మే2008
తొలి దళిత స్త్రీవాద కవిత్వం – మంకెనపూవు
తెలుగులో స్త్రీ దళితవాద కవిత్వాల ఆవిర్భావంతో సాహిత్యపీఠాల కుదుళ్ళు కదలడం ప్రారంభమైంది. అంతవరకూ తెలుగు సాహిత్యాకాశాన్ని కమ్ముకున్న అరుణ వర్ణ మేఘాలు కాస్త పక్కకు తొలిగి నీలి మేఘాలకు, నల్ల గబ్బిలాలకు చోటు యివ్వాలిసిన అగత్యం ఏర్పడింది. మరొక ప్రక్క బహుజన, ముస్లిం, ప్రాంతీయవాదాలు మొత్తం సాహిత్యచరిత్ర నిర్మాణాన్ని ప్రశ్నించేస్థాయికి చేరాయి. ఆది కవి స్థానంలో నన్నయకు బదులు నాచన సోమన్ననూ, తొలి తెలుగు నవల విషయంలో రాజశేఖర చరిత్ర స్థానంలో రంగరాజచరిత్రను ప్రతిపాదించడం ఇందులో భాగమే! తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని పునర్ మూల్యాంకనం చేసే ప్రక్రియ ఆలశ్యంగానైనా ప్రారంభం అయిందని ఇలాంటి ప్రతిపాదనలు రుజువు చేస్తున్నాయి. ఇది ఆహ్వానించ దగ్గ ఆరోగ్యకర పరిణామం.
తెలుగు సాహిత్యోద్యమంలో మొదటినుంచి ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. అదేమిటంటే ఈ కొత్త ఉద్యమాలతో పాటు పూర్వపు ఉద్యమాలు కూడా ఏకకాలంలో కొద్దొగొప్పో తేడాతో అస్థిత్వంలో ఉండటం వల్ల మా ఉద్యమం గొప్పదంటే మా ఉద్యమం గొప్పదనే గందరగోళం నెలకొంది. నిజానికి ఇవన్నీ అంతర్గతంగా ఒకదానికి మరొకటి పూరకంగా వచ్చినవే! అభ్యుదయం వల్ల వొనగూడే సోషలిజం కంటే, సాయుధ పోరాటం వల్ల సిధ్ధించే వర్గరహిత సమాజమే మంచిదని విప్లవ రచయితల సంఘం. విరసంలో వర్గదృశ్టే తప్ప లింగ, వర్ణ దృక్పథంలేదని స్త్రీవాద, దళితవాద ఉద్యమాలు, మళ్ళీ స్త్రీవాదంలో దళితస్త్రీలకు ప్రాతినిధ్యం లేదని దళితస్త్రీవాదమూ, ముస్లిం స్త్రీలకు ప్రాతినిధ్యం లేదని ముస్లిం స్త్రీవాదమూ, మొత్తం దళితవాదం నుండి బి.సి మైనార్టీ ఉద్యమాలు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి. ఇది ఒక అంతర్గత చక్రం. ఎవరికి యిష్టం వున్నా లేకపోయినా ఈ ఉద్యమాలు తమ పనిని గొప్ప నిబద్ధతతో నిమగ్నతతో చేసుకుపోతున్నాయి.
మనకి నిన్నమొన్నటివరకు రచయిత్రులు వున్నారు కానీ స్త్రీవాద రచయిత్రులు లేరు. ముస్లిం కవులు వున్నారు కాని ముస్లింవాద కవులు లేరు. అలాగే దళిత రచయితలు వున్నారు కానీ దళితవాద రచయితలు లేరు- దీనర్థం ఏమిటంతే ఆయా జెండర్, కులం, మతంలో పుట్టినంత మాత్రాన ఆయావాద రచయితలు కాలేరని, తాము వచ్చిన మూలాల నేపథ్యం నుండి మాట్లాడుతున్నవారు ఆయా వాదాలకు ప్రాతినిధ్య రచయితలు అవుతారని. దాదాపు రెండు దశాబ్దాలు పై చిలుకు నుండి తెలుగులో స్త్రీలు, దళితులు తమ మూలాలనుండీ మాట్లాడే ఒక అనివార్యతను తెలుగు సమాజం, సంఘటనలు కల్పించాయి. ‘చిక్కనవుతున్నపాట’ సంకలనంలో దళితవాద కవిత్వం లేకపోవడం అంతకు ముందటి సాహిత్యోద్యమాల వైఫల్యం.
తెలుగు దళితకవిత్వానికి మొదటిసారిగా దళిత స్త్రీ దృక్కోణం అందించిన కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి. ఆమె కవితాసంపుటి ‘మంకెనపూవు’ తెలుగులో తొలి దళిత స్త్రీవాద కవిత్వం. ‘చిక్కనవుతున్న పాట’ సంకలనం వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత వేదిక వెలువరించిన ‘గుండెడప్పు’ సంకలనంలో స్వరూపరాణి దళిత స్త్రీ కోణం నుండి రాసిన మంకెనపూవు, మట్టి బతుకులు కవితలు తొలిసారిగా అచ్చయ్యాయి. 1996లో వెలువడిన ‘పదునెక్కినపాట’ సంకలనంలో ఇతర దళిత కవయిత్రులతో పాటూ స్వరూపరాణి కవిత్వమూ చోటుచేసుకున్నది.
బయలుదేరిన తొలిరోజుల్లో దళిత సాహిత్యోద్యమం రెండు కొత్త బాధ్యతలనూ స్వయంగా నిర్వహించుకోవల్సి వచ్చింది. అందులో మొదటిది ఉద్యమ సాహిత్యానికి ఒక కొత్త పాఠకవర్గాన్ని తయారుచేసుకోవడం. రెండవది ఆ పాఠకవర్గం నుండి కొత్తతరం రచయితలను, కవులను సృజించుకోవడం, ఈ రెండు పనులనూ దళితసాహిత్యోద్యమం విజయవంతంగా నిర్వహించింది. అందులో భాగంగానే కొత్తతరం దళితకవులు మరీ ముఖ్యంగా దళిత స్త్రీవాద కవులు బయలుదేరారు. ఆ వరుసలో తొలితరం దళితస్త్రీవాద కవయిత్రులలో మొదటిది బలమైనది స్వరూపరాణి గొంతు. అయితే ఇప్పటివరకూ దళిత కవిత్వంలో దళితస్త్రీల సమస్యలు వ్యక్తం కాలేదా అంటే, అవుననే సమాధానం. అయితే అవి దళిత పురుషకవులు రాసినవి. సతీష్ చందర్, ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్ బాబు, కత్తి పద్మారావు, కోయి కోటేశ్వరరావు వంటి కవులు దళితస్త్రీల ఆర్తిని తమ కవితల్లో బలంగా వ్యక్తీకరించారు. దళితస్త్రీవాదం నుండి పురుషాదిక్య వ్యతిరేక భావజాలాన్ని, దళితవాదం నుండి కులాధిపత్య ధిక్కార స్వరాన్ని ఏకకాలంలో అందిపుచ్చుకున్నారు. అందుకే కులాన్ని ప్రశ్నించినంత తీవ్రస్వరంతో దళిత పురుషాధిక్యాన్ని ప్రశ్నించగలిగారు. స్త్రీవాదం కేవలం జండర్ సమస్యను ముందుకు తీస్తే దళితస్త్రీవాదం జెండర్‌తోపాటు కులంవలన అదనంగా దళితస్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించింది. దళితస్త్రీవాదం ప్రారంభమే స్త్రీవాదం వదిలేసిన సమస్యలను ఖాళీలను ప్రశ్నించడం, పూరించడంతో ప్రారంభమైంది.
కురవడం నేర్పిన
నా నీలిమేఘమా
నీ ప్రశ్నల చినుకులు
అన్నీ అమరిన వంటింటి దాకా వచ్చాయిగానీ
అసలు ఇల్లే లేని
నా మూడు రాళ్ళ పొయ్యి
గుమ్మమయినా తొక్కలేదేం
స్త్రీవాదం దళితస్త్రీ వరకూ రాలేకపోయిన ఒక దూరాన్నీ అంతరాన్నీ ఈ పాదలు సూచిస్తున్నాయి. సరిగ్గా స్త్రీవాదం ఆగిపోయిన ఈ చోటనుండే దళితస్త్రీవాదం మొదలయింది. ఈ మంకెనపూవుల కళ్ళు ఈ శతాబ్దపు జాములోయలో నిలబడి నెత్తుటిమరకలంటని సరికొత్త శకాన్ని ఎలుగెత్తి పిలుస్తున్నాయి. ఈ సంపుటికి శీర్షికై నిలిచిన ‘మంకెనపూవు’ కవిత సగటు దళితస్త్రీ ఆత్మకథనం. ఊరి కులాధిక్యంతో పాటు వాడ పురుషాధిక్యాన్నీ గుర్తించడం, ప్రశ్నించడం ఈ కవిత సాధించిన ప్రయోజనం.
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా
నా చుట్టూ ఎపుడూ ప్రమాదం బుసలు కొడుతుంది.
అసలు నా జీవితాన్ని నేనుగా జీవించలేదెపుడు
ఇంట్లో పురుషాహంకారం ఒక చెంప చెళ్ళుమనిపిస్తే
వీధిలో కులాధిపత్యం రెండో చెంప పగలగొడుతుంది.
ఒక దలితస్త్రీ జీవితంలోని ప్రతిసందర్భంలోనూ సన్నివేశంలోనూ ఎదుర్కొన్న కులపీడనకు శక్తివంతమైన ఆవిష్కరణ ఈ కవిత. చివరికి తాను చేయగలిగింది కష్టాల మంటల్లో బతుకుని కడుక్కుని మంకెనపూవులా విచ్చుకోవడం. ఈ విచ్చుకోవడంలో నేత్రధ్వని వ్యజింపబడింది. అది శక్తికి ప్రతీక. తిరుగుబాటుకు సూచిక. మాయమ్మ కవిత ఒకరకంగా లక్షణాలను కలిగి ఉన్న కవిత. దళిత స్త్రీ పీడనతో పాటు స్త్రీవాదంలోని డొల్లతనాన్ని బోనులో నిలబెట్టి ప్రశ్నించడం కనబడుతుంది. అంటరానివొంటిని కోరికల స్కేళ్ళతో కొలిచే వూరి అరుగులను మరుగుదొడ్లకు మల్లే కడుగుదాం అంటూనే
ఆ బంగారు చేత్తోనే మిమ్మల్ని బాబుగాడి సొమ్ములా
వాడుకుంటున్న మీ పెట్టుబడీదారి పెనిమిటిని
కిందినుంచి పైదాకా ఫినాయిల్‌తో జాడిద్దాం!
కవిత్వం నిర్వర్తించే అనేకానేకమైన చర్యల్లో మనసుల్ని శుభ్రపరచడం కూడా ఒకటి. మంకెనపూవు కవిత్వం ఆ పనిని విజయవంతంగా నిర్వహించిదని ఈ కవిత రుజువుచేసింది. దళిత సాహిత్యంలో గిరిజన కవుల ప్రాతినిథ్యమేకాదు, కనీసం గిరిజన జీవితాలను ప్రస్తావించిన కవితలూ అరుదే! స్వరూప ఈ సంకలనంలో కొండమల్లి, చెంచిత వంటి కవితల్లో గిరిజన జీవితాల్ని వాస్తవిక దృష్టి, సౌందర్యం మేళవించి ఆవిష్కరించగలిగింది. బడాబాబుల బంగ్లాల్లో అందంగా అమర్చిన లంబాడీ స్త్రీల పేయింటింగ్‌ల సౌందర్యం వెనుక వున్న క్రూరత్వాన్ని కవి ఇలా పసిగడుతుంది.
“రాళ్ళు రప్పల్లో / ఎండా వానల్లో / రేయింబవళ్ళు తిరిగి /
రాటుదేలిన నా పలవరింతల పళ్ళు / వొంపులు చొంపులుగా
తైలవర్ణ చిత్రమై మీ గోడపై తళుకు మంటుంటే / లజ్జతో
కుచించుకుపోయిన నా మనసుతో పాటు / ఆకలికి
అంటుకుపోయిన / పేగులు సైతం కలుక్కుమంటున్నాయి ”
సునీత, బసివి, బిడ్డసంచులు, మట్టిచేతులు, పూలన్‌దేవి వంటి కవితలు వివిధ అంతరవులతో దళితస్త్రీ ఎదుర్కొంటున్న మానసిక స్థితిని విశ్లేషించిన మంచి కవితలు. దళితస్త్రీల విషయాలలో ఇంత ఆర్ద్రత చూపగల ఈ కవి మానవ సంబంధాల విషయంలోనూ అంతకంటే ఆర్ధ్రంగా స్పందించడం అబ్బురపరిచే విషయం. నాన్న కోసం, తాతయ్య కోసం రాసిన నల్ల సూర్యుడు, పెచ్చులూడీన బాల్యం వంటి కవితలు ‘దళిత నేటివిటీ’తో పాటు ఆత్మకథనాత్మక (ఆటో బయొగ్రఫికల్) రూపంలో వ్యక్తమైన అపురూప చిత్రాలు, మరాఠీ దళిత సాహిత్యంలో ప్రాచుర్యంలో ఉన్న ఈ ప్రక్రియ తెలుగులో ఇంకా విస్తరించాల్సి ఉంది. అందుకు ఇటువంటి కవితలు మంచి ఊతం ఇస్తాయి, ఇంతరాసి ఈ కవి నిలవనీటి కాసారంలా నిలిచిపోయిన దళిత ఉద్యమం గురించి “సుఖంగా ఉద్యమిద్దాం రండి” కవిత రాసినా, దళిత ఉపకులాల మధ్య వర్గీకరణ చిచ్చుకు కలవరపడి ‘కవలపేగు’ కవిత రాసినా స్వరూప వర్తమాన దళిత సమాజాన్ని తన ‘మంకెనపూవు’ కన్నుతో వీక్షిస్తున్నట్లు వివేచిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
gurram seetaramulu మే 2008 1
Visayam baagundi
kaani Vargeekarana rajkeeyalanu chichhu anadame
Sanjeeva rao apasavyata telustundi
upa kula chaitanyam lo Vargeekaraniyanni Eekikaraniyanni
oke gatana katta gala nerpu sikamani garidi
antaa chaitanyame
nijam edantaa chaitanyame
Pranahita May-2008 Issue Released « Flat Forum అక్టోబర్ 2008 2
[…] read the review of Charlapalli Swaroopa Rani’s ‘mankena pUvu’ by Shikhamani describing it as first dalit women poetry. Also please read the essay that introduces the […]