ద పోస్ట్ మాన్ : (రెండవ భాగం)

- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)

(ప్రాణహిత ఏప్రిల్ 2008 సంచిక తరువాయి)
శాంత మహాసముద్రం తన అనంత సహనంతో సాధించలేకపోయిన మార్పులను ఆ చిన్న, ముద్దొచ్చే శాన్ ఆంటోనియో పోస్టాఫీసు తీసుకొచ్చింది. మారియో హిమేనెజ్ ప్రతిరోజూ పొద్దుపొడవకుండానే లేవడం మొదలుపెట్టాడు. లేచీలేవగానే హుషారుగా ఈలలు వేయడం కూడ మొదలుపెట్టాడు. ఇదివరకు లేచీలేవడంతోనే బాధించే ముక్కు దిబ్బడ ఇప్పుడు లేదు. తన ఉద్యోగబాధ్యతలను చాల కచ్చితంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. మారియో తనపనులను ఎంతబాగా చేస్తూ పోయాడంటే పోస్ట్ మాస్టర్ కోస్మె కు కూడ చాల నమ్మకం కలిగింది. పోస్టాఫీసు తాళం చెవిని కూడ మారియోకు ఇచ్చేశాడు. పాపం ముసలాయన ఎన్నాళ్లుగానో ఒక కల కంటున్నాడు. పక్కమీది నుంచి లేవకుండా మళ్లీ నిద్ర వచ్చేదాకా నిద్ర పోతూనే ఉండాలని, అలా ఎంతసేపూ నిద్రపోతూనే ఉండాలని, అలా నిద్రలోనే పగలూ రాత్రీ గడిపేసి మర్నాటి ఉదయం మేలుకునే సరికి పనిచేయడానికి బోలెడంత శక్తీ, ఆసక్తీ వచ్చేంత నిద్రపోవాలని. మారియోకు రోజూ ఉండేంత ఉత్సాహం తనకు కూడ ఉంటే ఎంతబాగుండునని కోస్మె అనుకునేవాడు. కోస్మె అంత ఉత్సాహంగా ఎప్పుడూ పనిచేయలేదు.

చిలీలో ఉద్యోగులందరికీ జరిగినట్టుగానే మారియోకు కూడ ఆలస్యంగా నెలన్నర తర్వాత మొదటినెల జీతం చెక్కు చేతికందింది. ఆ డబ్బులు చేతిలో పడగానే మహాఘనత వహించిన పోస్ట్ మాన్ మారియో హిమేనెజ్ గారు ఈ క్రిందివిధమైన కొనుగోళ్లు చేశారు: తండ్రికోసం స్పెషల్ వింటేజ్ కజినో మాకుల్ ద్రాక్ష సారా సీసా ఒకటి. నటాలీ ఉడ్ నటించిన వెస్ట్ సైడ్ స్టోరీ సినిమా టికెట్ ఒకటి, తనకోసం. జర్మనీలో తయారయిన స్టీలు దువ్వెన ఒకటి. శాన్ ఆంటోనియో బజారులో దువ్వెనల వ్యాపారి “జర్మనీ యుద్ధంలో ఓడిపోయిందిగాని శాంతిలో గెలిచింది. అక్కడ ఆయుధ తయారీదారులు ఇప్పుడు ఉక్కుతో దువ్వెనలు తయారు చేస్తున్నారు” అని అరుస్తుంటే ఆ దువ్వెన మీద ఆసక్తి కలిగింది. ఇక ఈ సామానులన్నీ కొనడం అయిపోయాక ఒక పుస్తకం కొన్నాడు. అది తాను ఉత్తరాలు తీసుకువెళ్లే ఏకైక ఆసామి రాసిన కవిత్వ పుస్తకం. పాబ్లో నెరూడా రాసిన ఎలిమెంటల్ ఓడ్స్.
కవి హుషారుగా ఉన్న, వీలయిన సమయం చూసి ఉత్తరాలతో పాటు ఈ పుస్తకం కూడ ఆయన చేతిలో పెట్టాలనీ, దానిమీద ఆయనతో సంతకం పెట్టించుకోవాలనీ మారియో నిర్ణయించుకున్నాడు. శాన్ ఆంటోనియోలో ఎప్పుడో ఒకప్పుడు తాను ఒక అద్భుతమైన అమ్మాయిని కలవకపోననీ, ఆ అమ్మాయి ముందర ఆ నెరూడా పుస్తకాన్నీ, అందులో నెరూడా తనకోసం చేసిన సంతకాన్నీ చూపెట్టి గొప్పలు పోవచ్చనీ మారియో కలలు కనడం మొదలుపెట్టాడు. ఒకవేళ అటువంటి మంచి అమ్మాయి శాన్ ఆంటోనియోలో దొరకకపోతే శాంటియాగోలో అయినా దొరకవచ్చు గదా. ఎట్లాగూ తన రెండోనెల జీతం రాగానే శాంటియాగో వెళతాడుగదా.

తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి మారియో చాల సార్లు ప్రయత్నించాడు. ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని కవి చేతుల్లో పెట్టబోయాడు. కాని నెరూడా ఎప్పుడూ తన ఉత్తరాలు తీసుకునేటప్పుడు చూపెట్టే ముభావం, ముక్తసరి పలుకులు మారియోను భయపెట్టేవి. తన ఉత్తరాలు తెచ్చి ఇచ్చినందుకు బక్షీష్ కూడ నెరూడా ఎంత తొందరగా ఇచ్చేసేవాడంటే ‘ఇక నీ పని అయిపోయింది వెళ్లిపో’ అన్నట్టుండేది. ఆ బక్షీష్ ఎక్కువే ముట్టేదనుకోండి. అయినా, నెరూడా ముఖం మీద ఎప్పుడూ తనలోపలికి తాను చూసుకుంటున్న ఒక అంతర్ముఖుడి హావభావాలే కనబడేవి. ఆయన ఏదో ఒక కొత్త అద్భుత కవిత మొదలుపెట్టడానికి ఉద్యుక్తుడై, ఉద్విగ్నంగా ఉన్నప్పుడు తాను ఉత్తరాలు పట్టుకొచ్చి తలుపు కొడితే ఆ తన్మయత్వంలోంచి ఆయనను బయటికి లాగినట్టవుతుందేమోనని మారియో చాలసార్లు ఇబ్బంది పడ్డాడు. ఆ భావం మారియోను వదలలేదు. ప్రతిసారీ నెరూడా తలుపు తెరిచి వెంటనే తన ఉత్తరాల కట్ట తీసుకుని, మారియో చేతిలో కొన్ని సెంట్లు పెట్టేవాడు. చిరునవ్వుతో ‘గుడ్ బై’ అనేవాడు. ఆ పలకరింపు, చిరునవ్వు కూడ క్షణకాలంలో అయిపోయేవి. ఆ క్షణం నుంచి సాయంత్రందాకా మారియో మాత్రం ఎలిమెంటల్ ఓడ్స్ పుస్తకాన్ని తన చేతుల్లో పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. ఏదో ఒకరోజు కవి సంతకం అడిగే ధైర్యం తనకు రాకపోతుందా అని ఎదురుచూస్తుండేవాడు.

మారియో ఆ పుస్తకాన్ని ఎంత ఎక్కువగా పట్టుకున్నాడంటే, అది ఒడిలో పెట్టుకుని చౌరస్తాలో దీపస్తంభంకింద కూచుని వచ్చేపోయే అమ్మాయిలు తనను ఒక మేధావి అని భావించాలని ఎంతగా ఎదురుచూశాడంటే, చిట్టచివరికి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేశాడు. ఎవరికోసం ఆ పుస్తకం పట్టుకుని కూచునేవాడో ఆ అమ్మాయిలు అసలు మారియోనుగాని, ఆ పుస్తకాన్ని గాని ఎప్పుడూ చూడలేదనుకోండి, అది వేరే సంగతి.

ఇక పుస్తకం చదివేశాక, ఒక్కసారయినా కవి దృష్టిని ఆకర్షించవలసిందే అనుకున్నాడు మారియో. ఒక చలికాలపు ఉదయాన ఎండపొడలో ఉత్తరాల కట్ట మీద ఆ పుస్తకం పెట్టి కవి ముందు పెట్టాడు. ఎన్నోసార్లు దుకాణాల కిటికీల మీద రాసిన దాన్ని చూసిన అనుభవంతో, “గురువుగారూ, మీ సంతకం ఇదిగో సరిగ్గా ఇక్కడ” అని అడిగాడు.

మారియో అడిగినది కవికి చాల మామూలు విషయం. ఎన్నోసార్లు చేసిన పని అది. అలా సంతకం పెట్టేసి మామూలు చిరునవ్వుతో ‘గుడ్ బై’ అనేశాడాయన. పుస్తకం చేతిలో పట్టుకుని ఆ సంతకాన్ని నిశితంగా పరిశీలించాడు మారియో. “అభినందనలతో, పాబ్లో నెరూడా” అని రాసి ఉన్న ఆ వాక్యం వల్ల తన అనామకత్వం యథాతథంగానే ఉండిపోయింది. ఇక కవితో సంబంధం పెంచుకోవాలనీ, ఏదో ఒకరోజున తనకు ఆయన ఒక పుస్తకం ఇచ్చేలా, అందులో ఆకుపచ్చని సిరాతో తన పేరు పూర్తిగా మారియో హిమేనెజ్ అని రాసేలా చూసుకోవాలనీ గట్టిగా అనుకున్నాడు. నిజం చెప్పాలంటే, “సన్నిహిత మిత్రుడు మారియో హిమేనెజ్ కు అభినందనలతో పాబ్లో నెరూడా” అని ఆయన రాస్తే ఎంత బాగుంటుంది అని కలలు కనడం మొదలుపెట్టాడు.

ఈ కలలను కోస్మెకు చెప్పాడు కూడ. కాని పోస్టల్ ఉద్యోగులు తమ ఆసాములను అలా ఇబ్బంది పెట్టడాన్ని నిషేధిస్తూ చిలీ లో ఉత్తర్వులు ఉన్నాయనీ, అయినా ఒక పుస్తకాన్నే రెండు సార్లు ఇవ్వడం కుదరదనీ కోస్మె చెప్పాడు. కవి ఎంత కమ్యూనిస్టయినా ఆయన వెంటపడి ఆయన ఇదివరకు రాసిన వాక్యం చెరిపేసి, ఆ స్థానంలో మరొక వాక్యం రాయమని అడగడం మంచిది కాదని కోస్మె చెప్పినదాని సారాంశం.

కోస్మె సలహా సరయినదే అని మారియో కూడ అనుకున్నాడు. అందువల్ల రెండో నెల జీతం వచ్చాక చాల సహజమైన కొనుగోలులాగ మరొక పుస్తకం కొన్నాడు. ఈ సారి అది న్యూ ఎలిమెంటల్ ఓడ్స్. ఎంతోకాలంగా కలలు కంటున్న శాంటియాగో ప్రయాణానికి కాకుండా ఈ పుస్తకానికి ఖర్చుపెట్టవలసి వచ్చినందుకు కాస్త బాధపడ్డాడు. అంతేకాదు, “వచ్చేనెల నీ కోసం థర్డ్ బుక్ ఆఫ్ ఓడ్స్ కూడ తెప్పించిపెడతాను” అని ఆ దుకాణదారు అనేసరికి ఆ బాధ మరింత పెరిగింది.

అయితే ఈ పుస్తకాలేవీ కవి సంతకానికి నోచుకోలేదు. మరొక చలికాలపు ఎండపొడ పడే పొద్దుటిపూట మారియో తనకోసం పుస్తకం మీద సంతకం పెట్టించుకోవాలనే సంగతే మరిచిపోయాడు, కవిత్వాన్ని మాత్రం మరిచిపోలేదు.

***

మారియో హిమేనెజ్ జాలరుల మధ్య పెరిగాడు గాని వలల గురించీ, ఎరల గురించీ తెలియదు. కవిని పట్టుకునే వల ఆ రోజు ఉదయపు ఉత్తరాల కట్టలో ఉంటుందని ఊహించలేకపోయాడు. ఆరోజు మారియో ఉత్తరాలకట్ట కవి చేతుల్లో పెట్టగానే, ఆయన అక్కడే మారియో ముందరే ఆగలేనట్టుగా ఆ కట్టలోంచి ఒక ఉత్తరం తీసి చించి చదవడం మొదలెట్టాడు. ఆయనకు మామూలుగా ఉండే గాంభీర్యం, ముక్తసరితనం ఏమయిపోయాయో తెలియదు. ఇలా ప్రవర్తించడం మారియోను ఆశ్చర్యపరిచింది. కవితో సంభాషించాలనీ, అసలు స్నేహం చేయాలనీ ఎప్పటినుంచో కంటున్న కలల మంటలు మళ్లీ ఒకసారి నాలుకలు తెరిచాయి.

“మిగిలిన ఉత్తరాల కన్న ముందు ఆ ఉత్తరం ఎందుకు విప్పారు?”
 
“అది స్వీడన్ నుంచి వచ్చింది గనుక.”

“స్వీడన్ ఆడవాళ్లు బాగుంటారని విన్నాను గాని స్వీడన్ నుంచి ఉత్తరం వస్తే అంత గొప్పేముంది?”
 
ఎప్పుడూ కదలకుండా ఉండే పాబ్లో నెరూడా కనురెప్పలు ఆమాటతో ఒక్కసారి మూసుకుని తెరుచుకున్నాయి.
 
“సాహిత్యానికి నోబెల్ బహుమతి గురించి బిడ్డా అది!”

“మీకిస్తున్నారా వాళ్లు?”

“వాళ్లు గనుక నాకిస్తే వద్దనను.”

“ఎంతొస్తుంది?”

అప్పటికి ఆ ఉత్తరంలో ప్రధాన భాగానికి చేరిన నెరూడా చాల మామూలుగా “లక్షా యాభై వేల రెండువందల యాభై డాలర్లు” అన్నాడు.
 
“మరొక యాభై సెంట్లు” అని కలుపుదామనుకుని, అతి కష్టం మీద ఆ మాట ఆపి, చాల గంభీరంగా “భలే” అన్నాడు మారియో.

“భలేనా, ఎందుకు?”

“నిజంగానే వాళ్లు మీకది ఇస్తున్నారా?”

“ఏమో. కాని ఈ సంవత్సరం నాకంటే ఎక్కువ అవకాశాలున్నవాళ్లున్నారు.”

“ఎట్లా?”

“వాళ్లు ఇంకా మంచి పుస్తకాలు రాశారు.”
 
“మిగిలిన ఉత్తరాల సంగతి ఏమిటి?”

“అవి తరువాత చూస్తానులే.”

“సరే.”

ఇక ఆ సంభాషణ ముగింపుకు వస్తోందని మారియోకు అనుమానం కలిగింది. ఆ విచారంతో కవికి సహజమైన పరధ్యానంలోకి ఆ పోస్ట్ మన్ కూడ జారిపోయాడు. ఆ పరధ్యానం ఎంత గాఢంగా ఉండిందంటే ఇక స్వయంగా కవే “ఏమిటి ఆలోచిస్తున్నావు?” అని అడిగాడు.

“ఏంలేదు, ఏంలేదు. ఆ వేరే ఉత్తరాల్లో ఏమి ఉండి ఉంటుందా అని. అవి బహుశా మీకొచ్చే ప్రేమలేఖలేమో.”

ఆ లావుపాటి కవి ఒక దగ్గు దగ్గాడు. “ఓయ్, జాగర్త, నేను పెళ్లయినవాడిని. నీ మాటలు మా ఆవిడ వింటేనా?”

“అయ్యయ్యో, క్షమించండి.”

నెరూడా తన జేబులోకి చెయ్యిపోనిచ్చి, మామూలుకన్న చాల ఎక్కువ కాగితం ఒకటి బయటికి లాగాడు. ఆ బక్షీష్ కన్న ఎక్కువగా కవిని వదిలిపోవలసి వస్తున్న విచారం ధ్వనిస్తుండగా మారియో కృతజ్ఞతలు చెప్పాడు. ఆ విచారం ఎందువల్ల కలిగినప్పటికీ, అది దాదాపు కాలూ చేయీ పడిపోయినంత పనిచేసింది. వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళుతున్న కవి ఆ కుర్రాడి స్థితిచూసి ఆశ్చర్యపోయాడు.

“ఏమయింది?”

“సార్!”

“ఏమిటలా స్తంభంలాగ నిలబడిపోయావు!”

మారియో తల తిప్పి కవి కళ్లలోకి చూశాడు.

“మేకు కొట్టినట్టుగా.”

“కాదు కాదు, కదలలేని పక్షి లాగ.”

“పింగాణీ పిల్లి కన్న నిశ్శబ్దంగా.”

నెరూడా గేటు గొళ్లెం తీసి పట్టుకుని, గడ్డం రుద్దుకుంటూ, “మారియో హిమేనెజ్, నేను ఎలిమెంటల్ ఓడ్స్ కన్న మంచి పుస్తకాలు రాశాను. ఇప్పుడు నువ్వు ఆ పాత పుస్తకం నుంచి ఉపమానాలు, అలంకారాలు నాకు వినిపించడం బాగులేదు.”

“సార్?”

“అలంకారాలు అన్నాను, ఏం?”

“అంటే ఏమిటి?”

కవి ప్రేమగా ఆ కుర్రవాడి భుజం మీద చెయ్యి వేశాడు.

“అంత కచ్చితంగా చెప్పలేననుకో, కాని అలంకారం అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చి చెప్పడం.”

“ఒక ఉదాహరణ చెప్పండి.”

నెరూడా తన చేతిగడియారం వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచాడు.

“సరే, ఆకాశం ఏడుస్తోంది అన్నామనుకో, ఏమిటన్నమాట?”

“ఓ, వానపడుతోంది అని అర్థం.”

“అంటే అది అలంకారం అన్నమాట.”

“మరి, మరి, అది అంత సులభమైన విషయమైతే అంత గొట్టుపేరు ఎందుకుంది దానికి?”

“ఎందుకంటే, ఆయా వస్తువులకు మనం పెట్టుకున్న పేర్లకూ ఆ వస్తువుల సాదాతనానికో, సంక్లిష్టతకో ఏమీ సంబంధంలేదు. నీ లెక్క ప్రకారమైతే మన చుట్టూ రోజూ ఎగిరే అతిమామూలు రెక్కలపురుగుకు సీతాకోకచిలుక లాంటి పేరు ఉండగూడదు. మరి ఏనుగుకు సీతాకోకచిలుకకన్న మామూలు చిన్న పేరే ఉందిగదా. అదేమో చాల పెద్దది, ఎగరనూలేదు కదా” అని ముగించాడు. ఒక్క ఉదుటున చెప్పేసరికి కవి గసపోశాడు. ఇక మిగిలిన శక్తితో, వెళ్ళిపోవచ్చునన్నట్టు మారియో వైపు చూశాడు.

(మిగతా వచ్చే సంచికలో)

అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Impotence Drugs and treatment It`s no secret that like to take Viagra? buy viagra here.
Family pharmacy there are many different ways to store your cheap generic viagra
New reviews of the cheap did you know that gel tab viagra so what exactly is a buy viagra cheap