అధ్యాయం 9: అన్ని తెగలకు తెలిసిన భాష - పెయూట్

Sculpture of Native American
Sculpture of Native American
మా పాటలలో పదాలు వుట్టి పదాలు కాదు. అవి పవిత్రమైన పెయూట్ వేరు ప్రతిధ్వనులు. మా నేలలోని గులకరాళ్ల మర్మర ధ్వనులు. పెయూట్ విసన కర్రలోని మ్యాగ్ పీ, సిజర్ టెయిల్ పక్షుల ఈకల స్వరాలు. మా నీటి వాద్యం లోపల్నించి పలికే గొంతులు. పెయూట్ మొక్క మాకు గొంతు ఇస్తుంది. మేము పరస్పరం అర్థం చేసుకోడానికి పాటను ఇస్తుంది. ఓసారి నేను మా ‘టిపి’ (ఇండియన్ ఇల్లు) పైని గవాక్షంలోంచి ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూశాను. నక్షత్ర కాంతి పవిత్రమైన మా పూజా వేదిక మీద పడుతూ, నాకొక పాటను ఇచ్చింది. చాల పాటల్లో పదాలు అంటూ ఏమీ వుండవు. కావాలంటే వాటిలో పదాలు పెట్టుకోవచ్చు. పాటలో పదాల్ని పెట్టాలో వద్దో పెయూట్ నిర్ణయిస్తుంది.

పెయూట్ సమావేశాల్లో ప్రతిసారీ ఆడవాళ్లు కూడా పాల్గొనేవారు. చాల కాలం వరకు ఆడవాళ్లు పాడేవారు కాదు. ఆడవాళ్లు పవిత్ర ధ్వజంతో ప్రార్థన చేయకూడదని అనేవాళ్లు. పవిత్ర ధ్వజం ఒక మగవాడు. ఆడవాళ్లు మగవాళ్లయి పోకూడదని అనేవాళ్లు. సమావేశాల్లో పాడటం మొదలెట్టిన మొదటి ఆడవాళ్లలో నేనూ ఒకతెను. నా గొంతు మరీ పై స్థాయిలో పలికేది. నా గొంతు దిగులుగా వున్న చిన్న పిల్ల గొంతులా వుంటుందని అనేవాళ్లు. లియోనార్డ్ అక్కచెల్లెళ్లు మంచి గాయకులు. ముఖ్యంగా క్రిస్టీన్ . తనది బాగా లోతయిన, బలమైన గొంతు. ఇప్పుడు సరే, చాల మంది ఆడవాళ్లు పవిత్ర ధ్వజం పట్టుకుని, సొరకాయ బుర్ర వూపుతూ జమాయించి పాడేస్తున్నారు.

నేనేదో తన పెళ్లాన్ని కాబట్టి చెబుతున్నానని కాదు గాని; దేశంలోని పెయూట్ గాయకులందరిలోకి మంచి గాయకుడు లియోనార్డ్ . విభిన్న తెగలకు చెందిన రకరకాల పాటలు వందల కొద్ది లియోనార్డ్ కు వచ్చు. సొంతంగా తానే ఓ వంద పాటలు కట్టి వుంటాడు. తన పాటలన్నీ సంప్రదాయికమైనవే గాని, వాటిలో కొత్తగా, ప్రత్యేకమైన సంగతులేవో కలిసేవి. ఆ ప్రత్యేకతలను విడదీసి చూపడం సాద్యం కానంతగా పాత పాటల్లో కలిసిపోయేవి. ఒక్కోసారి తన గొంతు మామూలు మానవ స్వరం కాదనిపించేది. మరికొన్ని సార్లు తను ఒక్కడే పాడుతున్నా, ఇద్దరు ముగ్గురు మనుషులు కలిసి పాడుతున్నట్లు వుండేది. రోడ్ రన్నర్ పక్షి స్వరాలతో కొన్ని పాటలు కట్టాడు. తను సూ బాషలో ఆ పాటలు పాడుతుంటే వినాలి. పాటలో అచ్చంగా రోడ్ రన్నర్ పక్షి అరుపులు వినిపించేవి. రోడ్ రన్నర్ మా ‘టిపి’ లో ఒక చోటు నుంచి మరో చోటుకు గింగిరాలు కొడుతోందనిపించేది. తీరా చూస్తే, అక్కడ ఏ పక్షీ వుండదు. పాట మాత్రమే వుంటుంది.

నేను పోంకాలు, ఓటోలు, విన్నెబగోలు, చెయెన్నేలు… ఇలా వివిధ తెగల వాళ్లతో కలిసి వృత్తంలో కూర్చున్నప్పుడు ; పూర్తిగా నా వాళ్ల మధ్యనే కూర్చున్నట్లనిపించేది. ఇంగ్లిష్ లో మాట్లాడుకుంటే తప్ప ఒకరి మాట ఒకరికి అర్థం కాదు. కాని, పెయూట్ ద్వారా మేమంతా ఒకే భాష మాట్లాడుతున్నామనిపించేది. అదొక ఆధ్యాత్మిక భాష. పెయూట్ క్రతువును నిర్వహించడంలో తెగ నుంచి తెగకు కొన్ని తేడాలుండేవి. తేడాలు చాలా చిన్నవి. సారాంశంలో అంతా ఒకటే. క్రతువులో న్యావహోలు ముక్కజొన్న పొట్టు సిగరెట్లు ఉపయోగిస్తే మేము పైపు, క్యాన్ షాషా, ఇండియన్ విల్లో బెరడు , పొగాకు వుపయోగించే వాళ్లం. న్యావహో ప్రధాన పూజా వేదిక అర్థ చంద్రాకారంలో వుంటే మిగతా తెగలవి మరో ఆకారంలో వుండేవి. కొందరు ఇంట్లోనే శుభ్రం చేసి, పవిత్రీకరించబడిన గదిలో క్రతువు నిర్వహిస్తే మరి కొందరు తప్పని సరిగా ‘టిపి’ వుండాలనే వారు.

లియోనార్డ్ దగ్గరికి న్యావహో వాళ్లు వచ్చినప్పుడు, తను వాళ్ల పద్ధతిలోనే క్రతువు నిర్వహించే వాడు. మేము అరిజోనా వెళ్లినప్పుడు న్యావహోలు మా కోసం సూ పద్ధతిలో క్రతువు జరిపే వాళ్లు. తేడాలు చాల తక్కువ. ప్రతి సమావేశం పొద్దు కుంకినప్పటి నుంచి పొద్దు పొడిచే వరకు జరిగేది. సమావేశంలో పాటలు, పవిత్ర ధ్వజం, సొరకాయ బుర్ర, విసన కర్ర, డోలు, పొగ తాగడం, మంట, చల్లని నీరు తాగడం… తప్పని సరిగా వుండేవి.

సరిహద్దు దిగువ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే పెయూట్ పూజ కాస్త భిన్నంగా వుండేది. 1975లో లియోనార్డ్ మా దగ్గర ఘోస్ట్ డ్యాన్స్ నిర్వహించాడు. ఆశ్చర్యకరంగా ఆ సమావేశానికి కొందరు మెక్సికో ఇండియన్లు వచ్చారు. యాఖీ, హుయ్చొల్, నహుయటిల్ అని వాళ్ల పేర్లు. మా ఘోస్ట్ డ్యాన్సు గురించి వాళ్లకెట్టా తెలిసిందో, అంత దూరం నుంచి ఎలా వచ్చారో అర్థం కాలేదు. ఇంకో సారి ఒయాక్సాకా నుంచి ఒకాయన వచ్చాడు. పూర్తిగా మెక్సికన్ ఇండియన్ తరహా దుస్తులు వేసుకున్నాడు. తన నహువా (తెగ) పేరు’ వెచ్చనిదక్షిణ గాలి’ (వార్మ్ సౌత్ విండ్ ). మా సూ జనం తమదయిన వ్యంగ్యంతో ఆయనకు’ చిన్నపాటి డిస్టర్బెన్స్ ‘ అని పేరు పేరు పెట్టేశారు. ఇలా అజ్టెక్ , మయా తదితర ప్రదేశాల నుంచి వచ్చే ఇండియన్ సోదరులు కూడా ‘పెయూట్ జనమే’ నని మాకు అర్థమయింది. అయితే, వాళ్ల క్రతువులు మా వాటికి బాగా భిన్నంగా వుండేవి. ఈ భిన్నత్వం కూడా నిన్న మొన్నటిది కాదు. చరిత్ర ప్రారంభ యుగాల నుంచి వస్తున్నదే.

పెయూట్ ధ్వజం కేవలం కర్ర కాదు. అదొక మానవుడు. సజీవ మానవుడు. అది… మా ఆయన మాటల్లో చెప్పాలంటే మేము మహా ఆత్మతో మాట్లాడుకునే ఒక ‘హాట్ లైన్ ‘ సౌకర్యం వంటిది. మా ఆలోచనలు దాని ద్వారా పైకి వెళ్తాయి, సందేశాలు కిందికి వస్తాయి. సొరకాయ బుర్ర మెదడు, కపాలం, దివ్య వాణి కూడా. నీటి వాద్యం మా జీవ జలం, ఇండియన్ల గుండె చప్పుడు. దాని చర్మం మా చర్మం. అది రెండు స్వరాల్లో పలుకుతుంది. ఒక స్వరం పై స్థాయిలో, స్పష్టంగా వుంటుంది. రెండో స్వరం లోతుగా ప్రకంపిస్తుంటుంది. డోలు … మొదలూ తుదీ లేని పవిత్ర చక్రంలా గుండ్రంగా వుటుంది. సెడార్ చెక్కల పొగ… అన్ని ఆకుపచ్చని, సజీవ వస్తువుల యొక్క ఊపిరి. అది తాకిన ప్రతిదీ పరిశుభ్రం, పవిత్రం అవుతుంది. మంట కూడా సజీవం, శాశ్వతం. అది ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే జ్వాల. ఈకల విసన కర్ర మా వాళ్లు తల నుంచి వీపు వరకు వేలాడదీసుకునే ‘వార్ బోనెట్ ‘ వంటిది. అది గాలి లోంచి పాటలను పట్టుకుంటుంది. క్రోడాగ్ తండ్రి హెన్రీ వద్ద మ్యాగ్ పీ పక్షి ఈకల విసన కర్ర వుండేది. మ్యాగ్ పీ పక్షి అతడికొక పాట నేర్పించింది. మ్యాగ్ పీ ఈకలను వైద్యానికి కూడా వాడుతారు. నీటి పక్షి ఈకలను ఊరూరు తిరిగే మనుషులు తమకు తోడుగా వుంచుకుంటారు. నీటి పక్షి పెయూట్ మతంలో చాల ముఖ్యమైన ప్రతీక. ఊరూరు తిరిగే మనుషులు ఈ ఈకలతో నీటిని దీవిస్తారు. డేగ ఈకలు సదవగాహనకు దోహదం చేస్తాయి. సిజర్ టెయిల్ పక్షి ఈకల విసన కర్ర ఇండియన్ తల్లులకు, తెల్లని జింక చర్మం దుస్తులు వేసుకున్న నల్ల కురుల కన్యలకు ప్రతీక. చాల మంది మకా చిలుక ఈకల విసన కర్ర కావాలనుకుంటారు. అది దొరకడం కష్టం. మకా చిలుక అన్ని భాషలు మాట్లాడుతూ తెగలను ఐక్యం చేస్తుంది. మకా చిలుక విసన కర్రలో చాల మంచి విశేషాలున్నాయి. విచిత్రం ఏమిటంటే; న్యూ మెక్సికో, అరిజోనా, కొలరాడో తదితర చోట్ల వేల ఏండ్ల నాటి శిధిలాలలో మకా చిలుక అవశేషాలు దొరికాయి. పలు శతాబ్దాల క్రితం ఈ చిలుకను చిత్రించిన బొమ్మలను కూడా నేను చూశాను. పెద్ద మకా చిలుకలు కనిపించే ప్రాంతానికి ఉత్తరాన పదిహేను వందలూ రెండు వేల మైళ్ల దూరం వరకు ఈ చిలుకల ఈకలు, బొమ్మలు, వీటి ‘మమ్మీలు’ (శిలాజ శరీరాలు) కనిపిస్తాయి. దీన్నిబట్టి ఉత్తర అమెరికా లోని ఇండియన్ జాతి గ్రామాలకు ఇటువైపు అజ్టెక్ , టొల్ టెక్ లతో సంబంధాలు వుండేవని అర్థమవుతోంది. చరిత్ర పూర్వ యుగానికి చెందిన అనసాజి ప్రజలు కూడా పెయూట్ ప్రజలే కావచ్చని, క్రతువుల కోసం మకా చిలుకలను దిగుమతి చేసుకునివుండొచ్చని నాకు అనిపిస్తుంది. ఎప్పటికయినా ఆ సంగతి తెలుసుకుంటాను.

‘నేటివ్ అమెరికన్ చర్చి’ని అనుసరించే వాళ్లను మొదట్లో మిషనరీలు, ప్రభుత్వాధికారులు చాల వేధించేవారు. అది కేవలం పెయూట్ ను పూజాద్రవ్యంగా వాడినందుకే కాదు. ఇక్కడి ప్రజల్ని ‘శ్వేతమానవీకరించే’ ప్రక్రియకు ఇండియన్ క్రతువులు అడ్డు పడుతున్నాయని వాటిని చట్టవిరుద్ధంగా ప్రకటించారు. చాల రాష్ట్రాలలో నిన్నమొన్నటి వరకు పవిత్ర మందుతో ప్రార్థన చెస్తే జైలుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ వేధింపులకు గురైన మొదటి కుటుంబాలలో నా భర్త కుటుంబం ఒకటి. మా రిజర్వేషన్ లో పెయూట్ చర్చిలో చేరిన మొదటి కుటుంబాలలో (1918-20) వీళ్లదీ ఒకటి. నా భర్త కన్న ముందు హెన్రీకి మరో అబ్బాయి పుట్టాడు. 1030 దశకం మొదట్లో వీరి కుటుంబం సెయింట్ ఫ్రాన్సిస్ లో వుండేది. ఆ వూళ్లో కాథలిక్ గురువులదే పెత్తనం . ఊళ్లో వారిదొక పెద్ద మిషన్, బోర్డింగ్ స్కూలు వుండేవి. ఒక చలి కాలం రాత్రి కాథలిక్ గురువులకు పెయూట్ డోలు శబ్దం వినిపించింది. అది ఎక్కడి నుంచి వస్తోందా అని ఆరా తీసి చూస్తే, హెన్రీ క్రోడాగ్ ఇంట్లో క్రతువు జరుగుతోంది. వాళ్లను ఊళ్లోంచి వెళ్లగొట్టాలని బి.ఐ.ఏ. పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. పోలీసులు వాళ్ల ఇంటి సామాన్లను, భార్యాబిడ్డలను గుర్రబ్బగ్గీలో పడేసి తక్షణం సెయింట్ ఫ్రాన్సిస్ వదిలి వెళ్లక పోతే జైలు తప్పదని హెచ్చరించారు. ఆ రాత్రి పెద్ద మంచువాన కురుస్తోంది. దక్షిణ డకోటాలో మంచువాన ఎంత భయంకరంగా వుంటుందో తూర్పు నగర వాసులు వూహించలేరు. పది మైళ్ల దూరంలో తనకు కేటాయించిన భూమి వద్దకు క్రోడాగ్ బండి కదిలించాడు. సొంత భూమి నుంచయితే తననెవరూ వెళ్లగొట్టలేరని ఆయన నమ్మకం. మంచు తుపానులో… అప్పుడప్పుడు దొర్లిపడే మంచులో ప్రయాణం సాగించారు రాత్రంతా. తెలవారు ఝామున ఆ స్థలానికి చేరి, అక్కడ పడుకోడానికి చోటు గాని ఇల్లు గాని లేక, అందరూ బండిలోనే పడుకుని నిద్ర పోయారు. పొద్దు పొడిచిన కాసేపటికి చలికి తట్టుకోలేక ఆ అబ్బాయి చనిపోయాడు. అప్పటికి అతడికి రెండేళ్లే. బతికివుంటే లియోనార్డ్ కు ఒక అన్న వుండేవాడు. ఎవరయినా ఒక విశ్వాసం కోసం ఎంత బాధ పడితే అంతగా వారి విశ్వాసం గట్టిపడుతుంది . క్రో డాగ్ తదితర సాంప్రదాయిక కుటుంబాల్ని వారి విశ్వాసాల కారణంగా ఎంత వేధించారో అంతగా వాళ్లు ఆ విశ్వాసాన్ని గట్టిపరుచుకున్నారు.

నేను ‘వూండెడ్ నీ’ ఘటనల తరువాత, క్రోడాగ్ ను పెళ్లి చేసుకున్న తరువాత, తనతో కలిసి, తను సరదాగా ‘పెయూట్ తోటల’ని పేర్కొనే దక్షిణాది ప్రాంతాలకు తరచు వెళ్లే దాన్ని. అక్కడికి వెళ్లాలంటే బాగా చుట్టూ తిరిగి వెళ్లాలి.

సుమారు మూడు వేల మైళ్ల ప్రయాణం. దారి మధ్యలో వివిధ తెగల వద్ద మజిలీలు చేస్తూ వెళ్లే వాళ్లం. నిజం చెప్పొద్దూ, కొన్ని దక్షిణ తెగల మీద మా సూ ప్రజలందరి లాగే మొదట్లో నాక్కూడా కాస్త తక్కువ చూపు వుండేది. వాళ్లు, ముఖ్యంగా పుయెబ్లో తెగ వాళ్లు మరీ శాంతంగా, వున్నదాంతోతృప్తి పడుతూ గడిపేస్తుంటారనీ , పోరాటం పట్ల నిబద్ధత వుండదనీ అనుకునేదాన్ని. అది వాస్తవం కాదు. మైదాన తెగల మాదిరి వాళ్లకు వ్యవసాయం పట్ల విముఖత లేదు. తెల్లవాళ్లు ఈ ఖండం మీద కాలు మోపడానికి వందల సంవత్సరాల ముందు నుంచే వాళ్లు తమ పొలాల్లో మొక్కజొన్న, స్క్వాష్ సాగు చేస్తున్నారు.

వాళ్లతో పరిచయమయ్యాక నాకు కొద్ది కొద్దిగా తెలిసి వచ్చింది. మైదాన జనాల్లో లేని ఒక అంతశ్శక్తి వారిలో వుంది. పురుషాహంకారం, తాము ఎంత వీరులమో చెప్పుకునే ప్రగల్భాలు ఏమీ లేని ఒక గొప్ప అంతశ్శక్తి అది. వాళ్లు ప్రభుత్వాన్ని, టూరిస్టులను, ఫొటొగ్రఫర్లను దగ్గరికి రానివ్వకపోవడం నాకు చాలా నచ్చింది. అనవసర ఆర్భాటాలు, ఘర్షణలు లేకుండానే వాళ్లు తమ పాత పద్ధతులను కాపాడుకోగలిగారు. వాళ్లు ఎప్పుడూ పని చేస్తూ తీరిక లేకుండా వుంటారు. మాకున్నట్లు తాగుడు తరహా సమస్యలు వాళ్లకు దాదాపు లేవు. వాళ్లు చరిత్ర ప్రారంభ దినాల నుంచి వున్న రైతులు. గొప్పగా కుండలు చేయడం వచ్చిన వాళ్లు. ఇటీవలికాలంలో నగల తయారీలో కూడా పనిమంతులయ్యారు. తమ వ్యవసాయం, చేతి వృత్తులతో వాళ్లు కొత్త వ్యవస్థ కింద నలిగిపోకుండా నిలదొక్కుకోగలిగారు.

వాళ్లు మా ఉత్తరాది తెగల కన్న చాల మెరుగ్గా జీవిస్తున్నారు. అందమైన వారి సాంప్రదాయిక ఇళ్లలో ఆధునిక స్నానశాలలు, వంటగదులు వున్నాయి. ఇంట్లో నేల మీద చక్కని ఇండియన్ రగ్గులు పరిచి వుంటాయి. దెంతెలకు ఎండు మిరపకాయల గుత్తులు వేలాడుతుంటాయి. హెడ్ లైట్లు, విండోగ్లాసులు పగిలిన మా పాత బండ్ల మాదిరి కాకుండా… ఇంటి ముందు వాళ్ల కార్లు కొత్తగా మెరుస్తూ కనిపిస్తాయి. పుయెబ్లో సమాజంలో స్త్రీలు నిర్వహించే పాత్రను గమనించకుండా వుండలేకపోయాను. ఇండ్లకు సొంతదార్లు స్త్రీలే . నిజానికి స్త్రీలే ఇండ్లు కట్టేవారు. వీరిలో పిల్లలకు వంశనామం తరచు తండ్రి నుంచి కాకుండా తల్లి నుంచి వస్తుంది. కొంత మంది తల్లి తెగతోనే కలిసిపోతారు. వాళ్లను చూస్తే నాకు అసూయ వేసింది. సరే, వాళ్లకు కొన్ని విషయాలు కలిసొచ్చాయనుకోండీ! కంచెల మధ్య రిజర్వేషన్ల లోనికి తరిమివేయబడిన పేద సూ ప్రజల మాదిరి కాకుండా… వాళ్లు శ్పానియార్డులు వచ్చే నాటికి తాము వుండిన ప్రాచీన ఇళ్ల లోనే వుండిపోయారు. అయినా సూ ప్రజలకు వున్న పలు సమస్యలు వాళ్లకూ వున్నాయి. ‘డెవెలపర్ల’ నుంచి, యురేనియం-వేటగాళ్ల నుంచి, ఆనకట్టలు కట్టేవాళ్ల నుంచి పుయెబ్లోలు కూడా తమ భూములను, నీటిని కాపాడుకోవలసి వుంది. ఈ విషయంలో కూడా… ఆడంబరంగా కనిపించే మా లకోటాల కన్న… నెమ్మదిగా ప్రవర్తించే పుయెబ్లోల వల్లనే ఎక్కువ మేలు జరుగుతుందని నాకు అనిపిస్తుంది.

మేము డకోటా రాష్ట్రాలలోని ‘నేటివ్ అమెరికన్ చర్చి’ తరుఫున పని చేస్తున్నమని మా దగ్గర సర్టిఫికెట్లు , డాక్యుమెంట్లు వుండడం వల్ల… లియోనార్డ్ ఆ ‘చర్చి’లో గురువూ , అధికారీ కావడంవల్ల; ఇప్పుడు మేము మా మందు కోసం టెక్సాస్, మెక్సికో వెళ్లడం పూర్తిగా చట్టబద్ధమయింది. మా దగ్గర తగినంత డబ్బు వుంటే కావలసినంత పెయూట్ కొనుక్కొవచ్చు. ఈ మాత్రం మార్పయినా వూరికే రాలేదు. దీని కోసం కోర్టులలో పోరాడాల్సి వచ్చింది. న్యావహో రిజర్వేషన్లో ఒక సంఘటన ఓ తమాషా కేసుకు దారి తీసింది. లియోనార్డ్ ను కొందరు న్యావహో మిత్రులు ఒక పెయూట్ సమావేశానికి ఆహ్వానించారు. దాన్ని నిర్వహించింది న్యావహోలే గాని, అగ్ని-నాయకుడి పనిని లియోనార్డ్ కు అప్పగించారు. క్రతువు మొదట్లోనే ఒక ఇండియన్ స్త్రీ ఒక తెల్ల మనిషిని వెంటబెట్టుకుని వచ్చింది. అతడు తన “భర్త కాబట్టి క్రతువులో పాల్గొన వచ్చు” అని చెప్పింది. ఆ తెల్లాయన వేషం హిప్పీ మాదిరిగా వుంది. ఒళ్లంతా పూసల దండలు. దుస్తులు ఇండియన్ లాగే వున్నాయి. కొంత మందు తీసుకున్నాక మత్తెక్కినట్లు కనిపించాడు. క్రతువు కొనసాగుతుండగా మధ్యలో మూత్ర విసర్జన కోసమని బయటికి వెళ్లాడు. తూలుతూ తిరిగి ‘టిపి’ లోనికి వస్తూ తలుపు దగ్గర తలవంచుకుని రావాలని మరిచిపోయాడు . అతడి పొడుగాటి జుట్టు తలుపుకు తగిలి వూడి వచ్చేసింది. అది నిజం జుట్టు కాదు. విగ్గు. దాని కింద క్రూ కట్ క్రాపు. అతడు వెంటనే “నేను హోల్ బ్రూక్ షరీఫ్ (పోలీసు అధికారి) ని, మిమ్మల్నంతా అరెస్టు చేస్తున్నా”నని ప్రకటించాడు. ఇండియన్లు అందరూ పగలబడి నవ్వారు. వాళ్లకు అదంతా చాలా వికారంగా కనిపించింది.

కోర్టులో కేసు ముందుకొచ్చింది. ఇండియన్లు ఒక తెల్లవాడిని క్రతువులో పాల్గొననిచ్చారనేది ఒక అభియోగం. లియోనార్డ్ అక్కడ అతిధి మాత్రమే కాబట్టి , తెల్లవాడు పాల్గొనాలో వద్దో నిర్ణయం తనది కాదు. కోర్టులో లియోనార్డ్ వంతు రాగానే , తను మాట్లాడుతూ “న్యాయమూర్తీ, ఒక తెల్లవాడు ఈ మందు తీసుకోడం చట్టవిరుద్ధమైతే, షరీఫ్ తన చట్టాన్ని తానే ఉల్లంఘించాడు. ఉల్లంఘించింది మేము కాదు. ఎందుకంటే, చాలా కాలంగా ఈ మూలికను ఉపయోగించడానికి మాకు అనుమతి వుంది. ఇంతకూ, షరీఫ్ కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, అది ఒక మత సమావేశం. మేము అనుమతి ఇస్తే అందులో పాల్గొనే హక్కు తెల్లవాళ్లకు వుంది. అది పద్ధతి ప్రకారం జరిగే సమావేశం అయితే చాలు. మత స్వేచ్చ అనేది పెయూట్ టీపీ తలవాకిలి దగ్గర ఆగిపోకూడదు. అంతే కాదు. ఈ షరీఫ్ ఇండియన్ల భూమిలో తన అధికార పరిధిని దాటి ప్రఫర్తించాడు. రిజర్వేషన్ లోపల వున్నంత వరకు అతడొక టూరిస్టు మాత్రమే అక్కడ అరెస్టులు అవీ చేసే అధికారం ట్రైబల్ పోలీసులకు మాత్రమే వుంటుంది. నేను చెప్పదల్చుకున్నది ఇంతే” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు . ఆ కేసులో మేము గెల్చాం. పెయూట్ చర్చి వైపు విజయంగా ఆ కేసు ఒక కొండగుర్తుగా మిగిలిపోయింది.

‘పెయూట్ తోటల’కు వెళ్లినప్పుడంతా మేము నాలుగైదు కార్లు, ట్రక్కులలో వెళ్లేవాళ్లం. పెయూట్ సేకరణకు చాల మంది అవసరమవుతారు. సరిహద్దుల వద్ద ‘పంపిణీదారుల’ పేరిట పెయూట్ వ్యాపారులు వుంటారు. అంతకు ముందొకసారి మేము వెయ్యి మొక్కలకు వందల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. దానికి అయిదేళ్ల ముందయితే ఇరవైఐదు డాలర్లు చెల్లించాం. ధర పెరిగింది. ద్రవ్యోల్బణం దెబ్బ. ఆ తరువాత మేమిక వ్యాపారి దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. మేమే సొంతంగా పెయూట్ సేకరించాం. దీని వల్ల డబ్బు మిగలడం మాత్రమే కాదు. పెయూట్ మందును యాస్పిరిన్ , దగ్గు బిళ్లల మాదిరి కొనుక్కోకుండా, సరైన, పవిత్రమైన పద్దతిలో సంపాదించుకున్నాం.

ఒక చోట ఎడారి అంతటా పెయూట్ మొక్కలు చెదరు మదురుగా వుండడం చూశాం. పెయూట్ ఒక నాగజముడు తరహా మొక్క. ఆ రోజు మేము పొద్దు పొడుస్తుండగా లేచాం. లియొనార్డ్ ప్రార్థన సమావేశం నిర్వహించాడు. ప్రార్థన వల్ల మేము పెయూట్ బాగా దొరికే చోట్లకు వెళ్లగలుగుతామని, కావలసినంత మందు దొరుకుతుందని లియోనార్డ్ అన్నాడు. మేము ఎవరికి వాళ్లం ఆ చోటంతా విస్తరించి, వెదకడం మొదలెట్టాం. అంతటా జముడు , జోషువా వటి పొదలు. కొన్ని జముడు పొదలు మరీ పొడుగ్గా 20 అడుగుల ఎత్తు వరకు వున్నాయి. ఆ చిన్న, పెద్ద ముండ్ల పొదల్లోనే పెయూట్ మొక్కలున్నాయి. చాల కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది. అలా ఒళ్లంతా ముండ్లు గీసుకుంటూ పెయూట్ కోసం కష్టపడ్డం నాకు చాల నచ్చింది. దాని వల్ల మా సేకరణ పనికి ప్రత్యేకమైన అర్థం ఏర్పడింది.

ఒక సారి మా అక్క బార్బరాకు నాయక జాతి పెయూట్ కనిపించింది. అది చాల పెద్దగా వుంది. పెయూట్ కు నాలుగు కణుపులు లేదా దిక్కులు వుంటే అది పవిత్ర సంఖ్య. బార్బరా చూసిన నాయక జాతి పెయూట్ కు …పవిత్ర సంఖ్యకు నాలుగు రెట్లు… పదహారు కణుపులు వున్నాయి. నాయక జాతి పెయూట్ దొరికినప్పుడు మేము దాన్ని ఉద్దేశించి, దాని కోసం, దానితో కలిసి ప్రార్థన చేస్తాం. ‘నేటివ్ అమెరికన్ చర్చి’లో ప్రతిమనిషి దగ్గర, ప్రతి కుటుంబం దగ్గర ఒక నాయక జాతి పెయూట్ ఉండాలని మేము కోరుకుంటాం. అలాంటి మొక్క లేని వారెవరికైనా అది కనిపించినప్పుడు, దాని వేర్లు, అక్కడి సహజసిద్ధమైన మట్టితో పాటు పెకలించి ఇంటికి తీసుకెళ్తాం. బార్బ్ వద్ద నాయకజాతి పెయూట్ లేదు. లియోనార్డ్ దాన్ని జాగర్తగా పెకలించి ఇస్తూ “ఈ పెయూట్ ను తీసుకెళ్లు , నీకు ఎప్పుడు ఎటువంటి ఆసరా కావాలన్నా తనతో కలిసి ప్రార్థన చెయ్యి” అన్నాడు. ఆ మొక్క చక్కగా బతికింది. బార్బరా దానికి క్రమం తప్పకుండా నీరు పెట్టింది. ప్రతి వారం దాని మీద ఒక చిన్న పువ్వు వచ్చేది. నేను ఎప్పుడు చూసినా అది మునుపటి కన్న ఎక్కువగా పెరిగినట్లనిపించేది. బార్బరా ఇంట్లో లేనప్పుడు మా అమ్మమ్మ దానికి తగినంత నీరు అందేట్లు , ఎండ తగిలేట్లు జాగ్రత్త తీసుకునేది. ఓసారి మా అమ్మ అదంతా చూసి అమ్మమ్మతో “దాన్ని బయట పారేస్తే పోదా” అంది. “మేరీకి, బార్బరాకు ఈ మొక్క మీద చాల గురి వుంది. వాళ్లు ఇంట్లో లేనప్పుడు దాన్ని నేను కాపాడతాను” అని అమ్మమ్మ జవాబిచ్చింది. దీని వల్ల మా అమ్మ కన్న అమ్మమ్మలోనే ఇండియన్ లక్షణాలు ఎక్కువ అని తేలిపోయింది. అలాగే మా అమ్మకు మాకు మధ్యన వున్న తరాల అంతరం కూడా తెలిసిపోయింది.

సేకరణ సమయంలో కొంతమంది మొత్తం పెయూట్ మొక్కను తీసేసుకుంటారు. మేము అలా కాకుండా మొక్క వేర్లను అలాగే వుంచి, అది తిరిగి పెరగడానికి అవకాశం మిగిల్చాలని అనుకున్నాం. పైభాగాన్ని, ఆకులను మాత్రమే తీసుకున్నాం. మా మొత్తం తెగకు, ఏడాది కాలం సరిపోయేలా సుమారు ముప్పై అయిదు వేల పెయూట్లను సేకరించడానికి మాకు రెండు వారాల కన్న ఎక్కువే పట్టింది. మేము పెయూట్ సేకరణలో ఉన్నప్పుడు ఆ భూమి ఆసామి వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగాడు. మేము వివరంగా చెప్పిన తరువాత నవ్వి, ‘మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు ‘ అని ఆహ్వానించాడు. అతడికి డబ్బు చెల్లించాల్సి వస్తే చాల కష్టమయ్యేది. ఆ ఏడాది మా పిల్లలకు బూట్లు కొనడం వంటివి మానుకోవాల్సి వచ్చేది. ఏడాది పొడుగునా తిండి, తదితర ఖర్చులు బాగా తగించుకోవాల్సి వచ్చేది. ముప్పై అయిదు వేల మొక్కలంటే మాటలా?! బహుశా, తన భూమిలోని పెయూట్ల వల్లనే ఆయనకు అంత మంచి ఆలోచన వచ్చి వుంటుంది. మా ‘ఎ.ఐ..ఎం.’ వాళ్ల మాటల్లో చెప్పలంటే ఆ పెయూట్లు అతడిని ‘చైతన్య పరిచి’ నట్లున్నాయి . మొదటి సేకరణ నాకొక మంచి అనుభవాన్ని మిగిల్చింది. అక్కడికి తిరిగి తిరిగి వెళ్లాలని, ప్రతి సారీ అంతకు ముందు కన్నా బాగా, మరింత పవిత్రమైన పద్ధతిలో, మరింత అర్థవంతంగా పని చేయాలని కోరిక కలిగేది.

ఒకసారి మేము ‘ఓల్డ్ మెక్సికో’ లో పెయూట్ సేకరణకు వెళ్లాం. తిరిగి వస్తున్నప్పుడు మా కారులో అంతటా, డాష్ బోర్డు మీద చిన్న చిన్న పెయూట్ మొక్కలు పడి వున్నాయి. “బాబోయ్, వీటిని సరిహద్దులు దాటించి తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. వాళ్లు మనల్ని అరెస్టు చేసి, మన మందును స్వాధీనం చేసుకుంటారు” అని అన్నారెవరో. మా పెయూట్ మందును కారు కిటికీలోంచి బయటకు పారేయడం నాకు ఏమాత్రం ఇష్టం కాలేదు. నేనూ మరో అమ్మాయి కలిసి వాటిని తినేశాం. టెక్సాస్ లో మా బస చేరుకునే సరికి మేము బాగా మత్తెక్కిపోయాం. నాకు తల తిరగడం మొదలెట్టింది. క్రతువు పద్ధతిలో తీసుకుంటే అలా జరగదు. బసకు చేరాక గదిలో తివాచీ మీద కూర్చుంటే మత్తు మత్తుగా వుండింది.

మాకు తరువాత తెలిసింది. కష్టమ్స్ వాళ్లకు మా సంగతి తెలుసు. క్రొడాగ్ దగ్గరున్న సర్టిఫికెట్ కూడా చూశారు. మిగతా కార్లను నవ్వుతూ పోనిచ్చారు. వాటిలో మొక్కల గురించి పట్టించుకోలేదు. మరోపక్క నేనెమో రికార్డు సమయంలో రికార్డు మొత్తం పెయూట్ మందు మింగేయడానికి చాల కష్టపడిపోయాను, చాలా అనవసరంగా. కాని, ఆ తరువాత, నాకు చాల గొప్పగా, అద్భుతంగా అనిపించింది.

Share/Save/Bookmark

అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో