మే2008
ఉక్క
అర్ధరాత్రి కావస్తున్నది. చలి తీవ్రంగా వున్నది. చీకటి గాఢంగా అలుముకున్నది. కొద్ది దూరంలో చిన్న దీపం బుడ్డి వెలుగుతున్నది. మంచు కురుస్తుండడం వల్ల దీపపు వెలుతురు చిత్రంగా కనిపిస్తున్నది.
చుట్టుపక్కల మనుషుల ఛాయలేం లేవు. పాడుబడ్డ భవనం ముందు ఎండిపోయిన పెద్ద చెట్టొకటి నిలబడి ఉన్నది. దానికింద రాలిపోయిన ఆకులు మసగ్గా కనిపిస్తున్నాయి. వాటిని తొక్కుకుంటూ వెళ్లి శిథిలమైన కట్టమీద కూర్చున్నాను. కాళ్ళను చూసుకున్నాను. చెప్పులు లేవు. ముఖంపై చేయివేస్తే కంటికింద చిన్నపాటి గాయం కనిపించింది. ఆందోళనంతా మాసిపోయి ఆకలి కొంచెం కొంచెం మొదలయింది.
ఒక అన్నం ప్యాకెట్, నీళ్ళ బాటిల్ ఇచ్చాడు, బలిష్ట దేహం గల ఒకాయన. చేయి కడుక్కుంటే నీళ్ళు ఎండిన ఆకులపై పడి శబ్దం చేశాయి. అంత ప్రశాంతతలో ఆ శబ్దం గమ్మత్తుగా అనిపించింది. సాధారణంగా ఇలాంటి వాటిని అంతగా పట్టించుకోం. కానీ నేనిపుడు వాటిని మాత్రమే పరిశీలించగలను. ఆకలయితే ఉంది గాని బుక్క నోట్లోకి దిగడం లేదు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు. చేయి కడుక్కుని కట్టమీద కూర్చున్నాను. జేబు తడుముకుంటే చిల్లరేమీ కనిపించలేదు. రెండు రోజుల క్రితం నావైన వస్తువులన్నీ తీసేసుకున్నారు. జేబు తడుముతుంటే ఒకడన్నాడు.
“ప్రాణాలు పోతుంటే ఇప్పుడేంట్రా, నీకు కోరికలూ” అని. ఆ మాటకు నాకు కోపం రాలేదు. బాధా కలగలేదు. ఊరికే విన్నాను. రెండు రోజుల బట్టీ స్తంభించిపోయిన మనసు ఇపుడిపుడే ఆలోచించడం మొదలుపెట్టింది. ముందుకు నడుస్తున్నట్లు తెలుస్తున్నదే కానీ ఆ అడుగులు ప్రయత్నపూర్వకంగా వేస్తున్నవేం కావు.
కొద్దిసేపు నడిచిన తర్వాత ఒక దగ్గర ఆగిపోయాను. సరిగ్గా అక్కడే ఆకుపచ్చని రంగేసిన ఇనుప ఊచలు కనిపించాయి. వాటి మధ్య నుంచి లోపలికి తొంగి చూస్తే అలాంటి తలుపులున్న గదులే ఇంకొన్ని కనిపిస్తున్నాయి.
నిదుర మగత వదలని ఒకాయన వచ్చి బరువైన ఊచల తలుపు తెరిచాడు. దానికి పెద్ద తాళం కప్ప వున్నది. ఆయన వేసుకున్న చొక్కాకు గుండీలు లేవు. పరుపులో నుంచి లేచి వచ్చినట్లుంది. నేను లోపలికి అడుగుపెట్టగానే తిరిగి తాళం వేశాడు. ఆ తలుపు భయంకరమైన శబ్దం చేసింది. ఆ శబ్దానికి పడుకున్నవాళ్ళంతా దిగాలున లేచి కూర్చుని దిక్కులు చూస్తున్నారు. రంగుపోయి తుప్పు పట్టిన ఆ తలుపు మిగతా తలుపులకంటే భిన్నంగా కనిపించింది. గదుల్లో ఉన్నవాళ్ళు బీడీ ముట్టించుకుంటున్నారని అగ్గిపుల్ల గీకినపుడు వచ్చే శబ్దం ద్వారా తెలుస్తున్నది. ఒకాయన పొగ బయటకు వదులుతూ ఊచల మధ్య నుంచి బయటకు చూస్తున్నాడు. ఆ గది ముందే వేలాడుతున్న డొక్కు రేడియో పాటలు పాడి పాడి అలసిపోయి బుస్సుమని అరుస్తున్నది. నన్ను తీసుకెళుతున్న ఆయన ఆ గది ముందే ఆగమని సైగ చేశాడు. దగ్గరగా వచ్చి వొళ్ళంతా తడిమాడు. చేతిలో వాచీ ఇచ్చేయమన్నాడు. ప్యాంటూ, చొక్కా విప్పి ఒకసారి కూర్చుని లేవమన్నాడు! వివరాలు రాసుకున్నాడు. ఈ తతంగం ముగిసేసరికి ఏ ఇరవై నిముషాలో పట్టింది. తాళం తెరిచి లోపలికెళ్ళమన్నాడు. లుంగీ చంకలో పెట్టుకుని గదిలోకి అడుగు పెట్టాను. అక్కడ ఇంకో ఆరుగురున్నారు. ఎవరి ఒంటిపై చొక్కాలు లేవు. లేచి కూర్చొని ఒకరి బీడీ తీసుకుని ఇంకొకరు ముట్టించుకుంటున్నారు. ఇంకొందరు బీడీ మార్చుకుని తాగుతున్నారు. నేను లోపలికి అడుగుపెట్టగానే ఎగాదిగా చూశారు. వాళ్ళలో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. కాసేపటికే దుప్పటి, పరుచుకునేదీ ఇచ్చారు. అవి నల్లగా మాసిపోయి వాసనేస్తున్నాయి.
మనుషుల్నీ, గదినీ పరిశీలిస్తూ లుంగీ కట్టుకుని ప్యాంటు కొక్కానికి తగిలించాను. టైపు చేసిన కాగితమొకటి చేతిలో ఉంటే తిప్పిచూశాను. ఒకవైపు ఖాళీగాఉంది. ఏదైనా రాసుకోవచ్చన్న ఊహ తట్టింది. మూత్రం పోయడానికి చిన్న సైజు లాట్రిన్ లాంటిది వున్నది. దాని చూట్టూ గోడలు లేవు. రాత్రిళ్లు దొడ్డికి సైతం అదే ఉపయోగించాలని వాళ్ళనడిగితే చెప్పారు. ఆ సందర్భాన్ని తలచుకుంటేనే భయం వేసింది. ఇంత చిన్న చిన్న పనులకు సైతం ప్రైవసీ లేదుకదా అనుకుంటూ, ఏవో ఆలోచిస్తూ వాళ్లమధ్యనే కూర్చున్నాను.
“ఏటనియా ఏటి కేసూ” అన్నాడు ఒకాయన. వయసు నలభైలోపే ఉంటుంది కావచ్చు. నల్లగా, లావుగా ఉన్నాడు. పళ్లు గారపట్టి వున్నాయి. గుండు చేయించుకున్నాడు.
చిన్న టవల్ కట్టుకున్నాడు. ఆ గుడ్డ శరీరాన్ని కప్పడానికి సరిపోవడంలేదని చూస్తేనే అర్థమవుతున్నది. దగ్గరగా కూర్చుని టవల్‌ను లాగి పట్టుకున్నాడు.
మీపేరేంటన్నాను.
“రాజండి. అందరూ రాజుగోడంటారండి. కేడీ పేటున్నాది కదండి. అక్కడ పల్లబేరం చేస్తానండి అన్నాడు ఒకింత కృతజ్ఞతతో”.
“మీ కేసేటో సెప్పనేదండీ” అన్నాడు మళ్లీ ఆయనే.
గవర్నమెంటుకు వ్యతిరేకంగా ఉన్నందుకనీ……. చెప్పాను.
“అలగండీ. అంతేలెండి. ఏటోనండి. నాకు తెల్దండి. ఈ గవుర్మెంటేటో దాని గోలేటో, నాకు తెల్దండి. గవర్మెంటుని ఎవరు నడిపిస్తారేటండీ, పోలీసులే కదండీ…” అంటూ
బీడీ ముక్క నా నోట్లో పెట్టి అంటించాడు.
ఆయన మాటలకు ఏ జవాబూ చెప్పకుండా నవ్వి ఊరుకున్నాను.
“బెంగగా ఉంటాది. రేపు చెబుదురుగానండీ” అన్నాడు.
మీదే వూరూ అన్నాను.
“ఈరగట్టమండీ కానీ చాల్రోజుల్నించి ఇక్కడే ఉండి పోన్ను” అన్నాడు.
కడుపులో ఆకలికీ, బీడీ రుచికీ కళ్లు తిరిగినట్లనిపించింది. నోరంతా కంపువాసన. పేగులు కరకర శబ్దాలు చేస్నున్నాయి. నీరసంగా గోడకు జారగిల పడుతూ తలపైకెత్తాను. గోడపై ఏసుప్రభు జాలిగా గదిలోని మనుషుల్నే చూస్తున్నాడు. బాగా పొద్దుపోయిన తర్వాత సింహాచలం వార్డరుగారొచ్చారు.
నిద్రపట్టక ఏదో ఆలోచిస్తున్న వాణ్ణి లేచి కూర్చున్నాను. సింహాచలంగారు పాత సినిమా పాట పాడుతున్నారు. భానుమతి ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాడమని అప్పల్నాయుడు సింహ్మాచలం గారిని బతిమాలుతున్నాడు.
“ఎల్రా ఎదవ నాయాలా, రేప్పాడతాలేరా” అంటూ వెళ్ళిపోయారు వార్డరుగారు.
“మల్లీశ్వరి ఉన్నాదండీ. మా బాగా ఉంటాదండి. ఒక పాత్రా తీసేయడానికి నేదండి. పాట్లూ, మాటలూ అంతేనండి” అన్నాడు అప్పలనాయుడు.
నేను వెళ్లిన కొద్దిసేపటికే చొరవగా పరిచయం చేసుకొని అందరి వివరాలూ చెప్పాడు. అప్పలనాయుడు వయసు నలభై మించదు. బాగా పొట్టి.
“ఈడి పేరు బ్రెమ్మాజిగోడండి. బామ్మర్దిని సావదొబ్బి సొర్గంలోకొచ్చాడండి. ఇదుగో ఈడున్నాడు కదండీ, ఆడి పేరేటో ఆడికే తెల్దు. మనకేటి తెలుస్తాది సెప్పండి. ఈడేటి సేశాడూ…? ఉంచుకున్న గుంటదాన్ని సావదొబ్బాడు. ఈడికీ ఈ గుంటదానికీ ఇలాకా ఉన్నాదని ఎవరికీ తెలీనేదు. ఈడు సంపీసినట్టూ ఎవరికీ అనువానం రాలేదు. మావూలుగా సచ్చిపోన్దని పూడ్చేశ్శారు. ఊరుకుంటే అయిపోయేది కదండీ. ఎవరో ఆపీసురుగోడితో ఫలానాదాన్ని సంపీశ్శాను, ఏటైంది బాబూగోరూ అన్నాట్టండీ. ఎర్రినాయాల కాప్పోతే. ఇదిగో ఇక్కడొగ్గిశ్శారు. పుల్లుగా పప్పు తినీస్తున్నాడండి. ఈడిపేరు సిరంజీవండి. కుర్రతనం ఎక్కువైపోయి బూ ఫిల్మీలూ సూశాట్టండి. ఇదిగో ఇక్కడ ఈరోయినై కులికేస్తున్నాడు. ఇక నాదంటారండీ… సారాకేసు. సీస్సారా అమ్మితే కేసెట్టేసి లోపల తోశ్శారండి. ఏటిసేత్తం సెప్పండి. నా బారియ ఉన్నాదండి. ఆ గుంటదానికి మాట్రాదు. మూగది. ఓ బాబండి, ఆడికీ మద్దె ఆరూగ్యం బాగుండట్నేదండి, జొరం” అన్నాడు.
సిమ్మాచెలంగారెళ్ళిపోయాక అందరూ ముసుగు తన్నారు. నాకు నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకుంటే ఏవో కలలొస్తున్నాయి. లేచి కూర్చున్నాను. చిమ్మ చీకటి. టైమెంతవుతుందో తెలుసుకోవాలని బయటికి చూస్తే దేముడుగారు టేబిల్‌పై తలపెట్టి గురకలు పెడుతున్నారు. మూలకు ఒదిగి కూర్చుని బీడీ ముట్టించుకున్నాను. బ్రమ్మాజి లేచి “ఏటండీ, నిద్రపట్టదు కదండీ….. మనసలా ఎలిపోతాదండి. ఎంతాపినా ఆగదు. గుండెలో కెలికినట్టయితాదండి” అన్నాడు. ఆయన మాటల గురించి ఆలోచించేలోపే మళ్ళీ అన్నాడు. “ఏటిసేత్తం సెప్పండి, తప్పదండి. పడుకోండి”. ఉదియమైతే పావురాలొస్తాయండి. మా బాగా ఉంటాదండి” అంటూ సరిపోని దుప్పటిని ముదురుకుని కప్పుకున్నాడు.
ఊచల మధ్య నుంచి ఆకాశాన్ని చూస్తున్నాను. ఎప్పుడు తెలవారుతుందా అని. కోళ్ళు కూస్తాయేమోనని ఎదురు చూశాను. కూసినా ఇంత పెద్ద గోడలు దాటి వినిపించకపోవచ్చనిపించింది.
హఠాత్తుగా మనకు తెలియని పరిసరాల్లో మనని బందీచేస్తే ఉండే ఆందోళనే నాలోనూ ఉంది.
*…. *…. *
ఆకాశం తెల్లబడి గదిలో కొంచెం వెలుతురు పరుచుకుంది. నలుపు తెలుపుల వింతకాంతి అది. ఎక్కడో దూరంగా మనుషుల అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడనిపించింది, ఈ కారాగారం ఇళ్ళ మధ్యన ఉన్నది కావచ్చని. బహుశా ఐదుగంటలపుడు దేముడు వార్డరుగారు లాఠీతో ఊచల్ని టకటకలాడిస్తూ వస్తున్నారు. మూడో నాలుగో గదులున్నట్టు అర్థమయింది. రాత్రి అటువైపు నుంచే వచ్చినా వాటి గురించి పట్టించుకునే స్థితి లేదు.
వార్డరుగారి కర్ర శబ్దానికి అందరూ దిగ్గున లేచి కూర్చున్నారు.
అప్పలనాయుడు తలగోక్కుంటూ నసుగుతూ “వార్డరు బాబుగోరూ! ఈ రాతిరీ పగళ్ళెందుకొచ్చాయండీ… ఉంటే రాత్రైనా ఉండాలా నేప్పోతే పగలైనా ఉండాల” అన్నాడు నిక్కరు సరిచేసుకుంటూ.
“ఒరే, రాత్రే ఉన్నాదనుకోరా మేం నిన్ను పట్టుకోలేం. ఉట్టి పగలే ఉన్నాదనుకోరా నువ్వు సారా అమ్ముకోలేవు. అందుకనే మా కోసం రాతిరీ, మీ కోసం పగల్రా” దేముడుగారు తాళం వేస్తూ వెటకారంగా అన్నారు.
“నిజవేనండి బాబుగోరు సత్తిం పలికారు, మీరు సెప్పే విషయాలన్నీ ఈ నిక్కరీ ముండకేటి తెలుస్తాయి సెప్పండి, ఇదీ నాలాగే ఎర్రిదండి బాబు” అన్నాడు అప్పలనాయుడు పొడవాటి నిక్కరు చూయిస్తూ. ఈ మాటలు అంటుండగానే వార్డరుగారు లాఠీతో పిర్రలపై సుతారంగా దెబ్బవేయబోతె గెంతుతూ, నవ్వుతూ ఆవరణలోకి పరిగెత్తాడు. దేముడుగారు అన్ని గదుల తాళాలు తీసిన తర్వాత అందరం గబగబా వెళ్లి వార్డరుగారి టేబుల్‌ముందు చేతులుకట్టుకుని వరుసగా కూర్చున్నాం. మొత్తం ఖైదీల సంఖ్య పధ్నాలుగుకు మించదు. అందర్నీ లెక్కించిన తర్వాత దేముడుగారు ఆవరణలోకి తీసుకెళ్లారు. అందరూ వరుసలో వెళ్లాలని ఆజ్ఞాపించారు.
“ఒరే ఎర్రినాయాల్లారా, వరుసలో నడవండిరా, మనం అలా నడవలేదనుకోరా, ప్రెపంచికం తలకిందలైపోయి తల్లడిల్లిపోతాదిరా” అన్నాడు నాయుడు ఊడిపోతున్న నిక్కరును సరిచేసుకుంటూ. అప్పల నాయుడిది విచిత్ర వేషధారణ. అందరూ లుంగీలు కట్టుకుంటే నాయుడు మోకాళ్ళకిందకు పొడవాటి లూజు నిక్కరూ చీకిపోయిన ముదురు తెలుపు జైలు బనియనూ వేసుకుంటాడు.
“ఏటండీ, ఇదిగో పందుంపుల్ల” అంటూ చేతిలో పెట్టాడు రాజు. పుల్ల నోట్లో వేసుకుని చుట్టూ పరికించాను. ఆవరణంతా పచ్చగా ఉన్నది. రకరకాల చెట్లూ, రంగు రంగుల పూవులున్నాయి. చుట్టూ ఎత్తైన, బలమైన గోడలున్నాయి. గోడలకవతల అంతస్తుల్లో కొంతమంది పళ్ళు తోముతూ తిరుగాడుతున్నారు. నవ్వుతూ, తుళ్లుతూ పనులు చేసుకుంటున్నారు. వాళ్లు ఇష్టమైనచోటికి తిరగ్గలరు, మాకా అవకాశంలేదు, అంతే తేడా. ఆవరణలోని చెట్లపై పక్షులూ, పావురాళ్లూ స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
అటూ ఇటూ పచార్లు చేస్తున్నవాణ్ణి వార్డరుగారి అరుపు విని గాబరాగా మొహం కడుక్కుని, ప్లేటు పట్టుకుని వరుసలో నిలబడ్డాను. కొంచెం పులిహోరా పెట్టారు. అంత ఉదయాన్నే తినబుద్ధికాక కొంచెం తిని, కొంచెం పారేశాను.
ఆవరణ మధ్యలో గోడలు లేని లాట్రిన్ ఉన్నది. దాన్ని చూసి జడుసుకుని రాజు దగ్గరికెళ్లి ఇక్కడేనా కూర్చోవడం అన్నాను.
“అవునండీ, అలగుంటాదండి, జైలుకదండి, ఏటో…” అన్నాడు. అందరూ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రాజు నిశ్చింతగా దొడ్డికి కూర్చుని అందరితో మాట్లాడుతున్నాడు.
గంటలోపే లాకప్ అయ్యింది. ఈ జైల్లో రోజుకు మూడు గంటలు మాత్రమే అన్‌లాకప్. ఉదయం, తిరిగి పదకొండింటికి, మళ్లీ సాయంత్రం. ప్లేట్లూ, గ్లాసులూ మూలకుపెట్టి అందరం ఎదురుబొదురుగా కూర్చున్నాం. అప్పలనాయుడికి ఒకటే ఆరాటం రేడియో ఎపుడు పెడతారా అని. ముళ్లపై నిలబడ్డవాడిలా పచార్లు చేస్తూ వార్డరుగారి కోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి దేముడుగారొచ్చి రేడియో పెడితే అది ఎంతకూ పలకలేదు.
“ఒసే జయమాలీ ఎట్టవే… ఓ… బాయ్యా… దేముడు బాయ్యా… తెరువు… బాయ్యా… తలుపూ…ఊఁ….”
అన్నాడు అప్పల నాయుడు. కొజ్జాలా నటించి అందర్నీ నవ్విస్తుంటాడు. చిరంజీవి బొద్దుగా ఉన్నందుకు జయమాలీ అంటాడు. ఆయన మాటలకు అందరూ గొల్లుమని నవ్వేసరికి, వార్డరుగారు కోప్పడుతూ తలుపు తెరిచారు. చిరంజీవి వెళ్లి రేడియో పెట్టాడు.
“ఒసే జయమాలీ… ఎలగే ఎట్టీశావూ… బలే కిటుకు తెలుసే నీకు…” అంటూ చిరంజీవి నడుము గిల్లుతూ ఎగతాళిగా అన్నాడు అప్పలనాయుడు.
“ఎటండీ సడి సేయకే గాలి పాటిన్నారండి, గొప్పగా ఉంటాదండి” పాతపాటని పలవరించాడు అప్పలనాయుడు.
రేడియో పాడటం ఆరంభించాక ఆయన మనసు స్తిమితపడ్డది.
“ఏసుప్రెబు గొప్పోడండీ, కరుణామయుడండీ, ఇశాల వృదయమండీ ప్రెబువుదీ” అంటూ ఏసు ప్రభు ఫోటో వెనకాల ఖైనీ ప్యాకెట్ బయటకు తీశాడు. ఉదయం టీ కాయడం, పులిహోరా వండటం, తిరిగి మధ్యాహ్నం, సాయంత్రం వంట వండటం, మిగతా సమయాలలో పాటలు పాడటం, కొజ్జాలా మాట్లాడి అందరినీ నవ్వించడం, క్యారమ్స్ ఆడటం అప్పలనాయుడు దినచర్య.
ఉదయం అన్‌లాకప్ చాయ్ తర్వాత బియ్యంలో రాళ్లేరటం అందరూ తప్పనిసరి చేయాల్సిన పని.
రాళ్లేరుతుంటే నాయుడు వచ్చి “ఒసే పెళ్లాలూ… బేగి కానీండే ఎంతసేపే… వంట వండాలే” అంటుంటాడు.
పాటలు వింటూ కాసేపు క్యారమ్స్ ఆడి, విసుగుతో పక్కనపెట్టారు. రాజు లుంగీ కట్టుకుంటూ “ఏటండీ, అసుకేసుకోడమేనండి, ఇంకేటున్నాది సెప్పండి” అంటుండగానే చిరంజీవి లుంగీ లాగేసరికి అందరూ భళ్లున నవ్వారు. రాజు తాపిగా లుంగీ చుట్టుకుంటూ ‘సూశ్శార్రా, మా గొప్ప అదృష్టంరా బాబు” అన్నాడు.
గుంపుగా కూర్చుని బీడీలు ముట్టించుకున్నారు. అందరూ పొగ ఒకేసారి గుప్పుమని వదులుతున్నారు.
అప్పలనాయుడు మొదలుపెట్టాడు.
“బతుకు మా పెద్ద బరువండీ, నడుములిరిగే బరువుకాదండి, మనసుకాలే బరువండీ” అంటూ దుఃఖంలో కెళ్లిపోయాడు. అంతసేపూ అందరినీ నవ్వించినవాడు అట్లా అయిపోవటంతో అందరూ ఆందోళన పడ్డారు. కొండజాతాయనైతే ఏమీ అర్థంకాక అందరి ముఖాలూ చూశాడు. గారపట్టిన పళ్లు బయటపెట్టి పిచ్చినవ్వు నవ్వాడు. ఆయనకు తెలుగురాదు. కుయీ మాట్లాడతాడు. ఏం చెప్పినా, తిట్టినా నవ్వి ఊరుకుంటాడు. చప్పిడి ముక్కూ, లావాటి పెదవులతో పొట్టిగా, లావుగా ఉన్నాడు. వయసు యాభైదాకా వుండొచ్చన్నాడు అప్పలనాయుడు. ఆయన గురించి ఏం చెప్పాలన్నా అప్పలనాయుడే చెప్పాలి. అప్పలనాయుడు కొండ ప్రాంతాలు తిరగటంవల్ల కొంచెం కుయీ వచ్చు.
గదికి ఎదురుగా ఉన్న పాత, నల్లటి గోడపై ఎండపొలుపు పడ్డది. చలింకా వదల్లేదు.
“ఏటండీ ఆ ఎండలో కూచొని అసుకేసుకుంటే బాగుండు కదండీ…” అన్నాడు రాజు.
ఆ ఎండలోనే రెండోమూడో పావురాళ్లు కూర్చుని గునగునమంటున్నాయి. నాయుడు వాటివైపే చూస్తున్నాడు.
“నా పెల్లామున్నాది కదండి, దాని గురించేనండి బెంగ. ఎలా బతుకుతాదో, తింటాదో, లేదోనండి, పిల్లోడికి ఆరూగ్యం బాలేదటండి. జొరం, మూడ్రోజుల క్రితం వొచ్చినాదండీ. ఓ బీడీ కట్ట, ఓ ఆపిలూ వొట్టుకొచ్చినాదండి. ఏటిసేత్తాం సెప్పండి ఆల్లలగా, మనమిలగా…” అన్నాడు గట్టిగా దమ్ము పీల్చుకుని గుప్పుమని పొగవదులుతూ.
కళ్లలో నీళ్లు తుడుచుకుంటూ తిరిగి ఆరంభించాడు.
“మా అమ్మ సెప్పేదండి, ఒరే నాయుడుగో మనకేటున్నాదిరా… కడుపున్నాదిరా, దానికి ఆకలేస్తాది. సేతులున్నాయిరా కుయ్యనకుండా కట్టం సేత్తాయి. ఈ సేతుల కట్టాన్ని ఆ కాలే కడుపుకు ఎట్టాలిరా అని. నేనదే సేత్నానండి. అలగైతే ఈ పప్పెందుకండీ. నేనేటి నేరం సెయ్యనేదండి. ఈ కడుపున్నాదికదండి. అదిగో దాన్ని కాపాడుకోవాలనుకున్నానండి. ఏడాది కిందట ఇలగే పప్పుకొచ్చీశానండి. ముసిల్దాని ప్రేనాలు పోనాయండి. ఆ శెవమక్కడా, ఈ శెవమిక్కడా, ఏటోనండి బ్రేందీ షాపులున్నంత కాలం మా బతుకులింతేనండి” అన్నాడు నిట్టూరుస్తు.
“నేరంసేసే ప్రెతివోడికి సిచ్చపడతాదంటారు, మరి సిచ్చేసేవోడి సంగతేటనియా” అన్నాడు రాజు పయఖానాలో ఊస్తూ. కొండజాతాయన మాత్రం మోకాళ్ల మీద కూర్చుని అందరినీ గమనిస్తున్నాడు. ఆయనవైపు చూస్తే పళ్లికిలిస్తూ నవ్వాడు.
“ఎర్రి నాకొడుకనియా, కొండోల్లంతా ఇంతే. సంపేసినోడు ఊరికే ఉండిపోక ఆడే సెప్పీస్తాడేటి ఎర్రి నాకొడుక్కాప్పోతే” కొండజాతాయన చెంపలు పిసుకుతూ నిష్టూరంగా అన్నాడు రాజు.
అప్పలనాయుడిని అడిగాను ఈయనది ఏ ఊరని. “ఈడిది రంపసోడవరమున్నాది కదండి. అటులోపల కొండల్లోనండి” అన్నాడు కోపంగా ఆయనవైపు చూస్తూ.
ఇంతలో చాయ్ టైమైతే వార్డరుగారు కేకేసి అప్పలనాయుణ్ణి బయటకు తీశారు. చాయ్ గిన్నెలో తీసుకొచ్చి బ్యారక్‌లు తిరుగుతూ పోస్తున్నాడు అప్పలనాయుడు. అన్ని బ్యారక్‌ల ఊచల మధ్య నుంచి గ్లాసులు పట్టుకున్న చేతులను చూస్తే గమ్మత్తుగా అనిపించింది. పక్క బ్యారక్‌లవాళ్ల చేతులు మాకు కనిపిస్తాయి. మా చేతులు వాళ్లకు కనిపిస్తాయి. కేకలేసి మాట్లాడుకోవడమే కానీ ముఖాలు చూసుకోవడానికి వీలుపడదు. ప్రతిరాత్రి రాజు పక్క బ్యారక్‌లో ఉండే బామ్మర్దితో మాట్లాడతాడు. “బామ్మర్దిగో బీడీలున్నాయేట్రా” అని.
చిరంజీవి పడుకోబోతుంటే “ఏంటి చిరంజీవి ఎప్పుడూ పడుకోవడమేనా” అంటే “అలాక్కాదనియా, జైల్లోని లెగిసున్నామనుకో బుర్రపాడనియా, తొంగున్నామనుకో అలగా రోజు గడిచిపోద్ది” అన్నాడు. చిరంజీవి టీ తాగడం పడుకోవడం, తినడం పడుకోవడం చేస్తుంటాడు. నిండా ఇరవై ఏళ్లు మించవు. ఈ మాటల మధ్యలో వార్డరుగారు తలుపుతీసి నాయుణ్ణి లోపలికి పంపించాడు.
“నాయుడు బాయ్యోచ్చాడు, నాయుడు బాయ్యోచ్చాడు” అంటూ చిరంజీవి అల్లరిపెట్టాడు.
“ఒసే జయమాలీ ఊరుకోయే గోలెట్టకూ…..” అన్నాడు అప్పలనాయుడు.
“ఒంటిగంటకు టీ యేటనియా, దొంగ నంజీకొడుకులు కాప్పోతే” చాయ్‌గ్లాసు చూయిస్తూ అన్నాడు రాజు. జైలు సమయపాలనే హింస. ఉదయం ఆరింటికి భోజనం. పదకొండింటికి భోజనం. ఒంటిగంటకు చాయ్ తిరిగి సాయంత్రం ఐదింటికి భోజనం. తినలేం, వదిలేయలేం అన్నట్టుగా ఉంటుంది.
“ఒరే బీడీ ఎలిగించరా, అసుకేసుకుందాం” అన్నాడు రాజు అప్పలనాయుడు తుండులాగుతూ. బీడీ తీసి రాజుకొకటి ఇచ్చి తానొకటి నోట్లో పెట్టుకున్నాడు అప్పలనాయుడు. బీడి ఉల్టాపెట్టుకోవడంతో “ఎర్రినాయాలా ఉల్టా ఎట్టేసుకున్నావు రా” అని రాజంటే
“ఒరే ఎలగెట్టినా పాపం కాలిపోయేదే కదరా, మనలాగే, ఎర్రిముండ ప్రెస్తుతానికి దానిట్టం అలగున్నాది పోనీరా” అన్నాడు.
చిరంజీవి నిద్రలేచి “ఏట్రా గోలెట్టీస్తున్నారు, ఊరుకొండహే” అంటే
“ఒరే బొక్కిలీసు నాయాలా, నీకేట్రా తెలుస్తాది, కొటీస్తాన్రే” గయ్యిమని అరిచాడురాజు.
యథాప్రకారంగా చిరంజీవి ముసుగేసుకున్నాడు.
నసుగుతూ అప్పలనాయుడు మొదలుపెట్టాడు.
“ఏటండీ ఏడు ఆకాశాలూ, ఏడు బూవులూ ఉంటాయంటారండి. ఏటి అక్కడా ఈ పోలీటేషన్లూ, జేల్లూ, కోర్టులూ ఉంటాయేటి, ఎవరున్నా బ్రెందీషోపులూ, జైల్లూ, కోర్టులూ, పోలీసులూ ఉండకూడదండి, మీరేటంతారేటి” అన్నాడు. జైల్లో కూర్చుని నిరంతరం బయటి ప్రపంచాన్ని చూస్తాడు, వ్యాఖ్యానిస్తాడు నాయుడు.
“ఏటండీ మీరోపని సేసిీండి, ఈ బ్రేందీ సాపులోల్ని సావదొబ్బీండి, కుల్లబొడిపీండి, ఒక్కసారితో పోదండీ… ఏటి… అలగా సంపీస్తుండాలండి, కాదంటారేటి” అన్నాడు.
నవ్వి ఊరుకున్నాను.
మళ్లీ అందుకున్నాడు. “అంతటితో అయిపోదండి. ఈ బ్రేందీ షోపులన్నీ ఎమ్మిల్ల్యీగాల్లవండీ, నేప్పోతే ఆల బందూలవండి. ఈల్ని ముట్టుకున్నామనుకోండీ ఇటు నర్సీపట్నం, అటు సోడవరం నుంచి పోలీసులు బేగిన దిగిపోతారండి” దీర్ఘంగా ఆలోచిస్తూ మెత్త సర్దుకుని పడుకోబోతూ అన్నాడు.
సాయంత్రం ఐదింటికి అన్‌లాకప్ అయ్యింది.
ఆరేసిన బట్టలు మడతబెట్టుకుని లైన్లో నిలబడ్డాం. నా వెనకాలే రాజు, కొండజాతాయనా ఉన్నారు.
“పూలు బాగా పూసాయండి, రేపు శివరాత్రి కదండీ దండగుచ్చాలండి” అన్నాడు రాజు.
తిన్న తర్వాత పదినిమిషాలు ఆవరణలో పచార్లు చేశాం. గోడల అవతల ఏవో ఏడ్పులు వినిపించాయి. కొద్దిసేపు దాని గురించి ఆలోచించాం. కొందరు చావన్నారు, ఇంకొందరు కాదన్నారు.
“మనకేట్రా తెలుస్తాది. ఆల్లు ఏరు, మనం ఏర్రా ఎర్రినాయాల్లారా ప్రెపంచికాలు రెండురా…” అంటూ అందరినీ గదుల్లోకి వెళ్లిపొమ్మని గట్టిగా అరిచాడు అప్పలనాయుడు. వరుసలో నిలబడి గదుల్లోకి వెళుతున్నాం. వార్డరుగారు లెక్కచూసుకుంటున్నారు. నా వెనకాల నిలబడ్డ నాయుడు చెవిలో గుసగుసగా చెప్పాడు.
“ఏటండీ సప్పర్లదెగ్గిరో, అటుపైకో ఎవర్నో కాల్చీశ్శారటండీ” అని.
రేపు పేపరొస్తే తెలుస్తుందన్నాను. వార్డరుగారు లెక్క చూసుకున్న తర్వాత గదుల్లోకెళితే తాళంవేసుకున్నారు.
ఖైదీల్ని లెక్కపెట్టుకోవడం రోజుకు ఐదుసార్లయినా ఉంటుంది. లెక్కపెడుతున్నపుడు రాజు అంటుంటాడు.
“వార్డరు బాబుగోరూ ఈ ఒకట్లూ రెండ్లూ మాకోసం పుట్టాయేటండీ” అని. ఉదయం వాయిదాకెళ్లిన బ్రెమ్మాజీ లాకప్ తర్వాత ఏడింటికి వచ్చాడు.
“బ్రెమ్మాజిగో ఎటెల్లిపోయావురా…, వాయిదా ఏటైనాదిరా…” అంటూ మందలించాడు చిరంజీవి.
“ఏట్లేదురా మనూర్లోని మెజిస్ట్రేటుగోరు లేర్రా సింతపల్లి కోర్టుకి ఎలిపోన్రు. సింతపల్లి దెగ్గిరే పోలీసుల్ని సంపీశ్శారటరా, ఎస్కార్టోల్లకి ఉచ్చపడి వాయిదాకి తీసుకెళ్లలేదురా, అలగా తిరిగి మద్దికాన టిఫినీ చేసి వొచ్చీశాన్రా” అన్నాడు బ్రెమ్మాజి.
రాజు, నాయుడు, బ్రెమ్మాజి ముగ్గురూ చిరంజీవినీ, కొండజాతాయన్నీ ప్రేమగా చూసుకుంటారు.
“వొరే సింరంజీవిగో బేలయినాదేట్రా” రాగానే అడిగాడు బ్రెమ్మాజి. “లేదురో మా అనియొచ్చాడు. రేపయిపోతాదన్నాడురా” అన్నాడు.
బ్రెమ్మాజి కొండజాతాయనవైపు కోపంగా చూస్తూ
“వొరే ఎర్రినాయాలా కుమ్మీసీరా పప్పు, కింటాల్లు. కింటాల్లు సూపరెంటుగోరు నీకోసమేరా తెచ్చారూ. అంతా ఉబ్బరం కదరా ఎర్రినాయాలా సుబ్బరంగా తినీసి తొంగో” అన్నాడు.
మూలకు నతికి కూర్చుని అందరివైపు చూస్తూ పళ్ళికిలిస్తున్నాడు కొండజాతాయన.
రాత్రి బాగా పొద్దుపోయింది. సమయం ఎంతవుతుందో కచ్చితంగా తెలీదు. ఆవరణలోని చెట్లపై పక్షులూ, కాకులూ అరుస్తున్నాయి. పావురాలు తిరుగాడిన గోడవైపు, నేలవైపు కనులు రిక్కించి చూశాను. ఏమీ కనిపించలేదు. ఎండపోగానే అవి మాయమవుతాయి. తిరిగి ఉదయం ఎండపొలుపెక్కగానే దర్శనమిస్తాయి.
“ఏటండీ, ఈ జేల్లని ఎవరు కనిపెట్టారండీ, ఎప్పుడు పుట్టాయేటండీ” అన్నాడు రాజు కళ్లు చీల్చుకుని గది బయటకు చూస్తూ.
“ఒరే నేరం పుట్టినాదిరా, ఎకాఎకీనా మఠాలూ పుట్టేసినాయిరా ఎదవనాయాలా…” జవాబుగా అన్నాడు అప్పలనాయుడు.
ఇంతలో సిమ్మాచెలం చిన్నగా పాడుకుంటూ వస్తున్నట్టు గమనించిన నాయుడు,
“ఒరే బాబుగోరికి టోకరా ఇచ్చీస్తాను సూడరా” అంటూ ఊచలకు తల ఆనించి నిలబడ్డాడు.
సిమ్మాచెలంగారు రేడియో పెట్టబోతుంటే “బాబుగో ఆగండి మీకో ఇసియం సెప్పాల, మనజేలు దిడ్డీలోని పూలుపూసాయటండి, ఆటి పేరేటో తెలుసండి, తర్వాచ్చెపుతాలెండి. ఆ పూలున్నాయా అయీ పోలీసులకు, మెజిస్ట్రీటుబాబుగోరికి మాత్రమే కనిపిస్తాయటండి. మీకూ కనిపిస్తాయేమోనండీ, ఆటిపేరేటో తెలుసండీ, కల్లబొల్లి మల్లెలటండీ, మల్లెలేకానండీ గులాబిలంతా పెద్దగా ఉంటాయటండి” నాయుడు ఈ మాటుల చెబుతున్నపుడు చిరంజీవి మూలకు నతికి నవ్వును బలవంతాన ఆపుకుంటున్నాడు.
సిమ్మాచెలం గారికి విషయం అర్థమైపోయి కొంచెం కోపం కొంచెం నవ్వుతో ఊచల మధ్యనుంచి లాఠీపెట్టి నాయుణ్ణి పొడవబోయాడు. నాయుడు గట్టిగా అరుస్తూ….
“బాబుగారు బాబుగారూ, మహాప్రెబువులు దయుంచండి. ఈ మాట నే సెప్పలేదండి ఇజీనరం సత్తిబాబుగోడు సెప్పాడండి” అంటూ వెనక్కి జరిగాడు. సిమ్మాచెలంగారికి రేడియో మాటవినలేదు “ఒరే సిరంజీవిగో” అంటూ కేకేసాడు. రాజులేచి వార్డరుగారితో మాట కలుపుతూ
“జయమాలి ఇల్లెక్కీసి ముట్టుకొట్టులో తొంగున్నాదండి, ఎలగండి పిలడం, గుంటది మా నాయుడు గోడికి మాబాగా అమిరినాదండి” రాజు మాట పూర్తి కాకముందే చిరంజీవి లేచి రాజు వీపుపై రెండు గుద్దులు గుద్దాడు. వార్డరుగారు తలుపుతెరిచి రేడియో పెట్టించి వెళ్లిపోయారు.
అప్పటికే కొండజాతాయన పడుకున్నాడు. నాయుడుకి నిద్రపట్టడంలేదని అటూఇటూ తిరుగుతున్నాడు. రాజు, బ్రెమ్మాజి నాతోబాటు కూర్చున్నారు.
బ్రమ్మాజి వృత్తేంటో కనుక్కుందామని “బయట నువ్వేం పనిచేస్తావ్ అన్నాను. “జట్లుకట్టి సెరుకుతోటలుంటాయి కదండి. అక్కడికి పనికెలిపోతానండి. జట్లోని పదిహేను మందుంటారండి. ఎటు కిట్టితే అటేనండి. ఎక్కువగా తునివైపే కిట్టుతాదండి అన్నాడు. చెల్లెక్కడుందని అడిగితే చెప్పుకొచ్చాడు.
“దాన్దోగొప్ప బాదనియా. ఎనుపూసిరిగిపోయి మంచంలో అలగా తొంగుంటాదనియా. మా బామ్మర్దిగోడు ప్రేమించాననీసి పెల్లిసేసుకున్నాడనియా, అప్పటినుంచి ఒకటే బాదలు. కూలీకెల్లీవోడు, మా సెల్లీ ఆడితో పనికెల్లీది. పనిదగ్గిరే గొడవడి మేడపై నుండి తోశ్శాడనియా. దాని బతుకలగైపోంది. ఏటిసేత్తం. ఎవరో ఆపీసరుగోల్లు (ఆయన భాషలో ఎన్.జి.వోలు) చెల్లిని తీసుకెళ్లి ఆస్టల్లో పెడతామన్నారు. ఆల్తో నేనేటన్నానంటే బాబుగోరు నా సెల్లంటే నాతోడబుట్టింది, నా దెగ్గిరే ఉండిపోతాదన్నాననియా.
అది మంచంలో ఉన్నా నా బామ్మర్దిగోడు ఇంటికొచ్చిసీ ఇబ్బంది పెట్టీవోడు. ఆయాలలగే ఒచ్చీసి దాన్ని కొట్టీస్తూన్నాడనియా, నేను జట్టుకెల్లీసి అలిసిపోయి ఇంటికొస్తే ఈడి గొడవ. కర్రతీసుకుని బాదేస్తే సచ్చిపోన్డు. సంపీయాలని కొట్నేదండి. అలగా జరిగిపోన్ది. తర్వాత గొప్ప బాదనియా” అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.
“ఒరే బ్రెమ్మాజిగో, బతుకలగే ఉంటాదిరా, ఏదీ సెప్పనేమురా. నువ్వైనా పప్పుతినీస్తావని అనుకున్నావేట్రా, ఏటోరా అలగా జరిగిపోతాదంతే” భుజం తట్టి ఓదారుస్తూ అన్నాడు రాజు.
అందరి దగ్గరా మాటలు అయిపోయాయి. గదంతా నిశ్శబ్దంగా ఉంది. అడుగుల చప్పుడు వినిపిస్తే బయటకు చూశాడు రాజు.
దేముడుగారు బాగా ఆలస్యంగా డ్యూటీకొచ్చారు. వచ్చీరాగానే తాళాలు కొక్కేనికి తగిలించి, గదిముందుకొచ్చి బుస్సుమని అరుస్తున్న రేడియోని కట్టేసి వెళ్ళిపోతూ లోపలికి తొంగి చూస్తూ
“ఒరే నాయుడుగో పాట్లకోసం ఇంతగోలేట్రా” అన్నారు. “దేముడు బాబుగోరూ… మనసులో సీకటుంటాదండి, పాట్లున్నాయి కదండి అలగా ఎలిగించీస్తాయండి” అన్నాడు.
దేముడుగారు వెళ్లిపోయాక మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. పక్క బ్యారకుల్లో నుంచి ఆవలింపుల శబ్దాలూ, నిదురపట్టనివాళ్లు కాల్చుతున్న బీడీ వాసనలూ తప్ప ఊసుల సడిలేదు.
వార్డరుగారి టేబిల్ వద్ద చిన్న బల్బు గుడ్డి వెలుతురు చిమ్ముతున్నది.
* * * *
ఉదయం ఆరింటికి వార్డరుగారి అరుపులూ, ఊచలపై లాఠీ శబ్దాలూ వినిపించడంతో లేచి దుప్పటీ పరుచుకునేదీ మడకబెట్టి, ప్లేటూ గ్లాసుపట్టుకుని వార్డరుగారి టేబిలు దగ్గరకెళ్లి కూర్చున్నాను. నాయుడు నా వెనకాలే కూర్చుని
“దేముడుగోరూ ఈయాల మఠంలో ఉన్నోలందరికీ కోక మరియాద సేస్తరటకదండీ, ఇసాపట్ననుంచి కోకలు దిగుతున్నాయట కదండీ…” అన్నాడు కిస్సున నవ్వుతూ. దేముడుగారు కోపంగా “ఎల్రా ఎర్రినాయాలా” అంటూ ఒక్కటిచ్చాడు.
“మా అమ్మ సచ్చిపోయి ఇయాల్టికి సమచ్చరం అయిపోన్ది. అదెప్పుడూ అనేదండి. బతుకంటే బూవి ఉన్నంతకాలం బతకడవేట్రా అని. బ్రేందీ షాపులున్నంతకాలం బతుకిలగే ఉంతాది. సలసలా కాలుతా ఉంతాది. మా తమ్ముడుండీవోడండి. ఆడికి మెంటలున్నాదని అందరు అనీవోరు. నిమానాగా ఏడెంది సమచ్చరాల కిందటే ఎలిపోన్డు. ఆడు పొద్దంతా ఇంట్లోని తొంగుండేవోడనియా, సీకటి ముసరగానే బయటికెల్లీవోడు. ఒరే తమ్ముడూ సీకట్లో తిరుగుతావేట్రా బయ్యిం కాదేట్రా అంటే ఆడనీవోడూ…
ఒరే అనియా ఎలుతురంటే నాకు బయ్యింరా, సీకటున్నాదనుకోరా సిత్రమైన ఎలుగులాగా కనిపిస్తాదిరా అని.
ఆడిమాటకు అర్థం తెలిసీది కాదండి. మఠానికొచ్చామా గొప్పగా తెలిసిపోన్ది. మా తమ్ముడుగోడు ఆయాల అలగా రేతిరి బయిటికెల్లినోడు మరిక రాలేదండి” అంటూ మౌనంలోకి వెళ్లిపోయాడు.
దేముడుగారు కేకేయడంతో అప్పలనాయుడు వంటగదిలోకెళ్లిపోయాడు.
పోతూ పోతూ “ఇదిగో ఇదేనండీ సీకటి” అంటుండగానే వార్డరుగారు గద్దించడంతో పరిగెత్తిపోయాడు. శివరాత్రి కావడంతో అందరూ చకచకా పనులు చేసుకుంటున్నారు. రాజు పూవులు కోసి దిమ్మెపై పెట్టాడు.
నలుగురో అయిదుగురో కలిసి బియ్యంలో రాళ్లేరుతున్నాం. రాజు కొన్ని నోట్లోపోసుకుని తుపుక్కున ఊస్తూ “ఈ బియ్యమేటి, మనవేటి, జైలు చేయడవేటి అంతా సిత్రంగా ఉన్నాది. ఉప్పరాపల్లి సత్తిబాబుగోడని, ఇజీనరం కేడీ ఉండీవోడండి. ఆడు నర్సిపట్నం పోలీసుల్తో లాయకీగా ఉండీవోడు. ఆడిప్పుడు ఇసాపట్నం సెంట్రల్ జైల్లో ఉంట్నాడండి. మా గొప్ప బుర్రండి ఆడిది. ఆడేటనేవాడంటే “ఒసే ఎర్రప్పల్లారా కోర్టులూ, పోలీటేషన్లూ, ఎమ్మిల్యేలూ అంతా ఒకటేరా, అందరూ కలిసి డబ్బు దొబ్బీస్తార్రా” అనీవోడు. ఆడిమాటే నిజవండి. ఇక్కడో ఎమ్మిల్యీగోడున్నాడు. ఆడికి నర్సీపట్నంలో, సోడవరంలో, కేడీపేటలో, రంపసోడవరంలో బ్రేందీషోపులున్నాయండి. ముండల కంపెనీలూ ఉన్నాయంటారండి. ఆడిపై మడ్డరు కేసులున్నాయండి. ఆడలగా కార్లో ఎక్కీసి తిరిగేస్తాడండి. మెజిస్ట్రీటుగోరు మాత్తరం చోరీకేసుల్లో సిచ్చలు గుచ్చీడం, పప్పుకు పంపీడం ఏటోనండి అంతా గొప్పసిక్కూ, సిరాకండి” అన్నాడు.
బియ్యాన్ని తట్టకెత్తుతూ “ఎలిపోదాం, లెగండి” అన్నాడు.
వార్డరుగారు లాకప్ అని అరవడంతో బ్యారక్‌లో కెళ్లిపోయాం. వంటకోసం అన్నీ సర్ది నాయుడు కూడా వచ్చాడు. రాజు బెల్లాన్ని దేవుడి ప్రసాదంగా పంచాడు.
“ఒరే రాజుగో, నా ప్రెబువున్నాడురా ఆడు నా బాదలలగా తీర్చీస్తాడురా నీ దేవుడేట్రా సేస్తాడూ” అంటూ ఏసుప్రభు ఫోటో వైపు చూశాడు నాయుడు.
“మా పిల్లలు తుని ఆస్టల్లో ఉంటారండి. ప్రెతి ఆదోరం ఎల్లి పల్లిచ్చేవోన్నండి. ఆరు నెల్లైపోన్ది. ఆల్లేటనుకుంటారో” కళ్లలో నీళ్లు కదలాడుతుంటే అన్నాడు రాజు.
“రాజుగో ఏడవకురా, ఏడిశావనుకోరా మనసు బెంగపడిపోతాది. జైలు చేయలేంరా” అన్నాడు అప్పలనాయుడు ఓదారుస్తూ.
మధ్యాహ్నం తిన్న తర్వాత కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. సాయంత్రం లాకప్ తర్వాత ఎంత ప్రయత్నించినా రేడియో పలకలేదు. చిరంజీవి చేతులెత్తేసి బ్యారక్‌లోకొచ్చాడు.
“ఒరే ఈ రోజు ఏసుప్రెబూ కరుణించడురా, అంతా ఖాళీరా” అన్నాడు నాయుడు, ఫోటో వెనకాల ఖాళీ ఖైనీ ప్యాకెట్ విసిరేస్తూ. రోజులాగే చిరంజీవి లాకప్ తర్వాత పడుకుండిపోయాడు.
పరుపు సర్దుకుంటూ నాయుడన్నాడు “ ఏటోనండీ ఎప్పుడూ ఇలగే సీకటే ఉంటాదా, ఎలుతురు పరుసుకుంటాదో లేదో తెల్దండి. మా అమ్మ సెప్పేదండి, నాయుడుగో సచ్చిపోకూడదురా, మనిషి సచ్చినా ఆత్మలగా…. భూమ్మీదో, సెట్టుమీదో తొంగుంటాదిరా అని. అది మా గొప్పగా సెప్పీదండి” అంటూ వెల్లకిలా పడుకుని కప్పువైపు చూస్తున్నాడు. కాసేపటికి బీడీ ముట్టిస్తుంటే కొండజాతాయన నవ్వుతూ చేయిచాపాడు. నాయుడు బీడీ ఇస్తూ “యీడు గొప్పోడండి” అన్నాడు.
ఇద్దరూ బీడీ కాల్చిన తర్వాత వార్డరుగారు లైట్లార్పేసారు.
“తొంగోండి, తెలవారితే చిరంజీవిగోడికి బేలయితాది. మీకూ అయిపోతాది. మీరు బయటికెల్తే ఈ బ్రేందీ సాపులోల సంగతిసూడండి” అంటూ దుప్పటి కప్పుకున్నాడు. వార్డరుగారి గురక చప్పుడూ మొదలైంది. గుడ్డిలైటు వెలుతురు గోడలపై పడుతున్నది.
బ్రమ్మాజీ నిద్రలో ఉలిక్కిపడిలేచి తూలి పడిపోయాడు. మళ్లీ లేచికూర్చుంటూ “సీతారామరాజుగోరు ఈ జేల్లోనే ఉండీవారటండీ” అంటూ మళ్లీ నిద్రలోకి జారిపోయాడు.
“కలపడి ఉంటాదిలేండి” అన్నాడు నాయుడు.
చప్పుడు విన్న వార్డరుగారు నిదుర మగతలోనే టేబిల్‌పై కొట్టాడు.
కచ్చితంగా సమయం తెలీదుకానీ మధ్య రాత్రయింది కావచ్చు.
*…. *…. *
ఉదయం లేచేసరికి వార్డరుగారు “బాబూ నీకు ఎస్కార్ట్, ఇశాపట్నం అడివివరం సెంట్రల్ జైల్” అన్నారు. గదిలోకెళ్లి ప్యాంట్ వేసుకుని, కవర్ తీసుకుని అందరికీ వెళ్లొస్తానని చెప్పిన తర్వాత టేబిల్ దగ్గిర వార్డరుగారు రెండో మూడో సంతకాలు పెట్టించుకున్నారు. సబినిస్పెక్టరు గొలుసు పట్టుకుని తీసుకెళుతుంటే నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగాను. కొండజాతాయనా, నాయుడూ, బ్రమ్మాజీ, చిరంజీవి, రాజు నావైపే చూస్తున్నారు. కొండజాతాయన పళ్లుబయటపెట్టి నవ్వుతున్నాడు. ఎస్సై మందలిస్తే బండెక్కాను.
Vipul మే 2008 1
కథనం బాగుంది. జైలు డైరి కథ అవగలదా.. కథాంశం ఏమిటి? పలు పాత్రలు, వాళ్ళ సంభాషణలు వాటి వెనక అంతరార్థం ఇవన్ని చూసుకున్నావిశేషమైన కథావస్తువేదీ ఇందులో కనిపించడంలేదు. ఈ రచయిత ఇదే శిల్పనైపుణ్యంతో వస్తు స్పష్టతసాధిస్తే మరిన్ని మంచి కథలు వచ్చే అవకాశం ఉంది.
vempaliprakash జూన్ 2008 2
కథ చాలా చాలా బావూంది. న్యాయ వ్యవస్త పై అధొజగథ్ సహొదరుల తాత్విక విమర్ష. ఘటన వుండాలన్న షరథు ఏమీలేదు. శిల్ప నిర్వ హణ అద్భుతంగా వుంది.
shravan vakiti జూన్ 2008 3
జీవితమింత దుఖంగా వుంటుందా అనిపించింది. గొప్ప తాత్విక కోణమూంది. ఊపిరాడని బతుకుంది. బాగా రాయండి.