Jul2008
గురి
- విమల
ఎప్పుడు ఎలా వచ్చిందో తెలీదు
ఒక తెల్లవారని రాత్రి తుఫానువలె కమ్ముకుని
నా అమాయక, కౌమార మర్మరహిత
మనోఫలకంపై చెరగని ముద్ర వేసివెళ్ళింది.
కలల అలలపై ఊహల ఊయలలూపి, వూపి,
నన్నల్లుకున్న చల్లని చందమామై
కనులపై వెన్నెల సౌరభాల
జీవన కాంక్షా నక్షత్రాల పుష్పాల్ని చల్లి.
కనులు తెరవగానే అదృశ్యమైంది.
అద్భుత వైప్లవ్య స్వప్నం -
స్వప్నం, స్వప్నమేనా?
అర్జునుని వలె పక్షి కన్నులలోని
నల్లటి కనుపాపలాంటి అంతిమ లక్ష్యాన్ని ఛేదించేందుకు
నా మనః శరీరాల్ని విల్లంబుల్ని చేసా.
గమ్యమంత అపురూపమైంది గమనం కూడా కదా!
కనుపాప తప్పా, పక్షిరూపం మొత్తం కనపడని
సూర్యోదయాలు తప్పా, సాయం సంధ్యలు కనపడని
హిమ సమూహాలు తప్పా, ఇసుక ఎడారులు కనపడని
పచ్చని మైదానాలు తప్పా, బీడు భూములు కనపడని,
అసమాన ఏకాగ్రదృష్టిలో
పొందినదెంత? పోగొట్టుకున్నదెంత?
అమరుడి గడ్డకట్టిన నల్లటి
నెత్తుటి చుక్కలా చందమామ -
పందెపు గిత్త కాలం కళ్ళ ముందు
రెపరెపలాడే, అందని ఎర్రజెండాలా
విప్లవం -
పరుగెత్తు పరుగెత్తు, నీటిబుడగల వంటి
స్వప్నాల వెంట, సంభ్రమాల వెంట.
మృత్యుఛాయ కమ్ముకున్న క్షణాల వెంట,
అమరుల చితాభస్మాల నుండి
ఎగరని పక్షుల వెంట
ఎడతెగని విషాద వైఫల్యాల చీలిక దారుల వెంట.
Hrk Aug 24, 2008 1
కవిత చాలా బాగుంది. విమల ఎంత విషాదంగా పలికినా విషాదం లొంచి కొంచం ఆశను తోడి ఇచ్చేవారు. ఒక కవిగా నాకు అది కుదరడం లేదే అని బాధ పడే వాడిని. ఈ పద్యంలో ఇసుమంత ఆశ లేకపొవడం వల్ల వట్టి బాధ మిగిలిపోతున్నదేమో?!
ఆశ వుంది.
చీలిక దారులు కలుస్తాయి. సత్య శకలాల మధ్య ఫెడరేషన్ తరహా ఐక్యత అయినా తప్పక సాధ్యమవుతుంది. మనందరిలో చిత్త శుద్ఢి సజీవంగా వున్నంత కాలం మన కల సజీవమే.
నిరాశను నిరాశగా కూడా చెప్పాలి. నిజం బతుకు లోంచి వస్తున్నంత వరకు, క్రియాశీల నిరాశ లోడొల్ల ఆశ కన్న గొప్పగా కలను కాపాడ గలుగుతుంది. అభినందనలు. -హెచ్చార్కె