May2008
ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి సాహిత్య జీవితం వ్యాస సంకలనం స్థూల పరిచయం
తెలంగాణా సాహిత్య చరిత్రలో “ప్రజల మనిషి వట్టికోట సాహిత్య జీవితం, వ్యాస సంకలనం ఒక చారిత్రిక సందర్భం. ఎప్పుడూ గుర్తుంచుకోదగిన మైలురాయి.
చెట్టు చెడు కాలానికి కుక్కమూతి పిందెలు అన్నట్టు నైజాం నిరంకుశ అసమానతల వ్యవస్థ అంత్యకాలానికి నిజాం సర్కారు కౄరాతి కౄరమైన చర్యలకు వ్యతిరేకంగా తెలంగాణా సాహితీ సాంస్కృతిక రంగాలలో తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ఇక్కడి సామాజిక పరిస్థితులను పట్టించుకోకుండా సామాజిక బాధ్యతలు గల ఏ కవీ, రచయితా ఊహాలోకాలలో విహరిస్తూ పలాయనం చిత్తగించలేదు. తెలంగాణా ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు పురుడు పోసుకున్న పుట్టినిల్లు. ఇటువంటి ప్రజా పోరాటాల నేపథ్యంలో వికిసించిన దాసనపువ్వు వట్టికోట ఆళ్వారుస్వామి. ఆయన నిజంగా ప్రజలమనిషి. ప్రజల సమస్యలపట్ల గల నిబద్ధత, నిమగ్నతల వలన ఆయన ఇంటిపేరే “ప్రజల మనిషి”, వట్టికోట ఆళ్వారుస్వామిగా వ్యవహారంలోకి వచ్చింది.
ఆళ్వారుస్వామి నిరుపేద శ్రీవైష్ణవ కుటుంబానికి చెందిన వాడు. స్పురద్రూపి జీవించడంకోసం వంట మనిషిగా పని చేశాడు. ప్రూఫ్ రీడర్‌గా, హోటల్ సర్వర్‌గా, పుస్తకాల విక్రయుడుగా కొనసాగుతూ ఒకవైపు బీదరికాన్ని ఎదుర్కుంటూనే మరొకవైపు సాహిత్య ఉద్యమాన్ని నిరంకుశ పాలనలో ప్రజల పట్ల తన అంకితమైన దృక్పధాన్ని నిర్భయంగా వ్యక్తపరిచిన ధీశాలి.
‘ప్రజల మనిషి’, ‘గంగు’ నవలలు, ‘జైలులోపల’ వంటి కథలను రాశాడు. ‘వీణ’, ‘తెలుగుతల్లి’, ‘గుమాస్తా’ పత్రికలకు విశేష సేవలందించాడు. గ్రంధాలయోద్యమం, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణా రచయితల సంఘంలో క్రియాశీలంగా పనిచేశాడు.
ఆ రోజులలో అగ్రవర్ణ పురోహిత వర్గానికి చెందిన వారు సంఘంలో ఏయే పనులు గౌరవ మర్యాదలనిస్తాయో ఆయా పనులను మాత్రమే చేస్తుండేవారు. నిమ్నకులాలతో, కార్మికులతో కర్షకులతో కలసిమెలసి ఉండడం వలన గౌరవానికి భంగకరంగా భావించే వారు. అటువంటి హేయకరమైన ముభావతను ఛేదించుకొని ప్రజలవైపు నిలబడ్డ వట్టికోట ఆళ్వారు స్వామి రిక్షా కార్మికుల సంఘం, రైల్వే కార్మికుల సంఘం, గుమస్తాల పోరాటాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. రాజకీయంగా అంధ్రమహా సభలో, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. ఆయన సమైక్య ఆంధ్ర సాహితీ, రాజకీయ చరిత్రలో పక్కకు పెట్టబడ్డ ప్రముఖడు కావడం ఒక చారిత్రిక మచ్చ.
అందుకే ‘ప్రజల మనిషి’ ప్రస్థానంలో సంపాదకీయ వ్యాసంలో నందిని సిధారెడ్డి “ఏ రచయితనైనా అంచనా వేయదల్చు కొన్నప్పుడు అతను సృజించిన సాహిత్యమూ, చేసిన సేవలు, జీవన విధానమూ ప్రధానంగా పరిశీలిస్తాం. సమకాలీన పరిస్థితుల పరిష్కారంలో తను చూపిన చొరవ, నిర్వహించిన పాత్ర తప్పకుండా గుణించవలసి ఉంటుంది. రచయిత మిగిల్చిన సాహిత్య వారసత్వం, అప్పటి, తర్వాత తరాలు కొనసాగించిన పరంపర, వికాస దశలు, దృష్టిలో ఉంచుకొని స్థానాలు నిర్ణయిస్తారు. తిరిగి విశ్లేషించేటప్పుడు సాహిత్యంలోనైతే వస్తువు, శిల్ప ప్రమాణాలు, ఇతరాత్రా భాషా, సారస్వత సామాజిక సేవలు, ప్రత్యేకించి జీవన నేపథ్యం, భావజాలం, క్రాంతి దర్శిత్వం, అంకితభావం పరిగణనలోకి తీసుకొంటారు. వీటన్నిటి దృష్ట్యా వట్టికోట తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉండవలసిన రచయిత” అని జైలు జీవితాన్ని కూడా లెక్కచేయక నిర్బంధాన్ని అనుభవించిన ఆళ్వారు స్వామిని విశ్లేషించాడు.
జెండర్ స్పృహ వట్టికోట ఆళ్వారు స్వామి రచనల్లో ప్రతిఫలించిన తీరును కె. శ్రీనివాస్ విశ్లేషించారు. ఆళ్వారు స్వామి పుట్టుక బాల్య జీవితాన్ని సాహిత్యన్ని తడిమి ఆయన రచనల్లో సాధారణ స్త్రీని ఆదర్శ స్త్రీని చిత్రించిన వాస్తవికతను పరిశీలించాడు. అగ్రవర్ణాల స్త్రీకి, శ్రామిక స్త్రీకి మధ్య ఆళ్వారు స్వామి గమనించిన స్పష్టమైన తేడాను ఆవిష్కరించాడు. భూస్వాముల వేధింపులలో, అత్యాచారాలలో స్త్రీ ప్రతిఘటన అవసరాన్ని గుర్తెరిగిన ఆళ్వారు స్వామి స్త్రీ చైతన్య ధృక్పథం సంప్రదాయపు ఆ రోజులలోనే గొప్ప విషయంగా గుర్తించాలి. మొత్తం ఆంధ్రదేశంలోనే స్త్రీ విద్య లేని సమయంలో అది తెలంగాణాలో అక్షరాస్యత మరింత తక్కువగా ఉన్న కాలంలో స్త్రీ చైతన్యాన్ని గురించి రచనలు చేసిన గొప్ప రచయితను, వ్యాస రచయిత మనకు వ్యాసరూపంలో పరిశీలించి ఇచ్చారు.
తెలంగాణా వైతాళికునిగా వట్టికోట ఆళ్వారు స్వామిని ఎన్. వేణుగోపాల్ పరిశీలించాడు. భూస్వామ్య, రాచరిక, పెట్టుబడిదారి అప్రజాస్వామిక ప్రజావ్యతిరేక ధోరణుల నించి ప్రజలను కాపాడడానికి సాహిత్యాన్ని గొంతుగా నినదించి నిద్రలేపిన వట్టికోట ఆళ్వారు స్వామి తెలంగాణా వైతాళికునిగా రచయిత నిలబెట్టాడు. ప్రజా పరమైన పోరాట సంఘాలతో వట్టికోట ఆళ్వారు స్వామి సంబంధాలు ప్రభావాలను చర్చించి ఆయన రచనల అధ్యయనాన్ని తెలంగాణా ప్రత్యేక అస్తిత్వ ఆంకాంక్షలను కొనసాగించే అనేక వైతాళికులు ఆవిర్భవించాలని చదువరుల బాధ్యతలను గుర్తు చేశాడు.
సంగిశెట్టి శ్రీనివాస్ ఆళ్వారు స్వామి ప్రజాచైతన్యాన్ని గురించి రాస్తూ ఆళ్వారు స్వామి జీవించిన కొద్ది కాలంలో ఆయన ప్రజాసేవ, అందించిన నూతనోత్సాహం నిరంతర కార్యదీక్షతను చర్చించాడు. గ్రంధాలు, అధ్యయనశీలత, గ్రంథాలయంల అవసరంలో దాగిన చైతన్యాన్ని ఆళ్వారు స్వామి సొంతం చేసుకున్న తీరు ఆయన వ్యాసంలో ప్రతిఫలించింది. పౌరహక్కులకు భంగం కల్గినచోట, అణచివేత, దోపిడీ కనిపించిన చోట ఆళ్వారు స్వామి సహించలేదు. దాశరధి రాసిన కవితను జైలుగోడల మీద బొగ్గుతో రాసాడు. జైలులో ఖైదీలతో పరిచయాలు పెంచుకున్నాడు. ఇలా తెలుగువారికి, స్పూర్తినిచ్చే సాహిత్యాన్ని సృజించిన ఆళ్వారు స్వామినీ విభిన్న కోణాలలో వ్యాస రచయిత పరిశీలించాడు.
వట్టికోట ఆళ్వారు స్వామి సమయం – ఒక సందర్భంగా కాత్యాయనీ విద్మహే గుర్తించారు. ఆళ్వారు స్వామితో తమ కుటుంబానికి ఉన్న సాన్నిత్యం ఆయన రచనలను రచనలకు కారణత్వం వహించిన సాహిత్య కాముకతను పరిచయం చేశారు.
సాంస్కృతిక రంగంతో మొదలై అనేక రంగాలలోకి వేళ్ళూనిన ఆళ్వారు స్వామి బహుముఖ కార్యశీలత్వాన్ని సమర్థతను తన వ్యాసంలో ఆవిష్కరించారు.
నూతన ప్రజాస్వామిక ఉద్యమాలకు, పోరాట పటిమకు, నిబద్ధతకు ఆళ్వారు స్వామి మార్గదర్శకత్వం చర్చను కాత్యాయనీ విద్మహే గారు ఆవిష్కరిస్తూ స్త్రీవాద, సాంస్కృతిక ఉద్యమాలను ప్రస్తుత తెలంగాణా అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమాలకు ఆళ్వారు స్వామి జీవితం రచనలు అనివార్య సందర్భంగా విశ్లేషించారు.
ముదిగొండ సుజాతారెడ్డి ఆళ్వారు స్వామి నవలల్లో ప్రజా జీవితాన్ని పేర్కొన్నారు. ఈ వ్యాసంలో వ్యాస రచయిత్రి, ఒకవైపు కొనసాగుతున్న స్వాతంత్రోద్యమం, మరోవైపు తెలంగాణాలోని నిజాం నికృష్ట పాలనలోని తారతమ్యతలు తెలంగాణా ప్రజల పోరాట దృక్పధాన్ని నేపథ్యంగా ఆళ్వారు స్వామి రాజకీయ సాహిత్య దృష్టి కోణాలను వివరించారు. ప్రజల మనిషి, గంగు నవలల్లో పరచుకున్న ఆళ్వారు స్వామి ఉద్యమశీలత కార్యదీక్షిత, సమాజం మారాలన్న తపనను విశ్లేషించారు. బీదరైతుల నుండి జమీందార్లు దొరలు, జాగీరులు సంస్థానాధీశులు వసూలు చేసే శిస్తులను తెల్పి ప్రజల పక్షపాతి ఆళ్వారు స్వామి అని ఋజువు చేశారు. ఆనాడు జైళ్ళలో ఉన్న దుస్థితిని అమానవీయతను చర్చించారు. ఈ సందర్భంలో ఆనాటి సాంఘిక పరిస్థితులను జోడిస్తూ చైతన్య ఆవశ్యకతను అందిస్తారు.
కె.కె.ఆర్ “ఇదో రసభ” వ్యాసంలో ఆళ్వారు స్వామి రచనల వైశిష్ట్యాన్ని తెల్పారు. ప్రజా జీవితంలో దగ్గరి సంబంధాలను కల్గి ఉన్న నిరుపేద రచయిత అయిన ఆళ్వారు స్వామి రచనలకు తగిన ప్రాచుర్యం రాలేక పోవడాన్ని తెలంగాణా ప్రాంతీయ చైతన్య దృష్టికోణంలోంచి ప్రతిఫలింపజేశారు.
స్వయం కృషితో విద్య, అధ్యయనాలను రెండు నేత్రాలుగా జీవితాన్ని నమ్ముకొని ప్రజల పక్షం వహించిన ఆళ్వారు స్వామిని నిరంతర స్ఫూర్తిదాయకునిగా పాఠకుల ముందుంచారు. ప్రజా పక్షం వహించిన రచయితగా, నాయకత్వ భావాలుగల వానిగా, ప్రజాస్వామ్య వాదిగా ఈ వ్యాసంలో ఆళ్వారు స్వామిని మనం అర్థం చేసుకుంటాం.
రాచపాళెం చంద్రశేఖర్ ‘ప్రజల మనిషి’ నవలా శిల్పం వ్యాసంలో వస్తు, శిల్ప నైపుణ్యాలను చర్చించి ఆళ్వారు స్వామి రచనల వైశిష్ట్యాన్ని, ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు. కథా శిల్పానికి వన్నె తెచ్చే విధంగా సాగిన ఆళ్వారు స్వామి రచనల్లోని ఇతివృత్తాలను ప్రజాపరంగానూ, ప్రజాపరంగా వచ్చిన ధోరణులకు సరిసమానంగానూ విశ్లేషిస్తూ పరిశీలన చేశారు. కాలక్షేపం కోసం చదివే నవలలకు బాధ్యతతో చదివే రచనలకు గల బేధాన్ని ఉద్యమకారిత్వంలో చోటు చేసుకున్న చైతన్యానికి అనుసంధానం చేస్తూ ప్రజాపరమైన రచనలకు పాఠకులకూ పెద్దపీట వేశారు. ఆళ్వారు స్వామి రచనల్లో ప్రజలతో గల దగ్గరి సంబంధం ఈ వ్యాసంలో స్పష్టమవుతుంది.
తెలంగాణా పోరాట దశలో అనివార్యంగా పెల్లుబికిన ఆళ్వారు స్వామి చైతన్యం, రచనలను వరవరరావు “ఆళ్వారు స్వామి ఒక అసంపూర్తి తెలంగాణా పోరాటం” లో పరిశీలిస్తారు. ఈ వ్యాసంలో ఆళ్వారు స్వామితో ఆయన రచలనతో స్వీయ అనుభవ అనుభూతులను పేర్కొన్నారు. ఆళ్వారు స్వామితో సమకాలీన పోరాట ఆవశ్యకత కల్గిన నేపథ్యాన్ని ఉద్యమ జీవితాన్ని సాహిత్యంలో చూపిన ప్రజాపక్షపాతం రచనలను మన ముందు ఉంచారు. శ్రీశ్రీ కవిత్వాన్ని భూమార్గం పట్టించాలన్న కల సాకారమైంది తెలంగాణా సాంస్కృతిక విప్లవంలోనే. అది జగిత్యాల, సిరిసిల్లా పోరాటాలలో “ఊరు మనదిరో వాడ మనదిరో” “దొరఎందిరో దొర పెత్తన్నమేందిరో” అన్నప్పుడే సాధ్యమైందని ప్రాపంచిక దృక్కోణంలో వరవరరావు పరిశీలించారు. గ్రామాల్లో రగులుతున్న చైతన్యం, కవులు, దున్నేవానిదే భూమి వంటి వ్యక్తికి ఆత్యావశ్యకమైన మినిమం నీడ్స్‌ని ఒక్కసారి తన వ్యాసం ద్వారా కళ్ళలో కదిలేటట్లు అవిష్కరించాడు. ఇన్నాళ్ళకు ఆళ్వారు స్వామిపై చర్చలు, పరిశీలనలు, వ్యాస సంకలనాలు వంటి కృషి జరుగుతున్నందుకు వరవరరావు ఈ వ్యాసంలో బహిర్గత పర్చిన తృప్తి ఒక అస్తిత్వ ఉనికిల నుండి ముందడుగు వేస్తున్న దశకు పారాకాష్టగా అర్థంచేసుకోవచ్చు.
మానవ విలువలకు అద్దంపట్టిన “జైలు లోపల” కథలలో వాసిరెడ్డి నవీన్ ఆళ్వారు స్వామి మానవీయ విలువలను తెలియజేస్తాడు. ఐదు ప్రాంతాలలో జైలు జీవితం గడపిన ఆళ్వారు స్వామి, జైలులో అనేక మంది ఖైదీలకు ఆత్మీయ అభిమానుడు. అటువంటి ఆళ్వారు స్వామిలోని సామాజిక ధృక్పథాన్ని విభిన్న పార్శ్యలను ఆలోచనా స్రవంతిని వ్యాస రచయిత ఆవిష్కరించాడు. ఒక్కొక్క కథలోని ఔన్నత్యాన్ని సామాజిక, జీవనపరంగా, ఆర్థిక, రాజకీయ కోణాలను పరిశీలించాడు. మానవీయ విలువలు, సిద్ధాంత జీవితం తెలుగు పాఠకులపై ప్రసరించి రేకెత్తించిన ఆలోచనాస్త్రాలను మనం అంది పుచ్చుకోవాల్సిన బాధ్యతను వ్యాస రచయిత గుర్తుచేశాడు.
ఇట్లా పది విభిన్న అంశాలను విభిన్న దృష్టికోణాలతో పరిశీలించిన వ్యాసకర్తలకు తెలుగు సాహితీ అధ్యయన ప్రియులు కృతజ్ఞతలు తెల్పుకునే రీతిలో ప్రతి ఇంటా భద్రపర్చుకొని తరచు చదువుతూ సాహిత్యాన్ని బేరీజు వేసుకోవడానికి ఉపయుక్తమైన పుస్తకం ఇది. రావలసిన సమయానికి సందర్భోచితంగా అచ్చయిన పుస్తకం “ప్రజల మనిషి వట్టికోట సాహిత్య జీవితం, వ్యాస సంకలనం”. సందర్భంతోపాటు విస్తృతమైన ప్రజా నేపథ్యాన్ని కల్గిఉన్నది. ఈ పుస్తకానికి నందిని సిధారెడ్డి, వేముగంటి రఘునందన్, దేశపతి శ్రీనివాస్, వేముగంటి మరళీ కృష్ణ సంపాదకత్వం వహించారు. మంజీరా రచయితల సంఘం ఆవిష్కరించిన ఈ పుస్తకం (28 అక్టోబర్ 2007) పునర్ముద్రణలకు దారిని సగమం చేసుకుంటుంది.
పుస్తకం దొరుకు చోటు:
1. వేముగంటి రఘునందన్
1-4-61, రాములగుడి, సిద్దిపేట – 502 103.
2. నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ ఎదురు వీధి, కాచిగూడ, హైదరాబాద్.
3. దిశ పుస్తక కేంద్రం
త్రినేత్ర సూపర్ మార్కెట్ ఎదురుగా, చిక్కడపల్లి, హైదరాబాద్.
(ముద్రణ: చరిత ఇంప్రెషన్స్, హైదరాబాద్)
పుస్తకం వెల: రూ. 30/-
అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు