May2008
నీడల మాటు
వాళ్ళు జీవితాన్ని
జీవితంలానే జీవించేవాళ్ళు
మెరిసే ఆకులలా
పరచిన నీడలా సంచరించేవాళ్ళు
తేనెటీగలకు రెక్క బలం నేర్పి
తేనె మూటగట్టటం తెలిసినవాళ్ళు
చివురు రాలకుండా
కొమ్మ విరవకుండా
ఒడినిండా కాయల్ని
ఒడుపుగా తెంపడం తెలిసినవాళ్ళు
అడవి వారిలో నాటుకుందో
వారే అడవిలో నాటుకున్నారో
తెలియదు
నిండు గంజికుండలో
ముఖం ముంచి నాకుతున్న
కుక్కని సాంతం తిననిచ్చి
మళ్ళీ ఒండుకోవడం తెలిసినవాళ్ళు
భుజాన గెంతి కూర్చున్న కోతిపిల్లను
చంకన బిడ్డతో పాటు మోసినవాళ్ళు
అయినా
ఎక్కడి నాగరీకమో
ఖాకీ బట్టలేసుకుని
వారి యజ్ఞవాటికల్లో
బీభత్సం సృష్టిస్తారని
కొండల్ని తవ్వి
ఎలుకల్ని చరుస్తారని
వారికేం తెలుసు!
పొగలు పెట్టినపుడు
ఏది స్పష్టంగా కనిపిస్తుందని!
ఒక్క మన నటన తప్ప
మన దానవత్వం తప్ప!
(వాకపల్లి గిరిజిన స్త్రీలపై జరిగిన హింసకు నిరసనగా)