి పాటల్ని ఒకరు నేర్చుకుంటారు. నిజానికి తామంతా ఒకటేనని తెలుసుకుంటారు. పెయూట్ చాలా తెగలను ఒకే తెగగా ఏకం చేస్తోంది. విభిన్న ఇండియన్ జాతులను ఏకం చేయడంలో సూర్యనృత్యం నిర్వహించే పాత్ర కూడా అలాంటిదే.

Share/Save/Bookmark

అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో