జులై2008
‘నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు’ : పాతికేళ్ల తర్వాత శ్రీశ్రీ
- ఎన్ వేణుగోపాల్
తన ఇరవైమూడో ఏట ప్రారంభించిన మహాప్రస్థాన గీతాల నుంచి డెబ్బయిలలో రాసిన మరోప్రస్థాన గీతాలదాకా తెలుగు జాతిని కదిలించి, ఊగించి, ఆలోచింపజేసి, రెచ్చగొట్టి, శాసించి, ముందుకు, మున్ముందుకు నడిపించిన మహాకవి శ్రీశ్రీ, తెలుగు సాహిత్యంలో ఎన్నో సంచలనాలకు ప్రారంభకుడూ, ప్రచారకుడూ, నాయకుడూ, వ్యాఖ్యాతా అయిన మహాకవి శ్రీశ్రీ మనమధ్యనుంచి వెళిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒక వాక్యం మాట్లాడితే అర వాక్యం శ్రీశ్రీ కవితా చరణాలతో నింపుతూ, శ్రీశ్రీలో తలమునకలుగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ రోజులలో ఒక పిడుగుపాటుగా శ్రీశ్రీ మరణవార్త విన్న 1983 జూన్ 16 ఉదయం నిన్నటి ఉదయంలాగే ఉంది. అప్పటికింకా ఇరవైనాలుగుగంటల వార్తా ఛానెళ్ళు లేకపోవడం మాత్రమే కాదు, ఏకైక దూరదర్శన్ టెలివిజన్ కూడ విస్తరించలేదు. రోజుకు మూడు నాలుగుసార్లు వార్తలు వినిపించే ఆకాశవాణి కూడ అందరికీ అందుబాటులో లేదు. ఉదయం పూట పత్రికలు మాత్రమే ఏకైక వార్తావనరు. జూన్ 15 బుధవారం సాయంత్రం సూర్యాస్తమయానికి కొద్దిముందు మహాకవి అస్తమించాడు గాని ఆ వార్త అందరికీ చేరింది మర్నాటి ఉదయాన్నే.ఆ వర్షాకాలపు ఉదయాన అప్పుడు నేనుంటుండిన ఓల్డ్ పిజి హాస్టల్ కు కూతవేటు దూరంలో సీతాఫల్ మండీ దారిలో ఉండే అప్పటి రాడికల్ యూత్ లీగ్ ప్రధాన కార్యదర్శి జగన్ వచ్చి శ్రీశ్రీ మరణవార్త చెప్పాడు.
ఒక్కసారి కాళ్లకింద నేల తొలుచుకుపోయినట్టు, కళ్లు చీకట్లుకమ్మినట్టు అయింది. ‘నిర్వికల్ప సమాధిలో’ ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుకుంటున్నామో, ఎటు నడుస్తున్నామో, ఏమీ తోచని తెలిసీ తెలియని స్థితిలో శ్రీశ్రీ కవిత్వ చరణాలు గుర్తు తెచ్చుకుంటూ, శ్రీశ్రీ కబుర్లు చెప్పుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్ దాకా నడిచివెళ్లాం. స్టేషన్ ఎదురుగా ఉన్న పత్రికల దుకాణాల్లో తెలుగు పత్రికలన్నీ కొనుక్కుని స్టేషన్ ముందు బస్ షెల్టర్ లో కూచుని శ్రీశ్రీ మరణవార్తలను, సంపాదకీయాలను, సంస్మరణలను చదువుకున్నాం. తర్వాత ఎక్కడపడితే అక్కడ సంస్మరణ సభలు, ఉపన్యాసాలు, కవితాపఠనాలు, శ్రీశ్రీ ఎవరివాడు, శ్రీశ్రీ వారసత్వం అంటే ఏమిటి అని వాడి వేడి చర్చలు, వివాదాలు….
అదంతా నిన్ననో మొన్ననో జరిగినట్టు ఉంది గాని పావు శతాబ్దం గడిచిపోయింది. చాల విషయాలు మారిపోయాయి. వంతెనలకింద చాల నీళ్ళు ప్రవహించాయి. ‘గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో.’
మహాకవి అనే విశేషణం లేకుండా ఆ పేరు పలకడమే అపచారం అనిపించే రోజుల నుంచి ఆయన కవిత్వంలో ఏముంది అనేదాకా తెలుగు సమాజం ప్రయాణించింది. అనాథులందరితో అశాంతులందరితో జాతిజనులందరితో మాట్లాడదలచుకున్న, మాట్లాడిన కవిని కోస్తాంధ్ర, బ్రాహ్మణ, విద్యాధిక, మధ్యతరగతికి మాత్రమే చెందినవ్యక్తిగా గుర్తించడం మొదలయింది. తన జీవితకాలంలోనే శక్తిగా, లెజెండ్ గా మారిన ఆయనను ఒకానొక వ్యక్తిగానూ, ఒకతరాన్ని తప్పుదారి పట్టించినవాడిగానూ చూడడం మొదలయింది. ఆకాశపు దారులంట హడావుడిగ వెళిపోయే జగన్నాథ రథచక్రాలను, కనీసం కవితా రథచక్రాలను భూమార్గం పట్టించిన కవి వల్లనే తెలుగు కవిత్వావరణంలోకి తప్పుడు, రాజకీయ ధోరణులు ప్రవేశించాయని, అందువల్ల తెలుగు కవితాభివ్యక్తి కలుషితమయిపోయిందని గౌరవనీయ సాహిత్య విమర్శకులు అనడం మొదలుపెట్టారు. ఆయన కవిత్వంలోని వస్తువు రాజకీయమైనదని, అంటే సాహిత్యేతరమైనదని, ఆయన శిల్పంలో వాగాడంబరం, బ్రాహ్మణ, హిందూ మత చిహ్నాలు, సమాసభూయిష్టత తప్ప మరేమీలేవని అనడమూ మొదలయింది. ఆయన మరణం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు బహుశా శ్రీశ్రీ ఎవరు అనీ, తెలుగు కవిత్వానికి శ్రీశ్రీ చేర్పులు ఏమిటి అనీ అడిగే ఒక కొత్త తరం తలెత్తుతున్నట్టు కూడ కనబడుతున్నది.
అందరూ అంటున్నట్టు, అనుకుంటున్నట్టు సమాజం, సాహిత్యం మారుతున్నాయి గాని ఇంతగా మారుతున్నాయా? కనీసం ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో తెలుగు సమాజంలో, సాహిత్యంలో ఇంత మౌలికమైన మార్పులు జరిగిన మాట నిజమేనా? నిజంగానే ఈ ఇరవై ఒకటో శతాబ్దపు తొలిపాదంలో తెలుగు సమాజంలోనూ, సాహిత్యంలోనూ శ్రీశ్రీ సంబద్ధత, అవసరం, ప్రభావం ఏమీ మిగలలేదా?
సమాజంలోనూ సాహిత్యంలోనూ మార్పులు, బహుశా పెనుమార్పులు కూడ జరిగిన మాట నిజమే గాని, ఆ మార్పులేవీ శ్రీశ్రీ సంబద్ధతను, అవసరాన్ని తగ్గించలేదు, సరిగదా రాసిన నాటికంటే ఆ రచనల అవసరం ఇవాళ ఎక్కువగా ఉంది. బహుశా శ్రీశ్రీ రచనలన్నీ కూడ ఇవాళనే ఎక్కువ అర్థవంతంగా ఉంటాయేమో. అసలు తెలుగు సమాజ సాహిత్యాలలో జరిగినట్టు కనిపిస్తున్న మార్పులన్నీ కూడ పైపై మార్పులే తప్ప మౌలికమైనవి కాదు. అందువల్ల శ్రీశ్రీ సంబద్ధత రూపు మార్చుకొని ఉండవచ్చుగాని రద్దయిపోయిన దాఖలాలు లేవు. కనుకనే ఆయన ప్రభావం కూడ ఆయన జీవించి ఉన్నప్పటి కంటె మరణానంతరం ఎక్కువగా పెరుగుతున్నది. సాధారణంగా సామాజిక వైతాళికుల విషయంలో, సామాజిక మార్పుకు దోహదం చేసినవారి విషయంలో, సామాజిక మార్పులను గానం చేసినవారి విషయంలో, క్రాంతదర్శుల విషయంలో, ప్రజల పక్షం తీసుకున్న వారి విషయంలో ఇది సహజమే. ఈ రకంగా వారి ప్రభావం మరణానంతరం విస్తరిస్తూనే ఉంటుంది. వారి సంబద్ధత, అవసరం ఇలా పెరుగుతూనే ఉంటాయి.
శ్రీశ్రీ విషయంలో ఇవాళ్టి సంబద్ధత, ప్రభావాల గురించి మాట్లాడడానికి ఎన్నో అంశాలున్నాయి. ‘ఈ శతాబ్దం నాది’ అని ఇరవయో శతాబ్దం మీద చెరిగిపోని సంతకం చేసిన శ్రీశ్రీ ముద్ర రోజురోజుకూ ఎంత బలపడుతున్నదో ఇరవై సంపుటాలుగా వెలువడిన ఆయన సమగ్ర సాహిత్యం నుంచి ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. వస్తువులో, శిల్పంలో, వస్తుశిల్పాల అన్యోన్య మైత్రిలో శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి నేర్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాఠాలకు ఇవాళ్టికీ సంబద్ధత ఉంది.
శ్రీశ్రీ కవిత్వీకరించిన సామాజిక సమస్యలలో అత్యధిక భాగం ఐదారు దశాబ్దాలు గడిచిన తర్వాత కూడ తొలగిపోలేదు సరిగదా ఇంకా జటిలమయ్యాయి. ఆయన ఊహించని, రాయని కొత్త సమస్యలు వచ్చి ఉండవచ్చుగాని, ఆయన రాసిన సామాజిక సమస్యలలో ఏ ఒక్కటయినా పూర్తిగా తొలగిపోయిందనడానికి, మారిందనడానికి వీలులేదు. ఆ సమస్యలలో కొన్ని తమ రూపాలు మార్చుకుని ఉండవచ్చు కాని వాటి మౌలిక పునాది చెక్కుచెదరలేదు. ఆరకంగా చూస్తే ఆయన కవితావస్తువులలో ఏ ఒక్కదానికీ కాలం చెల్లలేదు. కవితావస్తువులకు కాలం చెల్లనప్పుడు కవికి కాలం చెల్లడం అసాధ్యం. పైగా ఆ కవితా వస్తువులు నానాటికీ ఇంకా ఎక్కువమందికి అనుభవంలోకి వస్తున్నప్పుడు ఆ కవి దృష్టినైశిత్యం పట్ల, దూరదృష్టిపట్ల పాఠకులలో గౌరవం పెరుగుతుందే గాని తరగదు. అలాగే శ్రీశ్రీ తన రచనలద్వారా ఏ సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాడో ఆ సందేశానికి కాలం చెల్లలేదు. ఆ సందేశం అవసరమయిన ప్రజలు, ఆ సందేశం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు ఆయన రచనలు చేసిననాటికంటె ఇప్పుడే ఎక్కువగా ఉన్నారు. సార్వకాలిక, సార్వజనీన రచన అనేది ఉండకపోవచ్చుగాని, ఒక రచనలో ప్రతిఫలించిన సామాజిక స్థితి మారనంతవరకూ, ఆ రచనలో వ్యక్తీకరణ పొందిన, ఆ రచనద్వారా ప్రేరణపొందే సామాజిక వర్గం ఉనికిలో ఉన్నంతవరకూ ఆ రచన నిలిచే ఉంటుంది. ప్రత్యేకించి ఆ సామాజిక స్థితి ఒక దుస్థితి అయి, అది రద్దుకావాలని ఆ రచన కోరుకున్నప్పుడు, ఆ సామాజిక వర్గం ఒక పీడిత వర్గమై, ఆ పీడన రద్దుకావాలని ఆ రచన కోరుకున్నప్పుడు, ఆ రచన సంబద్ధతా అవసరమూ రోజురోజుకూ పెరుగుతాయి. శ్రీశ్రీని ఇవాళ చదివినా చాల సమకాలీన విషయాలు మాట్లాడుతున్నట్టు, తాను జీవించి ఉన్ననాటి స్థలకాలాలమీద కాక పాఠకులు అనుభవిస్తున్న సామాజిక స్థితి మీదనే ఒక విమర్శనాత్మక, ప్రతిపక్ష వ్యాఖ్య చేస్తున్నట్టు కనిపించడం అందువల్లనే.
ఇది మరొకవైపు నుంచి చూస్తే తెలుగు సమాజం, భారత సమాజం 1930 ల నుంచి 1970 లదాకా ఎట్లా ఉన్నాయో ఇవాళ కూడ అట్లాగే ఉన్నాయని, పైపై మెరుగులు ఎన్ని వచ్చినా దాని పునాది స్వభావం, సారాంశం మారలేదని గుర్తించడం. ఈ గుర్తింపు విచారకరమే. కాని అది ఒక వాస్తవమయినప్పుడు ఆ వాస్తవాన్ని అత్యంత ప్రతిభావంతంగా, కళాత్మకంగా, ప్రేరణాత్మకంగా కవిత్వీకరించిన అభివ్యక్తికి ఆ సమాజ స్థితి మారేవరకూ సంబద్ధత ఉంటుంది.
శ్రీశ్రీ కన్న చాల ముందు నుంచే, బహుశా శతాబ్దాల ముందు నుంచే, సామాజిక సమస్యలను ప్రతిబింబించడం, వాటిని కళారూపాలలో వ్యక్తం చేయడం ఉంది. అదేమీ కొత్త విషయం కాదు. కాని కేవలం సామాజిక సమస్యలను చిత్రించడంతో ఆగిపోకుండా ఆ సమస్యలు ఒక సంచలనానికి కారణమవుతున్నాయని, ఆ సంచలనం సమాజాన్ని ముక్కలుగా చీలుస్తున్నదని, ఆ చీలిక ఘర్షణ వైపు పయనిస్తున్నదని గుర్తించడం, ఆ ఘర్షణ అంతిమంగా ప్రగతివైపు పరిణమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం కవిత్వం ప్రజల పక్షాన, పీడితుల పక్షాన నిలుస్తుందని చెప్పడానికి చిహ్నం. శ్రీశ్రీ తెలుగు కవితా ప్రపంచంలో ఆ భావనను బలంగా ప్రకటించాడు. సామాజిక చైతన్య రూపమేదీ ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడదు గనుక ఇందులో కూడ శ్రీశ్రీ మొదటివాడు అనో, ఆయన కన్న ముందు శూన్యమనో వాదించనక్కరలేదు. బహుశా అప్పటికి అర్థశతాబ్దంగా ఏర్పడి ఉన్న ఆ దారిలో చాల ప్రతిభావంతుడూ, ప్రభావశీలీ శ్రీశ్రీ. ఆయన వల్ల ఆ మార్గం విశాలమూ, వైవిధ్య భరితమూ, ఎక్కువ ఆమోదయోగ్యమూ అయింది.
సామాజిక సమస్యలను ప్రతిబింబించడం సాహిత్య బాధ్యత అనే గుర్తింపు ఎక్కువగా పెరిగి, దాదాపు అన్ని వర్గాలకూ, ప్రాంతాలకూ, బృందాలకూ ప్రాతినిధ్య సాహిత్య ధోరణులు నెలకొని బలపడిన ఈ రోజుల్లో కూడ సామాజిక నేపథ్యపు సాహిత్యాన్ని తృణీకరించే వైఖరి కూడ తలెత్తుతోంది. ఒక రచనలో సామాజిక స్పర్శ ఉంటే, సామాజిక సంచలనాన్ని ప్రతిఫలిస్తే అది సాహిత్యం కాజాలదని కొందరు సాహిత్య విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. రచనలో కళాత్మకత ఉండాలని, సామాజిక చిత్రణ ఉన్నంతమాత్రాన కళాత్మకత లేని రచన సాహిత్యం కాజాలదని అన్నంతవరకు ఈ వ్యాఖ్యలను అంగీకరించవచ్చు. కాని వస్తుశిల్పాల చర్చలో వస్తువుకు ప్రాధాన్యత ఇచ్చి శిల్పాన్ని చిన్నచూపు చూడడం ఎంత పొరపాటో, శిల్పాన్ని మాత్రమే సాహిత్యంగా చూసి వస్తువును తృణీకరించడం, సామాజిక వస్తువు అసలు వస్తువే కాదని అనడం అంతకన్న ఎక్కువ పొరపాటు. రచనలో వస్తుశిల్పాలు రెంటికీ ప్రాధాన్యత ఉంటుందని, వాటి మధ్య పోటీ లేదని, ప్రజావసరమైన వస్తువును తీసుకున్నప్పుడు ప్రజాకర్షకమైన శిల్పాన్ని కూడ తీసుకోవాలని శ్రీశ్రీ తన సాహిత్యం ద్వారా చూపించాడు. సామాజిక సంచలనాన్ని ప్రతిఫలించడానికే సాహిత్య సృష్టి చేయాలని, ఆ సాహిత్యాన్ని గొప్ప కళానైపుణ్యంతో, చదువరులను ఆకట్టుకునేలా రూపొందించాలని శ్రీశ్రీ తెలుగుసాహిత్యంలోని ప్రగతిశీలధారకు నేర్పించాడు. ఆ ధార తన పరిణామక్రమంలో తిరిగిన రెండుమూడు మలుపులకు ఆయనే నాయకత్వం వహించాడు. గడిచిన ఏడెనిమిది దశాబ్దాలలో ఆ ధార కొన్నిసార్లు ఆయన నేర్పిన పాఠాన్ని విస్మరించి ఉండవచ్చు. తక్షణ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ శాశ్వతపాఠాన్ని అన్నివేళలా పాటించి ఉండకపోవచ్చు. కాని శ్రీశ్రీ మార్గం విశిష్టత సాహిత్యాన్ని ప్రజలకోసం సృష్టించాలని, ప్రజలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని చెప్పడంలోనే ఉంది. ఇవాళ ఏడుదశాబ్దాలు తిరిగిచూసేసరికి అసలు వస్తువులో ప్రజలు, ప్రజాపోరాటాలు, సామాజిక సంచలనాలు ఉండడమే తప్పనే ధోరణి తలెత్తుతున్న ఈ దశలో శ్రీ శ్రీ సంబద్ధతను చైతన్యపూరితంగా గుర్తుచేసుకోవలసి ఉంటుంది.
ఇక శిల్పపరంగా చూస్తే శ్రీశ్రీ సంబద్ధతను ఇవాళ కనీసం రెండు రంగాలలో గుర్తించవచ్చు. మొదటిది ఆయన సాహిత్యంలోని ఆశ్చర్యపరచే ప్రయోగాలు. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, మరోప్రస్థానం, అనువాదాలు, సినిమాపాటలు, చరమరాత్రి కథలు, వ్యాసాలు, సాహిత్యవిమర్శ, పదబంధప్రహేళికలు – ఏ ప్రక్రియ తీసుకున్నా శ్రీశ్రీ అసాధారణమైన ప్రయోగాలు చేశాడు. ఇవాళ్టికి కూడ ఆశ్చర్యపరిచే వినూత్న పదబంధాలను సృష్టించాడు. తనకాలానికి మాత్రమే కాదు, ఇవాళ్టికి కూడ అబ్బురపరిచే ముందుచూపును, అధ్యయన, పరిశీలనా, రచనా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. శ్రీశ్రీ కాలానికి అందుబాటులో ఉన్న వనరులతో పోలిస్తే వందలరెట్లు ఎక్కువ వనరులు ఉన్న ఇవాళ్టి స్థితిలో శ్రీశ్రీ ఉదాహరణ జాజ్వల్యమానంగా కనబడుతుంది. ఆ లక్షణం వల్లనే శ్రీశ్రీ సంబద్ధత ఇవాళ్టికీ ఎంత ఎక్కువగా ఉన్నదో అర్థమవుతుంది.
రెండవది, మరపురాని శ్రీశ్రీ కవితా వాక్యాలు. శ్రీశ్రీ వాక్యాలలోని వస్తువుతో భిన్నాభిప్రాయం ఉన్నవాళ్లు, అసలు ఆ వస్తువేమిటో తెలియనివాళ్లు కూడ ఆయనా కవితాచరణాలను నిత్యం గుర్తు చేసుకుంటున్నారంటే, అలవోకగా ఉటంకిస్తున్నారంటే, ఆయన ఒకరకంగా తెలుగుజాతి నుడికారంలో భాగమయ్యాడన్నమాట. గురజాడ ‘కన్యాశుల్కం’లోని పాత్రల సంభాషణాశకలాలు ఇవాళ్టికీ ప్రతిసందర్భానికీ పనికి వచ్చినట్టు, రాసిన వందసంవత్సరాల తర్వాత కూడ ఆ సంభాషణల సంబద్ధత పెరిగినట్టు, శ్రీశ్రీ కవితా చరణాల ఉటంకింపులు కూడ పెరుగుతున్నాయి. ఇవాళ్టికీ పత్రికారచనలో, సాహిత్యంలో, బహుశా సాహిత్యజీవుల సంభాషణల్లో శ్రీశ్రీ చరణాల, ప్రయోగాల ఉటంకింపులు లేకుండా ఒక్కరోజు కూడ గడవడం లేదంటే ఆయన సంబద్ధత తరగలేదనీ, పెరుగుతోందనీ అర్థం.
‘అనితరసాధ్యం నా మార్గం’ అని చెప్పుకున్నప్పటికీ శ్రీశ్రీ వేసిన మార్గంలో ప్రయాణించడానికి ఎందరెందరో ఇవాళ్టికీ ముందుకు వస్తూనే ఉన్నారు. ‘ఈ శతాబ్దం నాది’ అని ఆయన ఎప్పుడో చెప్పిన మాట నిజమవుతున్నదా అన్నట్టు ఎన్ని వివాదాలున్నా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఆయన మార్గాన్నీ స్థానాన్నీ దిగలాగడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆయన ప్రభావం తర్వాతి శతాబ్దంలోకి కూడ ప్రవహిస్తూనే ఉంది.
Rakesh జులై 2008 1
చాలా బాగా రాశారు.
కొన్నేళ్ళక్రితం, సరోజగారు ఒక వారపత్రిక (పేరు గుర్తులేదు) ధారావాహికలో శ్రీశ్రీ గారి గురించి ఎన్నో విషయాలను తెలిపారు.
narendra జులై 2008 2
Sri Sri vishayam lo generality ni choodakunda kevalam nirdhistata (particularity) ni choodatam innadu vunna particularist raajekaya dhorani valle. Thama thama chinna chinna astitvaalu okka sadharana charitrika setting lo bagam ane spruha nu upekishicatam, saadikaritha perutho yadhastithini (statu quo) balaparichi andulo kontha sectional proyojanalu - prajasmaikam maina korikalainappaitiki- sadhimcatamtho trupti pade dhorani valle.
Vipolodaymam lo unna tatvika lemi induku pedda yettuna dhodam chesindi.
manogna ఆగస్టు 2008 3
మీరు చెప్పింది చాలా సత్యము. ఎంతగా క0ప్యుటరల వినియొగ0 పెరిగినప్పటికి సాహిత్యము చదివె వారు చదువుతూనె వున్నారు. ముఖ్యముగా శ్రీశ్రీ రచనల్ని. కాబట్టి ఎప్పటికి ఆయన రచన్లు నిలిచె వుంటాయి. మీ వ్యాస్ము బాగుంది