May2008
ప్రేమ కాదా? అయితే పిచ్చా??
పరమ చెత్తగా వుంది సినిమా. ఎలాగోలా ఇంటర్వెల్ దాకా చూసింది లావణ్య. రాజా రాడేమిటి? పదోసారి విసుక్కుంది.
జనాలు కాళ్ళు తొక్కుకుంటూ పోతున్నారు.
“హబ్బా అంత జాగా పెట్టుకొని కాళ్ళు తొక్కి పోతారెందుకు? కళ్ళు కనబడకా?” అరిచింది.
“సిక్స్ థర్టీరోయ్…” రెండు సీట్లు వెనకనుంచి ఎవడో ఈలవేశాడు.
కోపంగా వెనక్కి తిరిగి చూసింది.
వాడు నవ్వాడు. పక్క సీటు వాళ్ళు అయిష్టంగా మొహాలు తిప్పుకున్నారు.
లావణ్య పైట సర్దుకుంటూ లేచి బాత్రూమ్ కి వెడదామనుకుని కూడా ఏదో గుర్తొచ్చి మానేసి మళ్ళీ సీట్లో కూలబడింది.
తొందరగా సినిమా మొదలైతే బావుండు. సినిమా మొదలైతే లైట్లారిపోతాయి. జనం ఎవరూ లేకుండా చూసి బాత్రూమ్ కి వెళ్ళిరావచ్చు. లేకపోతే ఎక్కడికని వెళ్ళాలి? ఆడవాళ్ళ బాత్రూమ్‌కా? మొగాళ్ళ బాత్రూమ్‌కా?
ష్, లాభం లేదు. నిన్నగాక మొన్న ఎంత గొడవ జరిగింది.
ఆవిడెవరో ఎస్సైగారి చెల్లెలట. ఆడాళ్ళ బాత్రూమ్‌లోకి వెడుతున్న తనని నిలదీసి హాలువాళ్ళకి అప్పగించింది. ఎంత చెప్పినా వినకుండా రెండ్రోజులపాటు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉతికేశారు. వాళ్ళ పిచ్చి గాని ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఏం చేస్తుంది? ఆ మాటే చెప్పింది. విన్లేదు.
“చీర కట్టుకున్న వాళ్ళంతా ఆడవాళ్ళయిపోతారా? నువ్వు మగాడివి ఇంకోసారి గాని ఆడాళ్ళ జోలికి వెళ్ళావో…” లాఠీలతో రోజంతా కుమ్మేశారు. తేరుకోడానికి నాల్రోజులు పట్టింది.
అలాగని మగాళ్ళ బాత్రూమ్‌కి వెడదామా అంటే అక్కడ ఎటువంటి అఘాయిత్యమైన్న జరగొచ్చు. తన ఫ్రెండ్ హేమమాలినికి అదే జరిగింది. ఈ రాజు పరిచయం అప్పుడే కదా! హేమని విడిపించడం కోసం రాజుని సపోర్టు తీసుకెళ్ళింది. రాజు హేమని రక్షించాడు. తన మనసులో చోటు సంపాయించాడు. నెల్లాళ్ళ క్రితం కమ్యూనిటీ నుంచి బైటికొచ్చి రాజుతో కలిసివుంటోంది.
ఇంతకీ ఏడీ రాజు?
రాజుని తల్చుకుంటే వొంట్లో కొత్త రక్తం చేరినట్టుగా వుంటుంది. వంట చెయ్యాలంటే రాజుకి ఏ కూర ఇష్టమో ఆలోచన. బజారుకెడితే రాజుకే చొక్కా బావుంటుందో వెతుకులాట, గుడి కనిపిస్తే రాజు గురించే ప్రార్థన. ఒక ఆడది తను నమ్మిన మగవాడ్ని ఎలా ప్రేమిస్తుందో తను అంతకంటే ఎక్కువ తపిస్తోంది. నమ్మరేమిటీ ఈ జనం?
అయితే ఆడాళ్ళు లేకపోతే మగాళ్ళ కోసమేనా ప్రపంచం? తన లాంటి వాళ్ళకసలు బతికే హక్కు లేదా? ఆడదానిగా బతకాలనే చిన్న కోరిక కోసం ఎన్ని అవమానాలు, తిరస్కారాలు, ఈసడింపులు!!!
చిన్నప్పుడోసారి తలుపు తీసుకుని అక్క లంగావోణి వేసుకొని అద్దంలో చూసుకుంటున్నాడతను. ఎంత బావున్నాడో? అక్క కంటే బావున్నాడు. “ఇదిగో ఇటు చూడండి, నే చెబితే నమ్మలేదు. కిటికీలోంచి అరుస్తూ అందర్ని పోగుచేశాడు అన్న. ఇంటిల్లిపాది తిట్లతో శాపనార్థాలతో వణికిపోయాడు తను. అప్పట్నించీ మొదలయింది కాపలా. పెరిగిన కొద్దీ కోరిక రెచ్చిపోయేది. వదిలి ఈ కమ్యూనిటీలో చేరేవరకూ మనశ్శాంతి లేదు.
స్… అబ్బా పొట్ట ఉబ్బిపోతోంది. లైట్లార్పి చావరేం. లైట్లారకుండానే సినిమా మొదలయింది. జనం అరిచారు. హాలు వాదు లైట్లార్పేశాడు. ఇందాకా గుర్రం మీద కాసేపు, స్కూటరు మీద కాసేపు, విమానం మీద కాసేపు, ఎగిరి హీరోయిన్ని రక్షించిన హీరో ఇప్పుడు ఒక కొజ్జా చేతిలో చిక్కుకున్నాడు. కొజ్జా హీరోగాన్ని ఎలాగోలా బలత్కారం చెయ్యాలని చూస్తోంది. హాలంతా నవ్వులతో దద్దరిల్లి పోతోంది. లావణ్య మొహం కందగడ్డలా మారింది.
“ఇదిగో” వెనక వరసలో ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగింది.
“మా బేబీ బూటు జారి పడిపోయింది. కుర్చీకిందికి వచ్చిందేమో చూస్తారా? వెనక సీటులోంచి యువకుడు అడిగాడు లావణ్య ముందుకి వొంగి బూటు తీసి ఇచ్చింది.
చెయ్యి తగలకుండా అతి జాగ్రత్తగా అందుకున్నాడు యువకుడు. భయంభయంగా చూస్తోందతని భార్య. ఆమె వొళ్ళో వున్న ఏడాది పిల్ల నవ్వుతూ కేరింతలు కొట్టింది. లావణ్యకు ముచ్చటేసింది.
“పేరేంటి పాపా” అడిగింది. పాపకు మాటల్రావు. పెద్దవాళ్ళకి వచ్చినా మాట్లాడరు. పాపని గట్టిగా పట్టుకుని అటు తిరిగిందావిడ. లావణ్యకు మనసు చివుక్కుమంది.
“ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్ళే. పిల్లల్నెత్తుకు పోయి తమలాగా మార్చేస్తారట తెలుసా,” బేబీ బూటు తండ్రి. ఔనౌను అన్నట్టు తలూపింది బేబీ బూటు తల్లి. లావణ్య సినిమాలో నిమగ్నమవడానికి కష్టపడుతోంది.
తెరమీద హీరోగారి గుడ్డి చెల్లెలు కళ్ళు బాగుపడిపోయి, కలెక్టరయి పోయి చిన్నప్పటి వూరికి కారులో వస్తుంది. డబ్బులేక అడుక్కుంటున్న తల్లిదండ్రులు అదే కారు కింద పడతారు. ఈ సంగతులన్నీ తెలియని హీరో ఇంకో వూళ్ళో చెల్లి ఫోటోకి దండేసి తద్దినం పెట్టి పిండాన్ని చెరువులో వదులుతాడు. తల్లిదండ్రులతో కారెక్కి చెల్లెలు పెద్ద వానలో, వేడెక్కి పోయిన ఇంజనుకి డబ్బాతో నీళ్ళు తేవడం కోసం అదే చెరువులో దిగుతుంది. భలే తమాషాగా ఆ వూళ్ళో అన్నగారు వదిలిన పిండం ఇక్కడ చెల్లెలు పట్టుకుని అందులో గోంగూర పచ్చడి చూసి ఆనంద భాష్పాలు కారుస్తుంది. తల్లీ తండ్రీ కూడా ఏడుస్తారు. మరి అప్పుడు ఎలాగో కాని హీరో అక్కడ ప్రత్యక్షమై మొత్తం అందర్ని కావిలించుకుంటాడు.
సినిమా తీసిన వాడెవడో గాని జనాల్తో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు. జనాలు కూడా ఎడాపెడా నిట్టూరుస్తూ చూస్తున్నారు.
లావణ్య మెల్లిగా లేచి ఆడవాళ్ళ బాత్రూంకి నడిచింది. అదృష్టవశాత్తూ అక్కడెవరూ లేరు. తన పని కానిచ్చుకుని వచ్చేసింది.
తెరమీద కలెక్టరు పిల్ల చిన్నప్పటి స్నేహితుడూ, ఇప్పటి లారీ డ్రైవరూ అయిన ఒకబ్బాయి ప్రేమలో పడి స్టెప్పులేస్తోంది.
లావణ్య తన సీటుదాకా రాకుండా డోర్ కి దగ్గరగా ఖాళీగా వున్న కుర్చీలో చతికిలపడింది.
ఈ రాజు కసలు బుద్ధు లేదు… ఛీ… అనుకుంది.
రూంకి వెడదామా అంటే తాళం చెవి అతని దగ్గరుండి పోయింది. ఎప్పటిలానే ఇద్దరం ఇంటి దగ్గర్నించి ఒకేసారి బయల్దేరాం. వూరెళ్ళి తనవాళ్ళని చూసి రాత్రికల్లా వచ్చేస్తాను. నువ్వు నీ స్నేహితురాలితో సినిమా కెళ్ళు అని చెప్పాడు. ఎటొచ్చీ తను కొత్త పర్సు తెచ్చుకుంది. తన తాళంచెవి ఇంట్లో పాత పర్సులో వుండి పోయింది. ఎంత పిలిచినా సినిమాకి స్నేహితురాలు రాలేదు. తనకు వొంట్లో బాలేదంది. తప్పనిసరయి తనొక్కతే వచ్చింది. లావణ్యకి తలనొప్పి మొదలైంది. ఎక్కువగా అలోచించొద్దని డాక్టరు అంటాడు. కానీ ఎలా?
తను కూడా మనిషే కదా. ఆడో మగో తర్వాత సంగతి. అప్పుడెపుడో పేపర్లో చదివింది. సెక్స్ రోబోట్స్ అట. మనిషి చేసిన అన్ని పనులూ చేస్తాయట, శృంగారంతో సహా! కృత్రిమ అండాలు మగవాడి శరీరంలో ఉత్పత్తి చేసే అవకాశం వుందట. అప్పుడు ఆడదాని అవసరం లేకుండా పిల్లల్ని కనొచ్చట. గర్భసంచీ డిజైను మీద యింకేదో దేశంలో ప్రయోగాలు జరుగుతున్నాయట. అన్ని అభివృద్ధి చర్యలకిందికే వస్తాయి. ఎటొచ్చీ మనిషిని మనిషి అర్థం చేసుకోడమే కష్టం. నా మానాన నన్ను బతకనివ్వచ్చు కదా. నాకు శరీరం వుంది. అందులో కోరికలున్నాయి. మరి లేనిదేమిటి? అదే అర్థం కావడం లేదు.
ఫాన్సు తిరగడం లేదు. కిర కిర కిర చప్పుడు చేస్తూ ఏ క్షణమైనా నెత్తి మీద పడిపోయేలా వూగుతున్నాయి. సినిమా ఇంకా అవడం లేదు.
“రాజు ఇంక నిన్ను తంతాను” అనుకుంటూ గుమ్మం వైపే చూస్తుంది.
దూరంగా రాజు. నలిగిపోయిన చొక్కాతో ఎండ వేడికి మాడిపోయినట్టు వున్నాడు. కళ్ళలో మాత్రం అదే మెరుపు. ఒక్కో సీటు వరసలోకి ఉత్కంఠగా తన కోసం వెతుకుతున్నాడు. చేతిలో జాజిపూల పొట్లం…
మీకు పిచ్చిలా కనిపిస్తుందేమో కాని మాది మాత్రం ప్రేమే, ఇది ప్రేమ కాదంటారా? అయితే పిచ్చే అనుకోండి. మాకేమీ అభ్యంతరం లేదు.
లావణ్య నవ్వుతూ రాజుకెదురైంది.
October 25th, 2009 at 9:03 am
i raed this story/topic first time..i impressed very much.. i like telugu a lot… be proud to be a telugu person…or telugoid… im very thank ful to telugu version n who has put their efforts to bring this web page.. thaks to all…!! with regards..lavanya.g