జులై2008
ఎన్నికలు
- పి.చంద్
మున్సిపాల్టీ ఎన్నికల తేది ప్రకటించే సరికి రామయ్య కాలనీలో ఎక్కడ లేని హడావిడి మొదలయింది.
కాంగ్రెసు నాయకుడు నారాయణ అప్పటికే ఒక పర్యాయం కాలనీలో పర్యటన జరిపి ఇల్లు ఇల్లు తిరిగి వెళ్ళి పోయిండు. అపోజిషన్ లీడర్ యాదవ్ తానేమి తక్కువ తినలేదని బారి ఎత్తున ప్రదర్శనతో వచ్చి వాడ వాడలు తిర్గిపోయిండు..
రామయ్య కాలనీలో కాంట్రాక్టు కూలీలు రెండు గ్రూపులుగా చీలిండ్లు.. ఒకటి తెలుగు దేశం వాళ్ళదైతే, మరొకటి కాంగ్రేసు వారిది. తెలుగుదేశంకు చిన్న చితక కాంట్రాక్టులు చేసే జానకి రాం నాయకత్వం వహిస్తే కాంగ్రెసు పార్టీకు సుబ్బారావు నాయకత్వం వహిస్తున్నారు…రామయ్య కాలనీలోని నర్సాగౌడుకు చెందిన రెండు తెల్లకల్లు దుకాణల కాడ సాయంత్రమే కాదు…పొద్దంతా కూడ కూలీలు మూగుతున్నరు.
“మీరేం రంది పడకుండ్లీ కడుపునిండా తాగుండ్లీ… బిల్లు సంగతి యాదవ్ సేఠ్ చూసుకుంటడు” అంటు జానకిరాం చెప్పి పోయిండు…
అఫోజిషన్ వాళ్ళు అంతగా హమీలు ఇస్తే కాంగ్రెసు వాళ్ళేమి తక్కువ తినలేదు.. తెల్లకల్లే కాదు చీకటైతే చాలు చీవు లిక్కర్ పవ్వలు పంచి పెట్ట సాగిండ్లు…
పోటీలో నిలబడ్డ ఇద్దరు నాయకులు కూడా కాంట్రాక్టర్లుగా ప్రముఖులే.. ఇద్దరి మధ్యన వృత్తి సంబంధమైన పోటీ ఉంది… దోస్తాని ఉంది ఇక లోపల ఎవరి మనసులో ఏమున్నదో కాని బయటికి మాత్రం ఇద్దరు మంచి మిత్రులుగానే చెలామణి అవుతారు…
పారిశ్రామిక ప్రాంతానికి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలను అటు అధికారి పార్టీవాళ్ళు ఇటు ప్రతి పక్షం వాళ్ళు సవాలుగా తీసుకున్నారు.
అందుకోసం డబ్బు దస్కం పలుకుబడి అన్నీ ఉన్న వారిని ఏరికోరి ఎన్నికల్లో నిలిపారు.
“పార్టీ పుట్టిన కాన్నుండి జెండాలు మోసింది మనం… తీరా ఎన్నికలు వచ్చె సరికి హఠాత్తుగా పుట్టుకొచ్చిన వాళ్ళు బీ ఫార్మ్ సంపాందించారు” అంటు మొదటి నుండి పార్టీ జెండాలు మోసినోళ్ళు కొందరు అలిగిండ్లు బయటికి పోయినోళ్ళు బయటికి పోయిండ్లు.. పార్టీ టికెట్ సంపాందించిన వాళ్ళు అసంతృప్తి చెందిన వారిలో కొందరికి నోట్ల కట్టలు పంచి, నోళ్ళు మూయించిండ్లు.. మరికొందరికి రాబోయే కాలములో రాబోయే పదవుల గురించి ఎర చూపిండ్లు.. అట్లావినని వాళ్ళను, మెండికేసిన వాళ్ళను.. పోతే పోనియ్ వాళ్ళ లెక్కబిషాదెంత అన్నట్టుగా అదిష్ఠానము వ్యవహరించి అన్ని రకాలుగా సర్దుబాటు చేసింది… మరి ఎన్నికలంటే మాటలా దానికి.
ఇక పోటీలో మిగిలిన ఇద్దరు.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీలు పడి ప్రచారము చేస్తున్నారు. డబ్బు పోర్టులో మకుటంలేని మహారాజు అయితే, మరొకరు చిన్న పెద్ద పరిశ్రమలు స్థాపించి అటు కాంట్రాక్టర్‌గాను ఇటు ఫ్యాక్టరీలు పెట్టి బాగానే కూడ బెట్టిండు….
కీలమైన పారిశ్రామిక ప్రాంతం మున్సిపాల్టీ కైవసం చేసుకుంటే అటు సమాజంలో పదవికి పదవి… డబ్బుకు డబ్బు డబ్బు లాభిస్తుందనే స్పృహ ఇద్దరికీ లేక పోలేదు…
ఎన్నికలతో రామయ్యకాలనీకి ఎన్నికల కళ వచ్చింది…
ఓట్ల కోసం నాయకులు కులాల పేర ప్రాంతాల పేరు మీద జనాలను సమీకరించటం మొదలు పెట్టారు.
జానకి రాం ఒరియా కార్మికులను కుప్పేసి “ఇదిగో మనమంతా ఒక్కటిగా ఉండాలి. ఆంద్రోళ్ళ మాటలు విని నోట్లె మన్ను కొట్టుకోవద్దు.. యాదవ్ సారుతో అన్ని మాట్లాడిన ఎన్నికల్లో నెగ్గిన తరువాత రేషన్ కార్డులు ఇప్పిస్తనన్నడు. మన కోసం ప్రత్యేకంగా ఇండ్లకు జాగ ఇప్పిస్తన్నడు మన ఒరియావాళ్ళకు తాగేందుకు మంచినీళ్ళ పంపులు వేయిస్తన్నడు.. కాలనీకి కరెంటు బుగ్గలు ఎల్గిస్తన్నడు” అంటు మొదలు పెట్టిండు.
“ఆంద్రోళెందో? ఒరియా వాళ్ళేందో వాళ్ళకేమి సమజ్ కాలే కూలి చేసే కాడ గా తేడాలేమి కన్పించదు. జానకి రాం కాస్త హుషారు గాడై కంట్రాక్టర్ దగ్గర సబ్ కంట్రాక్టులు పట్టినాల్గు పైసలు కండ్ల చూసే సరికి నిన్నటి దాక ఎవరిని లెక్క చేయనోడు ఇయ్యల మెత్త మెత్తగా మాట్లాడతాండు… అంటు లోలోన నసిగేటోళ్ళు నసిగిండ్లు .
“ముందుగాల పంపులు వేయించుండ్లీ నీళ్ళు లేక హరిగోసపడ్తం…” అంటూ ఒరియా ఆడోళ్ళు అడ్డు తగిలిండ్లు.
“వేయిస్తాం సారుతోని అన్ని మాట్లాడిన ఎన్నికలు అయినంక చేసే మొదటి పని అదే” జానకి రాం సముదాయించ చూసిండు.
“ ఆ ఎన్నికలైనంక మా మొఖం ఎవలు చూస్తురు” హరిరాం అడ్డు పడ్డడు.
జానకిరాం సహనం నశించి హరిరాం కేసి కొరకొర చూస్తూ” యాదవ్ సార్ అసుంటి వాడు కాదు” అన్నడు.
“ఎన్నికల ముందు అందరు అట్లనే చెపుతరు… పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పడు ఏం చెప్పిండ్లు.. రేషన్ కార్డులు ఇప్పిస్తమన్నరు.. పంపులు వేయిస్తమన్నరు.. వీదిలైట్లు పెట్టిస్తమన్నరు. ఎన్నికలైనంక ఇటు మొఖం చూస్తలేరు “ గోపాల్ అసహనంగా గుణిగిండు.
పరిస్థితి చేయ్యదాటెట్లున్నదని జానికి రాం శాంతానికి వచ్చి “ఇగో నా మాటనమ్ముండ్లీ మన మంతా ఒక్కటి, ఈ సారి మాట తప్పే దుంటె మళ్ళీ మీకు మొఖం చూయించ” అన్నడు.
ఇక మీటింగును పొడిగించటము ఇష్టం లేక జానకి రాం, సోన్ లాల్, ప్రశాంత్ రాంజీని, గోపాల్, బసంతనాగులను వెంటబెట్టుకొని పోయిండు. వాళ్ళు పోతుంటే…
“ఇంట్ల తిండికేం లేదు తాగి తందాన లాడి వస్తే ఊరుకునేదిలేదు. అ ఇచ్చేది ఎదో మాకే ఇచ్చి పోండ్లీ” అంటు బసంతనాగు భార్య సుభానా ఎదురు తిరిగింది.
జానకి రాం ఇరకాటంలో పడ్డడు. “ఇప్పడదేం లేదు” అంటు అక్కడి నుండి వాళ్ళను తోలుకొని పోయిండు.
రామయ్య కాలనీలో జానకి రాం ఒరియి కార్మికులను కుప్పేసి మాట్లాడిండు అని తెలిసిన తరువాత… తెలుగోళ్ళు ఓరియా వాళ్ళు, బెంగాలి వాళ్ళు అంటు చీలికలు వచ్చినయి. అంతకు ముందు తెలుగోళ్ళు తోని మాట్లాడిన సుబ్బారావు వెంటనే బెంగాలి వాళ్ళు ఉండే గుడెసెలకేసి నడిచిండు. అక్కడ వాళ్ళని పాతిక కుటుంబాల దాకా ఉన్నయి.
“ ఎంత లేదన్నా డెబ్బయి ఎనుబై ఓట్లుంటయ” అంటు కేశవులు హుషారుగా అన్నడు.
“కాని వాళ్ళు మన మాట వింటరంటావా” రామరావు అనుమానంగా అడిగిండు.
“విననీ వినకపోనీయ్… అడగటం మనవంతు నారాయన సారు ఒక్కటే చెప్పిండు..అందర్ని కలుపుండ్లీ.. ఎవరు ఎట్లా వింటారో చూసి అట్లా వినిపించుండ్లీ… డబ్బుల గురించి ఆలోచించవద్దన్నడు” సుబ్బారావు బరోసగా అన్నడు.
తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా విడిపోయినప్పుడు కాందీశీకులుగా వలసవచ్చిన బెంగాలీలకు ఉపాధి కల్పించటానికి ఆయా ప్రాంతాలకు తరలించారు. అలా కాందీశీకులుగా వచ్చిన వాళ్ళకు ఎక్కడ పనులు దొరకుతాయి అనుకుంటే ఆ ప్రాంతాలకు తరలించారు..
ఎన్టీపిసి నిర్మాణ సమయంలో అలా వలస వచ్చిన వంలాది బెంగాలీ కుటుంబాలలో అటు తరువాత పనలువీ కరువై ఉపాధి వెతుక్కుంటు పోయిన వాళ్ళు పోగా కేవలం పాతిక ముప్పయి కుటుంబాలు మాత్రం మిగిలిపోయాయి.
అందులో కొద్ది మంది మాత్రం ఎన్టీపిసిలో క్యాజువల్ లేబరుగా ఉద్యోగము సాంపాదించుకున్నారు. క్యాజువల్ లేబర్ పని సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. రోజు కూలి కోసము వెతుక్కోవల్సిన పని ఉండదు. పర్మినెంటు పనులనే క్యాజువల్ వర్కర్స్‌చేత చేయించటము వలన పని ఉంటుందో లేదో నన్న భయం లేదు. దానికి తోడు కనీస వేతనాలు, పిఎఫ్ వంటివి అమలు జరుగటంవల్ల క్యాజువల్ వర్కర్స్ పరిస్థితి మిగతా కూలీల కంటే కాస్త మెరుగ్గానే ఉంది.
రామయ్య కాలనీలోని మొత్తం గుడిసెలకు బెంగాలి కార్మికులుండే గుడిసెలకు మధ్య కొంత తేడా ఉంటుంది. మిగతా కార్మికుల గుడిసెలు పై కప్పులు సరిగా లేక అట్టపెట్టలతోని, డాంబర్ రేకులతో అంతంత మాత్రంగా, ఎండ వానలకు రక్షణ ఇవ్వనేని స్థితిలో ఉంటే, బెంగాలి కార్మికులు ఉండే గుడిసెలు ఉన్నంతలో మెరుగ్గా శుచి శుభ్రతతో ఉంటాయి.
క్యాజువల్ లేబర్స్ పని చేసే బెంగాలీలు కాకుండా మిగతా కుటుంబాలు పదిహేను ఇరువైదాక ఉంటాయి. కూలి దొరకనప్పుడు వాళ్ళంత ఎన్టీపిసికి నీళ్ళందించే డ్యామ్‌లో చేపలు పట్టి అమ్ముకుంటు జీవనం సాగించే వాళ్ళు. కాని గత కొద్ది సంవత్సరాల నుండి, డ్యాంలో చేపులు పట్టేకాడ, స్థానికులకు బెంగాలీలకు మధ్య లొల్లి చెలరేగి చివరికి ఒకరి మీది మరోకరు పోటీలు పడగా చేపలు పట్టే టెండర్ల రేటు పెరిగిపోయి. గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో తిండికి కటకటలాడే పరిస్థితి వచ్చింది.
సుబ్బారావు తన అనుచరులతో బెంగాలీల గుడిసెల ప్రాంతానికి చేరుకునేసరికి , బెంగాలీల పెద్ద బినయ్ మండల్, డూకిరాం, విమల్ పాండేలు ఇంటి వద్దనే కన్పించిండ్లు.
కాలనీలో ఎన్నికల హడావిడి మొదలయిన తరువాత తరుచు ఏదో ఒక పార్టీ వాళ్ళు వచ్చి కలసి పోతున్నారు. ఆయా గుడిసెల మీద పార్టీ జెండాలు ఎగరటం వల్ల వాడల్లో కలహాలు కక్షలు ఆరంభమైనవి. టి.కే. సర్కార్ ఇంటి మీద తెలుగు దేశం జెండా చూసి సుబ్బారావు “అపోజిషన్‌వాళ్ళు మనకంటే ముందే మేలుకున్నట్టుంది” అంటు అటు వైపు అనుమానంగా చూసిండు.
“అదేం కాదు టి.కే. సర్కార్, యాదవ్ మనిషి ఆయనను పట్టుకొనే క్యాజువల్ వర్కర్ అయిండు” అంటు కేశవులు “మిగత వాళ్ళంత మన మనుష్యులే మనం ఎంత చెప్పితే అంతా” అన్నాడు.
“ఏమో…” అంటు సుబ్బారావు దీర్ఘం తీసిండు.
“అదేం లేదు… నామాట నమ్ముండ్లీ” అంటు కేశవులు రో,నిగా అన్నడు
మీటింగు అనేసరికి అడోళ్ళు పిల్లలు కూడ జమైండ్లు.
అరువై ఎండ్లు పై బడ్డ సరస్వతి మండల్ వచ్చింది. లీడర్లు వచ్చిండ్లంటే ఆమె కొడుకు కోకన్ మండల్‌కు కంట్రాక్టరు తిర్గి పనిలో పెట్టుకుంటాడో లోదో అడుగుదామని వచ్చింది.
పరిచయాలు అయినంక సుబ్బారావు తను వచ్చిన పనేంటో తెలియ చెప్పి “మీకు తెలియంది ఏం లేదు.. మీ బాధ ఏమిటో నాకు తెలియంది కాదు. డ్యాం కట్టినప్పటి నుండి డ్యాంలో చేపలు పట్టుకుంటున్నది మీరు… మధ్యలో లోకల్ వాళ్ళు వచ్చిండ్లు లోకలోళ్ళు ఎవరు చేపలు పట్టి బ్రతికోటోళ్ళు కాదు… ఇందులో మీరేదో బావుకుంటాండ్లని వాళ్ళు వచ్చిండ్లు కాని దాని వల్ల వాళ్ళు బాగుపడ్డది లేదు…” మధ్యలో మీరు నష్ట పోయిండ్లు.. సారుబిత మాట్లాడి మునపటిలెక్కన మీరు డ్యాంలో చేపలు పట్టుకునే ఏర్పాట్లు చేయిస్తా… ఇంత కంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. అంటు చెప్పుకొచ్చిండు.
ఈ మాట బెంగాలీలకు మంచిగానే అన్పించింది. వినయ్ మండల్ అదే మాట అన్నడు. “మీరు ఆ పని చేస్తే మా బతుక్కి ఓదారి చూయించినట్టు అవుతుంది”.
మిగత వాళ్ళు సమ్మతిగా తలాడించిండ్లు…
“ ఆ విషయంలో మీరింక నిర్రందీగా ఉండొచ్చు” అంటు కేశవులు అత్యుత్సాహం ప్రదర్శించిండు.
“మా పొల్లగాన్ని కంట్రాక్టరు పనిల పెట్టుకుంట లేడు…” అంటు సరస్వతి మండల్ అంత వర దాక మనసులో కుతకుత లాడుతున్న మాట బయట పెట్టింది…
“దానికి వీళ్ళేం చేస్తేరే…” విమల్ పాండే ముసల్దాతీ మాటకు అడ్డు పోయిండు.
“మరెందుకు వచ్చిండ్లు”
“ఓట్లు వెయ్యాలే.. ఓట్లు”
“ఓట్లు ఏస్తే ఏమొస్తది… ఎన్ని సార్లు ఎయ్యాలనట…” అంటు మసక బారిన కండ్లతోని అందర్ని పరిక్షగా చూసింది.
“గా ముసల్దాని మాట పట్టించుకోకుండ్లే సారు… ఎడ్డి ముసల్ది భర్త చచ్చిపోయిండు. కొడుకు పనిలేక హోటల్ల పొంటి బ్రతుకుతాండు.”’ యువకుడై గోపాల్ అన్నడు.
సుబ్బారావు తెలిగ్గా నవ్వి “ ఎర్కే ఎర్కే” అంటు ముసల్దాని మాటలు పట్టించుకోకుండా బినయ్ మండల్‌తో మాటల్లోకి దిగిండు.
బినయ్ మండల్ చాయ్ తాగి పోవాలని బలవంతం చేసిండు. కాని ఇంకా చాలమందిని కలువాలని సుబ్బారావు తొందరగా లేచిండు. దాంతో అతని వెంట వున్న వాళ్ళు కదిలిండ్లు.
రామయ్య కాలనీ కాకుండా వొడ్డరి పని చేసే కార్మికులుండే క్రషర్ నగర్, కాకతీయ నగర్, ఎన్టీపిసి రోడ్డుకు ఎగవన ఉండే చత్తీస్ గడ్ క్యారీ కార్మికులుండే ప్రాంతాలకు కూడా ఎన్నికల సందర్భంగా నాయకుల రాక పోకలు ఎక్కువైనవి.
రోడ్డుకు ఒకవైపు ఎన్టీపిసి మెర్కురీ దీపాల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతుంటే. రోడ్డుకు ఈవలవైపున దుకాణాలు, వర్క్‌షాపుల వెనుక మొదలయ్యే గుట్ట బోరును అనుకొని గుట్టబోరు మీది కంటు ప్రాకిన చిన్న చిన్న గుడిసెల్లో చీకటి రాజ్యం ఏలుతుంది.
మనిషి నిలుచుంటే నడుము వరకు వచ్చే ఆ పూరి పాకల్లోనే ఏండ్లకు ఏండ్లగా క్వారీ కార్మికులు బ్రతుకులు వెల్లదీస్తున్నారు. అక్కడ దాదాపుగా రెండు వందల కుటుంబాలున్నాయి. రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి.
ఎన్నికలప్పుడు తప్ప నాయకులు ఎవరు వాళ్ళ గుడిసెల ప్రాంతాలకు రావటం జరగదు. బండలు కొట్టేపనుల్లో ఏండ్లకు ఏండ్లుగా గడిచిపోతున్న వాళ్ళ బ్రతుకుల్లో మారిందేమి లేదు.
ప్రచారానికి వచ్చిన నాయకులు వచ్చి తియ్య తియ్యని మాటలు చెపుతున్నారు. పులుకు పులుకు చూసుకుంటు ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళ మాటలు వినసాగిండ్లు…
దస్రు భార్య శ్రావణబాయ్ కల్పించుకొని “పోయినసారి ఎన్నికలప్పుడు వచ్చి నోళ్ళు బోరింగులు వేయించిండ్లు. కాని అండ్ల చుక్క నీరు వస్తలేదు. మీరు వచ్చే తోవల ఎన్టీపిసి మురికి కాల్వ ప్రక్కన మేము తవ్వుకున్న బాయినీళ్ళే తాగి బతుకుతానం. ఎండకాలం వస్తే అయింత నీళ్లు కూడా తొరకుతలేవు. గదాని సంగతేందో చూడాలి” అంది.
టీకురాం భార్య పుష్ప “వర్షకాలం కూడా నీళ్ళకు కరువొస్తాంది. ఉన్న ఒక్క బాయిల మురికి నీరు చేరి త్రాగ వశం అయితలేదు. బిందెడు బిందెడు నీళ్ళ కోసం మైళ్ల కొద్ది పోవలసి వస్తాంది” అంది.
మురికి, చమట కంపుతో నిండిన ఆ పరిసరాల్లో నాయకులు ఎక్కువసేపు నిలబడలే పోయిండ్లు. “ఈ సారి ఓట్లు వేస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం” అంటు చెప్పి పోయిండ్లు…
ఎన్నికల దగ్గర పడ్డ కొలది హడావిడి ఎక్కువైంది. కంట్రాక్టర్లు వారి కింద పనిచేసే మేస్త్రీలు, కూలీలు రెండు గ్రూపులుగా విడిపోయిండ్లు. మీటింగులకు ఊరేగింపు మనుషులను తోలుకు పోతున్నారు. అట్ల తోలుకు పోయినవాళ్ళకు తిండి పెట్టి సాయంత్రం తెల్లకల్లు పోయించి తిప్పుకుంటాండ్లు…
రామయ్య కాలనీలోని కాసిపెల్లి సోసైటీ, మేడిపల్లి సోసైటి కల్లు మొద్దులకాడ తెల్లల్లు జాతర సాగుతాంది. మేస్త్రీలు, ఎన్నికల సందర్భంలో పుట్టుకొచ్చిన చోట మోట లీడర్లకు చీప్ లిక్కరు అందుతాంది.
సుబ్బారావు ఒకవైపు, జానకీ రాం ఒకవైపు కంటిమీద కునుకు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. గెలుపు కోసం తీసుకోవలసిన చర్యలు అన్నీ తీసుకుంటున్నారు…
ఓరియా కార్మికుడు మాలిక్ బిహారీ… పసుల రాజయ్య మద్య మాట మాట ముదిరి తెలుగోళ్ళు, ఓరియా వాళ్ళ మధ్య తన్నులాటకు దారి తీసింది.
ఓరియా కార్మికులు దేవరాజ్, చక్రధరలకు తెలుగోళ్ళు పసుల దశరధం, చిట్టి పెల్ల చంద్రయ్యలకు తలలు పగిలినయి.. చాలా మందికి గాయాలు అయినవి. లొల్లి ముదిరింది…
ఏదో తమకు తెలియని కోపం… తమ మీద తమకే కోపం… ఆకలి కోపం… అసహాయ స్థితిలోనుండి వచ్చిన కోపం… ఆ విధంగా బయట పడ్డది.
అరుపులు కేకలు… ఆర్తనాదాలు… పోలీస్ వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చిండ్లు….
ఎన్నికలు సజావుగా జరిగాయి… నారాయణ మంచి మెజారీటీతో గెలుపొందాడు. తన ఓటమి అంగీకరిస్తూ యాదవ్ ప్రత్యేకంగా తయారు చేయించిన నిలువెత్తు పూలదండతో నారాయణ సత్కరించిండు.
“గెలుపు ఓటమీలు చాలా సహజం… స్నేహం మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అంటు నారాయణ యాదవ్‌ను కౌగిలించుకుని సహృదయత ప్రకటించిండు. ఇద్దరు చిరునవ్వులు చిందించారు. అది చూసి సుబ్బారావు, జానకీరాం చేయి చేయి కలిపిండ్లు.
ఆనందంగా అందరూ చప్పట్లు చరిచారు.
* * *
గవర్నమెంటు హాస్పిటల్లో బెడ్స్ లే నేలమీద పడివున్న మాలిక్ బిహారి, పసుల రాజయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేక ఏదో తప్పు చేసినట్టుగా ఖిన్నులై పోయిండ్లు.
ఎప్పటిలాగే సూర్యుడు తూర్పున ఉదయించిండు.
* * *