May2008
‘మెతుకు సీమ చరిత్ర – సంస్కృతి’ పుస్తకావిష్కరణ
14 మే 2008 రోజు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ‘మెతుకు సీమ చరిత్ర – సంస్కృతి’ అనే పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సమావేశానికి టి.ఎన్.జి.వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీప్రసాద్ అధ్యక్షత వహించారు. పుస్తక పరిచయం చేస్తూ నాళేశ్వరం శంకరం మెదక్ జిల్లాకి చెందిన కొండాపురం శాతవాహనుల టంకశాలగా వెలిగొందిందని, క్రీ. శ. 1 వ శతాబ్దంలో ఈ రాజ్యాన్ని పరిపాలించిన గుణాడ్యుడు పైశాచిక భాషలో రచించిన ‘బృహత్కథ’ కావ్యం భారతీయ సాహిత్యానికి కథ రాసే విధానాన్ని అందించిందని అన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి అచ్చ తెలుగు కావ్యం కూడా మెదక్ జిల్లా పటాన్‌చెరువుకు చెందిన పొనగంటి తెంగనార్యుడు రచించిన ‘యయాతి చరిత్ర’ అని చెప్పారు. అట్లానే కాళిదాసు సంస్కృత కావ్యాలకు భాష్యం రాసిన మల్లినాథసూరి మెదక్ జిల్లా కొల్చారంకి చెందినవాడు. అంతేకాకుండా ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, రాజయ్య, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన దర్శకుడు, చిత్రకారుడు అయిన బి. నర్సింగ్ రావు కూడా మెదక్ జిల్లాకి చెందినవారని అన్నారు.
ఈ సమావేశంలో నర్రా భగవాన్ రెడ్డి రచించిన ‘తెలంగాణలో బైరాన్ పల్లి పోరాటం – 1948′ పుస్తకాన్ని కూడా చుక్కా రామయ్య ఆవిష్కరించారు. పుస్తక పరిచయం తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి జూలూరి గౌరీశంకర్ చేశారు. ఈ రెండు పుస్తకాలను మంజీరా రచయితల సంఘం ప్రచురించింది.
Pranahita May-2008 Issue Released « Flat Forum Oct 2008 1
[...] In the literary news section please read the news about the release of the book ‘metuku sIma charitra – samskRti’. [...]